ఊహల ఊట 8

ఈతపళ్ళు, తాటి తాండ్రా గరాటా పొట్లాంలో వేసుకుని గోడగుర్రం ఎక్కే.

ముందు ఈతపళ్ళు తిన్నా? తాటి తాండ్రా? అని కాస్సేపు అటూ ఇటూ ఊగిసలాడే. తాండ్ర అయితే చాలాసేపు నోట్లో చప్పరిస్తూ ఉంచుకోవచ్చు కదా, ముందు పళ్ళు తినేసేయాలి అని బుద్ధికి తోచింది. ఒక్కొక్క పండూ తింటూ, గింజను ఉమ్ముతూ – తింటూ ఆకాశం వేపూ, ఉమ్ముతూ కింద నేల వైపూ చూస్తూ అన్ని పళ్ళూ అవగొట్టేసే! మా గమ్మత్తైన రుచి ఈ పళ్ళది!

ఇవాళ రైంధ్రాం బామ్మగారు వొచ్చేరు, ఈతపళ్ళూ తాటి తాండ్రా పట్టుకుని. రైంధ్రాం – అదో ఊరు పేరట. అదెక్కడుందో నాకు తెలీదు. 

ప్రతీ నెలా నాలుగేసి రూపాయలు బామ్మకు ఇవ్వడానికిగాను ఈ బామ్మగారు వస్తారు. అప్పుడు ఎప్పుడో బామ్మ ఆవిడకు డబ్బు ఇచ్చిందిట. ‘మీరు నా కష్టంలో ఆదుకున్నారు. మీరు అవునన్నా కాదన్నా నేను చేబదులుగానే తీసుకున్నా.  మీరు పెద్దమనసుతో ఇవ్వక్కర్లేదంటే మాత్రం నా మనసు ఎలా వొప్పుకుంటుంది చెప్పండీ! సమయానికి ఆదుకోవడమే చాల్చాలు’ అంటుంది. 

‘ఎందుకమ్మా పడుతూ లేస్తూ కష్టపడి బస్సులో పడివొస్తావూ? ఫర్వాలేదు, ఏదో ఆమాత్రం ఒకరికి సాయపడ్డానికి భగవంతుడు ఇచ్చేడు. తిప్పి ఇచ్చేవుగా ఇన్నాళ్ళూ. ఇంక వొద్దులే’ అన్నా వినిపించుకోదు. ప్రతీనెలా క్రమం తప్పకుండా పదో తారీఖున వొస్తుంది. ఓ రోజు అటూ ఇటూ అవనివ్వదు. పదో తారీఖున ఆవిడ డబ్బు పుచ్చుకుందిట. వాన అయ్యేది వొంగడయ్యేది వొచ్చి తీరుతుంది. తారీఖు మారితే లెక్క తెలీదుట ఆవిడకి! నాల్రూపాయలు ఇచ్చి ఇంకా మీకు ఇంతివ్వాలి, అని లెక్క చెపుతుంది. 

ఎంత గట్టిగా నొక్కి నొక్కి వద్దన్నా ‘ఇంకా నయం, నేనేమన్నా వొడ్డీ ఇస్తున్నానా? అసలే కద తీరుస్తున్నా. ఇంకొహరు ఇంకొహరు అయితే వడ్డీ కట్టమన్రూ? వడ్డీ లేకుండా అప్పు పుడుతుందా?’ అంటూ లోకం తీరు ఏకరువు పెడుతుంది. ‘తీసుకున్న మొత్తం అంతా ఒక్కసారి అదే – ఒకే దఫాలో ఇచ్చుకోలేను. మీకు తెలుసుగా! తాపీగా నెలనెలా ఇలా ఇస్తున్నా’ అంటుంది. 

“తేగలు ఇప్పుడు రావు కదూ?” అన్నా తాండ్ర తీసుకుంటూ. 

“ఏం? తేగలు నీకు ఇష్టమా?”

“తేగ లోపల ఇంతంటే ఇంత – చిన్న పిసరంత – తెల్లటి చందమామ భలే బావుంటుంది.” బొటకనవేలూ చూపుడువేలూ దగ్గిరగా నొక్కి పట్టుకుని ఎంత చిన్న పిసరో చూపెట్టే. 

ఆవిడ నవ్వి “మరి ముక్కలో?” అంది. 

“ముక్కలా? వాటిని మీగడ, కొత్తిమీరికారం అద్దుకుని తినాలి. నవుల్తూ తింటూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది తెల్సా అండీ?” అన్నా చేతులు రెండూ అటూ ఇటూ బారుగా చాపి. 

“మార్గశిరమాసంలో కానీ రావమ్మా! అప్పుడు తెచ్చిపెడ్తాలే” అన్నాదావిడ. 

“ఈ ఎండాకాలం అవాలి. వానాకాలం వెళ్ళాలి. కార్తీకమాసం కూడా వెళ్ళిపోవాలి. అప్పుడొస్తుంది మార్గశిరం. బోలెడు రోజులు. నాకు తెలుసు. తాటి తాండ్రను చూస్తే తాటి తేగలు గ్యాపకం వొచ్చేయి” అన్నా. 

“అదలా ఏదో ఓటి వాగుతూ ఉంటుంది. దాని మాటలు పట్టించుకోకండి. దానికన్ని రకాల తిళ్ళూ రుచులూ కావాలి” అంది అమ్మ. 

“ఆవిడ ఏదో ఓటి తెచ్చి నీకిస్తున్నారని నీకిష్టమైనవన్నీ ఏకరువు పెట్టచ్చా? తెచ్చింది పుచ్చుకోవాలే గాని ఎప్పుడు ఏది కావాలో జాబితా రాసి ఇచ్చేటట్టు ఉన్నావే! తప్పు కాదూ? రోజురోజుకీ కాకరకాయ అల్లా కీకరకాయ అవుతున్నావు.” బామ్మ దెబ్బలాడింది.

“నీలాగానే ఉంటారు. ఎవరో తెలీని పైవాళ్ళలా ఉండరు. వాక్కూడదని తెలీలేదు” అంటూ తల దించుకున్నా. 

“చిన్నపిల్ల. ముద్దుగా మాటాడుతూ ఉంటే ఏంటమ్మా దాన్నలా కోప్పడతారు! పిచ్చితల్లీ! నువ్వనుకుంటున్నట్టూ నే మీ బామ్మలాంటి దాన్నే. పరాయిదాన్ని కాను. నువ్వు అడగావొచ్చు. నేను తేనూ వొచ్చు” అన్నాదావిడ. 

ఏంటో నేను! ఒక దాన్ని చూస్తే నాకు ఇంకోటి గ్యాపకం వస్తుంది. దాంతో ఏదో ఓటి వాగేస్తూ ఉంటా. ఒకత్తినీ కూర్చుని ఉంటే నాలో నేను, నాకు నేను చెప్పుకుంటూ ఉంటా. ఎవరి ముందరన్నా అయితే అప్పటికి తోచింది చెప్పేస్తూనే ఉంటా. తాండ్రతో తేగలంటూ వాగే. తినేవే కాదు – ఏది చూసినా ఏది విన్నా మరోటేదో అమాంతంగా నన్ను పట్టుకుని లాక్కుపోతుంది. 

తప్పే. ఆవిడ దగ్గర అలా వాక్కూడదు.  బామ్మ అన్నట్టూ పడుతూ లేస్తూ బస్సులో వొస్తుంది. అడ్డకాళ్ళతో నడుస్తూ. బరువ్వి ఎలా తెస్తుందీ?! మోసుకురావద్దూ పాపం!

అవును. ఆవిడవి అడ్డకాళ్ళు. మొదటిసారి ఆవిణ్ణి చూసినప్పుడు, ఆవిడ కాళ్ళు అలా ఉన్నాయేంటీ? అలా నడుస్తోందేఁవిటీ? అని అడిగే. అడ్డకాళ్ళంటారట! పుట్టడమే కొందరు అవకరాలతో పుడతారట. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవేళ నేనడగడంతో అమ్మా బామ్మా అవకరం గురించి చెప్పేరు. అంతేకాదు, అవకరాల కబుర్లలో పడిపోయేరు.

“చిట్టెమ్మకి చిలక్కి చెప్పినట్టు చెప్పే” అంటూ మొదలెట్టింది బామ్మ. 

“ఏ చిట్టెమ్మా?” అడిగింది అమ్మ. 

“పెద్దింటి అమ్మడమ్మ కోడలే! చిట్టెమ్మను ఎరగవూ? అమ్మడమ్మకీ చెప్పే. కోడలు పిల్ల చిట్టెమ్మ చిన్నదీ. దానికి తెలీదూ – గ్రహణం నాడు గదిలోంచి  బయటికి రావొద్దనూ. నీళ్ళోసుకుందన్నావు. జాగ్రత్తా! అని. ఆవిడేం చెప్పిందో, అదేం విందో! మొదటి కాన్పు! గ్రహణం మొర్రి రాకేమవుతుందీ! పిల్లాడు చూడబోతే పనసపండులా ఉన్నాడు. మీది పెదవేమో చీలిపోయి ఉంది!”

గ్రహణం గురించి నాకూ తెల్సు. అల్లా వేళ సూర్యగ్రహణం పట్టిందిగా! అద్దంపెంకుకి పొగ మసి పట్టించి ఉంచింది బామ్మ. పట్టూ విడుపూ తెల్సుకోడానికి ఆదెమ్మను పళ్ళెంలో నీళ్ళు పోసి రోకలి నిలబెట్టమంది. పట్టుస్నానం, విడుపుస్నానం రెండూ చెయ్యాలిగా! రోకలి పడిపోకుండా నిలువునా నిల్చుంటే పట్టిందని, రోకలి కింద పడిపోతే విడిచిందనీ తెల్సిపోతుందట!

“మసి పట్టించిన అద్దం పెంకు నేనూ చూస్తా” అని గెంతే. 

నాన్న దెబ్బలాడుతూ నన్ను రెక్క పట్టుకుని ఎత్తి లోపలికి తీసుకొచ్చీసేడు. బామ్మనీ చూడొద్దన్నాడు. నాన్న దెబ్బలాడ్డం చూసి అమ్మయితే లోపలికి వొచ్చేసింది కాని బామ్మ మాత్రం చూసింది. కంటిగుడ్డు మీద మచ్చపడి కంటికి హాని కలుగుతుంది. అలా చూడకూడదు అంటూ నాన్న బోధపరిచేడు. గ్రహణం ఎలా పడుతుందో బొమ్మ గీసి చూపించేడు. 

“ఓహో, ఇదా సంగతీ! మరి బామ్మావాళ్ళూ రాహువూ కేతువూ మింగేస్తారు అని కథ చెప్తారే” అడిగే. 

“కథ అన్నావుగా. అది కథే” అన్నాడు నాన్న. గ్రహణం వల్ల మొర్రి రాదుట. అసలు ఏ అవకరమూ గ్రహణం వల్ల రాదట.

అబ్బులుగారన్నాయన ఏ ఊరినుంచో మా ఊరినుంచి వెళ్తూ నాన్నని పలకరించి వెళ్దామని మధ్యదారిలో దిగి మా ఇంటికి వొచ్చేడు. ఆయనా నాన్నా చిన్నప్పుడప్పుడెప్పుడో వీధిబళ్ళో కలిసి చదూకున్నారట. బామ్మ తను కట్టుకునే సైనుపంచె చిరిగిపోతే, చిరిగిన రెండు చివర్లూ కలిపి, నలిపి నలిపి గొగ్గిగొగ్గిగా ఉండలా లేచిపోయినట్టు కుట్టుకుంటుందే, అచ్చు సరీగ్గా అలా ఆయన పై పెదిమ ముక్కలయిపోతే రెండు ముక్కల చివరలనూ కలిపి కుట్టినట్టు మీదకి లేచి ఉండలా ఉన్నాది!

అది గ్రహణం మొర్రేనట! బామ్మ చెప్పింది. డాక్టరు చీలిపోయి విడిపోయిన పెదిమని కుట్టేసి కలిపేడు. లేపోతే ఏదీ తాగాలేడు. తినాలేడు. మాటాడాలేడు. కుట్టేసినా మాట విండానికి అదోరకంగా ఉంది. 

“పిల్లో పిల్లాడో ఎవరైతేనేం? భూమ్మీద పడి కేరుకేరుమన్నాక ఏ అవకరమూ లేకుండా అవయవాలన్నీ సరిగ్గా ఉన్నాయని చూసి అమ్మయ్య అనుకోవాలి. అవకరం ఉందని కనుక్కున్న పిల్లల్ని పారేసుకుంటామా? వదిలీగలమా? దేవుడికి వెయ్యి దణ్ణాలు పెట్టుకోవాలి. వెయ్యి మొక్కులు మొక్కుకోవాలి.  తలరాత ఉంటే తప్పదనుకో. అవకరాల పిల్లల్ని పెంచడం ఎంత కష్టం!” ఆ వేళంతా బామ్మ అవకరాల చిట్టా ఏకరువు పెడుతూనే ఉంది. అమ్మ విన్న విషయాలే వింటూనే ఉంది. 

రైంధ్రాం బామ్మగారూ బామ్మా పిచ్చాపాటీలో పడ్డారు. 

నేను నా డ్రాయింగు సరంజామా పట్టుకుని వీధి చీడీ మీదకు వెళ్ళే. నాగమణి లేదుగా నాకు బొమ్మలు గీసిపెట్టి ఇవ్వడానికి!

నేర్చుకుంటే అన్నీ వొస్తాయి. నోరు తిరిగేంత వరకూ రాని మాటలని పదేపదే పలుకుతూ ఉంటే ఆ మాటలు నోటికి వొచ్చేస్తున్నట్టు పదేపదే మళ్ళీ మళ్ళీ గీస్తే నోరు తిరిగినట్టు చెయ్యీ తిరుగుతుంది. ఎందుకు తిరగదూ? వచ్చేవరకూ వెయ్యడమే! రబ్బరుతో చెరపడం – వెయ్యడం – చెరపడం!

బడికి సెలవలివ్వగానే ఇలా ఇదంతా వాగే. నాన్న నవ్వి, అవును నీ నోరు తిరిగినట్టు చెయ్యీ తిరుగుతుంది. బొమ్మలు గియ్యడమూ వస్తుంది. అభ్యాసం కూసువిద్య అంటారు అందుకే, అన్నాడు. నాన్నతో బజారుకెళ్ళి, వెనకవేపు రబ్బరు ఉన్న పెన్సిలు, నల్ల క్రేయాన్ ఓటి, వాటర్ కలర్ బాక్సూ – రెండు డ్రాయింగు పుస్తకాలు కొనిపించుకున్నా. 

జంబుఖానా మీద గోడకానుకుని కూచుని డ్రాయింగు సరంజామా నా ముందు పరుచుకుని ఆలోచనలో పడ్డా. ఏ బొమ్మ గియ్యనూ? 

కొంగ బొమ్మ, కోడి బొమ్మ, నెమలి బొమ్మా అన్నీ అయిపోయాయి. గులాబి పువ్వు, కలువపువ్వుల బొమ్మలూ అయిపోయాయి. అన్నిటికన్నీ పక్షుల బొమ్మలు, పువ్వుల బొమ్మలూనూ. ఇవాళ ఏదన్నా పెద్ద బొమ్మ వెయ్యాలి. గోలెంలో పువ్వుల మొక్క? ఊహూఁ. ఇంకా పెద్దది – ఏది వెయ్యాలీ? 

వీధిలోంచి రెండెడ్ల గూడుబండి వెళ్తూ కనిపించింది. భలే, బండి బొమ్మ! బాగుంటుంది! వెయ్యగలనా లేదా అనుకోలేదు. 

బండి చక్రాన్ని ఓదాన్ని గుండ్రంగా వచ్చేటట్టు పెన్సిలుతో గీసి, పెన్సిలు వెనక రబ్బరుతో తుడిచి – గీసి – తుడిచి – గీసి భేషుగ్గా వచ్చిందే అనుకుని డ్రాయింగు పుస్తకాన్ని పైకెత్తి మరీ చూసుకున్నా. రెండో చక్రమో? ఎందుకూ వెయ్యడం? రెండోది కనపడదుగా. గూడు వెయ్యడం మరీ తేలిగ్గా అనిపించింది. తలకట్టు తీసేసిన పెద్ద ‘గ’ అక్షరమేగా!

ఇంక ఎద్దుల్ని వెయ్యాలి అనుకుంటున్నా. ఇంతట్లో ‘బొమ్మలు వేసుకుంటున్నావా తల్లీ?’ అని అడుగుతూ, నా బుగ్గలు చిదిమి ముద్దు పెట్టుకుని రైంధ్రాం బామ్మగారు ‘వస్తానమ్మా, మళ్ళీ బస్సు తప్పిపోతే కష్టం’ అంటూ సాగనంపడానికి వీధి చీడీ వరకూ వచ్చిన బామ్మతో చెప్పి వెళ్ళిపోయారు. 

“బామ్మా! బామ్మా! ఎద్దుని ఎక్కడ వెయ్యాలీ? గూడుకు తగిల్చి వెయ్యాలా? చక్రానికి తగిల్చి వెయ్యాలా?” 

లోపలికి వెళ్ళబోతూ నేనేమిటి అడిగేనో తెలీక –  “ఎద్దేమిటి? గూడు ఏమిటి? చక్రం ఏమిటీ” అంది. 

“రెండెడ్ల గూడు బండి బామ్మా! ఇదిగో చూడు.” డ్రాయింగు పుస్తకం ఎత్తి పట్టుకుని చూపెట్టే. 

చక్రాన్నీ ‘౧’ లాగా గీసిన గూడునూ చూసి, “నిల్చోడం రాకుండానే పరిగెట్టేద్దామనే? ముందు నిల్చో. తర్వాత పరిగెట్టు.” నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. 

గోడకి చేర్లబడిపోయా!  నిల్చోడం రాకండా పరిగెట్టేద్దామనుకున్నానా? శుద్ధ ఎద్దు మొద్దావతారాన్నా? 

ఎలా ఉంటుందీ ఎద్దుల బండి? ఎన్నిసార్లు చూశానో! గ్యాపకం రాదేం? చూశాం చూశాం అనుకుంటాం కాని దేన్నీ సరిగ్గా చూడం అన్నమాట! విన్నాం విన్నాం అనుకుంటాం కాని దేన్నీ సరిగ్గా వినం అన్నమాట!

కెల్ల నుంచి గూడు రెండెడ్ల బండిలో మొత్తం కుటుంబాన్ని తీసుకుని కుటుంబరావు దొడ్డగారు వచ్చేవారు. వచ్చినప్పుడు ఆ బండి గేట్లోనే ఉండేదిగా! వాళ్ళు వచ్చి చాన్నాళ్ళయిపోయింది. మరి రారు కూడా! ఏ మొహం పెట్టుకు వొస్తారు? అన్ని మాటలు పడ్డాక!

“ఇటుపక్క చుట్టాలు, అటుపక్క చుట్టాలు పిల్లా జెల్లాతో వొచ్చి ఓ నాల్రోజులుండి వెళ్ళడం, వాళ్ళూ వెళ్ళేటప్పుడు పదో పాతికో వాళ్ళచేతిలో పెట్టడం మామూలే. ఏం ఇచ్చినా ఏం పెట్టిపోతలు పెట్టినా ఎప్పుడూ ఏఁవీ అనడు బాబు. అలాంటిది – కెల్ల వాళ్ళమీద విరుచుకు పడ్డాడు! నిప్పులు చెరిగాడు. ‘సంస్కృతంలో చెపుతున్నానా? గ్రీకూ లాటిన్‍లో చెపుతున్నానా? అచ్చతెలుగులో చెప్పింది అర్థం కావటం లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? రావడం చుట్టపుచూపుగా కాదు! మీవాలకం తెలీడం లేదూ? ఏడాదిలో ఎన్నిసార్లు చుట్టపు చూపుకు వస్తావయ్యా పెద్దమనిషీ! రెండెడ్ల గూడుబండిలో యావత్తు కుటుంబాన్నీ ఎక్కించుకుని! మళ్ళా మా ఇంటి గుమ్మం తొక్కేవంటే చూడు!’

ఎర్రగా ఇంతింత గుడ్లు చేసుకుని ఎంత గట్టిగా అరిచేడో ఆయన మీద! ఎప్పుడూ నవ్వుతూ ఉండే బాబు, ఎవరినీ ఏనాడూ పల్లెత్తి ఓ మాట అననివాడు కెల్ల వాళ్ళ మీద ఇంతెత్తున లేచేడు! తలుచుకుంటేనే గుండె అదిరిపోతుంది” అంటుంది బామ్మ.

అమ్మా బామ్మా ఇద్దరూ హడిలిపోయేరు. ఆపూట భోజనాలయేక వెంటనే బండెక్కి వెళ్ళిన కెల్ల వాళ్ళు మరి రాలేదు!

“మీకు తెలీదు అమ్మా! వాడు తిష్ఠ వేయడానికి వస్తాడు. కదలడు. చూస్తున్నా, చూస్తున్నా – చెప్పక తప్పలేదు. మామూలుగా చెపితే అలాంటివాళ్ళకు చెవికెక్కదు. సిగ్గా లజ్జా! దులిపేసుకుని మళ్ళీ సిద్ధం అవుతారు!” అన్నాడు నాన్న. 

ఎన్ని రకాల మనుషులో! ఒక్కొక్కరు ఒక్కొక్క రకం! రైంధ్రాం బామ్మగారు చుట్టమన్నా కాదు. అప్పుడెప్పుడో తీసుకున్న చేబదులు నాలుగేసి రూపాయలు చొప్పున ప్రతినెలా తీర్చడానికి వొస్తూనే ఉన్నారు. ఇవ్వక్కర్లేదన్నా ఋణం ఋణమే. నే ఋణంగానే తీసుకున్నా అంటూ పెద్దవయసులో పడుతూ లేస్తూ బస్సులో పడి వస్తున్నారు. ఓ పూట ఉండమన్నా ఉండరు. డబ్బు లెక్కచెప్పి వెళ్ళిపోతారు. కుటుంబరావు దొడ్డా ఉన్నారు! చుట్టరికాన్ని అడ్డు పెట్టుకుని తిష్ఠ వేస్తున్నారు. ఒక్కడూ కూడా కాదు. మొత్తం కుటుంబంతో! ఇంచుమించు ఏడాదిలో సహం రోజులు. 

“పోనీ అని బొత్తిగా లేనివాడూ కాదు! తేరగా వొస్తే ఎలా వొదులుకుంటాడూ?” అన్నాడు నాన్న. 

తప్పు అని తెలిసీ కొందరు ఎందుకు అలా తప్పు పన్లు చేస్తారో!

బండి-ఎద్దు-గూడు-చక్రం — బొమ్మలో ఏది ఎక్కడ ఎలా వెయ్యాలో తెలీని తికమకలో కుటుంబరావు దొడ్డ రెండెడ్ల గూడుబండి గ్యాపకం వొచ్చి, అందులో పడిపోయి – ఏఁవిటేఁవిటో ఆలోచిస్తున్నా. నా బొమ్మని వొదిలేసి!

గేటు చప్పుడయింది. నాన్నే!

గేటు తలుపులు బార్లా తీసి “రా! జాగ్రత్త. గేటు స్తంభాలకి తగలకండా తోలుకురా!” అన్నాడు. 

గడ్డి బండీ! గడ్డి బండి అయితేనేం, బండి బండే కదా! దీనికి గూడు ఉండదనుకో. గడ్డే ఎత్తుగా వేసి ఉంటుంది. అంతేగా తేడా! భలే, దీన్నే అంటారు – రొట్టి విరిగి నేతిలో పడ్డాదని!

లేచి నిల్చున్నా. గబుక్కున నా గోడ గుర్రం ఎక్కి స్తంభం పట్టుకుని నిల్చున్నా. గడ్డి కింద ఉన్న చక్రాన్ని, దాని ముందున్న ఎద్దునీ చూడ్డానికి. నాన్న వీధీ చీడీ మెట్లవరకూ వచ్చి నన్ను చూడగానే “పడిపోతావ్! అదెక్కి నిల్చున్నావెందుకూ? కూర్చో. నిలబడకు” అన్నాడు. 

“బండి-చక్రం-ఎద్దు!”

“బండి-చక్రం-ఎద్దు ఏవిఁటీ?”

“బొమ్మ!”

బామ్మకీ అర్థం కానట్టే నాన్నకీ అర్థం కాలేదు. బండి వైపు చూస్తూనే మాటాడుతున్నా. బండివాడు ఎడ్లని విప్పేసేడు. అటుపక్కనే ఉన్న కొబ్బరిచెట్టుకి వాటిని కడుతున్నాడు. రెండు ఎడ్లకీ కలిపికట్టిన మొద్దుకర్రని కిందకి వాల్చేసి నిలబెట్టేడు. 

“ధాన్యం కొట్టు తాళంచెవి అమ్మని అడిగి పట్టుకురా” అన్నాడు నాన్న. 

వీధి చీడీ ఎడం పక్క ఓ కొట్టుగది ఉంది. నిజానికి అది ధాన్యం పోసుకునే కొట్టుగదిట. ఆ గదికి ఒక తలుపు, పైకప్పుకి దగ్గరగా ఓ చిన్న కిటికీ ఉన్నాయి. ఒహప్పుడు అందులో ధాన్యం నిండా పోసేవారట. నిచ్చెన వేసుకుని ఆపై కిటికీ లాంటి దాని తలుపు తీసుకుని ధాన్యాన్ని తీసుకునేవారట. తియ్యగా తియ్యగా ధాన్యం తగ్గి కిందకి వొచ్చిన తర్వాత గది తలుపులు తీసుకుని ధాన్యం పట్టుకెళ్ళేవారట. ఇప్పుడు అందులో గడ్డి పెడుతున్నారు. అండం మాత్రం ధాన్యం కొట్టుగది అనే ఇప్పటికీ అంటున్నారు! 

గడ్డి కదా ఉంది! ధాన్యం ఏఁవిటీ? ఎక్కడా? అని అడిగితే అమ్మ ఈ కథంతా చెప్పింది. 

నే గోడగుర్రం దిగకండా అలాగే నిల్చుని బండి వేపే చూస్తూ “నే బండిని చూడాలి” అన్నా. 

“బండి ఎక్కడికీ పోదు. గడ్డి ముట్టెలు కట్టి గదిలో పెట్టద్దూ? తాళంచెవి పట్టుకొచ్చి చూద్దువు గానిలే” అన్నాడు నాన్న. 

“బండీ-చక్రం-ఎద్దు-మొద్దు లావు కర్ర.”

“ఏఁవిటా పొడి పొడి మాటలు?” అన్నాడు నాన్న. 

“నే గీస్తున్న బొమ్మ! నా బొమ్మ!”

అప్పుడు చూసేడు నాన్న జంబుఖానాని, నా డ్రాయింగు సరంజామానీ! డ్రాయింగు పేపరు మీద నే గీసిన పెద్ద సున్నాల చక్రాన్నీ తలకట్టు తీసేసిన పెద్దసైజు ‘గ’నీ. పుస్తకాన్ని తీసి చేత్తో పట్టుకుని చూస్తూ “సున్నాల చక్రం సరే, తర్వాత ఇదేఁవిటీ ఈ సగం సున్నా?” అని అడిగేడు. 

“అది సగం సున్నా కాదు. తలకట్టు తీసేసిన పెద్ద సైజు గ” అని చెపుతూ గుర్రం మీంచి దిగి నాన్న పక్కకి వెళ్ళి నిల్చున్నా. 

“అది ఎందుకూ? ఏఁవిటది?”

“నా బండి గూడుబండీ.”

“ఓహో! అది గూడుబండీనా?”

“ఎద్దుని ఎక్కడ వెయ్యాలీ? గూడుకి తగిల్చి వెయ్యాలా? చక్రానికి తగిల్చి వెయ్యాలా? తెలీలేదు. అందుకే బండిని చూస్తున్నా.”

“తెలిసిందేఁవిటి?”

“తెలిసిందిగా. మొద్దుకర్ర కూడా గియ్యాలి.”

నాన్న నా నెత్తి మీద ఓ మొట్టికాయ పెట్టి, నవ్వుతూ “దేన్ని చూస్తే దాన్ని, చూస్తూ చూస్తూ బొమ్మ గీసేద్దామనే? నన్ను చూస్తూ నా బొమ్మ వేసేస్తావా అయితే?” అని అడిగేడు. 

నాన్నని, నాన్న మొహాన్ని తేరిపారి చూస్తూ “వెయ్యొచ్చును, కానీ…” అంటూ నసిగే. 

“బాబూ! ముట్టెలు కడుతున్నా. గడ్డి గది తలుపు తియ్యండి!” బండివాడు గట్టిగా అరిచినట్టుగా అన్నాడు. 

“ముందు పరిగెట్టుకుని వెళ్ళి గడ్డిగది తాళంచెవి పట్రా. తర్వాత చెపతాను బొమ్మలు వెయ్యడం గురించి.” 

తప్పదుగా ఇంక – ఒక్క పరుగుతో లోపటికి వెళ్ళి అమ్మనడిగి తాళంచెవి పట్టుకొచ్చా. నాన్న జంబుఖానా మీద కూచుని ఉన్నాడు. తాళం తీసి బండివాడు గడ్డి ముట్టెలు కట్టిన కాటికి తెచ్చి గదిలో పడేశాడు. మిగతా గడ్డిని కట్టేంతవరకూ ముట్టెలు తెచ్చేంతవరకూ ఇక్కడే ఉండాలి! 

నాన్న పక్కనే చతికిలపడి “చెప్పు మరీ! చెప్తానన్నావుగా” నాన్న చెయ్యి ఊపే. 

“నాయుడూ! మరీ చిన్న ముట్టెలు కడుతున్నావ్! కాస్త పెద్ద సైజులో కట్టు. ముట్టె విప్పి రాలిస్తే నాలుగంటే నాలుగు గడ్డిపరకలు పడితే ఎలా?” 

“పెద్దసైజు కడితే అమ్మగారు క్రితం సారి కోప్పడ్డారండీ. నానేదో తొందరగా ఎల్లిపోవాలని అనా పెద్దవి కట్టేస్తున్నావన్నారు.”

“సరి సర్లే. చిన్నా కాదు పెద్దా కాదు. మధ్యస్తంగా ఉండాలి మరి.”

నాన్న గడ్డి బండివాడితో మాటాడుతూ ఉంటే నేను నాన్న చేతిని ఊపుతూ “నా బొమ్మ గురించి చెప్తానన్నావు. చెప్పూ!” అని అడుగుతూనే ఉన్నా. 

“రేపు డ్రాయింగు మాస్టారి దగ్గరికి తీసికెళ్తా. రోజూ వెళ్ళి ఆయన దగ్గర ముందు మొదటి పాఠాలు నేర్చుకో. ఇలా చూసిన వాటినన్నిటినీ వెయ్యడం ఎలాగో తర్వాత వస్తుంది.”

“మరి నిన్ను వెయ్యాలంటే? బామ్మని వెయ్యాలంటే?”

“నన్ను వెయ్యాలనుకో. నన్ను కదలకుండా ఏదో ఓ పక్క చూస్తూ కూచోమని నన్ను చూస్తూ వెయ్యాలి. అలా వెయ్యడాన్ని మోడల్‍ని కూచోపెట్టి వెయ్యడం అంటారు. మొదటి పాఠాల బొమ్మలు బాగా వెయ్యడం వచ్చేక చెట్టు, ఆవు, ఎద్దు, పిల్లా పిచిక, ముష్ఠివాడు, సన్నేసి – ఇలా అన్నిటినీ అందరినీ చూస్తూ క్రేయాన్‍తో వేస్తూ ఉండాలి. అలా వేసేవాటిని స్కెచ్‍లు అంటారు.

జంబుఖానా, నీ డ్రాయింగు సరంజామా పట్టుకుని లోపలకి పద. బండివాడికి డబ్బులిచ్చి నేనూ వస్తాను. భోంచేద్దాం” అన్నాడు నాన్న.