దసరా వచ్చేసింది. ఒకటే సరదా. మాకే కాదు, మా మాస్టారికీ సరదావే! తొమ్మిది రోజులూ బాణాలు పువ్వులు పట్టుకుని జయీభవ! విజయీభవ! దిగ్విజయీభవ! అంటూ బాణాల్లోని పువ్వుల్ని కొట్టడం, ఇంటింటికీ వెళ్ళి దసరాపాట పాడి పప్పు బెల్లాలు, మాస్టారుగారికి ఇచ్చరూపాయిలూ పుచ్చుకోడం. ఓఁ ఓఁ ఓఁ! సరదా కాక! అన్ని పండగల కన్నా దసరాల సరదాలు మరీ మరీ ఎక్కువ!
నాన్న నాకు మూడు పువ్వులు వేసి కొట్టడానికి మూడు పొట్లాల గొట్టాలున్న బాణం తెచ్చేడు. దాన్ని చూసి తమ్ముడు నాకూ కావాలి, నాకూ కావాలి అని ఒకటే ఏడుపు. ఒక గొట్టాం ఉన్న చిన్న బాణం వాడికోసం కొసకి కొనక తప్పలేదు. అంతేనా? నేనూ వెళ్తా, నేనూ వెళ్తా – పువ్వులు నేనూ కొడతా, పువ్వులు నేనూ కొడతా అని మరో ఏడ్పు! నువ్వు నడవలేవురా! అన్ని ఇళ్ళు తిరగలేవురా అంటే వినడే! ఒకటే మంకుపట్టు!
“ఎందుకే అలా వాణ్ణి ఏడిపిస్తారూ? చిన్న వెధవాయి. సరదా పడుతున్నాడు. ఏడవకమ్మా ఏడవకు” అని వాణ్ణి బుజ్జగించి, వాడిని బాణంతోపాటూ ఎత్తుకు తీసుకొచ్చి బొజ్జ మాస్టారికి అప్పచెప్పింది బామ్మ.
“మాస్ట్రుగారూ, వీడు సరదా పడుతున్నాడు. వీణ్ణి ఎత్తుకు తీసుకు వెళ్ళాలి. పిల్లాడు నడవలేడు. వీడిచేతా పువ్వులు కొట్టించండి. ఏదీ, చిట్టికొండా – మాస్టారికి దణ్ణం పెట్టి జయీభవ చెప్పు” అన్నాది బామ్మ.
“జయీబవ! విజయీబవ!” అని వాడు పాటలా అన్నాడు.
“బవ కాదురా – భవ! భవ!” అని నేను వాడికి చెపుతూంటే “వాడికి రాకపోతే రాకపోయింది పలకడం – బవ అంటే అంటాడు. పెద్దయాక నీలాగే పాడతాడులే!” అని నన్ను కసిరి, ” ఇదిగో, వాడి బాణం గొట్టాంలో పువ్వులు వేస్తూ ఉండు నీ సంచీ పువ్వుల్లోంచి తీసి. తెలిసిందా? వాణ్ణి ఏడిపించకు. మాస్టారూ! దీన్ని గదమాయిస్తూ ఉండండి. లేపోతే ఇది వీణ్ణి ఏడిపిస్తూ ఉంటుంది” అని మాస్టారికి తమ్ముణ్ణి అప్పచెప్పింది.
“అలాగేనండీ! మీరు అంతగా చెప్పాలా, వర్ధనమ్మగారూ!” అంటూ బొజ్జ మాస్టారు తమ్ముణ్ణి ఎత్తుకున్నారు.
బొజ్జ మాస్టారి అసలు పేరు ఎవరికీ తెలీదు. ఆయనకి పెద్ద బొజ్జ ఉంది. అందరూ బొజ్జ మాస్టారనే అంటారు. బొజ్జ మాస్టారన్నా ఆయన ఏమీ అనుకోరు. నవ్వుతూ బొజ్జని నిమురుకుంటారు.
బళ్ళో పిల్లలందరమూ బిలబిలలాడుతూ పువ్వుల సంచులూ పప్పు బెల్లాలు తెచ్చుకోడానికి పెద్ద పెద్ద రుమాలు గుడ్డలూ పట్టుకుని బయల్దేరాం – జయీభవ! విజయీభవ అని పాడుతూ.
మొట్టమొదట బొజ్జ మాస్టారు పెద్దింటి రాజుగారి ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళది పెద్ద మేడ. రాజుగారు పెద్ద బెత్తు పడక కుర్చీలో కూచుని మేం పాడుతూ ఉంటే మీసాల్ని చేత్తో దువ్వుకుంటూ విన్నారు. ఆయన మీసాలు భలేగా ఉన్నాయి.
మేం గొంతులు చించుకుని మరీ పాట మొదలు పెట్టాం.
ఏదయా మీదయా మామీద లేదూ
ఇలా నిలబెట్టడం న్యాయమా మీకూ
ఇంత నిర్లక్ష్యమూ తగునా మీకూ!
దసరాకు వస్తిమని విసవిసలు పడకా
చేతిలో లేదనక అప్పివ్వరనకా
రేపురా మాపురా మళ్ళి రమ్మనకా –
పావలా బేడయితె పట్టేది లేదు
అర్థరూపాయయితె అంటేది లేదు
ముప్పావలా అయితె ముట్టేది లేదు
ఇచ్చరూపాయయితే పుచ్చుకుంటాము!
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు
జయీభవ! విజయీభవ! దిగ్విజయీభవ!
అందరమూ ఒక్కసారి మా బాణాలని ఎక్కి పట్టి రాజుగారి మీడకి పువ్వులు కొట్టేం!
రాజుగారు తన మీద పడిన పువ్వుల్ని చేత్తో దులుపుకుంటూ తమ్ముణ్ణి చూసి చెయ్యి చాచి “ఎవరి పిల్లడు మాస్టారూ?” అని అడిగేరు.
“వర్ధనమ్మగారి మనవడు. ఇదిగో వాడి అక్క కుంతలతో తనూ వస్తానని ఏడుస్తూ ఉంటే ఆవిడ, వాణ్ణి ఏడిపించకే అని కుంతలని గదమాయించి నాకు అప్పచెప్పి తీసుకువెళ్ళండి మాస్టారూ అన్నారు.”
రాజుగారు తమ్ముణ్ణి తన ఒళ్ళో కూచోపెట్టుకుని బోల్డు ముద్దు చేసి వాడితో కబుర్లు ముద్దుముద్దుగా చెప్పించుకుని వాడి రుమాలు నిండా పప్పు బెల్లాలు పోయించి ముడి వేసి మాస్టారి చేతికి ఇచ్చేరు. మాపిల్లలందరికీ రాజుగారి తల్లిగారు పప్పు బెల్లాలు పెట్టేరు. మాస్టారుగారికి ఒక ఇచ్చరూపాయి కాదు. ఐదు ఇచ్చరూపాయలు ఇచ్చేరు.
మేం మళ్ళీ మరోసారి జయీభవ! విజయీభవ! పాడుతూ మా బాణాలు పట్టుకుని రెండో ఇంటికి బయల్దేరేం. రోజూ ఇలా మా సందడే సందడి!
దసరా సందడి మాదే కాదు. ఇంట్లోనూ ఒకటే సందడి!
సుబ్బులత్తయ్య దసరాలకి మా ఇంటికొచ్చేస్తుంది. వాళ్ళ పల్లెటూళ్ళో బొమ్మలూ లేవు. బొమ్మలకొలువులూ లేవు. అదే విజయనగరంలో అయితేనా అందరి ఇళ్ళల్లో ఎంతెంత అందమైన కొలువులో! రాకుండా ఎలా ఉంటానూ! అంటుంది. అసలు సుబ్బులత్తయ్య రాకపోతే మా ఇంట్లోనూ అన్ని కొలువుల్లా అంత దీటుగా ఎవరు తీర్చిపెట్టగలరూ!
‘ఆవిడకు మంచి అభిరుచి ఉంది. కళ తెలుసు’ అంటాడు నాన్న. ఏదో మెట్ల మీద బొమ్మలు పెట్టడం కాదు. దానికీ ఓ తీరూ, ఓ పద్ధతీ, కథనాలూ కథలూ ఉంటాయి. పురాణ కథలు, చరిత్ర కథలు, రోజూ ఇప్పుడూ జరుగుతున్న ఉదంతాలు, పక్షులు, జంతువులు, మొక్కలు, కాయలు, పళ్ళు – ఎన్నెన్నో, సరియైన అందమైన పద్ధతిలో పేర్చి పెట్టాలి! ఒకరి ఇంటిని మించిన కొలువు ఇంకొకరి ఇంటిలో ఉంటుందాయె! ఏ విషయంలోనూ ఎందులోనూ మా ఇంటి కొలువు తీసికట్టుదయి పోకూడదు కదా! ఆవిడ ఒక్క చేతిమీద కొలువు పని అంతా తనే చేస్తుంది. ఎవరి సాయమూ అక్కర్ల్లేదు! అమ్మతో కలిసి అన్ని కొలువులు చూడ్డానికి అందరి ఇళ్ళకు వెళ్ళనూ వెళ్తుంది.
బొమ్మలకొలువంటే ఒక్క పనా?!
రంగం కావిడిపెట్టెలో పెట్టిన బొమ్మలన్నీ తియ్యాలా! మట్టి బొమ్మలు, గాజు బొమ్మలు, సెల్యూలాయిడ్ బొమ్మలు – ఒకటా రెండా నానారకాల బొమ్మలు – పెద్దవి, చిన్నవి, జపాను బొమ్మలు, మన దేశపు బొమ్మలు – అన్నిటినీ జాగ్రత్తగా బట్టతో తుడుచుకోవాలా! మట్టి బొమ్మలలో కొన్నిటికి తలకాయో కాలో విరిగిపోతే వాటికి ఆపరేషన్ చెయ్యాలంటూ వాటిని ఎలాగో అంటించి నిలబెట్టాలా! చక్రాలు ఊడిపోయిన చిన్న చిన్న పక్షుల బొమ్మలకి అడుగున ఉన్న చక్రాలని సరి చేయాలా! మట్టివి, గాజువి – ఇలా వేటికి వాటిని వేరు చేసి పెట్టుకోవాలా! అట్టపెట్టెల్లో జాగ్రత్తగా పెట్టిన పసుపు పచ్చటి బాతు బొమ్మలని వాటి రెక్కలని అటూ ఇటూ ఆడేటట్టు వాటిని కొక్కేలకు తగిలించాలా! ఓహోహో! లెక్కా పత్రం లేనన్ని పనులు!
దీనికి ముందర నాన్న గదినీ సావిడినీ తుడిపించి కడిగించుకోవాలి. టేకు బీరువాలని సుబ్బులత్తయ్య నాన్న గదిలోకి తీసుకువెళ్ళడం చూసి తీరాల్సిందే! ఆవిడ పనితనానికి, చాకచక్యానికి మురిసిపోవలసిందే!
నాన్న సాయమూ అక్కర్లేదు! మగాడి సాయమే అక్కర లేనప్పుడు అమ్మా ముత్తమ్మల సాయం ఎందుకూ? బీరువా కోళ్ళ మధ్యని రోకలి పెట్టి భలేగా దొర్లించేసి, అంత ఎత్తు గుమ్మాలమీంచీ జార్చేసి గదిలోకి తీసుకువెళ్ళి పోతుంది. ఏ దెబ్బా తగుల్చుకోకుండా ఏ గుమ్మం కమ్ములకీ కొట్టుకోకుండా సుళువుగా తీసుకుని వెళ్తుంది!
‘కొందరికి పని చెయ్యటంలో సుళువులు తెలుస్తాయి అమ్మా! తెలివితేటలు ఉండాలి. సుబ్బుల్ని చూసి నేర్చుకోండి బుర్ర పెట్టి ఎలా చేయాలో’ అంటుంది బామ్మ.
ఆరు అడుగుల బీరువాల మీద అడుగుపాటి బల్లచెక్క వేసి మొదటి మెట్టుతో మొదలుపెట్టి కిందవరకూ ఎత్తు తగ్గించుకుంటూ మెట్లన్నిటినీ కర్ర పెట్టెలు, బల్లలతో వేస్తుంది. వాటిమీద మల్లిపువ్వు లాంటి తెల్లటి బట్ట వేసి అటూ ఇటూ కిందవరకూ జార్చి కదలకుండా పిన్నులు పెడుతుంది. ఎత్తుబల్ల ఎక్కి మీదిమెట్టు మీద మధ్యలో గజలక్ష్మి, వీణ వాయిస్తున్న సరస్వతి బొమ్మలు పెట్టి రెండో మెట్టు మీద శేషపాన్పు మీద పడుకున్న విష్ణుమూర్తి బొమ్మ పెడుతుంది. ఇవి పెద్ద పెద్ద మట్టి బొమ్మలు, రంగులు వేసినవి. ఇలాగ్గానే మధ్యని పెద్ద మట్టి బొమ్మలు, అటూ ఇటూ వాటికి తగిన చిన్న బొమ్మలూ పేరుస్తుంది.
మడకాళ్ళ గాంధీ, కాంగ్రెసు టోపీతో నెహ్రూ, సెల్యూట్ పెట్టి ఆజాద్ హింద్ ఫౌజ్ యూనిపారమ్‍లో సుభాష్ చంద్రబోసు, జెండా పట్టుకుని నిలుచున్న భరతమాత, ఇలా దేశభక్తి ఉట్టిపడేలా ఓ మెట్టు మెట్టంతా చరిత్ర –
కీ ఇస్తే కుడి పక్కకీ ఎడం పక్కకీ తిరుగుతూ తుపాకీ పేల్చే సెల్యులాయిడ్ జర్మన్ సిపాయి, కీ ఇస్తే బెల్ కొడుతూ సైకిలు మీద వెళ్ళే అబ్బాయి, పిల్లల బొమ్మలు అమ్మాయిలవీ అబ్బాయిలవీ ఓ మెట్టు మీద –
కూచున్న నల్లమచ్చల పిల్లుల జతని ఈ పక్క ఒకటీ ఆ పక్క ఒకటీ, మొరుగుతున్న నల్లకుక్కల జతని అటు ఒకటి ఇటు ఒకటి, జామకాయ తింటున్న తోక ఎత్తిన ఉడతపిల్ల, చెవుల పిల్లి జతలు – గాజు బొమ్మలు ఇంకో మెట్టు మీద అన్నీ జతల బొమ్మలే! ఇటూ అటూ పెట్టడానికి వీలుగా!
సుబ్బులత్తయ్యకి అమ్మావాళ్ళ సాయం ఏదీ లేదంటే అసలు లేదని కాదు. ఆవిడ ఈ పనంతా చేస్తున్నప్పుడు అమ్మ మట్టి మూకుళ్ళలో ఆవాలు, ముత్తమ్మ తెచ్చిచ్చిన తుంగగడ్డి మొలకలూ పాతి మధ్యమధ్య నీళ్ళు జల్లుతూ పెంచుతుంది. మెట్ల మీద బొమ్మల పేర్పు అయిపోయాక పార్కు పెట్టడానికి – బేసినులో నీళ్ళు పోసి మడుగును చేసి చుట్టూ మట్టి గట్టు, గడ్డీ ఆవాల మొలకలని పెట్టాలి మరి. ఆ మడుగు మధ్యని కాళియ మర్దన చేస్తున్న గాజు కృష్ణుడి బొమ్మని ఉంచాలి! కృష్ణుడు గోపికలతో, గోవులతో ఆడుతూ పాడుతూ మురళి వాయిస్తూ ఉన్న వాటిని పెట్టడానికి వనం కావాలిగా! అందుకనీ!
“దొడ్డమ్మా! ఈసారి రథయాత్రలో కొన్న కొత్తబొమ్మలు మా బావున్నాయి” అని బామ్మని మెచ్చుకుంటూ సుబ్బులత్తయ్య ఆ కొత్త బొమ్మల్ని ఎక్కడ ఎలా పెట్టాలా, ఏ కథగా పెట్టొచ్చూ అని బుగ్గని చెయ్యి పెట్టుకుని ఆలోచనలో పడుతుంది.
అవును, ప్రతి రథయాత్రకి బామ్మ బొమ్మలు కొంటూనే ఉంటుంది. జపాను బొమ్మలే బొమ్మలు! ఎన్నెన్ని కొంటుందో! చిన్న కుర్చీల మీద కూచున్న అమ్మాయిల అబ్బాయిల గాజుబొమ్మలు, కాఫీ కప్పులు, సాసర్లు, వాటికి తగ్గ బుల్లి టేబిలు – సుబ్బులత్తయ్య వాటిని చూసి మురిసిపోతుంది! సెల్యూలాయిడ్ హంసలు, పిట్టలు, పళ్ళు, కాయలు, పువ్వులు, దొరటోపీలు పెట్టుకున్న దొరసానులతో చిన్న చిన్న పిల్లలు, గొడుగు వేసుకున్న దొరసానులు, తోపుడుబండిలో పడుకున్న చంటిపిల్లవాడు, దాన్ని తోస్తూ గడ్డి టోపీ లాంటిది పెట్టుకుని పెద్ద గౌను తొడుక్కున్న ఆయా లాంటి మనిషి, విసనకర్రలు పట్టుకున్న జపాను అమ్మాయిలు, చిన్నచిన్న బూట్లు – ఓహోహో! ఎన్నెన్ని రకాలో!
బామ్మతో ఒంతులు పడుతూ చిట్టి బామ్మగారూ ఆ బొమ్మలన్నిటినీ కొంటారు. వాళ్ళింట్లో గోడకి నిలువెత్తున ఉన్న అద్దాల బీరువాలో బొమ్మలన్నీ పేర్చి ఉంటాయి. ఎంచక్కా అన్నిటినీ రోజూ చూడొచ్చు. ఆ బొమ్మల్లో జర్మను సిపాయి బొమ్మ, సైకిలు బొమ్మా కూడా ఉన్నాయి. సైకిలు బొమ్మకి కీ ఇచ్చి తిప్పుకుంటానని అడిగితే ఇవ్వే ఇవ్వరు! ‘అల్లది ఇస్తానన్నావు. ఇచ్చేవే కావు’ అంటూ నేనల్లరి చేసినా లాభం లేకపోయింది.
అందుకే బామ్మ దగ్గర ఏడ్చి ఆ బొమ్మని కావిడి పెట్లో పెట్టకండా – అద్దాలు లేకపోయినా మా ఇంట్లో అలమరా ఉందిగా, అందులో పెట్టుకున్నా. బళ్ళోంచి వచ్చేక కాస్సేపు ఆ బొమ్మకి కీ ఇచ్చి ఆడుకుంటూ ఉంటా. నా పక్కనే కూచుని తమ్ముడు తప్పట్లు కొడుతూ నవ్వుతూ సైకిలు వెళ్తున్న వైపుకు డేకుతూ వెళ్తాడు.
చాగంటి వారిళ్ళల్లో కొలువులు, రామయ్యంగారి కొలువు, కోటంరాజు వారి కొలువు, కోట్ల మాదప్పవారి వీధిలోని ఫిడేలు నాయుడు గారింట్లోని కొలువూ చూడాలని దసరా తొమ్మిది రోజులూ పిల్లలతో సహా అమ్మలు, బామ్మలూ తొందర తొందరగా ఇళ్ళల్లో పనులు ముగించుకుని సాయంత్రాలు బయల్దేరతారు. చూసిన బొమ్మల్నే చూస్తూ ప్రసాదాలు పుచ్చేసుకున్న తల్లులు ‘పదండి వెళ్దాం మిగతా కొలువులు చూడొద్దా?’ అన్నా పిల్లలు లేవరు. చూపుడు వేళ్ళతో ఒకళ్ళకి ఒకళ్ళు బొమ్మల్ని చూపెడుతూ అది బాగుంది కదూ, ఇది బాగుంది కదూ అంటూ. ఇది కొత్త బొమ్మరోయి! ఇది వరకు చూడలేదు అని వాళ్ళల్లో వాళ్ళు కబుర్లాడుకుంటూ ఉంటారు.
‘మీరు ఇక్కడే కూచోండి. మేం ఫిడేలు నాయుడుగారింటికి వెళ్ళిపోతున్నాం!’ అంటే అప్పుడు లేస్తారు. ఫిడేలు నాయుడుగారి కొలువు చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు. తల్లులు పళ్ళు, తాంబూలాలు పిల్లలు తమకిచ్చిన ఈడిపళ్ళు, స్వీట్లూ రుమాలులో మూట కట్టుకుని బయల్దేరతారు. అవును మరి! నాయుడుగారింట్లో అన్నీ తమాషా తమాషా అయినవి, మిగతా ఇళ్ళల్లో లేనివేనూ!
వీధులు, పెంకుటిళ్ళు, డాబాలు, వీధిలైట్లు, 20, 30 లైట్లు వెలుగుతూ – ముమ్మూర్తులా నిజం గంటస్తంభం లాగా రంగులతో గడియారాలతో ఆ వీధి కూడలిలో గంటస్తంభం, ఉద్యానవనంతో సహా ప్రకాశం పార్కు, శ్రీకృష్ణా సినిమాహాలు, లోపలికి వెళ్ళి చూసేద్దామనిపించే స్వర్గసీమ పోస్టరు – సుబ్బులత్తయ్య అడక్కండా ఉండలేకపోతుంది!
“ఎవరు చేస్తారండీ? ఇవన్నీనూ!” అని అడిగింది.
నాయుడుగారి శిష్యుడు వి. ఎస్. అనంతరావుగారు సంగీత కాలేజీలో వీణ విద్యార్థి. వీణ ఎంతో బాగా వాయిస్తాడేమో నాయుడుగారి అభిమాన శిష్యుడయిపోయాడు. ఆయనట, ఇవన్నీ చేసి వాళ్ళ కొలువును, అందరి కొలువుల కన్నా భిన్నంగా గొప్పగా చేస్తున్నాడట!
హస్తకళల్లో ఆయనకున్న నైపుణ్యాలు అన్నీ ఇన్నీ కావు. బొమ్మలు చెయ్యడం, చిత్రకళ, చిన్న చిన్న భవనాల మోడల్సు చెయ్యడం, కొండలు సరస్సులతో చిన్న చిన్న ఉద్యానవనాలు సృష్టించడం, అల్యూమినియం రేకుతో లైటు స్తంభాలు, షేడ్లు, బల్బులు, బేటరీ వైరు బల్బులు – అన్నిటినీ లోకల్‍గా చేయించి ఆయనే పెడతాడట!
“మీ ఇంట్లోనే ఉంటారాండీ అనంతరావుగారు?” అడిగింది సుబ్బులత్తయ్య.
“లేదమ్మా! కళావరు రింగుగారింట్లో ఉంటారు. సింహాచలంవారి సత్రంలో భోంచేస్తారు. సెలవుల్లో ఆవిడే ఆయనకి భోజనం ఏర్పాటు చేస్తారు.”
కళావరు రింగుగారు ఎంత సహృదయురాలో విజయనగరం లోనే కాదు దేశం లోనే ఎవరు ఎరగనిది! బీద విద్యార్థులకు ఆశ్రయం ఇవ్వటమే కాదు, ఆర్థిక సాయం చెయ్యటం, అనాధలను ఆదుకోవడం కూడా. వీణ గొప్పగా వాయించే నాయుడుగారి అభిమాన శిష్యుడయిన అనంతరావు అంటే ఆ గానకళాకోవిద అభిమానించి ఆదుకోదా!
“కళావరు రింగుగారు మనింట్లోనూ హరికథ చెప్పేరే – చొప్పళ్ళి సూర్యనారాయణ భాగవతార్‍గారు పెట్టించారు. ఆవిడ పేరు సరిదే లక్ష్మీనరసమ్మ. చాలా మందికి ఆవిడ పేరు తెలీదు. కళావర్ రింగు అనే అంటారు అందరూనూ! మన చాగంటి గంగబాబు, ఫిడేలు నాయుడుగారి శిష్యులు మద్దిల సత్యమూర్తిగారి శిష్యురాలు.”
బామ్మ సుబ్బులత్తయ్యకి చెపుతూ ఉంటే అత్తయ్య ఇంతింత కళ్ళు చేసుకుని విని “ఆవిణ్ణి చూడాలని ఉంది” అన్నాది.
కోటంరాజుగారింట్లో ఓ కాలు మడిచి ఓ కాలు నిల్చోబెట్టుకుని పెద్దపొట్టతో ఉన్న నామాల సెట్టిగారి బొమ్మా, వాడి ముందు నిజం పప్పులూ బియ్యం మిరపకాయలూ ఉన్న చిన్న పెట్టెలూ చూసి, అలాంటి సెట్టిగారిని మనమూ పెట్టుకుందాం అని ఓసారి నేను గొడవ చేస్తే బామ్మ రథయాత్రలో ప్రతీ కొట్టులోనూ ఆ బొమ్మకోసం అడగడమూ, వెతకడమూనూ. పక్క కొట్లో ఉందేమో కనుక్కోండి మాదగ్గర లేదని వాడు అండమూనూ. ఎలాగైతేనో ఓ కొట్లో దొరికింది. వాళ్ళ బొమ్మకన్నా కాస్త పెద్దది. అయితేనేం. బాగానే ఉంది.
సుబ్బులత్తయ్యతో ఈ సంగతి అంతా చెప్పి దాన్ని ఓ చోట పెట్టమ్మా, పిల్ల సరదా పడుతోంది అని బామ్మ అన్నాది.
“అలాగే దొడ్డమ్మా! బజారు పెడ్తాలే ఈసారి” అన్నాది సుబ్బులత్తయ్య.
అలా ఉండేది పోటీగా అక్కడ చూసినది ఇక్కడ పెట్టాలని, ఇక్కడ చూసినది అక్కడా పెట్టాలనీను. వాళ్ళదానికన్నా మనది గొప్పగా ఉండాలనీనూ.
“బామ్మా బామ్మా, నాన్న నాయుడుగారింట్లో పెట్టినట్టు మనింట్లో దీపాలూ వీధులూ పెట్టలేడా?” అని అడిగే.
“ఒసే జడ్డీ! మనం ఎవరినీ కాపీ కొట్టకూడదే మనమే కొత్తగా ఆలోచించి కొత్తకొత్తగా చెయ్యాలి. అదీ గొప్ప” అన్నాది సుబ్బులత్తయ్య.