తాటి దూలాలకి చెద పడుతోందని తారు పూయడానికి అప్పలసామి వచ్చేడు.
‘తారు అంటుకుంటే ఓ పట్టాన వొదల్దు. ఈ వేపులకు రాకు’ అని బామ్మ పదేపదే చెపితే ‘అలాగే బామ్మా, సరే బామ్మా’ అన్నా.
సున్నాలు వెయ్యడం వేరూ తాటిదూలాలకి, తాటి పెండిబద్దలకీ తారు పుయ్యడం వేరూ!
“ఇదో యజ్ఞం పనమ్మా! చెదలు పట్టి దూలాలు పుచ్చిపోతే నెత్తిమీదొచ్చి పడతాయి!” అంటోంది బామ్మ. నెత్తిమీదొచ్చి పడితే ఠారని చచ్చి ఊరుకుంటారట మరి!
తాటిదూలం ఇంత లావూ బరువూనూ!
బామ్మ మళ్ళీ ఏఁవీ అనకుండా “ఎలా పూస్తాడో ఒక్కసారి తొంగిచూసి వెళ్ళిపోతా బామ్మా!” అని ముందే చెప్పేసే.
తారుడబ్బా, నిచ్చెన, కుంచే పట్టుకుని అప్పలసామి వంటింటి పక్కగది లోకి వెళ్ళబోతూ ఉంటే “అప్పలసామీ! అప్పలసామీ! ఇదేంటీ ఈ బ్రెష్షూ?” బ్రెష్షును చూస్తూ అడిగే. మామూలు బ్రష్షులు తారు పూయడానికి నడవ్వుట.
“నానే సేసుకున్నానీ కుంచెని తల్లీ” అన్నాడు అప్పలసామి.
“నీకు బ్రెష్షులు చెయ్యడం కూడా వొచ్చా? దేంతో ఎలా చేసేవూ?”
“నీకెందుకే ఈ భోగట్టాలన్నీనూ? వాణ్ణి పనిలోకి దిగనివ్వకుండా కబుర్లాడుతున్నావూ?”
“పర్నేదమ్మా, నాను సేసే పని బేగిబేగి ఎనాగూ సేస్తా. ఓ చిటం ఆలీసంగా నిచ్చెనెక్కినా పనిలో ఢోకా ఉండదు.
“పాపా, ఇది పచ్చితాటేకు మట్ట. దాన్ని కొట్టి కుంచెను సేసుకుంటాం తార్రాయడానికి. దాని నార కుంచెనా అగుతాది.” చెప్పేడు బుగ్గమీసాలతో నవ్వుతూ అప్పలసామి.
“తాటేకు విసనకర్రలనే చూశా. పచ్చి తాటేకు నే చూడ్లేదు!”
“దాసన్నపేట సివార్ని మా తాటేకిల్లున్నాది. ఓపాలి రా. తాటిసెట్లనీ పచ్చితాటేకు మట్టనీ సూద్దువు గాని!” అన్నాడు అప్పలసామి.
“అదలా ఏదో ఓటి అడుగుతూనే ఉంటుంది. చాల్చాలు, కబుర్లు ఆపి పనిలోకి దిగు” అన్నాది అమ్మ.
అప్పలసామి తారు పుయ్యడాన్ని ఓ గడియ చూసి బయటకొచ్చీశా. ఇంకా ఉంటే మళ్ళీ గదమాయింపులు తినాల్సొస్తుందని!
బళ్ళోంచి రాగానే “అయిపోయిందా తారు పుయ్యడం?” అనడిగే.
“అప్పుడే ఎక్కడయిపోతుందే? ఒక్క గదేనా మనకున్నదీ?” అమ్మ నవ్వుతూ సాతాళించిన సెనగలు బోడిగిన్నెలో వేసిచ్చింది.
అవును కదా, ఒక్కొక్కసారి నేను ఏంటో, జడ్డిమొడ్డి ప్రశ్నలు వేసేస్తూ ఉంటా.
అరచేతిలో గిన్నె పెడుతూ “ఇంకా వేడిగానే ఉన్నాయి. గిన్నెకి మట్టు లేదు. కింద పడేసుకోకుండా పట్టుకెళ్ళు” అన్నాది.
ఎడం అరచేతిలో పెట్టించుకుని, కుడి చేతివేళ్ళతో గిన్నె అంచుల్ని పట్టుకుని చీమలా నడుస్తూ మండువా చీడీ మీంచి, అంతవరకూ గిన్నెను చూస్తూ వెళ్తున్నదాన్ని మేడ మెట్ల నాదు దగ్గర ఎడం చేతిలో గిన్నెని కుడి చేతిలోకి మార్చుకుందామని ఆగే. గిన్నె కింద పెట్టి బుర్రెత్తేసరికి నాదులో తారుడబ్బాలో తారు నిగనిగలాడుతూ ముడత ముడతల మీగడ కట్టి కనపడింది, అచ్చుముచ్చు పాల మీద మీగడ లాగ!
నాదుని ఆనుకుని ఉన్న డాబా స్తంభం సందులోంచి నాదులోకి దూరే. తారుడబ్బా పక్క గొంతుకిల్లా కూచుని కాస్సేపు చూశా. గుండ్ర డబ్బా నిండుగా నున్నగా తారు, ఆ తారు మధ్యస్తంగా గుండ్రంగా సన్నసన్నటి ముడత ముడతల మీగడ!
దానిమీద వేళ్ళతో రాసి చూడనా? ‘రాసి చూడు’ ‘రాసి చూడు. ఎంత బావున్నానో’ – అది పిలుస్తున్నట్టనిపించింది!
కుడిచేతి నాలుగువేళ్ళతో ఇట్నించటూ అట్నించిటూ రాసే. భలేగా ఉంది. మీగడ ఊగుతూ కదిలింది! వేళ్ళెత్తే. ఊగులాట ఆగింది. నవ్వొచ్చి నవ్వుకుంటూ మళ్ళా మరోసారి రాసే.
ఈసారి పక్కకి జరిగింది. అంతే! నా నాలుగు వేళ్ళూ గబుక్కుమని తారులో మునిగిపోయాయి!
“అయ్యో! అయ్యయ్యో! అయ్యో! అయ్యయ్యో!” ఏడ్పుగొంతుతో గట్టిగా అంటూ పైకితీసి దులుపుకుందామనుకుంటే మునిగిపోయినట్టూ గబుక్కున మీదకి వేళ్ళు రావేఁ – బంకలా తారు వేళ్ళని పట్టేసుకుంది. ఏడ్పొచ్చేస్తోంది!
“అయ్యో, అయ్యో, అయ్యయ్యో, అమ్మోయ్! బామ్మోయ్! నా వేళ్ళు!” గట్టిగా కేకెట్టేననుకున్నా. కాని నా గొంతు నాకే వినిపించేటట్టు వొచ్చింది. పైకి లేవేలేదు. నాదులోంచి అస్సలు వినే వినిపించేటట్టు లేదు.
ఏడుస్తునే అమ్మనీ బామ్మనీ పిలుస్తూనే చేతివేళ్ళు పైకి లాగే. వేళ్ళనిండా తారు అరచేతివేపూ మండవేపూ పాకుతూ.
దులిపితే ఏవఁవుతుందో? అసలుకీ దులపబడుతుందో లేదో? గౌను మీద పడిపోతుందేమో. చెయ్యి బయటికొచ్చేక పయికి ఏడ్పు కాస్త తగ్గినా ‘ఇప్పుడిహ చీవాట్లు తినాలి తప్పదు’ – మనసులో మరోరకంగా దుఃఖం ముంచుకొస్తోంది. అమ్మా బామ్మా పెరటివేపున్నారేమో నా ఏడ్పూ పిలుపూ వినిపించినట్టు లేదు!
నాదులో తారుడబ్బా, కిరసనాయిల్లో బ్రెష్షుతో మట్టి మూకుడూ తప్ప ఏం లేవే! దేంతో తుడుచుకోవాలీ? ఎలాగ బాబోయి! ఓరి నాయినోయి! ఈ తారు మీగడతో ఎందుకాడుకున్నాన్రా దేవుఁడా!
గొంతుకిల్లా కూచున్నానేమో కాళ్ళు నొప్పెడుతున్నాయి. లేచి నుంచోడానికి భయవేఁస్తోంది. ఎడం చేత్తో స్తంభం పట్టుకు లేవాలి. అమ్మో! తారు చెయ్యి? డాబాస్తంభం సందులోంచి ఎలా దూరి బయటికి వెళ్ళడం?
“అమ్మా! బామ్మా! అమ్మా! బామ్మా!” మళ్ళాగట్టిగా కేకెట్టే.
“నువ్వేటి పాపా! నాదు సందులో కూకున్నావూ? అయ్యయ్యో! తారునో సెయ్యిట్టీసినావా? ఉండుండు. అనాగే కూకో. ఏటా, సెనగలగిన్నె ఇక్కడొడేసినారూ అనుకున్నా! సూసుకునొచ్చినాను. నేకపోతో నా కాలు తగిలీసీదే! నిచ్చిన్ని మేడమెట్ల కాడా నిలీయమన్నారు. పెరటిగోడ కాడ ఒగ్గీసి ఎల్లిపోనాను! పెద్దొమ్మగోరు సూస్తే ఇంకేటుందా? అయ్యికోనేరు దాటీసి ఆంజనేయులోరి కోయిల కాడ దాక ఎల్లిపోయా. ఆసిటాన మరిసిపోయినానని తిరిగిపారొచ్చినా. నిచ్చిన మేడ మెట్ల కాడ నిలేసొస్తున్నా. అనాగే కూకో.”
అప్పలసామి మాటాడుతూనే నిచ్చినతో మేడమెట్ల వేపెళ్ళేడు. అప్పలసామిని చూడగానే ‘బతికేన్రా భగమంతుడా!’ అనుకున్నా.
మెట్ల మీద కిరసనాయిలు పోసుకున్న డబ్బా పట్టుకు వొచ్చేడు అప్పలసామి.
“పాపా! ఆ తారుసెయ్యి ఈ డబ్బానో ఎట్టు. డబ్బా నానొట్టుకుంటాన్లే. నిమ్మనంగా నెగిసి నాదు సందునో ఎనా దూరినావో అనా దూరు. సెయ్యిని కిర్సనాయిల్లోనే అనాగే ఉంచు. నాను డబ్బానీ సెయ్యినీ ఎత్తి ఒట్టుకుంటాను” అన్నాడు.
అప్పలసామి చెప్పినట్టు దూరి నే బైటికొస్తూంటే తను ఎత్తిపట్టుకున్న చెయ్యున్న డబ్బాని సందులోంచి బైటికి తీసేడు. “ఇనా దా. ఈ సివరి మెట్టు మీద కూకో” అంటూ నన్ను మేడమెట్టు మీద కూచోమని కిందని డబ్బాని పెట్టేడు. నా ఎదురుంగా కింద కూచుని కిరసనాయిలు డబ్బాతో పట్టుకొచ్చిన గుడ్డతో తుడుస్తూ చెయ్యి కడిగేడు.
అప్పలసామిని చూడగానే నే కాస్త మామ్మూలు అయ్యా. ఇప్పుడు చెయ్యి కడిగేస్తున్నాడుగా – పూర్తిగా మామ్మూలు ఐపొయ్యా. భయం బెంగా పోయాయి. కిరసనాయిలు కంపు, కంపు, కంపు. అయినా నే ‘కుఁయ్యి, కఁయ్యి’ అనలేదు. కంపు ముక్కు కన్నాల్లోకి వెళ్ళిపోతోంది. మొహం ఎంత మీదకెత్తి కూచున్నానూ!
అన్నట్టు ముక్కు కన్నాలు కాదు. కన్నాలు అనకూడదు. ఓసారి ఇలాగే ఎందుకో ముక్కు కన్నాలు అన్నా. దాంతో అంతా నవ్వేరు. పుటాలు, ముక్కు పుటాలు అనాలిట! కన్నాలే కదా, కన్నాలని కన్నాలంటే తప్పేఁవిటీ? సరే, రెండు మాటలుంటే ఓసారి ఓటీ, ఓసారి ఇంకోటీ అనొచ్చుగా!
“ఒగ్గేసిందినే! పెరట్నోకి ఎల్లి సబ్బుబిళ్ళతో మూన్నాళ్ళు సుట్లు తోవేఁసుకుంటే కిరసనాయిలు కంపొగ్గేస్తాది’ అన్నాడు అప్పలసామి – కిరసనాయిలు డబ్బా గుడ్డా పట్టుకులేస్తూ.
నేను నా చెయ్యిని ఇటూ అటూ తిప్పీ వేళ్ళని ఎడం ఎడం చేసి చూసుకున్నా. తారు నలుపు మచ్చలతో కిరసనాయిలు చేతినిండా ఉన్నాది.
అమ్మ నట్టింట్లోకొచ్చింది కాబోలు అప్పలసామి మాటలు వినబడ్డట్టున్నాయి. “అప్పలసామి గొంతులా ఉందీ” అంటూ చీడీ మీదకు వొచ్చింది.
“నువ్విక్కడ కూచున్నావేఁవిటే? అప్పలసామీ ఏఁవిటయిందీ? ఏఁవిటయిందీ? నువ్వెళ్ళిపోలేదా? ” అంటూ ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ మా వరకూ గబగబా వచ్చింది.
“ఏటి నేదమ్మా. నిచ్చెన మెట్ల కాడ సేరేయడానికొచ్చినా. పాప తార్నో సెయ్యేటిసినాది. కిరసనాయిలుతో కడిగి తుడిసేశాన్లెండి. సబ్బుబిళ్ళేసి మూన్నాళ్ళు సుట్లు కడుక్కోమని సెపుతున్నా” అన్నాడు.
నేలేచి నిల్చున్నానే కాని నోరు విప్పలేదు. బామ్మ అనేటట్టు కిమ్మన్నాస్తి!
“అయ్యయ్యో! ఏం పిల్లవే! సెనగల గిన్నె ఇక్కడే ఉంది! నాదులో ఉన్న తారులో చెయ్యెలా పెట్టేవే?” అమ్మ లబోదిబోమంది.
ఈ గోలకి బామ్మా చీడీ మీదకొచ్చీసింది “ఏఁవిటయింది? ఏఁవిటయిందీ?” అంటూ.
నే బుర్రొంచుకుని అలాగే నిల్చున్నా. సంగతి తెలిసిన వెంటనే – “నీనెత్తి వాయించా. తారు అంటుకుంటే వొదల్దని పొద్దున్నే చెప్పేను కాదుటే? తారులో చెయ్యి పెట్టడవేఁవిటీ? తలతిక్కపిల్లా! అసలు నాదులోకి ఎలా దూరేవే?”
“ఏటనకండీ పెద్దొమ్మగోరూ! సిన్నపిల్లా – తెనీక ఎట్టీసింది” అన్నాడు అప్పలసామి.
“సరిసరి. అందరూ దీన్ని వెనకేసుకొచ్చేవాళ్ళే. ఏ వెధవపన్జేసినా నెత్తికెక్కించుకోడం మా బాగా అలవాటైపోయింది! ”
“చూడు! మాటకి మాటా ఠపీమని కొత్తవాళ్ళయినా అనేసి వెయ్యిప్రశ్నలు వేసే పిల్ల ఉలుకూ పలుకూ లేకుండా ఎలా నుంచుందో!”
“మొద్దులా ఆ నుంచోడం ఎందుకూ? పద పెరట్లోకి. చెయ్యి కడుగుతా” అంటోంది అమ్మ – నే చీడీ మీదకు ఎక్కబోతున్నా – నాన్నోచ్చీసేడు వీధిలోకి వెళ్ళినవాడు.
“ఏఁవయింది? ఏఁవయిందీ?”
“మీ నెత్తిమీది దేవతనే అడగండి ఏమైందో!” అమ్మ విసురుగా అంది.
“ఏఁటవనేదు బాబుగోరూ! పాప తార్నో సెయ్యేటిసినాది.” చెప్పేడు అప్పలసామి.
“నాదు డబ్బాలో తారు సన్నసన్నని ముడతల ముడతల మీగడ పాలమీగడలా కట్టింది కనపడ్డాది. సరదా వేసి ముట్టుకు చూద్దామనిపించి వేళ్ళతో రాసే. వేళ్ళు తారులో కూరుకుపోయాయి.”
నా మాటలు విని “బాగుంది దీనివరస!” అంది బామ్మ.
“బాగుంది అని మెల్లిగా అంటున్నారా? సరదాట సరదా! వంటింట్లోకి రానివ్వటం లేదు కాబట్టి సరిపోయింది. వేడిపాల మీద మీగడతో సరదాగా ఆడేదానివే! చెయ్యి కాల్చుకుని డాక్టరూ మందులతో తిప్పేదానివే! దీన్ని వెనకేసుకు వొచ్చేరంటే చూడండి. నేనూరుకోను!” అన్నాది అమ్మ.
“సరే, వెళ్ళు పెరట్లోకి. చెయ్యి కడిగించుకురా” అన్నాడు నాన్న.
చెయ్యి కడిగించుకుని నాన్న దగ్గరికెళ్ళే.
“సెనగలు తిన్లేదుగా! పాలు తాగేవా బళ్ళోంచి వచ్చేక?” అడిగేడు నాన్న.
తాగేనని బుర్రూపే.
అందరూ ఏమన్నా బామ్మా నాన్నా నన్ను ఎప్పుడూ ఏమన్రు. అలాంటిది ఇవాళ నే చేసిన పనికి బామ్మా కోప్పడుతోంది. అయితే నాన్నా దెబ్బలాడతాడు. నాన్నని చూస్తే ఎప్పుడూ భయం లేదా – అలాంటిది ఇప్పుడు తనవేపు చూడ్డానికి భయం వేసింది. బుర్రొంచుకుని అలాగే దిమ్మసాచెక్కలా చీడీ మీదికి ఎక్కకుండా నిలబడిపోయా. గౌనుకు తగలకుండా చాపి ఉంచిన చెయ్యిని ఉంచినదాన్ని ఉంచినట్టూ ఉండిపోయా.
“ఇలా రా” అన్నాడు నాన్న.
బెదిరిపోతూ చీడీ మీదికి ఎక్కే.
“ఇప్పుడు చెప్పు.”
బుర్రొంచుకునే- “తప్పయిపోయింది. సరదా వేసిందని ప్రతీ పనినీ చెయ్యకూడదని తెలిసింది. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను.” బెక్కులు బెక్కులుతో ఆగి ఆగి మాటలు కాస్త కాస్త మింగేస్తూ చెప్పే.
“సరదా ఏఁవిటీ? తారుతో? సరే, ఇలా నా దగ్గరగా కూచో” అని తనకి బాగా దగ్గరగా కూచోపెట్టుకుని పెద్ద లావు ఇంగ్లీషు పుస్తకాన్ని ఒళ్ళో పెట్టుకుని పేజీలు తిరగేస్తూ కొన్ని బొమ్మలు చూపిస్తూ చెప్పేడు.
మనుషులు మొదాట ఎలా జంతువుల్లాగానే ఉండేవారో, జంతువుల్ని చంపి పచ్చిమాంసం తినేవారో – రానురాను ఎలా జ్ఞానం పెరిగిందో – నిప్పు చేసుకోడం, జంతువుల తోలు బట్టల్లా కట్టుకోడం ఎలా నేర్చుకున్నారో, తర్వాత తర్వాత అలా అలా పెరిగి పెరిగి ఇప్పటివరకూ నాగరికులు అయ్యారో బోధపరిచేడు.
ఆఖర్ని “పెద్దవాళ్ళు అది ముట్టుకోకు, ఇది ముట్టుకోకు, దాని జోలికెళ్ళకు, దీని జోలికెళ్ళకు అని వాళ్ళకు పెరిగిన జ్ఞానంతో పిల్లలకి చెపుతూ ఉంటారు. పిల్లలు వాళ్ళు చెప్పినట్టు వినాలి. నువ్వు ఒక్కొక్క క్లాసు పాసవుతూ, పెద్ద క్లాసులకు వెళ్తూ ఇవన్నీ చదువుకుంటావ్. అప్పుడు నీకు ఇంకా బాగా బోధపడుతుంది. సైన్సు క్లాసుల్లో నీచేత ప్రయోగాలు చేయించి చూడమంటారు. నువ్వు అది కనిపెడ్తాను, ఇది కనిపెడ్తాను అంటూ ఉంటావ్ కదా. మనిషి మొదట్నించీ అలా కనిపెడ్తూ, నేర్చుకుంటూ, జ్ఞానం పెంచుకుంటూ తన పిల్లలకి చెప్తూ – ఆ పిల్లలు పెరిగి పెద్దయి వాళ్ళ పిల్లలకు చెప్తూ…”
“మనం ఇంతవరకూ వచ్చేమన్నమాట!” అని నాన్న మాటని అందుకుని నేను తల ఊపుతూ అంటూ ఉంటే – “భేష్! అదీ సంగతి! ఇవాళింక నీ గుర్రమూ వద్దు. ఊహల ఊసులూ వద్దు. వెళ్ళి నీ క్లాసు పుస్తకాలు చదువుకుని అన్నం తిని పడుకో” అన్నాడు.
నాన్న మళ్ళీ మామూలు నాన్నలా కనపడ్డంతో బోల్డు సంబరంతో నా క్లాసు పుస్తకాలు తీసుక్కూచున్నా.
అయితే ఆ మర్నాడే మరో పితూరీ జరిగింది. నాతప్పు ఏం కాదు కాని జరిగింది మరి నాకే!
బళ్ళో క్వాడ్రాంగిల్‍లో పెద్ద క్లాసు పిల్లలు కింద క్లాసు పిల్లలం కలిసి పెద్ద బాల్ ఆట ఆడుతున్నాం. నాలుగు మూలల్లో నాలుగు వేపులా గట్టుమీద పెద్ద క్లాసు పిల్లలు నలుగురుండి బంతిని ఒకరికొకరు విసురుకుంటూ ఉంటే కిందని మేం గెంతి గెంతి బంతిని పట్టుకోబోతున్నాం. ఒక పెద్దమ్మాయి విసిరిన బంతి గెంతుతున్న నా ఛాతీకి తగిలి కింద పడిపోయా. మొహం తిరిగింది. నాకేమీ తెలీదు. మొహం మీద నీళ్ళు జల్లేరు. నే కళ్ళు తెరిచేసరికి క్వాడ్రాంగిల్‍కి ఎదట గదిలో ఉండే పెద్ద మేడమ్‍గారూ బంతి విసిరిన ఆ పెద్దమ్మాయీ గాభరాగాభరా పడుతూ నా మొహం మీదికి ఒంగి కనపడ్డారు.
నే లేవబోతుంటే వాళ్ళే నెమ్మదిగా లేపి కూచోపెట్టేరు. అటెండరు ప్రవాసిని పెద్ద మేడమ్ గదిలోంచి తెచ్చియిచ్చిన బీకరుతో వేడి పాలు తాగించేరు. పిల్లలూ టీచర్లూ అందరూ గుంపుగా కొంచెం దూరంలో నుంచుని ఆదుర్దాగా చూస్తున్నారు.
నే పాలు తాగడమూ అయింది, నాన్న వొచ్చీసేడు. నాన్నకి కబురు పెట్టినట్టున్నారు. నాన్నని చూడగానే గబాల్న లేచి నిల్చోబోతూ ఉంటే “ఉండుండు. ఇదిగో ఈ రెండో బీకరులో ఉన్న పాలూ పూర్తిగా తాగాలి” అన్నాది పెద్ద మేడమ్ నా వీపు మీద తన చేత్తో రాస్తూ. ఆవిణ్ణి చూస్తే మా పిల్లలందరికీ గొప్ప హడలు. ఓ పెద్ద రాక్షసిలా కనిపించేది. అలాంటిది బామ్మ లాగ ఎంతో ప్రేమగా పాలు తాగించింది.
“కంగారేమీ లేదండీ” నాన్నకు చెప్పింది, “నీళ్ళు మొహం మీద జల్లగానే తెలివి వొచ్చీసింది.”
“బంతి ఎలా తగిలిందీ? హార్డు బంతా?” అడిగేడు నాన్న.
“ఇక్కడే క్వాడ్రాంగిల్‍లో బంతాడుతున్నారు. ఆఫీసు పనిలో ఉన్నా, బంతిని నేనూ చూళ్ళేదు. గేమ్స్ టీచరు దగ్గర బంతి తెచ్చుకుని ఆడుతున్నారు. ఏదీ బంతి? గేమ్స్ మిస్ ఎక్కడా?” గట్టిగా అడుగుతూ టీచర్ల పిల్లల గుంపువేపు చూసింది.
గేమ్స్ మిస్ మొహం వేళ్ళాడేసుకుని పిల్లల చేతిలోని బంతిని తెచ్చి పెద్ద మేడమ్ చేతికి ఇచ్చింది.
“హార్డ్ బాల్ ఈ ఆటకి ఎలా ఇచ్చేరూ?” నొచ్చుకుంటూ మరీ గట్టిగా ఆవిణ్ణి ఏఁవీ అనకుండా “సారీ సర్! పొరపాటు జరిగింది. ఓ బంతికి మరోబంతి పుచ్చేసుకున్నారు పిల్లలు. ఈసారి దగ్గర్నుంచీ ఈ మిస్ దగ్గరుండి ఆడిపిస్తారు” అని చెప్పింది.
నాన్న బంతినోసారి పట్టుకు చూసి తిప్పి ఇచ్చేసి – “యూ మస్ట్ బి కేర్‍ఫుల్ విత్ లిటిల్ చిల్డ్రన్” అని చెప్పి నన్ను ఇంటికి తీసుకువచ్చేడు.
మేం వచ్చేసరికి అమ్మా బామ్మా వీధి చీడీమీదే నిల్చుని ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు.
“కంగారు ఏం లేదు. పెద్ద దెబ్బేం కాదు.”
“నువ్వెళ్ళిన దగ్గర్నుంచీ ఇక్కడే నిల్చున్నాం. దేవుడి దయవల్ల పెద్ద దెబ్బేం తగల్లేదన్నావ్!” అంటూ బామ్మ నన్ను పట్టేసుకుంది.
“బంతాట ఆడుతూవుంటే బంతొచ్చి తగిలిందిట. హెడ్ మిస్ట్రెస్ మేడమ్ స్వయంగా వేడిపాలు తాగడానికి ఇచ్చేరు. ఆటలో అరిటిపండు. అంతేనా?” అని నా తలమీద చెయ్యేసి అడిగి, “మరేం లేదు. అన్నాలు తినేవేళ వరకూ పడుకుంటే మామ్మూలు అయిపోతుంది” అని చెప్పేడు నాన్న.
ఇవేళ అమ్మ చేసిన పాలకాయలు నవులుతూ నా గుర్రం మీద కూచుని ఆవు నెమరేసినట్టు నిన్నా మొన్నా జరిగినవి నెమరేసుకుంటున్నా.
పచ్చి తాటేకు మట్ట, కుంచె, తారు మీద కట్టిన మీగడ – అప్పలసామి నాదులోంచి నన్ను పయికి తీసి తారు చెయ్యి కిర్సనాయిల్లో కడగడమూ –
అప్పలసామి ఎంత మంచివాడో! నన్ను దెబ్బలాడుతూ ఉంటే – ‘చిన్నపిల్ల, ఏదో సరదాకి చెయ్యేటిసినాది. ఏటనకండమ్మా’ అన్నాడు. మరి ఆ పెద్ద మేడమో? ఆవిడ అచ్చుముచ్చు బామ్మ లాగే పాలు తాగించింది. ఎంత మంచావిడో!
పెద్ద క్లాసు పిల్లలు ఆవిణ్ణి పెద్దరాక్షసి, వాళ్ళ క్లాసు టీచర్ని చిన్నరాక్షసి అంటే మేఁవూ వాళ్ళని అలాగే అనుకుని వాళ్ళంటే భయంతో హడిలిపోతూ ఎక్కడ వాళ్ళం అక్కడే నిలుచుండిపోయి ‘గుడ్ మార్నింగ్ మేడమ్’ అనో ‘గుడ్ ఆఫ్టర్‍నూన్ మేడమ్’ అనో అనేసి నెమ్మదిగా జారుకునే వాళ్ళం.
నాన్నకి చెపితే నవ్వి, “బళ్ళో పిల్లలనందరినీ క్రమశిక్షణలో పెట్టడానికి మీ పెద్ద మేడమ్ అలా ఉంటారు. నువ్వు బామ్మకి ఎంత ఇష్టమో పెద్ద మేడమ్‍కీ మీ అందరన్నా అంతే ఇష్టం. ఆ క్లాసు టీచరూ అంతే. ఆ పిల్లలు బాగా చదవాలంటే స్ట్రిక్ట్‌గా ఉండాలి. అందరూ మంచి మార్కులతో పెద్ద పరీక్షలు పాసవాలి. పాఠాల్లో చెప్పిన జ్ఞానంతో ముందు ముందు బాగా పెద్దవాళ్ళవాలి. అందుకూ ఆవిడ అలా ఉంటారు. ఆవిడా మంచిదే. ఇప్పుడు తెలిసిందిగా? ” అన్నాడు.
“మరి గేమ్స్ టీచరు గట్టిగా ఉన్న బాల్ ఎందుకిచ్చిందీ?”
“ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆవిడా మంచిదే.”
అందుకే కాబోలు, పెద్ద మేడమ్ ఆవిణ్ణి గట్టిగా ఏఁవీ దెబ్బలాడలేదు!
నాకు దెబ్బ తగిలితే తగిలింది కానీ, తారులో చెయ్యి కూరుకుపోతే కూరుకుపోయింది కానీ ఎన్ని విషయాలు తెలిసేయో! ఆ బొమ్మల పెద్ద ఇంగ్లీషు పుస్తకమో!
“చెడ్డలో కూడా మంచి జరుగుతూ ఉంటుంది” అన్నాడు నాన్న.
పాలకాయలు అయిపోయాయి. మా ఇంటి వెనకాతల ఇంటి వేపుకు పక్షులు బారులు బారులుగా వెళుతున్నాయి. ఎగురుతున్న పక్షులు ఎంత బావున్నాయో! మనుషుల్ని చూసి పక్షులు ఎంత బావుంటారో మనుషులు అని పక్షులు అనుకుంటాయా? – నా ఊహకి నాకే నవ్వొచ్చింది.
“ఏఁవిటీ? నీలో నువ్వు ఒక్కత్తివీ కూచుని నవ్వుకుంటున్నావూ?”
బొమ్మల పుస్తకాలిచ్చే మావయ్యగారు నాన్నతో వస్తూ నన్ను గుర్రం మీద చూసి అడిగేరు. నేను చెప్పేను. ఆయనా నవ్వి “పక్షులకి సహజజ్ఞానం ఉంటుంది. వాటికది చాలు వాటి జీవనానికి” అన్నాడు.
“పద లోపలికి. నాతో కబుర్లు చెబ్దువుగాని. నీ పితూరీలు విన్నా!”
నన్ను లోపలికి రమ్మంటూ లేవదీసేడు.