బళ్ళోంచి వచ్చి పెద్ద గిలాసుడు పాలు తాగి నా గోడగుర్రం ఎక్కి కూచున్నా. ఇవాళ చిరుతిండి ఏదీ లేదు. అందుకే పాలు ఇచ్చింది అమ్మ! జేబులో చెయ్యిపెడితే ఎప్పుడో పెట్టుకున్న బల్లిగుడ్లు చేతిలోకొచ్చేయి.
ఏదో ఓటి నఁవలడవోఁ, చప్పరించడవోఁ అలవాటైపోయింది.
కవిత్వం అల్లడానికి సిగరెట్టుకు సిగరెట్టు ముట్టించి డబ్బాడు సిగరెట్లు ఊదేస్తాడట నాన్న కవి నేస్తుడు. నాన్నావాళ్ళూ మాట్లాడుకుంటూ ఉంటే విన్నా.
సిగరెట్లు కాల్చడమెందుకూ? బల్లిగుడ్లు చప్పరించినా చప్పరించకపోయినా నాకు ఊహలు గుత్తులు గుత్తులుగా తీగగులాబీ పువ్వుల గుత్తుల్లా విడుతూ బుర్రలోంచి పుడుతూనే ఉంటాయి.
ఊహలంటూ ఉంటే అవే నేను ముందంటే నేను ముందంటూ వొంతులుపడుతూ ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఒకదాన్ని పట్టుకునేలోగా రెండోది కాస్తా జారిపోతుంది. మళ్ళీ గుర్తుకి రాదు!
ఏదో ఓటి నఁవలడం, చప్పరించడం నాకు అలవాటు అయినట్టు ఆ కవిత్వం రాసే ఆయనకి సిగరెట్లు ఊదేయడం అలవాటన్నమాట! ఉత్తుత్తిదే కవిత్వం కోసం అని వొంక చూపెడుతున్నాడన్నమాట.
ఇవాళ బామ్మ నోట మరోమాట విన్నా.
‘నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు, వాడు బుర్రకి ఎక్కించుకోడ్రా!’ అని బుచ్చిబాబుగారితో అన్నాది. బుచ్చిబాబుగారు మూడుమేడల వీధిలో చివారి ఇంట్లో ఉంటారు. బామ్మ దగ్గరికి వచ్చే అందరి లాగానే ఈయనా తన గోడు చెప్పుకోడానికి వస్తూ ఉంటాడు.
వాడెవడో బుర్రకి ఎక్కించుకోడట!
బుర్రకి ఎక్కించుకోవాలంటే అటక ఎక్కడానికి నిచ్చెనలాగా ఓ నిచ్చెన ఉండాలి. నా బుర్రకు ఎక్కించడానికి కాస్త ఎత్తు బల్ల అయితే చాలు.
అదే కొండ మావయ్య అయితే – బాబోయి, ఎంత పెద్ద నిచ్చెన తెచ్చుకున్నా చాలదు! కొండ మావయ్య బుర్రని చూడాలంటే మెడ సాగదీసి మనం మన బుర్ర ఎంత ఎత్తినా ఆయన బుర్ర కనపడదు. గెడ్డామే కనపడుతుంది.
సత్రం గోడలకు సున్నాలు వెయ్యడానికి రెండు నిచ్చెనలు కలిపి కట్టుకుంటాడు పాపం అప్పిగాడు.
సత్రం గోడంటే బీదపిల్లలకి ఉత్తిదే భోజనం పెట్టే రాజావారి సింహాచలం సత్రం కాదు. ముందైతే నాకూ తెలీలేదు. అర్థమే కాలేదు.
అప్పిగాడు సున్నాలు వేస్తున్నప్పుడు బామ్మ వాడి వెనకాతలే ఉంటుంది. బట్టీలూ చారలూ లేకుండా చీపురూ చీపురూ కలిపి సున్నం వేస్తున్నాడో లేదో చూడ్డానికి!
ఆవేళ నేనూ సున్నాలు వేస్తున్నప్పుడు బామ్మ వెనకాతలే వెళ్ళే.
“ఇక్కడ నీకేం పనే, సావిట్లోకి ఫో. ఆడుకో” అంది బామ్మ. సత్రం గోడ ఏదో చూడాలిగా, నేనెందుకు వెళ్తానూ?
“సున్నం తుళ్ళి కళ్ళల్లో పడుతుంది. వెళ్ళవే” అని మరోసారి గదమాయించింది. నే కదల్లేదు సరికదా, “సత్రం గోడేదీ?” అని అడిగే.
“అందుకే కదా నిన్ను పొమ్మంటుంది. ఆ ఎత్తు మీంచి తుళ్ళి సున్నం కళ్ళల్లో పడుతుంది.”
అదిగో అప్పుడు తెలిసింది! సత్రం గోడంటే ఏదో. మా ఇంట్లో సింహాచలం సత్రం గోడేవిఁటీ అని కదా అనుకున్నా మొదట!
పెండిబద్దల నుంచి గుమ్మాల మీది గోడ అంచు వరకూ ముక్కోణపు గోడ ఉంటుందే, అదే సత్రం గోడ! అప్పిగాణ్ణి అలా రెండు నిచ్చెనలు గట్టిగా కలిపి కట్టి ఇమ్మనాలి కొండ మామయ్యకి. అప్పుడూ, తన బుర్రలోకి ఏదైనా ఎక్కించవచ్చు!
అప్పుడైనా కొండ మావయ్యని గోడకి చేరబడి నిల్చోమనాలి. గోడకి ఓ పక్క పెద్ద నిచ్చెనని పెట్టి ఒకరు పట్టుకుంటే ఇంకొకరు నిచ్చెన పైమెట్టు మీద వరకూ ఎక్కాలి. బాప్ రే బాప్! సున్నాలు వేసేవాళ్ళకి అలవాటు కాబట్టీ ఎక్కేస్తారు. కాని, మామూలువాళ్ళు కళ్ళు తిరిగి కింద పడతారు. ఎంత ఎత్తో!
అవునూ, బుర్రలోకి ఎక్కించాలంటే బుర్రకు కన్నం ఉండాలిగా! బుర్రకి కన్నం పెట్టాలా? కన్నం పెట్టి ఓ గల్లాలో మాటలు వేసి ఎక్కించాలా? అయ్యబాబోయి, బుర్రకి కన్నం పెడితే ఎంత నొప్పో! ఎంత నొప్పెడుతుందో! నెత్తురే నెత్తురు కారిపోదూ? అయినా మాటలు గట్టిగా ఉంటాయిగా, వాటిని కన్నంలోకి ఎలా పోస్తారూ?
ఛ, ఛ, నేఁనేఁవిటీ ఇలా ఆలోచిస్తున్నానూ! డొంకతోవలో పడిపోయా.
నా తెలివి తెల్లారినట్టే ఉంది.
విన్నపాటలు బామ్మ నోటికి ఎక్కినట్టూ, విన్నమాటలు నా నోటికి ఎక్కినట్టూ, విన్నమాటలు బుర్రకి ఎక్కుతాయన్నమాట! ఎవరూ ఎక్కించనూ అక్కర్లేదు, నిచ్చెనలూ బుర్రలకి కన్నాలూ అక్కర్లేదు.
ఎక్కించడం అన్నమాటతో ఎన్నెన్ని అడ్డదిడ్డపు ఊహలూ ఆలోచనలూ వచ్చేసేయో!
కొండ మావయ్య కొండంత ఎత్తు ఉంటాడు. కొందరు ఒంగిపోయి నడుస్తారా, కొండ మావయ్య నిఠారుగా బుర్రెత్తి నడుస్తాడేమో మరింత ఎత్తుగా కనబడతాడు. రోడ్డు మీంచి వెళ్తూ ఉంటే ఆయన్నే అందరూ చూస్తూ ఉంటారు.
‘ఏరా కొండా!’ అంటుంది బామ్మ.
‘కొండడూ’ అంటుంది అమ్మ.
‘మచ్చకొండా కన్నా ఎత్తూ
మా కొండా మావయ్యా
మా కొండా మావయ్యా’ అని పాడుతూ కొండ మావయ్య కాలి పిక్కలు పట్టుకుని వేళ్ళాడతా.
“తప్పు. అలా పెద్దవాళ్ళ మీద పాటలు పాడకూడదూ!” అంటుంది అమ్మ.
“ఇదికాక ఇంకెవరు నామీద పాటలు కడతారూ? పాడనీ.” పొంగిపోతూ కొండ మావయ్య ఒక చేత్తో నన్ను పైకెత్తి తన భుజం మీద కూచోపెట్టుకుంటాడు.
‘మచ్చకొండ ఎక్కేనోచ్చి
నేమచ్చకొండ ఎక్కేనోచ్చి’ అని తప్పట్లు కొడుతూ పాడతా.
కొండ మావయ్య అయితే తన రెండు చేతులూ పైకెత్తి ఎంచక్కా ఆకాశాన్ని ముట్టుకోవచ్చు. బూరుగుదూది తలగడాని నొక్కితే మెత్తగా లొత్తపడి చెయ్యి లోపలికి వెళ్ళిపోతుందే–అదిగో అల్లాగ్గా ఆకాశానికి లొత్తపడి చెయ్యి లోపలికి వెళ్ళిపోతుంది.
అవును, ఆకాశం మెత్తగా ఉంటుంది. తను నన్ను రెండు చేతుల్తోనూ మీదికి ఎత్తి పట్టుకున్నా ఆకాశం నాకు అందదు.
ఇవాళ వచ్చేడు కొండ మావయ్య. తను రాగానే అదే అడిగే.
‘అహఁహొఁ, ఒహొఁహొఁ’ అని ఆపకండా ఒకటే నవ్వు! ఇంటిల్లిపాదికీ చెప్పి తను నవ్వడం. ఆయనతోపాటు ఇంటిల్లిపాదీ నవ్వడం!
ఇందులో నవ్వడానికేఁవిటి ఉందో!
ఆకాశం మెత్తగానే ఉంటుంది. నిజఁవే. ముట్టుకొని చూస్తేనే కాని మెత్తగా ఉందో, గట్టిగా ఉందో తెలీదు.
నా కంటికి మెత్తగా, చాలా మెత్తగా కనబడుతుంది. కళ్ళకీ మెత్తనో గట్టినో తెలుస్తుంది.
అందరికళ్ళకూ కనపడదా? నాకళ్ళు వేరా?
నాకు తిక్కరేగి “నవ్వుతారేంటీ? మీరు నవ్వుతున్న ఈ నవ్వు నానానవ్వుల్లో ఒహటా?” అని అడిగే.
నానార్థాలు తెలుసుగా నాకు! బోలెడు బోలుడు అర్థాలు!
నానాతో ఎన్నో మాటలు. నానా యాతనలు, నానా అగచాట్లు, నానా కష్టాలు, నానా పుర్రాకులు.
“నానా నవ్వులేంటే?” అంటూ మళ్ళీ గొల్లున నవ్వేరు.
అవునూ, నవ్వు గొల్లుమంటుందా? గొల్లుగొల్లున ఏడ్చేడు అంటారు. గొల్లుగొల్లున నవ్వేడు అనొచ్చా?
మాట లోంచి మాట పుట్టినట్టు ప్రశ్న లోంచి ప్రశ్న పుట్టుకొస్తుంది నాకు.
పకపకా నవ్వడం. బడాలున నవ్వడం, పెంకులెగిరిపోయేట్టు నవ్వడం అంటాం కదా!
వెక్కి వెక్కి ఏడుస్తారు. వెక్కి వెక్కి నవ్వుతారా? కొందరైతే దగ్గుతున్నట్టు నవ్వుతారు.
నానానవ్వు అనకూడదేమో మరి! అందుకే నవ్వుతున్నారా?
ఓ సంస్కృతం మాటా, ఓ తెలుగు మాటా కలపకూడదట! కలిపి అంటే ఏంటిట? చెవికి బాగుంటే ఎందుకు అనకూడదూ? దుష్టసమాసంట!
దుష్టు అంటే – దుష్టుడు. అంటే చెడ్డవాడు. దుష్టసమాసం అంటే చెడ్డ సమాసం.
“నాన్నా, నాన్నా, చెవికి బాగుంటే ఎందుకు కలపకూడదూ?” అని నాన్నను అడిగితే – “నిజఁవే! భేషుగ్గా కలపచ్చు. మాటాడేటప్పుడు, అలా మాటాడేస్తూనే ఉంటారు.”
మాటలు కూడా నేస్తం కడతాయి. పడకపోతే శత్రువులూ అవుతాయి. వైరిసమాసం అంటే శత్రుసమాసం. దోస్తులూ దుష్మన్లూనూ!
నానానవ్వులు అంటే బాగానే ఉందిగా! ఏమో అబ్బా, నా చెవికి బాగుంది!
అయ్యయ్యో, నవ్వుల్లో పడిపోయా. ఎందులోనో అందులో పడిపోతూనే ఉంటా.
ఆకాశమే కాదు, ఆకాశం మీద తెల్లటి మేఘాలు అప్పుడే ఏకిన దూది పింజెల్లా మెత్తగా ఉంటాయి.
దూదేకులసాయిబు వీధి చీడీ మీద డాబా కమ్ముల మధ్యని ఉన్న కొక్కేనికి దూది ఏకే విల్లుని తగిలించుకుని ట్రింగు-ట్రింగు-ట్రింగీ-ఈ-ఈ-మంటూ నారిని కొడుతూ దూదిని లాగుతూ ఉంటే ఏకిన దూది తెల్లగా గుట్టలు గుట్టలుగా పడుతూ ఉంటుంది. సాయిబు పరుపులు కుట్టడానికి దూదేకుతున్నంత సేపూ చీడీ మీదే ఉంటాను.
“తల్లీ, నోపలికి ఎలిపో. దుమ్మూ దూళీ ముక్కుల్లోకి కళ్ళల్లోకి ఎల్తాయి” అంటాడు సాయిబు.
ట్రింగు-ట్రింగు-ట్రింగీ-ఈ-ఈ-మని పలికించే నల్లని గుండ్రని పిడుల మధ్య చేతిని దూర్చి నారిని లాగుతూ కొట్టడాన్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది.
చూసి చూసి అలా ఓ సారి నాకూ కొట్టాలనిపించి “సాయిబుగారూ, సాయిబుగారూ, నేనోసారి ట్రింగు-ట్రింగు-ట్రింగీ-ఈ-ఈ-మనిపిస్తూ లాగి కొడతాను. ఓ సారి నాకివ్వరూ?” అని అడిగే.
సాయిబు నవ్వేసి “దీన్ని నువ్వు ఎత్తలేవు తల్లీ!” అన్నాడు.
ఆకాశం మీదికెక్కి తెల్లటి దూదిపింజెల్లాంటి ఆ మెత్తటి మేఘాల మీద పడుకుంటే ఎంత బాగుంటుందో!
పరుపు గట్టిపడిపోతుంది టాకాలు కుట్టగానే. పింజెలంత మెత్తగా ఉండదుగా! మేఘాలకు టాకాలు ఎవరూ వెయ్యరు, పరుపునీ చెయ్యరు.
అందరితో పాటూ తనూ నవ్వి “ఆకాశం అంటే శూన్యమే. ఏదీ ఉండదక్కడ. మెత్తగా ఉండడమేఁవిటీ?” అంది బామ్మ.
ఏదీ ఉండకపోడమేమిటీ నా తలకాయ!
తెల్లటి మెత్తటి దూదిపింజెల మేఘాలు సరే, రోజూ పొద్దున్నే వొచ్చేసే సూరీడు, చీకటి పడీసరికి వొచ్చేసే నక్షత్రాలు, చందమామ, నల్లగా చిక్కగా పట్టిన మబ్బులు, కిందికి దిగి పడే వాన – అన్నీ అక్కడే కదా ఉన్నాయీ?
వాన పడి వెలిసేక సూరీడి ఎండా వస్తుంది. ఏడురంగుల హరివిల్లూనూ!
ఆ హరివిల్లు మీద అటో కాలూ ఇటో కాలూ వేలాడదీసుకుని కూచోవాలని ఎన్నిసార్లు అనుకున్నానో!
వీళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. నేననేది వీళ్ళకు అర్థం కాదు.
ఆకాశం అంటే శూన్యంట. అంటే అక్కడ ఏదీ ఉండదట. మెత్తగా ఉండదట. అయినా నేను వదల్లేదు వాళ్ళని అడగడం.
“సరే, ఆకాశంలో ఏం లేదు. అయితే ఆకాశం అవతల ఆ తర్వాత ఏముందీ?” అని అడిగే.
“ఆకాశం అవతల ఆ తర్వాత కటిక చీకటి. ఏఁవీఁ కనపడదు” అన్నాడు కొండ మామయ్య.
“కటిక చీకటా? ఏదీ కనపడదా? అంటే మనకు తెలీనిది. వెలుతురు అంటే తెలిసేది. ఓహో. ఇప్పుడు నాకూ తెలిసింది. వెలుతురు ఉంటే, తెలివి ఉంటే అన్నీ తెలుస్తాయి.” అన్నా.
“దీని ప్రశ్నలకు అంతూపొంతూ ఉండదు. దీంతో కూచుంటే మన పనులైనట్టే. పదండి అత్తయ్యా, పనుల్లో పడాలి.” అంటూ లేచింది అమ్మ.
“మరోమాటు వస్తాన్లే బావను చూట్టానికి.” అంటూ కొండ మావయ్యా లేచేడు వెళ్ళిపోతానంటూ.
“ఇప్పుడేం వెళతావురా కొండా. ఇవాళ్టికి ఉండిపో. రాత్రికి బాబు వచ్చేస్తాననే అన్నాడు.” అంది బామ్మ.
“అవును కొండడూ ఉండిపో. బావ మరో క్షణమో, ఘడియో ఎలాగూ వచ్చేస్తారు.” అంది అమ్మ.
“ఊరికి వెళ్ళినవాడు బస్సు దొరికి రావద్దూ?” అంటున్నాడు – తన నోట్లో మాట నోట్లోనే ఉంది. చేతి వేలి కణుతులతో తలుపుకి మొట్టికాయలు పెడుతున్నట్టు ఠక్, ఠక్, ఠక్ అని వీత్తలుపు చప్పుడు వినిపించింది.
“బావే! ఆయనే అలా కొడతారు. చేత్తో తలుపును తట్టరు.” అంది అమ్మ.
“నూరేళ్ళు ఆయుష్షు బావకి!” అన్నాడు కొండ మావయ్య.
నాకు ఆకాశం అందుకున్నట్టయింది. పరిగెట్టే వీత్తలుపు తీయడానికి. నాన్నొచ్చీసీడు. అన్నీ అడిగేస్తా. వీళ్ళకు నాన్నైతే సరిగా చెప్పగలడు అని సంబరపడిపోతూ.
“నాన్నా నాన్నా మరేం…” అని మొదలెట్టబోతే “వాణ్ణి రానీయవే లోపలికీ. మంచినీళ్ళన్నా తాగనీ. నువ్వూ నీ ఆత్రమూ, నీ ప్రశ్నలూనూ!” అంటూ బామ్మ కేకలేసింది.
“వెళ్ళిపోదామనుకుంటున్నా. నిన్ను ఈసారి చూడ్డం పడదనుకున్నా. వచ్చేసేవ్!” అని కొండ మావయ్య చేటంత మొహం చేసుకున్నాడు.
“కొండా. రాత్రికి ఉండిపో. రేప్పొద్దున్న బండికి వెళ్దువుగానిలే.” అన్నాది బామ్మ.
అమ్మ మంచినీళ్ళ గ్లాసు నాన్నకు అందించింది. నాన్న మంచినీళ్ళు తాగ్గానే మళ్ళీ “నాన్నా, నాన్నా!” అన్నా.
నాన్న నావేపు చూసి నవ్వి, “దా, ఏవిఁటి సంగతీ?” అంటూ ఒళ్ళో కూచోపెట్టుకున్నాడు.
“ఆకాశం మెత్తగా ఉంటుంది కదా నాన్నా? తెల్లటి మేఘాలు దూదిపింజెల్లా మెత్తగా ఉంటాయి కదా నాన్నా? మావయ్యా, బామ్మా, అమ్మా నేనలా అంటే నవ్వుతున్నారు.”
“అవునూ. మెత్తగానే ఉంటాయీ.”
“మరి వాళ్ళకి అలా కనపడవేం? నా కళ్ళకు కనపడుతున్నాయి. నీ కళ్ళకీ కనపడుతున్నాయి కదా! మన కళ్ళు వేరా?”
“ఊహలతో చూసే కళ్ళకి కనపడతాయి.”
“అలాగా! ఆకాశం శూన్యంట. అక్కడేఁవీ ఉండవట. సరే, ఆకాశం అవతల ఏముందీ అంటే కటిక చీకటిట, ఏఁవీ కనపడదట అంటున్నారు. మనకు తెలీనిది అంటే చీకటేనా నాన్నా? తెలిసేది అంతా వెలుతురు ఉంటేనేగా! తెలియడం అంటే తెలివే కదా నాన్నా?”
నాన్న నా వీపు తట్టి “నువ్వు పెద్దయ్యి కటిక చీకటిని చీల్చి అక్కడేముందో కనిపెడ్దువు గాని.” అన్నాడు.
“నువ్వెందుకు కనిపెట్టలేదూ?”
“నేనా?” నాన్న ఓ క్షణం ఆగేడు.
“భలే ప్రశ్న వేసింది బావా. నీకే వచ్చింది ఇప్పుడు ఎసరు!” అన్నాడు కొండ మావయ్య.
“నే కనిపెట్టాలంటే మరి సైన్సు చదువుకోలేదుగా. నువ్వు పెద్దయ్యి బాగా సైన్సు చదువుకొని కనిపెడుదువు గాని.” అంటూ మళ్ళీ నా వీపు తట్టేడు నాన్న.
సంబరంగా “కనిపెడతా, కనిపెడతా!” అంటూ తప్పట్లు కొట్టే.
“ఇది వాడి నెత్తి మీది దేవత. అదేం చెప్పినా అలా దాని వీపు తట్టి మెచ్చుకుంటూనే ఉంటాడు.” అంది బామ్మ.
“పిల్లల్ని ఎలా పెంచాలో బావ దగ్గర నేర్చుకోవాలి అందరూ!” అన్నాడు కొండ మావయ్య.