దీపావళే కాదు. కార్తీకమాసాన్నీ దీపాల పండగే అనాలి. అలా అనరు కాని! దీపావళి లాగానే ఈ దీపాల పండగా నాకు ఇష్టమే.
దీపావళి అంటే ఒకరోజు మాత్రమే వెలుగు దీపాలు. కార్తీకమాసంలో రోజూ నెలనెలంతా దీపాలే దీపాలు! నెలనెలంతా నాకు సరదానే సరదా.
బామ్మతో పాటు నేనూ తెల్లారుఝామునే లేచిపోతా. మరి బామ్మ నూదగ్గర స్నానం చేసి దేవుడి దగ్గర దీపాలు వెలిగిస్తుంది. వాటిని చూడొద్దూ?
బామ్మకు చలి వెయ్యదు కాబోలు అనుకున్నా. అది కాదు. నూతిలో నీళ్ళు వేడిగా ఉంటాయిట! వేడంటే బోల్డు వేడి కాదు. గోరువెచ్చ కన్నా కొంచెం ఎక్కువగా ఒంటిమీద పోసుకుంటూ ఉంటే హాయిహాయిగా ఉంటుందిట.
నూదగ్గర చీకటే చీకటి. ఇంకా ఆకాశం నిండా బుల్లి బుల్లి తెల్లదీపాలుంటాయి కదా! వెలుతురు ఇంకా రాదు కదా! అందుకని బామ్మ కిరసనాయిలు బుడ్డీ వెలిగించి నూదగ్గరికి తీసుకువెళ్తుంది. కిరసనాయిలు బుడ్డీ దీపం వెలుగు పచ్చగా పొడుగ్గా లేచి అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. కాని, పొగలు కక్కుతుంది. ఆ పొగ కాస్తా మన ముక్కుపుటాల్లోకి వెళ్తుంది. నల్లటి మసి మసి! ముక్కు నిండా అంటుకుపోతుంది. చూపుడువేలు పెట్టి చిటికెనవేలు పెట్టీ తుడిచి తుడిచి కడుక్కోవాలి. అప్పుడు దగ్గు వస్తుంది. ఒక్కొక్కసారి ‘హాచ్చీ ‘హాచ్చీ అంటూ తుమ్ములు. తుమ్ము తర్వాత తుమ్ము. ఒకటే తుమ్ములు!
‘మరీ అంతగా గొలికి గొలికి కడుక్కోకు. ముక్కు చూడు ఎంత ఎర్రగా అయిపోయిందో! దగ్గూ తుమ్ములూ వస్తాయి అలా చేస్తే. ఇదిగో ఈ పల్చటి గుడ్డతో ముందు తుడుచుకో. తర్వాత నీళ్ళతో కడుక్కో’ అంటుంది అమ్మ. ‘ఈ దగ్గులూ తుమ్ములతో ఎందుకూ మాతోపాటు తెల్లారుఝామునే లేచిపోవడం’ అంటూ దెబ్బలాడుతుంది.
లేవకపోతే ఎలా? తెల్లగా వెలిగేవి, పచ్చగా వెలిగేవి, మినుక్కు మినుక్కుమంటూ వెలిగేవి, అటూ ఇటూ ఊగుతూ వెలిగేవి – ఎన్నెన్ని రకాల దీపాలో! వాటిని చూడొద్దూ!
పెద్దవాళ్ళకి ఈ తేడాల దీపాల వెలుగులు కనపడవు కాబోలు! వాళ్ళూ వాళ్ళ స్నానాలూ పూజలూ! దీపాలు మాత్రం వెలిగించి దణ్ణాలు పెడతారు.
దేవుడి దగ్గర దీపపుసెమ్మలో దీపం వేరు. చెట్టులా ఉన్న దీపాలగుత్తిలో ఉన్న దీపాలు వేరు! దీపం అన్నది మళ్ళా ఒహటే. దేని చక్కదనం దానిదే.
దీపం సెమ్మలో ఒత్తి పెద్దది. ఎక్కువ నూనెలో నానుతూ వెలుగుతుంది పసుపు ఎరుపు రంగుల్లో. ఓసారి పచ్చగా ఓసారి ఎర్రగా! దీపాలగుత్తిలో బోలెడు దీపాలు కదా! వాటిలో ఒత్తులు చిన్నవి, నూనె కూడా తక్కువా! అవి తెల్లగా పచ్చగా ఎర్రగా మూడు రంగుల్లో ముప్ఫై దీపాలు చెట్టులాంటి సెమ్మ మట్టునుంచి మీదకు లేచి ఉన్న అందమైన కొక్కేల వరకూ! వీటికీ ఆరారాగా నూనె వేస్తూ ఉండాలి. లేపోతే కొన్ని కొండెక్కి పోతాయి. అమ్మ వాటికి అలా నూనె పోస్తూనే ఉంటుంది.
నూనె దీపానికి ఊపిరిట!
దేవుడికి కర్పూరహారతి ఇచ్చే దీపం తెల్లగా ఉంటుంది. కళ్ళకు అద్దుకుంటూ ఉంటే మన కళ్ళలోకి ఆ తెలుపు చొచ్చుకుపోతుంది. మళ్ళా అదే ఇత్తడిది ఉద్దరిణి లాంటి హారతి ఇచ్చే చెంచాలో దీపం గాలి విసురుకు ఎర్రగా గాఢంగా మంట ఎడమవేపు నుండి కుడివేపుకు పరిగెడుతూ వెళ్తుంది.
దేవుడి దగ్గర దీపాలు వెలిగించేక అమ్మా బామ్మా శ్లోకం చదువుతారు. నాకూ ఆ శ్లోకం నోటికి వచ్చు. మరి రోజూ సంజదీపం పెట్టి దణ్ణం పెడుతూ నేనూ చదువుతాగా!
దీపం జ్యోతి పరం బ్రహ్మా
దీపం సర్వతమోపహరం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే!
అమ్మా బామ్మలతో ముత్తమ్మా వెళ్తుంది మూడు కోవిళ్ళకి. నేనూ వాళ్ళ వెంట బయల్దేరతా. నువ్వెందుకే అని వాళ్ళు అన్నా నేనెందుకు వింటానూ? గుళ్ళో వెలిగే దీపాలు ఇంకో రకం కదా!
పూజారిగారు వెలిగించిన కర్పూరహారతి దీపాన్ని మనం కళ్ళకి అద్దుకోడానికి మన దగ్గరకు తెస్తాడుగా! ఆయన పట్టుకున్న ఇత్తడి పళ్ళెంలో రాగి పంచపాత్ర, ఉద్దరినీ, దేవుడి దగ్గర సెమ్మలో పువ్వొత్తీ పొడుగొత్తీ, ఆయన కట్టుకున్న పసుపుపచ్చ రంగు పంచె, మెళ్ళో తెల్ల జందెం – అన్నిటికి అన్నీ గమ్మత్తు గమ్మత్తుగా కనబడతాయి. ఊదొత్తుల వాసనా, కర్పూరపు వాసనా ఓహో! రోజూ చూస్తాగా అన్నిటినీ!
హారతికి చుట్టూ అరచెయ్యిని తిప్పి కళ్ళకి అద్దుకుని దణ్ణం పెట్టుకున్నాక ఉదకాన్ని వెయ్యడానికి అరచేతిని బొటకనవేలుతో చూపుడువేలుని పట్టుకుని ఉద్దరిణితో ఆయన వేసిన ఉదకాన్ని ముమ్మారు తాగి తలమీద ఆ తడిచేతిని రాసుకుని దణ్ణం పెట్టుకోవాలి. ఆయన ఇచ్చిన పువ్వుని కళ్ళకు అద్దుకుని తల్లో పెట్టుకోవాలి.
ఈ దీపాల పండగనాడు దామోదరుడికి దణ్ణం పెట్టుకోవాలిట!
దామోదరుడు అంటే మరెవరో కాదు. చిన్ని కిస్టుడే. తెగ అల్లరిపనులు చేస్తూ ఉంటే వాళ్ళమ్మ యశోదకి కోపం వొచ్చి కిస్టుణ్ణి తాడు వేసి కట్టేసిందిట. చిన్న పిల్లాడు కదూ. తాడు అంత గట్టిగా కట్టేసింది కదా. పొట్ట మీద గట్టిగా నొక్కుకుపోయి మచ్చ పడింది. పడదు మరీ! తాడు మచ్చ ఉన్న పొట్టవాడు ఆ దామోదరుడిని ప్రత్యేకించి పూజించి దణ్ణం పెట్టుకోవాలన్నమాట!
అలాంటిది ఓ రోజున నర్సింహాచార్యులవారి అబ్బాయి గురించి చెపుతూ ‘వాడా! వాడో దరిద్ర దామోదరుడు. ఎందుకూ పనికిమాలిన వాడు. అప్రయోజకుడు’ అంటుంది బామ్మ! తాడుమచ్చ పొట్టదేవుడు దరిద్రుడెలా అయ్యేడో!
కార్తీకసోమవారాలంటే ప్రతీ వారం రాత్రిపూట ఎంచక్కా ఎంతో ఇష్టమైనవి తినొచ్చు. బామ్మా వాళ్ళూ ఉపోషాలు సాయంత్రం వరకూ ఉంటారు. నేనా ఉపోషాలు ఏం చెయ్యను, నాకెందుకూ? పొద్దున్నా భోంచేసేస్తా సుష్టుగా! బామ్మ రాత్రి బ్రాహ్మడికి భోజనం పెట్టేక తింటుంది. అదీ బ్రాహ్మడి భోజనం అయ్యేక. ఆయన తింటూ ఉంటే ఆయన తోపాటు తను ఎలానూ తినదు. నాకు పెట్టచ్చుగా! ఊఁహూఁ ఆలా పెట్టకూడదట. ఆయన తిన్నది ఆయన తింటాడు. నేను తిన్నది నేను తింటా. ఒకళ్ళది ఒకళ్ళం తినీయం కదా!
ఆయన తింటూ ఉంటే ఎప్పుడు పెరుగూ అన్నంలోకి వస్తాడా, ఎప్పుడు లేస్తాడా అని చూస్తూ కూచుంటా. మరి, నా నోరు ఊరుతూ ఉంటుందిగా! ఎదురుగా వడ్డించడానికి పెట్టిన వాటిలో బూరెలు ఉన్న చిన్న పళ్ళెమూ నేతిగిన్నేనూ!
బూర్లు అంటే నెయ్యి వేసుకు తింటేనే అంత కమ్మని రుచి!
అన్నం తిననే తినను. అంటే అసలు తిననని కాదు. పెరుగూ అన్నం తింటా. అది తినందే తిండి తిన్నట్టే ఉండదు. బూరి తర్వాత బూరి, బూరి తర్వాత బూరి కమ్మని నేతితో తిన్నాక ఇంక చాలు అనిపించేక కాస్తంత అన్నంలో పెరుగేసుకుంటా. ఇలా బూర్లు తింటున్నానని అమ్మ దెబ్బలాడదు. నాకు ఇష్టం అని తెలుసుగా. తినొద్దు అంటే మాత్రం నేను వింటానా ఏం? అదీ తెలుసు అమ్మకి.
రెండో సోంవారం చద్ది, వేరుసెనగ పప్పులు వేసి చేస్తుంది. వేరుసెనగ పప్పుల్ని మొదటే చద్దిలోంచి ఏరుకుని తినేస్తా. ఉత్తి చద్ది తిననే తినను. అందులో పెరుగు కలుపుకుని తినాలి. అప్పుడు అది రుచిగా ఉంటుంది.
మూడోవారం మళ్ళీ తీపిది. బియ్యం పరమాణ్ణం. జీడిపప్పు, కిస్‌మిస్ పళ్ళు, ఏలకుల పొడీ వేసినది. దీని రుచి అంతా ఇంతా కాదు. అంత రుచి ఇందులో ఎందుకుంటుందంటే మాఘమాసం తులసమ్మ కోట దగ్గర చేసే పరమాణ్ణంలా ఇప్పుడూ చేస్తారు, అదీ సంగతి. నీళ్ళు అస్సలు కలపకుండా పాలలోనే ఉడకపెడ్తారు. కోవాలా అయి ఆ పరమాణ్ణం స్వర్గానికి ఓ బెత్తుడు ఎడంగా ఉంటుంది. రెండు మూడు కప్పులు తిన్నా ఇంకో కప్పు తినాలనిపిస్తుంది.
నాలుగోవారం సరే సరి, దద్ధోజనం. దద్ధోజనం అంటే పెరుగూ అన్నమే. పోపు పెట్టి, ఇన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలూ అన్నిటితో ఇది పెరుగూ అన్నం కన్నా కూడా బాగుంటుంది!
బూర్లు, చద్ది, పరమాణ్ణం, దద్ధోజనం – ఈ నాలుగూ నాకే కాదు, ఇవంటే ఇష్టం లేనివారు ఈ భూప్రపంచంలో ఎవరూ ఉండరు. ఉన్నారంటే నా చెవి కదపాయిచ్చుకుంటా.
ఏదన్నా తను అన్న మాట గాని గెలవకపోతే చూడు అన్నట్టు బామ్మ అలా అంటూ ఉంటుంది. నేనూ అంతే. గెలవకపోతే కదా! తప్పకండా గెలుస్తానని తెలిసే అలా అండం!
కార్తీకమాసంలో అన్నదానం, దీపదానం చేయాలట. అన్నదానం అంటే కేవలం బ్రాహ్మలకే పెట్టక్కర్లేదు. ఎవరికి పెట్టినా, అందులోనూ కడుపు నిండా తిండి దొరకని వాళ్ళకి తృప్తిగా పెడితే ఎంతో పుణ్యమట!
దీపదానం అంటే వెలుగుని ఇవ్వడం. వెలుగు అంటే తెలివి. జ్ఞానం. దీపం లేకపోతే అంతా చీకటే. చీకటి అంటే ఏఁవీ తెలియకపోవడం. అంచేత ఆ దానమూ గొప్ప దానమే.
బామ్మ ఈ రెండు దానాలూ తప్పకండా చేస్తుంది ప్రతి కార్తీకమాసం లోనూనూ!
కార్తీక పున్నమో – ఆవేళ దీపాలు అరటి దొన్నెల్లో వెలిగించి చెరువుల్లోనూ ఏటిలోనూ వదుల్తారు. నీటిలో దొప్పల్లో దీపాలు ఈదుతున్నట్టు వెళ్తూ ఉంటే రెండు కళ్ళూ చాలవు చూడ్డానికి అంటుంది అమ్మ. అమ్మమ్మా వాళ్ళ ఊళ్ళో చెరువులోనే అందరూ వదుల్తారట.
బామ్మ ఇంట్లోనే చేదలో డొప్పల దీపాలు పెట్టి నూతిలో వదుల్తుంది. అది చూడ్డానికి నేనూ వాళ్ళతో వేగిరం లేచిపోతా. నీళ్ళలో ఇటూ అటూ వెళ్తూ నూతి గోడ అంచుకి దగ్గరగా ఆగిపోయి వెలుగుతూ ఉంటాయి. ఆ నీళ్ళలో వాటిని చూడ్డానికి నూతి చప్టా మీద కాళ్ళు ఎత్తెత్తి నూతి గట్టుని ఆనుకుని ఎగురుతూ చూస్తూ ఉంటే బామ్మా అమ్మా నూతిలో పడిపోతావు జాగ్రత్త! జాగ్రత్త! అంటూ జాగ్రత్తలు చెపతారు.
ఈ దీపాలు పచ్చగా వెలుగుతూ తిరుగుతాయి నీటిలో. పున్నమి వెన్నెల రాత్రి కదూ, అవి తెల్లగా కనపడవు!
ఇహ కార్తీకమాసం వనభోజనాల సందడి చెప్పే చెప్పక్కర్లేదు!
మామిడితోటకి అందరం వెళ్ళి అక్కడ ఉన్న ఉసిరిచెట్టు కింద కూచుని భోంచేస్తాం. ఉసిరికాయలు చెట్టు కొమ్మలకి వేళ్ళాడుతూ ఉంటాయి. ఆడవాళ్ళు వంటలు వండుతూ ఉంటే జంబుఖానాల మీద కూచుని మగాళ్ళు పేకాట ఆడుతూనో, పేపరు చదువుతూనో ఉంటారు. మేఁవు పిల్లలం తోటంతా పరుగులు పెడుతూ ఆడుకుంటాం.
ఉసిరిచెట్టుకి పూజ చేసి ఉసిరి పచ్చడితో మొదటి ముద్ద తిని, బూర్లు పాయసం పులిహోర పప్పూ కూరా పులుసులతో పాటు తింటాం. భుక్తాయాసం తీరేక ఆడవాళ్ళం, పిల్లలం సామాన్లతో పాటు ఇళ్ళకి బళ్ళల్లో వస్తే, మగాళ్ళు నడుచుకుంటూ షైరునుంచి తిరిగి ఇంటికి వచ్చినట్టు ఇంటికి చేరతారు.
ప్రతీ పండగ లాగానే కార్తీకమాసం దీపాల పండగ దీపాలు వెలిగించి వెలుగులు పంచి తెలివిని పెంచి మళ్ళా సంవత్సరం మళ్ళా రావడానికి వెళ్ళిపోతుంది ఆకాశం అడుగుకి.
ప్రతీ పండగ కోసం ఎదురు చూస్తున్నట్టే ఈ దీపాల కోసమూ ఎదురు చూస్తూ ఉంటాం.