ఊహల ఊట 11

బళ్ళోంచి వొచ్చేక అమ్మిచ్చే చిరుతిండిని జేబుల్లో కుక్కేసుకుని వాటిని నవులుతూ నా గోడగుర్రమెక్కి ఊహల్లో ఆలోచనల్లో ఈమధ్య తేలిపోడం లేదు! గోడగుర్రం ఎక్కటం లేదు! సాయింత్రంప్పూట కొత్త నేస్తం తంగంతో ఆడవాళ్ళ పార్కుకెళ్తున్నా. ‘చీకటి పడీ పడకముందే ఇంటి కొచ్చీయాలి’ అని మా గట్టి హెచ్చరికతో ‘వెళ్ళు’ అన్నాది బామ్మ.

తంగం మళయాళీ అమ్మాయి. మా ఇంటికి నాలుగిళ్ళవతల ఈ మధ్యే కొత్తగా దిగేరు. మళయాళీ వాళ్ళేగానీ వాళ్ళకి తెలుగు బాగా వచ్చు. వాళ్ళ నాన్నగారు బదిలీల మీద ఆంధ్రా ఊళ్ళల్లో ఉద్యోగం చేస్తూ మా ఊరికిప్పుడొచ్చేరట!

తంగం అంటే బంగారం అని అర్థంట! పచ్చగా బంగారంలా ఉండదు. నల్లగానూ లేదు. గోధుం రంగులో ఉందది! మా బళ్ళోనే చేరింది. మజ్జలో చేరింది కదా, పాఠాలు రాయింపించినవి అన్నిటినీ నన్నే ఆ పిల్లకి ఇవ్వమంది టీచరు. ‘మీ ఇంటికి దగ్గర్లో దిగేరుట కదా! ఎంచక్కా ఇద్దరూ కలిసి చదూకోవచ్చు, అయిపోయిన పాఠాలు అన్నీ తంగానికి చూపించూ’ అనీ చెప్పింది.

మేఁవిద్దరం ఇట్టే నేస్తులమయిపోయాం. నాగమణిలా ఇది మొద్దుది కాదు. మా తెలివైనది. ఇలా వింటే అలా పట్టేసుకుంటుంది. దేన్నయినా సరే. ఈ పిల్ల నాలాటిదే అని మొదట కలిసిన రోజే తెలిసిపోయింది!

రెండోరోజు తంగం తేనెరంగు క్లిప్పులు ఈ జడకొకటీ ఆ జడకొకటీ పెట్టుకొచ్చింది. రెండు జెళ్ళు వేసుకుంటుందది! ఈ చెంప పక్కా ఆ చెంప పక్కా చెవులకి దగ్గరగా ఉన్న ఆ తేనెరంగు క్లిప్పులు ఎంత బావున్నాయో! నాకోసం అమ్మ ఎప్పుడూ నల్లరంగు క్లిప్పులే కొంటుంది. జుట్టులో కలిసిపోయి పైకి కనబడకుండా ఉండాలంటుంది అమ్మ! జుట్టు కళ్ళల్లో పడకుండా ఉండడానికి ఏ రంగు క్లిప్పు అయితేనేం అని నేనస్సలు ఎప్పుడూ పట్టించుకోనే లేదు. తేనెరంగు సీతాకోకచిలకల క్లిప్పులు ఎక్కడా ఎప్పుడూ నే చూడలేదు. అమ్మతో గాజుల దుకాణాలకి నేనూ వెళ్తాగా!

“నీ సీతాకోక తేనెరంగు క్లిప్పులు ఎంత బావున్నాయో!” వాటిని ముట్టుకుని చేత్తో రాసి చూస్తూ అన్నా.

“అవునా? బావున్నాయా? అంత నచ్చేయా? పెట్టుకుంటావా?” అంటూ క్లిప్పులు తీసి నా రెండు చెవుల పక్కా రెండు క్లిప్పులూ పెట్టింది వద్దు వద్దంటున్నా.

“నేనింకో రంగు క్లిప్పులు పెట్టుకుంటాలే. అచ్చంగా తీసేసుకో. మళ్ళీ ఇవ్వక్కర్లేదు” అంది.

“వొద్దు వొద్దు. మీ అమ్మగారు నిన్ను తిడతారు. కొడతారేమో కూడా. ఎక్కడో పారేసుకు వొచ్చేవనుకొని!” తీసేసి ఇచ్చీబోయా.

“ఎందుకు తిడుతుందీ? ఎందుకు కొడుతుందీ?”

“ఇవి నీకోసం కొన్నవి కదా!”

“నాకోసం కొని నాకిచ్చేసేక అవి మరి నావేగా! అమ్మవి కావుగా. నావీ అవి! నా ఇష్టం. పెట్టుకుంటే పెట్టుకుంటా. ఎవరికైనా ఇచ్చుకుంటే ఇచ్చుకుంటా!”

ఇది సరిగ్గా నాలానే ఉందే! నాలానే మాటాడుతోందే! ఎంత ఇచ్చీద్దామనుకున్నా ససేమిరా పుచ్చుకుంది కాదు!

గలగలా ఆపకుండా మాటాడుతుందది. నాలాగే దానికీ అన్నీ ప్రశ్నలే. వాటి గురించి తెలుసుకునేంత వరకూ నాలాగే ఊరుకోదుట. తెలుసుకు తీరాలిసిందేట. అదీ నాలాగే ఆలోచిస్తుంది. ఏవేవో ఊహిస్తుందిట! దాని బుర్రకి తట్టకపోతే అడిగి అడిగి తెలుసుకునేంత వరకూ నాలాగే దానికీ నిద్ర పట్టదట! భలే జత కలిసింది మా ఇద్దరికీ!

“సిగరెట్టు పెట్టెలు దొరికితే బావుణ్ణు” అన్నాది పార్కులో.

“ఎందుకూ? సిగరెట్లు కాలుస్తావా ఏం? అస్సలు ఎవరూ కాల్చకూడదు. ఆడవాళ్ళయితే అస్సలు కాల్చరు. మా ముత్తమ్మ – ముత్తమ్మంటే మా ఇంట్లో పాచిపని చేస్తుందే అది – చుట్టలు కాలుస్తుందనుకో. అదీ అడ్డపొగ పెట్టి మరీ!”

“అడ్డపొగేమిటీ?”

“నిప్పు వేపు నోట్లో పెట్టుకు కాలుస్తారు. ‘అగ్గి ఏపు నోట్నో ఎట్టుకు కాలిస్తే ఏడేడిగా సవానుగా ఉంటుందంటుంది. అదీ అడ్డపొగ.”

“అమ్మో! నోరు కాలిపోదూ?”

“ఊహూఁ, కాలిపోదట.”

“చుట్ట చెడ్డకంపు. సిగరెట్టు వాసన పర్వాలేదు. బాగానే ఉంటుంది.”

“అదీ బాగుండదు. అదీ కంపే.”

“అడ్డపొగ చుట్టతో కంపుకొడుతూ పని చేస్తే మీ అమ్మా వాళ్ళూ ఎలా ఊరుకున్నారూ?”

“మా ఇంటిపని కొచ్చినప్పుడు కాల్చదు. ఇంతకీ నువ్వు సిగరెట్టు కాలుస్తావా ఏంటి? సిగరెట్టు పెట్టెలు దొరికితే బావుణ్ణు అంటున్నావు!”

తంగం పకపకా నవ్వింది. “ఖాళీ సిగరెట్టు పెట్టెలు కూడబెడుతున్నా. మా అచ్చ కాలుస్తారు.”

“అచ్చ ఎవరూ?”

“మేం నాన్నని అచ్చ అంటాం.”

“అమ్మని ఏమంటారూ?”

“అమ్మని అమ్మ అనే అంటాం. నాన్నని అచ్చ, అచ్చన్ అంటాం.”

“మా బామ్మ అమ్మా అబ్బా లేనివాడు పాపం అని ఓ కుర్రాడికి మా ఇంటికొచ్చినప్పుడల్లా భోజనం పెట్టి డబ్బులిస్తూ ఉంటుంది. నాన్నని అబ్బా అని పిలవ్వుఁ అనుకో. దెబ్బ తగిలిందనుకో కాలికో చేతికో అప్పుడు నొప్పికి ‘అబ్బా’ అంటాం! మరే, నాకు మళయాళీ నేర్పిస్తావా?”

“వింటూ ఉంటావుగా మా ఇంటికొచ్చినప్పుడు. అలా అలా అడుగుతూ ఉండు. చెపుతూ ఉంటా” అంది తంగం.

ఎన్నెన్ని నేర్చుకోవాలో! నేనేర్చుకోవల్సిన జాబితాలో మరోటొచ్చి చేరింది అని మనసులో అనుకున్నా. సిగరెట్టూ చుట్టలా కంపే. వాళ్ళ అచ్చ తాగుతారు కాబట్టీ దానికా కంపు అలవాటైపోయి బాగుంటుందంటోంది కాబోలు!

“అవునూ, అద్సరే, ఖాళీ సిగరెట్టు పెట్లెందుకూ? ఏం చేస్తావూ?”

“సంచీ అల్లడానికి.”

“సంచీవా?”

“అంటే బుట్ట లాగా. బుట్టలా అల్లాలంటే ఎక్కువ పెట్టెలు కావాలి.”

“ఏ బొమ్మున్న సిగరెట్టు పెట్టి కావాలీ? కత్తెర బొమ్మున్నదా?”

“ఏ బొమ్మున్నా ఫరవాలేదు. కత్తిరించేసి అల్లుతాగా!”

“ఎన్ని కావస్తే అన్నీ నేన్నీకు తెచ్చిపెడతా. నాకూ నేర్పుతావా? మరి నన్నూ అల్లనిస్తావా?”

“నీకెక్కడివీ అన్నన్ని పెట్టిలు? మీ అచ్చ కాలుస్తారా?”

“ఊహూఁ. మా నాన్న కాల్చరు. మా నాన్న నేస్తం ఒకరున్నారు. ఆయనేమో సిగరెట్టుకి సిగరెట్టు ముట్టించుకుంటూ పెట్టిలు పెట్టిలు ఊది పారేస్తూ ఉంటారు. ఆయనకు అగ్గిపెట్టి అక్కర్లేదు.”

“గొలుసు పొగ పీల్చేవాళ్ళన్న మాట! ఇద్దరం కలిసి అల్లుదాం” అంది తంగం చేటంత మొహం చేసుకుని!

“అచ్చా! అచ్చా! ” అని గట్టిగా పిలుస్తూ “అచ్చా ఇంకా రాలేదా బామ్మా?” అని అడిగే పార్కునుంచి వొచ్చీ రాగానే.

“అచ్చా ఎవరే?”

“అచ్చా! మన అచ్చావే!”

నాన్నొచ్చీసి తన గదిలో ఉన్నట్టున్నాడు. నామాటలు వినపడి బయటకు వచ్చేడు.

“అదిగో అచ్చా!” అని నే నడగబోతూ ఉంటే, బామ్మ బుగ్గని చెయ్యిపెట్టుకుని “నాన్నా నాన్నా అని పిలవడం మానేసి ఈ అచ్చా అచ్చా ఏంటే?” అని అడిగింది. నాన్న మొహమూ ప్రశ్న మొహమే.

“అచ్చా అంటే నాన్న. నాన్నని నే మళయాళంలో పిలుస్తున్నా.”

“ఆ మళయాళీ పిల్లొచ్చి రెండ్రోజులు కాలేదు. మళయాళీ మాట నోట పట్టుకొచ్చీసింది” అన్నాది అమ్మ.

“అచ్చా, మరే – ఎన్నెన్ని నేర్చుకోవాలో నేను! మళయాళం నేర్చుకోవాలి. తంగం నేర్పుతానంది.”

“మళయాళం నీకెందుకే? నువ్వా దేశం వెళ్తావా పాడా?” అన్నాది బామ్మ.

“చీపురుపుల్లలా సన్నగా అటూ ఇటూ ఊగిపోతూ నడుస్తూ వొస్తాడంటావే అచ్చా నేస్తం, ఆయనకు ఎన్నో భాషలొచ్చుట! అచ్చావే చెప్పేడు. ఆయనలా నేనూ ఎన్నో భాషలు నేర్చుకుంటా!” అటూ ఇటూ ఊగుతూ చేతులూ కళ్ళూ తిప్పుతూ అన్నా.

“ఇహ నాన్న అని అండం మానేసేటట్టుందే ఇదీ!” అన్నాది బామ్మ.

“కొత్తో వింత కదా అత్తయ్యా” అన్నాది అమ్మ.

“అచ్చా! అచ్చా! మీ కవి నేస్తం, ఆయనే – సిగరెట్టుకి సిగరెట్టు ముట్టించి అలా వొరసాగ్గా కాలుస్తాడే కత్తిర పెట్టి సిగరెట్లు – ఆయనా! ఆయన్ని ఖాలీ సిగరెట్టు పెట్టిలు పారేయొద్దూ, మా అమ్మాయికి ఇవ్వూ అని చెప్పవా?”

“మళయాళం నేర్చుకోడానికి ఖాలీ సిగరెట్టు పెట్లెందుకే? రోజుకో విడ్డూరం నీ కూతురుతో!” అన్నాది బామ్మ.

“అచ్చా! అచ్చా! నేనెక్కడ చెప్పేనూ మళయాళం నేర్చుకోడానికి ఖాలీ సిగరెట్టు పెట్టిలు కావాలనీ? బామ్మే అంటూ ఉంటుందిగా – వాడెవడో మోకాలుకీ బోడిగుండుకీ ముడిపెట్టి మాటాడతాడని. ఇప్పుడు తనే మళయాళాన్ని ఖాలీ సిగరెట్టు పెట్టిలికి ముడి పెట్టేసింది!” పడిపడి నవ్వుతూ నాన్న వైపు చూశా.

“అద్చెప్పి సిగరెట్టు పెట్టిలు కావాలన్నావు కదే భడవకానా!”

“నవ్వింది చాలు! ఇహ నీ నవ్వాపు!” గదమాయించింది అమ్మ. “ఖాలీ సిగరెట్టు పెట్టిలెందుకో ముందది చెప్పి అడిగేవా? లేదే!” అనీ అన్నాది.

“అవును. ఎందుకన్ని పెట్టిలు?” అడిగేడు నాన్న.

“బుట్ట అల్లడానికి. తంగం నేనూ కలిసి అల్లుతాం.”

“మరో కొత్త విద్య మీద దీని దృష్టి పడ్డాది అత్తయ్యా” అన్నాది అమ్మ.

“బుట్టా? ఎందుకూ? ఎందుకు పనికొస్తుందీ? ఏం పెట్టినా బరువుకి చిరిగి చక్కా పోతుంది.”

“నీకే ఇస్తా. నీ ఒత్తులపత్తి పెట్టుకుందువు గాని.”

“సిగరెట్టు పెట్టిల బుట్టలో దేవుడి ఒత్తుల పత్తి పెడ్తారటే ఎక్కడన్నా!” అన్నాది అమ్మ.

నా బిస్కట్టుల డబ్బాని కత్తిరి బొమ్మ సిజర్సు పెట్టిల్తో నింపుతూ ఉంటే తంగం విల్సు, కాప్స్‌టన్ పెట్టిల్తో దాని డబ్బా నింపుతోంది. వాళ్ళ అచ్చా ఆ రెండు రకాలూ కాలుస్తారట.

బళ్ళోంచి రాగానే డెస్కుపెట్టిలో పుస్తకాలు పడేస్తూ ఆవేళ ‘అమ్మా, అమ్మా’ అని గట్టిగా పిలిచే.

“ఏఁవయింది? ఏఁవిటా హడావిడి? చేగోడీలు చేశా. పెడతానుండు” అన్నాది అమ్మ.

“రేపు ములక్కాడలూ పెసరపుణుకులూ వేసి మజ్జిగ పులుసు పెట్టూ!” అన్నా.

“ఏం? మజ్జిగ పులుసు తినాలని మనసయ్యిందేఁవిటే?” అడిగింది బామ్మ.

“తంగాన్ని రేపు మనింటికి భోంచేయడానికి పిల్చా. ఆదివారం కదా.”

“ముందస్తుగా ఇలా పిలవాలనుకుంటున్నానని మాట మాత్రమయినా చెప్పకుండా పిల్చీడం ఏఁవిటీ?”

“ఏం? నాగమణినీ అలా పిలుస్తూనే ఉండేదాన్నిగా. ముందస్తుగా ఎప్పుడూ చెప్పలేదే!”

“నాగమణి వేరు. అది మనపిల్ల. ఈ పిల్ల ఎక్కడో మళయాళీ దేశంప్పిల్ల!”

“అయితే ఏమయిందీ? అందరికీ పెడుతూనే ఉంటావుగా! ఇప్పుడు కాదంటావా ఏం?” నే ఏడ్పు స్వరంతో ఏడ్పు మొహంతో అడిగే.

“ఏడ్చి రాగాలు పెట్టేటట్టుంది దీని వాలకం!”

“అవియల్‌తో పందెం వేసే.” ఏడ్పు స్వరంతోనే చెప్పే.

“అవియల్ ఏఁవిటీ? పందెం ఏఁవిటీ?”

“నిన్న వాళ్ళింట్లో తిన్నా.”

“నిన్న చెప్పలేదే? అలా వాళ్ళింటో వీళ్ళింటో ఎవరింటో పడితే వాళ్ళింటో తినొచ్చా? అందులోనూ ఆ మళయాళం వాళ్ళింటో?”

“మనింటో ఎందరో వొచ్చి తినొచ్చు గానీ వాళ్ళిళ్ళల్లో మనం తినకూడదా ఏం? అది పెట్టింది. నే తిన్నా.”

“తినమంటే తినీడవేఁనా? వాళ్ళు నీచు తింటారు.”

“నీచు ఏఁవిటి?”

“మాంసం, చేపలు, నానా గడ్డీనూ.”

ఇంతలో బయటకు వెళ్ళిన నాన్న వొచ్చీసీడు. నా ఏడ్పుగొట్టు మొహం చూడగానే ఏదో గట్టిదే సంగతి అనుకున్నట్టున్నాడు. నాన్న అడక్కుండానే అమ్మ చెప్పడం మొదలు పెట్టీసింది.

“ఇదా మళయాళం వాళ్ళింటో అవియలో అధ్వాన్నమో తిన్నాదిట!”

“తింటే?”

“బాగుందిరా! తింటే అని అడుగుతావేంటీ? వాళ్ళు నీచు తింటారు!” అన్నాది బామ్మ.

“అందరు మళయాళీలు తినరమ్మా. తినేవాళ్ళైనా మనం తినం అని తెలిస్తే మనకు పెట్టరు.”

“ఓహో ! అలాగా! ఏదో అవియల్ పందెంట. ఆ పిల్లని మనింటికి భోజనానికి పిల్చేసింది మాకు మాట మాత్రం చెప్పకుండా. మజ్జిగ పులుసు పెట్టాలిట – ములక్కాడలూ పెసర పుణుకులూ వేసి!”

నాన్నకి ఏదో అర్థం అయినట్టుంది. “మజ్జిగ పులుసు చెయ్యమందా? మరేం, చెయ్యి, చెయ్యి. నువ్వీమధ్య చెయ్యలేదు. అందరం తినొచ్చు” అన్నాడు నాన్న.

ఆదివారం అన్నాలు తిన్నాక మేఁవిద్దరం ఒహరిని ఒహరం చూసుకుంటూ –

అదీ బావుందీ – ఇదీ బావుందీ!
ఇదీ బావుందీ – అదీ బావుందీ!
నేనూ బావుణ్ణా – నువ్వూ బావుణ్ణావూ!
నువ్వూ బావుణ్ణావూ – నేనూ బావుణ్ణా!

అని గట్టిగా పాడుతూ ఉయ్యాలా ఊగేం!

“వాళ్ళమ్మగారిని అడిగి అవియల్ చేయడం ఎలానో నేర్చుకో నువ్వూనూ!” అని నాన్న అమ్మకి చెప్పేడు.

నా బిస్కట్టుల డబ్బా నిండిపోయింది సిగరెట్టు పెట్టిలతో. తంగం ఎగిరి గంతేసింది. దాని డబ్బా కూడా నిండిపోయిందిట!

“నీ దగ్గర చిన్న కత్తిర ఉందా?”

“ఉంది.”

“ఆ కత్తిరా, నీ బిస్కట్ల డబ్బానీ పట్టుకురా సాయింత్రం. ఇద్దరం చెరో కత్తిరతో ముందు రింగులుగా కత్తిరించేసుకుందాం. రింగుల్ని ముందు డబ్బాల్లో పెట్టేసుకుంటే తొందర తొందరగా అల్లేసుకోవచ్చు.”

బామ్మ అనే మాటే! ‘వంట తొందర తొందరగా చేసేయాలంటే ముందు అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. చెయ్యడం ఎంత సేపూ! నిలవాల వొండీయొచ్చు. ఓ గంటన్నా పట్టదు!’

ఏ పనైనా అంతే కద! తంగమూ అదే మాట చెప్పింది.

నాకు ఇట్టే వొచ్చీసింది నాలుగు రింగులతో మధ్యకి చదరంలా వొచ్చేటట్టు అల్లడం. ’ఇదిగో ఇలాగ’ అంటూ రెండు, మూడు, నాలుగు చదరాలు అల్లేసరికి నాకు బోధపడిపోయింది. చాపలా బుట్ట అడుగుభాగం అల్లీసేం. అల్లిక చాప ముద్దొస్తోంది.

అదోమూలని, నేనో మూలని రింగులు కలిపి మీదికి ఎత్తాలని అనుకున్నాం. ఇద్దరికీ చేతకాలేదు. దానికీ రాలేదు! నాకూ రాలేదు!

“అయ్యో, అయ్యో! ఎలా, ఎలా?” అన్నాది తంగం.

“ఎలా, ఎలా? ఏమో, ఏమో!” అన్నా.

అల్లికచాపనీ డబ్బాల్నీ గూట్లో పెట్టీసేం.

రోజూ గోడగుర్రం ఎక్కి కూచుని అమ్మిచ్చిన చిరుతిండి తింటూ నేనెప్పట్లా ఉంటూ పార్కుకీ తంగం ఇంటికీ వెళ్ళకపోయేసరికి అమ్మకీ బామ్మకీ అనుమానం వొచ్చీసింది.

“నువ్వూ తంగం దెబ్బలాడుకున్నారా? పార్కుకి వెళ్ళటం లేదేం?” అంటూ నస మొదలు పెట్టేరు. నాన్నా అడిగేడు! గోడగుర్రం ఎక్కి చాల్రోజులయిపోయింది, ఆకాశాన్ని చూసి ఎన్నాళ్ళో అయిపోయిందీ అంటూ దీర్ఘాలు తీస్తూ చెప్పేనే కాని అసలు సంగతి చెప్పలేదు.

నా బుర్రను గొలుకుతున్నదీ, తెలీకపోతున్నదీ మా అల్లిక బుట్ట అల్లడం! ఒక్కత్తినీ కూచుని నాలో నేను మనసులో మనసులో ఇలా చేస్తేనో అలా చేస్తేనో అనుకుంటూ ఊహలతో అల్లుతూ ఎలాగో కనిపెట్టాలి కదా. నాల్రోజుల్నుండీ సాయింత్రంప్పూట గోడగుర్రం మీద కూచుని అమ్మిచ్చినవేవో నవులుతూ ఆకాశాన్నీ నేలనూ చూస్తూ సతమతమవుతున్నా.

నాన్నకు కూడా చెప్పను. చెప్పను గాక చెప్పను!

ఎన్ని రకాల వస్తువులో! ఎన్ని రకాల అల్లికలో!

తట్ట వేరు. బుట్ట వేరు.

తట్ట వెదురుపుల్లలతో అర్థచంద్రాకారపు గుండ్రాలు గుండ్రాలుగా ఉంటుంది. బుట్ట దీర్ఘచతురస్రంలా కదూ ఉంటుంది.

నాన్న పుస్తకాలు పెట్టుకునే పెద్ద మేజాబల్లకి సరిపడా సాలిపురుగుల డిజైనుతో అమ్మ క్రోషియా సూదితో అల్లింది. ఆ అల్లికగుడ్డ ఎంత అందంగా ఉంటుందో! దాన్ని చూసి రాధ పిన్ని తనూ వాళ్ళ మేజాబల్ల మీదకి అల్లుకుంది. సాలిపురుగు డిజైను క్రోషియా సూది మీదికి దారం వెయ్యకుండా సాలిపురుగు పొట్టని బిళ్ళలా పొడిచి పొడిచి అల్లాలిట! తేలిగ్గా తొందరగా అల్లీయాలని రాధ పిన్ని మొద్దు బడ్డు దారంతో అల్లీసుకుంది. ‘నువ్వంటే చేతులు పడేటట్టు ఆ సన్నటి నర్సాపురం దారంతో అల్లేవు. నేనల్లలేను బాబూ!’ అన్నాదిట.

రెండు అల్లిక గుడ్డల్లో ఎంత తేడావో! మళ్ళీ చూడబోతే అల్లిక అంతా ఒకటే, అదే డిజైను!

‘నాజూగ్గా అందంగా అల్లాలంటే మరి కష్టాపడాలి, దారమూ బాగుండాలి. ఒళ్ళు వొంచకుండా చేసే పనులు ఇదిగో ఇలాగే ఉంటాయి’ అంటుంది బామ్మ. ‘శ్రద్ధమ్మా! శ్రద్ధ! ఏ పని చేసినా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే ఏదీ పట్టుబడదు’ అనీ అంటుంది బామ్మ.

‘రాధ పిన్నికి శ్రద్ధా ఓపికా లేక కాదు. నర్సాపురం సన్నదారానికి బోల్డు డబ్బు ఖర్చు పెట్టాలని మొద్దు బడ్డు దారంతో అల్లింది. పిసినారిది! ఉత్తిదే పైకి అలా చెపుతోంది.’ అమ్మ బామ్మకి చెపుతూ ఉంటే తెలిసింది పిన్ని పిసినారిదని. సొంతానికైనా కాణీ ఖర్చు చెయ్యడానికి చెయ్యి రాదట!

నే బళ్ళో పాఠాలు ఈ మధ్య శ్రద్ధగా వినడం లేదు. టీచరు కనిపెట్టీసింది! “ఏఁవిటా పరాకు? ఏదీ చెప్పు. ఇప్పుడు నేనేం చెప్పేనో?” అంటూ గదమాయించింది. అమ్మబాబో! నాగమణిని చెయ్యి చాపమని బెత్తంతో కొట్టినట్టు నన్నూ కొడతానన్లేదు. నయం! నసుగుతూ విన్నకాటికి పాఠం చెప్పే కాబట్టి సరిపోయింది. బతికిపోయా!

సాలిపురుగు శ్రద్ధగా తన పట్టుని అల్లుతుందన్నమాట. ఎంత సన్నదారమో. దాని ఒంటినుంచి వొస్తుందా దారం మరి! అర్ధచంద్రాకారాల దారాలని మజ్జి దారానికి వేళ్ళాడబెడుతూ చకచకా అటోసారి ఇటోసారీ అతికేస్తూ అల్లేస్తుంది! దాని పనివాడితనాన్ని అమ్మ పనివాడితనాన్ని మెచ్చుకున్నట్టు మెచ్చుకోవలిసిందే!

అయ్యయ్యో! ఎందులోంచి ఎందులోకో కొట్టుకుపోతున్నా. మేజాబల్ల అల్లికా, రాధమ్మ పిన్ని శ్రద్ధా ఓపికా, పిసినారితనం లోంచి సాలిపురుగు అల్లిక మెప్పుల్లోకి! నేనింతే. ఒకటి అనుకుంటా. ఇంకో దాంట్లోకి ఆలోచన గెంతుతుంది. ఎటెటో దారి మళ్ళిపోతూ ఉంటుంది. ఒకదానితో ఒకదానికి లంకెలు అలా తీసుకుపోతాయి.

తలమీద నాకు నేనే జెల్ల కొట్టుకుని నేలవేపు చూశా. ముత్తమ్మ పేడనీళ్ళు జల్లి సంజె ముగ్గు పెట్టీసి వెళ్ళిపోయిందిగా. తెల్లటి ముగ్గు ముదురాకుపచ్చ కళ్ళాపు మీద మెరుస్తోంది. అవునూ, ముగ్గులూ అల్లికేగా! ముత్తమ్మ ముగ్గుల్ని అల్లింది. చుక్కలకి చుట్టూ సున్నాలు చుడుతూ. ఎన్నెన్ని రకాలో!

బామ్మకి చుక్కలముగ్గు పెట్టడం రాదుట. నాలుగువేళ్ళ సందుల్లోంచి పిడికిట్లో పట్టుకున్న ముగ్గుని జారుస్తూ ముగ్గుకర్ర గీస్తుంది. తల వెంట్రుక కన్నా సన్నంగా నాలుగు గీతలూ ఒకేలాగ ఒంకరటింకరలు లేకుండా! ఓసారి అలా గీద్దామని చూస్తే ముగ్గు కాస్తా చిన్న చిన్న కుప్పలుగా వేళ్ళ సందుల్లోంచి జారిపడ్డాది!

నాకేఁవిటీ? అమ్మకీ రాదుట! అమ్మా చుక్కల ముగ్గులే పెడుతుంది. గీతల ముగ్గు ఒక్కటీ పెట్టదు. బడ్డు గీతల ముగ్గు ఏం బాగుంటుందీ? ముత్తమ్మకైతే అసలు రానే రాదు!

‘అభ్యాసమర్రా! అభ్యాసం! ఒకటికి పదిసార్లు చేస్తే సరి. నాకు వొచ్చింది మీకు రాదా ఏం?’ అంటుంది బామ్మ. ‘అంత ఓపికా సమయమూ ఉండొద్దూ?’ అంటుంది అమ్మ.

’ఆసక్తే! ఆసక్తి! అది ఉంటే సమయమూ ఉంటుంది. ఓపికా వొస్తుంది. వచ్చేదాకా పట్టుదలా ఉంటుంది!’ అంటుంది బామ్మ.

నాకెందుకో ముగ్గుల మీద ఆసక్తి లేదు! ఎన్నెన్నో నేర్చుకోవాలని గెంతుతూ ఉంటానా, ముగ్గుల మీదకి మనసు పోలేదు.

ఈ మనసు ఉందే. ఇదీ గమ్మత్తైనదే. ఎవరి మనసు వాళ్ళదే. ఆ మనసులా ఈ మనసు ఉండదు. ఈ మనసులా ఆ మనసు ఉండదు. మనసు పడితే అన్నీ వొస్తాయి.

అరెరే, మనసు గొడవలో పడ్డా! నేనేఁవిటీ అనుకుంటున్నానూ? ఏదనుకుంటున్నానూ? ఊహకి ఏదీ అందటం లేదే! ఊహల అల్లికకి మొద్దు దారం పనికిరాదు అన్నమాట. ఊహకీ ఊహకీ కనిపించని దారంతో మెలికలు పెట్టుకుంటూ పోవాలి.

అరే, అవును కదా! బామ్మ నాలుగు సన్నటి గీతలతో ముగ్గుకర్ర గీస్తూ పాముని వేస్తుంది. పాముని మెలికలు మెలికలుగా తిప్పుతుంది. సంక్రాంతికి గాని దాన్ని పెట్టదే!

మెలికలు! మెలికలు!

మెలిక! మెలిక!

తెలిసిపోయిందోచ్చి! తెలిసిపోయిందోచ్చి!

గుర్రం మీంచి గభాలున ఓ గెంతు గెంతి చప్పట్లు కొట్టి ‘కనిపెట్టేశా! కనిపెట్టేశా!’ అని గట్టిగా వానా వానా చెల్లప్పలా చేతులు రెండూ చాచి గుండ్రంగా తిరుగుతూ పాడుతున్నా.

గేటు తీసుకు వొచ్చిన నాన్న నా వానావానా చెల్లప్ప తిరుగుడు పాటను విని “ఏఁవిటి కనిపెట్టేవూ?” అని అడిగేడు.

“మెలిక కలపడం.”

“మెలికేఁవిటీ? కలపడం ఏఁవిటీ?”

“చెప్పను. చెప్పను. ఇప్పుడు చెప్పను.”

“రహస్యమా? సరే అయితే. పద లోపలికి” అన్నాడు నాన్న.

తంగానికి బళ్ళో చెప్పనా? ఏకంగా బుట్ట అల్లి చూపెట్టానా? అని మనసులో అనుకుంటూ నాన్న చెయ్యి పట్టుకుని ఊగుతూ ఇంట్లో కెళ్ళా!