కొత్త కుట్టు టీచరు వచ్చింది. పేరు మార్గరెట్టుట!
నల్లగా, పొట్టిగా, తెల్లచీరలో. ఎంత నెమ్మదో! హాజరు పిలిచిందా – ఒక్కొక్క పేరూ తాపీగా అంటూ బుర్రెత్తి నిల్చున్న పిల్లను చూస్తూ.
ఎప్పటి అలవాటు లాగే మొదటిపిల్ల సైరను గొంతుతో ‘ప్రెజెంట్ టీచర్’ అన్నాదో లేదో “ఎందుకంత గొంతుకూ? నాలా చిన్నగొంతుతో చెపితే చాలు. ఇక్కడ ఎవరికన్నా చెవుడుందా?” మేం మొహమొహాలు చూసుకుని నోటితో చెప్పకండా అరచేతిని తిప్పి చూపెట్టేం. “అలా ఉండాలి. ఎందుకూ గోలా కబుర్లూనూ?” అంది.
తను తెచ్చిన చిన్న అట్టపెట్టె లోంచి ఓ గుడ్డ, సూదీ తెల్లదారం తీసి “మీరూ మీరు తెచ్చుకున్న రంగు గుడ్డ తియ్యండి. ఆ తెల్లదారాన్ని సూదిలోకి ఎక్కించుకోండి” అంది. మాటాడకుండా బుర్రలొంచుకుని తెల్లదారాన్ని తీసి సూదిలోకి ఎక్కించుకున్నాం.
డిబ్బీకుట్టు ఆ గుడ్డని మడత పెట్టి కుట్టి చూపించింది. రంగు గుడ్డ మీద డిబ్బీకుట్టు ఒకదానిలోకి ఒకటి వెళ్తూ వరసగా రావాలి!
రెండోరోజుకి మా పెద్దక్లాసు పిల్లలు ఆవిడకి కొందరు చీఁవ అని, ఇంకొందరు మార్గరెట్టు – సిగరెట్టు అని పేరు పెట్టీసేరు.
రెండు మూడు కుట్టు క్లాసులయాక ఆవిడ ఎంత మంచావిడో మాకు తెలిసిపోయింది. భయం పోయింది. ఆవిడ కుడుతూ చూపెడుతూ ఉంటే ఆవిడ కుర్చీ చేతులు పట్టుకుని వేళ్ళాడుతూ కొందరఁవూ, కొందరఁవు ఆవిడ వెనకాతల కుర్చీ పట్టుకునీ, బల్ల చుట్టూ బల్ల మీద చేతులు పెట్టి ఆవిడ వేపు ఒంగిపోయీ కుట్టుపని నేర్చుకోడం మొదలెట్టేం.
ఇంతకుముందున్న ఎమిలీ టీచరంటే హడిలి చచ్చేవాళ్ళం. ఒక్కళ్ళకీ ఒక్క కుట్టన్నా వొస్తే ఒట్టు. అదేంటో పెద్దక్లాసు పిల్లలకి ఆవిడంటే భయం ఉండేదే కాదు. పయిగా ఆవిడంటే చచ్చేటంత ఇష్టపడేవాళ్ళు. మేఁవే ఆవిడకి పేరు పెట్టేం, ఎమిలీ – కొంకిరి బింకిరి అని.
పెద్దపిల్లలు మార్గరెట్టు టీచరుకు పేరు పెట్టేరా, వాళ్ళతో దెబ్బలాటకి దిగేం, మంచివాళ్ళకి పేర్లు పెట్టకూడదంటూ! ‘మరోసారి చీఁవనీ సిగరెట్టనీ అన్నారో పెద్ద మేడమ్ టీచరుకు చెప్పేస్తాం! జాగ్రత్త! ఏఁవనుకుంటున్నారో, ఆఁ’ అని కూడా అనేసరికి చిన్నపిల్లలవేఁనా మేఁవు అంత పనీ చేసేస్తామని వాళ్ళు మరి మా ఎదట ఎప్పుడూ అనేవారు కాదు. వాళ్ళలో వాళ్ళు అనుకునేవారేమో తెలీదు.
వంకర టింకరలు లేకుండా డిబ్బీ కుట్టు మిషీను మీద కుట్టినట్టు అందరఁవూ ఇంటిదగ్గర కూడా వచ్చేదాకా వందసార్లు కుట్టు నేర్చేసుకున్నాం! మాకే ఆశ్చర్యం! టీచరు ‘అద్భుతం’ అనేసరికి ఆ పొగడ్తకి ఉబ్బితబ్బిబ్బయిపోయాం!
ఈవేళ బళ్ళోంచి రాగానే “అమ్మా మార్గరెట్టుగారు రేపు మనింటికి వస్తారు” అని సంబరంగా చెప్పే.
“మార్గరెట్టు ఎవరే?” బామ్మ అడిగింది.
“మా కుట్టు టీచరు. మడత విసనకర్ర నేర్పిస్తారట. జపాను అమ్మాయి పట్టుకుని విసురుకుంటూ ఉన్న బొమ్మ చూపెట్టి చెప్పేరు. దానికి పచ్చటి తాటేకు మువ్వులోది కావాలిట! మీరు తెచ్చుకోగలరా అని అడిగేరు. ‘ఓ, నే తెచ్చుకోగల్ను’ అని చెప్పేసరికి ‘మరి పిల్లలందరికీ కావాలే’ అన్నారు.
“మా అప్పలసామి గుడిసె దగ్గర తాటిచెట్లున్నాయి. తెచ్చుకోవచ్చు!
“ముదురాకులు పనికిరావు!”
“మీరు మాయింటికి రండి. నే మిమ్మల్ని అప్పలసామి గుడిసె దగ్గరికి తీసుకెళ్తా, అన్నా. టీచరూ పిల్లలంతా మనింటికి వొస్తారు. అందరం కలిసి అప్పలసామి గుడిసె దగ్గరికి వెళ్తాం. అందరికీ సరిపోయేటట్టు అప్పలసామి తాటేకు మువ్వాకులు కొట్టి ఇస్తాడు” అని చెప్పే.
“అప్పలసామి ఇల్లు దాసన్నపేట కొసాన ఎక్కడో! అంతదూరం వెళ్తారా?”
“రథయాత్రకు వెళ్ళడం లేదూ? నడిచి. అక్కణ్ణుంచి ఎంతో దూరం లేదట వాళ్ళ గుడిసె.”
“భోగట్టా అంతా కనుక్కునే ఉందే! తారు పుయ్యడానికి పన్లోకి ఎక్కకుండా వాణ్ణి తన ప్రశ్నలతో చంపింది కదా.”
“ఏదన్నా తెలుసుకుంటే ఎప్పుడో ఒహప్పుడు పనికి వొస్తుంది – అని నాన్న చెప్తూ ఉంటాడుగా!”
“ఆ మార్గరెట్టుగారిని లోపలికి తీసుకురా. కాఫీవో పాలో ఆవిడ ఏం తీసుకుంటానంటే అది ఇద్దాం. మీ పిల్లలందరినీ సావిట్లో కూచోపెట్టు. మురీలు తిని జేబుల్లో వేసుకు వెళ్దురు గాని” అంది అమ్మ.
మార్గరెట్టు టీచరు మొహమాటపడుతూ మొహమాటపడుతూ లోపలికి వొచ్చేరు. అతి బలవంతాన పాలు తాగేరు. ఆవిడ నెమ్మదితనం, మాటతీరు, మనిషీ అన్నీ అమ్మకీ బామ్మకీ నచ్చేయి. తర్వాత తెగమెచ్చుకున్నారు. ఆవిడ దగ్గర నెమ్మదితనాన్ని, గట్టిగా అరుస్తున్నట్టు మాటాడకండా మాటలాడ్డాన్ని నేర్చుకోవాలి. మేఁవు పిల్లలం నేర్చుకుంటున్నాంగా!
మమ్మల్ని చూసి అప్పలసామి గాభరా పడుతూ, హడావిడి పడుతూ టీచరు కోసం బల్ల వేసి తుడిచి ‘కూచోండమ్మా’ అన్నాడు. పెళ్ళాం, పిల్లలూ కూడా గుడిసె లోంచి బయటికి వచ్చి ఆవిడకు దణ్ణాలు పెట్టేరు.
తన దగ్గరికి పిల్లల్ని పిలిచి “బళ్ళోకెళ్తున్నారా? ఏం చదువుతున్నారూ?” అని అడిగేరు.
“మాకు సదుగులెందుకు తల్లీ?” అప్పలసామి జవాబు చెప్పేడు.
“అందరి పిల్లలూ చదువుకోవాలి. బళ్ళోకి పంపు.” టీచరు చెప్పేరు “మీరు ఎలాగూ చదువుకోలేదు. మీ పిల్లలన్నా చదువుకోవాలి.”
మేఁవు మా టీచరు బల్ల చుట్టూ గుంపుగా ఉండడం చూసి “ఒలే, నోపట్నుంచీ బరకాం తెచ్చి ఇనా ఈ పక్కగా పరువు. ఈ పిల్లపాపలు కూకుంటారు” అని అప్పలసామి పెళ్ళానికి చెప్పేడు.
పేడనీళ్ళు జల్లి నున్నగా చేసిన గుడెసె ముందు జాగా గచ్చు చేసినట్టే ఉంది.
“పిల్లలూ, మీరు వరసగా ఒకళ్ళ తర్వాత ఒకరు రెండు మూడు వరసల్లో కూచోండి. చూడండి ఇంటి ముందు గచ్చులా ఎలా శుభ్రంగా చేసింది ఈవిడ!” అని మాకు చెప్తూ అప్పలసామి పెళ్ళాన్ని మెచ్చుకున్నారు.
ఆవిడ సిగ్గు పడుతున్నా సంబరం మొహం నిండా! టీచరుకు మరోసారి దణ్ణం పెడుతూ, ‘బరకాం పరుస్తా. మా వోకిలి ఎంత బావున్నా దూలీ దుమ్మూ ఉంటాది’ అని బరకాం తెచ్చి పరిచింది. మేఁవు దాని మీదకు గెంతుకుంటూ వెళ్ళి వరసల్లో కూచున్నాం.
“అప్పలసామీ! చెప్పేనుగా వొచ్చి పచ్చి తాటేకును చూస్తాననీ. ఇప్పుడు మాకు పచ్చితాటేకు పసుప్పచ్చటి లేత ఆకులు కావాలి. మాకు మడత విసనకర్ర చేయడం టీచరుగారు నేర్పుతామన్నారు!’ చెప్పే.
“అనాగా! అనాగే. నాను కొట్టి సూపెడతా.”
తాటేకు మువ్వు పసుపుపచ్చని ఆకులు గోనెసంచీలో వేసి “అమ్మగోరూ, దీన్ని మీ ఎనకాలే పట్టుకొస్తా” అంటూ సంచీని భుజానికెత్తుకున్నాడు.
“అప్పలసామీ, నీకు సంతకం పెట్టడానికి కూడా అక్షరమ్ముక్క రాదు. నీ పిల్లల్ని బళ్ళోకి పంపు. వాళ్ళూ నీలా నిశానీలు కాకూడదు.” టీచరు అప్పలసామికి మరోసారి చెప్పి బయల్దేరడానికి లేచేరు. మేఁవూ లేచి మా జేబుల్లో ఇంకా ఉన్న మురీలని ఆ పిల్లల చేతిల్లో పోసి, ఇద్దరేసి నిల్చుని వరుసలు కట్టి బయల్దేరేం.
అందమయిన మడత విసనకర్రలు చెయ్యడం నేర్చేసుకున్నాం. గుడ్డలతో బంతులు చేసి ఎర్రదారంతో బంతి మీద చుట్టూరా సూది మీద దారం వేసే కుట్టుతో అందమయిన బంతుల్ని చేసేం. కొందరు నీలం దారంతో, కొందరు ఆకుపచ్చ దారంతో చేసేరు. మార్గరెట్టు టీచరు వొచ్చేక ఎన్ని రకాల కుట్టుపనులు నేర్చేసుకుంటున్నామో! మాకే ఆశ్చర్యం వేసింది. బడి యానివర్సరీ నాడు మా అందరికీ ఎన్నెన్ని ప్రయిజులు వచ్చేయో! నాకు ఓ అద్దం, సబ్బుబిళ్ళతో సబ్బుపెట్టె, తాడాట తాడు ఆకుపచ్చ చేతిపిడులతో ఉన్నది ఇచ్చేరు!
పెద్ద మేడమ్‍గారు, వచ్చిన పెద్ద పెద్దవాళ్ళూ మా తరగతినీ మార్గరెట్టు టీచరునీ ఎంత మెచ్చుకున్నారో! మేఁవు చేసిన వాటిని పెద్ద మేడమ్ గదిలో అద్దాల బీరువాలో పెట్టేరు. ఆ అరమీద ‘5వ తరగతి పిల్లల చేతిపనులు అత్యుత్తమం’ అని రాసి ఆ కాయితాన్ని అంటించారు! ఆ ఉత్సవం చూడ్డానికి వచ్చిన ఓ పెద్దాయన రంగుదారాలూ చిన్నా పెద్దా సూదులూ ఉన్నా అట్టపెట్టె నాకు ప్రత్యేక బహుమతిగా ఇచ్చేరు!
ఇవాళ నా గోడగుర్రం మీద కూచుని మొత్తం ఈ తరగతిలో నేర్చుకున్నవి, జరిగినవీ తలుచుకుంటే గిరగిరా రోజులన్నీ కళ్ళముందు కనబడుతూ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూంటే, నే నవుల్తున్న కోవెలగారెల కరకరలు తప్పట్లు కొడుతున్నాయి. ఆకాశం వెనక్కి ఎక్కడికో వెళ్ళిపోతున్నప్పటి వెలుగులు – తెల్లతెల్లటి మబ్బులు!
గిర్రున చక్రం తిరిగి చకచకా ఏడాది ఎక్కడికో వెళ్ళిపోయి ఎండాకాలం వొచ్చేసింది!
5వ తరగతి పిల్లలందరఁవూ 6వ తరగతికి వొచ్చేస్తావోచ్చి! హాయి! హాయి!
నాగమణి ఎలా ఉందో? అది పాసయి 6వ తరగతికి వచ్చిందో లేదో? దానికి ఉత్తరం రాయాలి ఈ ఏడాది ముచ్చట్లన్నిటినీను. అది ఉంటే దానికీ, వెర్రిమొద్దు పాపం, ప్రయిజులు వచ్చి ఉండేవి. మంచి టీచర్లున్నారో లేదో అక్కడ!
ఈ సాయంకాలం ఎప్పట్లా నా గోడగుర్రం మీద కూచుని ఆకాశాన్ని చూస్తూ ఉంటే ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు రాత్రయిందో తెలియే తెలీలేదు. ఇన్ని రోజులూ ఆకాశాన్ని అసలు పట్టించుకోలేదే, గోడగుర్రం మీద అసలు కూర్చోనే లేదే నేను! అనిపించింది.
ఒక్కో తరగతి మెట్టూ ఎక్కుతూ ఉంటే బుద్ధి పెరుగుతూంటుంది. మొగ్గ పువ్వు అవ్వడానికి ఒక్కొక్క రేకూ విడుతుందే అలాగ్గా బుద్ధి రేకు విడుతుందన్న మాట! 5వ తరగతి అంటే 5 రేకులు విడాయన్న మాట!
ఇంకా ఎంత పెద్దదాన్నవాలో!
బుర్ర తక్కువదాన్లా ఆలోచిస్తున్నా. ఎన్నేళ్ళోచ్చినా అలా అలా బుద్ధి పెరుగుతూనే ఉంటుంది. నేర్చుకోవల్సినవి ఉంటూనే ఉంటాయి. వెయ్యి రేకులు కన్నా ఎక్కువ ఉన్న పేద్ద పువ్వు విడుతూ విడుతూ విడుతూ ఉంటూనే ఉంటుంది!
అవునూ, పువ్వుకీ పురుగు పట్టేస్తుంది. అలాంటి పువ్వు వాడిపోయి రాలిపోతుంది. ఈ ఊహ రాగానే పురుగు పట్టిన పువ్వులూ పురుగు కొరికేసిన పువ్వుల రేకులూ కనబడ్డం మొదలెట్టేయి. అమ్మబాబోయి! అలా అవకండా చూసుకోవాలిరా దేవుడా!
ఏం మందులు కొట్టాలీ? మామ్మూలుగా మొక్కలకి చీడపడితే పొగాకు నానబెట్టిన నీళ్ళు బామ్మ జల్లుతుంది. బుద్ధికి చీడపడితే?
నాన్నని అడగాలి. ఇంక ఊహ సాగటం లేదు. ఆలోచనా రాటం లేదు. తెలిసిన బుద్ధితో ఆలోచనలు సాగుతాయి. ఊహలో?
బుర్రొంచుకుని కళ్ళు మూసుకుని ఆలోచనల్లో ఊహల్లో మునిగిపోయినదాన్ని కళ్ళు తెరిచి బుర్రెత్తి చూశా.
చీకటి పడిపోయిందే! నాన్నింకా రాలేదే!
అమ్మో బామ్మో గదమాయించకండా పదమ్మా లోపలికి అని నాకు నేను చెప్పుకు ఇంట్లోకెళ్ళడానికి లేచా!