ఊహల ఊట 7

“ఇవాళ ఇంకేం నవఁలకు. తిన్నది చాలు. పోయి ఆడుకుంటావో, నీ గుర్రం ఎక్కి ఊహల్లో ఊరేగుతావో!” అన్నాది అమ్మ. 

“ఇంకేం తింటుందీ! పులగం మీద పప్పూ!” అన్నాది బామ్మ. 

నిజఁవే! ఇహ ఏఁవీ తిన్లేను. పొట్ట నిండుగా ఉంది. 

ఆడుకోడానికి ఎక్కడికీ వెళ్ళాలని అనిపించలేదు. తాడు తెచ్చుకుని వీధి చీడీగచ్చు మీద తాడాట లెక్క పెట్టుకుంటూ నూరు గెంతులు గెంతే. తలమీంచి వేసిన కత్తెరలతో ఓ యాభై, కాళ్ళవేపు వేసిన కత్తెరలతో ఓ యాభై ఆడే. 

తాడును ఎర్రరంగు పిడులకు చుట్టబెట్టేసి గోడగుర్రం ఎక్కే.

ఆడ్డం నుంచి చెమట పట్టింది. చెమట ఒంటికి గాలి తగిలి చల్లగా చక్కిలిగింతలు పెడుతున్నట్టు ఉంది. గుర్రమూ చల్లగా ఉంది. సంజ ముగ్గూ, తెల్లచుక్కల గీతలతో తడితడిగా కిందా చల్లగా ఉన్నాది. ఆకాశం వైపు చూశా. అదీ చల్లగానే కనబడ్డాది. ఇవాళ రోజంతా చల్లగా కితకితలు పెడ్తూనే ఉన్నాది. 

ఇవాళ పొద్దున్న ఆలీసంగా లేచే. ఎప్పుడూ ఠంచనుగా తెల్లారీ తెల్లారకముందే లేచిపోతానా; అలాంటిది ఇవాళ మెలకువ రానే లేదు!

బడికి సెలవలిచ్చీసేరు. బుర్రకి తెలిసిపోయింది – లేచినా లేవకపోయినా ఫర్వాలేదని! అమ్మా లేపలేదు. నాన్నా లేపలేదు! దుప్పటి ముసుగు తీసి, కళ్ళు నులుపుకుంటూ నే లేచేసరికి ఇల్లంతా బోలుడు సందడిగా ఉన్నాది. 

ఉయ్యాలబల్ల మీద కూచుని జయపురం మావయ్య తన ప్రయాణం సంచీలోంచి బట్టలు తీసుకుంటున్నాడు. ఈ మావయ్య ఎప్పుడొచ్చినా నాకోసం ప్రత్యేకంగా ఏదో ఓటి పట్టుకొస్తాడు. 

“మావయ్యా! నువ్వెప్పుడొచ్చేవూ?” నిద్రమత్తు కళ్ళతో ఆవలిస్తూ అడిగే. 

“లేచేవా బుజ్జీ!” అంటూ మావయ్య పలకరించాడు. ఈ మావయ్య ఒక్కడే నన్ను బుజ్జీ అని పిలుస్తాడు. “మొహం కడుక్కురా! ఈసారి నీకోసం ఏం తెచ్చానో చూద్దువుగాని!” అన్నాడు. 

పెరట్లో మరీ సందడిగా ఉన్నాది. గేదె ఈనింది. నాన్న గేదెపెయ్యకు అరిటిపండు తినిపిస్తున్నాడు. అరిటిపండు తినిపిస్తే విరోచనం అవుతుంది. కిందటిసారి గేదె ఈనినప్పుడు పెయ్యకి విరోచనం అవలేదు అని బామ్మ కంగారుపడితే అరిటిపండు తినిపించేడు సన్నేసి. సన్నేసికి ఇలాంటి చిట్కాలెన్నో తెల్సు. 

విరోచనం కాదు విరేచనం అనాలి అని నాన్న చెప్పేడు. బామ్మ విరోచనం అనే అంటుంది. విరేచనం కన్నా తప్పుగా పలికే విరోచనం అని అంటేనే నోటికి తేలిగ్గా బాగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. విరోచనాలకి పాసనాలు అంటాడు సన్నేసి. ఒక మాటని ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు!

చుట్టాల్లో పెద్దపేరే ఉంది నాన్నకి – పశునాణెం బాగా తెలిసినవాడని! సన్నేసి సంగతి మరి చెప్పే అక్కర్లేదు! అలాంటిది – కొన్నది కాస్తా బెండ్లు గొడ్డు అయింది!

‘ఇన్నేళ్ళబట్టీ పాడిపశువును కొంటూనే ఉన్నారు! ఎప్పుడూ ఇలా జరగలేదమ్మా! ఎవరి కళ్ళు కుట్టేయో!’ బామ్మ తెగ వాపోయింది. 

‘ఇద్దరికిద్దరూ ఉద్దండులే! ఇద్దరికిద్దరూ ఘటికులే! ఎలా బోల్తా పడ్డారో ఏవిఁటో!’ అమ్మ విస్తుపోయింది. 

ఆ బెండ్లు వేసిన గొడ్డును వొచ్చినకాటికి అమ్మేసి ఇప్పుడు ఈనిన ఈ గేదెను కొన్నారు. ఈ గేదె గొప్పగా ఉంది!

కాలం ఖర్మం కలిసి రాకపోతే ఎంత తెలివైనవాడయినా టోకరా తింటాడు. ఎవడో ఒకడు టోపీ వేసీస్తాడు! మన జాగ్రత్తలు పనికిరావు!

కాలమూ లేదు, ఖర్మమూ కాదు! పొరపాటు పడ్డాం. ఒక్కొక్కసారి ఎవరికైనా అలా జరుగుతూ ఉంటుంది, అంటాడు నాన్న. 

పళ్ళు తోముకోడానికి వెళ్ళకండా పెయ్యనే చూస్తూ నిల్చుండిపోయా. భలే ముద్దుగా ఉంది. 

చంటిపిల్లలూ అంతే! ఎంత బావుంటారో! ఎత్తుకోబుద్దేస్తుంది! పెద్దయాక – ఏంటో మరి, బావుండే బావుండరు. అందరూ గేదెపడ్డలైపోతారు!

‘నెత్తిమీదకి ఇన్నేళ్ళొచ్చేయి. గేదెపడ్డలా ఎదిగిపోయావ్! ఎప్పుడు బుద్ధీజ్ఞానం వస్తుందిరా?’ అని బామ్మ ఒక్కలా తిట్టిపోసేది పెద్దిగాణ్ణి. పెద్దిగాడు అన్నీ అవకతవక పనులు చేసి తిట్లు తింటూ ఉండేవాడు. ‘ఒక్కపనీ తిన్నగా చెయ్యడు. ఒకటి చెపితే ఇంకోటి చేసుకువొస్తాడు. వీడితో మా తలనొప్పిగా  ఉంది. వీడ్ని మానిపించెయ్యరా’ అని నాన్నతో పదేపదే చెప్పి వాణ్ణి మానిపించేసింది బామ్మ. నాన్న ఏదన్నా ఊరెళ్ళి చాల్రోజులు వరకూ రాకపోతే కూరానారా తెస్తూ బజారుపని చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటాడనుకుంటే బభ్రాజమానంగాడు తగలడ్డాడు!

లింగంగారు అద్దెకు ఇల్లు దొరుకుతుందా దొడ్డా! అంటూ వచ్చేసరికి బామ్మ ఆకాశాన్ని అందుకుంది! లింగంగారు దూరపు చుట్టరికపువాడు. బదిలీ అయి వచ్చేడట. మా ఇంటికి దగ్గర్లోనే అద్దెకు దిగేటట్టు ఏర్పాటు చేసేసింది బామ్మ. ఆయన బజారు వెళ్ళేటప్పుడు ‘దొడ్డా! ఏమైనా తేవాలా?’ అంటూ వొస్తాడు – నాన్న ఊళ్ళో లేనప్పుడు. ప్రాణానికి హాయిగా ఉంది! అంటుంది బామ్మ.

“పొద్దెక్కి లేచేవ్! ఎంతసేపలా పెయ్యిని చుస్తూ నిలబడతావే? వెళ్ళూ – పెయ్యి ఎక్కడికీ వెళ్ళిపోదు. వెళ్ళూ – పళ్ళు తోముకురా. జయపురం మావయ్యొచ్చేడు. నూద్దగ్గర స్నానం చేస్తున్నాడు. బుజ్జి లేవలేదింకా అనుకున్నాడు,” అని అమ్మ గట్టిగా కేకలేసింది. 

ఏఁవిటో నేను!

బెండ్లుగొడ్డూ – గేదెపెయ్య – దానిలోంచి గేదెపడ్డ – గేదెపడ్డ లోంచి పెద్దిగాడూ – పెద్దిగాడు లోంచి లింగంగారూ – ఓమాటతో మరో మాట, ఓ మనిషితో మరో మనిషీ – ఎక్కడెక్కడికో నా బుర్ర వెళ్ళిపోతూ ఉంటుంది! అట్నించి మళ్ళీ ఇటు తిరిగిరాడానికి ఎవరో ఏదో చెప్పి పిలిస్తేనో, కేకలేస్తేనో! లేపోతే అందులో అలా కొట్టుకుపోతూనే ఉంటా!

పరిగెట్టే పళ్ళు తోముకోడానికి! జయపురం మావయ్య నాకోసం ఈసారి ఏం తెచ్చేడో అనుకుంటూ!

నందివర్థనం పువ్వులు కోస్తూ “లేచేవే తల్లిగా!” బామ్మ పలకరించింది. “పళ్ళు తోమేసుకున్నావా? అయితే చేతులు బాగా కడుక్కుని ఆ మందారపువ్వులు కోసిపెట్టు. నాకు అంది చావవు,” అంటూ పని పురమాయించింది. 

పొట్టిగోడ పక్కనే ఉంది మందారచెట్టు. గౌను పైకి లాక్కుంటూ గోడెక్కే. బామ్మ గోడ పక్కని ఇత్తడి సజ్జ ఎత్తిపట్టుకుంటే ఒక్కొక్క పువ్వూ కోసి అందులే వేసే. రోజూ కొక్కెం కర్రతో కొమ్మ ఒంచి కోసుకుంటూ ఉంటుంది. బడీ గిడీ లేకుండా పువ్వులు కోసుకునే సమయానికి లేచేనుగా! ఇవాళ నాచేత కోయించుకుంది. పాపం – పొట్టిమనిషి కదా – తలెత్తి కొక్కెంతో లాక్కుని అన్నన్ని పువ్వులు సజ్జనిండా కోసుకోడం కష్టమే! మెడ పట్టేసింది అని అందుకే అనుకుంటూ ఉంటుంది.

గోడమీంచి ఓ గెంతుతో దూకేసి ఒక్క పరుగు పెట్టే నట్టింట్లోకి. అమ్మ పాలగ్లాసు ఇవ్వడం ఏఁవిటి, నేను దాన్ని తీసుకుని మావయ్య దగ్గరికి వెళ్ళడం ఏఁవిటి – కన్ను మూసి కన్ను తెరిచేలోగా. ‘పాలు ఒలికిపోతాయి. మెల్లిగా వెళ్ళవే. వచ్చిన మావయ్య ఎక్కడికీ పారిపోడు’ అని అమ్మ అరుస్తున్నా నేను చెవి పెట్టలేదు!

మావయ్య కిటికీ గూట్లో పెట్టుకున్న తన పెట్టెలోంచి ఓ అట్టపెట్టె పెద్దది తీసి ‘చాప తీసుకురా. చాప మీద కూర్చుందాం’ అన్నాడు. చాప పరవగానే అట్టపెట్టీ, ఓ చిన్న కత్తెరా – ఏఁవిటేఁవిటో సరంజామా అంతా చాపమీదకి దించేడు. చిన్న అట్టపెట్టిని చూడగానే నాకు తెలిసిపోయింది. 

“ఓహోహో! నాకు తెలిసిపోయిందోచ్చి. గాజుల పెట్టి అది. గాజులు తెచ్చేవ్!” అంటూ తప్పట్లు కొట్టే.

“అవునే. గాజులే తెచ్చా. నువ్వు ఎప్పుడూ వేసుకునే రకంవి కావు.”

నిజఁవే! అలాంటి గాజులు నేనింతవరకూ వేసుకోవడం మాట దేవుడెరుగు – చూడను కూడా చూడలేదు! లక్కగాజులు. చిన్నచిన్న అద్దాలు. డైమండ్ ఆకారంలో అతికించి చేసిన ఎర్ర లక్కగాజులు!

“అమ్మోయి! మావయ్య ఎంచక్కటి గాజులు తెచ్చేడో నాకోసం. చూద్దువుగాని రా. రావేం? కొత్తగా ఉన్నాయి. రా, రమ్మంటూ ఉంటే! రావేం?” అమ్మని రమ్మని గోల చేసి చెయ్యి పట్టుకు లాక్కొచ్చా. 

“చేతిలో పని ఒదిలిరావాలా? ఏఁవిటా సంబరం? ఆగు వొస్తున్నా! అదీ సరి. నువ్వూ సరి. ఇప్పుడే నేనూ చూడాలా? పొద్దున్నపూట పని తొడతొక్కిడిగా ఉంటుంది. దానికితోడు ఇవాళ గేదొకటి ఈనింది! మధ్యాహ్నం భోజనాలయాక తాపీగా ఇవ్వాల్సింది. దీని సంగతి తెల్సుగా. నిమిషాల మీద అది అడిగినట్టు అన్నీ చేసీయాలి! పట్టు పట్టిందంటే ఒదలదు.” చీరకొంగుతో తడిచేతులు తుడుచుకుంటూ అమ్మ మావయ్యతో అన్నాది.
 
మావయ్య నవ్వేడు. “పిల్ల సంబరం కన్నా పనులెక్కువేంటి అక్కా! నీకూ నీ అత్తగారికీ పనులు లేనిదెప్పుడూ! చూడు, బుజ్జి మొహం ఎలా వెలిగిపోతోందో!”

రెండు చేతులూ ముందుకు చాచి ‘పాత గాజులు తీసేసి కొత్తగాజులు తొడుగూ – దా కూచో. నిల్చుని చూడ్డం కాదు’ అన్నా. అమ్మకి చాప మీద కూచోక తప్పలేదు! నా చేతులకి ఉన్న గాజులు తీసేసి కొత్తగాజులు తొడిగింది. రెండు చేతుల్నీ తిరగా బోర్లా తిప్పుతూ మావయ్య మొహం ముందు పెట్టి – 

తళుక్క్ తళుక్క్! బుజ్జి అద్దాలు!తళుక్క్ తళుక్క్ తళతళతళుక్క్!బుజ్జి బుజ్జి అద్దాలు తళుక్కు తళుక్కూ! – పాడ్డం మొదలు పెట్టే. 

బుజ్జి బుజ్జి బుజ్జీ బుళక్ బుళక్! బుళక్ బుళక్ తళతళ తళుక్ తళుక్ బుజ్జితల్లి బుజ్జి బుజ్జి అద్దాలు తళుక్ తళుక్ తళుక్ తళుక్కూ!- తనూ పాడుతూ మావయ్య నన్ను తన ఒళ్ళో కూచోపెట్టుకున్నాడు. 

“ఆది లేకపోయినా సరిగ్గా సరిపోయాయి! తెల్లటి గుండ్రటి మణికట్టు మీద గుత్తలంగా ఎర్రరంగుతో అందంగా ఉన్నాయి!” అమ్మ మావయ్యను మెచ్చుకుంది. 

“నీక్కూడా తెద్దామనుకున్నా. నీ ఆది సరిగ్గా అంచనా వెయ్యలేకపోయా. ఆమధ్య కటకం వెళ్ళే. అక్కడ కొన్నా. ఓ గాజు నీది ఇయ్యి. పెట్లో పడేసుకుంటా. ఈసారి కటకం వెళ్ళినప్పుడు తెచ్చి పెడ్తాలే ఓ సెట్టు గాజులు,” అన్నాడు మావయ్య. 

“అమ్మా! మర్చిపోతావ్ మళ్ళీ – ఇప్పుడే నీ చేతిగాజు తీసి మావయ్యకిచ్చీ. పెట్లో పడేసుకుంటాడు.”

“అక్కా! బుజ్జి చెప్పింది నిజఁవే. ఓ గాజు ఇప్పుడే ఇచ్చెయ్యి,” నవ్వుతూ అన్నాడు మావయ్య. 

అమ్మ కూడా నవ్వుతూ తన చేతి గాజు ఓటి తీసి మావయ్యకి ఇచ్చి చాప మీంచి లేచింది. “నువ్వూ నీ మేనగోడలూ పాటలు పాడుకుంటూ కూచోండి. నాకు అవతల చచ్చేటంత పని ఉంది.”

“చంటిగాడు లేవలేదా? వాడికోసం…” మాట పూర్తి కాలేదు. 

“నీకు పుణ్యం ఉంటుంది. వాణ్ణి లేపీకు. తెల్లారు జామున పాలు తాగించి పడుకోబెట్టా. లేచేడంటే నా కొంగు పట్టుకు ఒదల్డు. పని చెయ్యనియ్యకుండా కాళ్ళకి అడ్డం పడతాడు!” అన్నాది అమ్మ. 

“తమ్ముడికేం తెచ్చేవ్ మావయ్యా? చూపించు, చూపించూ!” తన ఒళ్ళోంచి లేచిపోయి నిల్చున్నా. 

గుడ్డలో చుట్టబెట్టిన దాన్ని తీసి, దాని చుట్టూ ఉన్న కాయితాన్ని చింపేడు మావయ్య. వెళ్ళిపోతున్నదల్లా అమ్మ నిలుచుండి పోయింది అదేమిటో చూడ్డానికి!

ఢమఢమాలబండి!

“దాన్ని మళ్ళీ పెట్టెలో పెట్టీ. తర్వాత ఇద్దువుగాని.” మరోసారి మావయ్యకు చెప్పింది అమ్మ. ఇహ ఇప్పుడు ఢమఢమాలబండి తాడు పట్టుకొని లాగుతూ ఢమఢమఢమా చప్పుళ్ళతో అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతాడు. బండినీ వొదలడు. అమ్మనీ వొదలడు. బామ్మ దగ్గరికీ వెళ్ళడు. నాకు తెల్సు!

ఇవాళ రోజురోజంతా సంబరంతో గడిచిపోయింది. 

మావయ్య పక్క కూచునే భోజనం. కూచున్నది మొదలు లేచేవరకూ కలుపుకున్న అన్ని అన్నాలతో పాటు పచ్చిబఠాణీ కూరే తింటూ – ఇంకా వెయ్యి, ఇంకా వెయ్యి అని ఎన్నిసార్లు వేయించుకున్నానో!

జయపురంలో పచ్చిబఠాణీలు తాజాగా మాబాగుంటాయి. మావయ్య వచ్చినప్పుడు పచ్చి బఠాణీలు, పాలగుండా తప్పకండా తెస్తాడు. 

ఇష్టం అని కడుపెక్కా మెక్కడం మంచిది కాదు, అంటూనే ఉన్నాడు నాన్న. మావయ్య పక్కన కూచుని తింటున్నాగా. నాన్న మాట వినిపించుకోలేదు!

“నేనొచ్చేను. దానికిది ఆటవిడుపు. నువ్వేం మాటాడకు బావా!” అని తాఖీదు ఇచ్చీసేడు మావయ్య. ఒక్కరోజు తింటే ఏం కాదులే అని భరోసా కూడా ఇచ్చేడు. 

గేదె ఈనింది కాబట్టి వొండలేదు కాని పాలగుండతో పాలముంజెలు కూడా చేసేవారే! జున్ను తినీ పాలముంజెలు ఎక్కడ తినగలం? తాటిముంజెల్లా నున్నటి పాలముంజెలు అరచేతిలో పెట్టుకుంటే జారిపోతాయి. 

తాటిముంజెల్లో నీళ్ళుంటాయి. పాలముంజెల్లో నీళ్ళుండవ్!

అనుకోకుండా జయపురం మావయ్య వచ్చినట్టే బామ్మ స్నేహితురాలు మాణిక్యాంబగారూ వొచ్చేరు! 

“కర్ణపిశాచి ఉన్నట్టు చూశావా ఎలా వొచ్చేనో!”

“ఊళ్ళో ఇల్లైనా దూరమాయె. ఎవరిచేత నీకు పంపడమా అని కిందామీదా పడుతున్నా. బాబునే ఓసారి అటువేపు వెళ్ళి ఇచ్చొస్తావా అని అడుగుదామనుకుంటున్నా. నువ్వే వొచ్చేసేవ్!” బామ్మ సంబరం అంతా ఇంతా కాదు. 

“మీరే కాదండోయ్! కర్ణపిశాచి ఉన్నట్టు నేనూ వొచ్చీసే,” అన్నాడు మావయ్య. 

జున్ను అంటే ఎవరికిష్టం ఉండదూ! అందులోనూ బామ్మలా సరీగ్గా పాళంగా పంచదార వేసి మిరియంగుండా ఏలకగుండా వేసి చేసిన జున్ను ఎక్కడ దొరుకుతుందీ! 

“నీ స్నేహితురాలు వొచ్చేసింది. జున్ను పెట్టేస్తావ్! నా నేస్తమే రాలేదు కద! దానికీ జున్నంటే ఇష్టమే.”

“రాజమండ్రీ వెళ్ళి నీ నేస్తం నాగమణికీ జున్ను ఇచ్చి వొస్తావేంటే?” అంటూ గలగలా నవ్వింది బామ్మ. 

ఎంతమంది ఇళ్ళకు వెళ్ళేనూ ఇవాళ! లింగంగారి ఇల్లంటే దగ్గర. కోట్ల మాదప్ప వీధిలో ఉన్న దూదేకుల సాయిబుగారి బూబమ్మ ఇల్లూ దగ్గిరే. ఎటొచ్చీ పోలీసుపెళ్ళాంగారి ఇల్లే దూరం! నాన్న స్నేహితుల ఇళ్ళకు వెళ్ళక్కర్లేదు. “రేపు వాళ్ళే వొచ్చి ఇక్కడ తింటార్లే,” అన్నాడు నాన్న.
 
వరుసగా రోజూ జున్నే! మురుగుపాలు అయిపోయేంతవరకూ. 

“అక్కా! కటకం వెళ్ళేనని చెప్పేను కదా! అక్కడా ఇలాగ్గానే నే దిగినరోజునే నా ఒడియా స్నేహితుడు మిశ్రా ఇంట్లో ఆవు ఈనింది. భలే మంచి వేళన ఒచ్చేనే! జున్ను పెడతావన్న మాట అన్నా. జున్నేవిఁటీ అన్నాడు మిశ్రా. ఆవు ఈనిందిగా అన్నా. అప్పుడు ఆయన చెప్పింది విని ఆశ్చర్యపోయా. వాళ్ళు జున్ను వొండుకోరట. ఆవుకీ పురుడు పాటిస్తారట. శుచి అయ్యేవరకూ పాలు పిండుకొని వాడుకోరట!” 

“ఆచారవ్యవహారాల్లో ఎంత తేడానో!” బామ్మా మాణిక్యాంబగారూ ఒకేసారి అన్నారు. 

“ఎక్కడ ఎప్పుడు ఏది తింటామో తాగుతామో తెలీదు. అందుకే అంటారు దానే దానేపర్ ఖానేవాలేకా నామ్.” ప్రతిగింజ మీదా తినేవాడి పేరు రాసి ఉంటుందట. మావయ్య చెప్పేడు. 

సుబ్బరంగా జున్ను వొండుకు తినని వాళ్ళ ఆచారం ఏఁవిటో! 

కాని, దానే దానేపర్ ఖానేవాలేకా నామ్ నాకు నచ్చింది. హిందీ విండానికి బాగుందే అనుకున్నా. 

“మనఁవూ అంటాం అదేమాట. ఉదకఋణానుబంధం అనీ. ఎక్కడ నీళ్ళు తాగాల్సి ఉంటే అక్కడికి మనల్ని లాక్కుపోతుంది,” అన్నాది బామ్మ. 

“అంతేనే, నువ్వన్నమాట నిజం. తినే తిండైనా, తాగే నీరైనా, పీల్చే గాలైనా ఋణానుబంధమే! మేం చూడూ ఎన్ని ఊళ్ళు దేశం అంతా బదిలీల మీద తిరిగేమో! బదిలీలు వొదిలీ, కాలికి చక్రాలున్నట్టు దేశాలు తిరిగేవాళ్ళని చూట్టం లేదూ? అందరూ దేశదిమ్మర్లు అవుతారా? కారే!” అన్నారు మాణిక్యాంబగారు. 

“రైలు తప్పిపోయి ప్రయాణం ఆగి తిరిగి ఇంటికి వొచ్చేస్తాం. అంటే ఏఁవిటీ? ఇక్కడి నీరు ఇంకా ఆ రోజూ తాగాల్సి ఉందన్నమాట!” అన్నాది బామ్మ. 

“మీ ఉత్తరాది చుట్టాల కథే!” అని అమ్మ నవ్వింది. బామ్మ ఉత్తరాది చుట్టాల కథ ఎప్పుడు విన్నా పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వొస్తుంది. 

ఆయన బాగా దూరపు చుట్టరికపు బంధువు. బామ్మ తోడికోడలు బాబాయిగారి వేపువాడు. బామ్మ ఎంత దూరపు చుట్టరికమైనా ప్రాణం పెడుతుంది. ఆప్యాయంగా అందరినీ అక్కున చేర్చుకుంటుంది. అందుకే అందరూ అలా వొచ్చేస్తూ ఉంటారు! ఉత్తరాది నుంచి పిల్లాపాపలతో అంతంత దూరం రైల్లో పడి వచ్చేటప్పుడు మధ్యలో ఓ మజిలీగా కావల్సిన వారింట దిగి ఓ రోజు ఉండి వాళ్ళ ఆప్యాయత పొంది విశ్రాంతిగా వెళ్ళాల్సిన దక్షిణాది ఊరు చేరుకోవడం సౌకర్యంగా ఉంటుంది.

“ఏఁవిటా కథా కమీమీషూ? చెప్పక్కా మేఁవూ విని నవ్వుతాం.” అడిగేడు మావయ్య. 

“చెప్పమ్మా  చెప్పు. చెప్పు. కొన్ని ఎన్నిసార్లు విన్నా భలే మజాగా ఉంటాయి. తెలిసిందే అయినా మళ్ళా మళ్ళా విని మళ్ళామళ్ళా నవ్వుతూనే ఉంటాం!”

“అవునే, పాతపడమన్నా అవి పాతపడవు. చెప్పేవాళ్ళ ధోరణి అది! వాళ్ళు చెపితేనే అలా ఉంటుంది. పొడిపొడిగా కట్టె-కొట్టె-తెచ్చె లాంటివాళ్ళు చెప్పేవి కావు!” అన్నాడు మావయ్య. 

“బావ చెప్పే మాటల్నే నువ్వూ అంటున్నావురా!” అంది అమ్మ. 

“బావ చెప్పినా, నే చెప్పినా నిజం నిజఁవే కదా!”

ఆయన్ను చూస్తేనే నవ్వు ఆగదు! ఆయన్ని ఎదురుగా చూస్తున్నట్టు నవ్వడం మొదలు పెట్టే. ఉత్తరాది నుండి వస్తాడు కదా. ఆయన్ని శర్మాజీ అని అంటారుట. అమ్మ చెప్పింది. 

“ఆ శర్మాజీనో ఎవరో ఈమధ్యే వొచ్చేరా ఏంటీ? ఈ పెంకిపిల్ల అలా నవ్వుతోంది?” అడిగేరు మాణిక్యాంబగారు. 

“అవును. ఈమధ్యేవొచ్చి వెళ్ళేరు. ఆయన మహా తాపీ మనిషి. మొహం కడుక్కోవటం ఓ గంట! గోలెండు నీళ్ళూ ఆ కడుక్కోడానికి చాలవు. కాఫీ ఇవ్వడానికి కాచుక్కూచునేదాన్ని! చెపితే మీరు నమ్మరు!” 

“అమ్మా! అమ్మా! శర్మాజీగారి దొడ్డి సంగతో? అద్చెప్పూ, అద్చెప్పూ!”

“శర్మాజీగారేఁవిటే అగ్గినిప్పులా?” మావయ్య నామాటకు నవ్వబోతే నే అడ్డుతగిలే. “పెద్దవాళ్ళని గారు అనాలి. అందులోనూ బామ్మ చుట్టాలాయన ఆయన.”

“జీ అంటే గారు అనేనే! తెలివితక్కువదానా! ‘జీ’ తగిలించి గౌరవంగా పిలుస్తారలా!” 

“ఓహో, అలానా? తెలిసింది తెలిసింది మావాజీ! నాన్నాజీ నాకీ జీ సంగతి చెప్పలేదూ” అని దీర్ఘాలు తీస్తూ “అమ్మాజీ, అమ్మాజీ, నే చెప్పనా శర్మాజీ దొడ్డిసంగతీ? మావాజీ, మావాజీ మరే, మరే, పాపం శర్మాజీ పెద్దపిల్ల, పెద్దపిల్లకి అర్జంటు – యమ అర్జంటూ. ఆయన దొడ్డి లోంచి ఎంత సేపటికీ రాడే,” అని చెప్పబోయి పొట్ట పట్టుకు ఒంగిపోయి నవ్వడం మొదలెట్టా. 

“చెప్పన్నా నవ్వు. నవ్వైనా చెప్పు. అయినా అందులో నవ్వడానికేముందీ? అందరూ ఒక్కలా ఉండరు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా అలా మాటాడకూడదు. నవ్వకూడదు.” బామ్మ కోప్పడ్డాది. 

“నే మాట్టాడను. బామ్మాజీకి కోపం వచ్చింది.” నోటిని రెండుచేతుల్తో మూసుకున్నా నవ్వు ఆపుకోడానికి. 

“ఇక ఇంటిల్లిపాదికీ ఈ జీ తగిలిస్తావేంటే కొంటెపిల్లా!” నవ్వుతూ అన్నారు మాణిక్యాంబగారు. 

“దూరాభారం కాబట్టి మనింట దిగేరు. ఏదో నాల్రోజులున్నారు. వెళ్ళేరు. వాళ్ళని యాగీ చేయొచ్చా? నవ్వొచ్చా? తప్పు కాదూ?” అంటూ బామ్మ విసవిసలాడింది. 

“నవ్వొచ్చేటట్టు ఉంటే నవ్వరటే? అవునూ, ఇంతకీ అసలు వాళ్ళ ప్రయాణం ఎందుకాగిపోయిందీ?” మాణిక్యాంబగారు అడిగేరు. 

“ఏం లేదండీ. ఆయనకి భార్య సద్దితే నచ్చదు. ఆయనే అన్నీ చూసుకుని సద్దుకోవాలి. పోనీ అని తొందరగా చెయ్యగలడా? అన్నీ తాపీనే కదా! హోల్డాల్లోరెండు, ఓ రెండు పెట్టెలు, సంచులు, నీళ్ళ కంచెంబు – అడక్కండి. బండెడు సామాను!”

“దూరాభారం నుంచి వస్తున్నారు కదమ్మా! సామాన్లు మరి ఎక్కువగానే ఉంటాయి,” అన్నారు మాణిక్యాంబగారు. 

“నిజఁవే అనుకోండి. అక్కడికీ ఆ పెళ్ళాం అన్నిటినీ సర్దడానికి వీలుగా పెడుతుంది.”

“బాగా చాదస్తుఁడన్న మాట శర్మాజీ,” అన్నాడు మావయ్య. 

“చాదస్తంలోనూ ఇలాగా అలాగానా? చూసి తీరాలి ఆ పెద్దమనిషిని!

పెద్ద ఇత్తడి మూకుడులో ఎర్రగా దళసరి పెచ్చు కట్టేటట్టు దిబ్బరొట్టె చేసి ఓ కేరియరూ, దిబ్బరొట్టెలో నంచుకోడానికి బెల్లమావకాయా, పచ్చావకాయా, తేనే పెరుగూతో మరో కేరియరూ – నేను పెట్టేను. కేరియర్లు వాళ్ళు తెచ్చుకున్నవే అనుకోండి. ఒకటికి పదిసార్లు లెక్కపెట్టుకుని సాయిబు జట్కాబండి ఎక్కి వెళ్ళేరు. వాన వెలిసినట్టయిందనుకుంటూ వీత్తలుపు వేసి నడుం వాల్చా. మాగన్ను పట్టిందో లేదో తలుపులు బడబడా బాదేరు వాళ్ళ పిల్లలు. వెళ్ళినవాళ్ళు వెళ్ళినట్టూ తిరిగి వచ్చేసేరు!

రైలు తప్పిపోయింది!

“మనిల్లేమో ఇస్టేసనుకి దూరం. బేగి బయలెల్లకపోతే గాడీ ఎనా అందుతాదమ్మా? అన్నాడు జట్కా సాయిబు.”

“మర్నాడు వెళ్ళేరా అయితే?” అడిగేడు మావయ్య. 

“ఎక్కడా? మర్నాడు మంచిరోజు కాదు. ఎలా వెళ్తాం? అన్నాడాయన. మీ బావా నువ్వూ పనులుంటే అలా మంచులూ వర్జ్యాలూ వారాలూ చూస్తే ఎలా కుదురుతుందీ అంటారు కాని అందరూ అలా ఉండరుగా? ఆఫీసుకు సెలవు పెట్టుకొని వచ్చేడు. తొందరేముందీ? అన్ని ఊళ్ళూ తిరిగి బంధువులందరినీ చూసిరావడానికే కద బయల్దేరింది! మూడోనాడూ మళ్ళీ అదే తంతు! ఓ రోజు ఉండిపోయారుగా. వాడుకోవాలంటూ మళ్ళీ అన్నీ విప్పేసేరు!”

“వెర్రివాళ్ళలా ఉన్నారు!” అన్నారు మాణిక్యాంబగారు.

“ఆయనేనండీ చాదస్తుఁడూ! పాపం ఆ పెళ్ళాం ఆయనతో ఎలా వేగుతోందో!” అన్నాది అమ్మ. 

“మొగుడు ఎలాంటివాడైనా వాడితో అలవాటైపోతుందమ్మా. తప్పదు కదా! వాళ్ళు మారరు కదా!” 

నేను నానోటి మీద పెట్టుకున్న చేతుల్ని తియ్యలేదు. వింటున్నా మాటాడకండా. నవ్వకండా. నా బుర్రలో ప్రశ్న పుట్టి నన్ను గొలుకేస్తోంది. 

పోలీసూ పెళ్ళాం ఓ రకం. ఈ శర్మాజీ పెళ్ళాం ఇంకోరకం. నాగమణీ అమ్మా నాన్నా మరోరకం. ప్రపంచకంలో పెళ్ళాలే మొగుళ్ళవల్ల వేగలేక ఛస్తున్నారు! ఎందుకనీ? ఇప్పుడు అడిగేననుకో – మళ్ళీ నా ప్రశ్నలనీ నన్నూ దెబ్బలాడతారు. లేదా పెద్దయ్యాక నీకే తెలుస్తుంది అంటారు. సరిగ్గా చెప్పరు. 

“అయితే ప్రయాణం అబద్దీ ప్రసాదం నిబద్దీ అయిందన్నమాట!” అన్నారు మాణిక్యాంబగారు. 

నేను అడక్కుండా ఉండలేకపోయా! దాని అర్థం నాకు బోధపడలేదు. ఎప్పుడూ అలా అండం వినలేదు. “అబద్దీ నిబద్దీ అంటే ఏఁవిటీ?” అని అడిగే.

“మాట లోంచి మాట పుట్టించేనని గెంతుతావుగా! నువ్వే అర్థం చేసుకో,” అన్నాది అమ్మ. 

ఆలోచిస్తే తెలుస్తుందేమో! నాకు ఆలోచించాలని లేదు. 

“చెప్పమ్మా. నాకు తెలీలేదు చెప్పమ్మా!” అని మళ్ళీ అడిగే. 

“నీకు ఆ గోడగుర్రం ఎక్కితే కాని ఆలోచనలు రావేఁమిటే?”

“ఇప్పుడూ బుర్రని గొలుకుతున్న ప్రశ్నలున్నాయి. అది వేరు. ఇది వేరు. మావయ్యా! నువ్వు చెప్పవా?”

మాణిక్యాంబగారు నవ్వి, “నేనే చెప్తాలే – ప్రయాణం అబద్ధం అయింది. ప్రసాదం అంటే భోజనాలు నిజం అయాయీ అని!” 

ఓహో! అబద్ధమూ నిబద్ధమూనా! 

“అయితే అక్కా! మళ్ళీ దిబ్బరొట్టె కాల్చారా?”

“లేదురా! వేరుసెనగపప్పు దండిగా వేసి పులిహోర చేసేం. రెండు గిన్నెల్లో తోడు పెట్టి మీగడ పెరుగు ఇచ్చేం. రెండుగంటలు ముందస్తుగా జట్కాబండితో వొచ్చి గేట్లో కూచున్నాడు జట్కాబండి సాయిబు. వాడెంత వేగిరం వచ్చినా వీళ్ళు తెవిలితేనా? స్టేషను రోడ్డు వేపు తిరుగుతున్నారట. రైలు కూత వినిపించిందట. సాయిబు ‘బండి తప్పిపోనారండీ ఇయాళానూ’ అన్నాట్ట. ఏ రైలేనా కూస్తుంది. మారైలేనని ఎలా చెప్తావ్? అని కసిరేట్ట శర్మాజీ. 

రైలు అందలేదు. తిరుగుటపాలో ఉత్తరం వొచ్చీసినట్టు ఇంటికొచ్చీసేరు. ఉదకఋణానుబంధం – మనింటి భోజనమూ నీళ్ళూ ఉన్నాయి. రైలెలా అందుతుందీ? అంటారు అత్తయ్య.”

“పెద్ద ఫార్సే!” నవ్వేడు మావయ్య. 

వీధిలోకి వెళ్ళిన నాన్న వచ్చేడు. “ఏవిఁటీ, పెద్ద ఫార్సు అంటున్నావూ?” అని అడిగేడు. 

“శర్మాజీ ప్రయాణం కథ,” అని మళ్ళీ నవ్వేడు మావయ్య. 

“అదా!” నాన్నా నవ్వేడు. 

“ఎంత మీరంతా నవ్వినా నే చెప్పేదే నిజం. ఇక్కడి ఈ నీరు తాగాల్సి ఉండి, బండి తప్పిపోతూ వొచ్చింది.” బామ్మ తన మాటని వొదలలేదు. “మాణిక్యాంబా నువ్వూ ఇవేళే ఎందుకొచ్చేరూ? ఈ జున్ను తినాల్సి ఉంది! వొచ్చేరు!” అంటూ బామ్మ తన మాటకి వీళ్ళ దృష్టాంతం కూడా చెప్పింది. 

“అమ్మా! దీన్ని కాకతాళీయం అంటారు. కర్ణపిశాచీ కాదు. జున్ను ఋణానుబంధమూ కాదు. కాకీ వాలింది. పండూ పడింది. అంతే! శర్మాజీ స్వభావం వల్ల మూడుసార్లు రైలు తప్పిపోయింది!” నవ్వుతూ చెప్పేడు నాన్న.