ఊహల ఊట 20

కొత్త క్లాసు, కొత్త టీచర్లు, కొత్త పుస్తకాలు – సరికొత్త వాసనలు! కొత్తలన్నిటితో మాంఛి ఉత్సాహంతో ఎగురుతూ కొత్త గౌను రెపరెపలతో నేను!

లెక్కల క్లాసు టీచరు వస్తున్నట్టు వరండా నుంచి సన్నని చప్పుడు. అందరమూ గుమ్మం వేపు మొహాలు తిప్పి చూస్తున్నాం. సెంటు పరిమళం గుబాళింపు గదిలోకి వచ్చింది!

భలేగా ఉంది లెక్కల టీచరు! పొడుగ్గా, రెపరెపలాడే వాయిల్ చీరలో – ఎంత తెలుపో! మోచేతివరకూ చేతులున్న జాకెట్టు, నల్లతోలు బెల్టుతో రిస్టువాచీ, రెండో చేతికి నల్ల గాజులు, చెవులకు పొడుగ్గా వెండి లోలాకులు, మెళ్ళో సీతాకోకచిలక లాకెట్టుతో సన్నటి వెండి గొలుసు, కళ్ళకు సురమా కాటిక!

క్లాసులోకి ఏదో తేజస్సు వచ్చినట్టనిపించింది. మంత్రం వేసినట్టు అందరం ఒక్కసారి లేచి నిల్చుని “నమస్తే టీచర్” అన్నాం. ఆవిడ మమ్మల్నందర్నీ ఓసారి కలయజూసి నవ్వుతూ “నమస్తే అమ్మాయిలూ! కూచోండి!” అన్నాది. తరువాత మా పేర్లు ఒక్కొక్కరివీ పిలుస్తూ హాజరు రిజిస్టరులో నమోదు చేస్తూ ఒక్కొక్కరినీ చూసింది.

నా పేరు పిలిచి “కుంతలా! అంటే అర్థం ఏఁవిఁటీ?” అని అడిగింది. మిగతా అమ్మాయిల పేర్లు బహుశా ఆవిడకు తెలిసినవేమో మరి!

“కుంతలంటే ఉంగరాల జుత్తు ఒత్తుగా ఉన్నది” అని చెప్పే.

“ఓహో! ఒత్తు జుత్తు అమ్మాయివా!” అంటూ నవ్వింది.

నేనూరుకుంటానా? వెంటనే అడిగేశా! “మీ పేరు ఏఁవిఁటి టీచర్?”

“సయీదా!” నవ్వుతూనే చెప్పింది.

“మరి దాని అర్థమో?”

“ఎప్పుడు నవ్వుతూ ఉల్లాసంగా ఉన్నది. ఇహ లెక్కలు చేసుకుందాం. అందరూ పుస్తకాలు తెరవండి.” చాక్‍పీస్ డబ్బాలోంచి సుద్దముక్కలూ డస్టరూ తీసుకుని నల్లబల్ల దగ్గరికి వెళ్ళింది.

అందంగా, తెలివితేటల తళుకుతో ఠీవిగా ఉన్న సయీదా టీచరు అయస్కాంతంలా బలంగా నన్ను తనవేపు ఆకర్షించేసింది.

పొడుగ్గా హుందాగా ఉన్నవాళ్ళు ఖరీదు తక్కువ మామూలు వాయిల్ చీరలు గంజిపెట్టి ఇస్త్రీ చేసినవి కట్టుకున్నా ఎంత బాగుంటారో! పొట్టిగా బుడంకాయల్లాంటి వాళ్ళు ఎంత ఖరీదు చేసిన చీర కట్టుకున్నా బాగుండరు సరికదా చీర అందమూ చెడిపోతుంది! అందం లేకపోయినా తెలివితేటల తళుకుతో జ్ఞానంతో కళగా ఉన్న పొట్టివాళ్ళూ ఉంటారు.

సయీదా టీచరులా అంత పొడుగ్గా అవుతానా? నాన్న పొడుగే కదా! అమ్మా మరీ పొట్టిది కాదు.

ఏంటో నేను! ఒక్కొక్కసారి ఇలా చిన్నపిల్లగా ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ఏవేవో చేసేయాలనిపించగానే పెద్దదాన్నయిపోవాలి అనుకుంటా. సయీదా టీచర్లా అయిపోవాలనో మరొకర్లా అయిపోవాలనో కోరిక పుట్టేస్తుంది.

లెక్కలంటే ఇదివరకూ ఇష్టమే కాని సయీదా టీచరు లెక్కల పాఠం వింటూంటే లెక్కలంటే మహాయిష్టం అయి “నాన్నా! నాన్నా! నే ఇంట్లో లెక్కలు చెయ్యడానికి నల్లబల్ల కావాలి. కొనిపెట్టవా?” అని అడిగే. ‘దీనికి మళ్ళా మరో కొత్త పిచ్చి పట్టినట్టుంది’ అని అమ్మా బామ్మా నోళ్ళు నొక్కుకున్నారు. నా పిచ్చిలు అన్నీ మంచి పిచ్చిలే. “పెద్దయ్యేసరికి ఏ పిచ్చి మిగిలినా మిగిలిన పిచ్చిలు ఆ పిచ్చికి బలాన్ని ఇస్తాయి” అన్నాడు నాన్న. ఈ పిచ్చిని పేషన్ అని ఇంగ్లీషులో అంటారుట.

నాన్న గోడకు వేళ్ళాడదీసుకునే నల్లబల్ల కొనిపెట్టేడు. రాసింది తుడిచేసుకోడానికి డస్టరు, తెల్ల చాక్‍పీసులతో పాటు రంగు చాక్‍పీసులూ తెచ్చి పెట్టేడు. బళ్ళోంచి రాగానే అమ్మిచ్చిన పాలు తాగేసి నవఁలడానికిచ్చిన వాటిని పట్టుకుని వీధి చీడీగోడకు కొట్టిన మేకుకు నల్లబల్ల తగిలించేసి లెక్కలు చెయ్యడంలో మునిగిపోవడం –

లెక్కలు, లెక్కలు – బుర్రనిండా లెక్కలు. దేన్ని చూసినా దీర్ఘ చదరంగానో, త్రికోణంగానో కనబడ్డం – ఎదురుగా ఉన్న స్తంభం, దానికి ఆనుకున్న అడ్డగోడ, తొంభై డిగ్రీల లంబకోణంగా కంటికి ఆనడం – బుర్రనిండా సందేహాలు – వాటిని సయీదా టీచర్‍ని అడగడం, లేదా నాన్నని అడగడం. లెక్కలు నిజంగానే నన్ను పిచ్చెత్తిస్తూ!

ఓరోజు అన్నం తింటూ “నాన్నా! నాన్నా! మనిల్లు కట్టి ఎన్నేళ్ళయిందీ?” అని అడిగే.

“మనిల్లు ఎన్నేళ్ళ క్రితం కట్టిందో నీకెందుకే?” అడిగింది బామ్మ.

నాన్న ప్రశ్నమొహంతో నోట్లో పెట్టుకున్న ముద్దని మింగేక “ఎందుకూ?” అని అడిగేడు.

“తాతగారు కట్టించారు. ఆయన పోయే పదేళ్ళు పైనే అయిపోయింది. అంతకు ముందు, అంటే యాభయ్యేళ్ళు అయి ఉంటుంది.”

“మామయ్యగారు నలభై ఏళ్ళకే చిన్నవయసు లోనే చనిపోయారు కదా. యాభై ఏళ్ళేం, అంతకు పైమాటే!”

అమ్మా బామ్మా లెక్కలు కడుతూ జవాబు చెప్పడానికి వెనకటి రోజుల్లోకి వెళ్ళిపోయారు.

“ఇప్పుడు మనింటికి తాపీ పని చెయ్యడానికి వచ్చే మేస్త్రీకే చదువు రాదు. మరి యాభై అరవై ఏళ్ళ క్రితం ఇల్లు కట్టిన వాడు చదువుకున్నాడా?”

“వాడి చదువు గురించి నీకెందుకే?”

“మరి స్తంభాన్నీ దాన్ని ఆనుకున్న గోడనీ తొంభై డిగ్రీల లంబకోణంగా ఎలా కట్టేడూ చదువుకోకండా?”

“ఓసీ! అదా నీ సందేహం?” అంది బామ్మ. “ముందే అలా అడగొచ్చు కదే?” అంది అమ్మ.

నాన్న తాపీమేస్త్రీల దగ్గర ‘ఒడంబం’ ఉంటుందని, అది తాడుకు వేళ్ళాడుతున్న బొంగరం లాంటిదని, దాన్ని కొన్ని చోట్ల తూకంగుండు అంటారని, దానితో పెట్టి చూసుకుంటూ ఇటుకలు పెట్టి కడతారనీ బోధపరిచాడు. కంపాస్ బాక్సులో సెట్‍స్క్వేర్ లాంటిది కర్రతో చేసినది, ఒడంబం, గుండ్రటి బొడిపెలాంటి హాండిలుతో నునుపు చేసే బల్లచెక్క – ఇలా తాపీ మేస్త్రీల పనిముట్ల గురించి చెప్పేడు. ఈసారి మన తాపీమేస్త్రీ వచ్చినప్పుడూ అతణ్ణి అడిగితే నీకు అన్నీ చూపిస్తాడు అనీ చెప్పేడు.

“నీకు తొంభై డిగ్రీల లంబకోణం గురించి చదువుకున్నావు కాబట్టి తెలిసింది. సరే – మరి ఇప్పుడు నువ్వు ఆ స్తంభాన్నీ అడ్డగోడనీ కట్టగలవా? కట్టలేవు. జ్ఞానం రెండు రకాలు. ఒకటి చదువుతో వచ్చేది. రెండోది అనుభవంతో అమలు పరచగా వచ్చేది. ఇంగ్లీషులో ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇంప్రాక్టికల్ నాలెడ్జ్ అంటారు” అని బోధపరుస్తూ పాఠం చెప్పినట్టే చెప్పేడు.

సయీదా టీచరూ అంతే. భలేగా బోధపరుస్తుంది. ఆవిణ్ణీ నేను ఇలాగే రోజూ ఏదో ఒకటి అడుగుతూ ఉండేసరికి ఆవిడ దగ్గర నాకు చనువు పెరిగిపోయింది. ఆవిడకి నేనంటే బోలెడు ఇష్టం అని మా క్లాసు అమ్మాయిలంతా అనడం మొదలుపెట్టేరు. నిజం చెప్పాలంటే వాళ్ళన్నా టీచర్‍కి ఇష్టమే. ఆవిడ అందరితోనూ ఎంతో సరదాగా నవ్వుతూ స్నేహితురాలిలా మాటాడుతుంది. విసుక్కోకండా కసురుకోకండా ఎంత తెలివి తక్కువ ప్రశ్న అడిగినా కోప్పడదు. దానికి జవాబు తను చెప్పడమో లేదా ముందువరసలో కూచున్న ఓ పిల్ల చేత నల్లబల్ల మీద రాయిస్తూ, చెప్పిస్తూ బోధపరచడమో చేస్తుంది. ప్రతిపిల్లకూ రావాలి. అదే కావాలి ఆవిడకు.

“మీకు మీరే నన్నడగకండా తెలుసుకుంటారు. ఎలాగంటారా? ఎక్సర్‍సైజులు మళ్ళీ మళ్ళీ చెయ్యాలి. ఆలోచిస్తూ చెయ్యాలి.”

నాకు ఆవిడ చెప్పిందీ నాన్న చెప్పిందీ బాగా అర్థం అయింది. నేనేదో ఎప్పుడూ ఊహిస్తూ ఉంటానుగా. ఊహ ఊహే కదా! దాన్ని నిజం చెయ్యాలి. దానికి ఒక్కొక్క స్టెప్ వేస్తూ నిజం చెయ్యాలి. అది ఊహ కాదు అని ఋజువు చేసేయాలన్నమాట. ఇదిలా అయితే ఇలా అవుతుంది. ఇలా అయితే తర్వాత ఇలా అవుతుందీ అని తెలిసిపోతూ ఉంటుంది. వెనకనుంచి ముందుకు వెళ్ళడం, ముందునుంచి వెనక్కి వెళ్ళడం, మధ్యనుంచి ముందుకు వెళ్ళడం – భలేగా అనిపిస్తూ ఉంటుంది.

ఓసారి నాన్నతో ఈమాట అంటే ‘కథ అలాగే రాస్తారూ, లెక్కలొచ్చిన వాళ్ళకి కథల్రాయడం వచ్చేస్తుంది’ అన్నాడు. గణితం బాగా వస్తే జ్ఞాపకశక్తి కూడా బ్రహ్మాండంగా పెరుగుతుందిట.

లెక్కలు చేసి చేసి, డస్టరుతో తుడిచి తుడిచి, చెయ్యి నొప్పి పెడుతున్నా నాకయితే ఇంకా ఇంకా కొత్తవి చెయ్యాలనిపిస్తోంది. ఏఁవిటో – కొందరు పిల్లలు ఇంకా వెనకపడే ఉన్నారు. వాళ్ళకు ఎంత బోధపరిచినా ఎన్నిసార్లు చెప్పిందే చెప్పినా రావటం లేదు. నాన్న అన్నాడూ -‘కొందరి మేధస్సు విచ్చుకున్నట్టు అందరిదీ విచ్చుకోదు. పువ్వులో అన్ని రెక్కలూ విడినవి, కొన్ని మాత్రమే విడినవి, కొన్ని సొట్టసొట్టగా విడినట్టు ఉన్నట్టుగా మేధస్సులోనూ కొంతమంది కొంత విడి, కొంతమంది విడీవిడక, కొంతమంది సొట్టపోయి ఎదుగుతారు.’

ఈ లెక్కలన్నింటికన్నా ముందు చెప్పిన లెక్కల్లో రూపాయి అణాపైసల లెక్కలని అందరం సరదాగా ఆడుతూ పాడుతూ చేసేం. మాకు ముందే డబ్బులు గురించి బాగా కాకపోయినా తెలుసు కదా! అందుకని టీచర్ దమ్మిడీలు కాసులు అంటూ చెప్పేసరికి మేం –

డబ్బు|కి|రెం|డూ|ద్రా|క్షా|పళ్ళూ|
బడి|పి|ల్లలం|దరూ|కొను|క్కోండి!

అని పాడ్డం మొదలు పెట్టేం. టీచరు నవ్వి “డబ్బు అంటే ధనం. సొమ్ము. కొందరికి డబ్బు ఉంటే కొందరికి ఉండదు. అంటే కొందరు గొప్పవాళ్ళు. కొందరు బీదవాళ్ళు. ధనాన్ని సొమ్ము అని కూడా అంటారు” అంది.

“‘డబ్బు’ అంటే రెండు దమ్మిడీలు. చిక్కాం సంచీలో రెండు దమ్మిడీలు వేయించుకుని మాకు రెండు ద్రాక్షపళ్ళు ఇస్తాడుగా! మేం బళ్ళో కొచ్చేటప్పుడు ‘డబ్బో’ కాణీవో పరకో ఏదన్నా కొనుక్కోడానికి ఇస్తారుగా! ” అంటూ జేబుల్లో చేతులు పెట్టేం తీసి చూపెట్టడానికి!

సయీదా టీచరు గట్టిగా నవ్వి “సరే, సరే! ‘డబ్బు’ అంటే రెండు దమ్మిడీలు. మరి రూపాయికి ఎన్ని దమ్మిడీలో చెప్పండి?” అన్నాది.

మేం మొహమొహాలు చూసుకున్నాం. అలా మొదలయింది రూపాయి అణాపైసల లెక్కలు నేర్చుకోవడం. రూపాయిలను దమ్మిడీల కింద మారిస్తే చిక్కాం సంచీలు నిండిపోయి ఎన్ని సంచులో కావాలి. అదే దమ్మిడీలని రూపాయిలకి మారిస్తే ఓ సంచీవో రెండో సంచీలో సరిపోతాయి. నూరు రూపాయిలని దమ్మిడీలుగా మార్చడం, వెయ్యి రూపాయిలను మార్చడం, గుణించడం – ఒకట్లు, పదులు, వందలు అంటూ పందొమ్మిది వేల రెండు వందలు, లక్షా తొంభైరెండు వేలు అంటూ చెప్పడం!

నాన్న నల్లబల్ల కొనిపెట్టేక ఇంటి దగ్గర నేను కోటి రూపాయిలను దమ్మిడీల కింద మార్చి లెక్క పెట్టడానికి సున్నాలు చుట్టి, ఆయాసపడిపోతూ గట్టిగా నూటా తొంభైరెండు వేల కోట్లు అంటూ ఉంటే – ముత్తమ్మ “ఏం చదువులమ్మా! పిల్ల ఎలా ఆయాసపడిపోతోందో చదవలేక!” అని వాపోతూ ఉంటే ఇంట్లో ఒకటే నవ్వులు!

ఎంత వేగిరం ఏడాది గిర్రున తిరిగిపోయింది! ఇవాళ గోడగుర్రం మీద కూచున్నానన్న మాటే గాని గుర్రం మీద కూచున్నట్టే లేదు – కాళ్ళు రెండూ నేలకి తగిలిపోతూ! గోడగుర్రం మీంచి ఇప్పుడు గెంతాలేను. కాళ్ళు నేలకి తగిలిపోతూ ఉంటే గెంతడం ఎలా?

నేను గడకర్రలా పొడుగయిపోతున్నానుట! ఒళ్ళు చెయ్యకపోతే బాగుండనట! అంటోంది బామ్మ. నేనంటే పొడుగ్గా పెరుగుతున్నా. కాని గోడగుర్రం ఎత్తుగా పెరగదుగా. ఇంక మెట్ల మీద కూచుని ఆకాశాన్ని మబ్బుల్ని సూరీణ్ణీ చూడాలి!

అవును, నేను ఓ క్లాసు తరవాత ఓ క్లాసుకి వెళ్తూ పెద్దదాన్ని అవుతున్నా. సయీదా టీచరులాంటి లెక్కల టీచరు పై క్లాసులో ఉంటుందో లేదో! ఆవిడ బళ్ళో క్లాసుకు రాకపోయినా క్లాసులో తెలీనివి వాళ్ళింటికెళ్ళి నేర్చుకోవాలి.

అవునూ, తెలివితక్కువ దాన్ని! అంతవరకూ ఎందుకూ? ఈ సెలవల్లోనే వెళ్ళొచ్చు కదా! నాన్నని అడుగుతా. వద్దనడు. వెళ్దామనే అంటాడు. ఈద్ నాడు ఈద్ ముబారక్ చెప్పడానికి వాళ్ళింటికి తనూ నాతో వచ్చి ముబారక్ చెప్పేడు. టీచరు పెట్టిన శాహీ టుకడా – అదే డబుల్‍కా మీఠా తిన్నాం. సేమ్యా కూడా తినేసరికి కడుపు నిండిపోయి బ్రేవుమని తేన్పు వచ్చింది!

ఇంటికొచ్చేక డబుల్‍కా మీఠా చేయించడానికి బ్రెడ్డు, బాదం, పిస్తా, కాజూ, రబడీ అన్నీ తెచ్చేడు. బామ్మా అమ్మా కొత్త వంటకాలు చెయ్యడానికి, నేర్చుకోడానికి ఎప్పుడూ సిద్ధమే.

“ఆ తురక టీచరు ఎవరో ఈదో ఏదో తమ పండగని దీన్ని పిలవడమూ, నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళడమే కాక వాళ్ళింట్లో అదేదో ఆ టుకడా తిని వస్తారా? బాగుందిరా! ఇదేం పనీ? ఆడపిల్ల. దానికన్నీ సరదాలే. ఇలా చెయ్యచ్చా?” బామ్మ నాన్నని దెబ్బలాడింది. అయినా, ముస్లిముల రంజాన్ నెల ఉపవాసం, దానికి వాళ్ళ నియమాలు, ఎంతబాగా వాటిని పాటిస్తారో, దానాలు చేస్తారో – ఈద్-ఉల్-ఫితర్ గురించీ ఇఫ్తార్ విందు గురించీ చెప్పేసరికీ ‘అలాగా?’ అంటూ ఆసక్తిగా వింది.

ఏ మతం అయినా ఇదే చెప్తుందనీ – ప్రేమ, దయ, కరుణ ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, అల్లా అయినా రాముడయినా ఏసుక్రీస్తు అయినా అదే చెప్పేరని, ఆ దేవుడి దృష్టిలో అందరూ సమానమేనని చెప్తూ, “గాంధీజీ భజన నీకూ తెల్సు, ఇష్టమేగా – వైష్ణవ జనతో తేనే కహియే జో పీడా పరాయి జానేరే” అన్నాడు నాన్న.

బామ్మకీ అమ్మకీ ఆ పాట వచ్చు. దాంతోపాటూ ‘రఘుపతి రాఘవ రాజారామ్, పతిత పావన సీతారామ్, ఈశ్వర్ అల్లా తేరేనామ్, సబ్‍కో సన్మతి దే భగవాన్!’ కూడా.

బామ్మ బుర్రూపుతూ “అవును. ఆ మహాత్ముడి భజన పాటలు రెండు నేనూ పాడుతూనే ఉంటాను” అంది.

“పాడ్డం కాదు. ఆచరణలో పెట్టాలి. అదీ గాంధీజీ కోరుకునేది!” అన్నాడు నాన్న.

“మతం గురించి కాదురా! వాళ్ళు నీచు తింటారు. అందులోనూ గొడ్డు మాంసం!”

“మాంసం తినేటప్పుడు గొడ్డు మాంసం ఏఁవిటి? ఏ మాంసం అయినా మాంసమే! జీవహింస చెయ్యకూడదని వాళ్ళంతట వాళ్ళు మానేయాలి గాని, వాళ్ళ అలవాట్లని వాళ్ళు ఎలా వదిలేస్తారూ? మాంసం మద్యం ముట్టుకోనని మాట ఇచ్చి గాంధీజీ పైదేశం వెళ్ళేడు.”

“నిజవేఁను. మనుషులం అందరం ఒకటే.”

అంతవరకూ ఏఁవీఁ మాటాడకండా వింటున్న అమ్మ “అందరూ సమానం సమానం అంటారు కాని సమానం ఎక్కడ అవతారూ? హెచ్చుతగ్గులు ఉంటూనే ఉంటాయి” అన్నాది.

ఈమాటలన్నీ వినేటప్పటికి ఆకాశంలో మెరుపు మెరిసినట్టు నా బుర్రలో జిగేల్మంది!

సయీదా టీచరూ ముస్లిమే. దూదేకుల సాయిబు వాళ్ళూ ముస్లిములే. వాళ్ళకీ వీళ్ళకీ ఎంత తేడా! మతం ఒకటే. ఒకరు బీదవాళ్ళైతే ఇంకొకరు డబ్బున్న వాళ్ళు. అయితే ఏం? వాళ్ళు వాళ్ళ వాళ్ళ విద్యలో గట్టివాళ్ళు. సయీదా టీచరు లెక్కలు పిల్లలకు చెప్పడంలో గట్టిదైతే సాయిబుగారు దూదేకి పరుపులూ అవీ కుట్టడంలో గట్టివాడు. అందుకే అందరూ అతణ్ణి పిలిచి కుట్టించుకుంటారు పరుపులూ అవీనూ. విద్య వచ్చినవాణ్ణే మెచ్చుకుంటారు కదా మరి! అంతమంది టీచర్లలో సయీదా టీచరంటేనే నాకు ఇష్టం ఎందుకూ? ఆవిడ లెక్కలూ బాగా చెప్తుందనేగా! బామ్మ బాగా వండడంలో గట్టిది. అందుకే ఆవిడ వండినవి తినాలని అందరూ వస్తారు. మెచ్చుకుంటున్నారు. ఆవిడంటే ఇష్టపడుతున్నారు! ఎవరికి ఏ విద్య ఇష్టమైతే ఆ విద్యని నేర్పించాలి. సాయిబుగారిలా వాళ్ళ తాతలనుండీ తండ్రులనుండీ వస్తున్న విద్యని వాళ్ళకి ఇష్టమైతే దాన్నే నేర్పించాలి.

ఒక్కటి నాకు బాగా బోధపడుతోంది. సయీదా టీచరు నన్ను పిలిచినట్టు సాయిబుగారూ బేగమ్ నన్ను పిలవలేకపోయారు. నే వాళ్ళ దృష్టిలో గొప్పవాళ్ళ పిల్లని! నన్ను ఎలా పిలుస్తారూ? అందుకే పిలవలేదు! నేనంటే ఇష్టమే!

ఇదే, ఇదే పెద్దలోపం. గొప్పా బీదా ఉండకూడదు. అందరికీ అన్నీ ఉండాలి. ఎక్కువ తక్కువలు పోవాలి. ఎవరూ ఎవరికీ బానిసలుగా ఉండకూడదు. ముందు మనకి స్వాతంత్ర్యం రావాలి. మన దేశపు బానిసత్వం పోవాలి.

నే పెద్దయేక చెయ్యాల్సిన పెద్ద పని గొప్పా బీదా ఉండకుండా చెయ్యడమే.

ఎన్నెన్ని పనులు చెయ్యాలో నేను! చెయ్యగలనా?

ఎందుకూ చెయ్యలేనూ? చేస్తాను. చేస్తాను. చేసి చూపెడ్తాను!

గోడగుర్రం మీంచి ఇటుకాలునీ అటుకాలునీ నేల మీద ఈడ్చి నిల్చున్నా, ఇంట్లోపలకి వెళ్ళడానికి.