ఎండాకాలం వచ్చింది. ఆవిడగారి ఉత్తరమూ వచ్చింది. రెండేళ్ళకొకసారి దిగబడుతుంది!
ఆవిడగారు అంటే నాన్నకు సొంత చెల్లెలూ కాదు! నాకు సొంత మేనత్తా కాదు! అమ్మకి సొంత ఆడబడుచూ కాదు! బామ్మకు ఎక్కడో దూరపు చుట్టరికం. అది చాలు ఆవిడగారికి!
‘అన్నయ్యా’ అంటూ “క్రితంసారి వచ్చినప్పటికీ ఇప్పటికీ నీకు పొట్ట పెరిగిందే! అన్నీ రుచిగా ఉన్నాయని కడుపెక్కా రోజూ తినీకు. అందులోనూ దొడ్డమ్మేమో అన్నిటికన్నీ మాబాగా చేస్తుందాయె!” “ఒసేయి మరదలా, నీ మొగుడు తింటున్నాడని కొసరి కొసరి అలా పెట్టకు” అనీ సలహాలిచ్చేసింది!
“ఏఁవేఁ కోడలు పిల్లా, రెండేళ్ళకే బాగా పొడుగెదిగేవే! మా అబ్బాయీ కాస్త సాగేడులే. ఆడపిల్లలు ఇట్టే ఎదిగిపోతారు. అయినా ఫర్వాలేదులే, కోడలు పిల్లా!” అని నిజఁవో వెటకారఁవో తెలీకండా నవ్వుతూ అన్నాది.
అమ్మకు మూరెడు కోపం వచ్చింది.
“ఈ గీరమనిషికి నా కూతురినిచ్చి పెళ్ళి చేస్తాననుకుంటున్నట్టుంది. దీని ఆశ మండిపోనూ! ఈసారి మళ్ళా రెండేళ్ళయేసరికి మనల్ని ఉద్ధరించడానికి వేంచేస్తుందిగా మహారాణీగారు! అప్పుడు చెప్పేస్తా. మా అమ్మాయి ఇంకా చదువుకుంటోందీ, అప్పుడే పెళ్ళేఁవిటీ? మా ఆయన దానికి పెద్ద పెద్ద చదువులు చదివిపిస్తా మంటున్నారూ అని చెప్పేస్తా!” అంది.
“అలా చెపితే, అలాగే మరదలా! చదువవనీ అంటుందది” అని నవ్వింది బామ్మ.
“అలా అంటే నీ ఇంటికోడల్ని చెయ్యే చెయ్యం అని ముక్కు గుద్ది మరీ చెప్పేస్తా!” మహాకోపంగా అన్నాది అమ్మ.
ఇదిగో ఎండాకాలం వచ్చేసింది. ఆవిడ ఉత్తరమూ ఆవిడగారు వస్తున్నట్టు ఠంచనుగా వచ్చేసింది. అమ్మ కోపంతో విసవిసలాడింది.
“మీకూ సరి, అత్తయ్యగారికీ సరి! ఇద్దరికిద్దరూ ఒక్కలాంటి వాళ్ళే! ఎవరైనా ఉబ్బేస్తే ఇట్టే ఉబ్బిపోతారు! పోనిద్దూ, ఏదో రెండ్రోజులుండి పోతుంది అంటారు ఆ గీరమనిషిని వెనకేసుకొస్తూ. గీరా? గీరన్నర గీరా? ఇంతా అంతానా? గీరా గోరోజనం, అతిశయం, గర్వం, మహా అతిశయం, మహా మహా అతిశయం. అన్ని ఛప్పన్న భాషల్లో ఉన్న అతిశయానికి ఎన్నెన్ని మాటలున్నాయో అన్నన్ని మాటలు, ఎన్నెన్ని శబ్దభాండాగారాలు ఉన్నాయో అన్నన్ని వాటిల్లో ఉన్న మాటలు, ఇంకా మీకూ నాకూ అందరికీ తోచిన మాటలూ ఎన్నెన్ని కలిపినా ఆవిడ అతిశయాన్ని చెప్పడానికి సరిపడవు. ఆకాశమంతా రాయాల్సిందే! ఏఁవిఁటా గొప్ప? వెధవ గొప్పాని! డబ్బుందని! గుర్రానికి తోకుంటే గుర్రం తోలుకుంటుంది!
“ఎంత గర్రారా బాబూ! గొప్పింట్లో పుట్టిందిట, గొప్పింటిని మెట్టిందిట! ఇటువాళ్ళూ అటువాళ్ళూ నెత్తిన పెట్టుకు చూస్తారట! చూస్తే చూస్తారు. ఎవరింట చూడరు కనక? డబ్బున్నాదని చూడరని తెలీదు ఈవిడగారికి! ఎవరన్నా ఈసడింపే. ఈవిడగారి కంటికి ఎవరూ ఆనరు. ఎవరన్నా నిస్సాకారమే! ఈవిడంటే అందరికీ ఏడుపేనంట! కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారట! ‘వాళ్ళు పెట్టిపుట్టందే నా మీదా మా ఇంటిమీదా పడి ఏడిస్తే ఏం లాభం? నేనంటే ఒకళ్ళకి పడదు కదా ఇరుక్కీ పొరుగుకీ.’ ఇక తప్పక పిలుస్తారట పేరంటాలకీ పూజలకీనూ.
“‘నా వంటినిండా మిసమిసలాడే బంగారమే. నా పచ్చటి ఒంటిమీద మరీ మెరిసిపోతూ ఉంటుంది. అందరి కళ్ళూ పడతాయి. నాకమ్మా అన్ని నగలున్నాయని ప్రదర్శించుకుంటున్నాననీ చెవులు కొరుక్కుంటారు. మా దాసీది చెప్పింది. అది తరతరాల బట్టీ మా ఇంటి దాసీ కుటుంబపు మనిషి. నేనింటికెళ్ళగానే ‘ఉండమ్మా, దిష్టి తీస్తాను’ అని దిష్టి తీస్తుంది. చుట్టాలూ అంతే! అందరికీ ఒకటే ఏడుపు! చుట్టాల్లో మీరొక్కరే ఏఁవీఁ అనుకోరు. పై ఊరికి అన్ని అన్ని నగలూ పెట్టుకోకపోయినా అన్నీ తీసేస్తే మా అత్తగారు దెబ్బలాడతారు. బోసి బోసి వంటితో నగా నాణెం పెట్టుకోకుండా ఉండడం నాకూ బావుండదు.’
“అవును మరి. ఈవిడగారు ఎంత దాష్టీకం మాముందు వెలగబెట్టినా మేఁవుఁ పట్టించుకోం మరి! ఆవిడగారు వెళ్ళిపోయాక నేఁ విసవిసలాడి బాధ పడ్తానే తప్ప మర్యాదా కోసం ఆవిడగారి ఎదట నోరు విప్పను! నన్ను అనుకోడం ఎందుకూ? అత్తయ్యా, ఈయనా కూడా ఏఁవీఁ పైకి అనరు. అందరికీ అన్ని బుద్ధులు చెప్పే అత్తయ్య ఈ దూరపు చుట్టరికానికి ఏ సుద్దులూ చెప్పరు. ఈయనా అంతే! చిన్నా పెద్దా అందరికీ ఎన్నో బోధపరిచి చెప్తూ ఉంటారా? ఈ గీర చెల్లెలుగారికి ఏఁవీఁ చెప్పరు! ఆవిడ వెళ్ళిపోయాక నా విసవిసలకీ, నా బాధకీ ఉపశమన వాక్యాలు పలుకుతారు.
“ఈ గోరోజనాల గొప్పల మనిషి ఎంత పిసినారిదో మరి చెప్పక్కర్లేదు! ఉహూఁహూ, కాదు కాదు – వెర్రి మొహాన్ని. పిసినారిది కాదు. అలా అనుకున్నా అదీ తప్పే. ఎంత పిసినారి పక్షి అయినా కాణీ పరకా ఇస్తుంది. ఈవిడా? ధర్మానికైనా పిల్లికి భిక్షం వెయ్యదు! ఆ మిసమిసల బంగారపు చేతుల్లోంచి దమ్మిడీ, రెండు దమ్మిడీల ‘డబ్బు’ అయినా రాలిపడదు. బడాయిలే తప్ప ముత్తమ్మ చేతిలోనైనా వెళ్ళిపోయేటప్పుడు వందలూ యాభైలూ మాట దేవుడెరుగు – పదీ పరకన్నా పెట్టదు.
“మళ్ళా, దిగబడ్డ మన్నాటినుంచీ తన చీరలు ఎంత ఖరీదైనవో గట్టిగా నాలుగిళ్ళకీ వినిపించేటట్టు చెపుతూ దగ్గరుండి ముత్తమ్మ చేత తిరగళ్ళా బోర్లా సబ్బు పట్టింపించి ఉతికిస్తుంది. అది ఎంత జాడించినా మరోసారి మరోసారి జాడించమని దాని జబ్బలు పడిపోయేవరకూ జాడించేటట్టు గట్టిగా అరిచి చేయిస్తుంది.
“చీరను పిండకూడదు. అరచేతులతో నొక్కి నొక్కి నీళ్ళు కారేటట్టు పదిసార్లు నిలువుగానూ అడ్డంగానూ పట్టుకొని చెయ్యాలి. ఆ తర్వాత దులపాలి. తిరగేసి చీరని ముడతలు లేకుండా ఆరెయ్యాలి! చాకలివాళ్ళయినా ఇన్ని సింగినాదాలు పోరు! ఇంకా నయం. గంజి పెట్టడాలు, చీర దండాడించడానికి ముత్తమ్మ కూతురుని రమ్మనమనడాలు లేవు! సంతోషించాలి!
“అన్నీ అట్టేపెట్టు! ఆఖర్ని మా చాకలివాడిచేత ఉతికించుకుని వెళ్దువుగాని అంటే వినదు. రాత్రి పడుకున్న చీరని మర్నాడు తడిపి ఉతకవలసిందే! ఇహ తనే ఏదో ఉతికినట్టు అలిసిపోయి ఆయాసపడుతూ ఉయ్యాలా బల్లెక్కి ‘మరదలు పిల్లా, కాసిన్ని మంచినీళ్ళియ్యమ్మా’ అని గిలాసుడు మంచినీళ్ళూ తాగుతుంది. ఉయ్యాలా గొలుసులు పట్టుకుని అమ్మా! అబ్బా! అంటూ ‘కాఫీ చుక్క కాస్త వేడివేడిగా గొంతుకలో పోసుకుంటా తే అమ్మా, బలం వస్తుంది’ అంటుంది!
“ముత్తమ్మంటే దాసీ పనిది. దాని చేతిలో ఏదీ పెట్టలేదు – సరే, ధర్మబుద్ధీ జాలీ లేవు. ప్రేమన్నా తనవాళ్ళ పట్ల ఉందా అంటే అదీ కనపడదు! దొడ్డమ్మ దొడ్డమ్మ అంటూ వచ్చి గారాలు పోతుందా – ఆవిడ కోసఁవూఁ ఏ పండో ఫలమో తేదు. అన్నయ్యా, అన్నయ్యా అంటూ వెటకారపు సలహాలు ఇస్తుంది కాని ఆయన కోసఁవూఁ – ఇదిగో అన్నయ్యా, ఈ బట్టల్తో డ్రెస్సు కుట్టించుకో అని – ఓ గుడ్డ ముక్కన్నా తేదు! కోడలు కోడలు అంటుంది తప్ప ఆ చిన్నపిల్లకయినా ఏఁవీ తెచ్చి పెట్టదు. ఇంక నాకోసం చంటివెధవాయికోసం ఏం తెస్తుందీ నా తలకాయ!
“డబ్బుండగానే సరా? ఎందుకూ ఆ డబ్బు? విర్రవీగడానికీ అందరినీ చిన్నచూపు చూడడానికీనా? ఒకరికి ఇచ్చిందీ పెట్టిందీ మనకి మిగుల్తుంది అని పెద్దవాళ్ళు చెపతారు. ఈవిడగారు వచ్చిందంటే సంతర్పణ వంటలే ఇంట్లో! ఎన్నిరోజులుంటే అన్ని రోజులు పనికి పని, ఇంటినిండా జనమూనూ. పోనీ అని ఓ చెయ్యి సాయమా? చేతిలో పని అందుకొని ఏఁవఁన్నా చేస్తుందా? ఉయ్యాలా ఊగుతూ కబుర్లు చెపుతుంది! పురమాయింపులకేం తక్కువ ఉండదు! అయ్యో అన్న మాటే ఎరగదు మహాతల్లి!”
అమ్మ ఉప్పు వేసి ఉడకబెట్టిన పనసగింజలని ఇచ్చింది. ఒక్కొక్క గింజనీ నవుఁలుఁతూ నా గోడగుర్రం మీద కూచుని నాకు ఇష్టమైన సరదాల నవ్వుల ఎండాకాలం సెలవలకి బదులు ఈ పదిరోజుల బాగోతంలో (అమ్మ బాగోతం అనే అంటుంది!) ఒక్కొక్క రోజునీ తలుచుకుంటూ, ఓ ఆటా పాటా లేకండా ఆకాశం, కొండలూ ఎర్రెర్ర గుండ్రని సూర్యుడూ – వీటిని వేటినీ చూడకండా నాన్న గదిలోనో సావిట్లోనో పుస్తకాలు ముందేసుకుని బొమ్మలు గీస్తూనో, చదువుతోనో గడిపేనే అని నాకు నేనే విస్తుపోయే!
చుట్టాలు ఇంటికి వస్తే ఎంతో సంబరపడిపోయి వాళ్ళతో తుళ్ళుతూ నవ్వుతూ నవ్విస్తూ గెంతుతూ మాటాడే నేను మాటామంతీ లేకండా నోరన్నది విప్పకండా భోజనాల దగ్గర కూడా బుర్రొంచుకుని తినేసి కంచంలోనే చెయ్యి కడిగేసుకుని నాన్న గదిలోకో సావిట్లోకో వెళ్ళిపోయే!
ఆవిడ రాకముందు అమ్మ విసుక్కుని పిసుక్కుని దుఃఖపడ్డట్టు, నేను ఆవిడున్నన్నాళ్ళూ లోలోపల విసుక్కుంటూ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూశా.
నాన్నకీ బామ్మకీ మాలాంటి బాధ లేదు. ఇద్దరికిద్దరూ ఒక్కలాంటివాళ్ళే! ఆవిడ పురమాయింపులకి వాళ్ళు విసుక్కోరు సరికదా ఆవిడ పేరు చెప్పుకుని మనఁవూ తింటున్నాం కదా అంటారు! ఓ పక్క ఆవకాయల యజ్ఞపు పనీ మరోపక్క ఆవిడ పురమాయింపుల వంటానూ. ఎండాకాలం అంటే రెండేళ్ళకోసారి వచ్చే ఈ పది పదిహేను రోజుల పండగ అంటుంది బామ్మ! పనంటే భయం లేదావిడకి.
ఆవిడ పురమాయింపుతో పనసకాయ కొనుక్కొచ్చేడు నాన్న. నట్టింట్లో చేటా పసుపూ నూనే పనసకాయ కొట్టే కత్తీ – సరంజామాలతో కూచున్నాడు.
బామ్మ మాణిక్యాంబగారికి కబురు పెట్టించేసింది. ఆవిడా వెంటనే బయల్దేరి వచ్చేసేరు! ఆవిడా బామ్మ చేతి పనసకాయ కూరంటే చెవి కోసుకుంటుంది.
నాన్న పెసరబద్దంత చిన్నగా పనసకాయ పొట్టు కొట్టడంలో ఘనుడు! పనసకాయ బొడ్డులో అట్లకాడ గుచ్చి కాయని గుండ్రంగా తిప్పుతూ తను కత్తితో కొడుతూ ఉంటే చూడ్డానికి బహుముచ్చటగా ఉంటుంది. అందరూ అదే మాట అంటారు!
పులిహారకన్నా కూడా రుచిగా పనసపొట్టు కూర వండడంలో బామ్మకి బామ్మే సాటి. సంతర్పణలప్పుడు అటక మీంచి దించి వాడే పెద్ద బేసిను నిండా వండినా బామ్మకి పిడికెడు కూడా చివరికి తిండానికి మిగలదు! ఎలా మిగుల్తుందీ? ముత్తమ్మ ముందే తను అంబలి తాగే పెద్ద మట్టుగిన్నె తెచ్చుకు కూచుంటుంది. నాకు బొమ్మల పుస్తకాలు ఇచ్చే మావయ్యగారు ఇంటికే వస్తారు నాన్నతో కలిసి భోంచెయ్యడానికి. మిగతా మిత్రులకి డబ్బాలతో పంపాలి! దూదేకుల సాయిబుగారి బేగమ్ ఈ కూరంటే పడి చస్తుంది. వాళ్ళ ఖైమా కూర కన్నా బాగా రుచిగా ఉంటుందంటుంది బేగమ్. ఆవిడకి నేనే డబ్బాతో కోట్ల మాదప్ప వీధిలో వాళ్ళింటికెళ్ళి ఇచ్చిరావాలి!
“మావాడూ కొడతాడు ఎందుకూ! ఇంత ముక్కొకటీ అంత ముక్కొకటీ! మీ బాబు కొట్టినట్టు వాడికి పనసకాయ కొట్టడం రాదు భద్రంగారూ” అంటూ వస్తుంది పక్కవీధి చిట్టెమ్మగారు. ముత్తమ్మ ఉందిగా, భోగట్టాల ఉప్పు అందించడానికి!
ఇంక వరసే! పనసపండూ తేవడం అయింది. వంకాయీ పనసపిక్కల ముద్దకూర, పనసపండు పీచు ముక్కలతో బెల్లం వేసిన తియ్య పులుసు, ఒకటేమిటి, అంతా పనసమయం! పనసమయం!
మళ్ళా మాటల్లో పనసతొనలు ఎక్కువగా తినకూడదూ, ఎక్కువ తినకూడదమ్మా, పనస పది పాతరోగాల్ని బయట పెడుతుందని ఓ సుద్దులు!
ఆవిడగారి పురమాయింపుల్లో తర్వాతది పెసరట్ల కూర! ఉన్నన్నన్నాళ్ళూ తిండి గొడవే. తిండి! తిండి! తిండి! తిండంటేనే రోత పుట్టేట్టు! ఇంత లావు గొప్పలు పోయే ఆవిడింట్లో వంటవాడు ఇలాంటి వంటలు వండడేమో ఖర్మం! లేకపోతే పిసినారీ పీచులవడం వల్ల చేయించుకోరేమో!
ఆకాశం నీలంగా మారింది. చాలా రోజుల తర్వాత ఆ నీలం రంగు ఆకాశాన్ని ఎంత చూసినా తనివి తీరటం లేదు. ఏముందీ? చూస్తూ ఉండగానే గాఢనీలం కాస్తా లేతనీలంగా మారిపోతోంది.
నీలంరంగుతో నీలవేణి గుర్తుకొచ్చింది.
క్లాసులో వెనక బెంచీలో కూచునే నీలవేణి ఈమధ్యే నాకు దగ్గరయింది. పాఠాలు రాక బెత్తం దెబ్బలు అరచేతిలో తినేవాళ్ళు, డబ్బులేక బీదరికం వల్ల తక్కువతనంతో తెలివితేటలున్నా వెనక బెంచీలో కూచునే అమ్మాయిలూ నాకు దగ్గరవతారు! నీలవేణి తెలివైనది. బాగా చదువుతుంది. పాపం బీదపిల్ల.
ఓ రోజు “కుంతలా! కుంతలా! కలలు నిజం అవుతాయి కదా?” అని అడిగింది.
“మనకి కావల్సినవి కలల్లో కనపడుతూ ఉంటాయి. ఏం? ఏం కల కన్నావేం?” అని అడిగే.
“మరే, నేను పెరట్లో మా చుట్టాలాయన ఇచ్చిన అణాకాసుని పాతిపెట్టేనుటా, రోజూ మొక్కలకి నీళ్ళు పోస్తూ దానికీ నీళ్ళు పోస్తూ ఉన్నానటా, నిన్ననేమో దాన్ని తవ్వి చూస్తే ఆశ్చర్యం! అణాలే అణాలు! నేను పాతిన అణాకి వేళ్ళు మొలిచేయి. వేళ్ళ నిండా అణాలే! వేరుసెనక్కాయలు వేలాడతాయే అలాగ. వాటిని తెంపి కడిగి చెంబులో వేసుకుని మళ్ళీ మన్ను కప్పేసేనుటా. అలా రోజూ వేళ్ళనుంచి తెంపుకొచ్చిన అణాలను దాచి దాచి ఎన్నో రూపాయలని మా అమ్మకి ఇచ్చేనుటా! అదేగాని రూపాయి బిళ్ళ పాతితే ఇంకా ఎక్కువ డబ్బు అయ్యేది! ఈసారి ఎవరైనా నాకు రూపాయి కాసు ఇస్తే బావుణ్ణు అనుకున్నా!” బోలుడు సంతోషపడిపోతూ చెప్పింది పిచ్చిపిల్ల!
అలా రూపాయి బిళ్ళలు పాతితే రూపాయిలే అయిపోతే, అంతమందీ డబ్బున్నవాళ్ళు అయిపోతే బీదవాళ్ళు ఉండే ఉండరు! డబ్బు చెట్ల వేళ్ళకీ కాయదు, కొమ్మలకీ కాయదు!
“డబ్బు పాతితే అలా వేళ్ళకీ కొమ్మలకీ కాయదు నీలవేణీ! బాగా చదువుకుని పెద్దవాళ్ళమై మనఁవే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి. అంతవరకూ మనం బాగా చదువుకోవాలి” అని దానికి బోధపరిచేను. బీదరికంతో దానికా కల వచ్చింది. అది బుర్రూపుతూ నా మాటలు విన్నాదే కాని దానికా కల నిజం అయితే బావుణ్ణని ఉన్నాది పాపం!
మరోరోజు మాత్రం మాగట్టి నమ్మకంతో “కుంతలా! ఈ రోజు వచ్చిన కల తప్పకుండా నిజం అవుతుందే! తెల్లారుజామున వచ్చిన కల నిజం అవుతుందిట. కావస్తే మీ బామ్మగారిని అడుగు. మరే, ఈ కల తెల్లారుజామున వచ్చిందే – మా పెరట్లో మొక్కలు పాతడానికి పెద్ద బొరిగెతో మన్ను పెళ్ళగించి గొయ్యి చేస్తున్నానుటా – పెద్ద బొరిగెతో లోతుగా తవ్వడం కష్టమే. అయినా అలా తంటాలు పడుతూ మన్ను పైకి తీస్తూ తవ్వుతూ ఉంటే ఓ చోట టంగుమని చప్పుడయింది. టంగుటంగుమంటోంది ఏఁవిఁటా అని మరోసారి మరోసారి మోకాళ్ళ మీద వంగీ పడుకొని బొరిగెను ఆడిస్తూ విన్నా! టంగుటంగుటంగు!
“మా నాన్నగారిని కేకేసే. దాంతో ఆయన ఏఁవిఁటమ్మా అంటూ వచ్చేరు. ఆయన వెంట అమ్మా వచ్చేసింది. ‘మనింట్లో గునపమన్నా లేదు. చూడు, ఇనపగజాలో రెండు కిటికీవి ఊడిపోయాయి. ఎక్కడ పెట్టేవూ? వాట్ని పట్టుకురా’ అన్నారు అమ్మతో. ఆ గజాలతో తవ్వి తవ్వి మన్ను తీసేరు. ‘పాతరే! పాతరే! లంకెబిందెలంటారే, దానిలా ఉంది!’ అన్నారు.
“‘పోనీ, ఎవరినైనా అడిగి గునపం తేనా?’ అంది అమ్మ. ‘ఏడిసినట్టే ఉంది నీ తెలివి! ఊరు ఊరందరినీ పిలిచేటట్టు ఉన్నావు! మన తంటాలు మనఁవే పడాలి’ అన్నారు నాన్నగారు. చెమటలు కక్కుకుంటూ గొయ్యి కైవారం పెద్దది చేసి చేసి, మన్ను పైకి తోడి తోడి, నాన్నగారూ అమ్మా కలిసి పెద్ద రాగిబిందెను పైకి లాగేరు. మూతని బద్దలు కొట్టేరు. కళ్ళు జిగేల్మన్నాయి! దాన్నిండా బంగారు నాణేలే! ఇహ మా కష్టాలన్నీ తీరిపోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి! మంచి బట్టలు నే కట్టుకోవచ్చు. మా అమ్మా నాన్నగారూ కళ్ళకద్దుకుని మా దేవుడి పట్టి దగ్గర పెట్టి, దేవుడికి వెయ్యి దణ్ణాలు పెట్టేరు. నేనూ కళ్ళకద్దుకుని దణ్ణం పెట్టే!” అని సంతోషపడుతూ చెప్పింది.
పాతరల గురించీ పాతరల లంకెబిందెల గురించీ మా క్లాసు పాఠాల్లో ఓ కథ ఉంది! ఈ నీలవేణి ఆనందాన్ని నేనెందుకు ముందస్తుగా పోగొట్టాలి? నిజం కాకపోయే సరికి అదే తెలుసుకుంటుంది! విని “అలాగా” అన్నాను.
ఏంటో! కొందరికి డబ్బుండదు. వాళ్ళ పిల్లలు ఇలా కలలు కంటూ ఉంటారు. మా ఇంటికొచ్చే ఆ గీర గర్రా ఆవిడ డబ్బులో మునిగి తేలుతోంది! ఇది ఎలా పోతుందబ్బా? ఏం చేస్తే పోతుందీ?
పూర్వజన్మలు, చేసుకున్న పుణ్యాలు, పెట్టి పుట్టడాలూ – అని బామ్మలాంటి వాళ్ళు చెప్పేది నిజంగానే నిజమా? అదే అయితే కాలు మీద కాలు వేసుక్కూచునే వాళ్ళూ, చెమటోడిస్తూ కష్టాలతో తినీ తినకా పిల్లాజెల్లాతో బతుకుతున్నవాళ్ళూ ఇలాగే ఉంటారన్నమాట!
ఎందుకో నాకది బాగోలేదు! నాన్నని అడగాలి.
నాన్న కొందరికి సాయం చేస్తున్న మాట నిజఁవే! బామ్మావాళ్ళూ దానం, ధర్మం పేరుతో బీదవాళ్ళని ఆదరిస్తున్న మాటా నిజఁవే! కానీ ఆమాత్రం వల్ల ఏం లాభం? నీలవేణి లాంటివాళ్ళు ఇంకా ఎంతమందో! నాకు తెలిసే నా ఈడు బీదపిల్లలు ఇంతమంది ఉన్నారే – మరి అన్ని ఊళ్ళల్లో కలిపితే?
పనసగింజలు తిండం ఎప్పుడో అయిపోయింది. నాన్న షికారు నుంచి వచ్చే వేళయింది. ఎండాకాలం సెలవుల్లో చేయవలసిన హోమ్‍వర్క్ ఇంకా అలాగే ఉండిపోయింది. ఇవాళ చేసేసుకోవాలి.
రాత్రి పడుకోబోయే ముందు నాన్నని అడుగుతా. బీదా గొప్పా తేడా పోగొట్టాలంటే ఏం చెయ్యాలో? పెద్దయ్యాక నే చేస్తా ఆ పనిని! అనుకుంటూ గుర్రం మీంచి ఓ గెంతు గెంతి లోపలికి బయల్దేరా.