శివరాత్రి శివరాత్రికీ ఇంట్లో సాయంత్రం వరకూ ఉపవాసం, రాత్రి జాగారం ఉంటారు బామ్మా, చిట్టి బామ్మగారూనూ. అమ్మా పిన్నీ అమీను తాతయ్యగారు ఉపవాసం ఉండరు. జాగారం మాత్రం చేస్తారు. మేం పిల్లలం తాతయ్యగారిలా జాగారం మాత్రమే ఉంటాం. వాళ్ళు పడుకోమన్నా పడుకోం.
రచయిత వివరాలు
పూర్తిపేరు: చాగంటి తులసిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
చాగంటి తులసి రచనలు
మా ఊళ్ళో రథయాత్ర పూరీలో జరిగే రథయాత్ర లాగా ఘనంగా చేస్తారు. దాసన్నపేట చివారన రథాన్ని పెడతారు. మూడు కోవెళ్ళ ముందు, కన్యకాపరమేశ్వరి గుడి ముందూ ఊళ్ళోనూ రథాలు పెడతారు. అవీ పెద్ద రథాలే. దాసన్నపేట దూరం అనుకున్నవాళ్ళు ఊళ్ళో పెట్టిన ఈ రథాల దగ్గరికి ఎవరికి వీలైన చోటుకు వారు వెళతారు.
స్త్రీల పాటలలోని కుచ్ఛల కథ లాంటివి చదివితే రామాయణ కథ మరోలా ముందుకు వస్తుంది. రావణాసురుడి దగ్గర్నుంచి రాముడు సీతను పుష్పకవిమానంలో తెచ్చిన తర్వాత సీత రావణుడి బొమ్మని గీసుకుని తలగడ కింద పెట్టుకుని పడుకుందిట! రావణాసురుడు మాటాడుతూ ఉండేవాడట!
వాడు నాకు బావ అవుతాడు కదూ. ఏదో ఒకటి వెక్కిరించకుండా వాడి నోరు ఊరుకోదు. నామీద ఓ అక్క అంటూ ఏడవబట్టి నన్ను పెళ్ళి చేసుకోడు. బతికిపోయా. లేపోతే ఏముందీ మా మేనత్తా మా బామ్మా నన్నే వాడికి కట్టబెట్టేస్తారు. పై సంబంధాలు ఎందుకూ? వాడికెవరికో ఇచ్చి తర్వాత ఏదన్నా అయితే బాధ పడ్డం, అని ఉపన్యాసాలు ఇస్తారు.
ఈ మాఘమాసంలో పెళ్ళి చేసేస్తాం, ఈ ఏడు మాఘంలో చేసేస్తాం అంటూ ఇంట్లో కూచోపెడతారు, ఆడపిల్లకి చదువు చెప్పించడం ఆపేసి. చదివేవులే స్కూలు ఫైనలు వరకూ లేదా టెంత్ వరకూ అంటారు. అలాగే ఆ అమ్మాయి కూడా పెళ్ళి కోసం ఈ మాఘం కోసం ఆ మాఘం కోసం చూస్తూ కూచుంటుంది. మాఘమాసాలు ఆగమేఘాల మీద వచ్చివెళ్తూ ఉంటాయి!
బామ్మ దగ్గర కథలు విని రాయడం నేర్చుకోవాలి. నన్నడిగితే ప్రపంచం లోని పెద్ద పెద్ద పేరున్న కథకులందరూ బామ్మ దగ్గర కథ చెప్పడంలో బలాదూరే! ఒక్కసారి గాని వాళ్ళు వింటే ఎంత నేర్చుకోవాలో తెలిసివస్తుంది! బామ్మ దగ్గర కథలు విని కథలు రాయడం మొదలుపెడితే ఇంక వాటికి తిరుగు ఉండదు!
తెల్లగా వెలిగేవి, పచ్చగా వెలిగేవి, మినుక్కు మినుక్కుమంటూ వెలిగేవి, అటూ ఇటూ ఊగుతూ వెలిగేవి – ఎన్నెన్ని రకాల దీపాలో! వాటిని చూడొద్దూ! పెద్దవాళ్ళకి ఈ తేడాల దీపాల వెలుగులు కనపడవు కాబోలు! దేవుడి దగ్గర దీపపుసెమ్మలో దీపం వేరు. చెట్టులా ఉన్న దీపాలగుత్తిలో ఉన్న దీపాలు వేరు!
అసలు ఏ రచన గొప్ప రచన? ఏ కథ గొప్ప కథ? ఏది సామాన్యమైన కథ? అలా చెప్పడానికి దానికి తూనికరాళ్ళేమిటి? ఏ కథైతే మన అనుభవ పరిధిలోకి వచ్చిన మన అనుభవాన్ని ఆసరా చేసుకుని మళ్ళా మళ్ళా మరోసారి మరోసారి అందులోని ఒక మాటో, ఒక వాక్యమో, కొన్ని వాక్యాలో జ్ఞాపకం వస్తూ ఉంటాయో ఆ కథ గొప్ప కథ.
కళావరు రింగుగారు ఎంత సహృదయురాలో విజయనగరం లోనే కాదు దేశం లోనే ఎవరు ఎరగనిది! బీద విద్యార్థులకు ఆశ్రయం ఇవ్వటమే కాదు, ఆర్థిక సాయం చెయ్యటం, అనాధలను ఆదుకోవడం కూడా. వీణ గొప్పగా వాయించే నాయుడుగారి అభిమాన శిష్యుడయిన అనంతరావు అంటే ఆ గానకళాకోవిద అభిమానించి ఆదుకోదా!
మతాబా గొట్టాలెన్నయ్యాయి? లెక్కపెట్టేరా? అవి చాలవు. ఇంకా అంటించాలి. సన్నపాటి పెన్సిలుతో కొన్ని చెయ్యాలి. పంచడానికి వాటిని ఇద్దాం. చచ్చటి కణికికి, చాకలి నారాయణకి, ముత్తెమ్మ వాళ్ళ గూడెం పిల్లలకీ ఇవ్వాలిగా! ఇంకా నయం, రూళ్ళకర్రకి చుట్టి గొట్టాలు చెయ్యలేదు! ఎంత మతాబు మందూ వీటికే చాలదు. ఇంక చిచ్చుబుడ్లలో ఏం కూరతాం?
మనోరమ నాకన్నా బాగా పెద్దమ్మాయి. దానికి చాలా విషయాలు తెలుసు. అది మగపిల్లల బళ్ళో చదూతూంది. నే నాల్గోక్లాసు చదూతూన్నప్పుడు నాన్న తనతోపాటు నన్నూ కానుకుర్తివారి సత్రంకి తీసుకెళ్ళేడు. అదిగో – ఆవేళ అక్కడ మొట్టమొదటి సారి మనోరమని చూశా. మాటాడే. నాటకం చూడ్డానికే కాదు, డబ్బులు దండడానికీ వచ్చేనని చెప్పింది.
నాటు అంటే అర్థం తెలుసా? మొదట్లో జనం గుంపులు, గుంపులుగా ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి తిరుగుతూ బతికేవారు. తర్వాత తర్వాత వ్యవసాయం చెయ్యడం నేర్చుకున్నారు. దాంతో ఒక్కొక్క గుంపు ఒక్కొక్కచోట స్థిరపడ్డారు. అంటే నాటుకుని స్థిరంగా ఎక్కడికీ వెళ్ళకుండా ఒక్క చోటే నిలిచి ఉన్నారు.
భలేగా ఉంది లెక్కల టీచరు! పొడుగ్గా, రెపరెపలాడే వాయిల్ చీరలో – ఎంత తెలుపో! మోచేతివరకూ చేతులున్న జాకెట్టు, నల్లతోలు బెల్టుతో రిస్టువాచీ, రెండో చేతికి నల్ల గాజులు, చెవులకు పొడుగ్గా వెండి లోలాకులు, మెళ్ళో సీతాకోకచిలక లాకెట్టుతో సన్నటి వెండి గొలుసు, కళ్ళకు సురమా కాటిక!
“ఈ గీరమనిషికి నా కూతురినిచ్చి పెళ్ళి చేస్తాననుకుంటున్నట్టుంది. దీని ఆశ మండిపోనూ! ఈసారి మళ్ళా రెండేళ్ళయేసరికి మనల్ని ఉద్ధరించడానికి వేంచేస్తుందిగా మహారాణీగారు! అప్పుడు చెప్పేస్తా. మా అమ్మాయి ఇంకా చదువుకుంటోందీ, అప్పుడే పెళ్ళేఁవిటీ? మా ఆయన దానికి పెద్ద పెద్ద చదువులు చదివిపిస్తా మంటున్నారూ అని చెప్పేస్తా!” అంది.
మార్గరెట్టు టీచరు మొహమాటపడుతూ మొహమాటపడుతూ లోపలికి వొచ్చేరు. అతి బలవంతాన పాలు తాగేరు. ఆవిడ నెమ్మదితనం, మాటతీరు, మనిషీ అన్నీ అమ్మకీ బామ్మకీ నచ్చేయి. తర్వాత తెగమెచ్చుకున్నారు. ఆవిడ దగ్గర నెమ్మదితనాన్ని, గట్టిగా అరుస్తున్నట్టు మాటాడకండా మాటలాడ్డాన్ని నేర్చుకోవాలి.
అందరూ ఏమన్నా బామ్మా నాన్నా నన్ను ఎప్పుడూ ఏమన్రు. అలాంటిది ఇవాళ నే చేసిన పనికి బామ్మా కోప్పడుతోంది. అయితే నాన్నా దెబ్బలాడతాడు. నాన్నని చూస్తే ఎప్పుడూ భయం లేదా – అలాంటిది ఇప్పుడు తనవేపు చూడ్డానికి భయం వేసింది. బుర్రొంచుకుని అలాగే దిమ్మసాచెక్కలా చీడీ మీదికి ఎక్కకుండా నిలబడిపోయా.
కొందరైతే ఎదురుగా పుస్తకం లేందే పాడలేరు. కొందరు పాటలైతే బాగా పాడతారు కానీ పాడుతున్నప్పుడు వాళ్ళ మొహాన్నీ వాళ్ళనీ చూడలేం! కళ్ళు మూసుకుని వినాల్సిందే. బోలెడు కష్టపడిపోతూ, అప్పడాలపిండి అయిపోతూ, తాళం వెయ్యడానికి చెయ్యి ఇంతెత్తు ఎత్తుతూ ఏవిఁటో – చూడ్లేం బాబూ!
తేనెటీగల్లా నేనూ ఊహల గదుల గూడు కట్టుకుంటా! తేనెటీగలు పువ్వు పువ్వు దగ్గర్నించీ తేనె పట్టుకొచ్చి గదుల్లో పెట్టుకున్నట్టు ఒక్కొక్క ఊహనీ పట్టుకెళ్ళి ఆ గదుల్లో దాచుకోవాలి! అత్తయ్య ఈతపాయల జడల ఫోటోలు ఎప్పటికీ అట్టే పెట్టుకుని మనవలికి చూపెట్టుకోవాలి అంది కదా! అలా నేనూ నా ఊహల్ని అట్టే పెట్టుకోవాలి.
పండుముసిలి అంటారు. ఈవిడ లాంటి వాళ్ళనేనా? పాక్కుంటూ, డేక్కుంటూ ఉండే ముసిలివాళ్ళూ ఉంటారు కామోసు. నేనెప్పుడూ ఎవర్నీ చూడలేదు. బామ్మ మరికొన్నేళ్ళకి ఇలా అయిపోతుందా ఏం? అమ్మో! బామ్మ ఇలా అవకూడదు. తను అసలే పొట్టిమనిషి. ఈవిడలా నడుం వొంగిపోతే ఇంకేమైనా ఉందా!
మాటామంతీ లేకుండా ఎవరి మానాన వాళ్ళు అలా ఓ చోట ఎవరి గోలలో వాళ్ళుంటే నాకు నచ్చదు కాక నచ్చదు! ఒకళ్ళం కూచున్నాం అనుకో – మనలో మనం ఏదో ఆలోచిస్తూనో, ఊహించుకుంటోనో, ఏవేవో జ్ఞాపకం తెచ్చుకుంటోనో ఉంటాం. అది వేరూ! అందరూ ఒకేచోట కూచుని ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకోవాలి. నవ్వాలి. నవ్వించాలి! ఏఁవిటో ఈ పెద్దవాళ్ళు!
వంటింటి అటకమీంచి ఆవకాయ గూనలు పెద్దవీ చిన్నవీ అన్నిటినీ దింపించాలా, కడిగించాలా, ఎండబెట్టాలా! ఒక వహీవా? అన్ని వహీల ఆవకాయా పెట్టాలా! పచ్చావకాయ, బెల్లమావకాయ, ఎండావకాయ, అడకాయ, మాగాయి, తొక్కుపచ్చడి, కాయావకాయ, మెంతావకాయ. మళ్ళీ అందులోనూ కొన్నిటిలో వెల్లుల్లి వేసీ, కొన్నిటిలో వెయ్యకుండానూ!
సాలిపురుగు శ్రద్ధగా తన పట్టుని అల్లుతుందన్నమాట. ఎంత సన్నదారమో. దాని ఒంటినుంచి వొస్తుందా దారం మరి! అర్థచంద్రాకారాల దారాలని మజ్జి దారానికి వేళ్ళాడబెడుతూ చకచకా అటోసారి ఇటోసారీ అతికేస్తూ అల్లేస్తుంది! దాని పనివాడితనాన్ని అమ్మ పనివాడితనాన్ని మెచ్చుకున్నట్టు మెచ్చుకోవలిసిందే!
నువ్వనుకున్నావ్ కొండమావయ్యా నే పడుకున్నాననీ! వెన్నెలగా ఉంది కదూ ఇవాళ! పెద్దకిటికీ తీసివుందిగా! ఆకాశం మాంఛి తెల్లగా వెన్నలా మెత్తగా భలే బావుంది. అలా చూస్తూ ఉంటే కాస్సేపటికి చందమామ కిటికీకి ఎదురుగ్గా దగ్గరగా వొచ్చీసీడు. కళ్ళు మూసుకుని తెరిచీసరికి నేను ఆకాశంలో ఉన్నా. ఎంత మెత్తగా ఉందో ఆకాశం!
‘మరేమో ఒచ్చి’ ఏం గోడు చెప్పుకోడానికి ఒచ్చిందో వినాలని ఉన్నా ఆవిడ వెళ్ళిపోయాక బామ్మా అమ్మా మళ్ళీ మళ్ళీ ఎలాగా వాళ్ళలోవాళ్ళు ఏకరువు పెట్టుకుంటూనే ఉంటారు! భోగట్టా తెలీకపోదు! ఎటొచ్చీ ఆవిడ నోట విండం ఇహ కుదరదు! నేనక్కడ ఉంటే నవ్వుతానని, నవ్వు ఆపుకోనని అమ్మకు భయం! ఆవిడ ఎదురుగా నన్ను చీవాట్లు పెట్టడమూ కుదరదు! అదీ సంగతి!
“పెద్దింటి అమ్మడమ్మ కోడలే! చిట్టెమ్మను ఎరగవూ? అమ్మడమ్మకీ చెప్పే. కోడలు పిల్ల చిట్టెమ్మ చిన్నదీ. దానికి తెలీదూ – గ్రహణం నాడు గదిలోంచి బయటికి రావొద్దనూ. నీళ్ళోసుకుందన్నావు. జాగ్రత్తా! అని. ఆవిడేం చెప్పిందో, అదేం విందో! మొదటి కాన్పు! గ్రహణం మొర్రి రాకేమవుతుందీ! పిల్లాడు చూడబోతే పనసపండులా ఉన్నాడు. మీది పెదవేమో చీలిపోయి ఉంది!
అక్కా! ఇలాగ్గానే నే దిగినరోజునే నా ఒడియా స్నేహితుడు మిశ్రా ఇంట్లో ఆవు ఈనింది. భలే మంచి వేళన ఒచ్చేనే! జున్ను పెడతావన్న మాట అన్నా. జున్నేవిఁటీ అన్నాడు మిశ్రా. ఆవు ఈనిందిగా అన్నా. ఆయన చెప్పింది విని ఆశ్చర్యపోయా. వాళ్ళు జున్ను వొండుకోరట. ఆవుకీ పురుడు పాటిస్తారట. శుచి అయ్యేవరకూ పాలు పిండుకొని వాడుకోరట!
అబద్ధాలాడకూడదు. నిజఁవే. కాని, మనసులో ఉన్నవన్నీ చెప్పకూడదు అని ఈమధ్యనే తెలిసింది. అందులోనూ, అమ్మా బామ్మా లాంటివాళ్ళతో. నాకు ఏఁవిటో బాగోలేదు. నాకు ముసురు పట్టింది అని చెప్పేననుకో. ఇంక చూడు రాద్ధాంతం చేస్తారు. దిష్టి తీస్తారు. తాయెత్తు కడతామంటారు. ఆంజనేయస్వామి బిళ్ళ గొలుసు మెళ్ళో వేస్తామంటారు. అందుకని అబద్ధం ఆడొచ్చు!
దానిబలమే నా ఊపిరి
ప్రతిక్షణం, ప్రతీ ఘడియా
దానివల్లే!
గుప్తంగా దాంట్లోనే
నా గుండె చప్పుళ్ళు
దాక్కుని ఉన్నాయి.
ఆడవాళ్ళ నెత్తిమీద నీళ్ళకుండ ఉంటుంది, ప్రతీదానికి ఏడుస్తూనే ఉంటారు అంటారు మొగాళ్ళు. నిజఁవే. ఆడవాళ్ళకి అలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. నాకు ఏడుపు రాదు. ఆలోచన ఉన్నవాళ్ళకి ఏడుపు అంత త్వరగా రాదట! మొగవాళ్ళు అందుకే ఏడవరు. బుర్రే పని చేస్తుందట వాళ్ళకి. గుండె కాదు!
ఇవాళ బామ్మ నోట మరోమాట విన్నా. ‘నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు. వాడు బుర్రకి ఎక్కించుకోడ్రా!’ అని బుచ్చిబాబుగారితో అన్నాది. బుచ్చిబాబుగారు మూడుమేడల వీధిలో చివారి ఇంట్లో ఉంటారు. బామ్మ దగ్గరికి వచ్చే అందరి లాగానే ఈయనా తన గోడు చెప్పుకోడానికి వస్తూ ఉంటాడు. వాడెవడో బుర్రకు ఎక్కించుకోడట!
పండు అనుకుని ఆంజనేయుడు సూర్యుడి దగ్గరకి ఆకాశంలో ఎగిరి వెళ్ళేడు. మీదికి బాగా లేచేక బాగా వేడెక్కిపోతాడెమో! పొద్దున్నే అంత వేడిగా ఉండడేమోలే! కాస్త కాలితే కాలింది అనుకుందామంటే అందడు కదా! గాలికి పుట్టేడు కాబట్టి ఆంజనేయుడు ఎగిరివెళ్ళేడు. నేనెలా వెళ్తానూ? ఎగరలేనే! ఎలా సూరీడిని రాకుండా చెయ్యాలీ? తెల్లారకుండా ఎలా చెయ్యాలీ?
పిన్ని కూతురు రేవతికి పన్నుమీద పన్ను ఎక్కింది. దొంతర పన్ను అంటారట! అది నవ్వితే భలే అందంగా ఉంటుంది. నిజానికి అందంగా కనబడకూడదుగా! అందరూ ఒకలాగ ఉండి ఒకళ్ళు వేరేగా కనబడితే దాన్ని గొప్పగా బాగుందనుకుంటాం కాబోలు! అది నవ్వితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది!
ఒకటి అనుకుంటానా, ఇంకేదో గుర్తుకు వస్తుంది. దాంతో మరోటేదో వచ్చేస్తుంది. పరిగెట్టుకెళ్ళి చెప్పకపోతే నా బుర్రలోంచి అది ఎగిరి చక్కాపోతుంది. అవునూ, ఎగిరి ఎక్కడికి వెళ్తుందీ? పిట్టలు ఓ చెట్టు మీంచి మరో చెట్టు మీదికి ఎగిరి కూచుంటాయి. ఒకటా రెండా? ఎన్నో చెట్లు! నా బుర్రలోంచి ఎగిరి బహుశా మరో బుర్రలోకి దూరిపోతుంది కాబోలు! ఒకటా రెండా? ఎన్నో బుర్రలు!