ఊహల ఊట 26

మాఘమాసం అంటే పెళ్ళిళ్ళ మాసం. మిగతా విశిష్టతలకన్నా పెళ్ళిళ్ళదే ముఖ్యమైన విశిష్టత.

ఈ మాఘమాసంలో పెళ్ళి చేసేస్తాం, ఈ ఏడు మాఘంలో చేసేస్తాం అంటూ ఇంట్లో కూచోపెడతారు, ఆడపిల్లకి చదువు చెప్పించడం ఆపేసి. చదివేవులే స్కూలు ఫైనలు వరకూ లేదా టెంత్ వరకూ అంటారు. అలాగే, ఆ అమ్మాయి కూడా పెళ్ళి కోసం ఈ మాఘం కోసం ఆ మాఘం ఎదురు చూస్తూ కూచుంటుంది. ‘మాఘమాసాలు ఆగమేఘాల మీద వచ్చివెళ్తూ ఉంటాయి! కానీ ఏ మాఘంలోనూ పెళ్ళవదు! ఇదీ ఆడపిల్ల స్థితి!’ అని ఎవరన్నా అంటే బామ్మ ఊరుకోదు. కత్తులు దూస్తుంది.

‘పాపం డబ్బు అందితే చేద్దామనుకున్నారు. అందకపోతే ఏం చేస్తారు? కట్నానికి – డబ్బు సమకూడాలా? ఏ తల్లికి ఏ తండ్రికి పిల్ల పెళ్ళి తొందరగా చేసేద్దామనీ? వచ్చే మాఘమాసంలో అందితే చేద్దామనుకుంటారు. తప్పా?’ అని తగాదాకు వస్తుంది. మరి చదువు చెప్పిస్తూ ఉండొచ్చుగా అయ్యేవరకూ అంటే ఊఁహూఁ, చదువు చెప్పిస్తే దీనికన్నా ఎక్కువ చదువు ఉన్నవాణ్ణి తేవాలిట! వాడు మరింత కట్నం కావాలంటాడట! ‘అంత కట్నం ఎక్కణ్ణుంచి తెస్తారూ? ఈ కట్నానికే డబ్బు ఎక్కడా పుట్టకపోతే – సమకూడ్డం లేకపోతే! వాళ్ళ చేతుల్లో ఉంటే ఏనాడో చేసేవాళ్ళు. ఓ పిల్లాడి కాళ్ళు కడిగి అమ్మయ్య అనుకునేవారు! ఆడపిల్ల బరువు వదిలించుకునేవారు! అవటం లేదు! మాఘమాసాలు వచ్చి పోతున్నాయి!’ అని వత్తాసు పలుకుతుంది.

అన్ని మాసాల్లోనూ మాఘమాసం విశిష్టమైనది అంటారు. అన్ని మాసాల్లోనూ నేనుండే మాసం మాఘమాసమే అంటాడు నారాయణుడు! ఆ రకంగా అందరూ ఈ మాసాన్ని విశిష్టమైనదే అంటారు. సూర్యుడి కిరణాలు దక్షిణాయనంలో కన్నా ఉత్తరాయణంలో వేరుగా పడతాయి. కళ్ళకి మంచిది. రెండు చేతులూ పైకెత్తి సూర్యుణ్ణి చూస్తూ పాదాలవరకూ వొంగి నమస్కారాలు చేయడమే సూర్యనమస్కారాలు. ఆ వ్యాయామం చేయటమే సూర్యనమస్కారాలు! మనవాళ్ళు దైవపరంగా పెట్టినదే అయినా అర్థవంతమైనది, డి విటమిను పుష్కలంగా దొరుకుతుంది. ఆరోగ్యానికి ఎంత మంచిదో!

ఈ పెద్దవాళ్ళు సూర్యనమస్కారం అంటే తూర్పువేపు తిరిగి వచ్చీరాని సూర్యుడికి నమస్కారం చేసి లెంపలు వాయించుకుని దణ్ణం పెడతారు. అది కాదు సూర్యనమస్కారం! ఎలా చెయ్యాలో అలా చెయ్యకుండా చేస్తున్నారు! ప్రయోజనకరం కానిది!

మాఘమాసంలో ఐదువారాలు వస్తాయి. మహాపాదివారాలు అంటారు కదా! చిక్కుడు ఆకులతో ఆవు పిడకల కింద తులసమ్మ కోట దగ్గర వండిన పరమాన్నం రుచి మామ్మూలుగా ఇళ్ళల్లో చేసే పరమాన్నం కన్నా ఎంతో రుచిగా ఉంటుంది. ఎందుకుండదూ? ఆవు పాలలో నీళ్ళు కలపకుండా కాసిని బియ్యం వేసి ఉడకబెడతారాయిరి. కోవాలా దగ్గరపడి రుచిగా ఉంటుంది. నీళ్ళు కలిపి చేసే పరమాణ్ణం ఎక్కడ, ఈ పరమాణ్ణం ఎక్కడ! వెయ్యితాళ్ళు వెయ్యాలి రెండింటినీ కలిపి చూడడానికి!

అంతేనా, సూర్యారాధన కదా! సూర్యుడి రథం పుల్లలతో చేసి తులసమ్మ కోట దగ్గర పెట్టి దణ్ణం పెట్టుకోవాలిట. ఆ రథం ఎంత బాగుంటుందో! అందరూ అంత బాగా చెయ్యలేరు, బామ్మ చేసినట్టూను. ఆవిడ దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. అమ్మ కూడా అలా చెయ్యలేదు! నేర్పరితనం కావాలి.

పెసలు నానబెట్టి మొక్కపెసలు అయ్యేంతవరకూ ఉంచి కొంతమంది పిల్లలు లేని ఆడవాళ్ళు దణ్ణం పెట్టుకుంటారట! పిల్లలు కలగాలని సూర్యుడికి మొక్కుకుంటారుట!

ఐదు ఆదివారాలూ నెత్తి మీద జిల్లేడు ఆకులూ రేగిపళ్ళూ పెట్టి నీళ్ళు పోస్తుంది నాకూ తమ్ముడికీ బామ్మ. అలా చేస్తే ఆరోగ్యంగా ఉంటామట! పిల్లలకే కాదు, పెద్దవాళ్ళూ అలాగే తలమీద రేగుపళ్ళూ జిల్లేడు ఆకులూ పెట్టుకుని స్నానం చేయాలిట. నాలుగు కాలాలపాటు ఆరోగ్యంగా ఉండటమే కాదు, నిండా నూరేళ్ళు జిర్రుమని చీదకుండా బతుకుతారట! నాన్ననీ అలాగే పెట్టుకుని పోసుకోమంటుంది. నాన్న వీటిని నమ్ముతాడో లేదో తెలీదు! బామ్మ మాట కొట్టీడమే? వీల్లేదు కాక వీల్లేదు. తనూ పోసుకుంటాడు. తలమీద జిల్లేడు ఆకులూ రేగిపళ్ళూ పెట్టుకుని!

అమీను తాతగారు ఎంత పెద్దవారో! అయనా అలాగే స్నానం చేస్తారు. చిట్టి బామ్మగారూ అలాగే చేస్తారు! పాపం అమీను తాతగారికి రెండు కాళ్ళూ బోదకాళ్ళే. ఇంతింత లావుగా ఉంటాయి. వాటిని ఈడ్చుకుంటూ వెళ్ళి కుర్చీపీట మీద కూచుని రేగిపళ్ళూ జిల్లేడు ఆకులూ పెట్టుకుని స్నానం చేస్తారు.

పిన్నీ రాజునాన్నా కూడా అలా చేయాల్సిందే! చేయకపోతే ఊరుకుంటారా? తాతగారు బామ్మగారూ ఇద్దరూ వాళ్ళిద్దరినీ దెబ్బలాడరూ? ఎంత వీళ్ళు పెద్దవాళ్ళయినా వాళ్ళ అమ్మా నాన్నలు ఇంకా పెద్దవాళ్ళు కదా! మా ఇంట్లో పనిచేసే ముత్తమ్మని, చిట్టి బామ్మగారింట్లో పనిచేసే గైరమ్మనీ మా నూతి దగ్గరే నీళ్ళు తోడుకొని జిల్లేడు ఆకులూ రేగిపళ్ళూ ఇచ్చి నూతి నీళ్ళతో స్నానం చేయమంటారు! ఇద్దరికీ చెరో పాత చీరా కట్టుకోడానికి ఇచ్చి స్నానం చేసిన చీరల్ని ఉతుక్కోమని సబ్బుబిళ్ళని ఇచ్చి దొడ్లో ఆరేసుకోమంటారు! వాళ్ళూ అలాగే బుద్ధిగా స్నానాలు చేసి బట్టలు ఉతుక్కుని ఆరేసుకుంటారు, బామ్మావాళ్ళు ఇచ్చిన పాత చీరలు కట్టుకుని. పాచిపని పూర్తి చేయడం అప్పటికే అయిపోతుంది కాబట్టి వాళ్ళ గూడేనికి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం అంట్లూ చెంబులూ తోమడానికి వచ్చినప్పుడు అంట్లు తోమి వీధి గుమ్మాలు తుడిచి పేడనీళ్ళతో కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మర్నాటి పొద్దున్న చేయాల్సిన పనిని కూడా పూర్తిచేసుకుని వెళ్తారు!

మొదట్లో ఇద్దరు బామ్మలూ వాళ్ళ మీద ఇంతెత్తున లేచి ‘తెల్లారేక పొద్దున్న గుమ్మం కడిగి ముగ్గుపెట్టి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టాలి కాని సాయంత్రం చేయడం ఏమిటి, బుద్ధీ జ్ఞానం ఉందా?’ అని తిట్టిపోసేరు! తర్వాత ఏమనుకున్నారో ఏమో, వాళ్ళ మనసుని వాళ్ళు సరిపెట్టుకున్నారో లేకపోతే పొద్దున్న లేచేసరికి గుమ్మం ముందు శుభ్రంగా ఉంటోందని అనుకున్నారో కాని, ఊరుకున్నారు! సన్నేసి వచ్చి గేదె పాలు పితికేలోగా ఎలాగా తమ స్నానధ్యానాలు అవ్వాలి కాబట్టి అలాగ చేసేవారేమో తెలీదు!

ఈ పెద్దవాళ్ళ పనులు అర్థం అయి చావవు! ఏది ఎందుకు చేస్తారో! ఎవరూ వాళ్ళని పట్టించుకుని తిట్టేవాళ్ళు దెబ్బలాడేవాళ్ళు ఉండరు కదా! వాళ్ళు ఇతరులను తిట్టి దెబ్బలాడినట్టూనూ! అదీ విషయం!

నాన్న ఆడవాళ్ళ పనుల్లో జోక్యం చేసుకోడు. ఆడాళ్ళు వాళ్ళ ఏడుపు ఏదో వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళని సరిదిద్దడం ఎలాగూ కుదరదు. వాళ్ళు ఎవరి మాటా ఎలాగూ వినరూ అని ఊరుకుంటాడన్నమాట!

మాఘమాసంలో పెళ్ళిళ్ళు ఒడుగులూ మా జోరుగా జరుగుతాయి. అందరూ కావల్సిన చుట్టాలే స్నేహితులే! ఎంతమంది ఇంటికి వెళ్తాం అంటుంది బామ్మ. ‘మీరు వచ్చి పిల్లా పిల్లాడి తలమీద అక్షింతలు వేసి ఆశీర్వదించాలి వర్ధనమ్మా! పెద్దవారు. పిల్లా పిల్లాడూ ఆనందంగా పిల్లాపాపని కనేసుకుని సుఖంగా ఉండాలని దీవించండి’ అని పిలుస్తారు!

వెళ్ళక తప్పదు. అక్కడికీ కొందరిళ్ళకి అమ్మనీ నాన్ననీ వెళ్ళమంటుంది బామ్మ.

బామ్మతో పెళ్ళికి వెళ్తే ఒకలాగ ఉంటుంది. అమ్మతో వెళ్తే ఒకలాగా ఉంటుంది. బామ్మ నన్ను వెయ్యి కళ్ళతో చూస్తూ మధ్యమధ్య గదమాయిస్తూ ఉంటుంది. అమ్మ ఎంచక్కా నన్ను పట్టించుకోనే పట్టించుకోదు.

అమ్మ నన్ను పట్టించుకోకపోయినా నేను తోకలాగా అమ్మ వెనకాతలే ఉంటాను. అమ్మే పెళ్ళికూతురికి ముస్తాబు చేస్తుంది కదా, దాన్ని చూడాలి! చీర కట్టి పెద్ద జడని పొడుగ్గా వేసి చివరని జడగంటలు పెట్టి వాడాంబరాలు దవనం మరువాలతో జడ చుట్టూ వచ్చేటట్టు కడుతుంది. కళ్ళకు కాటుక పెట్టి ఆ కాటుకతోనే ఎడమబుగ్గ మీద గుండ్రంగా చుక్క పెడుతుంది. అందం కోసమో దిష్టి తగలకుండా ఉండటం కోసమో!

నుదుటమీద కల్యాణం బొట్టు పెడుతుంది. ఆ బొట్టు భలేగా ఉంటుంది. పెళ్ళప్పుడే పెడతారట! ఉత్తి రోజుల్లో పెట్టుకోకూడదట. కుడి పక్కకీ కొక్కెం, ఎడం పక్కకీ కొక్కెంలా తిరిగి కిందవేపుని ఆ రెండు వొంకీల నుంచీ గీత లాగా లాగి కిందికి అర్ధచంద్రాకారంగా తిప్పాలి. దాని కింద ఓ చుక్క, మధ్యని ఓ చుక్క పెట్టాలి. నుదుట మీద ఎలాగూ బొట్టు చుక్క ఉంటుంది కదా! ఇక చెవులకి జుంకాలూ మెళ్ళో గొలుసులూ చేతులకి గాజులూ వేళ్ళకి ఉంగరాలూ పాపిడిలో పాపిడి పిందెలూ పెట్టాలి. వాటినన్నిటినీ ముందే తన పక్కని డబ్బాలో పెట్టుకు కూచుంటుంది.

ఇవన్నీ చూసి తెలుసుకోవాలి కదా! నేను నా స్నేహితురాళ్ళతో బొమ్మలాట ఆడుకుంటున్నప్పుడు బొమ్మల పెళ్ళి కూడా చేయాలి, అప్పుడు ఇవన్నీ చేయొద్దూ మరి! అందుకే అమ్మ వెనకాతలే తోకలా ఉండేది. వాళ్ళింటి పిల్లలూ నాతోపాటు కూచుని చూస్తూ ఉంటారు!

నాకూ వాళ్ళకీ అమ్మా పెళ్ళికూతురూ కూచున్న చాప మీద చోటు ఉండనే ఉండదు. ఆ అలంకరణ సరంజామా అంతా చుట్టూ పెట్టుకు కూచుంటారు మరి! మేం గచ్చు మీదే ఇటువేపూ అటు వేపూ కూచుని చూస్తాం. పెళ్ళికొడుక్కీ కళ్ళకి కాటుక పెడ్తారట. కాటుక చుక్క కుడిబుగ్గ మీద పెడ్తారట!

ఇవన్నీ పెట్టేసరికి పెళ్ళికూతురికి పెళ్ళికళ వచ్చేసిందని వాళ్ళ అమ్మా బామ్మా ఆ అమ్మాయి తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తారు. అన్నట్టు చెప్పడం మరిచిపోయా, అమ్మ బంగారపు చేమంతి పువ్వు పెళ్ళికూతురి తల మీద పెడ్తుంది. వాళ్ళ అమ్మా బామ్మా మెటికలు విరుస్తున్నప్పుడు మళ్ళా చూసేనేమో జ్ఞాపకం వచ్చింది.

నిజమే, ఇవన్నీ చేసేక ఆ అమ్మాయి మరీ అందంగా ఉంటుంది. అన్నీ పెడితే అమ్మక్క లేపోతే తిమ్మక్క అంటారు.

నాన్నకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరీ అంచు పంచె లుంగీలా కట్టుకోవల్సిందే. బామ్మ మాటకి తిరుగు చెప్పలేడు కదా! కట్టుకుని వెళ్తాడు. అమ్మ అయితే తనకున్న పట్టుచీరలు అన్నీ పట్టుకెళ్తుంది. పెళ్ళి తంతు చూస్తూ ఎన్ని చీరలు మారుస్తుందో, ఒక్కొక్క తంతుకి ఒక్కొక్క చీర! నాకూ పట్టు పరికిణీ జాకెట్టూ వేస్తుంది! జడని వేసి పువ్వులూ పెడుతుంది. తను ఎలాగూ సిగచుట్టూ ఎర్రరాళ్ళ నాగరం పువ్వుల దండని నిండా పెట్టుకుంటుంది. బంగారం నగలు గాజులు చంద్రహారాలు దండలకి వంకీలు చెవులకు పెట్టుకునే రకరకాల దుద్దులూ అన్నీ పెళ్ళిలో మార్చి మార్చి పెట్టుకోడానికి. జుంకీలు వెళ్ళే ముందు తగిలించుకుంటుంది. నాకు బంగారం గొలుసు వెయ్యాలని తీస్తుంది కాని బామ్మ దెబ్బలాడుతుంది. అది ఆటలాడుతూ ఎక్కడన్నా పారేసుకు వస్తుంది. ఒకచోట నీతోపాటు బుద్ధిగా కూచుని పెళ్ళి చూస్తుందా ఏమిటీ? దానికి వెయ్యకపోయినా ఫర్వాలేదు అంటుంది! నిజమే! ఆ గొలుసు పారేస్తే ఇంకేమైనా ఉందా? బంగారం బోలుడు ఖరీదాయె!

‘మడత చంద్రహారాలు వేసుకోలేదేమీ, నువ్వే పెళ్ళికూతురిలా ఉన్నావు!’ అని నాన్న ఓసారి వెటకారంగా మాటాడితే బామ్మ దెబ్బలాటకు దిగింది. ‘ఆడవాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని మగాళ్ళు చూస్తే కద వాళ్ళకు తెలిసేదీ! ఆ పట్టు చీరలు, నగలూ అలా బీరువాల్లో మూలుగుతూ ఉంటాయి. ఇదిగో ఇలాగ ఏ పెళ్ళికో కాని కట్టుకోడానికీ పెట్టుకోడానికీ అవకాశం దొరుకుతుంది. ఉత్తి రోజుల్లో వంటింటి పనిలోనూ పిల్లల పనితోనూ, మొగుడు అడిగినవల్లా చెయ్యడంలోనూ కొట్టుకుచస్తూ వుంటారు! ఎప్పుడు చీరలు కట్టుకుంటార్రా నగలు పెట్టుకుంటార్రా?’ అని నాన్నని గట్టిగా దెబ్బలాడింది.

నాన్న బుర్రొంచుకొని మాట రాక తన గదిలోకి వెళ్ళిపోయాడు. నిజం ముందర ఎంతటివాడైనా తలవొంచవలసిందే! వొంచక తప్పదు!

ఒడుగులో చూడ్డానికి తమాషా అయినది ఒకటి ఉంది. జందెం వేసుకుని పంచశిఖలు పెట్టుకుని ఒడుగు చేయించుకున్న అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటే అబ్బాయి బావమరిది ఒడుగు కుర్రాడి గెడ్డం కింద బెల్లంముక్క పెట్టి ‘మా అక్కనిచ్చి పెళ్ళి చేస్తాం వెళ్ళిపోకు’ అంటాడే అదీ! నాకయితే నవ్వొస్తుంది, ఆ వేషం చూసి! ఆ పంచశిఖలూ జందెం సంచీను!

అందరి దగ్గరికీ వెళ్ళి భిక్ష అడుగుతాడే అప్పుడు అందరూ డబ్బు వాడి జోలెలో వేస్తారు. ఇది బాగుంది! ఒడుగు చేసుకుంటే బోలుడు డబ్బు దొరుకుతుంది! హాయిగా!

కొబ్బరాకుల పందిరి కింద అరటిచెట్లు గుమ్మం ముందు రెండువేపులా పెట్టిన తర్వాత జంబుఖానాలు పందిరి కింద పరిచిపెడ్తారు. మావిడాకులు గుమ్మానికి కడ్తారు. అన్నీ కలిసి వింతైన వాసన వేస్తూ ఉంటుంది! అదీకాక పెళ్ళికి వచ్చినవాళ్ళందరికీ కర్పూరం పుల్లలు ఇస్తారు కదా! కర్పూరం బిళ్ళని పుల్లకి ఎర్రదారంతో చుట్టబెట్టి కడ్తారు! మంచి వాసన వేస్తూ ఉంటుంది. పెళ్ళికొడుక్కీ పెళ్ళికూతురికీ మెడల్లో కర్పూర దండలూ వేస్తారు. చెంకీలతో చుట్టి ఉన్నవి. ఆ పందిరికింద పెళ్ళి చూడ్డం మాటెలా ఉన్నా ఆ జంబుఖానా మీద పరిగెడుతూ ఆడుకోవచ్చు.

ఆడవాళ్ళు పెళ్ళి పందిరి కింద సందడి సందడిగా పట్టుచీరలతో కట్టిన చీర కట్టకుండా నగలు పెట్టుకుని తిరుగుతూ ఉంటే పెళ్ళికి వచ్చిన మగవాళ్ళు విడిది ఇంటిలో పేకాట ఆడుతూ కూచుంటారు.

మంగళసూత్రం కట్టే వేళకి సన్నాయి టకోరా మేళం మా జానకమ్మ పెళ్ళికూతురాయెనే అని వాయిస్తూ ఉంటే ఏమర్రోయి, ఓమారు లేచి రండి – పిల్లా పిల్లాడి మీద అక్షింతలు వేసి వెళ్ళండి, మంగళసూత్రం కడుతున్నాడు అని కేకేస్తారు. అప్పుడు వాళ్ళు ఎవరి చేతిలో ముక్కలు ఎవరి జాగా దగ్గర వాళ్ళు ఆ పేకముక్కల్ని బోర్లా పెట్టుకుని పెళ్ళి పందిరిలోకొచ్చి పిల్లా పిల్లాడి మీద అక్షింతలు వేసి ఆ తంతంతా అయ్యెంతవరకూ ఉండి మళ్ళా చతుర్ముఖ పారాయణం కోసం వెళ్ళిపోతారు. మళ్ళీ భోజనాలు వడ్డించేస్తున్నారు రండర్రా అని కేక వేసేవరకూ అక్కణ్ణుంచి లేవరు.

పెళ్ళి తంతులో తలంబ్రాలు పోసుకుంటారే అది చూడ్డానికి బాగుంటుంది. ఒకరి తలమీద ఒకరు పోసుకుంటూ! ఆఖర్ని పళ్ళేలు ఎత్తి పంతంగా నేను ముందు పోసేస్తా నేను ముందు పోసేస్తా అని పోటీపడుతూ పోసుకుంటారు!

ఆ వేళ పెళ్ళివారి విడిది ఇంట్లో పనిచెయ్యడానికి వెళ్ళిన తవిటమ్మ కొడుకుని, ‘ఒరే నువ్వు ఈ పందిరి కింద ఆడుకో’ అని అక్కడ ఉండమని విడిది ఇంట్లో ఉన్న వియ్యాలవారికి కాఫీలు, ఉప్మాలు అన్నీ అందించడానికి వెళ్ళింది.

పెళ్ళిలో చేసే ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అరిటాకు ముక్కలో జీడిపప్పు వేసి కమ్మటి నెయ్యి కారేటట్టు పోస్తారేమో అరటి ఆకు ముక్క నల్లగా కమిలిపోతుంది. దానికీ ఓ రుచి వస్తుంది. మామ్మూలప్పుడు చేసే ఉప్మాలో ఇవన్నీ వేసినా ఆ రుచి రాదు, అదేఁవిటో!

పెళ్ళి భోజనాలు అయితే మరీ గొప్పగా గమ్మత్తుగా ఉంటాయి. వరసగా కూచునే పంక్తి భోజనాలు, అదీ అరిటి ఆకుల్లోనే! వడ్డన పూర్తయాక శ్రీమద్రమారమణ గోవిందో హారి! అని దేవుడిని తలుచుకుని కుడి అరచేతిలో నీళ్ళు పోసుకుని ఆకు చుట్టూ తిప్పుకుంటూ పోసి తిండం మొదలుపెడ్తారు. ఇత్తడి చేటలతో అన్నం, రాగి జారీలతో నెయ్యీ నూనే వడ్డిస్తూ వంట బ్రాహ్మలు వేడివేడిగా భోజనాలు పెడ్తారు.

పంక్తిలో కూచొని తింటామేమో అందరూ భోజనాలు చేసేంతవరకూ మనం తిండం అయిపోయినా కూచోవలసిందే! లేచి చెయ్యి కడుక్కోకూడదు. ఆకుపక్కన మనం సొడ్డు పెట్టేసినా చచ్చినట్టు కూచోవలసిందే. అంతా భోజనాల్చెయ్యడం అయ్యాక బ్రేవుమని త్రేన్చేక అందరితో పాటూ లేవాలి. ఇత్తడి అండా దగ్గర వరసగా నిల్చుని ఇత్తడి చెంబుతో నీళ్ళు తీసుకుని ఒక్కొక్కరూ పుక్కిలించి ఉమ్మి నోరు కడుక్కునేవరకూ మన వంతు వచ్చేవరకూ ఆగవలసిందే. ఆ ఇత్తడి చెంబు ఇంత బరువు కదా, ఎడం చేత్తో దాన్ని ఎత్తలేక నేను అవస్థపడుతూ ఉంటే ఎవరో ఒకాయన ‘ఉండమ్మా నేను నీ చేతిమీద నీళ్ళు పోస్తాను కడుక్కుందువిగాని, నువ్వు ఎత్తలేవు చెంబు బరువు’ అంటూ పోస్తాడు! బతుకు జీవుడా అని చెయ్యి కడుక్కుంటా. పుక్కిలించి ఉమ్మను. ఆఖరిని బూరెముక్కని నోట్లో పెట్టుకున్నాను కదా! పుక్కిలిస్తే ఎలాగ? దాన్ని తీరిగ్గా నముల్తూ తినొద్దూ అదీ సంగతి! ఆయనకి చాల్చాలు అని చేత్తో చూపెట్టి కడుక్కోడం పూర్తిచేస్తా.

పెళ్ళిపందిరి కింద జంబుఖానా మీద రాటల చుట్టూ తిరుగుతూ నేనూ తవిటమ్మ కొడుకూ ఆడుకుంటుంటే ఆ రాటలు ఊగిసలాడుతూ ఉన్నాయి, ఊడి పడిపోతాయేమో అన్నట్టు. లోతుగా పాతలేదేమో ఖర్మం! ఓ పెద్దాయన పందిరి ఊగిసలాడ్డం చూసి గబగబా వచ్చి, పిల్లలూ రాటలు పట్టుకుని ఊపుతూ ఆడకూడదు. కూచుని ఆడుకోండి. పరిగెడుతూ ఇటూ అటూ దొంగాట ఆడుకోండి అన్నాడు.

ఏం చేస్తాం? ఇద్దరమూ మొహాలు మొహాలు చూసుకుని చీడీ మీంచి కిందకీ కింద నుంది చీడీ మీదకీ గెంతుతూ ఎవరు ఎన్ని గెంతులు గెంతేరో లెక్కపెడుతూ ఆడుకున్నాం.

ఇంతలో విడిది ఇంటినుండి తవిటమ్మ వచ్చి తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది.

నేను ఒక్కర్తినీ ఏవిటి ఆడుకోవడం? నాలుగు రాళ్ళు ఏరుకొచ్చి చింతగింజల ఆటలాగ ఆడుకున్నా. ఎడం చెయ్యిని బోర్లా పెట్టి రాళ్ళని ఎగరేస్తూ బొటనవేలు చుట్టూ తిప్పి కిందకి చేతి అడుక్కి తోసేసి, ఇలాగ రాళ్ళని ఎగరేస్తూ అన్నిటినీ చేతి అడుక్కి తోసేస్తూ చివరని ఆ నాలుగురాళ్ళని చెయ్యెత్తి తిరిగి మీదకి ఎగరేసి పట్టుకోవాలి. ఇలా ఎంతసేపని ఆడుకోనూ? విసుగొచ్చేసింది.

అది వదిలిపెట్టి ఏంచెయ్యాలో తోచక చూస్తూ ఉంటే అమ్మ వచ్చి, “పద జుట్టంతా రేగిపోయి పిచ్చిదాన్లా ఉన్నావు. పువ్వులన్నీ వాడిపోయి, కొన్ని రాలిపోయి. పద స్నానం చేసి కొత్త గౌను వేసుకుందువుగాని. పరికిణీ కట్టడం నాదే బుద్ధి పొరపాటు. చూడు ఎలా మాపేసుకున్నావో పట్టు పరికిణీని! కుంకుడుకాయ రసంతో ఉతకాలి దీన్ని ఇంటికి వెళ్ళేక” అంటూ లోపలికి తీసుకుని వెళ్ళింది.