చిన్న అరిటి ఆకుముక్కలో పాకం చలివిడి పెట్టి బళ్ళోంచి రాగానే తిండానికి ఇచ్చింది అమ్మ!
“భలే భలే! ఇదెందుకు చేసేవూ ఇవాళా?” సంతోషపడిపోతూ అడిగే. నాకు పాకం చలివిడీ, దానిలో మధ్య మధ్య వచ్చే చిన్న చిన్న కొబ్బరిముక్కలు అంటే మాలావు ఇష్టం!
కార్తీక పున్నానికి చేసే ఉత్తి చలివిడి బాగుండే బాగుండదు. బామ్మ ఎలా తింటుందో ఏఁవిటో! ఆ చలివిడి తినే ఉంటుంది! ఇంకేమీ తినే తినకుండా!
అమ్మాయమ్మగారి అమ్మాయి అత్తారింటికి వెళ్తోంది. అమ్మని వచ్చి చేసిపెట్టమన్నారట! బాగా చెయ్యటం అమ్మకి అన్నీ వచ్చుగా! అందరూ అలా పిలుస్తూనే ఉంటారు. విసుక్కోకుండా సనుక్కోకుండా సాయం చెయ్యటానికి వెళ్తూనే ఉంటుంది అమ్మ!
అమ్మాయిని అత్తారింటికి పంపేటప్పుడు కడుపుచలవ అంటూ పాకం చలివిడి ఇచ్చి పంపాలట!
గోడగుర్రం ఎక్కి పాకం చలివిడి తింటున్నానా – గేటు తీస్తున్న చప్పుడయింది. తలెత్తి చూద్దును కదా ‘మరేమో ఒచ్చి!’
గుర్రం మీంచి ఓ గెంతు గెంతి ఒక్క పరుగున లోపలికి వెళ్ళి “బామ్మా! ఓ బామ్మా ‘మరేమో ఒచ్చి’ వొచ్చింది” అంటూ చెప్పే.
“ఒచ్చినావిడ లోపలికి రాదా ఏం? నువ్వు పరుగులు పెడ్తూ వచ్చి అరిచి చెప్పాలా? ఆవిడకి వినపడితే ఏమన్నా అనుకోదూ? అందరికీ పేర్లు పెట్టడం నేర్చుకున్నావ్ అల్లరి గుంటా!” అన్నాది బామ్మ.
“ఆటచీమలా తురుతురు పరుగుతో రాదుగా” అన్నా.
“దాంతో మాటలు పెంచకండి అత్తయ్యా! మాటికి మాట ఏదో ఒకటి తుపుక్కున అంటూనే ఉంటుంది” అన్నాది అమ్మ.
“ఫో! నీ గుర్రం ఎక్కి ఆ చలివిడి తింటూ ఆకాశాన్నో, నేలనో, నీ నెత్తినో చూస్తూ కూచో. మా నెత్తి మీద కూచోకు” అంటూ కేకలేసింది కూడా!
‘మరేమో ఒచ్చి’ ఏం గోడు చెప్పుకోడానికి ఒచ్చిందో వినాలని ఉన్నా ఆవిడ వెళ్ళిపోయాక బామ్మా అమ్మా మళ్ళీ మళ్ళీ ఎలాగా వాళ్ళలోవాళ్ళు ఏకరువు పెట్టుకుంటూనే ఉంటారు! భోగట్టా తెలీకపోదు! ఎటొచ్చీ ఆవిడ నోట విండం ఇహ కుదరదు! నేనక్కడ ఉంటే నవ్వుతానని, నవ్వు ఆపుకోనని అమ్మకు భయం! ఆవిడ ఎదురుగా నన్ను చీవాట్లు పెట్టడమూ కుదరదు! అదీ సంగతి!
“నేను నా గుర్రం మీదకే పోతాన్లెండి. మీ నెత్తి ఏఁవీ ఎక్కను, మరికొంచం పాకం చలివిడి పెట్టు. మరీ కొంచెం పెట్టేవూ!” అని గునుస్తూ అడిగే.
“రాత్రి తిండి తక్కువ తింటుందిలే. పెట్టవే. తండ్రి చూస్తే ఎలాగా తిననివ్వడు. వాడు ఇంట్లో లేనప్పుడు నీదగ్గరా నాదగ్గరా గునుస్తుంది పాపం.” బామ్మ నాకు వత్తాసుగా సిఫారసు చేసింది.
పాకం చలివిడిముద్దని ఊలుబంతిలా గుండ్రంగా చేసి నా అరిటాకు ముక్కలో అమ్మ పెడుతోంది – ‘మరేమో ఒచ్చి’ లోపలికి ఒచ్చింది.
నా చేతిలోని పాకం చలివిడిను చూసి “పాకం చలివిడి చేసేరా? నీకూ ఇలాంటివి ఇష్టమేనా?” అంటూ నవ్విందావిడ.
“నాకు ఇదంటే మాలావు ఇష్టం అండీ. మరేమో ఒచ్చి – చూడండి – మా అమ్మ ఎంత పిసరు చిన్న ఊలుబంతిలా చేసి పెట్టిందో!”
అమ్మ కళ్ళెర్రజేసి నావేపు చూసింది. బామ్మ కళ్ళు నవ్వుతున్నాయి. దెబ్బలాడుతుంది అన్నమాటే కాని బామ్మకు నా అల్లరి ఇష్టమే!
“ఎక్కువుగా తింటే హరాయించుకోలేవమ్మా. అందుకని కొంచెం పెట్టేరు” అందావిడ.
“తెలిసిందండీ. తెలిసిందండి.” లోలోపల నవ్వుకుంటూ వెళ్ళి నా గోడగుర్రం ఎక్కి కూర్చున్నా.
రెండు ముక్కలు మాటాడుతుందా, మరో రెండు ముక్కలు మాటలాడ్డం మొదలెట్టగానే ‘మరేమో ఒచ్చి’ అంటూ ఉంటుంది! ఓసారి ఆవిడ ఎన్నిసార్లు ‘మరేమో ఒచ్చి’ అందో లెక్కపెట్టే!
కొందరు ఇలాంటి ఊతపదాలు లేకండా మాటాడలేరట! అలా వాళ్ళకి అలవాటైపోతుందట! వాళ్ళకి తెలీకండానే ఆ పదం మాటమాటకీ అలా వచ్చేస్తూనే ఉంటుందట!
అవతారాల అబ్బాయి పంతులు మాటిమాటికీ ‘మరే, మరే’ అని అంటూ ఉంటాడు. ఈయన పేరే గమ్మత్తుగా ఉంటుంది.
చిన్నపిల్లాడప్పుడు ముద్దుగా అబ్బాయి, అబ్బాయి అనేవారట. ఊరూ వాడకి అబ్బాయి అయికూచున్నాడు. అందరూ అబ్బాయి అనే పిలిచి ఆ పేరుని ఖాయం చేసేసేరు! పెద్దయాక అబ్బాయిగారు అనొచ్చు కాని పెద్దింటివారి పిల్లాడు కదా, అందుకని అబ్బాయి పంతులుగారు అనడం మొదలెట్టేరట! దాంతో ఈసారి ఇంట్లోవాళ్ళకీ అబ్బాయి పంతులు అయిపోయేడు!
బామ్మ దానికి మరో ముక్క జోడించేసింది. ఆయన ఎత్తినన్ని అవతారాలు ఎవరూ ఎత్తలేదంటూ ‘అవతారాల అబ్బాయి పంతులు’ అని తెలిసిన వాళ్ళందరితో – ఆయన గురించి కథలు కథలుగా చెపుతూ ఉంటుంది.
అవతారాలు నాకు తెల్సు. మొత్తం పదీ! కానుకుర్తివారి సత్రంలో హరికథ భాగవతారు దశావతారాల హరికథని బామ్మతో వెళ్ళి విన్నానుగా! పాడలేను కాని చిరతలు పట్టుకుని అలా ముందుకీ వెనక్కీ వెళ్తూ అటూ ఇటూ ఆడుతూ కథంతా చెప్పేయగల్ను! ఆవేళ ఇంటికి వచ్చేక నేను కథంతా చెప్పీగలనూ, ఎటొచ్చీ ఆ పద్యాలే రాగాలు తీస్తూ పాడలేనూ అన్నా!
చిరతల్లా రెండు చెక్కపేడు ముక్కలు పట్టుకుని మర్నాడంతా హరిదాసులా ముందుకీ వెనక్కీ అడుగులు వేస్తూ అటూ ఇటూ గెంతుతూ ఉంటే, “చూసిందల్లా పట్టుకుంటుంది. దీనికి హరికథలు చెప్పటం నేర్పించు అన్నయ్యా” అన్నాడు త్యాగరాజు, నారాయణదాసు ఉత్సవాలకి ఒచ్చిన శరభయ్య బాబయ్య!
“హరికథ నేర్చుకోవాలంటే పాడ్డం రావాలిగా! ముందు పాడ్డం నేర్చుకోవాలి, హరికథ కాదూ. నాకు తెలీదా, ఏం?” అంటూ దీర్ఘాలు తీసే.
“చూశావా దీని ఆలోచన! సూక్ష్మగ్రాహి!” అన్నాడు శరభయ్య బాబయ్య.
“అంటే?”
“ఉందిగా శబ్దరత్నాకరం. నువ్వే తెలుసుకో. మమ్మల్ని అడగటమెందుకూ?” అన్నాడు నాన్న.
“అలాగే. అలాగే. మీరేం చెప్పక్కర్లేదు” అంటూ పరిగెట్టే నా పుస్తకాల డెస్కుపెట్టె దగ్గరికి.
“దీనికి సంగీతం నేర్పించు అన్నయ్యా! చాకులా ఉంటుందిది!”
“ఎన్నని నేర్పిస్తారూ! మొన్నే బొమ్మలు గియ్యడం నేర్చుకుంటానూ అంటూ బొమ్మలు గియ్యడంలో పడింది. ఇప్పుడిహ పాటలు నేర్చుకుంటుందిట” అన్నాది బామ్మ.
అవును కదా. అమ్మ అంటున్నట్టూ ఎన్ని, ఎన్ని నేర్చుకోవాలో! బొమ్మలు గియ్యడం నేర్చుకోవాలి. పాటలు పాడ్డానికి సంగీతం నేర్చుకోవాలి. ఆ పాట పాడ్డం వచ్చేక హరికథ చెప్పడం నేర్చుకోవాలి. కథలు రాయడం నేర్చుకోవాలి. ఇంగ్లీషూ, హిందీ, మరెన్నెన్నో భాషలూ నేర్చుకోవాలి. బోలెడు బోలెడు ఉన్నాయి నేర్చుకోవల్సినవి.
అవునూ, హరికథ చెప్పిన భాగవతారుగారికి బొమ్మలు గియ్యడం వొచ్చునా? నాకు బొమ్మలు నేర్పిస్తున్న మాస్టారుగారు హరికథ చెప్పడం ఎప్పుడూ విన్లేదే! అంటే ఒకటి వొచ్చిన వాళ్ళకి రెండోది రాదా? నాకు అన్నీ నేర్చుకోవాలనిపిస్తోందే – మరి వాళ్ళకు అలా అనిపించలేదా?
‘అన్నీ వొచ్చిన వాళ్ళు ఉంటారా?’ సందేహం వొచ్చిందంటే అడక్కుండా ఉండనుగా!
అన్నీ వొచ్చిన వాళ్ళూ ఉంటారట! వాళ్ళకి బోల్డు భాషలూ వొస్తాయిట. పాటలూ పాడతారట. బొమ్మలూ గీస్తారట. నృత్యమూ, డాన్సూ చేస్తారట. నాటకాలూ ఆడతారట!
అవుతా అవుతా
అలా అవుతా
అవుతా! అవుతా!
అవుతా వాళ్ళలా
అవుతా అవుతా వాళ్ళలా
అన్నీ నేర్చుకుంటా
నేర్చుకుంటా నేర్చుకుంటా అన్నీ
అన్నీ! అన్నీ! అన్నీ!
అవుతా! అవుతా! అవుతా!
ఇలా వరసగా మూడ్రోజులు పాడుతూ గెంతుతూ ఉంటే నవ్వింది బామ్మ.
“ఎందుకు నవ్వుతావూ? నేనేర్చుకోపోతేగా నవ్వడానికి! చూస్తూ ఉండు ఎంత పెద్దదాన్నవుతానో!”
“ఇవన్నీ కట్టిపోతాయి ఆ మూడుముళ్ళూ పడ్డాక! మీ అమ్మలా అన్ని వంటలూ బాగా వండడం నేర్చుకోవాలి పిల్లా!” అన్నాది బామ్మను చూడ్డానికి వొచ్చిన పక్కవీధి పరమేశ్వరమ్మగారు.
ఏఁవిటిదీ? ఎక్కణ్ణుంచి బయల్దేరి ఎక్కడికి వచ్చే? ఎందులోంచి ఎందులో పడి ఇక్కడ తేలే?
అవతారాల అబ్బాయి పంతులు అవతారాలు కాదూ? ‘మరేమో ఒచ్చి’, ‘మరే మరే’ లోంచి బయల్దేరి – ఏఁవిటో – గొలుసుల రింగురింగుల లింకులూ నేనూను!
ఆవేళ బామ్మకీ పేర్లు పెట్టబోయి కసుర్లు తిన్నా.
అవతారాల అబ్బాయి పంతులు అవతారాలు ఏకరువు పెడుతూ బామ్మ ‘చెప్పొచ్చేదేమిటంటే’ అని పదేపదే అంటూ చెప్పుకుపోతూ ఉంటే నాకు నవ్వొచ్చింది.
“బామ్మా! బామ్మా! నిన్నింక బామ్మా అని పిలవను. ‘చెప్పొచ్చేదేమిటంటే’ అనే పిలుస్తా! పిలవడానికి కాస్త పొడుగ్గా ఉందనుకో. ఫర్వాలేదు అయినా!”
దాంతో అమ్మ ఓ కసురు కసిరింది. కసురు తిన్నా నే ఖంగు తిన్లేదు.
“అవతారాల అబ్బాయి పంతులుగారి మాటల్ని వెక్కిరిస్తూ బామ్మ మరే, మరే, అనొచ్చునేం? మరి తననీ అలా వెక్కిరిస్తే? బామ్మా, నువ్వూ ’చెప్పొచ్చేదేమిటంటే’ అంటున్నావూ. నిన్నూ వెక్కిరించచ్చూ! అని బామ్మకి తెలియద్దా? మనం ఒకరిని వెక్కిరిస్తే మన వెనుకవాళ్ళు మనని వెక్కిరిస్తారు అని తెలుసుకో. ‘మరేమో ఒచ్చి’ అనొద్దని నువ్వే కోప్పడ్డావుగా!”
“ఏం చెప్పీ ఏం లాభం! పెద్దంతరం చిన్నంతరం లేకుండా నీ రాలుగాయితనం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది.”
“దాన్నెందుకే అలా కసిరి దెబ్బలాడతావ్! నిజవేఁగా! అవునూ, నేనలా అంటున్నానా? ఇదివరకెప్పుడూ చెప్పేవు కావే!”
“ఇదివరకెప్పుడూ నువ్వనందే! అవతారాల అబ్బాయి పంతులు అవతారాలు చెప్పేటప్పుడే అంటున్నావ్!”
“అలాగా! ఎన్నిసార్లన్నానే?”
“లెక్క పెట్టలేదు బామ్మా!”
“ఆయన లాగే మీరూ దాన్ని నెత్తికెక్కించుకుంటున్నారూ!”
“నయం కదే. అదెత్తి చెప్పింది కాని లేపోతే నాకెలా తెలుస్తుందీ? వాళ్ళలా మాట్లాడుతూ అవే అలవాటుగా నా నోటా వచ్చేస్తున్నాయన్నమాట! ఈసారి లెక్కెట్టి చెప్పవే ఎన్నిసార్లు అన్నానో!”
“చూశావా అమ్మా, బామ్మెంత మంచిదో!”
“ఒకరినోట విన్న మంచిని పట్టుకోవాలి కాని ఇలాంటివి నోటికి అంటించుకోకూడదు. చెప్పిందే చెపుతూ ఉంటుంది అమ్మ. విన్నకొద్దీ వినాలనిపించేటట్టు అవతారాల అబ్బాయి పంతులు అవతారాలు! ఓసారి చెప్పినట్టు మరోసారి చెప్పదు. చిలవలూ పలవలూ చేర్చి మార్చి మార్చి! అవే అవతారాలు!” అన్నాడు నాన్న శరభయ్య బాబయ్యతో.
“ఎవరా పంతులు దొడ్డమ్మా?” అడిగేడు శరభయ్య బాబయ్య.
“నీకు ఓపిక ఉండి వినాలే గాని గంటలు గంటలు చెప్తుంది ఇవాళ. నువ్వు విను. నాకు రాసుకునే పని ఉంది” అంటూ నాన్న తన గదిలోకి వెళ్ళిపోయాడు.
“హరికథలే కాదు. దొడ్డమ్మ కబుర్లు విండానికి కూడా వచ్చే నేను!” బామ్మని మెచ్చుకుంటూ ‘అలా చెప్పడం అందరికీ రాదు’ అన్నాడు శరభయ్య బాబయ్య.
“చెప్పు బామ్మా చెప్పు. మత్స్యావతారం, కూర్మావతారం అయ్యాయా? ఎన్నో అవతారం వరకూ ఒచ్చేవూ? బాబయ్యకి మరి మొదట్నించీ చెప్పాలి కదూ?” అన్నా.
“రెడ్డొచ్చేడు మొదలాడు అన్నట్టు నేనొచ్చేను. మొదట్నించీ మొదలుపెట్టు దొడ్డమ్మా!” అన్నాడు శరభయ్య బాబయ్య.
“ఎంతాస్తి! ఎంతాస్తి!” మొదలు పెట్టింది బామ్మ. “అంతకంతా కరారావుడు అయిపోయింది. ఎంత గొప్పగా బతికేరు అబ్బాయి తల్లీ తండ్రీ! ఏదీ మిగల్లేదు! అబ్బాయా? వీడో భభ్రాజమానంగాడు. కట్టుకున్న పెళ్ళాం ఓ జెష్ట. అది ఇంట కాలు పెట్టింది. అంతా ఊడ్చుకుపోయింది! అంతేరా నాయనా! ఆడది తిన్నదైనదైతే అష్టైశ్వర్యాలూ అడక్కండానే వొచ్చి వొళ్ళో పడతాయి!
అబ్బాయి పంతులుది ఒక అవతారమా? బతుకులో అన్ని అవతారాలు ఎత్తినవాడు మరొహడు కనబడ్డు! చదువా, తగలేసుకున్నాడు జెష్ఠవెధవలతో వెధవ తిరుగుళ్ళు తిరిగి! పెళ్ళైతే నిలకడొస్తుంది అనుకుంటే ఆ వొచ్చిందీ అలాగే తగలబెట్టేదే అయింది! వీడో సున్నం పిడతగాడు. ఆ పెళ్ళామేమో ఇనపగజ్జెల మాలచ్చిమి అయింది!”
బామ్మ అలా చెప్పుకుపోతూ ఉంటే వింటున్నవాళ్ళు అలా కూచోవల్సిందే. మధ్యమధ్యలో ‘అయ్యో! అలాగా, పాపం!’ అని కూడా అండానికి సందివ్వదు అని అమ్మ ఎందరితో చెప్పిందో!
శరభయ్య బాబయ్య బుగ్గన చెయ్యి పెట్టుకుని బామ్మ మొహాన్నీ చేతులు తిప్పడాన్నీ కళ్ళార్పకుండా చూస్తూ వింటున్నాడు.
“వీడి కాళ్ళూ వాడి కాళ్ళూ పట్టుకుని ఎక్కడ పెట్టినా నాలుగు రాళ్ళు తెచ్చుకుని కుదుటపడ్డం, నిలదొక్కుకోడం కనబడలేదు. పెద్దకోమటి కొట్లో గుమస్తాగా పెట్టేరా – అదీ తగలెట్టుకున్నాడు. చెప్పుకుంటే ఎంత అప్రతిష్ట! ఎంత అప్రతిష్ట! ‘పెద్దింటివారు. ఏదో మీరు చెప్పేరని పెట్టుకున్నా. ఇలాంటివాడని తెలీదు. ఇంకా నయం – మా కుర్రాడు సరిగ్గా సమయానికి లెక్కలు చూడబట్టి గానీ లేపోతే మునిగిపోయేవాణ్ణే’ అని ఆ కోమటాయన లబోదిబోమని నెత్తి మొత్తుకున్నాడు.
చెప్పొచ్చేదేమిటంటే – అన్నీ తప్పుల తడకల లెక్కలట! ముందు పేజీలో కూడింది పక్క పేజీలో సరిగ్గా వెయ్యాలా? వందల్లో వెయ్యాల్సింది వేలల్లో రాసి పడేశాట్ట.”
బామ్మ నోట ఇంతవరకూ ఊతపదం ‘చెప్పొచ్చేదేమిటంటే’ రాలేదే అనుకుంటున్నానూ – అది వినగానే చిటికెనవేలు మడిచి పెట్టుకున్నా. లెక్కపెట్టి చెప్పమందిగా! ఇంతసేపటికి ఒకసారి అన్నాది.
“సన్నేసిగాడు కాకపోతే కూడ్డం రాకపోడం ఏఁవిటో! పాలమ్మే ఎంకన్నగాడు నయం. నోటి లెక్కలతో వందలూ, వేలూ చెప్పేస్తాడు. వాడేమన్నా చదువుకున్నాడా! బళ్ళోకెళ్ళాడా! చేసేది కోమటికొట్టు గుమస్తాగిరీ అయితే మాత్రం ఏం! మర్యాదగా, గౌరవంగా చూసేవాడాయన. అబ్బాయి పంతులుగారు, అబ్బాయి పంతులుగారంటూ. చేరి నాల్రోజులవకుండానే పండగొచ్చింది. కొత్త బట్టలు పెట్టేడాయన! ఎంత బాగుంటే మాత్రం – అయింది ఆ అవతారం! చెప్పొచ్చేదేమిటంటే మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం!”
నేను వెంటనే ఉంగరం వేలు మడుచుకుని మనసులో రెండూ అనుకున్నా.
“చిన్న గుంటలే సైకిళ్ళు తొక్కుకుంటూ ఝూమ్మని వెళ్తారా, అబ్బాయి పంతులుకి సైకిలు తొక్కడమన్నా రాదు! ఎంత దూరం అయినా నడిచే పోతాడు. ఇంటికి మరీ దూరంలో ఏ పనికైనా పెడితే వీడెళ్ళే సరికే ఝాము పొద్దెక్కిపోతుంది! కావల్సినవాళ్ళూ, అయినవాళ్ళూ మళ్ళీ తర్జనభర్జన పడి వీడికి ఎలా సాయపడ్డమా అని తలలు పట్టుకున్నారు.
అయితే ఈసారి వాడంతట వాడే ‘బడిపిల్లలకి పనికొచ్చే పుస్తకాల కొట్టు పెట్టుకుంటాను. నేను ఎవరిదగ్గరా చేరను’ అన్నాడు. లెక్కాడొక్కా సరిగ్గా చూసుకోడం రాకే కదరా గుమస్తాగిరీని తగలెట్టుకున్నావూ, పుస్తకాల కొట్టేం నడుపుతావురా? అన్నారు. ‘ఏరోజు డబ్బు ఆరోజు డబ్బాలో వేసుకొని ఇంటికెళ్ళి ఒకటికి పదిసార్లు లెక్క పెట్టుకుంటా. దాన్నీ లెక్కపెట్టమంటా’ అన్నాడు.
ఇదీ బాగానే ఉంది. సొంతం కాబట్టి బాగానే ఉండొచ్చు. అయినా ఇదేమన్నా వేలమీద వ్యాపారమా? నాలుగువేళ్ళూ నోట్లోకి వెళ్ళే సంపాదనే కదా! అనుకున్నారంతా. బడి దగ్గరగా ఓ వీధిగది అద్దెకి తీసుకుని అన్నీ అమర్చి మదుపుగా కొంత సొమ్మూ ఇచ్చి – ఇహ ఫర్వాలేదనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు!”
“ఎన్నో అవతారంలోకి వచ్చేరూ? అన్నాలు తిందాం. లేవండిక” అంటూ వచ్చేడు నాన్న.
“మంచి రసకందాయంలో ఆగిపోతుందన్నయ్యా!” అన్నాడు శరభయ్య బాబయ్య.
“రేపు విందూగానిలే!” అన్నాడు నాన్న.
“బామ్మా! చెప్పొచ్చేదేమిటంటే – రెండే రెండు సార్లు అన్నావ్! ఎక్కువ సార్లు అనలేదు. భలి భలీ బామ్మా!” అన్నా.
బామ్మ నవ్వుతూ లేచింది.
అందరమూ అన్నాలు తిండానికి నట్టింట్లోకి వెళ్ళేం.