ఊహల ఊట 22

నే పిరికిదాన్నా అంటే కాదు – కాని మెరుపు మెరిసీ మెరవగానే ఇంక ఉరుముతుంది దేవుడా అని రెండు చెవులనీ రెండు చేతులతో గట్టిగా మూసేసుకుంటా.

ఉహుఁ ఉహుఁ ఉహుఁహుఁ అన్న చప్పుడు చెవుల్లో గింగుర్లు కొడుతుంది. అది గాని పిడుగు అయిందా – ఫెళఫెళమంటూ మెట్లుమెట్లుగా దొంతరలతో విరిగి పడుతున్న చప్పుడు చెవుల్ని బద్దలు కొడుతుంది.

‘అర్జున ఫల్గుణ పార్థ కిరీటి ధనంజయ శాతవాహనా’ అంటూ నన్నూ అలా అనుకోమంటుంది బామ్మ.

మనమీద పడకండా ఉంటే చాలా? అదెక్కడో అక్కడ పడుతుంది. ఏ చెట్టుమీదో పడి చెట్టంతా నిలువునా మాడి మసి అయిపోయిందని, ఆరుబయట ఆకాశం కింద ఉన్నవాడి మీద పడిందని, వాడు ఠారుమని చచ్చిపోయాడనీ ఉరుములూ పిడుగుల వానప్పుడు చెపుతూనే ఉంటారు!

అందుకే దీపావళి వస్తోందంటే ఓ పక్క సరదా, ఓ పక్క ఆ చప్పుళ్ళకి హడలూనూ. ఈసారి దీపావళికి అమ్మాయమ్మ దొడ్డమ్మ వస్తోందని అమ్మా బామ్మా తెగ సంబరపడిపోతూ ఉంటే నాకు చచ్చేంరా దేవుడా అనిపించింది. ఆ దొడ్డమ్మ బడబడా, డబడబా, ఘడఘడా చప్పుళ్ళు ఘట్టిగా చెవులు చిల్లులు పడేటట్టు మనింట్లో మన మండువాలో అయితేనే దీపావళి పండగ అంటుంది.

తెల్లగా వెన్నముద్దల్లా వరస్సాగా ఆగకండా మతాబాలనుండి వెలుగు వెన్నెల ముద్దలు జారిపడుతూ ఉంటే కంటికి ఎంత ఇంపుగా హాయిగా ఉంటుందో! అందులోనూ రెండు చేతుల్తో రెండు మతాబులు ఒకేసారి ముట్టించి పట్టుకుని వరస్సాగా నలుగురం నిల్చుని కాలుస్తూ ఉంటే ఎనిమిది వరసల వెన్నెల వెలుగు ముద్దలని చూడ్డానికి ఎదురింటివారికి రెండుకళ్ళూ చాలవు! కన్నుల పండవ కదా! ఆ దొడ్డమ్మకి కన్నుల పండవ వెన్నముద్దల వెలుగుకన్నా ఆ బ్రహ్మాండమైన చెవులు బద్దలు కొట్టే చప్పుళ్ళ దీపావళంటేనే ఇష్టం!

ఇంటికి దీపావళి కళ వచ్చేసింది! దీపావళి హడావిడి మొదలయింది.

మతాబాలకని లావుపాటి పెన్సిలుకి కాగితం చుట్టి గొట్టాలు చేయడం, మైదాపిండిని ఉడకబెట్టి చేసిన పేస్టుతో ఉన్న గిన్నెని పక్కన పెట్టుకొని గొట్టాం అడుగువేపు మడతపెట్టి అతికించడం – మిఠాయి కిళ్ళీల్లా చిన్నసైజు కాగితాన్ని చుట్టి సిసింద్రీల కోసం గొట్టాలు చెయ్యడం – జంగిడిలో చేసిన గొట్టాల్ని వేసి ఆరబెట్టడం, చిచ్చుబుడ్ల వెనక ముయ్యడానికి ఎర్రమట్టిని కొండం, మందార కుంపీలు, చిచ్చుబుడ్లు కాల్చడానికి, వాటిల్లో కూరడానికి రంజకం కోసం పేకేజీడొక్కులు కాల్చిన బొగ్గుల పొడి, ఓ – ఓ – ఓ – ఒక్క పెట్టున ఇన్నిన్ని పనుల తయారీలు!

మతాబా గొట్టాలెన్నయ్యాయి? లెక్కపెట్టేరా? అవి చాలవు. ఇంకా అంటించాలి. సన్నపాటి పెన్సిలుతో కొన్ని చెయ్యాలి. పంచడానికి వాటిని ఇద్దాం. చచ్చటి కణికికి, చాకలి నారాయణకి, ముత్తెమ్మ వాళ్ళ గూడెం పిల్లలకీ ఇవ్వాలిగా! ఇంకా నయం, రూళ్ళకర్రకి చుట్టి గొట్టాలు చెయ్యలేదు! ఎంత మతాబు మందూ వీటికే చాలదు. ఇంక చిచ్చుబుడ్లలో ఏం కూరతాం?

మతాబాలు కూరడానికి కాగు పల్దుం పుల్లలూ తయారుగా గొట్టాలతో పాటు పెట్టుకోవాలి. సురేకారం, రింగురింగుల చిన్న చిన్న చుట్టలతో బీడు, గంధకం, గుల్లసున్నం, ఆవదం, మొత్తం అనీ కొనుక్కోచ్చీసేడు నాన్న.

ముందు సురేకారం, అందులో సహం రింగురింగు చుట్టల బీడు, దానిలో సహం గంధకం, గంధకంలో సహం సున్నం – మొత్తం అన్నిటినీ రెండు అరచేతుల మధ్యకీ ఎత్తి తీసుకొని, పామి పామి కిందకు వదుల్తూ మొత్తం అంతా బాగా కలిసిపోయేటంత వరకూ చాలాసేపు చేసేక పిడచ కట్టేంతవరకూ ఆవదం వేసి మతాబాల మసాలా చెయ్యడానికి త్రాసు పట్టుకుని నట్టింట్లో కూచున్నాడు.

నేనూ అమ్మాయమ్మ దొడ్డా, తమ్ముడూ గొంతుకిళ్ళా నాన్న ఎదురుగా కూచుని చూస్తూ ఉంటే మసాలా తయారైపోయింది. బామ్మా అమ్మా వంటింట్లో వంటల్లో ఉన్నారు!

“ఓ గొట్టం సన్నపాటిది పట్టుకురా” అని అనగానే పరిగెట్టుకెళ్ళి జంగిడి లోంచి గొట్టాన్ని పట్టుకొచ్చా. “ఇసకేదీ?” అన్నాడు నాన్న. మతాబా చివరని ఇసక వేసి కూరకపోతే పట్టుకుని కాల్చేటప్పుడు చెయ్యి కాలిపోదూ? అందుకనీ! ఇసక అదీ సన్నపాటిది, ఇనప మూకుడులో వేసి పెరటి చీడీ మీద పెట్టి ఉంచారు. బడ్డు ఇసక అయితే కాగితం కాస్తా చిట్లి కన్నం పడిపోతుంది. ఇసకా మందూ మొత్తం అంతా కలిసిపోయి కింద పడుతుంది!

రెండు కొక్కేల మూకుడుని రెండు చేతులతో కొక్కేల దగ్గర పట్టుకుని నేనే తెచ్చా. అమ్మాయమ్మ దొడ్డమ్మ “నువ్వు తేలేవు. ఉండు నేతెస్తా” అన్నా “ఊహూఁ, నేనే తెస్తా” అని ఆవిడకి ఇవ్వలేదు!

“ఇదిగో నాన్నా ఇసక” అన్నా.

“కూరడానికి కాగు పల్దుం పుల్లేదీ? ఒక్కొక్కటీ ఒక్కొక్కసారి తెస్తారా ఎవరన్నా? అన్నీ తెచ్చుకోరూ ఒక్కమారే?” అన్నాడు నాన్న. మసాలా మందుని మళ్ళీ మళ్ళీ అన్నీ తెచ్చేవరకూ కలుపుతూనే ఉన్నాడు. ఈసారి తమ్ముడు “నేతెస్తా నేతెస్తా” అంటూ పరిగెట్టేడు. వాడి వెనకాతలే నేనూ పరిగెట్టే. ‘సరేలే అదయితే వాడు తేగలడు కదా పాపం’ అనుకుంటూ వాడితోపాటూ తిరిగొచ్చే.

నాన్న ఆ సన్నగొట్టంలో ముందు ఇసక కూరి తర్వాత తను చేసిన మతాబాల మసాలాని కొంచెం కొంచెం వేసి దట్టించేడు. పరిగెట్టుకెళ్ళేం వీధి చీడీ మీదకి నాన్న వెనకాలే. అమ్మాయమ్మ దొడ్డమ్మా మా వెనకాలే వచ్చింది. నాన్న బుడ్డీ దీపం వెలిగించగానే “నే కాలుస్తా, నే కాలుస్తా” అని గెంతే!

సరియైన పాళ్ళలో కలిపినా ఏ మాదిరిగా వెన్నల వెలుగు ముద్దలు పడుతున్నాయో చూసుకోవాలి.

“శాంపిలు మతాబా పెద్దవాళ్ళే కాల్చి చూడాలి. తర్వాత పండగరోజున అన్నీ మీరే కాలుద్దురు గాని” అన్నాది అమ్మాయమ్మ దొడ్డమ్మ.

పగటి ఎండలో ఏం తెలుస్తుందీ? వీధి చీడీకి కుడివేపు ఉన్న మేడ మీదకి వెళ్ళే మెట్ల గోడ అడ్డం తిరిగిన చోట పగటి వెలుగు పడదు. అక్కడ వెలిగించేడు నాన్న. ఆగకండా ఒకదాని వెనక ఒకటి వెంటవెంటనే వెలుగుముద్దలు పడుతూ మతాబా కాలింది.

“భేష్! బాగా కుదిరింది” అన్నాది అమ్మాయమ్మ దొడ్డమ్మ.

పక్కింటివాళ్ళు శాంపిలు కాలిస్తే వాంతి చేసుకుంటున్నట్టు ఒక్కసారి బలుక్కున ఓ ముద్ద పడ్డం, ఆ తర్వాత పొగ కక్కి కక్కి రెండో వెలుగు ముద్ద ఎప్పుడు పడుతుందో ఆ దేవుడికి కూడా తెలీదు. అలా చూస్తూ కూచోవలసిందే. ఆ పొగతో కాలుస్తున్న వాడూ చూస్తున్న వాళ్ళూ ఆ పొగకి దగ్గులు దగ్గడమూనూ!

వాళ్ళకి పాళ్ళు సరిగ్గా తెలీదో! సరిగ్గా కలపరో! తాసుతో సరిగ్గా తూచరేమో!

ఈ పండవ అంటే కాంతే. ప్రకాశమే. ఈ పండవ వెలుగుల పండవ. అందుకే నాకు మతాబాలు ఇష్టం. ఆగకండా పైకి వెన్న వెలుగుల గుండ్రటి పూబంతుల జల్లులు విరజిమ్మే చిచ్చుబుడ్లన్నా ఇష్టమే. కాకరపువ్వొత్తి వెలిగించి చిచ్చుబుడ్డి కన్నానికి అడ్డంగా అంటించిన చిన్న కాగితంముక్క దగ్గర రంజకం అంటుకునే వరకూ పట్టుకుని రంజకం అంటీ అంటగానే గభాలున పరిగేట్టుకెళ్ళి వీధి మెట్లెక్కెయ్యాలి. గౌను మీదా ఒంటి మీదా నిప్పురవ్వలు పడకండా, వెన్న వెలుగుల పూబంతుల జల్లులు చూడ్డానికి!

ఎన్ని మతాబాలు కాల్చినా, ఎన్ని చిచ్చుబుడ్లు కాల్చినా తనివి తీరదు. మరోటి మరోటి ఇంకోటి కాల్చాలనే ఉంటుంది. అన్నీ ఎక్కడ కాల్చేస్తానేమో అని అమ్మా బామ్మా ముందే కొన్ని తీసి దాచేస్తారు. నాగుల చవితినాడూ పున్నమినాడూ కాల్పించడానికి.

తమ్ముడు బుద్ధిగా కూచుని అగ్గిపెట్టెలు తెల్లగా వెలిగేవి, పచ్చగా వెలిగేవి, కాకరపువ్వొత్తుల్లా వెలిగేవి కాల్చుకుంటూ ఉంటాడు. పాముల్లా మెలికలు తిరుగుతూ వచ్చే నల్లటి పాముల్ని ఆ బిళ్ళలు ఒక్కొక్కటీ వెలిగించి చూస్తుంటాడు. నే వెలిగించిన మతాబాల్ని చిచ్చుబుడ్లనీ చూసి నిల్చుని తప్పట్లు కొడతాడు.

వాడు సరదా పడుతూ ఉంటే అమ్మ బొప్పాయిగొట్టాంలో మతాబాని దూర్చి పట్టుకోమని కాల్పిస్తుంది. అప్పుడు వాడి మొహం ఆ మతాబా లాగే వెలిగిపోతుంది! చూసి తీరాల్సిందే వాడి సంబరాన్ని!

వాడికి అమ్మాయమ్మ దొడ్డమ్మ రోలూ రోకలీ కేపుల బిళ్ళల పెట్టెలూ తెచ్చింది. రోజూ ఆ బిళ్ళలను కొడుతూ చప్పుడు చేస్తూ సంబరపడి పోతూనే ఉన్నాడు.

అసలు దేవుడి దగ్గర దీపాలు వెలిగించి, మా ఇద్దరి చేత బొప్పాయి ఆకులకి నూనెలో ముంచిన పొడుగాటి గుడ్డ ఒత్తుల్ని వెలిగించి, వీధరుగు మెట్ల మీద ‘దిబ్బూ దిబ్బూ దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి’ పాడించి దిబ్బూ దిబ్బూ దీపావళి కొట్టించాక మధ్యాహ్నం చేసిన మైసూరుపాకు ముక్కని తినిపించేక గాని మతాబాలని ముట్టుకోనివ్వరు!

అంతకు ముందు వీధి గుమ్మం గడప మీద మైనం ఒత్తి కడ్డీ వెలిగించి గుగ్గిలం గుండ చల్లుతూ అది చుర్ చుర్ చిట్ ఫట్‍మని నిప్పురవ్వల్ని పేలుస్తూ ఉంటే ‘శివోహం! శివోహం!’ అంటూ దణ్ణం పెట్టుకోవాలి బామ్మా అమ్మా అమ్మాయమ్మ దొడ్డమ్మానూ. వీధి గుమ్మం పెరటి గుమ్మం గడపల మీద శివోహం దండాలు అయాక దేవుడి మందిరం దగ్గర వెలిగించిన మట్టిప్రమిదల దీపాలని తులసమ్మ కోట దగ్గర పెట్టాలి. పెద్ద పెద్ద పళ్ళేల్లో మట్టి ప్రమిదలని, నూనెనీ పట్టుకుని వెళ్ళి వీధి గోడల మీద పొడుగూనా వెలిగించాలి. గేటు స్థంభాల మీదా పెట్టాలి. అబ్బ! ఇన్నిన్ని అయితేనే గాని – అప్పటికి గాని మమ్మల్ని కాల్చుకోనియ్యరు బాణసంచా!

ఈలోగా మతాబాలు, చిచ్చుబుడ్లు, మందారకుంపీలు, దీపావళి అగ్గిపెట్టెలు, తాటేకు టపాకాయలు, మెగ్నీషియం తీగ వైరులు, సిసింద్రీలు, భూచక్రాలు, విష్ణుచక్రాలు, పాముల బిళ్ళలు – అన్నిటినీ గదిలో సర్దిపెట్టిన వాటిలోంచి కొన్నిటిని కాల్చడానికి నాన్న తీసి వేరుగా వీధి చీడీ మీద పెట్టాలి.

అమ్మ పెరటివేపు కిటికీ తలుపులు – పంచవాళీవి, గదివి – అన్నిటినీ ఒకసారికి పదిసార్లు గట్టిగా లాగి కర్ర చిడత గడియలు వేసెయ్యాలి. లేపోతే ఏ తారాజువ్వో సిసింద్రీవో కిటికీల్లోంచి లోపలికి దూరి వచ్చేస్తుందిట! బామ్మకి భయం!

దీపావళికి టపాసులు కాల్చడం ఎంత సరదావో అంతకు అంతా భయపడాలి. జాగ్రత్తా పడాలి! ఇళ్ళూ ఒళ్ళూ కాలకండా! గుడిసెల మీద ఏ తారాజువ్వో ఆరకండా పడిపోతే ఇంకేముంది! ఒక్క గుడిసె కాదు. ఒకదానితో ఒకటి వరస్సాగా అంటుకుని గూడెం అంతా కాలిపోదూ!

ఓసారి సిసింద్రీ ఓటి తుర్రుమని తిరిగి ఎవరో అబ్బాయి వదూలుగా ఉన్న లాగులోకి దూరిపోయిందిట! నిజఁవో అబద్దఁవో! ఇలాంటివి విన్నప్పుడు నవ్వూ వస్తుంది, అమ్మో అనీ అనిపిస్తుంది.

పెద్దతాతగారి అబ్బాయికి వెలక్కాయలే ఎక్కువ ఇష్టంట తారాజువ్వల కన్నా. సొంతంగా వెలక్కాయలు మందు కూరి కట్టేవాట్ట. ఓసారి అరచేత్తో వెలక్కాయ ముట్టించి అటూ ఇటూ తిప్పుతూ ఇంకా ఆకాశంలోకి వదిలే లేదట. అది కాస్తా అరచేతిలోనే చీదేసిందిట! అరచెయ్యంతా వేళ్ళతో సహా కాలిపోయిందిట. నయం అవడానికి చాన్నాళ్ళు పట్టిందట. అప్పట్నుంచీ అందరికీ హడలేనట వెలక్కాయలంటే. బామ్మకైతే అంతా ఇంతా భయం కాదు. ఈ సంగతి పదే పదే చెబ్తూనే ఉంటుంది.

మెగ్నీషియం వైరునీ విష్ణుచక్రాన్నీ చేత్తో పట్టుకుని కాల్చి సరదా పడతామా – మళ్ళా భూచక్రంతో చిక్కే! హాల్లో బీరువాల కిందకో, గుమ్మాల దగ్గర నిల్చుని చూస్తున్న మా గడపల మీదకో తిరుగుతూ తిరుగుతూ సర్రుమని వచ్చేస్తుంది. ఓ కర్ర పట్టుకుని అమ్మాయమ్మ దొడ్డమ్మో నాన్నో దాన్ని హాలు మధ్యలో తిరుగుతూ ఉండేటట్టు తోస్తూ ఉండాలి. చీర కుచ్చెళ్ళవో, గౌను చివరివో అంటుకుంటే ఇంకేమన్నా ఉందా! సరదాన్నర వదిలిపోతుంది!

ఇవన్నీ కాల్చడం అయ్యేక చివరని అమ్మాయమ్మ దొడ్డమ్మ మండువాలోకి పెద్ద రాగి డేగిసా తెచ్చి, సీమటపాకాయ జడల గుత్తుల్ని ఓ నాలుగింటిని ముట్టించడం మొదలు పెడ్తుందనగానే నే నట్టింట్లోకి పరిగెట్టేస్తా. ఆవిడకదో సరదా! సీమటపాకాయ జడల్ని ముట్టించేసి వాటిమీడ గభాల్న డేగిసాని బోర్లించేస్తుంది. ఆ చప్పుళ్ళు ఒకంతటికి గాని ఆగవు. అవి పేల్తూనే ఉంటాయి. పేల్తూనే ఉంటాయి టప్ టప్ టప్ టపా అంటూ.

తమ్ముడికి భయం లేదు. చప్పుళ్ళు అన్నా ఇష్టమే వాడికి. గెంతుతూ తప్పట్లు కొడుతుంటాడు దొడ్డమ్మ దగ్గర నిల్చుని చీడీ మీద! మగపిల్లలకి చెవులు బద్దలైపోయే చప్పుళ్ళంటే ఇష్టం ఉంటుంది కాబోలు. దొడ్డమ్మలాంటి వాళ్ళు ఆడవాళ్ళలో తక్కువమందే ఉంటారు.

కాస్త పెద్దవగానే మగపిల్లలు ‘ఫైర్ యుద్ధాలు’ చూడ్డానికి తీసికెళ్ళమని మారాం చేస్తారు. బామ్మయితే నాన్ననే వెళ్ళద్దని మరీ మరీ చెప్పి అడ్డుకుంటుంది.

ఊరంతా దీపావళి పండగ చేసేసుకున్న తర్వాత అప్పుడు మొదలవుతుందిట ‘ఫైర్ ఫైటు’ నెహ్రూ పార్కు వెనకాతలున్న మైదానంలో!

లంకవీధి వాళ్ళు, సుంకరవీధి వాళ్ళు, ఇస్మాయిల్ కోలనీ వాళ్ళూ బస్తాల కొద్దీ సామాన్లు, వెలక్కాయలు, తారాజువ్వలు, వెదురుగొట్టాలు, లావు లావుపాటి గొట్టాలు, టిన్ను గొట్టాలు, తాటి టెంకల్లోనూ మందు కూరి తయారు చేస్తారట. అంతా పేలే మందే! ఆ మందుతో పాటు గాజుపెంకులు, అల్పీలు, మేకులు గుండుసూదులు లాంటివి కూడానట! ఫైరు ఫైటు చూడాలని జనానికీ సరదావే! జనం మైదానానికి వెళ్తారు! మర్నాటికి కొందరికి కాళ్ళు పోయాయని, కొందరికి చేతులు పోయాయని, కొందరు చచ్చిపోయారని చూడ్డానికి వెళ్ళిన వాళ్ళ నోట ఇంటింటా ఆడవాళ్ళు విండం!

వీళ్ళ సరదా మండిపోనూ! ఈ యుద్ధాలేఁవిటో – నిప్పుతో చెలగాటమేఁవిటో! దేవుడిచ్చిన కాలూ చెయ్యిని పోగొట్టుకుని బతుకంతా ఏడ్వడాలేఁవిటో! ఈ ఫైరు ఫైట్లు జరక్కండా ఆపేస్తే బావుణ్ణు. ఎందుకాపేస్తారూ? మగాళ్ళందరికీ యుద్ధాలంటే మహా ఇష్టంగా! అన్నీ యుద్ధాలే! మళ్ళా వాటికి ధర్మయుద్ధాలని పేర్లు కూడానూ!

“మారరమ్మా! వీళ్ళు మారరు. పడే పాట్లన్నీ ఆడవాళ్ళవేగా!” అంటూ బామ్మ ప్రతి ఏటా బాధ పడుతూనే ఉంటుంది.

ప్రతీ ఏడాది లాగానే ప్రతీ దీపావళి పండగా పూర్తవుతుంది!