అమ్మయ్య! ఇన్నాళ్ళకి నా గోడగుర్రం ఎక్కి కూచున్నా. నా మానాన నేను కూచుని ఆకాశాన్నో, కొబ్బరి చెట్టు ఆకుల మజ్జినుంచి కనిపించే పడమటి సూరీడి వెలుతురు చుక్కల్నో చూస్తూ నాతో నేను మాటాడుకుని ఎన్నాళ్ళయిపోయిందో!
సందడి! సందడి! ఒకటే సందడి! ఊపిరి తిప్పుకోనివ్వని సందడి! ఒకటా? రెండా? నెలా పదిహేను రోజులు! అందులోనూ మహాసందడికి ఏడు ఆదివారాలు! ఏడో ఆదివారం నాడు ఆవిడతో పాటు మొత్తం సందడి వెళ్ళిపోయింది. ఇల్లు బోసిపోయింది!
ఆవిడ వస్తే అంతే!
ఒక వేలు విడిచిన కాదు – ఎన్నెన్నో వేళ్ళు విడిచిన చుట్టాల వరసలో ఎక్కడెక్కడిదో కలుపుకుంటే ఈ ఇంటి ఆడబడుచు అవుతుందట! అయితేనేం, సొంత ఆడబడుచుకన్నా ఎక్కువే! ఇంటిల్లిపాదీ నెత్తిని పెట్టుకుని చూస్తారు. ఆవిడ ఉన్నన్నాళ్ళూ ఆవిడ కా అంటే కా! కీ అంటే కీ!
ఏడాదికో ఏడాదిన్నరకో ఓ సారి వొస్తుంది. నెలో నెలన్నరో ఉండి ఇల్లంతా సందడి సందడి చేసి తను సంబరపడిపోతూ, ఇంటిల్లిపాదినీ సంబరపెట్టేస్తూ, ఎన్నాళ్ళున్నా ఇంకా ఉంటే బావుణ్ణని అనిపించుకుని వెళ్తుంది.
అమ్మయ్య, నా మానాన నేను నా గుర్రం ఎక్కి కూచున్నా అని ఇప్పుడు అనుకుంటున్నాను కాని నిజం చెప్పొద్దూ, ఆవిడొస్తే నాకూ సంబరమే! చుట్టాలెవరొచ్చినా నాకు సంబరమే, అందులోనూ ఈవిడ రావడం మరీ మరీ సంబరం!
అయితే ఎందుకలా అనుకున్నా? మజ్జి మజ్జిని కొంచెమన్నా తెరిపి లేకుండా ఉంటేనూ – ఇన్నాళ్ళూ ఊహల ఊసే లేదు! అవి ఒక్కళ్ళం ఉంటేనే! పదిమంది మజ్జిలో ఉంటే ఆలోచనకి సందే దొరకదు.
ఆవిడ ఉన్నన్నాళ్ళూ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలా ఉండరు. చిన్నపిల్లలైపోతారు. ఆవిడయితే నాకన్నా చిన్నపిల్లయిపోతుంది. అల్లరి! అల్లరి! బండి దిగిన దగ్గర్నుంచి మళ్ళీ బండి ఎక్కేవరకు! ఒకటే అల్లరి!
మళ్ళా చూడబోతే అమ్మంతే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకీడువాళ్ళే. అమ్మకీ ఆవిడకీ ఎంత తేడానో!
ఇంట్లో మేఁవూ సరదాగానే ఉంటాం. నవ్వుతూ నవ్వుకుంటూ హుషారుగానే ఉంటాం – కబుర్లు చెప్పుకుంటూ! కాని ఆవిడ సరదాలకి అంతూ పొంతూ ఉండదు. గమ్మత్తు గమ్మత్తైన సరదాలు!
బండి దిగీ దిగ్గాన్నే ఇంకా లోపలకి అడుగు పెట్టకుండానే, “అన్నయ్యోయి! ఈసారి బగ్గీ మీద షికారుకు వెళ్ళాలి!” అంటూ మొదలు.
“సరే, ముందు పద ఇంట్లోకి! అమ్మా! చూడు ఎవరొచ్చారో!” అంటూ బామ్మని కేకేసేడు నాన్న.
“ఎవరూ? అమ్మడే! ఒసేయి! అమ్మడొచ్చిందేవ్!” అంటూ బామ్మ అమ్మను కేకేసింది. లోపలున్న అమ్మా పరుగు పరుగున వచ్చింది.
“వస్తున్నట్టు ఓ ముక్క ఉత్తరం రాస్తే బాబు స్టేషన్‌కి వచ్చేవాడు కదే!” అన్నాది బామ్మ.
“చెప్పాపెట్టకండా ఉన్నట్టుండి నే ఊడిపడితే నన్ను చూసీ చూడగానే మీ మొహాలు మతాబుల్లా వెలిగిపోతూ ఉంటే నే చూడొద్దూ?” కిలకిలా నవ్వుతూ గలగలా చెప్పింది.
నాన్నా నవ్వుతూ “నిజమేనే అమ్మడూ! ఈ ఎక్సైట్‌మెంట్ ఎక్కడుంటుందీ?” అన్నాడు, అమ్మడి పెట్టే, సంచీ అమ్మకి అందిస్తూ – “ఈసారి బగ్గీలో షికారుట! గుమ్మంలో అడుగు పెట్టీ పెట్టకుండానే చెప్పేసింది. నే బగ్గీ బెత్తాయించాలిట!”
“ముందే చెప్పేస్తున్నా ఒదినా! నువ్వూ షికారుకి రావాలి. రానంటే కుదరే కుదర్దు. అన్నయ్య పక్కనే కూచోవాలి! నా పక్కని అన్నయ్యకి ఎదురుబొదురుగా కూచోడానికి వీల్లేదు, ఆఁ” అంది.
“నే రావక్కర్లేదేఁవిటే?” అడిగింది బామ్మ.
“అయ్యో! పప్పు లేని పులగమా? నెయ్యి లేని బూరెలా? నిన్నెలా ఒదిలేస్తా దొడ్డమ్మా!”
“మరి నేనో?” అన్నా.
“సొంఠి లేని కషాయమా? అందులోనూ నువ్వు మీ నాన్న నెత్తిమీది దేవతవి! నువ్వు లేకుండానా? నిన్ను తీసుకెళ్ళనూ అంటే అన్నయ్య బగ్గీవే తేడు!”
“బాగుంది వరస! ముందు పద. ప్రయాణం చేసి వొచ్చేవ్! వేణ్ణీళ్ళు పెడతా. నువ్వు స్నానం చేసి వస్తే అందరం కలిసి భోంచేద్దాం” అన్నాది అమ్మ.
“అదేమీ! మీరింకా భోజనాలు చెయ్యలేదా?”
“ఏదీ? ఏదో పని మీద బయటికి వెళ్ళిన మీ అన్నయ్య ఇప్పుడే వచ్చేరు. నువ్వూ వొచ్చేవ్!”
భోజనాలయ్యేయో లేదో “ఏదీ ఒదినా, నా పెట్టె ఎక్కడ పెట్టేవూ? నేనేం తెచ్చేనో చూద్దురు గాని” అన్నాది.
“వీధిలో కాళ్ళు పెట్టుకువచ్చావా ఏం? రేప్పగలు చూస్తాం లే” అన్నాది అమ్మ.
“ఈసారి ఎన్ని రోజులుండడానికి సెలవిచ్చేడూ నీ మొగుడు?” అడిగింది బామ్మ నవ్వుతూ.
“పొద్దున్నే వచ్చిన వాన, పొద్దుగూకి వచ్చిన చుట్టం పొమ్మన్నా పోరు. ఇహ ఇక్కడే ఉండిపోతా. తిరిగి వెళ్ళనే వెళ్ళనూ!” తనూ ఆపకండా నవ్వడం మొదలెట్టింది.
“అలా చెప్పొచ్చావా ఏం? అయితే రేప్పొద్దున్న నువ్వు లేచేసరికే మీ ఆయనా ఇక్కడ ప్రత్యక్షమవుతాడు!”
“నా ఇష్టం వచ్చినన్ని రోజులుండమన్నారు. ఆయనట ప్రశాంతంగా ఏదో గొప్ప పని చేసుకోవాలిట!”
“అవును మరీ, నువ్విలా చిన్నపిల్లలా ఒహటే అల్లరి చేస్తూ ఉంటావు!”
“ఓహో, మీ ఆయన నిన్ను మా మీదకి తోలేసేడన్నమాట!”
“ఆట్టే! ఆట్టే! ఏయ్ ఏయ్! అన్‌పార్లమెంటరీ మాట! తీసుకో వెనక్కి! చెప్పుకో క్షమాపణ!”
విరగబడి నవ్వుతూ అందరం పక్కల మీద వాలేం.
కాఫీలు తాగేరో తాగలేదో ఇంకా, ఆ మర్నాడు పొద్దున్నే – “రండహో! రండహో! రండి! రండి! ఆలసించిన ఆశాభంగం!” చాటింపులా ఢం! ఢం ఢం! అని డప్పు కొట్టినట్టు పెట్టి మీద వాయించడం మొదలు పెట్టింది.
“మజ్జాన్నం కూచుందాంలే అమ్మడూ! పనివేళా! మా తల్లివి కదూ” బుజ్జగిస్తున్నట్టు బామ్మ నచ్చచెప్పబోయింది.
“పనుల్లారా! ఓ పనుల్లారా! కాచుక్కూచోండి వచ్చే వరకూ! అని ఓ కేక పెట్టింది.
నాన్నా నేనూ చాటింపు విని మూగే జనంలా ఒహరిని ఒహరం తోసుకుంటూ వొచ్చేం.
“జనం మూగేస్తున్నారు అమ్మలారా! తొరపడండి. రండి! రండి!” ఢం! ఢం ఢం! “పని, పని, పని – ఎప్పుడూ ఉండే పనులే – ఎక్కడివక్కడ వదిలేసి బయల్దేరి రండి!” ఢం! ఢం ఢం!
అమ్మా బామ్మే కాదు, ముత్తమ్మా నవ్వుతూ గిన్నెలు తోమకుండా వచ్చేసింది.
“ఇదిగో, పెంకిపిల్ల కోసం గౌను” అంది, గౌను పైకి తీసి ఎత్తి పట్టుకుని ఆడిస్తూ.
నేను చూడగానే తొడిగేసుకుందామని నే కట్టుకున్న గౌను విప్పుకుంటూ ఉంటే, “ఏయ్! ఆగు! ఆగు! గౌను నేనింకా ఇవ్వందే! పసుపు పెట్టి దేవుడి దగ్గర పళ్ళెంలో అన్నిటినీ పెట్టి దణ్ణం పెట్టాలి. అప్పుడూ అందరికీ ఇవ్వాలి” అన్నాది.
“మళ్ళీ అదో తతంగమా? ఇచ్చేద్దూ, ఇప్పుడే! అదంతా అక్కర్లేదు” అన్నాడు నాన్న.
“సంప్రదాయం! సంప్రదాయం! సంప్రదాయాన్ని పాటించాలి. కదూ దొడ్డమ్మా!”
“అవునమ్మా! అలాగే చెయ్యి. స్నానాలూ అవీ అయి నే పూజ చేసేటప్పుడు ఇద్దువు గాని” అన్నాది బామ్మ.
అమ్మకి గోచి పోసి కట్టుకోడానికి సరిపోయే ఏడు గజాల చీరా పైట పిన్నూ, నాన్నకి స్వాన్ ఫౌంటెన్ పెన్నూ, బామ్మకి పంచముఖి రుద్రాక్ష తావళం, ముత్తమ్మకి నల్లంచుల పసుపు పచ్చ చీర, తమ్ముడికి కీ ఇస్తే తుపాకితో తిరిగే సిపాయి బొమ్మా!
మజ్జాన్నం గౌను తొడుక్కుని తెగమురిసి పోయా. ఎర్ర రంగు గౌను! గుండెల మీద పొట్ట మొదలు వరకూ చిన్న చిన్న గదులుగా లాగితే సాగుతున్న పసుపు రంగు దారంతో ఎంబ్రాయిడరీ! తనే కుట్టిందిట! హనీకూంబ్ స్టిచ్చిట!
హనీకూంబ్ స్టిచ్చి అన్న పేరు విని తెగ నవ్వే.
“ఎందుకలా నవ్వుతున్నావూ? నవ్వడానికి ఏముందీ?” అన్నాది.
“హనీకూంబ్ అంటే నీకు అర్థం తెలీదా? నాకు తెలిసింది కాబట్టి నవ్వొస్తోంది.”
“దీనికి అన్ని మాటల అర్థాలు లాగడం తెలుసు! అలా లాగి నవ్వుతుంది” అన్నాది బామ్మ.
“నేనేం దీనికి అర్థం లాగలేదు! దాని అర్థమే నవ్వొస్తోంది. హనీ అంటే తేనె. కూంబ్ అంటే పన్ని. అదే దువ్వెన్న! తల దువ్వుకునేది. హనీకూంబ్ స్టిచ్చంటే తేనెపన్ని కుట్టు! తేనెదువ్వెన్న కుట్టు!” అని నవ్వుతూనే చెప్పే.
“కూంబ్ అంటే దువ్వెన అనే కాదు. హనీకూంబ్ అంటే తేనెపట్టు. తేనెపట్టు గదులు గదులుగా తేనెటీగలు మైనంతో పెడతాయి. ఈ కుట్టు అలా కనపడుతోంది కదా! అందుకూ ఆ స్టిచ్‌కి ఆ పేరు!” నాన్న బోధపరుస్తూ చెప్పేడు.
“ఓహో, తేనెపట్టు కుట్టు అన్నమాట! ఇంగ్లీషులో కన్నా తెలుగులోనే ఈ కుట్టు పేరు విండానికి బాగుందే!” అని “కుట్టు, కుట్టు, కుట్టు! తేనెపట్టు కుట్టు! కుట్టు, కుట్టు, కుట్టు! తేనెపట్టు కుట్టు” అంటూ పాడుతూ గౌను కొసల్ని రెండు వేపులా లాగి రెండు చేతుల్తో పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ రోజంతా తిరుగుతూనే ఉన్నా.
“మాపేసుకోకే! విప్పి దాచుకో. బగ్గీలో షికారు ఉందిగా. అప్పుడు వేసుకుందువు గానీ” అని అమ్మా బామ్మా ఎంత చెప్పినా, చివరికి అత్తయ్య చెప్పినా, ఎంత ఎంత బోధపరిచినా విప్పేను కాను.
రోజూ ఇలాగే ఏదో ఒక కొత్త సరదా! కొత్త అల్లరి!
ఓ రోజయితే “ఈతపాయల జడ వేసుకుందాం” అన్నాది. వేసుకుందాం అంటే నేనూ తనూ మాత్రమే కాదు. అమ్మ కూడానుట. ముగ్గురమూ వేసుకోవాలిట!
అమ్మ రోజూ జట వేసుకుని ఆ జటనే గుండ్రంగా తిప్పి వెండి పిన్నులు గుచ్చుకుని ముడి వేసుకుంటుంది.
“పెద్దదాన్నయిపోయా! చిన్నపిల్లలా ఈతపాయల జడేవిటీ? దీనికీ ఆ జడ బాగుండదు. నీలా సాఫు జుట్టు పొడుగ్గా ఉంటే బాగుంటుంది. దీందా ఉంగరాల జుట్టూ! పైగా దుబ్బులా ఉంటుందాయె! నువ్వు వేయించుకో” అన్నాది అమ్మ.
“అదేం కుదర్దు. ముగ్గురం వేసుకోవల్సిందే! దొడ్డమ్మా! మాకు ఈతపాయల జడ వెయ్యాలి” అన్నాది.
బామ్మా చెప్పింది “నీకు వేస్తాలే! సరదా పడుతున్నావు.”
వీల్లేదు కాక వీల్లేదని ఒకటే పట్టు! నాకొద్దు మొర్రో అని నేనేడ్పు! వింటేనా? మెడ మీదకి కూడా కారిపోయేటట్టు కొబ్బరినూనె పట్టించేసింది. “ఎందుకు లొంగదూ నీ జుట్టిప్పుడు! వెళ్ళు, బామ్మ జడేస్తుంది” అన్నాది.
బామ్మ పాపం ఎంతో ఓపిగ్గా కొంచెం కొంచెం జుట్టు పాయగా తీసుకుని ఓ గంటసేపు నాకు జటేసింది. కూచుని కూచుని నా కాళ్ళు పట్టేసేయి మఠంతో. అంత కష్టపడ్డా తను వేసిన జడ ఈతాకుల జట కాదు! తాటాకుల జట అయింది.
అమ్మ చేత తాను వేయించుకుని, తను అమ్మకి వేసింది. అమ్మ ఎంత బిర్ర బిగుసుకుని వేసుకోను కాక వేసుకోను అని కూచున్నా, బామ్మ బతిమాలినా వినలేదు. నాన్న ఒకటే నవ్వు అమ్మనీ నన్నూ చూసి!
అంతతో ఊరుకుందా? ఉహూఁ!
“ఈరోజు ఎన్నాళ్ళకీ గుర్తుండిపోవాలి” అంటూ, “అన్నయ్యా! అన్నయ్యా! మా జడలకి ఫోటో తీయించూ. నా మనవలకీ నీ మనవలకీ కూడా చూపించుకుని నవ్వుకుందాం” అన్నాది.
“నువ్వు ఇంకా నీళ్ళే పోసుకోలేదు. నీకు పిల్లలు పుట్టడం ఎప్పుడు? వాళ్ళు పెద్దవడం ఎప్పుడు? వాళ్ళకీ పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టడం ఎప్పుడు? పిల్లా జెల్లా ఇంకా కలగలేదు కాబట్టి ఇలా పిల్లవేషాలు వేస్తున్నావ్! ఓ ఇద్దరి పిల్లల తల్లివైతేనే గాని పెద్దరికం రాదు” అని బామ్మ ఆవిడ నెత్తిమీద ఓ మొట్టికాయ మొట్టింది.
నాన్నకి తప్పలేదు ఫోటోగ్రాఫర్‌ని పిలుచుకురావడం! నల్లగుడ్డ మొహం మీద కప్పుకుని పదిసార్లు మమ్మల్ని అటు తిరగమని, ఇటు తిరగమని మా ముగ్గురి జడలకి ఫోటో తీసేడు!
“ఏమయ్యోయి! బాగా తీసేవా? బాగా రాకపోతే డబ్బులివ్వనివ్వను! ఆఁ, రెండేసి కాపీలు ముందువేపు నుంచి తీసినవీ, జడలకి తీసినవీను! ఒక్కొక్కటి కాదు! నే ఊరు వెళ్ళిపోవాలి. పదిసార్లు తిప్పకండా తొందరగా చెయ్యి!” అని వాడికి చెప్పింది.
బామ్మా నాన్నా ముత్తమ్మా వీధి చీడీ మీద నిల్చుని ఫోటో తియ్యడాన్ని చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. అమ్మ పాపం సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోయిందని వంచిన తల ఎత్తకుండా ఇంట్లోకి అందరికన్నా ముందు వెళ్ళిపోయింది, ఎప్పుడు ఈ జడను విప్పేద్దామా అని!
“ఈ బగ్గీ షికారు సరదా ఏఁవిటే? నీ పెళ్ళికి ఊరేగలేదూ?” అడిగింది బామ్మ. ఆవిడ పెళ్ళికి మా ఇంటినుంచి ఎవరూ వెళ్ళలేదుట!
“అక్కడ బగ్గీలు లేవు. పల్లకీలో ఊరేగించారు. కిందటిసారి వొచ్చినప్పుడు ఇక్కడ బగ్గీని చూశా. అప్పటికి వెళ్ళిపోవలసిన రోజు వచ్చేసింది.”
“పెళ్ళి ఊరేగింపు సరదా తీర్చుకోవాలంటే నీ మొగుడితో ఎక్కాలి. మాతో కాదు. ఆయననీ తీసుకు రాలేకపోయావూ? మీరిద్దరూ ఎక్కి వెళ్తే మేఁవూ చూసి ఆనందించే వాళ్ళం!”
“ఆయనొస్తే ఇన్నాళ్ళుండడం ఎక్కడ పడుతుందీ? మర్నాడే ప్రయాణం కట్టించేస్తారు. ఆయనని వెంటేసుకుని ఎక్కడికీ వెళ్ళకూడదు” అని ఒకటే నవ్వు!
“మేం నీకు తేరగా దొరికేమా? షికారుగా ఊరేగుదామంటున్నావు!” అన్నాది అమ్మ.
“మీ పెళ్ళికి నే రాలేదుగా!”
బగ్గీ షికారు అమ్మకి తప్పలేదు. బామ్మ ‘నే రానమ్మా. మీరు పిల్లలు వెళ్ళిరండి’ అంటే ఎలాగో దానికి ఒప్పుకుంది.
వెళ్ళిపోయే రోజు వరకూ ఇదే వరస.
“ఈసారి వానాకాలంలో వొస్తా! వానలో ఎంచక్కా తడుద్దాం అందరమూనూ! సరదా చేద్దాం!”
“నా తల్లే! ఇప్పట్నించీ ఏవేం సరదాలో లిస్టు తయారు చేస్తున్నావా? పడిశం పట్టుకు జొరాలతో అందరం పడుకుందాం! సరదాన్నర వొదిలిపోతుంది” అంటూ బామ్మ నవ్వుతూనే అన్నా, అదీ నిజమే! నాకూ నా జొరం జ్ఞాపకం వొచ్చి భలే భయం వేసింది ఇప్పుడే!
ఆవిడ వెళ్ళిపోయింది. ఇవాళ నా గుర్రం ఎక్కి ఆవిడ ఉన్నన్ని రోజులూ ఎలా తెల్లారినట్టూ రాత్రయినట్టూ కూడా తెలీకుండా గడిచిపోయాయో తలుచుకుంటూ ఉంటే, ఒక్కొక్క దాన్ని ఆవు నెమరు వేసుకుంటున్నట్టు నెమరు వేసుకుంటూ ఉంటే తమాషాగా అనిపిస్తోంది. ఇలా కూచోడానికి, ఆలోచించుకోడానికీ సమయం మిగలందే!
హనీకూంబ్ – కాదు – తేనెపట్టు కుట్టు గౌను వేసుకు రేపు బళ్ళోకి వెళ్ళాలి! అందరికీ గొప్పగా చూపెట్టుకోవాలి. ఆ కుట్టూ ఆ గదులూ ఎంతా బావున్నాయో!
తేనెటీగల్లా నేనూ ఊహల గదుల గూడు కట్టుకుంటా! తేనెటీగలు పువ్వు పువ్వు దగ్గర్నించీ తేనె పట్టుకొచ్చి గదుల్లో పెట్టుకున్నట్టు ఒక్కొక్క ఊహనీ పట్టుకెళ్ళి ఆ గదుల్లో దాచుకోవాలి! అత్తయ్య ఈతపాయల జడల ఫోటోలు ఎప్పటికీ అట్టే పెట్టుకుని మనవలికి చూపెట్టుకోవాలి అంది కదా! అలా నేనూ నా ఊహల్ని అట్టే పెట్టుకోవాలి. లేపోతే అన్నిటికి అన్నీ ఎప్పటికీ ఉండకుండా పోతాయి.
అవునూ, తేనెపట్టుకు పొగపెట్టి తేనెటీగల్ని చంపేసి తేనె తీసేసుకుంటారు కదా! అలా నన్నూ చంపేసి నా ఊహల గదుల గూడుగదుల్లోంచి నా ఊహలన్నిటినీ పట్టుకుపోతారు కాబోలు! అలా అవకూడదంటే ఏం చేయనూ? నా ఊహలు నావే కదా! ఎవరన్నా ఎందుకు ఎత్తుకుపోవాలీ? అలా ఎత్తుకెళ్ళి వాళ్ళ ఊహలే అని బడాయిలు కొట్టుకుంటారు కాబోలు!
ఏం చెయ్యాలబ్బా! ఏం తోచటం లేదు.
ఊహల గదులు కట్టుకోవాలన్న ఊహే ఇన్నాళ్ళూ రానే లేదు. ఊహలోంచి ఊహ పుట్టుకొచ్చి ఎటెటో పారిపోతూ మళ్ళీ పట్టుకుందామంటే దొరక్కండా పోతోందన్న ఊహతో ఊహలగూడు ఆలోచన బాగుందనుకున్నా. లాభం లేదు సరికదా అసలుకే మోసం వచ్చేటట్టు నాకే తెలిసిపోయింది.
మోసాలు ఎందుకు జరుగుతాయో!
ఆకాశం వేపు చూశా! పలచటి మబ్బు. తెరలు తెరలుగా నడుస్తోంది. కదులుతున్న తెరలు ఊగుతున్నాయి. నా ఊహలూ పలచ పలచగా ఆ తెరల్లా ఊగుతూ వస్తూ ఎటో పోతున్నాయి. వాటిని పట్టుకోవాలి. దాచుకోవాలి. దాచుకోవాలంటే ఎక్కడా? ఓ ఇల్లు కట్టుకుంటే?
భలే ఊహ వచ్చిందే! పొదలతో ఇల్లు, పొదరిల్లు! ఊహల పొదల ఇల్లు!
ఇదేదో బావున్నట్టు అనిపిస్తోంది. ఊహల గూడు కన్నా ఆ గదుల కన్నా ఇదే నయం! ఊహల తుప్పల్లోంచి ఊహల్ని పట్టుకోవడం అంత సుళువు కాదేమో!
ఒళ్ళు రుద్దుకుని సుబ్బరంగా ఉన్నట్టు దొంగపనులూ మోసప్పనులూ చెయ్యకండా మనస్సునీ రుద్దుకుని సుబ్బరం చేసుకోవాలి అందరూనూ!
లైఫ్‌బాయ్ సబ్బు – అదే, ఎర్ర సబ్బు – తెస్తాడు నాన్న. మురికంతా పోతుంది దాంతో రుద్దుకుంటే. చర్మానికి ఏ రోగం రాకండా ఉంటుందంటాడు. అత్తయ్య హమామ్ సబ్బు తెచ్చుకుంది. బాగుందది! నాన్నతో అదే అన్నా – ఎర్ర సబ్బు బాగులేదూ. హమామ్‌తో అత్తయ్య నాకు రుద్దిందీ అని!
హమ్మామ్ అంటే స్నానాల గది అని అర్థంట! తెలుగు మాట కాదు. కాని ఇప్పుడు తెలుగు మాటే! అరబ్బీ భాషనుంచీ పారశీక భాషనుంచీ ఆ మాట మనవరకూ వచ్చిందట.
మాటలూ ప్రయాణం చేస్తాయి మనుషుల్లా, ఓ భాషలోంచి మరో భాషలోకి. మనుషులు ఓ ఊరు వచ్చి ఆ ఊరువాళ్ళే అయిపోయినట్టు ఓ భాషలోంచి మరో భాషలోకి వచ్చిన మాట ఆ భాషదే అయి కూచుంటుంది.
పాత మాటలు పోతాయి. కొత్త మాటలు పుడతాయి.
పుట్టడం – పోవడం.
కొత్త మాటలు పుట్టించడం! మాట లోంచి మాట – మాటల దండలు!
బెల్కోరా అని నేనూ కొత్తమాటని పుట్టించేను కదా! మాట లోంచి మాటను లాగేను.
మాటల్ని, పాత పడినవాటిని, పోకుండా శబ్దరత్నాకరంలో దాచి పెట్టేరే! పాత మాటల అర్థాలు అందులో చూసుకోవచ్చు కదా!
ఊహల్నీ దాచుకోవచ్చు అన్నమాట! ఆలోచన లోంచి మరో మంచి ఆలోచన వచ్చేసిందే! హుర్రే! హుర్రే!
“నాన్నోయి” అని గట్టిగా కేకేశా. “హుర్రే! హుర్రే!” అని మరీ గట్టిగా అన్నా.
నా ఊహలన్నిటినీ శబ్దరత్నాకరం అంత పెద్ద పుస్తకంలో దాచుకుంటా.
నాన్న తన గది లోంచి చీడీ మీదకి వచ్చి “ఎందుకూ హుర్రే హుర్రేలు?” అని అడిగేడు.
“నా ఊహలనన్నిటినీ పెద్ద శబ్దరత్నాకరంలా అచ్చు వేయించుకుని దాచుకుంటా, ఎవరూ ఎత్తుకుపోకుండా! దొంగతనం చెయ్యకుండా! హుర్రే! హుర్రే!”
“ఇదో కొత్త ఊహా?”
“అత్తయ్య వెళ్ళిపోయాక తీరుబడిగా కూచుంటే ఇన్నాళ్ళకు నా ఊహలకూ ఆలోచన లోంచి ఆలోచనలకీ తలుపులు తెరుచుకున్నాయి.”
“తలుపులు బిడాయించుకోకు! బార్లా పెట్టుకో! శబ్దరత్నాకరం ఏం? అంతకన్నా పెద్ద గ్రంథాన్ని అచ్చు వేయించుకోవచ్చు! హుర్రే! హుర్రే!” అన్నాడు నాన్న.