ఊహల ఊట 12

వచ్చేసింది ఎండాకాలం. ఇల్లంతా హడావిడిగా ఉంది.

బామ్మ గొంతు పది వీధులకు వినబడేటట్టు ఖంగు ఖంగుమంటోంది. చెప్పినవే మళ్ళీ మళ్ళీ ఏకరువు పెడుతోంది.

ఏటికేడాది ఉండేదాయిరి! ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి! ఒకటా, రెండా? అన్నీ తనే చూసుకోవాలాయె! ఎంతమంది ఎన్ని పనులు చేసినా తను పురమాయించిన పద్ధతినే జరగాలాయె!

వంటింటి అటకమీంచి ఆవకాయ గూనలు పెద్దవీ చిన్నవీ అన్నిటినీ దింపించాలా, కడిగించాలా, ఎండబెట్టాలా! ఒక వహీవా? అన్ని వహీల ఆవకాయా పెట్టాలా! పచ్చావకాయ, బెల్లమావకాయ, ఎండావకాయ, అడకాయ, మాగాయి, తొక్కుపచ్చడి, కాయావకాయ, మెంతావకాయ. మళ్ళీ అందులోనూ కొన్నిటిలో వెల్లుల్లి వేసీ, కొన్నిటిలో వెయ్యకుండానూ! ముత్తమ్మకీ దాని కూతురికీ ఊపిరి సలపనివ్వకుండా పని మీద పని చెప్పేస్తోంది.

“మాడుగుల నుంచి సన్నావాలు ఇంకా రాలేదేంరా? పోయిన ఏడాది ఈ సరికి వచ్చేసేయి కదరా?” అని ఒకటే గోల.

“ఇవాళో రేపో వస్తాయి. కంగారు పడకండి అత్తయ్యా!” అమ్మ గొంతూ ఖంగుమంటోంది.

తెలకలి పెద్దాయన నువ్వులనూనె పట్టుకు వొచ్చీసేడు. ప్రతీ ఏడాదీ అంతే! సరీగ్గా సమయానికి వొచ్చేస్తాడు. ఇంటివాడకం నూనె కొడుకుల చేత పంపించినా ఆవకాయకి మాత్రం స్వయంగా తానే తెస్తాడు. పాపం, రెండు కాళ్ళూ బోదకాళ్ళే. గుండ్రటి రుబ్బురోళ్ళని ఒకదానికింద ఒకటి పెట్టినట్టు కాళ్ళు మీదినుంచి కింది పాదాల వరకూ బోదవాపులు, ఇంతంత లావు లావు ఉండలు ఉండలు! ఆ ఉండల బరువు కాళ్ళను ఈడ్చుకుంటూ నడిచి నూనె పట్టుకువొస్తాడు.

“ఏనాటి వాడకం మరి! మా అత్తగారి కాలం నుంచీ ప్రత్యేకించి మనకోసం మంచి నువ్వులతో గానుగాడి నూనె తెస్తున్నారు!” అని గొప్పగా చెప్తుంది బామ్మ.

నూనే కాదూ ఆవాలే కాదూ. మిరపకాయలే కాదూ మావిడికాయలే కాదూ. అన్నిటికి అన్నీ ఆవిడ చెప్పినవే తేవాలి!

‘దినుసులు బాగుండాలమ్మా! ఏదో పెట్టుకున్నామమ్మా అని పెట్టుకుంటే ఎలా? అంత సింగినాదాలు మేం పడలేం అంటే ఎలా? నేను పెట్టిన ఆవకాయ ఎంత బాగుంటుందో మరి. అంతా లొట్టలేసుకు తింటారు.’ విన్నవాళ్ళకీ విననివాళ్ళకీ తనకి తానే పొంగిపోతూ చెప్పుకుంటూనే ఉంటుంది.

ఎప్పట్లాగే తెలకలి పెద్దాయన మేడ మెట్ల నాదు లోపలికి అడ్డంగా దూరి గోడ మీద నూనెమడ్డితో వరసాగ్గా చుక్కలు పెట్టుకుని వెళ్ళేడు. బామ్మకైతే అంతా నోటిలెక్కే! ఎంత డబ్బో ఎన్నాళ్ళైనా మరిచే మరిచిపోదు. తెలకలి పెద్దాయన ఆవకాయలు పెట్టడం తతంగం అంతా అయాక మళ్ళీ వస్తాడు డబ్బు పట్టుకెళ్ళడానికి. ముందస్తుగానే బామ్మ డబ్బు అట్టేపెట్టి ఇందయ్యా! అంటే ఆయన నాదులోకి దూరి చుక్కలు లెక్కెట్టుకుని సరీగ్గా సరిపోయిందమ్మా! అంటాడు.

పోయినేడు అత్తయ్యావాళ్ళూ వొచ్చేరు. సరీగ్గా ఆవకాయల ఉక్కిరి బిక్కిరి టయిములో! వల్లీ, జగ్గూ, చంటిని చూడగానే కొండెక్కినంత సంబరపడ్డా. ఎండలో ఇంట్లోనే ఆడుకోవాలి! ఒకత్తినీ ఆడుకోడం ఎలా? ఎంతకనీ?! పెద్దవాళ్ళంతా ఆ గొడవల్లో పడివుంటే అత్తయ్య పిల్లలూ నేనూ కలిసి ఆటలే ఆటలు! వాళ్ళకొచ్చిన ఆటలు వాళ్ళు నాకు నేర్పా, నాకొచ్చిన ఆటలు వాళ్ళకి నేను నేర్పా!

అత్తయ్య కొడుకు జగ్గూ అల్లరి వెధవాయి! వాడోరోజు మావిడికాయి జీడితో వీధి చీడీ గోడ మీద ‘దడిగాడువానవిదిచ’ అని రాక్షసంత అక్షరాలతో రాసీసేడు.

“ఒరే ఒరే! తెల్లటి గోడను ఖరాబు చేస్తున్నావ్! తాపులు తింటావు!” అని అడ్డు తగులుకున్నా వాడు రాయడం ఆపలేదు. పైగా ‘తెలకలి పెద్దాయన నూనె మడ్డితో చుక్కలు పెట్టి ఖరాబు చెయ్యలేదా ఏం?’ అన్నాడు.

“మేడమెట్ల నాదు లోపల ఎవరికీ కనబడని చోట ఆయన చుక్కలు పెట్టుకుంటాడు. పాపం అలా పెట్టుకుని లెక్కెట్టుకుంటేనే గాని ఆయనకి లెక్క తెలీదుట! నువ్వేమో గోడమీద ఇంటికొచ్చిన వాళ్ళందరికీ కనబడేటట్టు రాస్తున్నావ్!”

“రాయడం ఎందుకూ? అందరికీ కనబడాలనేగా!” అని గట్టిగా నవ్వేడు.

వాడు రాసినదేఁవిటో నాకు బోధపడలేదు. వల్లికీ తెలీలేదు. చంటి కూడబలుక్కుని కూడబలుక్కుని అక్షరాలు విడివిడిగా పైకి గట్టిగా చదివింది. మా ఇద్దరికే తెలీలేదు. దానికన్నా పెద్దవాళ్ళం. పెద్దక్లాసులు చదువుతున్నవాళ్ళం. దాని మొహం, దానికేం తెలుస్తుందీ?!

ఏఁవిటయివుంటుందా! అని మళ్ళీ మళ్ళీ చదివి గుండా పిండీ అయ్యేం. ఆ వెధవాయి నవ్వుతాడే కానీ చెప్పడే!

“ఇది తెలుగుమాట అయి ఉండదూ, అందుకే మనకు తెలీటం లేదూ” అన్నా.

“వీడికి తెలుగే బాగా రాదు! బొటాబొటి మార్కులొస్తాయి తెలుగులో. చీవాట్లు తినని రోజు ఉండదనుకో వెధవాయికి!” అన్నాది వల్లి.

“ఇదేదో మరి గమ్మత్తుగా రాసేడే!”

“వీడిలాంటి ఏ అల్లరి వెధవ దగ్గరో నేర్చుకుని ఉంటాడు.”

గోడకి ఎదురుగా నిల్చుని మా గొడవలో మేం ఉన్నాం.

“ఎండ మండిపోతూ వేడిగా గాడ్పు కొడుతూ ఉంటే వీధి చీడీ మీద ఏం చేస్తున్నారూ?” నాన్న మాట వినగానే గోడకడ్డం పడుతూ అటువేపుకి తిరిగేం. నాన్నా మావయ్యా ఎండలో కందిపోయిన మొహాల్తో బంగినపల్లి మావిడిపళ్ళ సంచులు పట్టుకు వొచ్చేరు.

‘పదండి లోపలికి’ అన్నా మేం కదలక పోయేసరికి సావిట్లోకి వెళ్ళబోతున్న మావయ్య “మా గంధోళీగాడు ఏదో ఆకతాయి పని చేసి ఉంటాడు బావా!” అన్నాడు.

“వాళ్ళే వస్తార్లే! నువ్వు పద” అంటూ నాన్న నావేపు చూసేడు. దాంతో నేను కదిలేను. నా వెనకాలే వల్లి, చంటీ. జగ్గూ వొస్తున్నాడో లేదో తెలీలేదు.

నాన్న అత్తయ్య పిల్లల్ని గట్టిగా ఏఁవీ అనడు. నాకు తెల్సు. కేకలేస్తే నన్నే కేకలేస్తాడు!

మేం కదలగానే రాక్షసజీడి అక్షరాలు నాన్న కంటపడ్డాయి. “జీడితో రాసేవా గోడమీద? ఏఁవిటీఁ పని?”

నే మాటాడలేదు. నేరాయలేదనీ చెప్పాలేను. జగ్గూ రాసేడనీ చెప్పాలేను. జగ్గూ ఎటో చూస్తూ నిలబడ్డాడు. వాడెందుకు చెప్తాడూ? తనే రాసేననీ!

“ఏం మాటాడవేం?” ఎప్పుడూ గట్టిగా నన్నేఁవీ అనని నాన్న గదమాయిస్తూ నోరు పెంచేడు. నాన్నకి తెలీదా? నేనలాంటి ఆకతాయి పనులు చెయ్యనని. తెలుసుండీ అడుగుతున్నాడు! బుర్రొంచుకుని చేతులు కట్టుకుని నిల్చున్నా.

నాన్న నన్ను గదమాయిస్తూ ఉంటే వల్లి ఊరుకోలేకపోయింది. “అది రాయలేదు. వద్దని అడ్డుకుంది కూడానూ. అయినా జగ్గూగాడు రాసీసేడు” అంటూ చెప్పేసింది.

“ఓహో! ఇది కాదూ రాస్త? జగ్గూవా రాసేడు! ఏరా, జగ్గూ, ఏఁవిట్రా రాసేవు. చదువూఁ” అన్నాడు నాన్న.

వాణ్ణి గదమాయించకుండా చదవమనీసరికి వాడికి ధైర్యం వొచ్చేసినట్టుంది. చీవాట్లు పెట్టకండా చదవమంటున్నాడుగా! ఫర్వాలేదనుకున్నాడు. నాన్నవేపు చూసేడు. చంటి నేచదువుతా అంటూ గట్టిగా అన్ని అక్షరాల్నీ ఒక్కొక్కటీ చదివి వినిపించింది. ఇప్పటికి చాలాసార్లు చదివిందిగా. కంఠతా పెట్టినట్టు అక్షరాలు అప్పచెప్పీసింది.

“రాసినవాడే చదవాలి. చదవరా!”

జగ్గు వినబడీ వినబడనట్టు ‘దడిగాడువానవిదిచ’ అన్నాడు.

“ఊహూఁ, అలా గొణుక్కుంటున్నట్టు కాదు. స్పష్టంగా చదువు. అర్థం అవాలిగా! అసలు ఎలా చదవాలీ దాన్నీ? ఎటించెటు చదవాలిరా? రాసినవాడివి అలా చదువు మరీ!” అన్నాడు నాన్న.

బుర్రెత్తి నాన్న వేపు చూశా. నాన్న కళ్ళు నవ్వుతున్నాయి.

‘ఓహో అదా సంగతీ! ఎటించి ఎటు చదవాలీ అంటే తిరగేసి చదవాలా!’ మనసులో మనసులో అనుకుంటూ కుడివేపు నుంచి ఎడమవేపుకు చదివే. ‘ఓరి జగ్గుగా!’ అనుకున్నా.

మేఁవు ఎప్పటికీ ఇంట్లోకి రాకపోయేసరికి మావిడిపళ్ళు లోపల పెట్టడానికి వెళ్ళిన మావయ్య ‘ఏమైందీ?’ అంటూ వొచ్చేడు.

“ఏం లేదూ! జగ్గూ ఏదో జీడితో గోడ మీద రాసేడు. చూడు. వాణ్ణే చదవమంటున్నా!” అన్నాడు నాన్న.

మావయ్య జగ్గూని గట్టిగా దెబ్బలాడతాడనుకున్నా. నాన్న కళ్ళతో నవ్వుతూ చదవమంటూ ఉంటే తను గట్టిగా నవ్వుతూ “ఒరే గంధోళీగా! రాసేవుగా. చదువు మరీ!” అన్నాడు.

నాకు ఆపుకోలేనంత నవ్వొచ్చింది. రెండు చేతుల్తో నోరు గట్టిగా మూసుకున్నా.

ఇహ తప్పలేదు వాడికి. రాసినదాన్ని తిరగేసి చదివేడు. “చదివిన వాడు గాడిద!”

మేఁవు ముగ్గురం గొల్లని నవ్వేం. గాడిద, గాడిద, గాడిద అన్నాం!

“ఈ గాడిద వెల్ల వేసి చేసిన తప్పు దిద్దుకోవాలి, బావా. సున్నం ఉందా? కుంచె కట్టిన చీపురూనూ!” అన్నాడు మావయ్య.

మావయ్యా నాన్నలా పిల్లల్ని తిట్టడన్నమాట. పిల్లలు ఆకతాయి పనులు చేసినా వాళ్ళ తప్పు వాళ్ళకి బోధపడేటట్టు చెయ్యాలి కాని పిల్లల్ని తిట్టకూడదూ, కొట్టకూడదూ, అంటాడు నాన్న.

వల్లీ నేనూ కూడబలుక్కుని భోజనాల దగ్గర మొదలు పెట్టేం. ‘రుచా రుచా’ అని నేనంటే ‘నాకూ రుచా రుచా’ అంది వల్లి. ముందు చంటికి అర్థం కాలేదు. కాస్సేపటికీ అదీ అందుకుంది. ‘రుచా రుచా నాకూ రుచా రుచా’ అని పాడ్డం మొదలెట్టింది. నాన్నా మావయ్యా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వడం మొదలు పెట్టేరు. తింటూ నవ్వేరేమో ఇద్దరికీ పొలమారింది!

గంధోళీగాడు వొంచిన తల ఎత్తకుండా తింటున్నాడు!

నాన్న కూరా అన్నం తిండం అయిపోగానే తను అడక్కుండానే చారు వడ్డించింది అమ్మ. “లుచా లుచా” అన్నాడు నాన్న.

“నాకూ రుచా రుచా కావాలి” అని చంటిలా దీర్ఘాలు తీస్తూ మావయ్య పాట అందుకున్నాడు.

“ఈ రుచా రుచాలు, లుచా లుచాలూ ఏఁవిటండీ” అంటూ అమ్మ నాన్న కంచంలో మరో గరిటెడు చారు పోయబోయింది. నాన్న ‘లుచా లుచా” అంటూ కంచానికి చెయ్యి అడ్డం పెట్టేడు. ‘చాలా?’ అని అడుగుతున్న అమ్మకి ఠక్కని బుద్ధి జిగేల్మంది.

“ఓహో! చాలు చాలు అనా? తిరగేసి మాటాడుతున్నారా? రుచా రుచా, ఓహో చారు చారు! పిల్లలతో సమంగా మీరిద్దరూ కూడా ఏఁవిటీ తిరగేసి మాటల ఆటా?” అమ్మా అత్తయ్యా బామ్మా నవ్వుతూ “రిస! రిస! రిస!’ అన్నారు.

పెరుగూ అన్నం లోకి వొచ్చేం. మావిడిపళ్ళు వేస్తోంది బామ్మ.

“రోమ రోమ డుంప డుంప! రోమ రోమ డుంప డుంప” అన్నాడు మావయ్య. గంధోళీగాడు తప్ప అందరం ‘రోమ రోమ డుంప డుంప, డుంప రోమ డుంప రోమ డుంప రోమ’ పాడి రెండేసి పళ్ళు తిన్నాం! గంధోళీగాడికీ రెండు పళ్ళు వేసింది బామ్మ.

మర్నాడు పొద్దున్న – ‘లుయగారకూజాతా’ అన్నాది అమ్మ, నాన్న వీధిలోకి బయల్దేరుతూ ఉంటే! ‘రేస, రేస!’ అంటూ నవ్వుకుంటూ నాన్నా, నాన్నతోపాటూ మావయ్యా బయల్దేరేరు సంచీలు పట్టుకుని.

ఆ వారం వారం అంతా తిరగేసిన మాటల ఆటతో గడిచింది. గంధోళీగాడు జీడిరాత పోయి గోడ తెల్లగా అయ్యేంతవరకూ రెండు మూడు పూతలు వెల్ల వేసేడు! వాడు మాత్రం ఎవరం ఎంత అడిగినా మా అందరి ఆటలో చేరలేదు వెర్రి వెధవాయి!

ఈ ఏడాది చుట్టాలెవరూ రాలేదు. ఎండల్లో ఏ చుట్టాలింటికీ, ఏ ఊళ్ళకీ వెళ్ళలేం. ఆవకాయ యజ్ఞం ఉంది అంటుంది బామ్మ. చుట్టాలే మా ఊరు రావాలి, మా ఇంటికి రావాలి.

ఒక్కదాన్నీ ఒంటిపిల్లి రాకాసిలా సావిట్లో కూచుంటున్నాను. ఎంత సేపని బొమ్మలు గియ్యనూ! ఎంతకని బొమ్మల పుస్తకాలు చదవనూ! సాయంత్రం పూటైనా గోడ గుర్రం మీద కూచోడానికి లేదు. గోడ కాలిపోతూ ఉంటుంది. కూచుంటే చురుక్కుమంటుంది! చల్లబడేసరికే చీకటి పడిపోతుంది.

‘ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి’ అంటుంది బామ్మ. ‘ప్రతీ ఏడాదీ అదేమాట! పోయిన ఏడాదుల ఎండలు పరగడుపు అయిపోతాయి. ఈసారి మరీ ఎక్కువ మండిపోతోంది అనిపిస్తుంది’ అంది అమ్మ. చుట్టాలొస్తే సందడి సందడిగా ఉంటుంది. ఎండా కొండా గాడ్పూ గీడ్పూ తెలీనే తెలీదు.

ఎవరన్నా వొస్తే బావుణ్ణు!

కొత్తది ఏదన్నా చూడాలి. ఏదైనా కొత్తమాట వినాలి. చెట్టూచేమనీ, మబ్బుల్నీ ఆకాశాన్నీ కొండల్నీ, వాటి మజ్జినుంచి లేచి వచ్చే ఎర్రటి సూరీణ్ణీ, చుక్కల్నీ చందమామనీ చూడాలి. అప్పుడు గాని బుర్ర విచ్చుకోదు. నా బుర్రేనా? అందరి బుర్రలూ అంతేనా? కొందరి బుర్రలు చీకటి కొట్లో కూచున్నా పువ్వులా విడతాయి కాబోలు! నా బుర్ర మట్టి కొట్టుకుపోతోంది కాబోలు!

వీత్తలుపు ఎవరో బాదేస్తున్నారు! ఎవరబ్బా ఇప్పుడొచ్చేరూ!

అక్కప్పా, కూతురు అలివేలూ! బస్సులో పడి వొచ్చేరేమో ఎండకి మొహాలు గాదరించిపోయి ఉన్నాయి.

అమ్మా, బామ్మా బోల్డు సంతోషపడిపోయారు. “రామ్మా అక్కప్పా! ఎండబడి వొచ్చేరు. ఎప్పుడు బయల్దేరేరో! ఎండాకాలంలో రాత్రి బస్సులు నయవమ్మా! తెల్లారుతోనే దిగిపోతాం కాబట్టి ఎండపడం!” అంటూ లోపలికి తీసికెళ్ళేరు.

అలివేలు నాకంటే కొంచెం పెద్దది. అది వొచ్చిందన్న సంబరం తీరన్నా తీరలేదు. వాళ్ళు లెక్కగా నాలుగంటే నాలుగు రోజులున్నారు. “అడంగుకు వెళ్తే మళ్ళీ ఇటువొచ్చి చూడ్డం పడదని వొచ్చేం” అన్నాది అక్కప్ప. ఉన్న నాల్రోజులూ అలివేలూ నేనూ ఓ ఆటే ఆడేమా! ఓ పాటే పాడేమా! ఆకాశాన్ని అందుకున్నంతగా సరదా. ఒకటే సరదాతో గెంతేం.

ఇవాళ కాస్త మబ్బు వేసింది. నా గోడగుర్రం నన్ను పిలిచినట్టయింది. గుల్ ముఖుఠాని పెద్ద కప్పుగిన్నెలో చెమ్చాతో సహా పెట్టించుకుని గుర్రం ఎక్కి కూచున్నా.

అలివేలు ఉన్న నాల్రోజులూ మజ్జాన్నం మూడూ అవగానే గుల్ ముఖుఠా తిందాం పద అనేది.

“గుల్ ముఖుఠా ఏఁవిటీ?”

“తింటే తెలుస్తుంది” అంది.

మొదటిరోజు అమ్మని పెద్దకంచంలో తరవాణీ కుండలోంచి తరవాణీ లేకుండా అన్నాన్ని పెట్టమంది.

కందిగుండ ఉందా?
చింతకాయ పచ్చడి ఉందా?
గోంగూర పచ్చడి ఉందా?
తరిగిన ఉల్లిపాయ చెక్కు, ఎర్రెర్రని కొత్తావకాయ, నువ్వుల నూనె ఇవన్నీ ఇంట్లో ఉన్నవే.

అది అడిగినవన్నీ అమ్మ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటే అలివేలు ఆ అన్నాన్ని అన్నిటితో కలిపేసింది. ఎర్రెర్రగా, పచ్చపచ్చగా, తెల్లతెల్లగా, తడితడిగా, జిడ్డుజిడ్డుగా అన్నీ కలగలసిన ముద్ద కాని అన్నం!

“ఇదీ గుల్ ముఖుఠా! ఓసారి తిన్నారంటే మరి వొదిలిపెట్టరు. ఇది తినకపోతే ఎండాకాలం వెళ్ళమన్నా వెళ్ళదు” అన్నాది.

దాని మాటలకు అమ్మ నవ్వింది. “నోరు మండదూ?”

“ఊహూఁ, కమ్మకమ్మగా గమ్మత్తు గమ్మత్తుగా ఉంటుంది” అంది.

అది వెళ్ళిపోయినా ఎండాకాలం వెళ్ళిపోలేదుగా! రోజూ మజ్జాన్నం మూడుగంటలకి గుల్ ముఖుఠా తింటున్నా.

‘గుల్ ముఖుఠా అంటే అర్థం ఏఁవిటి అలివేలూ?’ అని అడిగితే – ‘దాని పేరు అది, అంతే’ అంది.

మసాబు మసాబుగా ఉన్న ఆకాశాన్ని చూస్తూ గుర్రం మీద కూచుని గుల్ ముఖుఠా నోట్లో పెట్టుకుని ఆలోచనలో పడ్డా.

అర్థం పర్థం లేని మాటలుంటాయా?

ఏదో మాటలా మరోమాట పుడుతుంది. మాటలోంచే మాట పుడుతుంది. కొత్తమాటలు పుట్టించొచ్చు కదా, బెల్కోరాలా! ఇదీ అలాగే పుట్టి ఉంటుంది. ఎవరో నాలాంటి అమ్మాయి ఈ మాటని కనిపెట్టి ఉంటుంది. ఏఁవిటై ఉంటుందీ ఆ మాట?

గుల్ అంటే? ముఖుఠా అంటే?

ఆఁ! ఆహాఁ! బామ్మ తాంబూలంలో గుల్‌కంద్ పిసరంత పెడుతుందిగా! గులాబీ పువ్వుల రెక్కలతో చేసిన తియ్యముద్ద. తేనె కూడా వేస్తారట అందులో. తిన్నానుగా నేనూను!

ఓహో, అయితే గుల్‌కంద్ లాంటిదన్న మాట గుల్ ముఖుఠా. కానీ ఇది తియ్యగా ఉండదే. కొత్తావకాయ ఘాటుతో ఎర్రెర్రగా ఉంటుంది. ఎర్రగా ఏఁవి ఉంటాయీ?

గులాబీలు కావు, గన్నేరు పువ్వులు కావు. మరి? వొచ్చింది వొచ్చింది భలే జ్ఞాపకం. కోడిపుంజు పువ్వు! నాగమణీ నేనూ ఆ ఎర్రపువ్వుల్తో కోడిపందేల ఆట ఢీ ఢీ అని ఆడేవాళ్ళంగా! అవి తురాయి పువ్వులని చెప్పేడు నాన్న. ఊహూఁ, అయితే ఆ ఎర్రపువ్వులూ కావు. గుల్‌తో ఇంకే మాట ఉందబ్బా? ఏదో నోట్లో నోట్లో ఆడుతోంది. గుర్తు రాటం లేదు. గుల్, గుల్…?

చేతిలోని కప్పుగిన్నెని మెట్టు మీద పెట్టేసి నుదుటి మీద కొట్టుకున్నా. ఏఁవిటబ్బా ఆమాట? నాకు తెలిసిన మాటే!

బుర్రా! బుర్రా! బట్వాడా చెయ్యవే. కావాలన్నప్పుడు బుర్ర లోంచి బయటికి రాకపోతే ఎలా? ఏం బుర్ర ఇదీ!

నాగమణి దీని పేరే విని ఉండదు. చేసుకునో చేయించుకునో తినమనాలి. ఎలా ఉందో ఆ మొద్దు! అన్నట్టు ఎండాకాలంలోనే కదూ దాని పుట్టినరోజూ! ఉత్తరం రాయాలి. మరిచే పోయా! రంగురంగుల పువ్వుల బొమ్మ వేసి పంపితే సరి. ఇక్కడ ఉన్నప్పుడు పువ్వులదండ పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని. ‘దండ కాదూ, పుట్టినరోజుకి గుల్‌దస్తా ఇవ్వాలీ’ అన్నాడు నాన్న.

అరే, జ్ఞాపకం వొచ్చేసిందే మాట! బొకే అంటారట గుల్‌దస్తాని ఇంగ్లీషులో. రంగురంగుల పువ్వుల్ని కాడలతో, ఆకులు కాడలూ కూడా పెట్టి కట్టాలి.

ఒకదానితో ఒకటి గొలుసులతో అల్లుకుపోతూ జ్ఞాపకాల కట్ట బుర్రలో ఎక్కడో దాక్కుని ఉంటుంది. ఓ గొలుసు పట్టుకులాగితే మిగతావి ఆ గొలుసుతో పాటు బయటికి వొచ్చేస్తాయి. ఊహలూ అంతే! ఊహల తకిలీని తిప్పుతూ ఓ ఊహ ఏకును అందిస్తే ఊహలదారం పొడూగ్గా అయి ఎంత దూరమో సాగుతూ పోతూనే ఉంటుంది.

నాకు రాట్నంతో దారాలు తియ్యడం రాదు. తకిలీతో తియ్యడమే తేలిక. బామ్మ దీపం ఒత్తులకి పత్తిని విభూతి రాసుకున్న వేళ్ళతో నులుపుతూ దారం పోగులు తీస్తుంది. తకిలీతో తీసిన దారాలు దీపం ఒత్తులకి పనికిరావుట! పత్తితోనే కదా ఏకు కూడా అవుతుందీ, ఏఁవిటో బామ్మా, బామ్మ దేవుడి రూల్సూనూ!

ఈసారి నేను తీసిన దారంతో ఓ చేతిరుమాలు నేయించుకోవాలి. ముఖానికి పట్టిన చెమట తుడుచుకోడానికి.

అయ్యయ్యో. నూలుదారాలు వడకడం దగ్గరికి బుద్ధి వెళ్ళిపోయింది! గుల్ ముఖుఠాని వొదిలేసి, గుల్‌దస్తాని వొదిలేసీ!

రంగురంగుల పువ్వుల్ని గుది గుచ్చి కట్టినట్టు తరవాణీ అన్నంలో రంగురంగుల పచ్చళ్ళు, ముదురు ఎరుపురంగు నిప్పులాంటి ఎర్రని ఘాటైన ఆవకాయ, అందులోనూ కొత్తావకాయను కలిపి చేస్తారు కాబట్టీ గుల్‌దస్తాలా గుల్ ముఖుఠా అయిందన్న మాట!

ఆలోచనల కలగలుపు – నోరూరించే ‘లొఠల’ ముఠా గుల్ ముఖుఠా.

అలివేలుకీ ఉత్తరం రాయాలి గుల్ ముఖుఠా అర్థం కనిపెట్టేనని!