ముసురు పట్టింది.
“ఓరోజు బడికి వెళ్ళకపోతే కొంపలేం అంటుకుపోవు. నాన్న కూడా ఊళ్ళో లేడు, నిన్ను బడి నుంచి ఇంటికి తీసుకురావడానికి. నీకు జలుబు చేస్తే ఓ పట్టాన వొదిలి చావదు. ఆ తుప్పజుట్టుతో తడిసి ముద్దై వస్తావు. తుడిచి ఆరబెట్టడానికి మా తాతలు దిగొస్తారు.”
బామ్మ ఓ దండకం చదివి బళ్ళోకి వెళ్ళనియ్యలేదు.
జుట్టుకి సాంబ్రాణి పొగ, మిరియాల కషాయం బెల్లం వేసి వేడివేడిగా తాగించడం – వేడి అన్నం మీద మిరియాల గుండా ఉప్పూ వేసి వేడి నెయ్యి పోసి అది బుసబుసా పొంగేక ఆ ముద్దని మొదట తినిపించడం – రాత్రి మళ్ళీ వేడిపాలలో మిరియాల గుండ వేసి పడుకోబోయే ముందు తాగించడం!
ఓరి నాయనోయి! వానలో తడిసి వచ్చేనంటే అమ్మా బామ్మా ఇద్దరూ నానా తంటాలూ పడి నన్ను తంటాలు పెడతారు.
నిజఁవే! వానలో తడిసేనంటే హాఁచ్చి, హాఁచ్చి, హాఁచ్చిఁచ్చి అని వరస తుమ్ములు – ఆగడం అంటూ ఉండదు! ముక్కు ఒకటే కారడం – కట్టే కట్టదు! ఇటు జలుబూ తుమ్ములూ ముక్కు కారడంతో పాటు వాళ్ళ తంటాలు! ఓరి నాయనోయి – నా తల ప్రాణం తోక్కొస్తుంది.
అందుకే మారుమాటాడకండా బడికి సెలవిచ్చేయాలి దేవుడా! సెలవిచ్చేయాలి, సెలవిచ్చేయాలి, ముసురని సెలవిచ్చేయాలి దేవుడా! అని లోపల ఒకటికి పదిసార్లు అనుకుంటూ బుద్ధిగా ఇంటిపట్టునే ఉండిపోయా. బడి గాని ఉండి కొత్త పాఠాలు చెప్పేస్తే ఎలాగా అని ఒకటే బాధ. మనసులో రంధి – నాన్నను అడగచ్చనుకో – బళ్ళో అందరితో కలిసి పాఠాలు విండం వేరు. ఇంటిదగ్గర నాన్నతో చెప్పించుకోవడం వేరు.
“ఈ ముసురు కాదు గాని ముజ్జిడ్డుగా ఉంది. ఓ పనీ తోచదు. పాటా తోచదు. సమయానికి ఆయన కూడా ఊరు వెళ్ళేరు. పాలు ఎలాగ అత్తయ్యా” అంటూ అమ్మ విసవిసలాడింది.
“అదేనే నేనూ గొడవ పడుతున్నాదీ. ఎవరిని పిలిస్తే ఎవరొచ్చి తీసిపెడతారూ? పాలు పితకడం రావొద్దూ? వాడు ఉంటే ఏదో ఒకటి చేసేవాడు…” బామ్మ అంటూనే ఉంది, సన్నేసి తాటాకు గొడుగేసుకుని వాడి పొడుగు కర్రని చంకలో పెట్టుకుని ముసురైనా పాలు పితకడానికి వచ్చేడు!
బామ్మ మొహం చేటంతయింది.
“వచ్చేవురా సన్నేసీ! పాలు ఎలాగా అని ఒహటే మజ్జిగుజ్జాలు పడుతున్నాం. బాబు ఊరికెళ్ళేడు – ఎవర్నయినా పిలవడానికైనా ఎవరూ లేదు!” అంది బామ్మ.
సన్నేసి పాలు తీసి, ఆవుకు కుడితి పెట్టి, దూడను కట్టేసి, పేడా గట్రా తీసి శుభ్రం చేసేడు.
“మీ అమ్మ కడుపు చల్లగా వెయ్యేళ్ళు వర్ధిల్లు! నా తండ్రే. నా తండ్రే. ఉండు వెళ్ళిపోకు. ఆవకాయ ఇంత పట్టుకెళ్ళు. అంబలిలో నంచుకుందువు గాని. సీసాలో పెట్టి ఇస్తా” అన్నాది.
“ఈ ముసురు మాకో నెక్కా అమ్మగోరూ! సాయింతరం బాబుగోరు వొచ్చీసినా ఎవురినీ పిలిసి పాలు పితికించుకోకండి. నాను ఒస్తాను” అన్నాడు సన్నేసి.
నిన్ననూ మసాబుగానే ఉంది. అయితే చినుకులు పడటంలేదు. తేట పడేటట్టు ఉందనుకుంది బామ్మ. బళ్ళోకి వెళతానంటే వద్దనలేదు!
సాయింత్రం అమ్మ ఇచ్చిన పేలపుండ తింటూ గోడగుర్రం ఎక్కే, మబ్బు ముసుగేసుకున్న ఆకాశాన్ని చూస్తూ.
“సూరీడూ రేపు వచ్చేస్తే బావుణ్ణు! తెరిపి ఇచ్చింది” అంది బామ్మ.
“ఏవిఁటో! మనం వద్దనుకుంటే ముసురు పోతుందా! సూరీడును రమ్మంటే వస్తాడా! మన ఇష్టాయిష్టాలతో పనేమిటి. వాటి ప్రకారం మనం నడవాల్సిందే” అనీ చెప్పింది.
గేటంతా బురదా, చిత్తడీ.
ఆకాశమంతా బూడిద రంగు.
పేలుపుండ బెల్లం చేతికి బంకలా అంటుకుంది. లోపలికి వెళ్ళి కడుక్కోక తప్పదు అనుకుంటూ ఉంటే గేటు తలుపు తెరుచుకుని పోలీసుగారి పెళ్ళాం వచ్చింది, నిండా పమిట కప్పుకుని ఏడుస్తూ.
ఆవిడ పేరేమిటో తెలీదు. అమ్మా బామ్మా పోలీసుపెళ్ళాం అనే అంటారు. ఆవిడ వెనకాలే నేనూ గుర్రం మీంచి ఓ గెంతు గెంతి ఇంట్లోకి వెళ్ళా – ఏమయిందో ఏమిటో పాపం! ఏడుస్తూ వచ్చింది, అనుకుంటూ.
నేను చెయ్యి కడుక్కుని వచ్చేసరికి అమ్మ గాభరాపడుతూ ‘ఏమైందమ్మా’ అంటూ ఆవిణ్ణి కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చింది.
ఆవిడ ఒహటే ఏడుపు!
బామ్మ ఆవిడ దగ్గరగా కూచుని ఓదార్చడానికి వీపు మీద చెయ్యి వేసి వీపు రాస్తూ ఏదో అనబోతే – ‘అమ్మో రాయద్దు. మండుతోంది’ అన్నాది.
ఆవిడ వెక్కిళ్ళ ఏడ్పు ఇంకా ఎక్కువైంది.
చనువుగా ఆవిడ నిండా కప్పుకున్న పమిటకొంగు తీసి వీపు చూసి ‘అయ్యయ్యో మళ్ళీ కొట్టేడా? రాక్షసముండావాడయ్యేడే నీ పాలిటికి.’ బామ్మ నొచ్చుకుంటుంది. బామ్మ వెనకాతల నిలుచుని చూసే. వీపు మీద వాతలు ఎర్రగా.
“ఎందుకు కొట్టేడూ? వీడి చేతులు పడిపోనూ!” పోలీసును తిట్టింది బామ్మ.
“అం… అంకె… అంకెలు” అందావిడ.
“వెధవ అంకెలు! రాకపోతే రాకపోయాయి. దానికి గొడ్డుని బాదినట్టు బాదుతాడా! చెప్పేవాడు లేక!”
అమ్మ చిన్నగిన్నెలో వెన్న తెచ్చి ఆ వాతలమీద రాసింది. నేను పరిగెట్టికెళ్ళి నాన్న గదిలో ఉన్న నెమలి పింఛాల విసనకర్రను పట్టుకువచ్చా, గోడకు తగిలించినదాన్ని. తాటేకు విసనకర్ర అయితే ఎక్కువ గాలి. విసురుతూ ఉంటే తగిలినా తగలొచ్చు. అందుకని.
నా తల్లే, నా తల్లే! అంటూ విసనకర్రతో మెల్లిగా విసురుతూ “ఏడవకమ్మా, ఏడవకు. ఏఁవన్నా ఎంగిలి పడ్డావా? తిండీ తిప్పలూ లేకుండా ఏడుస్తూ వచ్చేవా? పోలీసు ఇంట్లో లేడా? ఎలా వొచ్చేవూ?” అడిగింది బామ్మ.
“కొంచెం తేరుకోనివ్వండి అత్తయ్యా! చెప్తుందీ” అన్నాది అమ్మ.
“కాస్త మజ్జిగా అన్నాం కలిపి పట్టుకురా, పల్చగా. తింటుంది పాపం.”
వెన్న రాయడం అయేక అమ్మ మజ్జిగా అన్నం పెట్టింది.
బామ్మ భలేది! ఆవిడ దగ్గరికి అందరూ ఇలాగే వస్తారు బాధలు చెప్పుకోడానికి. చుట్టాలూ పక్కాలూ, ఇరుగూ పొరుగూ వాళ్ళే కాదు!
ఈవిడ – ఈ పోలీసుపెళ్ళాం మా చుట్టమూ కాదు. ఇరుగూ పొరుగూ అంతకన్నా కాదు. ఓ మంగళవారం నాడు పెద్ద ఆంజనేయస్వామి గుడికి వెళ్ళిందట బామ్మ. అక్కడికి ఈవిడా వచ్చిందట. బామ్మను చూసీ చూడ్డంతో దణ్ణం పెట్టి అచ్చుముచ్చు ముమ్మూర్తులా మా అమ్మలా ఉన్నారు. మా అమ్మను చూసినట్టుంది అని కళ్ళనీళ్ళు పెట్టుకుందిట. కొబ్బరిముక్కలు కళ్ళకద్దుకుని తింటూ గుడి ముందు కాసేపు కూచుని కబుర్లు చెప్పుకున్నారట. పోలీసుపెళ్ళానికి తల్లి లేదట.
పోలీసుపెళ్ళాం బుర్ర అదేం బుర్రో! నాగమణి బుర్ర కన్నా అధ్వాన్నం. అంకెలు రావని మొగుడు కొట్టేడని ఇదివరకు ఓసారి ఇలాగే వచ్చింది. ఇంతా చేసి ఎన్ని అంకెలూ? ఒకటి నుంచి పది వరకూనూ!
నాకు ముందు నవ్వొచ్చింది. పాపం నేర్పిస్తే పోలా! నేర్పించేద్దాం అనుకున్నా. “ఏవుందీ? మీకు వచ్చేస్తాయి. నే నేర్పిస్తాగా. రాకపోతే నన్నడగండి.”
నేను ఒకటీ అండం – తర్వాత ఆవిడ అండం. అలా పది వరకూ మళ్ళీ మళ్ళీ పదేపదే చెప్పించా. వచ్చేసుంటాయి అనుకున్నా.
వచ్చేయో లేదో చూడద్దూ. ఆ మొగుడు ముక్కు మీద వేలు వేసుకుంటాడు ఇక, అనుకుంటూ, ఏదీ ఇప్పుడు చెప్పండీ, అన్నా. ఊఁ ఒకటీ – ఆవిడ రొండూ అంది. భలే వచ్చేస్తున్నాయి చూశారా ఊఁ తర్వాత – ఆవిడ తల గోక్కుంటూ ఐదూ అంది.
నేను నా తల పట్టుకున్నా. ఆవిడకు ఎన్నిసార్లు చెప్పించినా గుర్తు ఉండటం లేదు!
“చాల్లేవే, నువ్వూ నీ నేర్పించడమూనూ” అని అమ్మ దెబ్బలాడింది!
ఆవిడ కాస్త తేరుకున్నాక చెప్పింది. అంకెలు వచ్చేయా? ఏదీ చెప్పూ? అంటూ లాఠీకర్రతో వీపు మీద కొట్టేట్ట!
“అంకెలు రాకపోతే ఏమిటయిందట! చక్కని చుక్కలా ఉంటావ్! ఏం తెగులూ వాడికి! అందమైన పెళ్ళాం అన్నీ వొండిపెట్టి పెట్టే పెళ్ళాం దొరికిందని సంతోషించక! గెడ్డ వీధి కదూ అన్నావ్? ఉండు. రేపు మంగళారం ఆంజనేయస్వామి గుడి కొచ్చినప్పుడు మీ ఇంటికి వొచ్చి నాలుగు జెష్ఠలు పెడాతాను. పక్కనే కద గెడ్డ వీధి. వస్తానుండు” అన్నాది బామ్మ.
“అమ్మో, వొద్దండీ. మీరు వెళ్ళిపోయాక మళ్ళీ నన్ను కొడతారు. వొద్దండీ వొద్దు” అన్నాదావిడ.
‘పాపం, తల్లీ తండ్రీ లేరు. ఉన్న ఆ ఒక్క అన్నగారూ ఈ పోలీసు చేతిలో పెట్టి తన చెయ్యి కడుక్కున్నాడు. ఇంక తొంగి చూసి వొంగి వాలడు. ఏ దన్నూ లేదు ఈ పిల్లకి’ అని బామ్మ ఎన్నిసార్లో ఆవిణ్ణి తలచుకుంటూనే ఉంటుంది.
నిజఁవే. ఆవిడ చక్కటి చుక్కే. చెంపకు చేరడేసి కళ్ళతో, పసిమి ఛాయతో, వెన్ను దిగువు వరకూ పొడుగాటి జుత్తుతో – చూడముచ్చటేస్తూ ఉంటుంది.
“చక్కగా ఉన్నాననే చేసుకున్నారట! ఇప్పుడు నా జుత్తు కత్తిరించేస్తారట! అందరూ నన్నే చూస్తున్నారట!” ఆవిడ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది.
“అనుమానప్పీనుగలు మొగాళ్ళు!” అంది అమ్మ.
ఆవిణ్ణి ఎలా ఓదార్చాలో బామ్మకీ అమ్మకీ తోచలేదు.
‘దేవుడే దిక్కులా ఉంది. మనమేం చెయ్యగలమూ? పై వాళ్ళం. నా పెళ్ళాం, నా ఇష్టం. తంతానో, కొట్టి చంపుతానో, మీరెవరూ అడగడానికి, అంటే?’ అమ్మ తనలో తను నెమ్మదిగా వినిపించీ వినిపించనట్టు అనుకుంది.
దేవుడనే సరికీ నాకు చటుక్కున జ్ఞాపకం వచ్చింది. ఆవిడ పాటలు బాగా పాడుతుందనీ!
ఆవిణ్ణి కొట్టి కేంపుకు వెళ్ళేట్ట! రాత్రికి రాట్ట.
“అయితే ఇక్కడే ఉండు. రేప్పొద్దున్నే వెళ్దువుగాని. నేవచ్చి దిగబెడతాలే” అన్నది బామ్మ.
“వొద్దండీ. వెళ్ళిపోతా” అంటూ కళ్ళు తుడుచుకుంది.
“సర్వమంగళనామా సీతారామా రామా – సర్వవినుతా శాంతిదూతా రామారామా పాట నాకు నేర్పించరూ?” అని అడిగే.
బామ్మకు నా మాట నచ్చినట్టుంది. “పాట పాడితే మనసు కాస్త శాంతపడుతుంది. పాడమ్మా!” అని అడిగింది.
బామ్మ మాటను ఆవిడ కొట్టేయలేదు. పాడలేనండీ అని కూడా అనలేదు. మొహం కడుక్కుని వచ్చి పాట పాడింది.
నీవు నేననూ భేదబుద్ధీ మాపీ మాలో – నిలుపుమా నీ జ్ఞానసిద్ధీ రామారామా!
రామకృష్ణ గోవింద నారాయణా!రామకృష్ణ గోవింద నారాయణా!
అమ్మా బామ్మా కూడా ఆవిడతో కలిసి – రామకృష్ణ గోవింద నారాయణా! అని పాడేరు. నేనూ ఆవిడతో పాటంతా పాడే.
ఇవాళ రోజంతా మండువా చీడీలో నా బెత్తం కుర్చీలో కూచుని మండువాలో పడుతున్న చినుకులని, నీటిబుడగలని, బుడగలు పేలిపోయి చిట్లిపోయి నీళ్ళవడాన్నీ చూస్తున్నానే కాని – నిన్న జరిగినదంతా నా బుర్రలో తిరుగుతున్నాది. పోలీసుపెళ్ళామే జ్ఞాపకం వస్తోంది. ఆ జ్ఞాపకాల్లోకి మళ్ళీ మళ్ళీ జారిపడుతున్నా.
ఉయ్యాలా గొలుసు గుండ్రని చక్రాలు ఒకదాన్ని ఒకటి జత చేసుకుంటూ పొడుగు అయినట్టూ, చంద్రహారం లోని చిట్టి చిట్టి చక్రాలు ఒకదానిలో ఒకటి దూరినట్టూ, మడత చంద్రహారంలా రెండేసి దొంతరై చక్రాలతో కలుపుకుని పొడుగ్గా అయి తిరిగి మొదటి చక్రం దగ్గరికి వచ్చినట్టూ – పోలీసు ఆయన పెళ్ళాం దగ్గరికే వచ్చేస్తున్నా. ఏవిఁటో!
నాన్న ఊరినించి రాలేదు. నాన్న ఉంటే బాగుంటుంది. ప్రశ్నల్లోంచి ప్రశ్నలు పుట్టుకువొచ్చేవి. ఇవాళ నా ఊహలకు మసాబు వేసింది. నా ఆలోచనలకి ముసురు పట్టింది.
‘మన్ను తిన్న పాములా, మాటా మంతీ, ఏ అల్లరి ప్రశ్నలూ లేకుండా అలా కూచున్నాదేఁవిటీ’ అంటోంది బామ్మ.
అమ్మ ఏది యిస్తే అది తింటూ తాగుతూ వానని చూస్తున్నా. “ఇంద, సాతాలించిన సెనగలు. వేడిగా ఉన్నాయి” అంటూ చిప్పగిన్నెలో చెంచా వేసి ఇచ్చింది.
“చదూకోటం లేదేఁవిటీ?”
“అన్నీ చదూకోటం అయిపోయింది.”
“అయితే బొమ్మల కథల పుస్తకం చదుకో.”
“వాన చూస్తున్నా అమ్మా! బుడగల్ని చూడు. ఎంత బాగున్నాయో!” అన్నా. “సరే అయితే” అని అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది.
అబద్ధాలాడకూడదు. నిజఁవే. కాని, మనసులో ఉన్నవన్నీ చెప్పకూడదు అని ఈమధ్యనే తెలిసింది. అందులోనూ, అమ్మా బామ్మా లాంటివాళ్ళతో. నాకు ఏఁవిటో బాగోలేదు. నాకు ముసురు పట్టింది అని చెప్పేననుకో. ఇంక చూడు రాద్ధాంతం చేస్తారు. దిష్టి తీస్తారు. తాయెత్తు కడతామంటారు. ఆంజనేయస్వామి బిళ్ళ గొలుసు మెళ్ళో వేస్తామంటారు. అందుకని అబద్ధం ఆడొచ్చు! ఇది నిజానికి అబద్ధమూ కాదు. వానని చూస్తూ కూచున్నానుగా! సగం అబద్ధం. సగం నిజం!
అభ్యాసం కూసువిద్య అని చెప్పేడు నాన్న కూడా. కాని కొందరికి ఎంత అభ్యాసం చేయించినా వాళ్ళ బుర్ర నేను నేర్చుకోను పొమ్మంటుంది. పోలీసుపెళ్ళాం బుర్రలాగ! అప్పుడు ఏం చేయాలీ? ఆ బుర్రనే అడగాలి. సరే, తల్లీ! నువ్వు ఇది నేర్చుకోను ఫో – అంటున్నావు. మరి అయితే ఏది నేర్చుకుంటావూ? అని అడగాలి కాబోలు. అప్పుడైనా అది చెబుతుందా? అయినా ఆ మొద్దుబుర్రల మనిషికి తెలీదుగా అలా తన బుర్రను అడగాలని! ఇంకెవరైనా బయటివాళ్ళు తెలుసుకోవాలి. ఆ బుర్ర అది కాదూ ఇదీ నేను నేర్చుకుంటానూ – అని అంటోంది. ఇది నేర్చుకుంటుందీ, అని!
అవునూ, ఆ పోలీసుపెళ్ళాం ఎంత బాగానో పాడుతోంది కదా! వినికిడితోనే! నేర్చుకోకుండానే! గొంతూ కమ్మగానే ఉంటుందీ – సంగీతం కావాలేమో ఆ బుర్రకి! గమ్మత్తు, అంకెలు రావు కాని, పాటంతా పొల్లు పోకుండా ఆవిడకు వస్తుంది. అవును. బామ్మకి ఈ విషయం చెప్పాలి. పోలీసాయనకి నాలుగు జెష్టలు పెట్టి, నీ పెళ్ళానికి అంకెలు కాదూ, సంగీతం నేర్పించూ, సంగీతం కాలేజీలో చేర్పించూ అని చెప్పమనాలి. బామ్మకి ఎందుకిలా తోచలేదూ? పెద్దవాళ్ళకి కావలసినవి ఏఁవీ తోచవు. ఆ ఊహలు ఆవిడకు రావో, ఏవిఁటో!
దేవుడు ఆవిడ నుదుట వాణ్ణి రాసిపెట్టేడు. మనవేం చెయ్యగలమూ? అంటుంది. మళ్ళా చూడబోతే అందరి కష్టసుఖాలూ వింటుంది. ఓదారుస్తుంది. అందరూ ఆవిడ దగ్గరకు వొస్తారు. ఓదారిస్తే చాలా?!
ఇలాంటి ప్రశ్న ఆవిణ్ణి వేస్తే జవాబు చెప్పనన్నా చెప్పదు. లేపోతే, పెద్దపేరక్కలా వెధవ ప్రశ్నలు వెయ్యకు అనేనా అంటుంది. అయితే నాన్నను అడుగుతా అంటాననుకో – నాన్న నిన్ను ఉబ్బేస్తాడు. అందుకే వాణ్ణి అడుగుతావు అంటారు. మాటిమాటికీ నాన్న నన్ను ఉబ్బేస్తాడు అని అంటూ ఉంటే నాకు ఉడుకుబీత్తనం వొచ్చి – నన్ను ఎవరూ ఉబ్బేయక్కర లేదు. నేననుకుంటున్నాది తప్పా ఒప్పా అన్నది చెపితే చాలు. మిమ్మల్ని అడిగితే ఏఁవిటేఁవిటో చెపతారు కాని నాన్న లాగ కాదు. చక్కగా చెపతాడు తప్పో ఒప్పో!
అన్నట్టు నాగమణి ఎలా ఉందో?
ఇక్కడ బళ్ళో పాఠాలు దాని బుర్రకి ఎక్కేవి కావు. రోజూ బెత్తానికి చెయ్యి జాస్తూనే ఉండేది. ఇక్కడైతే టీచరు భయపెట్టడానికి దెబ్బ తగిలీ తగలనట్టు బెత్తాంతో బులబులాగ్గా కొట్టేది. కాని అక్కడ ఆ రాజమండ్రీలో ఆ టీచరు ఎవరో ఘట్టిగా కొడుతోందో ఏమో! పాపం, దాని అరచెయ్యి ఎర్రగా కందిపోయి పోలీసుపెళ్ళాం వీపు మీద వాతలా అవుతోందేమో!
అది పోలీసాయన పెళ్ళాంలా అందమైనదీ కాదూ, జుట్టేమో ఎలకతోక జుట్టూనూ! ఎవరూ నాగమణిని పెళ్ళి చేసుకోరేమోలే! అలా అయితే ఏ గొడవా ఉండదు.
బామ్మ చెప్తునట్టూ దేవుడు నిజంగానే నుదుటి రాతలో ఎవణ్ణో రాసిపెడతాడా? అమ్మో! అలా అయితే నాగమణి నుదుటి రాతలో ఏం రాసేడో? పోలీసాయన లాంటివాణ్ణి రాసిపెట్టి ఉంటాడా? అలాంటి వాణ్ణే రాసిపెట్టి ఉంటే వాడు దాన్ని కొడతాడేమో? కర్రతోనో దేనితోనో! వాతలు పెడతాడేమో. అయ్యబాబోయ్!
అయినా ఆ దేవుడికి మాత్రం తెలియద్దూ? బుర్రలేని ఆడపిల్లకి కొట్టి వాతలు పెట్టే మొగుణ్ణి నుదుటి మీద రాసి పెట్టకూడదని! ఏఁవిఁటో ఈ దేవుడు!
ఎన్నిసార్లు చెప్పినా పోలీసాయన పెళ్ళానికి అంకెలు రానట్టు నాగమణికీ పాఠాలూ రావు. దాని బుర్రనీ అడగాలి. సరే, తల్లీ! పాఠాలూ నేర్చుకోనూ, అంటున్నావు. ఏది నేర్చుకుంటావూ అని. నాగమణికి తన బుర్రను అలా అడగాలని ఎక్కడ తెల్సూ? దాని మొహం. దానికంత ఆలోచన కూడానా! అదే ఉంటే పాఠాలే వచ్చును కదా! ఒకవేళ దాన్ని నే అడిగేననుకో. ఏమోనే, నాకు తెలీదు. నువ్వే చెప్పు అంటుంది.
అవునూ, దాని బుర్ర ఏం నేర్చుకుంటుందిటా? ఆఁ, కనిపెట్టేసే! కనిపెట్టేసే!
నాకయితే కమ్‌పేస్ బాక్సు లోని సర్క్యులర్‌తో, వృత్తలేఖిని అంటాంగా దానితో, గుండ్రంగా సున్నా చుట్టడం రానే రాదు. సున్నా చుట్టాలనుకో, అప్పుడు చేతికున్న గాజు తీసి గాజు చుట్టూ గీత గీసేస్తా. చక్కటి సున్నా పడుతుంది కాయితం మీద! నాగమణో? అది ఇట్టే సర్క్యులర్‌తో సున్నా చుట్టేస్తుంది.
అది కమ్‌పేస్ బాక్సు అనదు. కంపస్ బాక్సు అంటుంది. కంపస్ కాదే కమ్‌పేస్ బాక్సు అనాలంటే అనే అనదు. దాని నోటికామాట రానే రాదు.
డ్రాయింగు బొమ్మలో? భలేగా వేసేస్తుంది. నాకు చచ్చినా ఓ బొమ్మా తిన్నగా వేయడం రాదు. చేతిగాజు పెట్టి సున్నా చుట్టినట్టే ఆకు పెట్టి ఆకు చుట్టూ గీత గీసేసి ఆకు బొమ్మయితే వేసేగలను. మిగతా బొమ్మలా? కుదరనే కుదరవు! దాని బుర్ర బొమ్మలు నేర్చుకుంటానంటోదన్నమాట!
వాళ్ళ నాన్నగారిని దానికి బొమ్మలు వెయ్యడం నేర్పించమని చెప్పాలి. దాని బుర్ర అది నేర్చుకుంటానంటోందీ అనీ చెప్పాలి. అయినా, ఆయన అదోరకం మనిషే అని అంటుంది కదా బామ్మ! నాన్నలా ఏదీ పిల్లలకు నేర్పించడట. వాళ్ళమ్మే చెప్పిందిగా భోజనం చేసినపుడు. ఆయన బొమ్మలు నేర్పించే బళ్ళో దాన్ని వెయ్యడేమో!
అవునూ, అసలు బొమ్మలు వెయ్యడం నేర్పించే బళ్ళు ఉంటాయా? ఒకవేళ ఉంటే అలాంటి బడి రాజమండ్రీలో ఉందో లేదో?
ఏంటో నాన్న ఇంకా ఊర్నించి రాలేదు. నాన్నొస్తే ఇవన్నీ అడగొచ్చు.
మండువాలో చినుకుల బుడగల్లా నా బుర్రలో ప్రశ్నలు పొంగి లేచినట్టే లేచి చిట్లిపోతున్నాయి.
“ముసురు చినుకులు మండువాలో అలా పడుతూనే ఉంటాయి. ఎంతసేపలా చూస్తావ్? చూసింది చాల్లే. రావే లోపలికి. అన్నం తిందువు గానీ” అంటూ అమ్మ కేకలేసింది.
అన్నం తినాలిగా! బెత్తం కుర్చీతో పాటూ నట్టింట్లోకి వెళ్ళే.