ఉగాది పండగన్నా నాకు ఇష్టమే. ఉగాది పచ్చడి వేపపువ్వు చేదే అయినా అన్నిరకాల రుచులతో బాగుంటుంది నా నోటికి. ఎంచక్కా కొత్తబట్టలు కట్టుకోవచ్చు. ప్రతి పండక్కీ కొత్త బట్టలు కొండం తప్పదు. ఎంచేతా అంటే ఉత్తప్పుడు ఎప్పుడూ కొనరు. ప్రతి పండక్కీ ఓ జత కుట్టిస్తే చాలు. పెద్దవాళ్ళూ అలాగే పండగలకే కొనుక్కుంటారు. అందరిళ్ళల్లోనూ అంతే. ఎక్కువ బట్టలు ఏమీ అయిపోవు. అలా అని తక్కువా కావు. ఏడాదికి సరిపడా వస్తాయి. అయినా మన పండగలు వరస్సాగా వస్తూనే ఉంటాయి. ఉగాది మొదలు దసరాలు, దీపావళి, పుట్టింరోజులు – ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మా ఇంట్లో దేశభక్తి ఎక్కువ కదా అంచేత జెండా పండగ అదే స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15నో, రిపబ్లిక్ డే జనవరి 26నో కొంటారు. ఏదో ఓ రోజే! రెండు రోజులూ కాదు. అంచేత బట్టలు దండిగా ఉన్నట్టే అవుతుంది, చిరుగు పట్టకుండా. అవును మరి. వాటి సాలి వంతు వచ్చేటప్పటికి సంవత్సర కాలం పట్టేస్తుంది మరి.
వేపపువ్వు కోసం మార్కెట్టుకి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. మా ఇంటికి దగ్గర్లోనే వేపచెట్టు ఉంది. దాన్నిండా పువ్వు పూసి తెల్లటి చిన్న చిన్న పూలతో చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అందరూ ఉగాదినాడు కోసేస్తే బోడిగా అయిపోయి బావురుమని ఏడుస్తుంది ఆ చెట్టు అనిపిస్తుంది నాకు! మనం తిండానికి ఎన్ని చెట్లనూ మొక్కలనూ ఏడిపిస్తుంటామో కదా! ఇలా అని నేను అన్నాననుకో అందరూ నవ్వుతారు. మరీ దీనివి సోద్యం కబుర్లు అంటారు. వాళ్ళు నవ్వడమే కాదు ఇంటికి వచ్చిన చుట్టపక్కాలకీ చెప్పి నవ్వించి నన్ను ఏడిపిస్తారు. ఒక్కరంటే ఒక్కరు అవును నిజమే అనరు. అదేదో చెట్లనీ మొక్కలనీ బావురుమని ఏడిపించడం తమ జన్మహక్కన్నట్టు. ఎవరు ఇచ్చారు మనకు ఈ జన్మహక్కు?
పాపం, చెట్లకీ మొక్కలకీ నోరు లేకపోబట్టి, ఒకే చోట పాతుకుపోయి ఉంటాయి కాబట్టి, పరిగెట్టి మరో చోటుకు పారిపోలేవు కాబట్టీను. అయితే ఒకటిలే, అవి ఎక్కడికి వెళ్ళినా రాక్షసుల్లాంటి మనుషులం మనమే ఉంటాం కదా! అక్కడా వాటిని బతకనిస్తూ చంపేస్తూ ఉంటాం కదా! అవి ముసలివై పడిపోతే వాటి సంతానాన్ని పీడించడం లేతమొక్కలప్పటినుంచీ మొదలెట్టేస్తాం! మనుషులంత దుష్టులు, కర్కోటకులు భూప్రపంచంలో ఎవరూ ఉండరు. మళ్ళా మానవత్వం అంటూ కబుర్లు చెపుతూ తమ మానవత్వానికి మురిసిపోతూ గర్వపడుతూ ఉంటారు. మరి వృక్షత్వం వృక్షాలకూ ఉండదా? అవీ మురిసిపోయి గర్వపడవా?
ఇలాంటి ఆలోచనలు నాకే వస్తాయా? ఇంకెవరికీ రావేమిటో! వాళ్ళవి మట్టిబుర్రలో అసలు పనే చెయ్యవో! వాళ్ళకి వైద్యం చేయించాలి. మెదళ్ళని వైద్యం చేస్తే స్పెషలిస్టు డాక్టరు దగ్గరికి తీసుకువెళ్ళాలి. అసలు ఇదో సమస్య అని ఆ స్పెషలిస్టు డాక్టరు అనుకుంటాడా? అతగాడు వీళ్ళ కోవకు చెందినవాడే అవుతాడేమో! నేను వీళ్ళ కూడా వెళ్ళి ‘అయ్యా డాక్టరుగారూ దీనికండీ మీరు వైద్యం చేయవలసినదీ – మీకు తెలిసిన జబ్బేనా అండీ ఇది? దీనికి అసలు ట్రీట్‌మెంటు ఉందా అండీ? మందు ఏదైనా కనిపెట్టారా అండీ రష్యా లోనో, అమెరికా లోనో, చైనా లోనో? మనదేశంలో మటుకు ఏ చరకుడూ కనిపెట్టలేదు లెండి. ఆ సంగతి నాకు తెల్సు. చేసేడంటే, అన్నీ మా దేశంలోనే ఉన్నాయి. ఇక్కణ్ణుంచి పైదేశాల వాళ్ళు దొంగలించి పట్టుకుపోయారు, దాని పేటెంటు మాదే అని చంకలు గుద్దుకుంటున్నారు. మన ప్రభుత్వం ఏం చెయ్యలేని సన్నాసి ప్రభుత్వం. చూస్తూ ఊరుకుంది. కొంతమంది ఆందోళన, అదే ఉద్యమం లేవనెత్తేరూ, అది రాజకీయం అని పేరు పెట్టి ఇంకో పార్టీవాళ్ళు ఇంకో ఉద్యమం లేవదీసేరూ, ఇదండీ మా తీరు’ అని నాలాంటి వాళ్ళు నెత్తి మొత్తుకుంటున్నారా? మనల్ని చూసి మనం దేనికి గర్వపడాలో దేనికి తల వంచుకోవాలో కూడా తెలియని దద్దమ్మలం. మొద్దు బుర్రలం, వెధవాయిలం. గురజాడ ఎంత సరిగ్గా మన గురించి గిరీశం నోట చెప్పించాడు! మహానుభావుడు మన గురించిన సత్యాన్ని మనకు చెప్పి వెళ్ళిపోయాడు. సత్యం తెలిసినంత మాత్రాన మారిపోతామా? అబ్బే, అది జరగని పని. శాశ్వత సత్యాల్లా శాశ్వత వెధవాయితనం అన్నమాట! మారదు కాక మారదు. మనం మనగానే ఉంటాం. అందులో మరి ఏ తిరకాసూ లేదు.
అరే! ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వచ్చేనూ? ఉగాది పండగ లోంచి ఇలా ఇలా ప్రయాణించానా? నా ఆలోచన చైత్రమాసంలోనూ శీతాకాలపు చిక్కుడులా తీగ సాగుతోంది!
అన్నట్టు ఉగాది అంటే మరలాంటి మాట ఎలా పుట్టిందీ అన్న ఆలోచన వచ్చింది. ఉగానికి ఆది. ఆది అంటే మొదలు కదా. మరి ఉగా ఏఁవిటీ? ఉగా కాదు, యుగా కాస్తా ఉగా అయిపోయింది. మాటలు భలే మారిపోతూ ఉంటాయి. యుగానికి ఆది యుగాది. య కాస్తా ఉ అయిపోయి ఉగాది అయికూచుంది.
నేను ఓ చిన్నదాన్ని, మరీ పిసరంత దాన్ని చిలవలూ పలవలూ చేర్చి పొడుగ్గా చేస్తానట! మొన్న మా ఇంటికి ఒచ్చిన మా మేనత్త కొడుకు చెప్పేడు. అందర్నీ అంటే మా ఇంటిల్లిపాదినీ నవ్వించేడు.
వాడు నాకు బావ అవుతాడు కదూ. ఏదో ఒకటి వెక్కిరించకుండా వాడి నోరు ఊరుకోదు. నామీద ఓ అక్క అంటూ ఏడవబట్టి నన్ను పెళ్ళి చేసుకోడు. బతికిపోయా. లేపోతే ఏముందీ మా మేనత్తా మా బామ్మా నన్నే వాడికి కట్టబెట్టేస్తారు. పై సంబంధాలు ఎందుకూ? మనలో మనం చేసుకోవాలి గాని. పైవాడికెవరికో ఇచ్చి తర్వాత ఏదన్నా అయితే బాధపడ్డం, అని ఉపన్యాసాలు ఇస్తారు. వీళ్ళు మా ఘటికులు! దేవుడే వీళ్ళనుంచి తప్పించాలి మరి.
మళ్ళా ఎటో పోతున్నానా? అలాగే ఉంది. ఏవిటో మాట లోంచి మాట, ఆలోచన లోంచి ఆలోచనా అలా అలా వచ్చేస్తూ ఉంటాయి ఊటలా. ఊహల ఊట దాన్ని అని నాకు పేరు కూడా పెట్టేశారు. అదో ముద్ర పడిపోయింది నాకు. మంచో చెడో పేరు వచ్చేసిందీ అంటే అది చెరపబడదు! నేనున్నన్నాళ్ళే కాదు నేను వెళ్ళిపోయాక భావితరాలవాళ్ళు కూడా నన్ను ఊహల ఊటది అనే జ్ఞాపకం ఉంచుకుంటారు.
పిల్లలు పరీక్షల్లో ఒక మార్కు ప్రశ్నకు జవాబుగా రైటు టిక్కు పెడతారు ఏ సందేహం లేకుండా, ఏ పక్క పిల్లదో కాపీ కొట్టక్కర్లేకండా. ఏ ఇన్విజిలేటరునూ పుసలాయించకుండా. వాళ్ళే రాసిపారేస్తారు. ఆ ఒక్క మార్కూ ఇంటూగా వస్తుంది. ఒక్క మార్కు అనుకుంటాం కాని ఆ ఒక్క మార్కూ రాకపోతే ఫస్టుక్లాసు మరొకరికి వెళ్ళిపోతుంది! అయ్యో, ఒక్క మార్కులో పోయిందే అని బాధపడ్డం అందరికీ చెప్పుకోడం. ఇంట్లోవాళ్ళు మా దానికి ఒక్కమార్కులో ఫస్టుక్లాసు పోయిందండీ అని చెప్పుకోడం. ఓహో! అదోటి మొదలవుతుంది. ఉగాదిలా ఒక్క మార్కాది అంటే సరి. అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఆపండి మీ నవ్వాది. ఉగాది అనొచ్చు కాని ఒక్క మార్కాది అంటే నవ్వుతారేం? బాగుందే తల్లీ, నువ్వూ నీ ఆదీనూ. ఆది జాకట్టుని అలా కలపలేవు కదా అంటూ మళ్ళా నవ్వేరు. ఆ ఆది వేరు ఈ ఆది వేరు. ఆమాత్రం తెలీదా నాకు? మీరు నవ్వడానికి దాన్ని దీనికి పోటీగా తెచ్చిపెట్టేరు. నవ్వుకోండి నవ్వుకోండి. నవ్వే నాపచేనే పండుతుంది. నాకేం మీ నవ్వులు తగలవు లేండి అన్నాను నేను. ఉడుక్కుంది ఉడుక్కుంది ఉడుకుబోతు పిల్ల. ఇప్పుడు ఏం అల్లుతావు మళ్ళా అని వాళ్ళూ ఓ జోడింపు మాటని తగిలించి నావేపు వెక్కిరింపు కళ్ళతో చూసేరు.
మీకో జోత తల్లుల్లారా! తండ్రుల్లారా! నన్ను నా ఊహల ఊటను రాసుకోనివ్వండి. అది రాసేక, ఈమాటలో వచ్చేక మీ ఇష్టం. మీరు ఏమన్నా సరే వెక్కిరించండి. నవ్వండి. ఇదేం ఊట అని ఎందులోంచో ఎందులోకో వెళ్ళిపోతుంది అని ఒకరితో ఒకరు చెప్పుకుని ఇంక చదవం అనుకోండి. నాకేం బాధ లేదు. ఒకసారి లోకం లోకి నా రాత వెళ్ళిపోయాక అది మీదే. నాది కాదు. అంచేత మీరేమనుకున్నా నేను పట్టించుకోను. ఇప్పుడు మాత్రం నన్ను ఒదిలేయండి. మళ్ళీ పెడుతున్నా జోత!
అవునూ, నేనెక్కడ వరకూ వచ్చేనూ? ఎక్కడ – ఎక్కడ – వీళ్ళు అడ్డు తగలనప్పుడు – ఊహూఁ, జ్ఞాపకం రాటంలేదు. ఏంటో ఒక్కొక్కసారి ఠక్కని జ్ఞాపకం వస్తుంది. ఒక్కొక్కసారి ఎంత జ్ఞాపకం చేసుకున్నా రాదు. ఇంకేవేవో మాటలు ఆ మాట గుర్తు రాకండా వీళ్ళు అడ్డు తగిలినట్టే అడ్డు తగులుతాయి.
ఏఁవిటో ఖర్మ! నేనూ ఏ స్పెషలిస్టు డాక్టరు దగ్గరికి పోయి నా బుర్రని పరీషించి మందు ఇమ్మనాలో ఏఁవిటో! అసలే నాకు ఆస్పత్రులన్నా డాక్టర్లన్నా చచ్చేటంత భయం. ఒక రోగానికి వెళ్తే పది రోగాలు వచ్చేటట్టు చేస్తారు. అసలు ఆస్పత్రిలో అడుగు పెడితే చాలు, అక్కడున్న గాలి పీలిస్తే చాలు, వంద రోగాల్ని వొంటికి ఎక్కించుకొని ఇంటికి వస్తాం. కూఁ, కూఁ, కూఁ – పెరటి చెట్లమీంచి ఏ చెట్టు మధ్యనుంచో కోకిల కూఁ, కూఁ అంటోంది! ఓహో, జ్ఞాపకం వచ్చేసింది. ఉగాది గురించి! ఈ కోకిల జ్ఞాపకం వచ్చేటట్టు చేసింది. ధన్యవాదాలు నీకు కోకిలమ్మా! కోకిలమ్మ అంటే బాగుంటుందా? కోయిలమ్మా అంటే బాగుంటుందా? కూనలమ్మా అని ఆరుద్ర పదాలు రాసేడు కదా! కోకిలమ్మా అంటేనే బాగున్నట్టు ఉంది! ఈ సారి నేను కోకిలమ్మ పదాలు రాస్తాను. ఆరుద్రను మెడ్డాయించేయాలి. అతన్ని తోసిరాజని నా కోకిలమ్మ పదాలనే ఎక్కువమంది చదవాలి. మెచ్చుకోవాలి. నేననుకున్నానంటే చెయ్యకండా రాయకండా ఉండను. ఉడుంపట్టులదాన్ని. సాధించేటంతవరకూ ఊరుకోను! నిద్రపోను! అదే కదా మన స్వభావం! మన అంటే అందరిదీ కాదు. నన్ను నేను గౌరవ సూచకంగా ‘మన’ అంటున్నాను. అనుకుంటున్నాను. రాయల్ ఉయ్ అన్నమాట.
ఈ నెలలో ఉగాదే కాదు, హోళీ పండగ కూడా వస్తుంది. వసంతాగమనం! వసంతోత్సవం! రంగుల పండగ హోళీ. దక్షిణాదిని బుక్కాగుండ ఒకరి మీద ఒకరు చిన్నా పెద్దా ఆడా మగా తేడా లేకండా జల్లుకుంటారు. అది దులుపుకుంటే రాలిపోతుంది. కడుక్కుంటే ఇట్టే పోతుంది. రాధాకృష్ణులు ఆడుకున్నారట! ఉత్తరాదివారు హోళీని రంగురంగుల నీళ్ళని పిచికారీతో ఒకరి మీద ఒకరు కొట్టుకుని ఆడుకుంటారు. అక్కడా ఆడా మగా తేడా లేకండా. కృష్ణుడూ రాధా పిచికారీలతోనే ఆడేవారట! ఈ రంగులు ఒకంతటికి వదలవు. బట్టలు పాడైపోయి ఎన్ని ఉతుకులు చాకలికి వేసినా ఆ బట్టలు ఆ రంగులతోనే ఉంటాయి. చిరిగిపోయినా బట్టలు అలాగే రంగుల మచ్చలతోనే ఉంటాయి. అందుకే తెల్ల చొక్కాలు, తెల్ల చీరలూ అస్సలు కట్టుకోకూడదు. పండగ కదా అని వేసుకున్న కొత్తబట్టల్ని విప్పేసి ఏ పాత చీరనో, పాత చొక్కానో వేసుకొని రంగుల ఆట ఆడుకోవాలి. వార్నీసు రంగుల్లాంటి రంగులు కూడా వాడేస్తున్నారు ఇప్పుడు! అదేం సరదావో! ఎరుపూ నీలం ఆకుపచ్చా చాలవు కాబోలు. ఆ జిగజిగ మెరిసే సిమెంటు రంగు వార్నీసు రంగంటే ఎందుకు ఇష్టమో!
నాకు ఈ పండగంటే సరదా లేదు కదా అసహ్యం కూడానూ. అందుకే ఇంట్లో మా ముసలమ్మ కూచుని జపం చేసుకునే మూల చీకటిగది లోకి వెళ్ళి మధ్యాహ్నం ఒంటిగంటా రెండు గంటల వరకూ ఆకలి వేస్తున్నా సమయం దాటేంతవరకూ అక్కడే కూచుంటాను. ఓసారి ఆకలి వేస్తోందని కాస్త ముందు బయటకి వచ్చేనో లేదో ఓ గుంపు వచ్చి పడింది. రంగులతో ముంచెత్తి తలమీంచీ పోసేసి నవ్వుకుంటూ వెళ్ళింది! అలా రంగులు పోసేసేక సరే ఏం చేస్తాం అనుకుని స్నానం చేస్తూ ఉంటే మరో గుంపు వచ్చింది. స్నానాలగది లోంచి మరో పొడి బట్టలు కట్టుకుని వచ్చేటంతవరకూ ఒకటే గోల! బయటకి రాక తప్పలేదు. మళ్ళా వీళ్ళూ నెత్తి మీంచీ పోసేసి నువ్వు ఎక్కడ దాక్కున్నా పట్టుకు లాక్కొస్తాం. నువ్వే బుద్ధిగా మాతో రంగులు ఆడ్డానికి మా గుంపుతో రా. పిచికారీ మేం ఇస్తాంలే అని ఓ పిల్ల అన్నాది. పిల్లా పెద్దల్లో ముసలమ్మలూ ఉన్నారు. వాళ్ళ సరదా మండా! చచ్చేకాలం వచ్చినా సరదాలు చావలేదు వాళ్ళకి! వయసులో ఉన్న పిల్లవి – ఓ సరదా లేదూ ఏమీ లేదు. ఇదెక్కడ పిల్లవి! అని ఆశ్చర్యపోతారు.
ఎక్కడికి పారిపోవడం? చివరికి ఓ ఉపాయం కనిపెట్టే. హోళీకి రెండు రోజుల ముందే నా దగ్గరి స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఊరికి వెళ్ళేనని ఇంట్లో చెప్పమనేదాన్ని. స్నేహితురాలూ రంగులు ఆడుతుంది. అయితే నా సంగతి తెలుసు కాబట్టి నన్ను బలవంతపెట్టదు. వాళ్ళింట్లో నేను ఉన్నట్టు ఎవరికీ తెలియనియ్యదు. దొంగదానిలా అలా దాక్కుంటాను. వాళ్ళాయన ఆ మర్నాడు పొద్దున్నే నేను బయల్దేరబోతే ఆగండి. ఇంకా బయల్దేరకండి. బాగా పొద్దేక్కేక వెళ్ళండి అన్నాడు. పెళ్ళవని పిల్లవీ – తప్పుగా అనుకునే ప్రమాదం ఉందనీ ఆయన అలా అంటున్నారు అని స్నేహితురాలు చెప్పేవరకూ నాకు అర్థమే కాలేదు! అంత అమాయకురాలిని నేను! లేదా బుద్ధి పెరగని దాన్ని! చీర కట్టుకోగానే సరా? చీరతోపాటు వయస్సుకు తగ్గట్టు బుద్ధీ పెరగాలిగా! పెరగలేదు నాకు. బోధపరిస్తే గాని తెలియలేదు నాకు!
పండగలంటే ఇష్టమే కాని హోళీ అంటే చికాకు. పండంగల్లో అధమాధమ పండగ ఈ హోళీ! ఎవరు నన్ను ఎన్ని తిట్టినా తిమ్మినా నా అభిప్రాయం మారమన్నా మారదు! అన్ని విషయాల్లో వికసించిన నా బుర్ర ఇలాంటి పండగల విషయంలో వికసించనే వికసించదు.