ఎండాకాలం వచ్చిందంటే చాలు – మిట్ట మధ్యాన్నవేళ ఇంటిల్లిపాదిమీ నట్టింట్లోనే!
నట్టిల్లు చల్లగా ఉంటుంది మరి!
నాన్నా, తనతోపాటు ఎండల్లో మా ఇంటికి వచ్చిన మావయ్యలో, బాబయ్యలో వాళ్ళూ నట్టింట్లోనే! నాన్నగదిలో ఉండనే ఉండరు.
నట్టింటికి ఉన్న ఇటు తలుపులూ అటు తలుపులూ బిడాయించి కిటికీలకు చల్లని నీళ్ళతో తడిపిన తెరగుడ్డలు వేలాడదీస్తుంది అమ్మ. ఇహ గాడ్పుగాలి ఎంత వద్దామని గింజుకున్నా లోపలికి రానే రాలేదు.
తడి ఇసక మీద పెట్టిన మంచినీటి పెద్ద కూజాకీ తడిపిన దళసరి గుడ్డ చుట్టూరా చుట్టబెడుతుంది అమ్మ. నట్టింటి మూలని పెట్టిన చల్లటి నీళ్ళను తాగుతూ, మొహం మీద చల్లుకుంటూ, పొద్దువాలి బాగా చల్లబడేదాకా చల్లటి గచ్చు మీద దొర్లుతూ బామ్మ చెప్పే కబుర్లు వింటా. ఓ సారి బోర్లా పడుకుని రెండు మోచేతుల మీదా మొహాన్ని ఆన్చి రెప్ప వాల్చకుండా బామ్మనే చూస్తూ వింటా! ఓ సారి బాసింపట్టు మఠం వేసుకుని రెండు చేతులూ తొడలమీద పెట్టుకుని అటూ ఇటూ దృష్టి పోకుండా ధ్యానం చేస్తున్నట్టు వింటా! బామ్మ కబుర్లు భలేగా చెప్తుంది! నిజానికి కొత్త కబుర్లేవీ కావు. ప్రతి ఏడూ వినేవే! బామ్మ చెప్పినవే చెప్తుంది. మేం విన్నవే వింటాం.
తాటిముంజెలు కొన్నారివాళ. అమ్మా బామ్మా ముంజెలు పడంగా చితికి నీళ్ళుకారిపోయి ముక్కలు కాకుండా పంచదార వేసిన వెంబమూతి పెద్దగిన్నెలోకి ఒలుస్తున్నారు. మళ్ళీ మళ్ళీ లేచివెళ్ళి తేనక్కరలేకండా కప్పుగిన్నెలు, చెమ్చాలు కూడా తెచ్చుకుని మరీ కూచున్నారు.
నాన్న గోడకి చేర్లబడి ఏదో పుస్తకం చదువుతున్నాడు. బాబయ్య గోడనానుకుని కూచుని కాళ్ళు రెండూ చాపుకున్నాడు. ఆయనా ఏదో పుస్తకంలో మునిగిపోయాడు. తమ్ముడు అమ్మ పక్కనే హాయిగా నిద్రోతున్నాడు.
మాటామంతీ లేకుండా ఎవరి మానాన వాళ్ళు అలా ఓ చోట ఎవరి గోలలో వాళ్ళుంటే నాకు నచ్చదు కాక నచ్చదు! ఒకళ్ళం కూచున్నాం అనుకో – మనలో మనం ఏదో ఆలోచిస్తూనో, ఊహించుకుంటోనో, ఏవేవో జ్ఞాపకం తెచ్చుకుంటోనో ఉంటాం. అది వేరూ! అందరూ ఒకేచోట కూచుని ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకోవాలి. నవ్వాలి. నవ్వించాలి! ఏఁవిటో ఈ పెద్దవాళ్ళు! ఒక్కొక్కసారి ఈ పెద్దవాళ్ళకి ఏఁవీ తెలీదు! ఎలా పెద్దవాళ్ళయ్యారో ఏఁవిటో, అనిపిస్తుంది.
“తాటిముంజెలు ఒలుస్తూ తాపీ కబుర్లు చెప్పూ” అన్నా బామ్మతో.
చీడీస్తంభాలు చెక్కసున్నాలు ఊడిపోయి రోజూ సున్నం రాలుతూ ఉంటే తాపీ మేస్త్రీ చేత మొన్నీమధ్యే స్తంభాలన్నిటినీ నున్నగా చేయించారు.
బామ్మ భల్లుక్కుమని నవ్వుని ఒక్కసారిగా ఒంపేసి, “తాపీ మేస్త్రీ కబుర్లేవిఁటే తలతిక్క పిల్లా!” అన్నాది.
“అయ్యో బామ్మా! తాపీ మేస్త్రీ అని నేనెక్కడన్నానూ” అంటూ నేనూ కిలకిలా నవ్వేను.
మా నవ్వులకి నాన్నా బాబయ్యా పుస్తకాల్లోంచి బయటపడి బుర్రలెత్తి మావేపు చూశారు. నయం, నిద్రోతున్న తమ్ముడు లేచిపోలేదు. నానుంచే లేచిపోయేడని కోప్పడేవారు! బామ్మా నామాటకే కదా నవ్వింది అంత గట్టిగా!
“మాటలకి బోలెడు అర్థాలు లాగి మాటలతో ఆట ఆడ్డం దీనికి అలవాటేగా అత్తయ్యా! నింపాదిగా చెప్పమంటోంది” అంది అమ్మ.
“లొడలొడలాడుతూ కబుర్లు ఎప్పుడన్నా బడబడా చెప్పేనా? చెప్తానా? తాపీగా చెప్పమండానికి” అని రుసరుసలాడింది బామ్మ.
ఆ రుసరుసకి నాకు నవ్వొచ్చింది కాని ఆపుకున్నా. నవ్వేననుకో, ఇంకేమన్నా ఉందా! నేననుకున్నట్టు అంతమందిమీ సరదాగా కబుర్లకి దిగడం మాట దేవుఁడెరుగు. అంతా తలకిందులైపోతుంది!
“తాపీ తాత కబుర్లు బామ్మా” అని తికమక పెట్టకుండా తిన్నగా చెప్పే.
“మీ పినమాఁవగారి కబుర్లత్తయ్యా! పేర్లు పెట్టడం లోనూ ఉద్దండురాలని మీరు పొంగిపోతూ మనవరాలిని వెనకేసుకొస్తారుగా. మరిచిపోయారా? ఆయనకి తాపీ తాతని పేరు పెట్టిందని?”
నాన్నా బాబయ్యా పుస్తకాలు కింద పడేసి మా కబుర్లు విండంలో పడ్డారు.
“మాఁవిడి పళ్ళ తాత అని కదూ అనేదీ?”
“దాని బుర్రకెప్పుడే పేరు తోస్తే ఆ పేరు పెట్టేస్తుంది. మొదట్లో తాపీ తాతగారనే అనేది!” అమ్మ బామ్మకి గేపకం చేసింది.
“అవును. తాపీ అంటే ఇలా అలా తాపీనా? ఏళ్ళూ పూళ్ళూను. మా పిన్నత్తగారు చచ్చి స్వర్గాన ఉన్నాది. ఆ మహానుభావుడు బతుకంతా ఒక్కలా ఆవిణ్ణి వేపుకుతిన్నాడు.”
ఎండల్లో తన పినమావగారిని తప్పనిసరిగా బామ్మ తలుచుకుంటుంది. ప్రతి ఏటా ఆయన కబుర్లు చెపుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఆయన మాఁవిడి పళ్ళు తిండం గురించి చెప్పడం-నవ్వడం-నవ్వించడమూనూ! అందుకే నేను ఆయనకు మాఁవిడి పళ్ళ తాత అని పేరు పెట్టే. ఇవాళ తాపీ తాత అండంతో బామ్మకి వాళ్ళ పిన్నత్తగారు గేపకం వొచ్చీసినట్టున్నారు.
తాపీ తాతగారు పెళ్ళాన్ని వేపుకు తినేవాడా?
“దాని మొగుడు రాచి రంపాన పెడుతున్నాడే. దాన్ని ఒక్కలా కాల్చుకు తింటున్నాడే, అనే ఎప్పుడూ పోలీసు పెళ్ళాం గురించి ఆ పోలీసు గురించి చెప్తావ్! అయితే మొగుడు పెళ్ళాన్ని వేయించుకుని కూడా తింటాడా బామ్మా?” అని అడిగే.
“ఇదీ వరస! నోటంట మాట రావడం భయం! చూడు దీని ప్రశ్నలు!” అన్నాది బామ్మ.
“రాచి రంపాన పెడుతున్నాడన్నా, కాల్చుకు తింటున్నాడన్నా, వేపుకు తిన్నాడన్నా ఒకటేనే! బాధ పెట్టేడని అర్థం” అన్నాడు బాబయ్య.
“అలా ఎలా అవుతుంది బాబయ్యా! కాల్చుకు తింటే ఆ రుచి వేరు. వేయించి తింటే రుచి వేరు. రాచి రంపాన పెడితే ఆ నొప్పి వేరు. మొన్న నేను జారి గేట్లో పడిపోయినప్పుడు మోకాలు చర్మం గీరుకుపోయింది. ఆ నొప్పి చిన్నది కదా! రంపంతో కోస్తే ఎంత గట్టిగా నొప్పి పెడుతుందీ? అన్నీ ఒక్కటెలా అవుతాయీ? అన్నీ ఒకటే అయితే అన్నిరకాలుగా అండం ఎందుకూ?”
నాన్న నవ్వేడు. “పాయింటే!” అన్నాడు.
“లా పాయింట్ల గుంటా! రాచి రంపాన పెట్టడం అంటే రంపంతో కొయ్యడం కాదే. కాల్చుకు తింటున్నాడంటే నిజంగా నిప్పుల్లో వేసి కాలుస్తున్నాడనీ కాదే. అంతలా వేధిస్తాడూ అని! చెప్పేనుగా, నోట మాట రావడం తరవాయి – ఇలా ప్రశ్నలతో చంపుకుతింటుంది” అన్నాది బామ్మ.
“నిన్ను నేను చంపేనా? బతికే ఉన్నావుగా? ఎక్కడ తిన్నానూ?” అని నవ్వేను.
“అది తెలిసే అడుగుతోందత్తయ్యా! తెలీక కాదు” అన్నాది అమ్మ.
తలమీద చెయ్యి పెట్టుకుని “నే చచ్చినంత ఒట్టూ! నాకు తెలీదు. తెలీకే అడిగే” అన్నా.
బాబయ్యకీ నవ్వొచ్చింది. “పిన్నీ! ఇది నిన్ను ఆట పట్టిస్తున్నాది!” అంటూ పకపకా నవ్వేడు. “చాలా జాతీయాలు వొచ్చే నీకూ!” అని నన్ను మెచ్చుకున్నాడు.
“ఏది వింటే అది ఆ బుర్రలో పోసేసుకుంటుంది. బుర్ర నిండిపోయి ఎప్పుడో ఓ రోజు అన్నీ కారిపోతాయిలే!”
“నింపినకొద్దీ జాగా వొస్తూనే ఉంటుంది. జ్ఞానంతో బుర్రని నింపుతూనే ఉండాలి” అన్నాడు నాన్న.
“నిండు నట్టింట్లో కూచుని చావులూ, ఒట్లు సత్యాలు, బాధించడాలు వేధించడాలు, నింపడాలు కారిపోడాలు – ఈ కబుర్లేవిటిటా! చాల్చాలు. తాటిముంజెలు ఒలవడం అయిపోయింది, తిందురుగాని” అన్నాది అమ్మ తొక్కుల గిన్నెలో చేతులు కడుక్కుంటూ.
తాటిముంజెలు తింటూ… “అయితే బామ్మా…” అనగానే “మళ్ళీ ఏఁవొచ్చింది తుప్పబుర్రలోకి?” నవ్వుతూ అడిగింది బామ్మ. దీని పెంకిమాటలంటే నాకూ సరదావే అని ఇంటికొచ్చిన వాళ్ళకి సంబరపడుతూ చెప్తుంది. నేననే మాటలకి కోపం రమ్మన్నా రాదు బామ్మకి. మజ్జ మజ్జ కొంచెం విసుక్కుంటుంది అంతే.
నా తుప్ప జుట్టు అడుగున బుర్రలో పెద్ద ప్రశ్నల డొంక ఉందంటుంది బామ్మ. ఊహలు ఊరినట్టే డొంక లోంచి ప్రశ్నలు ఉడతల్లా తోకలు ఎత్తుకుని గెంతుకుంటూ వచ్చేస్తాయిట!
“ఏం లేదూ, మొగుళ్ళని కాల్చుకు తినే పెళ్ళాల గురించి ఎప్పుడూ చెప్పవేమీ?”
“ఎక్కడో లక్షకో కోటికో అలాంటి ఆడది ఉంటుంది. మొగాడు ఎలాటివాడైనా ఓర్పుతో ఆడది భరిస్తుంది తల్లీ! ఆడదాని నుదుటిని అలా రాసి పుట్టించాడా దేవుడు! మగాళ్ళు మారరమ్మా. వాళ్ళంతే!”
“చదువుకున్న ఆడవాళ్ళు పెరిగితే మగాళ్ళూ మారతారు. మారకేం చేస్తారు?” అన్నాడు నాన్న.
వీత్తలుపు ఎవరో టకటకా కొట్టడంతో బాబయ్య లేచేడు తలుపు తియ్యడానికి, ‘ఇంత ఎండలో ఎవరొచ్చేరబ్బా!’ అంటూ. “అన్నయ్యా! నీకోసం ఎవరో పెద్దావిడ వొచ్చేరు” అంటూ కేక పెట్టేడు.
“నేనేనండీ! ఒరే అబ్బాయీ. ఆ బుట్ట ఇలా లోపల పెట్టు. ఇంద, నీ డబ్బులు’ అంటూ సన్నాయి లాంటి తియ్యటి గొంతు వినిపించింది.
“నాన్నా! నాన్నా! నథానియల్ మేడమ్‌గారు!” అంటూ ఓ గెంతు గెంతి వెళ్ళబోతే, “నువ్వు కూచోవే” అంటోంది అమ్మ. నాన్న లేచి వెళ్ళేడు.
నథానియల్ మేడమ్ ఇంతెత్తుగా నాన్నంత పొడవూ ఉంటారా, కాని అంతకుమించి బాప్‌రే బాప్ ఎంత లావో! అంత లావు మనిషా – మాట మాత్రం సన్నాయిలా తియ్యగా ఉంటుంది. నాజూగ్గా సన్నగా ఉన్నావిడ కంఠం బొంగురుగా మగాళ్ళ గొంతులా ఉండడం విని ఓ సారి వింతగా చూశా. ఆవిణ్ణి చూడకపోతే మగాడనే అనుకుంటారు ఆ గొంతు విని! నథానియల్ మేడమ్ దానికి సరిగ్గా విరుద్ధం. కోకిల కంఠం!
ఆకారాలకి గొంతుకలకీ ఎక్కడా సంబంధం ఉండదు. అదేఁవిటో! ఎంతమంది మనుషులో! ఎన్ని రకాల గొంతుకలో! చేతి సంతకంలా ఎవరి గొంతు వాళ్ళదే!
“రండమ్మా! ఎప్పుడు బయల్దేరేరో ఏమో. మంచి ఎండలో వొచ్చేరు. గోలెంలో చల్లటి నీళ్ళున్నాయి. మొహం, కాళ్ళూ చేతులూ కడుక్కుని రండి” అంటూ బామ్మ ఆవిణ్ణి పలకరించింది.
“మెల్లిగా అంటున్నారా? కొలిమిలో వేసి కాలుస్తోంది. ఈసారి ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి.”
నే లేచే. ఆవిడకు నీళ్ళు కడుక్కోడానికి ఇద్దామని, పోద్దామనీనూ.
“నువ్వెళ్ళకు. ఆవిడ చీరంతా తడిపేస్తావ్ నీళ్ళు పొయ్యడం కాదు కాని! కిందటిసారి పాపం చీరంతా పూర్తిగా తడిపేసేవ్. మీ అమ్మ ఇస్తుందిలే!” అంటూ నన్ను వొద్దని, అమ్మని వెళ్ళమని చెప్పింది బామ్మ.
బామ్మ మరీను! కిందటేడు ఆవిడ చీరంతా తడిపేసేనుట! ఎన్నిసార్లు – నే తడపలేదు మొర్రో, ఆవిడే మళ్ళా మళ్ళా చీర మీద లోపల పరికిణీ మీదా పొయ్యమంటే పోసేనూ – అని చెప్పేనా, ఆవిడా చెప్పిందా – నేనే పొయ్యమన్నానండీ అని. అయినా ఊహూఁ, ఎప్పుడు చెప్పినా నేనే తడిపేసేనంటుంది.
అసలు నథానియల్ మేడమ్ ఈసారి ఎండల్లో వొచ్చేరు కాని ఎప్పుడూ ఆవిడ ఎండలు వెళ్ళేక, ఆవకాయలు నానేక బామ్మ పెట్టిన మాగాయి పట్టుకెళ్ళడానికి వొస్తారు.
కిందటేడు మేడమ్ వొచ్చినప్పుడు నట్టింట్లో మేఁవందరఁవూ భోజనానికి పీటల మీద కిందే కూచున్నాం. నథానియల్ మేడమ్‌గారు కింద కూచోలేరు ఆ భారీ శరీరంతో. మా పంక్తి పక్కనే కుర్చీ వేసి స్టూలు మీద పెట్టేరు. మా అందరి తిండం అయిపోయింది. కంచాల్లో చేతులు పెట్టుకుని కూచున్నాం.
సరిగ్గా మేం బళ్ళో ‘లెట్ మీ గో ఔట్ టీచర్’ అని పెర్మిషన్ అడిగినట్టు, నథానియల్ మేడమ్‌గారు ‘లెట్ మీ ఎంజాయ్ మై మాగాయిటెంకా’ అంటూ మాగాయి టెంకను చీకుతున్నారు. చీకుతూ చీకుతూ బుర్రెత్తి మమ్మల్ని చూసి ‘మీరు చేతులు కడిగేసుకోండి’ అని చెప్పబోయేసరికి టెంక కాస్తా జారి దబ్బున మాగాయి ఊటతో సహా ఆవిడ ఒళ్ళో పడ్డాది!
నాకు నవ్వొచ్చింది. కాని నవ్వకూడదు కదా! పెద్దావిడా, హెడ్‌మిస్ట్రెస్ ఏదో బడికి. మా చుట్టమూ కాదు. మర్యాదగా ఉండదు.
అయ్యో! అయ్యో! అంటూ గబుక్కున లేచి నిల్చున్నారు ఎడంచేత్తో చీర కుచ్చిళ్ళని ఎత్తి పట్టుకుని. పలచటి చీర కదూ, లోపలి పరికిణీ వరకూ ఊటతో తడిసిపోయింది. పాపం! ఖరీదైనా చీరా – ఎప్పుడూ ఖరీదైనవే కట్టుకుంటారు – అందులోనూ లేతరంగుది. ఆవిడ ఒంటిరంగు నలుపు కదా మరి!
నన్ను నీళ్ళు పొయ్యమంటూ సన్‌లైట్ సబ్బు పట్టించి పట్టించి ఆ ఊట పడ్డ మేర కుచ్చెళ్ళబట్టని ఉతికినట్టు కడుక్కున్నారు. వెంటనే అలా కడుక్కోకపోతే ఆ రంగు వదలదట! జిడ్డు సరే సరి! ‘ఆరిపోతుంది లెండి’ అన్నారే కాని తన చీరని కట్టుకోమని అమ్మ ఎంత చెప్పినా కట్టుకోలేదు. ఉన్నంతసేపూ కుర్చీలో కూచుని ఆ కుచ్చెళ్ళని ఎత్తి పట్టుకుని ఆరబెట్టుకున్నారు. తడీపొడీగా ఆరేక ‘వస్తాను’ అంటూ మాగాయి సీసా పుచ్చుకుని బయల్దేరేరు.
అప్పట్నించి నేనూ ‘లెట్ మీ ఎంజాయ్ మై మాగాయి టెంకా’ అని పెర్మిషను తీసుకుని అందరి భోజనాలు అయిపోయి వాళ్ళు చేతులు కడిగేసుకున్నా సరే – గంటలకొద్దీ మాగాయి టెంకను చీకుతూ తింటున్నా. ఒక్కోసారి ‘చీకింది చాల్లే. ఇంక లే. టెంకనింకేం లేదు’ అమ్మ నా చెయ్యి పట్టుకుని కంచం ముందునుంచి లేవదీసి, ‘పద పెరట్లోకి’ అంటుంది. ‘నువ్వూ అలా చీకి చీకి తిను. ఆ మజా తెలుస్తుంది. కంచం ముందునుంచి నువ్వూ లేవవు!’ అంటా.
మనిషిని చూస్తే మనిషిడు గేపకాలు! మనిషి గేపకం వొస్తే మనిషిడు గేపకాలు!
గిర్రున తిరిగిపోతూ సినిమాలోలా ఒకదాని తర్వాత ఒకటి కళ్ళముందుకు వొస్తూ పోతూ ఉంటాయి. కనపడుతూ కనుమరుగై పోతాయి. మాటలు వినపడుతూ వెనక్కి మళ్ళిపోతాయి. వెనక్కి వెళ్తూనే ఉంటుంది బుర్ర! ముందుకు వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళాల్సిందే. నిన్నటి – మొన్నటి – అల్లప్పటిదెప్పటిదో కలిస్తేనే ‘ఇవాళ’ అవుతుంది. ముందుకు జరుగుతుంది. ‘రేపు’ వొచ్చి ‘ఇవాళ’ కాస్తా ‘నిన్న’ అయిపోతుంది!
ఇవాళ ఏవిఁటో వింతవింతైన తమాషా ఆలోచనలూ ఊహలూ బుర్రలో పరిగెడుతున్నాయి. నేలని చూస్తూ నాలో నేను మునిగిపోయి, ఎప్పుడూ రాని గమ్మత్తుగా ఉన్న ఊహల్లో ఉన్నా. ఏదో ఈడుస్తున్న చప్పుడుకి తుళ్ళిపడి తలెత్తే.
నాన్న ఎండుగడ్డితో కప్పి కట్టిన మావిడి పళ్ళ వెదురుబుట్టను ఎత్తలేక ఈడుస్తూ నట్టింట్లోకి తెచ్చేడు. ఆ వెనకాతలే బాబయ్య చేతులున్న ఎత్తైన కర్రకుర్చీ పట్టుకొచ్చేడు. నథానియల్ మేడమ్, అమ్మా అప్పుడే పెరట్లోంచి వొచ్చేరు.
“స్టూలు బల్ల కూడా తీసుకురా బాబూ, మేడంగారు భోంచేస్తారు” అంది బామ్మ.
“నే భోంచేసే బయల్దేరేనమ్మా. మా స్టూడెంటు ఇదిగో ఆ పళ్ళబుట్ట తెచ్చేడు. అది ఇవ్వాలని వొచ్చే.”
“బుట్ట బుట్టంతా, ఇంత పెద్ద బుట్టనీ మాకోసమే తెచ్చీసేరు! మీరు మీకోసం పళ్ళు అట్టే పెట్టుకున్నట్టు లేదే?!” అన్నాడు నాన్న.
“ఒక్క మనిషిని! నాకెన్ని కావాలి? మీదన్నారా, నలుగురున్న కుటుంబం. నలుగురూ వచ్చే ఇల్లు. చిన్నబుట్టలో నాకోసం వేరే తెచ్చి పెట్టేడు!”
నథానియల్‌గారు పెళ్ళి చేసుకోలేదట!
“మరైతే ఏం తీసుకుంటారూ? చల్లగా ఉన్నాయి. పంచదార వేసిన లేత తాటిముంజెలు తీసుకోండి.”
“ఊహూఁ, ఏం వొద్దమ్మా!”
“మజ్జిగ ఇవ్వవే. ఎండలో వొచ్చేరు కదా!”
“సరే, మజ్జిగ ఇవ్వండి. బాబూ, మీకు తెలియదని కాదు. బుట్టలోంచి తీసి పళ్ళని గడ్డిమీద పరిచి పెట్టుకోండి. లేపోతే కుళ్ళిపోతాయి” అన్నాదావిడ.
“ఏం పళ్ళండీ? సపోటాలా?” అని అడుగుతూ బుట్ట దగ్గరికెళ్ళి గొంతుకిళ్ళా కూర్చున్నా.
“మావిఁడి పళ్ళు.”
“ఏ మావిఁడి పళ్ళూ?”
బాబయ్య బుట్ట తాళ్ళు విప్పదీసి మీద బోర్లించి పెట్టిన పల్చని వెదురు తడకని తీసేడు. మావిఁడి పళ్ళ వాసన గుప్పుమంది.
“ఓ! ఓ! తెలిసిపోయింది. రసాలు, రసాలు. చెరుకు రసాలు!” లేచి నిల్చున్నా తప్పట్లు కొడుతూ.
అమ్మ ఇచ్చిన మజ్జిగ గ్లాసు అందుకుంటూ “పోల్చేసేవే వాసనకే! పండు చూడన్నా చూడకండా” అన్నారు నథానియల్.
“అదా? దానికన్ని జాతుల మావిఁడి పళ్ళూ తెల్సు” అన్నాది బామ్మ.
పళ్ళబుట్టని వొదిలి బామ్మ పక్కన కూచుంటూ “అమ్మా! అమ్మా! నాకూ కావాలి మజ్జిగ! నాకూ కావాలి మజ్జిగ” అన్నా.
ఈ మజ్జిగ మామూలు ఉత్తుత్తి మజ్జిగ కాదు. ఒక్కొక్క గుక్కా గుటక వేస్తూ తాగుతూ ఉంటే చల్లగా గొంతు దిగుతూ మా చెడ్డ రుచిగా ఉంటుంది. నిమ్మరసం, శొంఠిగుండ, ఉప్పు, కరివేపాకు వేసి చేస్తుంది అమ్మ. మజ్జిమజ్జిని పిసరు పిసరు పచ్చిమిరప ముక్కలు నోట్లోకి రాగానే తీసేయాలి. లేపోతే నోరు మండుతుంది! కారం తినేవాళ్ళకైతే పరవాలేదనుకో! ఎవరైనా వస్తేనే అమ్మ చేస్తుంది. నాన్నా వాళ్ళూ మజ్జిగ కాదూ – ఉప్పు వేసి దబ్బాకు తరువాణీ తేట ఇవ్వూ! అని దాన్నే ఇష్టపడతారు. నాకయితే అదీ ఇష్టమే, ఇదీ ఇష్టమే.
ఎన్నో రకాల జాతుల మావిఁడి పళ్ళు, పాల సపోటా పళ్ళు, తాటిముంజెలు, దబ్బాకు తరువాణీ తేట, సొంఠినిమ్మ మజ్జిగ, పచ్చటి పనసతొనలు, తెల్లటి మల్లిపువ్వులు, సింహాచలం సంపెంగపువ్వులు, బెల్లమావకాయ ఎండీ ఎండని ముక్కలు – ఓహోహో, ఎన్నెన్నెన్నో ఎండాకాలంలో!
ఎండా, గాడ్పూ, చెమటా, పేతపొక్కులూ – ఇవీ ఉంటాయి అనుకో. బాగున్నవాటిని తీసుకుని బాధ పెట్టేవాటిని పక్కని పెట్టేస్తూ ఉండాలి!
“బామ్మని మావిఁడి పళ్ళ తాత, తాపీ తాత కబుర్లు చెప్పమని అడుగుతున్నా. మేడమ్‌గారు మావిఁడి పళ్ళు తెచ్చీసేరు!” అన్నా.
“మావిఁడి పళ్ళ తాత ఎవరూ?” అడిగేరు నథానియల్.
“మా పినమాఁవగారు. ఆయనా, ఆయన భోజనం, మావిఁడి పళ్ళు ముగ్గవెయ్యడం – అదంతా ఓ పెద్ద ఫార్సు” అంది బామ్మ.
“ఫార్సంటే ఫార్సు కాదండీ. మా కుటుంబాల్లో ఆయన్ని అలా తలుచుకుంటూనే ఉంటాం. విడ్డూరపు మనుషుల్నీ వాళ్ళ అలవాట్లనీ మరిచిపోలేం కదండీ!” అన్నాది అమ్మ.
“అంత విడ్డూరపు మనిషా ఆయన!”
“అంతా ఇంతా కాదు. విని విస్తుపోతారు”
అమ్మా, బామ్మా పోటీ పడుతున్నట్టు ఇద్దరూ మావిఁడి పళ్ళ తాత – తాపీ తాత గురించి చెప్పడం మొదలుపెట్టేరు.
“నాలుగు మూలలా వెండి పువ్వులతో ఉన్న పెద్ద పీట, దానికి వెనక గోడకి చేర్లాబడే పీట, ఆపుకోరాతో మంచినీళ్ళు, ఆవునేతి గిన్నే, నువ్వుల నూనె గిన్నే, వెండి మట్టు గిన్నెడు పెరుగు – అన్నీ అమర్చాల్సిందే! పెద్ద వెండి అర్పేణంలో భోజనం చేసేవారు. ఈ పద్ధతికి ఏ తేడా ఎప్పుడూ రాకూడదు! ఆపుకోరాకి బదులు గుండ్రకంచెంబుతో నీళ్ళు పెట్టినా, వెండి అర్పేణం బదులు వేరే ఇంకే కంచం పెట్టినా అగ్గిరాముడయి పోయేవారు. గడగడలాడుతూ ఆయన పద్ధతి ప్రకారం అన్నీ చెయ్యక తప్పేది కాదు ఆ ఇల్లాలికి!”
నాన్నా బాబయ్యా చదువుతూ వొదిలేసిన తమ పుస్తకాలు పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయేరు. వాళ్ళకీ కబుర్లు వినాలనిపించలేదు కాబోలు. అవును! అమ్మా బామ్మా సాదాసీదాగా చెప్తున్నారు. కడుపుబ్బా నవ్వించేటట్టు చెప్పటం లేదు!
“ఇంకా ఏం విన్నారు? ఆయన భోజనం అయ్యేలోగా ఓ వందమంది పంక్తి భోజనం చేసి లేస్తారు! ప్రతీ పూటా కాయావకాయ సగానికి సగం చెక్క, పూర్తిగా గిన్నెడు నెయ్యీ వేసుకు తినేవారు! ఎన్ని కూరలు ఉండనీ, ఎన్ని పచ్చళ్ళూ పులుసులూ పెట్టనీ – ఆ కాయావకాయ తినందే ఆయనకి భోంచేసినట్టు లెక్కకి ఒచ్చేది కాదు!”
“మావిఁడి పళ్ళన్నారూ?”
“వస్తున్నా. వస్తున్నా. ఆ సంగతి దగ్గరికీ! వాళ్ళకి మావిఁడి తోట ఉండేదండీ. తోటకెళ్ళి దగ్గరుండి కాయను దింపించుకుని తెచ్చుకునేవారు. ఎవరినీ నమ్మేవారు కాదు. అన్నీ తనే స్వయంగా చేసుకోవాలి. ఎవరికన్నా ఏ పనన్నా అప్పచెప్పడమేఁ! మిసమిసలాడే తెలుపు. ఆజానుబాహువు. మా దిట్టమైన మనిషి. జిర్రని చీదకండా బతికేరు! అంతలా తిని అరాయించుకునే వారంటే చూడండి మరి!
“తోటనుంచి మావిఁడి కాయలు తెచ్చేవారా? కాగు వెయ్యడమూ తనే! ఆ గదిలోకి ఎవర్నీ వెళ్ళనిచ్చేవారు కాదు! రోజూ గడ్డిని తిరగెయ్యడం, పండిన పళ్ళని – ఇంటిల్లిపాదికీ తలో పండు చొప్పునా, తనకి రెండుపళ్ళ చొప్పునా తేవడం.”
“ఎండుగడ్డిలో పొరలు పొరలుగా సరిగ్గా ముగ్గేయడం వచ్చునా అంటే రానే రాదు! పరువుకొచ్చిన తర్వాతే దింపించేవారు. అయినా వాటినీ సరిగా చూసుకుని వేరు వేరు వరుసల్లో గడ్డిలో పెట్టేవారా? తెలీదు కదా! ఇక రోజూ ఓ పది పదిహేను పళ్ళు మూతి దగ్గరో, మధ్యలోనే కుళ్ళేవి. ఇవాళ వీటిని తినకపోతే ఇంకా పాడయిపోయి, ఈ మాత్రం పనికిరాకండా పోతాయి, అండం! ‘కుళ్ళు తీసి తినండి’ అని ఇచ్చేవారు. పోనీ అని తనకేమన్నా బాగున్న పళ్ళు వేరుగా తెచ్చుకునేవారా? ఊహూఁ. ఆయనా ఓ రెండు కుళ్ళు పళ్ళు కుళ్ళు తీసేసుకుని తినేవారు. అదే పీల్చుకుని తినే రసాల పళ్ళయితే ఏం చేసేవారో!”
“తోట చూసే రైతు ‘బాబుగోరూ, నాను పేరిసి ఎల్తా. ఏ వొరస తొరాత ఏ వొరస పండుతాదో అనాగ్గా. మీరు ఓ పొర పలసాగ్గా గడ్డి కప్పుతూ తీస్తూ వుంటే సాలు’ అనేవాడు. ఆయనెక్కడ వింటాడూ? మహానుభావుడు మంచి మావిఁడి పండు ఏ ఎండాకాలంలోనూ బతుకులో తిని ఎరగడు. ఇంకొకరికి పెట్టి ఎరగడు, సొంత తోట ఉండీ!”
నథానియల్‌గారు చిరునవ్వుతో వింటూ కూర్చున్నారు, ఏమాటా అనకండా.
నాకు సరదాగా అనిపించలేదు సరికదా ఆవలింతలు వొచ్చేయి.
“మీరు తెచ్చిన పళ్ళని రోజూ తలో మూడు పళ్ళ లెక్కని లాగించేస్తాం. పళ్ళు కుళ్ళుతామన్నా కుళ్ళనియ్యం” అన్నా.
నా మాటకి నథానియల్‌గారికి నవ్వొచ్చింది. “పళ్ళు మేం కుళ్ళిపోమా అంటూ అడుగుతాయా?” అన్నారు.
కాఫీలు కలుపుతానంటూ అమ్మ లేచింది.