ఊహల ఊట 5

ఇవాళ అటక మీంచి కురిడీకాయలు ఒలిపించారు కొబ్బరినూనె ఆడించడానికి. అమ్మ కురిడీ ముక్కలు పెట్టింది. కురిడీ ముక్కలు నఁవులుతూ నా గోడగుర్రం ఎక్కే. 

నాగమణీ వాళ్ళ నాన్నగారికి రాజమండ్రి బదిలీ అయింది. అది ఒకటే ఏడుపు. ఏడవకే అని ఎన్నిసార్లు చెప్పినా ఏడుస్తూ, ‘నువ్వు నన్ను మర్చిపోతావు’ అంటూనే ఉంది. నువ్వు నన్ను మర్చిపోతావా, నేను నిన్ను మర్చిపోడానికి అంటే వినదే. 

మనం తెల్లకాయితాల పుస్తకాలు కుట్టుకుంటామే ట్వైన్ దారం – అలాంటిదే స్నేహం! పుటుక్కున తెగిపోదు. దిబ్బ అయ్యరు హోటల్లో ఇడ్లీ పొట్లాలకి చుట్టి ఇచ్చే దారం కాదే అనీ చెప్పేను. 

దిబ్బ అయ్యరు ఎత్తు అరుగుల హోటల్లో ఇడ్లీలూ కాఫీ బాగుంటాయని నాన్నా, నాన్న స్నేహితులూ వెళ్తూ ఉంటారు. వాళ్ళతో నేనూ వెళ్ళేను చాలామాట్లు. ఒక్కొక్కసారి నాన్న ఇడ్లీపొట్లాలు కట్టించి తీసుకువస్తాడు హఠాత్తుగా చుట్టాలొచ్చినప్పుడు. 

ఆడవాళ్ళ నెత్తిమీద నీళ్ళకుండ ఉంటుంది, ప్రతీదానికి ఏడుస్తూనే ఉంటారు అంటారు మొగాళ్ళు. నిజఁవే. ఆడవాళ్ళకి అలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. నాకు ఏడుపు రాదు. ఆలోచన ఉన్నవాళ్ళకి ఏడుపు అంత త్వరగా రాదట! మొగవాళ్ళు అందుకే ఏడవరు. బుర్రే పని చేస్తుందట వాళ్ళకి. గుండె కాదు!

నిజఁవే. నాకూ బాధగానే ఉంది. పాపం పిచ్చిది. ఆ మొద్దుకి నేనొక్కత్తినే మంచి నేస్తాన్ని. అయితే మాత్రం ఏఁవైందిట? రాజమండ్రీ లోనూ నాలాంటి పిల్ల దానికి దొరకొచ్చుగా. అదే చెప్పే. ఊహూఁ – ‘ఏమో’ అంటూ ఇంకా గట్టిగా ఏడుస్తూ రెండు చేతిమండలతో కళ్ళు తుడుచుకుంటూ నలిపేసుకుంటూనే ఉంది. ఎర్రగా అయిపోయాయి మిరపపండుల్లా పాపం దాని కళ్ళు!

ఎండిపోతేనే గానీ కొబ్బరి కురిడీ కాదు. కురిడీ అయితే గానీ నూనె ఎక్కువగా రాదు. నూనె అంటే స్నేహంట. నూనెజిడ్దు వదలనట్టే స్నేహం కూడా వొదలదు. అది ఆఁవదం జిడ్డులాంటిది. వొదిలేదీ కాదు. తరిగేదీ కాదు. 

ఎక్కడెక్కడో ఏవేవో ఊళ్ళు తిరిగి తిరిగి చివరికి మాణిక్యాంబగారు బామ్మున్న చోటికే వచ్చేరు. అలాగే నేనున్న చోటికి అదీ చేరొచ్చు. అది ఉన్న చోటికి నేనూ చేరొచ్చు – ముసలైపోయాక! చిన్నప్పటి నేస్తాలు మాణిక్యాంబగారూ బామ్మా లాగ!

వెర్రిమొద్దుకి అలాగానూ బోధపరిచా – ఉహూఁ – దాని తలకెక్కదే. 

ఏడవటమూ మంచిదే. ఏడవాలట. నాన్న చెప్పేడు. 

పాపం ఒకావిడ బుజ్జిపిల్లాడు నాలుగేళ్ళవాడు చచ్చిపోయాట్ట. ఆవిడ రాయిలా కూర్చుండిపోయిందట. నోట మాట లేదు. ఏడవనూ లేదు. ఆవిడ అలా ఉండేసరికీ అంతమందీ ఒకటే కంగారు పడ్డారట. ఇలా అయిపోయిందేవిఁటీ? కొయ్యబారిపోయింది దేవుడా అని వాళ్ళమ్మగారు బెంబేలు ఎత్తిపోయారట. ఆవిడ అత్తగారు గభాలున లేచి చిన్న గుల్లీచెంబు తెచ్చి ఆవిడ చేతిలో పెట్టేరట. ఆ చెంబును చూసీ చూడ్డంతో అంతవరకూ ఉలుకూ పలుకూ లేకుండా కూచున్నావిడ భోరుభోరుమని ఏడవడం మొదలెట్టిందట!

ఆ చిన్న గుల్లీ చెంబుతో ఆ బుజ్జిగాడు తన చిట్టి చిట్టి చేతుల్తో ‘నా బొబ్బ నేనే పోచుకుంటానూ, ఎవలూ వొద్దూ’ – అంటూ తన బొబ్బ తనే పోసుకునేవాడట! ఆవిడ కాస్త మనుషుల్లో పడ్డాక కిటికీ గూట్లో ఉన్న ఆ గుల్లీ చెంబును వాళ్ళత్తగారు భోషాణం పెట్టెలో పడేసిందట. దాన్ని చూసినప్పుడల్లా ఆవిడ ఏడుపు ఆగేది కాదుట మరి!

అవును మరి, చచ్చిపోయినవాళ్ళని మళ్ళీ చూడలేంగా! అందుకే దుఃఖం పొర్లి పొర్లి వస్తుంది. 

చచ్చిపోవడాన్ని నేను చూడలేదు. 

కానీ ఆవేళ నాన్న నేస్తం కాళిదాసుగారు ‘నీకోసం బొమ్మల కథల పుస్తకం తెచ్చా. ఇంటికి రా ఇస్తా’ అన్నాడు. ఆయనకూ నేనంటే మహా ముద్దు. పోనీ, నాన్న కోసం ఇంటికొస్తాడా – అప్పుడు నాకిస్తానన్న పుస్తకం తేనే తేడు. మా ఇంటికి వొస్తేనే ఇస్తానంటాడు. వాళ్ళింట్లో నాతో ఏవేవో వాగించి వాళ్ళావిడా ఆయనా ఓఁ ఓఁ ఓఁ అని నవ్వుతారు. అప్పుడు ఇస్తాడు నాకిచ్చే పుస్తకాలు!

బొమ్మలపుస్తకం కోసం వెళ్ళా జిడ్డువారి మేడ దగ్గరున్న వాళ్ళింటికి. పుస్తకం తీసుకుని వీధి వారంట బొమ్మలు చూసుకుంటూ చిన్న ఆంజనేయస్వామి కోవెల దగ్గరికి వొచ్చేనో లేనో పూజారిగారు గబుక్కున నా చేయి పట్టుకుని లాగి కోవిల్లోకి తీసుకెళ్ళిపోయాడు. బుర్రెత్తి చూద్దును కదా – ‘అటు చూడకు, రా లోపలికి’ అంటూ లోపలికి లాగేసి తలుపులు వేసీసేడు. నాకో అరిటిపండు ఇచ్చి, ‘ఎవరో చచ్చిపోయారు శవాన్ని తీసుకువెళ్తున్నారు. అది వెళ్ళేవరకూ తింటూ కూచో’ అన్నాడు. 

అదేంటో – ఏదన్నా చెయ్యొద్దు అంటే అదే చెయ్యాలి అనిపిస్తుంది. ఆయన చూడొద్దు అంటే అదేంటో చూడాలనిపించింది. చూడనే చూశా. 

బామ్మ నే చెప్పింది విని దేవుడికి వెయ్యి విధాల చెయ్యెత్తి దణ్ణాలు పెట్టింది. ఆయన ఇల్లు వెయ్యిళ్ళై వృద్ధిలోకి రావాలని పూజారిగారిని దీవించింది. ‘దానికి దిష్టి తియ్యవే. అందుకే ఆంజనేయస్వామి బిళ్ళున్న గొలుసొకటి దాని మెళ్ళో వెయ్యవే అని మొత్తుకుంటున్నా’ అని. నేను కొంచెమే చూశా నాకేం కాలేదన్నా విన్లేదు. 

నాన్నకి చెపితే, “నువ్వు జడుసుకుంటావని, భయపడతావని అలా చేసేడు. అయితే చూడ్డమే మంచిది. అన్నీ చూడాలి. అప్పుడు భయం గియం ఉండవు” అన్నాడు. 

“వద్దంటే చెయ్యాలనిపిస్తుంది నాన్నా!”

“అవును, నీకే కాదు. అందరికీ అనిపిస్తుంది. దేనికీ అడ్డగించకుండా ఉంటే వాటంతటవే అన్నీ తెలుస్తాయి.”

జ్ఞాపకాల గోతిలోకి జారి పడిపోయా. ఎందుకో అందులోకి జారిపోతూనే ఉంటా. 

దుఃఖం పేరుకుపోతే, బాధని దాచేసుకుంటే అదో పెద్ద జబ్బయిపోతుందిట. అందుకే ఏడవడం మంచిదట. ఆడవాళ్ళ గుండె బహుమెత్తనట! గుండె అంటే లబ్ డబ్ – లబ్ డబ్ అని కొట్టుకునే గుండె కాదు. ఎవరన్నా బాధపడుతూ ఉంటే జాలి కలిగి అయ్యో అనిపిస్తుందే – అదిగో – ఆ గుండె. 

మొగాళ్ళకీ ఈ గుండె ఉంటుందిట. వాళ్ళ కళ్ళూ చెమరుస్తూనే ఉంటాయిట. బుర్రా ఉండాలి. చెమర్చే గుండే ఉండాలి అన్నాడు నాన్న. మంచి తక్కెడ రెండూ పళ్ళేలూ సమానంగా ఉంటాయే – అల్లాగ్గా అన్న మాట. 

ఒక్క బుర్రే పనిచేయకూడదు! ఒక్క గుండే పనిచేయకూడదు!

నెర్లిమర్ల తిక్క బాబాయి ఆడదానిలా వలవలా ఏడుస్తాడని వెక్కిరిస్తారు అమ్మా బామ్మానూ! పాపం! ఆయన గుండే ఆడదాని గుండెలా బహుమెత్తన కాబోలు!

మొగవాళ్ళు ఏడవరు అని ఆ వాక్యం కింద ఎర్ర పెన్సిలుతో గీత గీసీసేరు. అందుకే ఏ మగాడు ఏడ్చినా వెక్కిరిస్తారు. 

చచ్చిపోయినవాళ్ళు మళ్ళా కనపడరు కాబట్టి దుఃఖపడతారు. బతికున్నప్పుడు ఎక్కడో ఓ చోట ఎప్పుడో ఒకప్పుడు కలుసుకుంటాం కదా!

నాగమణికి నాకు తెలిసినవేవీ చెప్పలేదు. చెప్పినా దానికి అర్థంకాదు. 

“సరేలే, ఏడుపు వచ్చింది. ఏడుస్తున్నావ్. ఇహ ఊరుకో. నేనే అయితే ఎగిరి గంతేసేదాన్ని తెల్సా? నువ్వు రైల్లో వెళ్తూ ఎంచక్కా అన్నీ చూస్తావ్! వెనక్కి పరిగెట్టే చెట్లనీ, పొలాల్నీ, మొక్కల్నీ, పశువుల మందల్నీ! ఎంత బాగుంటుందో ఆకాశం. నీతోపాటూ అలా వస్తునే ఉంటుంది. ఓసారి లేత నీలం రంగులో అందంగా ఓసారి తెల్లటి దూదిపింజెల మబ్బులతో! మజ్య మజ్య ఊళ్ళు!”

దాన్ని ఊరిస్తూ ఊరుకోబెట్టడానికి- “చూడూ, రాజమండ్రి ఎంత దూరం కనక! మా బామ్మ చెప్పింది ఐదుగంటల ప్రయాణంట. ఐదే ఐదు గంటలు. ఇట్టే అయిపోతాయి. మరి కాస్సేపు రైలు తాపీగా నడిస్తే బాగుణ్ణనిపిస్తుంది నీకే!”

నా మొహాన్ని కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయింది నాగమణి.

“ఒసే మొద్దూ, నేను వస్తాలే రాజమండ్రీకి. ఇన్నీసుపేటలో మా బామ్మ స్నేహితురాలు ఉంది. గోదావరి పుష్కరాలకు బామ్మ వస్తుంది. ఆవిడతో నేనూ వస్తాను. అప్పుడు మనం గోదావరిలో మునిగి స్నానం చేద్దాం ఏం?” అని ఊరడించా. దాంతో దాని మొహం కాస్త తేటపడ్డాది.

అదే కాదు, వాళ్ళమ్మా బామ్మకి ఏడుస్తూ, ‘మంచీ చెడ్డా చెప్పుకోవడానికి పెద్దవారు మీరున్నారు ఇక్కడ ఏ సలహాకైనా! ఆ కొత్త ఊళ్ళో వెళ్ళిపడుతున్నాం. ఎలాగో ఏఁవిటో!’ అంది. బామ్మ ఆవిణ్ణి ఓదార్చి ‘వెళ్ళే ముందురోజు నువ్వూ నాగమణీ మా ఇంట్లో భోంచేసి మరీ వెళ్ళాలి సుమా!’ అంటూ ఆవిడకి అభిమానంగా చెప్పింది. ఆవిడ వెళ్ళేక ‘ఓ జలతారు చీరా, జలతారు అంచుల రవికల గుడ్డా తెప్పించవే. పళ్ళూ పువ్వులూ పసుపూ కుంకంతో పాటు బొట్టు పెట్టి ఇద్దువు గాని. పాపం అమాయకపు ఇల్లాలు!’ అని అమ్మకి చెప్పింది. 

అది విన్నాక ఓహో, అయితే నేనూ నా నేస్తానికి బట్టలు పెట్టాలి అనుకున్నా. 

“నాన్నా, నాన్నా, నా నేస్తం నాగమణికి పొడుగు గౌనుకి పెద్ద జేబులతో కుట్టించుకోడానికి సరిపడా గుడ్డ కొనిపెట్టాలి. నేనూ అమ్మ వాళ్ళమ్మకి పెట్టినట్టు నా నేస్తానికి పెట్టుకుంటా. దానికి పాపం, పొడుగు గౌను రెండువేపులా పెద్ద జేబులది లేదు” అని చెప్పే. 

నాన్న నవ్వి “అలాగే” అన్నాడు.

“ఇదిగో, చీర అంటే పొడూగ్గా ఇంత పెద్దది కాబట్టి ఒకటే కొనమన్నాది. గౌను చిన్నదీ, అంచేత రెండు గౌన్ల కోసం కొనాలి మరి.”

“ఓహో, అలాగా? సరే” అని నాన్న మళ్ళీ నవ్వేడు. 

“అంతే కాదు, చీర మీదకి రవికలగుడ్డ పెడుతుందిటగా, గౌను కింద వేసుకోడానికి మరి లాగు ఒద్దా? అందుకని రెండు గౌన్లకీ రెండు లాగులకీ సరిపడా కొనిపెట్టు.” 

నాన్నకి ఇంకా నవ్వొచ్చింది. “సరే సరే. అంతేనా? ఇంకేమన్నా ఉందా?”

“ఉండు మరీ, చెప్తున్నా చెప్తున్నా. నేనంటే తెల్లగా ఉంటానని ముదర రంగు పువ్వుపువ్వుల గౌన్లు కుట్టిస్తావ్. దానికి ముదురు రంగుది తేకేం! చామనచాయగా ఉంటుంది కదా! లేత లేత రంగులు తేవాలి.” 

అమ్మా బామ్మా బుగ్గలు నొక్కుకొని నే నాన్నకి చెప్పేదంతా వింటున్నారు. ‘ఓహోహో!’ నవ్వుతూనే వింటున్నాడు నాన్న. 

“మరేం, బేండుమేళం వాళ్ళ బట్టల్లా రెండు గౌన్లకీ ఏకాండీగా ఒకటే గుడ్డ కాదు సుమీ! వేరు వేరు గుడ్డలు. వేరు వేరు రంగులవి. ఆఁ, అన్నట్టు – లాగు గుడ్డ కూడా రెండు ముక్కలు వేరువేరుగా విడివిడిగా ఉండాలి. ఏ గౌనుకి ఏ లాగు గుడ్డ పెట్టాలో అలాగ్గా ఆ గౌన్లమీద పెడతా.”

“మరీ సోద్యం. లాగు గౌను కింద ఉంటుందే. నీ వెర్రితల తెలివితేటలు కూలా! రవిక కనపడుతుంది. అందుకని దానికి సరిపోయేటట్టు కొనుక్కుంటాం” అంది అమ్మ. 

“దాని ఆలోచనకే ముచ్చటపడక అవేం మాటలే! అసలు తన నేస్తానికి బట్టలు పెట్టాలని అనుకోవడమే చాలు. ఎన్ని రకాలుగా చెప్తోందో చూడు!” అని బామ్మ నన్ను మెచ్చుకుంది. 

“నాన్నా, నాన్నా! ఇంకా అయిపోలేదు. మరోటి ఉండిపోయింది. నీ ఫౌంటెన్ పెన్ను లాంటిది సిరా పోసుకునేది కొను. బాతుముక్కు పాళీ కలం కాదు. సిరా బుడ్డీలో ముంచి రాసుకునేది. నాగమణి దాన్ని దాచుకుంటుంది. పెద్దయేక రాసుకుంటుంది.”

“దీని జాబితా హనుమంతుడి తోకలా పెరిగిపోతోందే, అంతూ పొంతూ లేకుండా!” అంది అమ్మ. 

“ఏం వొండుతావే?” అంది బామ్మ.

“ముద్దపప్పూ, తియ్యగుమ్మడికాయ ముక్కలు ఆనపకాయ ముక్కలూ వేసి తియ్యపులుసూ, కాయపడంగా మెంతి గుండ పెట్టి వంకాయ కూర చేద్దామనుకుంటున్నా. రెండో కూర ఏం చెయ్యనూ?”

“రెండో కూర వొద్దులే. గోంగూర పచ్చడీ నిమ్మకాయా ఎటూ ఉన్నాయి. పులిహోరా బూరెలూ చేద్దాం. ఆవిడకి ఇష్టమే కాని ‘చీదేస్తాయి అండీ’ అంటుంది” అంది బామ్మ. 

చీదేస్తాయి అనగానే నాకు నవ్వు ఆగింది కాదు. 

“నవ్వుతున్నావెందుకే భడవా!” అడిగింది బామ్మ. 

“చీమిడేమిటి చీదడానికి! బూరెలు ఎక్కడన్నా చీత్తాయా?” 

“వేగుతూ వేగుతూ బూరె పూర్ణం ముద్దని బురబురలాడుతూ పైకి కక్కేస్తుంది. అదీ చీదడం!” చెప్పింది బామ్మ. 

‘చీదడం – కక్కేయడం – చీదడం – కక్కేయడం – బూరె చీత్తుంది – కక్కేస్తుందీ’ పాటలా పాడుతూ నవ్వుతూనే ఉన్నా. “ఇంక చాల్లే నవ్వింది ఆపింక” అంది అమ్మ. 

“బామ్మా, బామ్మా,  నాకూ నాన్నకీ వేరువేరుగా మట్టుగిన్నెల్లో మీగడ పెరుగు తోడు పెడ్తావే. అలాగ నాకూ నాగమణికీ వేరువేరుగా మీగడ పెరుగు తోడు పెట్టు.”

బామ్మ నవ్వి “నీకూ నాగమణికేనా? వాళ్ళమ్మకి తోడు పెట్టద్దా?” అని అడిగింది. 

“అది నీ ఇష్టం. ఆవిడకీ వేరే గిన్నెలో తోడు పెట్టుకో.” 

అమ్మా బామ్మా మొహమొహాలు చూసి నవ్వుకున్నారు. నాన్న నా తలమీద ఓ చిన్నమొట్టికాయ పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు.

నాన్నతో కలిసి నే భోంచేయలేదు. తను ముందే తినేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. చిన్నపీటల మీద నేనూ నాగమణీ పక్కపక్కల కూచున్నాం. వాళ్ళమ్మ నాగమణి పక్క పెద్ద పీట మీద కూచుంది. పప్పూ అన్నంలో పూసకట్టిన నెయ్యి కలుపుకుని ముక్కల తియ్యపులుసు నంచుకుంటూ తిన్నాం. వంకాయకూర లోంచి చిన్న చిన్న వంకాయలు ఏరి నాకొకటీ దానికొకటీ వేసింది అమ్మ.  
 
అది కూర తినలేదు, గోంగూర పచ్చడి కలుపుకుంది. ముందు పచ్చడి తినడం దాని అలవాటు కాబోలు. నేనూ పచ్చడి కలుపుకుని, “అమ్మోయి! వెన్న, వెన్న, వెన్న వెయ్యి,” అని గట్టిగా చెప్పే. 

“అలాగేనే, దానికి గట్టిగా అరవడం ఎందుకూ?”

“వెన్నెందుకూ?” అడిగింది నాగమణి. 

“గోంగూరపచ్చడీ అన్నంలో వెన్న నంచుకుంటే భలేగా ఉంటుంది.” 

“నూనె వేసేరుగా!”

“నూనె ఎలాగూ వేసుకుంటామే. కానీ వెన్న నంచుకు తినాలి. నీకు తెలీదా?” 

ఆవేళే తీసిన వెన్నతో నంచుకుని తిన్న నాగమణి ‘భలే బావుందే!’ అంది. 

“అమ్మా, మరికొంచెం వెన్న వెయ్యవే. రుచి తెలిసింది అమ్మాయిగారికి!”

బూరికి మధ్యలో కన్నం పెట్టు, అమ్మ పేరిన నెయ్యి వేస్తుందీ. పులిహోరలో పెరుగు కలుపుకుని తినూ – దానికి అలా చెప్తూ తినూ తినూ అని తిండం ఎలాగో చెప్తూ ఉంటే, ‘మీ నాన్న నీకు నేర్పినవన్నీ ఆ పిల్లకి నేర్పిస్తున్నావే! ఇదండీ వరస. అలా అన్నీ నేర్పిస్తాడు తండ్రి,’ అంటూ వాళ్ళమ్మకి చెప్పింది బామ్మ. 

“మంచి మాటే కదండీ, మా ఆయన అడుతూ పడుతూ తినేసి వెళ్ళిపోతారు. ఎవరు ఏంటి తిన్నారో, ఎలా తిన్నారో ఏదీ పట్టించుకోనే పట్టించుకోరు.” అంది నాగమణీ వాళ్ళమ్మ. 

“మీరు పచ్చి ఉల్లిపాయి తింటారో లేదోనని ఉల్లిచెక్కు గోంగూర పచ్చడికి పెట్టలేదు,” అంది అమ్మ. 

“ఉల్లి చెక్కు మహా పసందుగా ఉంటుంది. నువ్వూ నేనూ వేసుకుందామా?” అడిగేను నాగమణిని. బుర్రూపింది. 

పెరుగూ అన్నంలోకి వచ్చేం. “ఇదిగో, ఇలా ఊడ్చుకుని ఊడ్చుకుని వేళ్ళను నాకుతూ తినాలి. ఆఖరి అన్నంలో అమృతం ఉంటుందంటుంది మా బామ్మ.”

“అమృతమా?” 

“మనం పారేయకండా ఉండాలని అలా చెపతారు అనుకో. అయితే మీగడ పెరుగూ అన్నం చివరగా కంచం ఊడ్చి ఊడ్చి తింటే నిజంగానే మా కమ్మగా ఉంటుంది. నేనేదీ పారెయ్యను. ఎంతమందో కష్టపడితేనే గాని మన కంచాల్లోకి అన్నం రాదు అని మా నాన్న చెప్పేడు. ఒక్క మెతుకు కూడా కింద పడకుండా చిన్న చిన్న ముద్దలు చేసుకు తింటా అందుకే.” 

నాగమణి గతుక్కుమని తన కంచం చుట్టూ చూసుకుంది. 

“ఫర్వాలేదులే. ఇప్పుడు పడితే పడ్డాయి. ఇహముందు పడనియ్యకు.” 

“ఆసి భడవా, దానికెన్ని పాఠాలు చెప్తున్నావే! బయటికెళ్ళి గోళెంలో ఉన్న నీళ్ళతో చేతులూ మూతీ కడుక్కురండి,” అంది బామ్మ. 

బామ్మిచ్చిన తమలపాకు చిలకలు నఁవులుతూ ఉయ్యాలా ఎక్కేం. 

వాళ్ళు వెళ్ళబోయే ముందు అమ్మ రెండు పళ్ళేల్లో బట్టలు పెట్టి తెచ్చింది. నేముందే చెప్పే. నాగమణికి నేనిచ్చేవి కూడా అలాగే పెట్టమని. నా నల్లగళ్ళ తెల్లగౌను పెద్దజేబులతో కుట్టించుకున్నది కొత్తబట్టలతో పాటు పెట్టమన్నా. 

“అదెందుకే?”

“అక్కడ కుట్టుమిషను వాడికి తెలుస్తుందో తెలీదో! ఈ మాదిరిది కుట్టాలని చూపెట్టద్దూ! అందుకని.” 

“నీకా గౌను అంటే చాలా ఇష్టం కదే! ఇంకో గౌను పెడ్తాలే.” 

“ఒకళ్ళకి ఇచ్చేటప్పుడు మనకి చాలా ఇష్టమైనదే ఇవ్వాలి. మనం అక్కర్లేదనుకున్నది కాదు. అలా ఇవ్వడం తప్పు కాదూ?”

బామ్మ నన్ను దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని, “నా తల్లి బంగారమే! బంగారం! ఏఁవనుకున్నావ్?” అంది. 

అమ్మ పళ్ళెం సద్దేక ఫౌంటెన్ పెన్నూ, నా బొమ్మల కథల పుస్తకాలు నేను చదివేసినవి – ఓ మూడు పుస్తకాలు కూడా వాటిమీద పెట్టి నాగమణికి బొట్టు పెట్టి ఇచ్చే. ఇదిగో, ఈ నల్లగళ్ళ తెల్లగౌనూ ఇచ్చా! ఈ మాదిరిది కుట్టించాలండీ పెద్ద పెద్ద పక్కజేబులతో పొడుగ్గా అని వాళ్ళమ్మకి చెప్పా.

నాగమణీ వాళ్ళమ్మా వెళ్ళిపోయాక నాకు ఏడుపొచ్చీసింది.

అమ్మా బామ్మా నిర్ఘాంతపోయారు. తనగదిలో ఉన్న నాన్న ఇవతలకి వచ్చేడు ‘ఏమైంది, ఏమైంది’ అంటూ. 

“ఏడవడమూ మంచిదే అన్నావుగా. నన్ను ఏడవనీ నాన్నా!” అనే.