కలం

చెప్పాపెట్టకుండా
అడగన్నా అడక్కుండా
గభాలున
నా కలాన్ని ఎప్పుడూ
నా దగ్గర్నుండి లాక్కుపోకు.

అదొక్కటే
కేవలం నాదీ అన్నది
నా అధీనంలో ఉన్నది.

దానిబలమే నా ఊపిరి
ప్రతిక్షణం, ప్రతీ ఘడియా
దానివల్లే!

గుప్తంగా దాంట్లోనే
నా గుండె చప్పుళ్ళు
దాక్కుని ఉన్నాయి.

నా నాడీ కొట్టుకుంటూ ఉంటుంది
దాంట్లోనే!
దాని సిరల గుండానే
పారుతూ ఉంటుంది
నా నెత్తురు.

నా దగ్గర ఉన్నదాన్ని మొత్తం
యావత్తూ తీసుకుపో.
కాని,
ఒక్కటి, ఒక్కటి మాత్రం
లాక్కుపోకు.
అదే – అదే
నా కలాన్ని!


[కరామత్ అలీ ‘కరామత్’ ప్రసిద్ధ ఉర్దూ కవి, విమర్శకుడు. నాలుగు కవిత్వసంపుటాలు, ఆరు ఉర్దూ సాహిత్యవిమర్శ గ్రంథాలు, మూడు అనువాద సంకలనాలు వెలరించారు. ఎన్నో రాష్ట్రీయ జాతీయ అకాడెమీ బహుమతులు అందుకున్నారు. ఆౙాద్ గౙల్ అనే ఒక నూతన ప్రక్రియకు ఆద్యుడు. ఉర్దూ -ఒడిశా సంస్కృతుల వారధిగా తరచూ చెప్పుకోబడే కరామత్ అలీ నివాసం కటక్.]