ఊహల ఊట 16

క్రిష్టాష్టమి అంటూ అమ్మా బామ్మా ఆ రోజున ఎప్పుడూ ఏ పూజా ప్రత్యేకించి చెయ్యే చెయ్యరు! ఈ సారి ఆవిడ ఒచ్చేరు. ఆవిడతోపాటు క్రిష్టాష్టమి మా ఇంటికి ఒచ్చేసింది!

నే బుద్ధి ఎరిగేక ఆవిడ రావడం ఇదే మొదటిసారి. ఆవిడ ఒచ్చేరని తెల్సి బుచ్చిమావయ్య క్రిష్టాష్టమికి ఒచ్చీసేడు. ఆయన క్రిష్టభక్తుడట!

ఆవిడ వెళ్ళిపోయినా క్రిష్టుడు మాత్రం మా ఇంట్లో ఉండిపోయాడు. ఆ పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. ఆవిడ వెళ్ళిపోయిందా – అయినా ఇంటిల్లిపాదీ ఇంకేదీ మాట్టాడ్డం లేదు. ఆవిడ మాటలే! ఆవిడ పాటలే! ఆవిడ గురించే.

‘ఎంత కళైన మొహమో ఆవిడది!’ తనలో తను అనుకోడం కాదు, అందరితోనూ పదే పదే అంటోంది అమ్మ.

“కళ మొహానికి వెలుగునిస్తుంది” అన్నాడు బుచ్చిమావయ్య.

“మొహానికే కాదురా బుచ్చీ! మీరు చూసేరో లేదో కాని ఆ తేజస్సు దేవుడి తల చుట్టూ ఉన్నట్టు గుండ్రంగా ఆవిడ పాడుతున్నప్పుడు ఆవిడ తల చుట్టూ వలయం కట్టి ఉంది” అని బుచ్చిమావయ్యతో అన్నాది బామ్మ.

దాన్ని ఇంగ్లీషులో హేలో అంటారని చెప్పేడు నాన్న.

నా గోడగుర్రం మీద కూచున్నానా – నా చెవుల్లోనూ ఆవిడ పాటలే రింగురింగుమంటూ గింగుర్లు పెడుతున్నాయి.

మొన్న సాయంత్రం బళ్ళోంచి ఇంటికొచ్చేసరికి అమ్మా బామ్మా హడావిడి హడావిడిగా ఉన్నారు. హాల్లో ఉయ్యాలా తీసీసేరు. తెల్ల అంచుల ఆకుపచ్చ తివాసీని పరచడానికి ముత్తమ్మ సాయం చేస్తోంది.

“తివాసీ చాలని చోట జంబుఖానాలు పరుద్దాం” అన్నాది బామ్మ.

“ఏవి? ఎర్రగీతలవా?” అడిగింది ముత్తమ్మ.

“అవేనే! భోషాణం పెట్టె మీదున్నాయి. పట్టుకురా!”

ఒక్కొక్కసారి నాన్న స్నేహితులందరూ కలిసి మా హాల్లో సభ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. పై ఊరు నుంచి ఏ గొప్ప పండితుడో ఏ పద్యాలు రాసిన కవో వస్తే మా హాలైతే బాగుంటుంది, వీలుగా అందరికీ అందువిడిగా ఉంటుందంటారు.

ఎవరు వొస్తున్నారో? పద్యాలకవిగారా? పండితులా?

“ఆ దుమ్ముకాళ్ళతో తివాసీ మీదకు రాకు” అరిచింది అమ్మ.

“ఈసారి రాత్రివేళ మీటింగా? ఎవరొస్తున్నారూ?” గుమ్మం అవతల నుంచి అడిగే.

“జ్ఞానాంబగారు వొస్తున్నారు. రేపు కృష్ణాష్టమికి!” అన్నాది బామ్మ.

“క్రిష్టాష్టమేవిఁటీ? ఆవిడెవరూ?”

“రేపు చూస్తావుగా!”

“వేసిన ప్రశ్నలు చాలు. వెళ్ళు, ముందు కాళ్ళు కడుక్కురా. పాలిస్తాను. తాగి పేలపుండలో రెండు పట్టుకు ఫో నీ గుర్రం మీదకి. మా పన్లకు అడ్డురాకు” అన్నాది అమ్మ.

జ్ఞానాంబ!

ఆవిడ పేరూ బాగుంది. ఆవిడా బాగున్నారు.

“మేఁవమ్మా ఎంత చక్కటివాళ్ళమో అని మిడిసిపడే వాళ్ళని ఎంతమందిని చూట్టం లేదూ? వాళ్ళ మిడిసిపాటు తగలడా! ఈవిణ్ణి చూడండి, ఎక్కడైనా రవ్వంతైనా టెక్కుందేమో!” మాణిక్యాంబగారు ఒహటే మెచ్చుకోడం!

బామ్మ అందరికీ కబురు పెట్టీసింది. అమ్మబాబోయి! ఎంతెంతమంది ఒచ్చేరో! హాలు కిక్కిరిసిపోయి ఈ గుమ్మం అవతలా ఆ గుమ్మం అవతలా కూడా కూచున్నారు! ఆనోటా ఈ నోటా తెలుసుకుని కూడా ఒచ్చీసేరు. ముత్తమ్మా గూడెం వాళ్ళూ ముందే హాజరైపోయారు. నాన్న స్నేహితులూ ఒచ్చేరు!

ఆ పాటలన్నీ నాకు కొత్తవే. ఇదివరకెప్పుడూ ఎవరూ పాడగా విన్లేదు. బాప్‍రే బాప్! ఆవిడకి ఎన్ని పాటలు కంఠతా వొచ్చో! అన్నిటికి అన్నీ క్రిష్టుడి మీదే!

కొందరైతే ఎదురుగా పుస్తకం లేందే పాడలేరు. ముక్కలు జ్ఞాపకం లేవమ్మా పుస్తకం తెచ్చుకోలేదు అంటారు. అందరికందరం ఆవిడకి కళ్ళప్పగించి పాటల లయకి తలలూపుతూ తొడమీద చేత్తో తాళం వేస్తూ విన్నాం. పెద్దవాళ్ళు వేసే తాళం చూస్తూ తప్పుగా కొట్టకుండా మజ్జ మజ్జ ఆగిపోతూ నేనూ తాళాన్ని పట్టుకోడానికి తంటాలు పడుతూ మరీ విన్నా.

కొందరు పాటలైతే బాగా పాడతారు కానీ పాడుతున్నప్పుడు వాళ్ళ మొహాన్నీ వాళ్ళనీ చూడలేం! కళ్ళు మూసుకుని వినాల్సిందే. బోలెడు కష్టపడిపోతూ, అప్పడాలపిండి అయిపోతూ, తాళం వెయ్యడానికి చెయ్యి ఇంతెత్తు ఎత్తుతూ ఏవిఁటో – చూడ్లేం బాబూ! పాట దానంతటది నోట జారిపోతున్నట్టు, అందులో పూర్తిగా మునిగిపోయి అతి తేలిగ్గా పాడుతూ ఉంటే ఆ పాట పాడేవాళ్ళకి కళ్ళూ చెవులూ రెండూ అప్పగించేస్తాం.

ముందైతే అమ్మ పక్కనే కూచుందాం అనుకున్నా. అమ్మో! ఏఁవడిగినా చూపుడువేలు పెదిమల మీద పెట్టి ‘మాటాడకూడదనీ’ చెవి దగ్గర డొప్పలా అరచెయ్యి పెట్టి ’విను’ అనీ సైగలే చేస్తుంది. తెలీనిది దేనినీ అడగనియ్యదు. నిజఁవే, మాటాడకూడదు. నాకూ తెల్సు. మరెలా?

ఆమధ్య బొమ్మల కథలపుస్తకం కోసం వెళ్తే మావయ్యగారు ఆ పుస్తకాలతోపాటు ఓ పుస్తకం ఇచ్చేడు. ‘దీంట్లో రోజూ నువ్వు తెలుసుకున్నవీ, అనుకున్నవీ, చేసినవీ, నీ ఊహలూ ఆలోచనలూ అన్నీ రాసుకుంటూ ఉండు!’ అని నాపేరు తనే మొదటి పేజీలో రాసిపెట్టేడు. నున్నటి పాలమీగడ లాంటి తెల్లటి కాయితాల పుస్తకం మజ్జ మజ్జ రంగు రంగు పిట్టల బొమ్మలతో భలే బావుంది. ఆ పుస్తకఁవూ పెన్నూ తెచ్చుక్కూచున్నా నాన్న పక్కని.

పాలరాతితో చేసిన బాల క్రిష్టుణ్ణీ శృతిపెట్టినీ జ్ఞానాంబగారు తనతో పాటే తెచ్చుకున్నారు. ఆ క్రిష్టుడికి నమస్కరించి శ్రుతిపెట్టితో పాడ్డం మొదలు పెట్టేరు.

కృష్ణం కలయసఖి సుందరం
బాల కృష్ణం కలయసఖి సుందరం

నాన్నకి పుస్తకం ఇచ్చే. పాట వింటూనే నారాయణ తీర్థులవారి తరంగాలు అని రాసిపెట్టేడు.

ఆవిడ ఒక తరంగం తర్వాత మరో తరంగం వరస్సాగా పాడేరు. తరంగం మొదటి మాటను పుస్తకంలో రాసుకుంటూనే ఉన్నా. పాట వింటూనే ఉన్నా.

ఆలోకయే బాలకృష్ణం సఖి
శరణం భవ కరుణామయ

అన్నిటికన్నా నాకు, బ్రూహిముకుందేతి హే రసనే పాహి ముకుందేతి – ఎందుకోమరి ఎక్కువగా నచ్చింది.

తరంగాల తరవాత అష్టపదులు జయదేవుడివి.

సావిరహే తవదీనా రాధా
లలిత లవంగ లతాపరిశీలన కోమలమలయసమీరే
చందనచర్చిత నీల కలేబర

సూరదాస్ పదాలు, మీరా పాటలు – ఓహో, వరసగా అన్నిటికి అన్నీ ఆవిడ పాడుతూ ఉంటే ఎంత బావున్నాయో! అన్నీ బావున్నా నాకు మరీ మరీ బాగుంది మధురాష్టకం.

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతే రఖిలం మధురం

దీన్ని వల్లభాచార్యులవారు రచించారట.

జయదేవుడి పాటల్లోని మాటలూ మధురాష్టకంలోని మాటలూ ఎంతో కమ్మగా ఉంటాయి. మాటా పాటా రెండూ చెవికి ఇంపుగా ఉండాలన్న మాట – అని నాన్న నా పుస్తకంలో రాసేడు.

క్రిష్టుడికి మోహన్‍భోగ్ నైవేద్యం పెట్టేక ప్రసాదాన్ని అరిటాకు ముక్కల్లో అందరూ తిని జ్ఞానాంబగారికి ప్రణామాలు చేసి వెళ్ళేరు. ఆవిడ దగ్గరికి వెళ్ళి కూచున్నా.

“నేనో పాట పాడతా. వింటారా అండీ?”

“నీకు పాడ్డం వొచ్చా? చెప్పేవు కావేం? ఎందుకు విననూ?” అంటూ శ్రుతిపెట్టి దగ్గరికి లాక్కున్నారు. “ఏ పాట? ఎవరిది?” అని అడిగేరు.

“శృతి నాకు వొద్దండీ. ఎవరిదో కాదు. నేను ఇప్పుడిప్పుడే ఆ పాటను కట్టే. మనసులో మనసులో” అన్నా.

“పాటలు రాస్తావా? కడతావా? భేష్! భేష్! వినిపించు మరి.”

“నవ్వకండేం మరి? ఏఁవీ అనకండేం మరి?”

“నవ్వొస్తే నవ్వుతారే! ముందరే నవ్వొద్దని షరతులు పెడుతున్నావూ?” అన్నాది మాణిక్యాంబగారు. ఈవిణ్ణీ బుచ్చిమావయ్యనీ ఆ మర్నాడు వెళ్ళొచ్చు ఉండమని వాళ్ళు వెళ్తామన్నా వెళ్ళనియ్యలేదు బామ్మ.

“ఎందుకంటే మరి మీమీదే కట్టే పాట! అందుకనీ!”

“నామీదే? పాటే? కట్టేవా? ఇప్పటికిప్పుడే?” అన్నాదావిడ కళ్ళనిండా ఆశ్చర్యంతో.

బామ్మకి ఏం అనిపించిందో ఏమో దాంతో “చాల్లే, నువ్వూ నీ పాటలు కట్టడాలు…” అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉంటే – “పాడమ్మా, ఏం పాట ఎలా కట్టేవో వింటాం అందరఁవూనూ” అన్నాదావిడ.

కొండమావయ్య మీద పాట కట్టినట్టూ ఈవిడ మీద ఏం కట్టేనో అని బామ్మ భయపడిపోయినట్టుంది. నే పాడ్డానికి గొంతు సవరించుకుంటూ ఉంటే అందరూ నవ్వుతూ నావేపు చూసేరు. ‘ఉఉహు, ఉఉహు, ఉఉహు’ అంటూన్న నన్ను చూస్తూ నవ్వొచ్చింది కాబోలు!

మీ పాట మధురం మీ మాట మధురం
మీ రూపు మధురం మీ చూపు మధురం
మీరే మీరే మధురం మధురం
జ్ఞానాంబారఖిలం మధురం
మధురమే మధురం మధురాతిమధురం
ఇతి కుంతల విరచిత జ్ఞానాంబాష్టకం సంపూర్ణం

కళ్ళు తిప్పుతూ చేతులు ఆడిస్తూ పాడి సంపూర్ణం అని దీర్ఘం తీసే.

బుచ్చిమావయ్య “ఓహోహో! అమ్మాయిగారు వాళ్ళ నాన్న రాసింది పాడేసి తనే పాట కట్టానని చెప్పేసుకుంటోంది!” అనేసరికి నాకు మా చెడ్డకోపం ఒచ్చింది.

“నాన్న రాస్తే నాన్నే పాడతాడు! నేనెందుకు పాడతాను? అది నాదెలా అవుతుందీ? మావయ్య ఎలా అంటున్నాడో చూడు నాన్నా!” అని నాన్న వేపు చూశా. మధురాష్టకం పాట నాన్న చేత రాయించుకున్నా. అంతే.

“నే రాయలేదు. దానికలవాటే పాటలా ఏదో ఒకటి ఇలా కట్టడం” అన్నాడు నాన్న.

“విన్నారాండీ?” అని ఆవిణ్ణి అడిగే.

“మా కొండడి మీదా అప్పటికప్పుడు పాట కట్టి వాడి భుజం ఎక్కి కూచుని మరీ పాడింది!” అని బామ్మా చెప్పింది.

నావేపూ, మావాళ్ళవేపూ ఓ వింత చూస్తున్నట్టు చూసిందావిడ!

మాణిక్యాంబగారు చప్పట్లు కొడుతూ “బాగా కట్టేవే, బాగా పాడేవే!” అంటూ దూరం నుంచే నా మొహం చుట్టూ తన చేతుల్ని తిప్పి నుదుటి రెండువేపులా వేళ్ళు ముడిచి మెటికలు విరిచేరు.

“కృష్ణాష్టమికి ఎన్నెన్నో చోట్ల పాటలు పాడుతున్నా కాని నా మీద ఇలా పాటకట్టి పాడింది నువ్వే! ఎంత మంచి బహుమానం ఇచ్చేవో” అంటూ ఆవిడ నా బుగ్గలు రెండు అరచేతుల్తో పట్టుకుని నా నుదురుని ముద్దు పెట్టుకున్నారు.

“సరే, నేనొకటి అడుగుతా. ఏఁవీ అనుకోకూడదు.”

“అడగండి. ఎందుకనుకుంటానూ? నాలాగే మీరూ ముందు జాగ్రత్తగా షరతు పెడ్తున్నారు!” అంటూ నవ్వే.

“ఇది పెంకి గుంటండీ జ్ఞానాంబగారూ” అన్నాది బామ్మ.

“ఇందులో పెంకితనం ఏవుందండీ భద్రంగారూ. తను అడిగినట్టే నేనూ అడిగేను అంటోంది. అంతే కద.

“మరే కుంతలా. జ్ఞానాంబాష్టకం అని పాడేవు కదా. అష్ట అంటే అర్థం తెలుసా?”

“నాకెందుకు తెలీదూ? అష్ట అంటే ఎనిమిది. ఇవాళ క్రిష్టాష్టమి. అందుకే మీరు క్రిష్టుడి పాటలు పాడేరు. తిథుల పేర్లు అంకెలతోనే కదా. పంచమి ఐదు, షష్టి ఆరు, సప్తమి ఏడు, అష్టమి ఎనిమిదీ! అష్టాచెమ్మా గవ్వలతో ఎండాకాలంలో అమ్మావాళ్ళతో ఆడతాగా! అష్టా అంటే ఎనిమిదీ చెమ్మా అంటే నాలుగునూ!”

“అబ్బో! భలే బోధపరిచేవే! అష్ట ఎక్కడెక్కడ నీకు తెలుసో కూడా చెప్పేవే!”

“ఓమాట తెలిసిందనుకోండి. దాని అర్థం తెలుసుకునేదాకా నాకు ఉండబుద్ధి పుట్టదు. ఆ మాట ఎక్కడ విన్నానూ, ఎక్కడ ఎవరు ఎందుకు ఎలా అన్నారూ, పాఠాల్లో ఎక్కడ వొచ్చిందీ అన్నీ వరస్సాగా నాకు జ్ఞాపకం వొచ్చేస్తాయి.”

“అలాగా?”

“లింకులండీ. అన్నిటికి అన్నీ లింకులే!”

“మరి నువ్వు అష్టకం కట్టేవా?”

అందరూ నావేపు చిరునవ్వులతో నేనేం చెప్తానో అని చూస్తూ తలలూపుతున్నారు. ఠక్కని నా తప్పు నాకు తెలిసిపోయింది.

“అవునవును. ఒకటే కట్టి అష్టకం అనేసే! మరో ఏడు రాయాలి” అన్నా.

“అయితే ఇప్పటికిప్పుడు ఏడూ కట్టేసి పాడి వినిపించేస్తావా?”

“ఊహూఁ! అంత పొడుగ్గా ఎప్పుడూ కట్టలేదు. ఆలోచించుకోవాలి మాటలను – నా గోడగుర్రం మీద కూచుని!”

“గోడగుర్రమా?” అని నవ్వి “మీ మనవరాలికి రోజూ దిష్టి తీస్తూ ఉండండి” అని బామ్మకు చెప్పిందావిడ.

“అరె! మీరూ దిష్టి తియ్యాలంటున్నారే! దిష్టి నిజంగా తగుల్తుందాండీ? ఎవరికి ఎందుకు తగుల్తుందీ?”

“ఈపిల్ల ఎంత తెలివైనదో అని చూస్తారు కదా! ఆ చూపుతో దిష్టి తగులుతుంది!”

“అయితే మీకూ దిష్టి తియ్యాలి. బామ్మా! బామ్మా! నువ్వు పెద్దా జ్ఞానాంబగారికన్నా? ఆవిడకి దిష్టి తియ్యి. నాకళ్ళూ దిష్టి కళ్ళే! ఎంత బాగున్నారో ఎంత బాగా పాడుతున్నారో అని కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నా!”

“నువ్వే కాదు. అందరూ కళ్ళప్పగించి చూస్తూనే బాగా పాడుతున్నారనుకున్నాం. దాన్ని మెచ్చుకోడం అంటారు” అన్నాడు నాన్న.

“మరి నాకెందుకూ దిష్టి తీయడఁవూ? మీరంతా ఓ సారి తెలివైన పిల్ల అంటారు. మరోసారి దద్దమ్మ అంటారు. ఇంతకీ నేను దద్దమ్మనా? తెలివైనదాన్నా? దద్దమ్మకీ దిష్టి తగుల్తుందా?”

జ్ఞానాంబగారు ఆవలించారు, నోటి దగ్గర చిటికె వేస్తూ. మాణిక్యాంబగారికీ ఆవలింతొచ్చింది.

“దీని మాటలకీ ప్రశ్నలకీ అంతూ పొంతూ ఉండదు. పొద్దున్నే లేవాలి కూడా. మీకు పక్కలు వేయించి ఉంచాను. పదండి పడుకుందురు గాని.” అమ్మ అందర్నీ లేవదీసింది.

మర్నాడు పొద్దున్న ఆవిడ వెళ్ళబోయేముందు చీరా-రవికలగుడ్డా పువ్వులూ-పళ్ళూ పసుపూ-కుంకంతో తాంబూలంలో వెయ్యినూటపదహార్లు పెట్టి అమ్మ చేత ఇప్పించేరు.

“నేనూ మీతో వొచ్చేస్తా! మీ దగ్గర పాటలన్నీ నేర్చుకోవాలి” అన్నా. అందరూ మొహమొహాలు చూసుకున్నారు.

“నేను మీరు చెప్పినట్టే వింటా. అల్లరి చెయ్యను. నన్ను తీసుకెళ్ళరా?” అంటూ ఉంటే “ఇది మీ మోహంలో పడిపోయిందండీ!” అన్నాది బామ్మ.

“నాకన్నా గొప్ప విద్వాంసులు మీ ఊళ్ళోనే ఉన్నారు. వాళ్ళ దగ్గర నేనెంత! చక్కగా వాళ్ళదగ్గర సంగీతం చెప్పించండి అమ్మాయికి” అన్నాదావిడ.

“వాళ్ళు ఎవరో నాకు నచ్చొద్దూ, మీరు నచ్చినట్టు?”

“ఎందుకు నచ్చరూ? గురువులు ఎప్పుడూ నచ్చుతారు.”

“లేదండీ! అందరూ నాకు నచ్చరు. మా బళ్ళో టీచర్లలో ఒకే ఒక్క టీచరుగారే నాకు నచ్చినావిడ. మిగతావాళ్ళూ చెపతారు లేండి పాఠాలు!

“నాన్నా! నువ్వు చెప్పవా? ఆవిడకి నన్ను తీసుకెళ్ళమనీ.”

“మీ బామ్మనీ అమ్మనీ వదిలి, అందర్నీ వదిలి ఉందామనే? నీకోసం వాళ్ళు బెంగ పెట్టుకోరూ?” అన్నారు మాణిక్యాంబగారు.

“మేం కాదు. అదే బెంగపెట్టుకుంటుంది. ఒక్కరోజు నాన్న ఊర్నించి రావడం ఆలీసం అయితే నాన్న రాలేదే రాలేదే అని ఒకటే గొడవ పడుతుంది!” అన్నాది అమ్మ.

“నేనేం బెంగెట్టుకోను. పాటలు నేర్చుకుని ఒచ్చేస్తా!” ఏడ్పుస్వరంతో అన్నా.

జ్ఞానాంబగారు నా వీపు చుట్టూ చెయ్యి వేసి “మళ్ళా వొస్తాగా! అప్పుడు మీ ఇంట్లో చాలా రోజులుండిపోతాలే. నీకన్ని పాటలూ నేర్పించేస్తా, ఏం?!” బుజ్జగిస్తూ నా నుదుటిమీద ముద్దు పెట్టి బండెక్కి వెళ్ళిపోయేరు.

ఇల్లు బావురుమంది ఆ పాటలు హోరెత్తుతున్నా! అమ్మా బామ్మా ముత్తమ్మా ఆవిడ గురించి అలా మాటాడుకుంటూనే ఉన్నారు.

“అంత విద్య వచ్చినా ఎంత మామ్మూలుగా ఉన్నాదో! ఆ వేలుముడీ, గుండ్రంగా పెట్టుకున్న ఆ పెద్ద కుంకంబొట్టూ, మెళ్ళో శంఖాల తావళం, ఏడురాళ్ళ తెల్లదుద్దులూ, చేతులకు గాజు గాజులూ, ఎర్ర అంచుల తెల్లచీరా – ఎంత సాదాసీదాగా ఉన్నాదో!”

“నగానట్రా ఎందుకే? విద్యే వెయ్యి ఆభరణాలు! అన్నీ ఉన్నవాళ్ళు వినయంగానే ఉంటారు. ఏఁవీ లేనివాళ్ళే ఎగిరెగిరి పడతారు!”

“అమ్మా! ఆవిడకి పిల్లా పాపా కలగలేదా?” అడిగింది ముత్తమ్మ.

“పిల్లా పాపా కూడా ఎక్కడా? పెళ్ళయి కాపురానికొచ్చిందా – ముద్దూ మురిపెం ముచ్చటా ఏదీ తీరకండానే ఓ రోజు ఆ మొగుడు చెప్పాపెట్టాకండా ఎటో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో ఎక్కడికి వెళ్ళేడో ఏమయ్యాడో ఉన్నాడో లేడో తెలీదు. లేడని తెలిసేవరకూ పునిస్త్రీవే!”

“అయ్యోపాపం! పుట్టింట్లోనే ఉండిపోయిందా ఆ తల్లి?” బాధపడుతూ అన్నాది ముత్తమ్మ.

“అత్తారు చాలా మంచివాళ్ళే! అత్తారింట్లోనే ఉంది.”

“కృష్ణభక్తిలో పడిపోయిందన్నమాట అందుకనే!” అన్నాది అమ్మ.

“నీకిది తెల్సా? ఆ మొగుడి పేరు కృష్ణారావట!”

“ఎవరి బతుకు ఎలా వెళ్ళాలో నుదుటిని రాసే పుట్టిస్తాడు ఆ దేవుడు!”

“సంసారజీవితం లేకపోతేనేం? మంచిపేరు తెచ్చుకుని పదిమందికి ఆనందాన్ని పంచుతోంది!”

“అందరికీ వొస్తుందా ఆ అదృష్టం! పూర్వజన్మ సుకృతం సంగీత విద్వాంసురాలయింది.”

వాళ్ళ మాటలు కొన్ని బోధపడీ కొన్ని బోధపడకపోయినా ఆవిడ గురించి నాకూ కొంత కొంత తెలిసింది.

ఈవేళ ఎప్పటిలాగానే సాయింత్రం గోడగుర్రం ఎక్కి కూచున్నా. మురీలు, చిన్న ఉల్లిపాయచెక్కు మీద కొంచెం నిమ్మరసం పిండి కలిపి ఇచ్చింది అమ్మ.

కాయితం గరాటా పట్టుక్కూచున్నా కాని దానిమీద ధ్యాస పోటంలేదు. నోట్లో వేసుకున్నా ఓ సారి అంతే! గుర్రం పక్కనే వీధిమెట్టు మీద పెట్టేసే.

ఆవిడ మీద కట్టిన నా పాటని ఎలా అంత పొడుగ్గా చెయ్యడమో? ఏకంగా ఒకటి కాదు రెండు కాదు. ఏడింటిని రాయాలి. ఊహించుకుని మాటలతో పాటలా కట్టాలి. రెండో దానికే ఏ ఊహా రాటల్లేదు. ఏ మాటలూ తోచటం లేదు. అమ్మో! ఎంత కష్టమో!

ఆ వల్లభాచార్యులుగారు రాసినట్టూ రాయాలంటే ఎన్నెన్నో మాటలు రావాలి. సరిపోయేవి – ఒక్కలా ఉండేవి – పాటలా పాడ్డానికి.

‘పూర్వజన్మ సుకృతం వల్ల వస్తాయి. ఆవిడ పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంది!’ బామ్మా వాళ్ళూ అంటున్నారుగా. నే పూర్వజన్మలో పుణ్యం ఏదీ చెయ్యలేదా? చేశానా? ఎలా తెలుస్తుందీ? ఆ వల్లభాచార్యులుగారూ పూర్వజన్మలో ఏదో మంచి పని చేశారా? అలా చేస్తేగానీ సంగీతం రాదా? రాయడం రాదా? ఇప్పుడు రావాలంటే అప్పుడెప్పుడో ఏదో చెయ్యాలా?

ఎవర్నడిగితే చెపతారూ? ఎవరికీ తెలీదు కదా! వాళ్ళగురించే వాళ్ళకు తెలీదుట! నా గురించి ఏం చెపతారూ? జ్ఞానాంబగారినే అడగాల్సింది. ఆవిడ పేరే జ్ఞానం. ఆవిడకి తెలియకండా ఉంటుందా?

మరి నేనూ సరదా సరదాగా పాటలు కడుతున్నానుగా – పొట్టివే అనుకో – అవి పాటలు కావా? చిన్నపిల్లనని ఉత్తుత్తిదే మెచ్చుకుంటున్నారా?

ఇంతకీ చచ్చిపోయి మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతామా? నిజఁవేనా?

‘జన్మజన్మల ఋణానుబంధమమ్మా!’ అంటూ ఉంటుంది బామ్మ.

అన్నీ ప్రశ్నలే! ఎవరికీ జవాబు తెలియదు కాబోలు! ఖచ్చితంగా ఏదీ చెప్పరు.

నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయనుకున్నా. అమ్మో! ఎన్నెన్ని నేర్చుకోవలసినవి ఉన్నాయో! ఎన్నెన్ని కనిపెట్టాల్సినవి ఉన్నాయో! అన్నీ అన్నీ చేసేస్తా అనుకున్నా. అలా ఏం లాభం లేదన్నమాట. నుదుటిని రాసి ఉంటేనే వస్తాయన్న మాట!

అయోమయంగా ఉంది. ఎట్నించి ఎటు కొట్టుకుపోతున్నానో తెలీటం లేదు.

“ఏంటలా తల వాలేసి కూచున్నావ్? మురీలు తిన్లేదే?

“ఇదిగో సంగీతం మాస్టారు. హార్మోనియం కూడా తెచ్చేరు. పద పద ఇంట్లోకి!” అన్న నాన్న మాటకి తలెత్తా.

“నాకు సంగీతం రాదేమో నాన్నా!”

“అదేఁవీ? ఎవరన్నారలాగ?”

“పూర్వజన్మలోనేఁ మంచిపనులు చేసేనో లేదోనని!”

సంగీతం మాస్టారూ నాన్నా గట్టిగా నవ్వేరు.

“నీకు రాకపోడం ఏఁవిటీ? కిందటి జన్మలో మంచిపనులు చేసినా చెయ్యకపోయినా నీకు సంగీతం నేర్పేవాణ్ణి నేనూ! సాధన చేస్తే నువ్వు సాధించలేనిదేదీ ఉండదు!” అన్నారు మాస్టారు.

“పిచ్చిపిచ్చి ఊహలు పెట్టుకోకు” అన్నాడు నాన్న.