ఊహల ఊట 14

ఆ వేళా నా ఊహల్లో ఏవేవో ఆలోచిస్తున్నా నా గోడగుర్రం మీద కూచుని, అమ్మ ఇచ్చినదేదో నవులుతూ – గేటు చప్పుడయితే తలెత్తి చూద్దునూ, ఎడంచెయ్యి తిరగేసి మండవేపు నడ్డిమీద పెట్టుకుని కుడిచేత్తో చిన్న చేతికర్ర పట్టుకుని తడబడే అడుగుల్తో లోపలికి వస్తోందో ముసలావిడ. తమ్ముడు నిల్చుంటే ఎంతెత్తో అంత ఎత్తు ఉంది. నడుం అంతలా ఒంగిపోయింది మరి. బామ్మ లాగానే బుర్ర మీద ముసుగేసుకుని తెల్లటి గ్లాస్గో పంచె కట్టుకుంది. గుండు మీది పండు వెంట్రుకలు ముసుగులోంచి నుదురు మీదికొచ్చీసేయి.

గబుక్కున గుర్రం మీంచి దిగే, ఆవిడ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకురాడానికి. ‘నా తల్లే, నా తల్లే’ అంటూ చేతికర్ర నా చేతికిచ్చింది. నా నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటే ‘ఇంకొక మెట్టు, ఇంకొక మెట్టు’ అంటూ వీధీ చీడీ మెట్లు ఎక్కించి లోపలికి తీసికెళ్తూ సావిట్లోంచి కేక పెట్టే.

“అమ్మా! బామ్మ కోసం ఎవరో కొత్త బామ్మగారు వొచ్చేరు. తొందరగా రా!”

అమ్మా, అమ్మతోపాటు బామ్మా సావిడి ముందు చీడీ మీదకు వచ్చేరు. పరుగు పరుగున వొచ్చి అమ్మ ఆవిణ్ణి పట్టుకుని ‘రండమ్మా రండి’ అంటూ ‘నెమ్మది, నెమ్మది, జాగ్రత్త’ అని చెప్తూ చీడీ మీంచి నట్టింట్లోకి తీసుకెళ్ళింది.

“ఎప్పుడొచ్చేరూ ఊర్నించి? కులాసా? ఎలా వొచ్చేరూ?” బామ్మ పలకరించింది.

“ఒక్కరూ రాకూడదమ్మా! పెద్దవారైపోయారు. తోడు ఎవరూ రాలేదా?” అడిగింది అమ్మ.

“నా మొహం! ఒహత్తిని రావడం కూడానా? ఆరోజులేనాడో వెళ్ళిపోయాయి. చేతివాడు కూడా వచ్చేడు. జట్కావాడు చిల్లర లేదంటే పక్కనున్న కిళ్ళీకొట్టు దగ్గర మార్చుకుని వస్తానని వెళ్ళేడు.”

“అయ్యో! జట్కాలోనే కూచోలేకపోయారా?”

“జట్కా దిగిపోయేక చిల్లర లేదన్నాడు. చేతివాడు వచ్చేవరకూ నిల్చోలేక లోపలికి నెమ్మదిగా నడిచి వద్దామనుకున్నా. ఎక్కువసేపు నిల్చోలేను. గేటు తీసీ తియ్యగానే మీ మనవరాలు, బంగారు తల్లి పరుగున వచ్చి చెయ్యి పట్టుకుంది. జాగ్రత్తగా వీధిమెట్లు ఒక్కొక్కటీ ఎక్కించింది. వాడా! క్షణం పాటైనా నిల్చున్నాడా? జట్కా తోలుకుని కిళ్ళీకొట్టు వేపు వెళ్ళిపోయేడు. పెద్దముండాదాన్ననైనా చూళ్ళేదు!”

“కొందరంతే!”

ఈ ముసిలావిణ్ణి నేనిదే చూడ్డం. ఎన్నేళ్ళుంటాయో?

పండుముసిలి అంటారు. ఈవిడ లాంటి వాళ్ళనేనా? పాక్కుంటూ, డేక్కుంటూ ఉండే ముసిలివాళ్ళూ ఉంటారు కామోసు. నేనెప్పుడూ ఎవర్నీ చూడలేదు. బామ్మ మరికొన్నేళ్ళకి ఇలా అయిపోతుందా ఏం? అమ్మో! బామ్మ ఇలా అవకూడదు. తను అసలే పొట్టిమనిషి. ఈవిడలా నడుం వొంగిపోతే ఇంకేమైనా ఉందా!

పంచే లాల్చీలో, బుగ్గ మీసాల్తో ఇంత లావు మనిషి లోపలికి వొచ్చేడు.

“అదిగో చేతివాడూ! ఏం నాయినా? ఆలీసం అయింది. చిల్లర దొరకలేదా?”

“కిళ్ళీకొట్టు దగ్గర లేదన్నాడు. ఇంకాస్త ముందుకెళ్తేనే కానీ దొరకలేదు. ”

“ఏం బాబూ, బాగున్నావా? దా, కూచో. మంచినీళ్ళు ఇవ్వవే. ఇంకా చేతివాడనే పిలుస్తున్నారా?” అడిగింది బామ్మ.

“నాకే కాదు, ఇంటిల్లిపాదికీ పిల్లామేకా అందరికీ వాడు చేతివాడే. అలా అలవాటైపోయింది.”

చేతివాడేంటీ? చేతిగుడ్డ, చేతి రుమాలు, చేతికర్ర లాగా! ఊరుకోబుద్ధి పుట్టదుగా నాకు!

“ముద్దుపేరా అండీ?” అడిగేసే.

“చంకలో పిల్లాణ్ణి చేతివాడు అంటారు. ముద్దుపేరు కాదు.” చెప్పింది బామ్మ.

ఈ బుగ్గ మీసాలాయన, ఇంత పెద్దాయన – చేతివాడట! చంక దిగేక పేరు పెట్టి పిలవాలిగా? పైకి ఏఁవీ అనకుండా “ఓహో, అలాగా” అన్నా, నవ్వొస్తున్నా నవ్వకుండా. ఇక్కడుంటే నవ్వేస్తా! వీళ్ళ మాటలు నాకేలా అనుకుంటూ వీధి చీడీ వేపు పరిగెట్టే – నా గోడ గుర్రానికి. గుర్రం ఎక్కి కూచున్నా బుర్రకి పట్టిన ‘చేతివాడు’ ఆలోచన వొదల్లేదు.

ముసిలివొగ్గు అయిపోయినా, ఆవిడకి పోనీ చేతివాడనే అనుకుందాం. కానీ అందరూ అలా అండం బావోలేదు. ముద్దుపేర్లూ అంతే. లావుగా రుబ్బురోలు పొత్రంలో ఉన్న పెద్దావిణ్ణి ‘పాపాయీ! పాపాయీ!’ అని పిలుస్తూ ఉంటే ఫకాల్మని నవ్వు రాదూ! పసిపిల్లప్పుడు మిసమిసలాడుతూ బూరి బుగ్గలతో బొద్దుగా ముద్దుగా ఉంటే పాపాయి అని పిలిస్తే పిలిచేవారు అనుకో. పెద్దయ్యాక మానేయాలిగా అలా పిలవటం! ఎంచక్కా ఆ పిల్ల అసలు పేరుతో పిలవొద్దూ?

పేర్లకీ ఆ పేరున్న మనుషులకీ ఎక్కడా గోరంత పొంతన ఉండనే ఉండదు. పాపం ఈ పెద్దవాళ్ళు వాళ్ళకి ఇష్టమొచ్చిన పేర్లు పెట్టేసుకుంటారు. పెద్దయ్యాక ఆ పిల్లలు ఎలా తేలతారో పాపం, వాళ్ళకి మాత్రమేం తెల్సూ?

నాతోపాటూ మా తరగతిలో సుగుణ ఉందా – ఆపేరులో ‘సు’ కాసా ‘దుర్’ అయి కూచుంది. దానంత చెడ్డపిల్ల మొత్తం తరగతిలో మరోత్తి లేదు! సుందరి ఉందా – దుర్భిణీ వేసి ఎంత వెతికినా అందం ఏ కోశానా కనపడదు!

నాన్న స్నేహితుడొకాయన తిన్నగా ఇంట్లోకి వొచ్చేస్తాడు. సావిట్లో కూచోనే కూచోడు. ఉయ్యాల బల్ల మీద కూచుని కాఫీ తాగుతూ నాన్నతో కబుర్లాడతాడు. ఆవేళ ఆయన రాగానే నాన్న అడిగేడు.

“గాంధీకెలా ఉంది? తగ్గిందా?”

“అయ్యో, అయ్యో! గాంధీజీకి ఏమైందీ? ఆయనకి బాగోలేదని మాకు నువ్వు చెప్పలేదే?” ఒకటే కంగారు పడిపోతూ అడిగింది బామ్మ.

“గాంధీజీకి ఏఁవీ అవలేదు. వీళ్ళబ్బాయి గాంధీకి జ్వరం తగ్గిందా అని అడిగే.” చెప్పేడు నాన్న.

ఆ స్నేహితుడికి నలుగురు కొడుకులట. పెద్దవాడు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ, రెండోవాడు జవహర్‌లాల్ నెహ్రూ, మూడోవాడు బాలగంగాధర తిలక్, నాలుగోవాడు సుభాష్ చంద్ర బోసుట! బామ్మకీ ఈయన పిల్లల పేర్లు ఆవేళ వరకూ తెలియే తెలీవుట.

“మా బాగా పెట్టుకున్నావే అబ్బాయిలకి పేర్లూ” అన్నాది బామ్మ.

“జ్వరం దిగజారింది. దగ్గూ పడిశం తగ్గలేదు” అన్నాడాయన.

పెద్దయ్యాక ఈ నలుగురూ ఏమవుతారో? అబద్ధాలకోరులు, పిరికిపందలు, తెలివితక్కువ దద్దమ్మలు, చేతకాని చవటలూ అయితే?

నయమే, నాకు ఇలాటి పేరు ఏదీ పెట్టలేదు. బామ్మ వాళ్ళత్తగారి పేరు పెట్టాలందిట, కామాక్షమ్మ అని. పుట్టడమే తట్టెడు జుట్టుతో పుట్టేనట! నాన్న ‘కుంతల’ అన్నాట్ట. ‘బాగుంది, బాగుంది! కుంతల! కుంతల’ అన్నారట అందరూ. ‘మొదటి అక్షరం ‘క’ కలిసిందిగా!’ అని బామ్మ సంతోషంగానే సరే అందిట! ఏ ముద్దుపేరూ కూడా తగల్చలేదు. బతికిపోయా. ‘సార్థకనామధేయురాలు ఇది’ అని నవ్వుతూ అంతా అంటూ ఉంటారు. జుట్టంతా ఊడిపోయి గుండయిపోతే తప్ప నా పేరుకీ నాకూ పొంతన లేని రోజు రమ్మన్నా రాదు.

అవునూ, పెద్దై పెద్దై నేనూనూ ముసిలిదాన్నయిపోతా కామోసు. అయితే నాకంటే ముందు అమ్మా నాన్నా ముసిలైపోతారు, ఈ ముసిలావిడలా నడుంలు ఒంగిపోయి. అయ్యబాబోయి! ఆ ఊహే భయపెడుతోంది. నిజంగా అయిపోయినప్పుడు – అమ్మో! ఎప్పటికీ ఎవరూ ముసిలి అవకుండా ఎవరు ఎలా ఉన్నారో అలా ఉండిపోవాలి.

కథల్లో ఋషులూ మునులూ తపస్సు చేస్తే దేవుళ్ళు వొచ్చి ఏం కావాలో కోరుకోండి అంటారు. వాళ్ళేది కోరుకుంటే దాన్ని ఎంచక్కా ఇచ్చేస్తారు. అలా నే తపస్సు చేస్తేనో? కథల్లో వాళ్ళయితే అడవుల్లో ఏ చెట్టుకిందో కూచుని చేస్తారు. నేనెక్కడ చెయ్యాలీ? ఇక్కడ మనవూళ్ళో అడివేదీ? లేదు కదా! మనుషులు ఎవ్వరూ లేని అడివిలో అయితే తపస్సు చెయ్యొచ్చు. ఇక్కడ ఎలా చేస్తా? ఎలాగోలా చేసేనే అనుకో – చేస్తే గీస్తే – దేవుడు వస్తే గిస్తే – వరం ఇస్తే గిస్తే – మనుషులందరూ ఇప్పుడెలా ఉన్నవాళ్ళు అలా పెద్దవకండా అలాగే ఉండిపోతారు. పెద్దవకుండా పిల్లలం పిల్లలంగానే ఉండిపోతాం.

అలాగ్గా అయిపోతే ఏ పేరు ఎవరికి పెట్టినా ఎలా పెట్టినా ఇహ తంటా అన్నది ఉండదు. పెద్దయితే కదా ఎవరు ఏఁవయ్యేదీ తెలిసేదీ? ఇది బావుంది!

కొందరు మరి చచ్చిపోతూ ఉంటారుగా – పిల్లలూ పెద్దవాళ్ళూ వాళ్ళూ వీళ్ళూ అనకండా ఏవేవో జబ్బులొచ్చేస్తాయి కదా! అలాంటప్పుడు నేనూ చచ్చిపోవచ్చుగా ఏ జబ్బో చేసి! నేనుండకపోతే వీళ్ళంతా పెద్దవకండా ఎలా ఉన్నవాళ్ళు అలా ఉన్నారో లేదో నాకెలా తెలుస్తుందీ? నేనున్నాను. ఎవరు ఎలా ఉన్నారో, అన్నీ ఎలా ఉన్నాయో తెలుస్తోంది. నే లేకపోతే?

“చీకటి పడిపోయింది. ఇంకా గుర్రం మీదే కూచుని ఎందులో మునిగి తేలుతున్నావే? రా, లోపలికి, వీత్తలుపు గడియలు పెట్టి.” అమ్మ గట్టిగా కేకేసింది.

బుర్ర దించుకుని ఓసారి కళ్ళు మూసుకుని ఓసారి తెరిచి ఏఁవిటేవిటో ఏదో ఏదో ఒకదాని లోంచి మరో దాంట్లోకి వెళ్తూ దారీ తెన్నూ తెలీక కొట్టుకుపోతున్నదాన్ని గభాలున లేచి చూద్దునూ, సావిడి ముందు చీడీ మీదికి నట్టింటి లాంతరు వెలుగు పడుతోంది. నట్టింట్లో ముసిలావిడ, చేతివాడుగారూ బామ్మతోపాటు సొజ్జ తింటున్నారు.

“నువ్వూ అన్నం తినెయ్యి. నాన్న ఇవాళ ఊర్నించి రారు. ఇంకా ఎన్ని రోజులకు వస్తారో! నువ్వు నాన్న కోసం కాచుక్కూచోక్కర్లేదు.” అన్నాది అమ్మ.

“అలాగే, అలాగే. తినేస్తా” అన్నా.

“బాబు ఊళ్ళో లేరని తెలీక వచ్చీసేం. ఓ కార్డుముక్క రాసి బయల్దేరవలసింది” అంటూ విసవిసలాడింది ముసలావిడ.

“ఇప్పుడేమయిందీ? వాడు వచ్చేవరకూ రెండ్రోజులుండి వెళ్దురు గాని” అంది బామ్మ.

“లేదండీ! రేప్పొద్దున్నే వెళ్ళిపోతాం. ఆయనున్నప్పుడు వొస్తాం” అన్నాడు చేతివాడుగారు.

“నువ్వొక్కడివే రా బాబూ. అమ్మగారు మరీ పెద్దవారయిపోయారు. ఇహ ప్రయాణాలు చెయ్యకుండా విశ్రాంతిగా ఇంటి పట్టునే ఉండాలి” అన్నాది అమ్మ.

“నేనూ అదే అన్నానమ్మా, వినందే. నీకు తెలీదు నేనోసారి ఆయనతో నాలుగూ మాటాడాలి అంటూ బయల్దేరింది.”

“ఈసారి చేతివాణ్ణి పంపండి. తనే ఆ మాటాడవలసిన నాలుగు మాటలూ మీరు చెప్పి పంపితే మాటాడతాడు లెండి.” బామ్మ బోధపరుస్తున్నట్టుగా చెప్పింది.

నే పొద్దున్న లేచేసరికి చేతివాడుగారూ లేరు, ఆవిడా లేరు. వెలుగు విచ్చుకోకుండానే, కోటలో నగారా వాయిస్తూ ఉండగానే వెళ్ళిపోయారుట.

కోటలో వాయించే నగారా వినాలంటే తొలివెలుగు రాకండానే నిద్ర లేవాలి. ఎప్పుడో గాని నేనంత పొద్దున్నే లేవే లేవను. ఒక్కోసారి అమ్మో, నాన్నో లేపేస్తే నగారా ఆఖర్ని ఊదే తు-తు-తు-త్తూ-త్తూ బాకా మాత్రం వింటూ ఉంటా.

అమ్మిచ్చిన పాలు ఇంకా తాగుతూనే ఉన్నా. నాన్న వొచ్చీసేడు ఊర్నించి.

“వచ్చీసేరే!”

“అయ్యో! నువ్వొచ్చేస్తావని తెలిస్తే పాపం ఈ పూటకి బలవంతంగానైనా ఆపేసేదాన్నే” అంది బామ్మ.

“ఎవరొచ్చేరూ?”

“చేతివాడుగారూ, వాళ్ళమ్మగారూనూ.” చటుక్కున చెప్పేసే.

“చేతివాడుగారెవరూ?”

“చంకలో పిల్లాడుగారు” అని నవ్వడం మొదలెట్టే.

“ఆపవే, నీ నవ్వూ నువ్వూనూ!”

“నయఁవే! నిన్న వాళ్ళ ఎదట పడిపడి నవ్వలేదు.”

“వాళ్ళెదుట నవ్వుతానా? నాకు తెలీదా ఏం? నవ్వు ఆపుకోలేకే మీ దగ్గర కూచోకుండా వెంటనే వెళ్ళిపోయా నా గోడగుర్రానికి.”

“ఇంతకీ ఎవరా వచ్చిందీ?” అడిగేడు నాన్న.

“పరమేశ్వరమ్మగార్రా! కాలం ఖర్మం కాకపోతే ఆ అర్బత్ నాటూ మునిగిపోవాలా! కొడుకా అచ్చుముచ్చు తండ్రి పోలికే! అమాయకుడూ అర్భకుడూను!”

“పరమేశ్వరమ్మగారా!”

“నిన్న సాయంత్రం వచ్చేరు. రాత్రి తప్పదు కదా అన్నట్టు ఆగేరు. మీరు లేకపోయేసరికి వొచ్చినవాళ్ళు వొచ్చినట్టూ తెల్లారీ తెల్లారకముందే వెళ్ళిపోయారు.” చెప్పింది అమ్మ.

“పాపం, డబ్బుకి రొక్కటంగా ఉండి వొచ్చివుంటారు!” బామ్మ తన మాటని పొడిగించి విచారంగా చెప్పింది.

చేతివాడిగారి ముసలమ్మగారి పేరు పరమేశ్వరమ్మగారా? అర్బత్ నాటు ఏఁవిటీ? మునిగిపోడం ఏఁవిటీ? డబ్బుకి రొక్కటంగా ఉండడం అంటే? ఎప్పుడూ ఈ మాటలే విన్లేదే! బామ్మ కబుర్లలో ఈ కబుర్లు ఎప్పుడూ చెప్పలేదే! వింటూ కూచున్నానే కాని ఎప్పుడూ గబుక్కున అడిగినట్టు నేనేం అడగలేదు. ఇలా మొహాల నిండా విచారం పులుముకుని ఏదో గట్టి సంగతి మాటాడుకుంటున్నప్పుడు నేను నోరు మెదపకూడదు. ఇదేదో నవ్వే సంగతీ కాదు, నవ్వించే సంగతీ కాదు!

“ఎంతో కొంత మీదగ్గరున్నది ఇవ్వలేకపోయారా?” అన్నాడు నాన్న.

“మేమిస్తే ఆవిడ పుచ్చుకుంటుందిట్రా? పెద్దబతుకు బతికినావిడ! ఎంత ఆభిజాత్యమో! పోనీ, ఇదీ సంగతి అని మాతో ఏమన్నా చెప్పిందా? నీతో నాలుగూ మాటాడాలంటూ వచ్చానంది.”

“తోడబుట్టినవాణ్ణి మట్టికరిపించి ఏం బావుకున్నాడులే!” అన్నాడు నాన్న.

“కరణం బుద్ధిరా! పోనీ అని ఆ కరణీకం తన తదనంతరం తమ్ముడికి వచ్చేటట్టు ఏఁవన్నా చేశాడా? అదీ లేదు.”

“చేస్తే మాత్రం అత్తయ్యా? ఆ అమాయకపు తమ్ముడు కరణీకం చెయ్యగలిగేవాడా? ఆ అన్నగారి నిర్వాకానికి తమ్ముడికి భూమ్మీద బతుకే లేకపోయింది. అన్నగారి కళ్ళెదెటే కాలం చేసేడు!” అన్నాది అమ్మ.

“అదీ నిజఁవే! తెలివితేటలుండొద్దూ? ఆయనంటే బుర్రలు తీసి బుర్రలు పెట్టేవాడు. అమ్మో ఇలాంటి అలాంటి వాడూనా? తన చేతికి చమురు అంటకుండా పన్లు చక్కబెట్టడమంటే మాటలతో పనా? కేశవాయస్వాహా, నారాయణాస్వాహా, మాధవాయస్వాహా జపిస్తూ ఆచమనం చేసినట్టు అందరి ఆస్తులూ గుటకాయస్వాహా చేసేడు! చివరికి సొంత తమ్ముడి నెత్తినీ శఠగోపం పెట్టేడు. అబద్ధాల అప్పుల్లో మునిగిపోయినట్టు చేతులెత్తేసి దివాలా అర్జీ పెట్టీసేడు. ఆ అప్పులవాళ్ళందరూ పెళ్ళాం తరఫు కావల్సిన వాళ్ళే!”

“పోనిద్దురూ. అలా వచ్చింది వచ్చినట్టే పోతుంది. నిలుస్తుందా ఎక్కడయినా?”

“నువ్వన్న మాట ముమ్మాటికీ నిజం. అడ్డతోవలు తొక్కి సంపాదించింది అనుభవానికి రాదు కాక రాదు.”

“పెళ్ళాం వంకవాళ్ళు బాగుపడ్డారు. వాడి వంశం వాళ్ళే కటకటలాడుతూ బతుకుతున్నారు. ఆయుష్షు ఎవరిదీ ఇంతని చెప్పలేం కదా! పరమేశ్వరమ్మకి ఆ దేవుడు ఆయుర్దాయం ఎక్కువ పోసేడు. ఆ కోర్టువాళ్ళు ఇప్పించిన ఆ నష్టపరిహారం ఎన్నాళ్ళొస్తుందీ? బతికినన్నాళ్ళకీ ఎక్కడొస్తుందీ?”

“తెలివితక్కువ వాణ్ణి తెలివైనవాడు, బలం లేనివాణ్ణి బలం ఉన్నవాడు, బీదాబిక్కీనీ అధికారబలం డబ్బుబలం ఉన్నవాడూ అణిచేస్తాడు. దీన్ని మార్చడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. నుదుటి రాతను అనుభవించాల్సిందే. బాబన్నట్టూ ఏం బావుకున్నాడూ? పిడిరాయిలా ఉన్నవాడు, చేసిన అన్యాయానికి గుండాగి చచ్చేడు!”

ఆ వేళంతా అలా అమ్మా బామ్మా దానిగురించి మాటాడుకుంటూనే ఉన్నారు. ఎంత విన్నా నాకేం అర్థం కాలేదు. ఒకే ఒక్క సంగతి అర్థమయింది. పరమేశ్వరమ్మగారికి డబ్బుల్లేవని. అమ్మనీ బామ్మనీ ఎలాగూ అడక్కూడదు. వాళ్ళు ఎటూ ఏదీ నాకు తెలిసేటట్టు చెప్పరు. చిన్నగుంటవి. పెద్దపెద్ద విషయాలు నీకెందుకూ అని కేకలేస్తారు. నాన్నని అడగొచ్చు. అడగనా, వొద్దా? అడక్కూడదా? తెలీలేదు. నాన్న ఏవో ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నట్టు తెలుస్తూనే ఉంది.

సాయంత్రం ఏం చెయ్యబుద్ధి కాలేదు. బొమ్మలూ వెయ్యాలనిపించలేదు. ఎవరింటికైనా వెళ్తే బావుణ్ణు! అనుకున్నా.

బొమ్మల పుస్తకాలు ఇచ్చే నాన్న స్నేహితుడింటికి వెళ్తేనో? ఆయన ఇంట్లో లేకపోయినా ఆ అత్తయ్యగారు సరదాగా మాటాడతారు.

“అమ్మా, బొమ్మల పుస్తకాలు తెచ్చుకోడానికి వెళ్ళొస్తా!” చెప్పే.

అమ్మ ఏ కళనుందో “వెళ్ళి చీకటి పడకుండా వొచ్చేయి” అంది.

అత్తయ్యగారు వంటింట్లో ఉన్నారు. “దా! దా! మంచివేళకి వచ్చేవు. ఈ పీట మీద కూచో” అంటూ చిన్న పీట వేసేరు.

“ఏం చేస్తున్నారూ? కమ్మటి కరివేపాకు పోపు వాసన వొస్తోందీ!”

“జీడిపప్పు వేసి సేమ్యా ఉప్మా” అంటూ ఆవిడ పోపులో నీళ్ళు పోసేరు. ఛుయ్యిమంటూ ఆవిరి ఇంతెత్తున లేచింది. ఘుమఘుమలాడుతూ నెయ్యి వాసన వంటిల్లంతా! సేమ్యా చుట్టని విరిచి ముక్కలు ముక్కలు చేస్తూ పళ్ళెంలో పెడుతున్నారు.

“ఈ ముక్కలే దారాల్లా అయిపోతాయా? నేనింకా దారాల్లాంటివాటిని చేస్తారనుకున్నా. చేస్తూ ఉండగా ఎప్పుడూ చూళ్ళేదుగా!”

“ఉడుకుతూ విడిపోతాయి. మీ అమ్మ చేస్తున్నప్పుడు చూడ్లేదా?” అందావిడ నవ్వుతూ.

“నేనసలు వంటింట్లోకే వెళ్ళను. అమ్మా బామ్మా ఇద్దరే వంటింట్లో ఉంటారు. నన్ను రానూ రానివ్వరు. నేను వెళ్ళనూ వెళ్ళను. నా పనులే నాకు. వాటితోనే నాకు సరిపోతుంది.”

“ఓహో! నీకు అన్ని పనులున్నాయన్నమాట! ఏం పన్లమ్మా అవీ?” ఆవిడ మళ్ళీ గట్టిగా నవ్వుతూ అడిగింది.

“ఒకటా రెండా! ఎన్నని చెప్పనూ?” అన్నా.

“వెయ్యి పనులు చేస్తున్నావన్నమాట!”

“అంతకన్నా ఎక్కువే! చదువుకోవాలి. రాసుకోవాలి. బొమ్మలు గీసుకోవాలి. బుర్రనిండా ప్రశ్నలే. వాటికి జవాబులు అడగన్నా అడగాలి. నాకు నేనన్నా జవాబులు ఏఁవిటో ఆలోచించి, ఆలోచించి తెలుసుకోవాలి. బొమ్మల పుస్తకాలు చదివి అలాంటి కథలు నేనూ రాయాలి. బొమ్మల పుస్తకం నేనూ నా బొమ్మలతో వేయించుకోవాలి.”

“అయ్యబాబోయి! ఈ తుప్పజుట్టు అమ్మాయికి ఇన్ని ఊహలా?”

ఆవిడ ఇంతింత కళ్ళు చేసుకుని అరచెయ్యి బుగ్గమీద పెట్టుకుని ఆశ్చరం పోతున్నట్టు మొహం పెట్టింది.

“నిజం అండీ. సత్యప్రమాణంగా!”

“ఈ సత్యప్రమాణం ఎక్కడ నేర్చుకున్నావూ?”

“అమ్ముగోరూ, సత్తెపెమాణంగా సెపుతున్నానండీ! నాను అబద్ధం ఆట్టం నేదు. మీ ఎదట అబద్దం సెపతానుటండీ! అని మా బామ్మకి తవుడు చెపుతూ ఉంటే విన్నా. అసలు మాట సత్యప్రమాణం అని నాన్న చెప్పేడు.”

“తవుడెవరూ?”

“కూరలమ్మి.”

“ఏమాట వింటే ఆ మాటని పట్టేసుకుంటావన్న మాట.”

“మరే, మా అమ్మా బామ్మా అదే అంటారు. నేనుట – నా బుర్రలోకి, విన్నవీ చూసినవీ చదివినవీ అన్నిటినీ ఒంపేసుకుంటున్నానట!”

అత్తయ్యగారికి మళ్ళా నవ్వొచ్చింది. నవ్వుతూనే సేమ్యా ఉప్మా పళ్ళెంలో వేసి నా ముందు పెట్టేరు.

“వేడిగా ఉంది. చెమ్చా ఇవ్వనా? ఫోర్కు ఇవ్వనా?”

“మీ ఇంట్లోనూ ఫోర్కులున్నాయా? మా ఇంట్లోనూ ఉన్నాయి. పండుముక్కలు తినటానికి. ఇంగ్లీషు దొరగారెవరో నాన్నకి ఫోర్కులు, చాకులు, చెమ్చాలూ ఇచ్చేరు. మా బామ్మ వాటిని ముళ్ళ చెమ్చాలు అంటుంది. ముళ్ళచెమ్చాతో సేమ్యా దారాల తీగల్ని ముళ్ళకి చుట్టబెడుతూ పొడూగ్గా తీయొచ్చు. మామూలు చెమ్చాకి అలాగ రాదు. కాని ఉప్మాలో జీడిపప్పు తినాలంటే మామూలు చెమ్చా ఉండాలి!”

“ఉండయితే రెండు చెమ్చాలు ఇస్తా.”

“ముందు నేనెలా తింటానూ? మావయ్యగారూ మీరూ తినకుండా? కలిసి తిండం వేరూ.”

“భలే మర్యాదలు తెల్సే నీకు! మావయ్యగారు గడియో క్షణమో వొచ్చేస్తారు. నువ్వు చేస్తూ ఉండూ, ఈ పక్కనే దగ్గర్లో పని ఉందీ, ఇలా వెళ్ళి అలా వొచ్చేస్తానూ, అని వెళ్ళేరు. నువ్వు తింటూ ఉండు. ఆయనా వచ్చేస్తారు.”

“అదా సంగతీ! వీత్తలుపు తోసేస్తేనే వొచ్చేసింది. లోపల గడీ పెట్టిలేదు. అవునూ, గడీ పెట్టేరు కాదేం? ఏ దొంగన్నా దూరితే?”

“ఏ దొంగా రాడు. ఓవేళ వొచ్చేడే అనుకో, ఈ వేడి వేడి అట్లకాడతో వాడి మొహాన్ని కాల్చేస్తా.”

“దొంగంటే భయం లేదా మీకు?”

“ఎందుకూ భయం? సింహమో పులో కాదుగా. వాడూ మనిషేగా.”

“అవును. దొంగా మనిషే. కాని వాడు చెడ్డవాడుగా. మా బామ్మ వీత్తలుపు గడీ వెయ్యకపోతే నానా రాద్ధాంతం చేస్తుంది. జాగ్రత్తలు లేవని.”

చడీ చప్పుడూ లేకండా దొంగాడు వొచ్చినట్టు మావయ్యగారు వొచ్చేరు.

“వీత్తలుపు గడీ పెట్టేరా? లేపోతే దొంగెవడన్నా ఇంట్లో దూరతాట్ట. జాగ్రత్తగా ఉండాలిట. ఇప్పుడే తెల్సింది నాకూను, ఇది చెపితేనూ” నవ్వుతూ అన్నాది అత్తయ్యగారు.

“ఎవరూ, కుంతలా? చాల్రోజులికి వొచ్చేవే!”

“మీరు కొత్త బొమ్మల పుస్తకాలు ఇస్తాను రా, అని పిలవలేదుగా?”

“మరి ఇవాళ ఎలా వొచ్చేవూ? నే పిలవలేదుగా.”

“వొచ్చేనూ. రావాలనిపించిందీ. ఒచ్చా.”

“ఉప్మాలో జీడిపప్పులన్నీ నువ్వే తినేస్తున్నావా? నాకేమన్నా మిగిల్చేవా?” అంటూ ఆయన తన ఉప్మా పళ్ళెం వేపు చూస్తూ నవ్వేరు.

“అత్తయ్యగారు బోలెడంత వేసేరు. చెమ్చాకి ఓ పప్పు వస్తుంది. చూసుకోండి!”

“ఇంకేంటి కబుర్లూ?”

“మరే, అర్బత్ నాటు అంటే పెద్ద షిప్పా అండీ?”

“ఈమాట ఎక్కడ దొరికిందీ నీకు? బుర్రలో పోసుకు వొచ్చేవా అడగడానికి?” అడిగేరు అత్తయ్యగారు.

“ఎక్కడిదో అక్కడిది! షిప్పే అయివుంటుంది. అది మునిగిపోయిందిట. ముంచేసిందట కూడానూ.”

“షిప్పు కాదు కుంతలా, అదో డబ్బు కంపెనీ. దివాలా తీసింది. అంటే దాని దగ్గర డబ్బంతా నష్టపోయింది. ఇహ దాని దగ్గర ఏఁవీ లేదని అర్థం. మునిగిపోవడం అంటే దివాలా తియ్యడం. అందులో డబ్బు పెట్టుకున్నవాళ్ళని ముంచేసింది అంటే వాళ్ళ డబ్బు పోయింది అని! ఇది ఎప్పటి భోగట్టావో! ఎక్కడ విన్నావూ?” మావయ్యగారు చెప్పేరు.

“ఓహో! అదా! రొక్కటం అంటే డబ్బు లేకండా పోవడమా అయితే?”

“డబ్బు చాలినంత లేక ఇబ్బంది పడ్డం.”

“అమ్మయ్య! అర్థం అయింది. షిప్పు అనుకున్నా. తెలీక బుర్రంతా చికాకు చికాకు అయిపోయింది.”

“ఇదడగడానికా వొచ్చేవూ? ఇందుకా రావాలనిపించిందీ?”

“అబ్బెబ్బే, ఉత్తిదే వొచ్చే. వచ్చే కాబట్టీ అడిగే. వెళ్ళొస్తా” అని లేచే.

“ఉండు మరి కాస్సేపు. మాటలు తెలిసిపోయి బుర్రలో చికాకు పోగానే బయల్దేరేవే!”

“వచ్చి చాలా సేపయింది. అడగండి ఎంత సేపయిందో. చీకటి పడకుండా వొచ్చేమంది అమ్మ.”

రాత్రి ‘నాన్నా, నాన్నా! నా ఊహలకి రొక్కటం వచ్చింది’ అని ఏడుస్తూ పలవరిస్తూ ఉంటే నాన్న లేపి కూచోపెట్టేడు. మంచినీళ్ళు తాగించేడు.

“వెల్లకితలా పడుకుంది. ఏదో కల వచ్చినట్టు ఉంది” అన్నాది అమ్మ.

కళ్ళు నులుముకుని, మూసుకునీ విప్పీ చెప్పే. “నా గుర్రం మీద కూచుని సేమ్యా చుట్టలోంచి తీగదారాల్లా పొడూగ్గా ముళ్ళచెమ్చాతో ఊహల తీగల దారాల్ని పొడూగ్గా తియ్యబోతే సాగలేదు. ఊహలకి రొక్కటం వచ్చింది నాన్నా! రొక్కటం వచ్చింది నాన్నా!”

“కలలో చూసేవు.”

“ఇదంతా కలా?”

“దా, నా దగ్గర పడుకుందువు గాని. నీ ఊహల ఊట ఊరుతూనే ఉంటుంది. సాగుతూనే ఉంటుంది. ఆగమన్నా ఆగదు” అన్నాడు నాన్న.