సాయంత్రాలు నా గోడగుర్రం మీద కూచోడం మానేసే.
ఓరోజు మనోరమ మా ఇంటికొచ్చి “నేన్రోజూ పార్కుకు వెళ్తున్నా. నువ్వూ వస్తావా?” అని అడిగింది. దాంతో మనోరమతో కలిసి పార్కుకి వెళ్ళడం మెదలెట్టా, అమ్మ ఇచ్చే చిరుతిండిని జేబుల్నిండా వేసుకుని.
మనోరమ నాకన్నా బాగా పెద్దమ్మాయి. దానికి చాలా విషయాలు తెలుసు. అది మగపిల్లల బళ్ళో చదూతూంది. నే నాల్గోక్లాసు చదూతూన్నప్పుడు నాన్న తనతోపాటు నన్నూ కానుకుర్తివారి సత్రంకి తీసుకెళ్ళేడు. అదిగో – ఆవేళ అక్కడ మొట్టమొదటి సారి మనోరమని చూశా. మాటాడే. నాటకం చూడ్డానికే కాదు, డబ్బులు దండడానికీ వచ్చేనని చెప్పింది. మూతకి కన్నం ఉన్న ఓ డబ్బాని నాకూ ఇచ్చింది. తనలాగానే ఇంకా కొందరు అమ్మాయిలూ అబ్బాయిలూ డబ్బాలు పట్టుకుని ఉన్నారు. నాటకాన్ని చూడ్డానికి ఒక్కొక్కరూ వస్తున్నారు. కుర్చీల్లో కూచుంటున్నారు. స్టేజికి ముందు తెరవేసి ఉంది.
వంగ దేశము నా
కరువు పుట్టెనో బాబా!
అని మనోరమా పిల్లలూ పాడుతూ ఉంటే నేనూ ఆపాటని అందుకుని ఆ మొదటి ముక్కలు అండం, నెమ్మదిగా వాళ్ళతో గొంతు కలిపి పాడుతూ డబ్బాని గలగల్లాడిస్తూ డబ్బులు వెయ్యమని కుర్చీల మధ్య తిరుగుతూ అడగడం మొదలెట్టే.
ఆ డబ్బాలకి గుండ్రటి కన్నం లేదు. రూపాయి నోట్లు వెయ్యడానికి వీలుగా కాస్త సన్నగా గాడీ ఉంది. కొందరు చిల్లర డబ్బులు వేస్తే కొందరు పెద్దనోట్లు వేస్తున్నారు.
మేఁవు కుర్చీల మధ్య వరసల్లో తిరుగుతూ డబ్బాని ఆడిస్తూ పాడుతూ ఉన్నాం. ఇంతలో ఓ పెద్దాయన మనోరమ దగ్గరికి వచ్చి “నువ్వూ నీ వెనకాతలే తిరుగుతున్న ఈ చిన్నపిల్లా – మీ ఇద్దరూ నాతో రండి” అన్నాడు. ఆయన మనోరమా వాళ్ళా మావయ్యట. మా డబ్బాలని పక్క పిల్లలకి ఇచ్చేసి ఆయన వెంట వెళ్ళేం. మమ్మల్నిద్దర్నీ ఆయన స్టేజి పక్కనుండి స్టేజి మీదకు తీసుకువెళ్ళేడు.
“మీ ఇద్దరూ నాటకం ఆడుతున్నంత సేపూ, అంటే తెర ఎత్తి మళ్ళీ తెర పడేవరకూ ఇదిగో – ఈ వెనకవేపు గోడలా వేసిన తెరవేపు మొహాలు పెట్టుకు పడుకోవాలి. వీపులు మాత్రం చూసేవాళ్ళకి కనబడాలి. మీరిద్దరూ ఈ ఇంటివాళ్ళ పిల్లలన్నమాట. అర్థం అయిందా?” అంటూ బోధపరిచాడు. ‘నువ్వు గౌను విప్పేసి లాగుతో పడుకోవా’లని నాకు చెప్పి, మనోరమకు ఓ చింకి పరికిణీ, మాసికల జాకెట్టూ వేసుకోమని ఇచ్చేడు. మా జుట్టుని చింపిరిజుట్టుగా చెరిపేసేడు. “మీరు వెళ్ళేప్పుడు మీ బట్టలు వేసుకు వెళ్దురుగాని” అని అన్నాడు. మమ్మల్ని ఆ తెరవేపు పడుకోబెట్టి “వీళ్ళ వీపుల మీద లైటు పడేటట్టు లైటు తిప్పుతూ ఉండాలి” అని లైట్లవాడికీ చెప్పేడు.
అప్పుడు తెలిసింది నాకు. వంగదేశంలో పెద్ద కరువు వచ్చిందని, అందరూ తిండి లేక చచ్చిపోతున్నారని, పిల్లలు ఆకలితో అల్లల్లాడి మలమల మాడిపోతున్నారనీ. వాళ్ళకి సాయం చెయ్యడానికి ఆ కరువు మీద నాటకం వేస్తున్నారనీనూ. కొంత మనోరమ చెప్పింది. ఆ మర్నాడు నాన్న మేపు చూపెట్టి చెప్పేడు – ఇదిగో ఇదీ వంగదేశం. బెంగాలు అని కూడా అంటారు. అక్కడివాళ్ళు బెంగాలీ భాష మాటాడతారనీనూ.
నేను కడుపులో రెండు మోకాళ్ళు పెట్టుకుని మునగదీసుకుని ఆకలితో బాధ పడుతున్నట్టు పడుకున్నాను.
“నువ్వు అంబళ్ళ సత్రం వేపునుంచి వచ్చేయి. నేను రాజారావు మేడ వేపునుంచి వొస్తా. ఇద్దరం అక్కణ్ణించి కలిసి పార్కుకి వెళ్దాం” అంది మనోరమ.
అది మొదలు – తను అట్నుంచీ నేను ఇట్నుంచీ జంక్షను దగ్గర కలుసుకుని ఇద్దరం కలిసి పార్కుకి వెళ్ళడం.
లేడీస్ పార్కు నాకు ఎంత నచ్చిందో! గేటు కెదురుగుండా నీళ్ళు విరజిమ్ముతూ ఫౌంటెను, నీళ్ళు వొంపుతూ నిల్చున్న అమ్మాయి బొమ్మా – అంటే ప్రకాశం పార్కే – కాని రెండు భాగాలుగా ఉంది. అటు పూర్ణాటాకీసు గోడ వేపునుండి ఇటు కృష్ణాటాకీసు వరకూ లేడీస్ పార్కు, పెద్ద గేటుతో.
రెండోవేపు మొగవాళ్ళ పార్కు. రెండింటి మధ్యా చిన్న గది. దాని మీద అటొకటీ ఇటొకటీ హార్న్ స్పీకర్ల బాకాలూ – మగవాళ్ళ పార్కుకీ ఆడవాళ్ళ పార్కుకీ మధ్య గోడకి అటు సగం ఇటు సగంగా కట్ట్టిన చిన్న గది! లేడీస్ పార్కు సంరక్షణంతా తమ్మినాయుడిగారిదే. ఆయన పార్కు తమ సొంతం అన్న విధంగా నియమాల్ని, తన నమ్మకాలనీ గొప్పగా పాటిస్తూ పార్కుని కంటికి రెప్పలా చూస్తున్నారు.
ఎంత పెద్దవాళ్ళొచ్చినా ఏ మొక్క మీదా ఏ పువ్వు మీదా చెయ్యి వెయ్యనివ్వరు. మునిసిపల్ ఛైర్మన్ వచ్చినా అదే చెప్తారట! ‘ఏ పువ్వు కొయ్యాలో ఏ పువ్వు కొయ్యకూడదో మీకు తెలీదు. నన్ను అడిగి తీసుకోండి. అంతేగాని మీరు తెంపుకోకూడదు’ అని ఖరాఖండీగా చెప్పేస్తారట!
పూర్ణాటాకీసు గోడకి ఆనుకుని పంచముఖీ మందారమొక్కలు దడి కట్టినట్టు ఉన్నాయి. ఎర్రవీ పచ్చవీ గులాబీవి. కోడిజుత్తు ఎర్రగా వరసగా, దగ్గరగా. రంగురంగుల క్రోటన్సు మొక్కలు లైన్లు లైన్లుగా. ఇంకా ఏవేవో రంగురంగుల పువ్వుల మొక్కలు. ఎక్కడా చెత్తా చెదారం లేనే లేదు. మొక్కల కింద ఎండి రాలిపోయిన ఆకులైనా ఉండకండా – అంత శుభ్రంగా అందంగా పార్కుని తమ్మినాయుడుగారు ఉంచుతున్నారు.
మొదటిరోజు నాకు తెలీక జేబులో వేసుకొచ్చిన వేయించిన వేరుసెనగ పలుకులు పట్టుకొచ్చిన కాయితాన్ని కింద పడేసే. పలుకుల మీద తొక్కని నలిపి కింద పడేస్తూ తిండం మొదలెట్టే. మనోరమకి నేనిచ్చిన పలుకుల్ని అరచేత్తో ఇంకా పట్టుకునే ఉంది. “అలా కింద పడేయకూడదే” అంటూనే అటువేపు చూసి గాభరా పడిపోతూ “తీసెయ్యి, తీసెయ్యి. కాయితంలో వేసేసి జేబులో గబాల్న పెట్టేసుకో. నాయుడుగారు ఇటువేపే వస్తున్నారు” అంది.
దాంతో కంగారు పడిపోతూ గబుక్కున కింద పడిన పలుకుల తొక్కుల పొట్టుని చేత్తో దగ్గరగా తీసి కాగితంలోకి ఎత్తేసి జేబులో కుక్కేసుకున్నా.
“మనోరమా! కొత్త స్నేహితురాలా ఈ పిల్ల?” అంటూ పలకరించారు నాయుడుగారు.
“అవునండీ” అంటూ దణ్ణం పెట్టింది మనోరమ. దాన్ని చూసి నేనూ దణ్ణం పెట్టే. ఆయన మరోవేపు వెళ్ళిపోయారు.
“పార్కంతా తిరిగి చూస్తానే” అంటే “సరే, ఓ చుట్టు చుట్టిరా. నేనిక్కడే కూచుంటా” అంది మనోరమ.
పంచముఖీ మందార పువ్వులు చూసేసరికి బామ్మ దేవుడి పూజకి రంగురంగుల మందార పువ్వులు బాగున్నాయని ఓ గులాబీ రంగు మొగ్గ కోసేనో లేదో – తమ్మినాయుడుగారు నా చెయ్యి పట్టుకున్నారు. ఆయన్ని నే చూడే లేదు! ఎప్పుడొచ్చేరో!
“ఇలా అడక్కండా లొడక్కండా కొయ్యొచ్చా?” అని గదమాయించేసరికి బిక్కమొహం వేసే. ” మా బామ్మ పూజకి.” బుర్రొంచుకుని చెప్పే.
“నువ్వివాళే పార్కు కొచ్చేవ్. నన్నడగకండా నీ మానాన నువ్వు కొయ్యకూడదు. నే కోసి ఇస్తే తీసుకోవాలి. తెలిసిందా? కావలిస్తే కొమ్మలు ఇస్తా. మీ పెరట్లో పాతుకోమని మీ బామ్మకి చెప్పు” అన్నారు. నే కోసిన ఆ మొగ్గొకటీ నాకు ఇచ్చేరు!
నే మనోరమ దగ్గరికి వెళ్ళేసరికి బాకాలో మాటలు వినబడేసరికి బుర్రెత్తి బాకా వైపు చూశా.
“దా. కూచో. వార్తలు మొదలవుతున్నాయి” అంది మనోరమ. చిన్నగదిలో రేడియో ఉంది. ఆ రేడియో వార్తలు విండానికే మనోరమ రోజూ పార్కుకి వస్తోందట.
ఆ మర్నాడు మగవాళ్ళ పార్కుకీ “చూద్దువుగాని పద” అని ఆవేపుకి, అవతలవేపు ఆ పార్కుకి ఉన్న గేటు లోంచి తీసుకువెళ్ళింది.
మగవాళ్ళ పార్కు ఆకుపచ్చటి గడ్డి తివాసీతో నిండి పాదాలకు మెత్తగా తగులుతూ కితకితలు పెట్టింది. ఆ గడ్డి మీద బోర్లా పడుకుని, రెండు మోచేతులూ ఎత్తి అరచేతులు బుగ్గల మీద అటూ ఇటూ పెట్టుకుని కొందరు, కూచుని కొందరు, బాకాలోంచి వచ్చే రేడియో వార్తలు వింటూనూ – గుంపులు గుంపులుగా కూచుని కొందరు, మరికొందరు ఒక్కొక్కరే ఓ వార కూచుని శ్రద్ధగా వింటూ, కాగితాల మీద రాసుకుంటూనూ – అక్కడక్కడున్న సిమెంటు బల్లల మీద కొందరు కూచునీ వింటున్నారు!
పార్కుకి కొందరు అమ్మాయిలు కాస్సేపు ఆడుకోడానికి, తిరగడానికీ వచ్చేవారు. అందరూ వార్తలు వినేవరకూ ఉండేవారు కాదు. ఒకమ్మాయి మాత్రం – మనోరమ అంత పెద్దదీ కాదు, నా ఈడుదీ కాదు – పేరు ఇందిర. వాళ్ళింట్లో అందరికీ జవహర్లాల్ నెహ్రూగారి అమ్మాయి ఇందిరా ప్రియదర్శిని అంటే ఇష్టం అంతా ఇంతా కాదట. అందుకని తనకి ఇందిరని పేరు పెట్టేరట. – ఆ రెండుజళ్ళ ఇందిర కూడా – మాతోపాటు వార్తలని విని మరీ ఇంటికి లేడీస్ సైకిల్ మీద వచ్చి వెళ్ళేది. ఆ అమ్మాయి సైకిలు చూడగానే నాకూ సైకిలు తొక్కడం నేర్చుకోవాలన్న ఉబలాటం పెరిగిపోయింది. మనోరమకీ సైకిలు తొక్కడం రాదట.
“ఇందిరా! ఇందిరా! నువ్వింకాస్త ముందరొచ్చి మాకు సైకిల్ నేర్పవా?” అని అడిగేం.
“అలాగే! సైకిలు తొక్కడం బ్రహ్మవిద్యేం కాదు. ఇట్టే వచ్చేస్తుంది మీ ఇద్దరికీనూ” అన్నాది.
ఆ మర్నాడే ఇద్దరమూ తయారయ్యేం. ముందు మనోరమని ఎక్కించింది. నాకన్నా పొడుగు కదా! దాని కాళ్ళు నేలకి తగుల్తాయి. సైకిలు ఓ పక్కకి ఒరిగిపోతూ ఉంటే కాలు కిందకి పెట్టేసి పడిపోకుండా ఆపేస్తే వెనకాతలే ఉన్న ఇందిర గభాల్న వెళ్ళి పట్టుకునేది. అలా రెండు మూడు సార్లు రోడ్డు మీద అటూ ఇటూ దాని చేత నడిపించీ తొక్కించాక నా వొంతు వచ్చింది.
నాకు పెడల్సు అందేయి కాని కాళ్ళు నేలకి తగిలేటట్టు లేవు. అందుకని ఇందిర ఈ పక్కనుంచి ఆ పక్కకి, ఆ పక్కనుంచి ఈ పక్కకి సైకిలు పట్టుకు మరీ తొక్కించింది. రెండోసారి వెనకాతలే పక్క పక్క చూస్తూ “తొక్కే” అంది. తొక్కేనో లేదో సైకిలూ నేనూ కొంద పడిపోయాం. రెండు మోకాళ్ళూ ముణుకులూ చెక్కుకుపోయి నెత్తురొచ్చింది. మనోరమ నా చెయ్యి పట్టుకుని నెమ్మదిగా నడిపిస్తూ పార్కులో ఫౌంటెను దగ్గర నీళ్ళతో కడిగింది.
తమ్మినాయుడుగారు “ఏమైంది? ఏమైంది?” అంటూ వచ్చేరు. చెక్కుకు పోయి నెత్తురు చిమ్ముతున్న నా మోకాళ్ళు ముణుకుల్ని చూసి రేడియో గదిలోంచి అయోడినూ, దూదీ పట్టుకొచ్చేరు. మోకాలుల మీద అయోడిను దూదితో రాసేసరికి భగభగ మండే. “అమ్మో అమ్మో” అంటే “తగ్గిపోతుందిలే అమ్మా! రోడ్డు మీద పడ్డావా? మరి రాసుకోకపోతే ఎలా?” అన్నారు. “వార్తలు విన్నాక ఇంకాస్త సేపు కూచుని వెళ్ళండి. అప్పటికి నొప్పి అంతుండదు” అనీ అన్నారు.
మనోరమ నన్ను ఇంటికి తీసుకెళ్ళింది. దానివెంట కుంటుకుంటూ కుంటుకుంటూ ఇంటికెళ్ళేసరికి నాన్న ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేపోతే అమ్మా బామ్మా కంగారు పడిపోయేవారు ఇంతోటి ఈ చిన్నదెబ్బకీనూ!
“ఏం లేదండీ. సైకిలు తొక్కడం నేర్చుకుంటున్నాం. చిన్న దెబ్బ తగిలింది.” మనోరమ చెప్పింది.
“నాకు నా ఎత్తుకు సరిపోయే లేడిస్ సైకిలు కొనిపెట్టు నాన్నా” అన్నా.
“సరే, అలాగే కొనుక్కుందువు గాని. ఎవరు నేర్పుతున్నారు? లేడీస్ సైకిలేనా?” అడిగేడు నాన్న.
“పార్కుకి ఇందిరని ఓ కొత్త స్నేహితురాలు తనూ వార్తలు విండానికి సైకిలు మీద వస్తుంది. లేడీస్ సైకిలే!”
“అలాగా! మంచిదే, సైకిలు తొక్కడం నేర్చుకోడం” అన్నాడు నాన్న.
అప్పటివరకూ నాకు తెలీని విషయాలు మనోరమ చాలా చెపుతూ వుంటే పార్కులో వార్తలు వినడం అలవాటయింది. ఇందిరా ఎన్నో దానికి తెలిసినవి చెపుతూ ఉండేది.
వీరజోయా కథను
విన్నారమ్మ మీరూ
వీరపుత్రికలారా ఓ బాలలారా
రష్యాదేశమమ్మ వీర జోయాది
ఫాసిస్టు… పాటని మనోరమ నేర్పింది.
1759లో ప్లాసీ యుద్ధం – ఈస్టిండియా కంపెనీ – బ్రిటీష్ రాజ్ – సిపాయిల తిరుగుబాటు – మొదటి ప్రపంచ యుద్ధం – జలియన్ వాలాబాగ్ – భగత్‌సింగ్ – ఇలా దేశంలో జరిగిన జరుగుతున్నవన్నీ కథల్లా మనోరమ చెపుతూ ఉంటే చెవులు అప్పగించి వింటూ ఇవీ అసలు కథలు, నిజం కథలు అనుకున్నా.
మనదేశం గురించీ ప్రపంచదేశాల గురించీ ఎన్నెన్ని నిజం కథలు – జరిగిన కథలు, జరుగుతున్నవీనూ. ఆలోచనలూ ఊహలూ బుర్రనిండా కళపెళా మరుగుతుంటే నాలో నేను సతమతమవుతున్నా.
ఎప్పుడూ ఆలోచనల్లో మునిగితేలుతూ నవ్వుతూ గెంతుతూ మాటాడ్డం మానేసే!
ఊహలు వేరు. ఆలోచనలు వేరు. ఊహలు నిజాలుగామారి అసలు సిసలు నిజం కథలు కావాలి!
“వటవటా వాగి అందరికీ మాటకి మాట అని ఏదో ఒకటి అడిగేదా – ఇప్పుడు చదువూ లేదా గబగబా అన్నం తినేసి నిద్ర పోతోంది! తెల్లారు ఝామునే మాతో లేచిపోయి చదూకుంటోంది!” అంటోంది అమ్మ.
“పెద్దరికం వస్తోంది” అంటోంది బామ్మ.
అవును. నాకూ తెలుస్తోంది. నేను ఆలోచనల్లో ఊహల్లో పెద్దదాన్ని అవుతున్నా.