ఊహల ఊట 29

మా ఊళ్ళో రథయాత్ర పూరీలో జరిగే రథయాత్ర లాగా ఘనంగా చేస్తారు. దాసన్నపేట చివారన రథాన్ని పెడతారు. మూడు కోవెళ్ళ ముందు, కన్యకాపరమేశ్వరి గుడి ముందూ ఊళ్ళోనూ రథాలు పెడతారు. అవీ పెద్ద రథాలే. దాసన్నపేట దూరం అనుకున్నవాళ్ళు ఊళ్ళో పెట్టిన ఈ రథాల దగ్గరికి ఎవరికి వీలైన చోటుకు వారు వెళతారు. మరీ ముసలీ ముతకా తప్ప ఈమాత్రం ఆమాత్రం నడవగల్గిన వాళ్ళు దాసన్నపేటకే వెళతారు. అక్కడ విశాలంగానూ ఉంటుంది. బోలెడన్ని దుకాణాలు బొమ్మలవి మట్టివి, గాజువి, సెల్యులాయిడ్‌వీ ఉంటాయి. తినుబండారాల షాపుల్నీ పెడతారు, పిల్లలకీ పెద్దలకీ. అవి పట్టి లాగుతాయి.

మా విజయనగరంలో ఒకరిని మించి ఒకరు పంతాలు పడి మరీ దసరాలకి బొమ్మల కొలువులు పెడతారు. బొమ్మలు కొనుక్కోడానికి, తమ దగ్గర లేని బొమ్మలు ఏమిటో కొత్త బొమ్మలు ఏమిటేమిటి వచ్చాయో తెలుసుకోడానికి, తమ దగ్గర బొమ్మల పెట్టెలో పెట్టుకున్న బొమ్మల్లో విజ్జోడి అయిపోయిన బొమ్మలకు సరిపోయే బొమ్మ దొరకొచ్చునేమో – విజ్జోడి బొమ్మను ఒక్కదాన్ని మెట్టుకు ఓ పక్క పెడితే బాగుండదు. ఆ బొమ్మ అలా మూలుగుతూ ఆ రంగూను బొమ్మల పెట్టెలో పడుండాల్సిందేనని ప్రాణం ఉసూరుమంటుంది. ఈసారి ఈ రథయాత్రలో ఆ బొమ్మ గాని దొరికితే ఎగిరి గెంతేసి మరీ కొనుక్కోవచ్చు.

మట్టి బొమ్మలు పెద్ద సైజువి లక్ష్మి, సరస్వతి వంటివి, విష్ణుమూర్తి పాలసముద్రంలో పడుకున్నట్టు ఉండే మరీ పెద్ద బొమ్మా – ఇలాంటివి చాలాసార్లు బద్దలు అయిపోతూనే ఉంటాయి. ఎంత జాగ్రత్తగా కాగితాలు చుట్టి పెట్టినా మళ్ళా తీసేప్పుడో, బట్ట పెట్టి తుడిచేప్పుడో చెయ్యి జారి కింద పడి సగానికో, లేకపోతే ఓ కాలో చెయ్యో తలకాయో బద్దలవడం, అయ్యో అయ్యో మళ్ళా బద్దలు అయిపోయిందే అని నెత్తీ నోరూ కొట్టుకోడం, ‘అదేం చేతులే జారుడు చేతులు, ఎన్నిసార్లు డబ్బు తగలేసి కొని తెచ్చుకోడం’ అంటూ కోడల్ని అత్తగారు ఆడిపోసుకోడం – ప్రతి ఇంటా ప్రతి ఏడూ ఉండే భాగోతమే. ‘నేనేమైనా ఎత్తేద్దామని ఎత్తేశానా, ఈ మారు నుంచి మీరే ఈ బొమ్మల్ని పెట్టె లోంచి తీసి బట్టతో తుడిచి పైమెట్టు మీద మీరే పెట్టండి. నేను ముట్టే ముట్టుకోను’ అని ఆ కోడలూ ఒట్టు పెట్టుకోడం అతి మామ్మూలు. ‘నేనేమన్నాననే అంత విసురూ? నేనో మాట నిన్ను అనకూడదా? జాగ్రత్త చెప్పకూడదా? పెద్దదాన్ననయినా లేదు. మాటకు మాటా అని మరీ ఒట్టూ శపథం చేస్తున్నావు? నేనేం నాకోసం డబ్బు ఖర్చు చేస్తున్నానా? నేనేమన్నా డబ్బు సంపాదిస్తున్నానా? నీ మొగుడుదే డబ్బు. దాచుకున్నా ఖర్చు చేసుకున్నా మీదే. నాకేమిటే? దుబారా చేసుకుంటారో పొదుపే చేసుకుంటారో, పిల్లలు కలిగిన వాళ్ళు మీరే ఆలోచించుకోవాలి. అందులోనూ ఇద్దరూ ఆడపిల్లలు. వాళ్ళ పెళ్ళిళ్ళకీ కట్నాలకీ కావాలి డబ్బు!’ అంటూ ఆ అత్తగారు ఓ పేద్ద చదువు చదువుతుంది.

రథం మీదుండే మొండిచేతులవాడూ చక్రాల కళ్ళవాడూ కాళ్ళు లేనివాడూ అయిన ఆ జగన్నాథుణ్ణి వదిలేసి బొమ్మల తగాదాలో పడిపోతారు అత్తాకోడళ్ళు, అమ్మా నాన్నమ్మా. ‘అసలే జనం. ఇంకా పెరిగిపోతారు. నువ్వు ఆ తొక్కిడిలో రథం ఎక్కలేవు బామ్మా. పదండి, పదండి’ అంటూ పిల్లలిద్దరూ పువ్వుల గౌనులు తొడుక్కుని, తల్లో పువ్వులు పెట్టుకుని కొబ్బరికాయలు తలోటి చేతిలో పట్టుకుని తొందర పెడతారు. అల్లాగ్గా రథయాత్ర ఇళ్ళ దగ్గర్నుంచి బయలు దేరుతుంది!

రథం ఎక్కడానికీ దిగడానికీ సదుపాయం చేసే పెడతారు. ఓవేపు నుంచి ఎక్కి రెండోవేపు నుంచి దిగడానికి వీలుగానూ తాళ్ళు కట్టి – తాళ్ళను పట్టుకొనీ రథం కర్రలను పట్టుకొనీ ఎక్కడానికి వీలుగానూ కడతారు ముసలివాళ్ళు, ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా. పిల్లగుంటలు కోతుల్లా చకచకా గెంతుతూ గెంతుతూ ఎక్కుతారు. వాళ్ళకి అదో ఆట. ఇట్నించి ఎక్కి ఓసారి దేవుడి మొఖం చూసి అట్నించి దిగి మళ్ళా ఈ పక్క నుంచి ఎక్కడానికి ఒక్క పరుగున వొస్తారు. అందులోనూ ఎవరి గుంపు వాళ్ళది కాబట్టి వాళ్ళకంటే వీళ్ళు, వీళ్ళకంటే వాళ్ళు, ఒకళ్ళని ఒకళ్ళు మెడ్డాయించడానికి తోసేసి ఎక్కడాలు, పోట్లాడుకుంటున్నట్టు ఎక్కుతారు. పెద్దవాళ్ళు, జగన్నాథుడి దగ్గరున్న పండా బ్రాహ్మలు ఎన్నిసార్లు ఎక్కుతారు అని ‘అబ్బాయిలూ చాలాసార్లు వచ్చేరు. ఇంక ఇళ్ళకు వెళ్ళండి, ఏమన్నా తిండానికి కొనుక్కుని’ అంటూ అనునయంగానే చెప్తారు. అయినా పిల్లలు పిల్లలే. ఆకతాయి వెధవాయిలు – మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో! ఇంతమందిమి కదా, పోల్చుకోలేక పోయారు అంటారు!

ఇదో తంతు. రథయాత్రలో జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడూ బొమ్మలు బావుంటాయి. శంఖం ఊదుతూ జేగంట వాయిస్తూ అందరినీ దేవుడి దగ్గరకు పిలుస్తున్నట్టు ఉంటుంది.

గుడిసెన గుళ్ళకి తీసుకు వెళ్ళి ఉంచేటంత వరకూ రథం అక్కడే ఉంటుంది. తర్వాతా ఆ రథాన్ని అక్కడే ఉంచినా మొత్తం రథాన్ని కప్పి ఉంచుతారు.

మూడు కోవిళ్ళ దగ్గర రథం యాత్ర అయిపోయాక మూడు గుళ్ళకు ఎదురుగుండా పెద్ద మైదానం లాంటి ఆతాలో పెడతారు. దానికి ఏమీ కప్పరు. అదలా ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఉంటుంది. ఏం కర్రతో చేస్తారో ఏమో పాడవదు. చాలా గట్టిది. పిల్లలు సాయంత్రాల వేళ అది ఎక్కుతూ దిగుతూ ఆడుకుంటూ ఉంటారు. చిన్న చిన్న ఆడపిల్లలు మేమూ తీసిపోము మీకు అని మగగుంటలతో సమానంగా రథం ఎక్కుతూ దిగుతూ ఆడ్డమే కాదు, వాళ్ళల్లా దాని మీద సర్కస్ ఫీట్లు కూడా చేస్తుంటారు. వేళ్ళాడ్డం తలకిందులుగా, కాళ్ళు మీదకీ తల కిందికీ పెట్టి ఊగిసలాడ్డం – ఒకటేమిటి, సర్కసు వాళ్ళు చూస్తే మూర్ఛ పోయేటట్టు. మీరు మా సర్కసులో చేరతారా అని వాళ్ళు అడుగుతారు కూడా. ఎంత డబ్బు ఇస్తారు అని ఎదురు ప్రశ్న వేస్తారు ఈ గుంటలు. గడుసు వెధవాయలు. ఒక షోకి ఎంత? అంత. వాళ్ళు చెప్పింది వీళ్ళకు చాలదు. మీకు మా వల్ల ఎంత డబ్బు వస్తుందో, మాకు అంత తక్కువా? మేం రాం! అంటారు. ఏదో వీళ్ళు నిజంగా వెళ్ళేటట్టు. ఇంట్లో తెలిస్తే చావబాదుతారు. తెలీకండా ఎలా ఉంటుందీ? ఊళ్ళో వాళ్ళంతా సర్కస్ చూడ్డానికి వెళ్తారాయిరి. ఎవరో ఒకరు తండ్రికి చెప్పేస్తారు! ఇంక చూసుకోండి నాసామిరంగా మీకు ఇలాంటి బుద్ధులేంట్రా దొమ్మరి గుంటల్లా అని తండ్రికన్నా వాళ్ళ నాన్నమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది! ఉత్తిదే, హాస్యానికి అలా వాళ్ళతో మాటాడాం, ఆడించడానికి, నిజం కాదు అని ఎంత చెప్పినా వినిపించుకోదు. తండ్రే ఇంక వదిలేయమ్మా! వీళ్ళకి అంత ధైర్యం లేదులే అంటాడు. ఇదంతా డ్రామాలా ఆ పిల్లలే మనస్సులో మనస్సులో ఊహించుకుంటారు.

నిజంగా ఇవి డ్రామాలే!

కన్యకాపరమేశ్వరి కోవెల దగ్గర పెట్టే రథాన్ని ఎక్కడ పెడతారో, పండగ అయిపోయాక, ఆ చుట్టుపక్కల ఎప్పుడూ ఎక్కడా కనపడదు. బజారు ఏరియా కదూ! ఎప్పుడూ జనమే జనం. ఎక్కడ పెడతారూ? ఎప్పుడూ ఎవరినీ ఎక్కడ పెడతారని అడగలేదు.

రథయాత్రలో లక్కపిడతలు, లక్క రైలుబళ్ళు, చంటి పిల్లల్ని ఆడించడానికి గలగలా చప్పుడు అయ్యే ఎర్ర ఎర్ర నీలం నీలం లక్కకాయలూ అమ్ముతారు. బిందె మీద బిందె అతుక్కుపోయినవి, బిందెలూ ఉంటాయి. చంటి పిల్లకి కట్టే రంగు రంగు గుడ్డలతో వివిధ ఆకారాల బొమ్మలు కుట్టీ ఉయ్యాలలో పిల్లాడికి వేళ్ళాడదీసే కట్టె, నల్చదరపు చక్కీవో – వెదురుబద్దలతో చేసినది, దొరుకుతాయి. చంటిపిల్లల తల్లులో వాళ్ళింటి ముసలమ్మలో గీసి గీసి బేరమాడుతూ వాటిని కొనుక్కువెళతారు.

అసలు సంబరం కన్నా వీటిని చూడ్డానికి వెళ్ళాలి రథయాత్రకు! ఎంత బాగుంటాయి ఇవన్నీ! మెల్లిమెల్లిగా కృష్ణుడి బొమ్మని రెండు చేతులా కౌగిలించుకొని పట్టుకుని నడుస్తున్న ముసలమ్మగారిని చూసి పొట్ట పగిలేటట్టు నవ్వి నవ్వి ఆయాసపడచ్చు. నవ్వుతో వంగిపోయి మోకాళ్ళ వరకూ దగ్గు వచ్చి దగ్గచ్చు. అమ్మమ్మ దగ్గరా నాన్నమ్మ దగ్గరా తాతయ్య దగ్గరా ముద్దులు గుడిచి తెచ్చుకున్న కాణీవో అర్థణావో పెట్టి రంగులరాట్నం ఎక్కి తిరగచ్చు. జూదం చక్రం మీద కాణీ కాసి రెండు కాసులు గెలుచుకొని తోక తొంభై కొనుక్కోవచ్చు. ఎన్నైనా చేయచ్చు. తనతో పాటూ తనలాగే అల్లరి చేసే నేస్తం కూడా ఉంటే సంబరం సంబరంలా ఉంటుంది. ఒక్కడూ సంబరాల్లో తిరిగితే బాగోదు!

ఏ ఏడాదికి ఆ ఏడాది రథయాత్ర కొత్తగా జనంతో హోరెత్తుతూ పిల్లల్నీ పెద్దల్నీ పిలుస్తూనే ఉంటుంది. అన్ని పండగల్లాగానే రథయాత్ర కోసం పిల్లలు ఎదురు చూస్తారు. ఎప్పుడు ఎప్పుడొస్తుంది అని అడుగుతూ ఉంటారు. రథయాత్రకీ మారు రథయాత్రకీ ఒక్కలా జనం విరగబడతారు. ఆ వేళ తప్పకండా రథం ఎక్కుతున్నప్పుడు, దిగి వచ్చేస్తున్నప్పుడు వాన పడుతుంది. అలా అని కొట్టి కురవదు. జగన్నాథుడు ఆశీర్వదిస్తూ అక్షింతలు జల్లినట్టు నీటిజల్లులు జల్లుతాడు వేడుకున్న ఫలితంగా.