ఊహల ఊట 3

వేయించిన వేరుసెనగపప్పు పెట్టింది అమ్మ. బెల్లమ్ముక్క ఇవ్వనా అని కూడా అడిగింది.

వద్దు అన్నా.

గోడగుర్రం మీద అటో కాలూ ఇటో కాలూ వేసి రెండు చేతుల్తో చివరిమెట్టుతో కలిపి కట్టిన గుండ్రపు దిమ్మని ఒంగిపోయి పట్టుక్కూచున్నా. వేరుసెనగపప్పు జేబుల్లో పోసుకున్నానన్నమాటే కాని తినాలని అనిపించటంలేదు.

హుషారుగా లేదు.

‘మనసు బాగోలేదమ్మా’ అంటూ ఉంటారు పెద్దవాళ్ళు.

ఇదేనా మనసు బాగోలేకపోవడం అంటే? నా మనసు బాగోలేదా?

అసలు మనసు అంటే ఏఁవిటీ?

ఆలోచనలు బుర్రలోంచి పుట్టుకువస్తాయని తెల్సు. కానీ ఈ మనసు ఎక్కడుందీ?

ఏమిటో చూస్తూ ఉండగానే చీకటి పడిపోతుంది! మళ్ళీ తెల్లారిపోతుంది. రేపు వచ్చేస్తుంది!

తెల్లారకుండా ఉంటే బావుణ్ణు! రేపు రాకుండా ఉంటే బావుణ్ణు!

తెల్లారకూడదు. రేపు రాకూడదు!

తెల్లారకుండా చెయ్యాలంటే ఏం చెయ్యాలీ? రేపు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలీ?

సూర్యుణ్ణి రాకుండా అడ్డుకోవాలి.

శ్రీ సూర్యనారాయణా అని పాడతారేగాని ఎవరూ రేపు రాకయ్యా సూరీడా అని పాడరు!

బామ్మ పొద్దున్నే ఏదో ఓ పాట పాడుతూ పనులు చేసుకుంటుంది. తనకి భలే భలే పాటలు వచ్చు!

ఓసారి నాన్నని అడిగా. “బామ్మ అన్నేసి పాటలు పాడుతుందీ–ఎలా వొచ్చాయీ అన్ని? తనని అడిగితే నవ్వేసింది కాని చెప్పలేదు.”

“నీకెలా విన్నవన్నీ నోటికి ఎక్కేస్తున్నాయీ? అలాగే చిన్నప్పటినుంచీ వింటున్నవి తన నోటికి ఎక్కీసేయి!” అన్నాడు నాన్న.

పాటలూ మాటలూ నోటికి ఎక్కుతాయి.

పుట్టేటి భానుడా, పుష్యరాగపు చాయ శ్రీ సూర్యనారాయణా!
పుష్యరాగము మీద పొంగు బంగరు చాయ శ్రీ సూర్యనారాయణా!
జామెక్కి భానుడా, జాజిపూవుల చాయ శ్రీ సూర్యనారాయణా!
జాజిపూవుల మీద సంపెంగపువు చాయ శ్రీ సూర్యనారాయణా!
మధ్యాహ్న భానుడా మల్లెపూవుల చాయ శ్రీ సూర్యనారాయణా!
మల్లెపూవుల మీద మంచివజ్రపు చాయ శ్రీ సూర్యనారాయణా!
మూడ్జాముల భానుడా మునగపూవుల చాయ శ్రీ సూర్యనారాయణా!
మునగపూవుల మీద ముత్యాలపొడి చాయ శ్రీ సూర్యనారాయణా!
క్రుంకేటి భానుడా గుమ్మడీపువు చాయ శ్రీ సూర్యనారాయణా!
గుమ్మడీపువు మీద కుంకంపువూ చాయ శ్రీ సూర్యనారాయణా!
ఆయురారోగ్యములు ఐశ్వర్యములనిమ్ము శ్రీ సూర్యనారాయణా!

ఈ పాట బాగుంటుంది. నాకూ ఇష్టమే ఈ పాటంటే! ఆ మాటలన్నా ఇష్టమే!

ఎక్కణ్ణించో కిందనించి లేస్తున్న సూరీడు ఎలా ఎలా పైకి లేస్తున్నకొద్దీ దేనిలా ఉంటాడో, మళ్ళీ ఎక్కడికో కిందికి దిగిపోతూ దేనిలా ఉంటాడో చెప్పే పాట!

ఆ పువ్వులన్నీ నాకు తెల్సు.

క్రుంకేటి భానుడు గుమ్మడీపువు చాయ.
గుమ్మడీపువు మీద కుంకంపువు చాయ!

కుంకుంలా ఎక్కడుంటుందీ!

అనుమానం వచ్చిందీ అంటే అడిగేనన్నమాటే!

“బామ్మా బామ్మా! కుంకుం రంగులో ఉండడూ, అమ్మ బొట్టు తోపు రంగులో ఉంటుందీ, ఎండల్లో ఛాయ పసుపుకొమ్ములు కొట్టించినప్పుడు చినాలు పలుకులు వేసి కుంకుం చేయించుకుంటుందీ…” అని దీర్ఘాలు తీశా!

“ఆ కుంకుం కాదే వెర్రికుంకా! కాశ్మీరం కుంకం పువ్వు.” అంది బామ్మ.

“మాటలు మింగేయకుండా తిన్నగా సరీగా పలుకు! నువ్వే చెప్తూ ఉంటావు. నువ్వే చివరిమాటని మింగీసేవు అయితే!”

“నేనెక్కడ మింగానే? కుంకంపువు చాయ అని పాడితేనూ! నువ్వే సరీగ్గా విని ఉండవూ!” దీర్ఘాలు తీసి అంది బామ్మ.

“సరే సరే, ఒప్పేసుకుంటున్నాను. నేనే తిన్నగా విన్లేదు. పెద్దయాక కాశ్మీరం వెళ్ళి కుంకంపువ్వుని చూడాలి. నువ్వు చూశావా? వెళ్ళేవా కాశ్మీరం?”

“వెళ్ళే చూడాలి ఏమిటి? ఆ రంగులో సూర్యభగవానుడు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటే!” పకపకా నవ్వి, “కుంకంపువ్వు కేసరాలని తాంబూలంలోనూ వేసుకుంటారు.” అంది.

“నీ పాన్‌దాన్‌లో ఉందా మరి?”

“లేదు.”

కేసరాలు అంటే నాకు తెల్సు. అరటిపువ్వులో మెత్తటి, సన్నని, పలచటి కాడలు ఉంటాయి కదా, అవీ కేసరాలు. వాటి మధ్యలో మీదివేపు చిన్ని బుడిపితో దొంగాడూను! వాణ్ణి తీసేసి వొండుకోవాలి.

ఓ రంగు చూస్తే ఏదో అలాంటిదే పువ్వో పండో గుర్తుకువస్తుంది. ఇది దానిలా ఉందని అనుకుంటాం అన్నమాట!

సూరీడు రంగు – వాడి రంగు వాడిదే! ఒక రంగుతో కాదు. రెండేసి రంగులు కలిపి చెప్పాల్సిందే సూరీడు ఎలాగుంటాడో! గుమ్మడిపువ్వు చాయ మీద కుంకంపువు చాయ!

జానపద పాటల్లో ఒత్తులు పలకరట!

అవునూ, ఇంతకీ మీదికి పొడుచుకు వచ్చేస్తున్న సూరీణ్ణి ఎలా ఆపాలీ?

అమ్మ రెండు అరచేతుల్తో బట్టల్ని అదిమి అదిమి నొక్కి నొక్కి ట్రంకుపెట్టెలో సద్దుతూ కిందవరకూ తోసేస్తుంది.

సూర్యుణ్ణి నా రెండు అరచేతుల్తో అదిమి అదిమి నొక్కి నొక్కి కిందికి తోసేస్తే సరి!

అవునూ, అరచేతుల్తో నొక్కితే చేతులు రెండూ కాలిపోతాయేమో?!

పండు అనుకుని ఆంజనేయుడు సూర్యుడి దగ్గరకి ఆకాశంలో ఎగిరి వెళ్ళేడు. మీదికి బాగా లేచేక బాగా వేడెక్కిపోతాడెమో! పొద్దున్నే అంత వేడిగా ఉండడేమోలే! కాస్త కాలితే కాలింది అనుకుందామంటే అందడు కదా! గాలికి పుట్టేడు కాబట్టి ఆంజనేయుడు ఎగిరివెళ్ళేడు. నేనెలా వెళ్తానూ? ఎగరలేనే!

ఎలా సూరీడిని రాకుండా చెయ్యాలీ? తెల్లారకుండా ఎలా చెయ్యాలీ?

‘పొగిడితే పొంగిపోనివాళ్ళు ఉండరే! కాస్త వాణ్ణి ఉబ్బెయ్యి. దారికి వొస్తాడు’ అని అమ్మ ఓసారి పిన్నితో చెప్పడం విన్నా.

పొగిడి చూడనా?

సూర్యనారాయణా!
వేదపారాయణా!
దైవచూడామణీ!
లోక రక్షామణీ!

బామ్మ రోజూ రెండు చేతులూ పైకెత్తి దణ్ణం పెడుతూ పాడుతుంది.

ఊహూఁ, నే పాడినా మీదికి లేచి వచ్చేస్తాడు.

రోజూ ఎంతమంది బామ్మలా చేతులు పైకెత్తి దణ్ణాలు పెడుతూ పాడుతున్నారో!

‘పొగిడి ఉబ్బేసినా దారికి రాడు. కొంతమంది అంతే!’ అంది బామ్మ అమ్మతో.

సూరీడూ అంతే! ఒంగడు, లొంగడు, దారికి రాడు.

బళ్ళో ప్రార్థన రోజూ చేయిస్తారుగా, అలా ప్రార్థిస్తేనో?

అవును, అదే ఉపాయం!

‘సూర్యుడా! తండ్రీ, ఇంక పైకి రాకు! దిగిపో! కిందికి దిగిపో! రేపు తెల్లారనీకు! మామంచివాడివి! రేపు రోజంతా రాకు! రేపు రాత్రి కూడా అయిపోయాక ఎల్లుండి పొద్దున్నే రా! రేపు మాత్రం రాకు! ఎల్లుండి రా!’

పిల్లల్లో దేవుడుంటాడు అంటారుగా! నాలో దేవుడుంటే సూరీడు దేవుడు తప్పకుండా వింటాడు!

దేవుళ్ళూ దేవుళ్ళూ నేస్తాలుగా. ఒకళ్ళ మాట ఒకళ్ళు తప్పకుండా వింటారు. ఒకళ్ళు చెప్పింది మరొకళ్ళు తప్పకుండా చేస్తారు. నాలోని దేవుడు చెప్పింది సూరీడు చేస్తాడు!

రేపు ఆదివారం.

బళ్ళోకి రావక్కర్లేదు అంటూ అంతమందీ ఎగురుకుంటూ గెంతుతూ ఇళ్ళకు బయల్దేరతారా, నేను ఎగరాలేను గెంతాలేను.

ఆదివారంనాడూ బడి ఉంటే ఎంత బావుణ్ణూ! బళ్ళో అందరికీ సంబరమే! కాని నాకు ఆదివారం అంటే ఇష్టంలేదు. చచ్చేటంత భయమూ బెంగా కూడా!

అసలు ఆదివారాలు లేకుండా ఉంటే హాయి! వారాల్లోంచి ఆదివారాన్ని తీసిపారేస్తే?

సరే అనుకుని ఓ రోజు అదేమాట నాన్నని అడిగేను!

“నాన్నా! నాన్నా! వారాల్లోంచి ఆదివారం తీసిపారేయొచ్చుగా!”

“ఆదివారాన్ని తీసిపారెయ్యడం ఏమిటీ?” నాన్నకి నేనన్నమాట బోధపడలేదు.

“బళ్ళోకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలి బాబూ!”

“అంటే ఆదివారమూ బడి ఉండాలా?”

“ఆహా ఉండాలి. అదే మంచిది.”

“కాని పాపం మీ టీచర్లూ వాళ్ళకి ఎన్నెన్ని పనులుంటాయీ? ఆ ఒక్కరోజు సెలవన్నా లేకపోతే పన్లు ఎలా చేసుకుంటారూ?”

“పోనీ మా పిల్లలమటుకేనా ఆదివారాన్ని తీసిపారెయ్యాలి!”

“అదేఁవిటీ? హాయిగా చదువూ గిదువూ చీకూ చింతా లేకుండా ఎంచక్కా ఆడుకోవచ్చు!”

అక్కడికీ టీచర్లు రాకపోయినా ఫర్వాలేదూ. బళ్ళోకెళ్ళి ఆడుకుంటాం అందాం అనుకున్నా.

నాన్నకి ఎలా చెప్పాలీ?

నాన్నకీ నా కడుపులో మాట చెప్పలేకపోయా! ఆదివారం అంటే నాకు పడదు. భయం కూడా! భయమే భయం! భయం బాబూ భయం.

అవును మరి, భయం కాక ఏఁవిటీ?

తెల్లారీ తెల్ల్లారకముందే అమ్మా, బామ్మా, ముత్తమ్మా తయారైపోయి కూర్చుంటారు!

ముత్తమ్మ ప్లీడరు కాంతంగారింటికి వెళ్ళాలి. ఆలస్యం అయితే వాళ్ళు ఒప్పుకోరు! నాకు తలంటు పొయ్యకుండా వెళ్ళిపోతే అమ్మా బామ్మా ఒప్పుకోరు.

నే నిద్రలేచేసరికే ముత్తమ్మ పెరట్లో మూడురాళ్ళ పొయ్యిలో కొబ్బరాకులూ చిప్పలూ మట్టలూ పెట్టి రాగి డేగిశాలో నీళ్ళు మరగబెట్టేస్తుంది! పెద్ద గిన్నెతో పెద్ద గిన్నెడు మెత్తటి కుంకుడుకాయ పులుసుని గింజలూ తొక్కలూ లేకుండా పిసికి పెట్టేస్తుంది.

కచ్చూరాలూ అవీ వేసి చేసిన నలుగుబిండీ, మట్టుగిన్నెడు నిండా నువ్వుల నూనీ, కొమ్ము పసుపుగుండా పెద్ద పళ్ళెంలో పెట్టుకుని బామ్మ తయారైపోతుంది.

మొహం కడుక్కుని పాలుతాగీ తాగ్గానే గట్టిగా బిగించి వేసిన మోకుల్లాంటి మూడుపాయల జడని విప్పేసి గౌనుతోనే స్నానాలగదిలోకి బరబరా లాక్కువెళ్తుంది అమ్మ!

“మా మంచితల్లివి కదూ! బేగిబేగి నీకు తలంటడం అయిపోతే నాను ప్లీడరు బాబింటికి ఎల్తా. అలీసంగా ఎల్తే ఆళ్ళు దెబ్బలాడతారమ్మా! నా బంగారు తల్లివి! రా అమ్మా! బేగిరా!” ముత్తమ్మ ముద్దుగా బతిమాలుతుంది.

“వారం వారం పెద్ద యజ్ఞమే దీంతో! రావే! పెద్దదానివవుతున్నావ్! ఇలా ఈడిగిలపడకూడదు!”

“నే పోసుకోను! నే రాను!”

నేను చతికలబడ్డం – మొండికెత్తడం – కూచోబడిపోవడం!

“రా అమ్మా! బంగారపు తల్లివి! అంటూ తియ్యారింపు మాటలొకటీ! రెండు వడ్డిస్తా. లే… ఊఁ లే!” అంటూ అమ్మ రెక్కపట్టుకుని ఈడుస్తుంది!

వడ్డించడం అంటే కొట్టడం!

అమ్మ ఉత్తిత్తినే నోటితో ‘వడ్డిస్తా రెండు’ అంటుంది కాని ఎప్పుడూ కొట్టదు.

అసలు ఎప్పుడూ ఎవరూ నన్ను కొట్టరు.

బళ్ళో టీచరు బెత్తంతో వడ్డిస్తూ ఉంటుంది.

పాపం నాగమణికి ఎప్పుడూ వడ్డింపులు తప్పవు!

బెత్తంతో ఉత్తిదే చేతిమీద తగిలీ తగలనట్టు వడ్డిస్తుంది. ఆవిడా అమ్మలా మంచిదే, భయపెట్టడానికి అలా అంటుంది అంతే!

కాని వడ్డింపులు తింటున్న పిల్లలకు నామర్దా! మిగతావాళ్ళం నవ్వుతాం కదా!

పాపం నాగమణికి ఎప్పుడూ వడ్డింపులు తప్పవు! నాకూ వడ్డింపులు తిన్న పిల్లల్ని చూస్తే నవ్వొచ్చేస్తుంది. కాని నా నేస్తం కదా అంచేత నేన్నవ్వను. నవ్వుని ఆపేసుకుంటాను. కాని మిగతావాళ్ళు నవ్వుతారు కదా. వడ్డింపులు తిన్నవాళ్ళు బుర్రలొంచుకుని చెయ్యి చాచి ఎటూ చూడరు.

ఇంక నే ఈడిగిలపడ్డా లాభం లేదు!

“ఏమే, రెండు వడ్డిస్తేనే గాని రావేంటే నువ్వూ!” వడ్డించకుండానే అమ్మలాగే బామ్మా అంటుంది.

‘లాగిప్పవే భడవా!’ అంటూ బామ్మ మొలతాడులో దోపుకున్న లాగుని కిందకు లాగేస్తుంది.

బొందు ఎక్కించిన లాగు నేను తొడుక్కోమన్నా తొడుక్కోను. పొట్టమీద ముడి పెట్టుకోడం, విప్పుకోడం – అదో తలనొప్పి!

లాగు లాగేసి ఒళ్ళంతా నూని పట్టించి తొడల దగ్గర్నుంచి గజ్జల్లోనూ చేరెడు నూని పట్టించేస్తుంది!

‘మీ అమ్మకడుపు చల్లగా అత్తకడుపు చల్లగా మంచిముహూర్తాన మంచిమొగుడొచ్చి వెలలేని సొమ్ములు పెట్టుకుని తుల లేని భాగ్యాలతో పిల్లాపాపలతో’ అంటూ చేతి గిన్నెడు నూని తలమీద పోసి మర్దనా చేస్తుంది.

“తమ్ముడికి అనవే? వాడికీ అనూ. మీ అమ్మకడుపు చల్లగా! అత్తకడుపు చల్లగా!”

“వాడు మగపిల్లాడే.”

“మగపిల్లాడైతే మరి వాడికి మంచిముహూర్తాన మంచిపెళ్ళాం రావద్దేంటి?”

“మీ అమ్మకడుపు చల్లగా లెక్కలేనంత చదువులు చదివి గొప్ప ఉద్యోగాలు చేసి తుల లేని డబ్బు రెండు చేతులా సంపాదించాలి.” బామ్మ వాడికి పాట మార్చి పాడింది.

“మీరూ సరి, మీ మనవరాలూ సరి. వీడికీ మార్చి పాడేరే!” పకపకా నవ్వింది అమ్మ. ముత్తమ్మకూ నవ్వు వచ్చింది. అదీ పెద్దగానే నవ్వింది.

“మంచిముహూర్తాన మంచి పెళ్ళాం రావాలని పాడేవు కాదేమీ?”

“వాడు అన్నీ అయ్యాక పెళ్ళి చేసుకుంటాడు!”

“అయితే నా పాటా మార్చు. నేనూ లెక్కలేనంత చదువులు చదివి, గొప్ప ఉద్యోగాలు చేసి, డబ్బులు రెండుచేతులా సంపాదించేకే చేసుకుంటా, మంచి ముహూర్తాన మంచి మొగుణ్ణి.”

“నీకెందుకూ ఉద్యోగం? నీ మొగుడు సంపాదిస్తే హాయిగా దర్జాగా ఉందువు గాని!”

‘కాదు కాదు’ అంటూ నే ఇంకా ఏఁవీ అనకుండానే, “ఊఁ, కదలకు, కుదురుగా కూచో. నోట్లోకి నలుగుబిండీ నూనీ వెళ్తాయి. కళ్ళు మూసుకో.”

ఇహ అక్కణ్ణించి కళ్ళు మూసుకుని నోరెత్తకుండా కదలకుండా మెదలకుండా చచ్చినట్టు కూచోవాలి.

ఏమాటకామాట అనుకోవాలి. నలుగుబిండి మంచి వాసన వేస్తుంది. ఎటొచ్చీ గట్టిగా కళ్ళు మూసుకుంటే కళ్ళముందు రంగురంగులు కనబడతాయి. వెంటనే తెరిచేయాలనిపిస్తుంది. ఉత్తిదే బులబులాగ్గా రెప్పలు మూసుకోడం నాకు రాదు.

“బాబోయి వేడి వేడి! చుర్రుమంది!” అంటూ కళ్ళు విప్పి రెండుచేతులూ అడ్డం పెడ్తా.

“పిల్ల కందిపోయింది! మరీ అంత వేణ్ణీళ్ళు పొయ్యకే!” 

“సెయ్యెట్టిసూసే పాళంగున్నాయని పోసేనమ్మా.”

“నీ చెయ్యి ఎంత వేడైనా ఓరుస్తుంది. లేత ఒళ్ళు. పిల్లకు ఎక్కడైనా అంత వేడిగా పోస్తారే!”

“డేగిశాలో కాచిన నీళ్ళన్నీ దీనొక్కదానికే చాలేటట్టు లేవు!

ఇదిగో ఇక్కడ ముచ్చిలిగుంటలో రుద్దు. అక్కడ వదల్లేదు. మరికాస్త పులుసు పొయ్యి…”

“అంతంత నూని పట్టించేవ్! ఎలా వొదుల్తుందీ? రంగురంగులు కనబడుతున్నాయి. ఇంక కళ్ళు మూసుకోలేను బాబోయి!”

“తల పైకెత్తూ, కళ్ళల్లో పడకుండా నేను రుద్దుతాగా.”

“పోసేయ్యి పోసెయ్యి నీళ్ళు పోసెయ్యి చాలు ఇహ చాలు.” ఏడుపుగొంతుతో గోల గోల చేస్తా.

“అయిపోయింది. అయిపోయింది. తాళ్ళకి పులుసుపోయవే ముత్తమ్మా.”

“తాళ్ళు ఎక్కడివీ? వాట్నెందుకు రుద్దుతున్నావ్?”

“మాటాడొద్దన్నానా?”

“తాళ్ళు ఎక్కడున్నాయీ? ఎందుకూ రుద్దడం?”

“అబ్బ! చంపుతావ్ కదే ప్రశ్నలతో! బుర్ర మీంచి వీపు మీదికి వేళ్ళాడే జుట్టు తడిసిపోయి తాళ్ళలా ఉంటుంది. ముత్తమ్మా, వీపు రుద్దవే!”

“ముత్తమ్మ నా వొళ్ళు రుద్దొద్దు. దాని చేతి మురుగులు గుచ్చుకుంటున్నాయి. పరపరా పామేస్తుంది గిన్నెలు తోమినట్టు!”

“సరే, సరే.”

“నువ్వైతే గాజులు మీదకు తీసుకుని కిందకు జారకుండా పెట్టుకుంటావ్! ముత్తమ్మ మురుగులు మీదికి తోసినా వెళ్ళవే. దాని గుండ్రచేతులకి గుత్తలంగా ముంజేతిని పట్టుకునే ఉంటాయి…”

“అబ్బా! ఇహచాలు. ఇహచాలు బామ్మా! శ్రీరామరక్ష పెట్టేయి. శ్రీరామరక్ష పెట్టేయి!” గగ్గోలూ గోలా పెడతా.

తలచుట్టూ తిప్పుతూ చెంబుడు నీళ్ళు చేత్తో పోస్తూ శ్రీరామరక్ష శ్రీరామరక్ష పెడ్తుంది బామ్మ.

“పద తల్లీ! ఒక  యజ్ఞం అయింది. ఇహ రెండోది ఉంది.” అంటుంది అమ్మ తలకి పిడప పెట్టీ ఇంకో పొడితువ్వాలుతో వొళ్ళు తుడిచీ. రెండో యజ్ఞంలో ముత్తమ్మా అమ్మా ఉండరు. బామ్మొక్కతే.

గౌనూ లాగూ తొడిగి అంగారు బొట్టు నుదుటికి పెట్టి పంచదార కలిపిన పాలల్లో అటుకులు వేసి ఇస్తుంది అమ్మ.

“ఇదిగో చెమ్చా. మూతినిండా చేసుకుని గౌనుమీద పడకుండా తిను.” అంటుంది.

ఉయ్యాల బల్ల మీద కూచుంటూ ఉంటే “ఉయ్యాల్లో కూచోకు. ఊగుతూ తింటే ఒంటినిండా పడుతుంది. చచ్చీ చెడీ రుద్ద్దేం.” అంటూ ఎంత కష్టపడ్డారో చెప్తుంది!

సరే, ఏం చేస్తా! చిన్నబెత్తు కుర్చీల్లో కూచుని తింటా.

ఈలోగా కాళ్ళూచేతులు కడుక్కొచ్చిన బామ్మ నులకమంచం వాల్చి, సాంబ్రాణిపొడి డబ్బా, గుండ్రమట్టిపొయ్యి నిండా ఎర్రటి బొగ్గుల నిప్పుతో తయారైపోతుంది.

“తిండం అయిందా? రావే! బోల్డు పని మూలుగుతోంది. వేగిరం నీకు సాంబ్రాణి పెట్టేసి మడి కట్టుకుంటా.” అంటూ తొందరపెడుతుంది.

తప్పదుగా! వెళ్ళి మంచం మీద పడుకుంటా.

జుట్టుని విడదీసి సాంబ్రాణి పొగ వేస్తుంది. 

అక్కడికీ ఓసారి ఈ సాంబ్రాణి తతంగం అయేక అన్నాను కదా, “ఈసారి తమ్ముడికి క్రాఫు చేయించినప్పుడు నేనూ క్రాఫు చేయించేసుకుంటా. నీకీ బాధ పోతుంది.” అంత బాధా వాళ్ళదే అయినట్టు!

“ఇంత చక్కటి ఒత్తైన ఉంగరాలజుట్టు నీకైతే ఉంది! నీ జతపిల్ల నాగమణిది ఎలకతోక జడే కదా. నీ జుట్టూ జడా ఎంత బాగుంటాయీ అంటూ వాళ్ళమ్మ నిన్ను చూసి ఎంతో ముచ్చట పడుతుంటుంది. అవునా?”

నిజఁవే. నాగమణిది ఎలకతోకే!

“క్రాఫు అయితే ఇంకా బాగుంటుంది బామ్మా!” అంటూ ముద్దులుగుడిచా.

“ఆడపిల్లవి, క్రాఫు ఏఁవిటీ? మగపిల్లాడిలా ఉంటే నిన్నెవరూ పెళ్ళాడరు. నీ జుట్టునీ నిన్నూ చూసి ఎగురుకుంటూ వచ్చి లైను కడతారు పెళ్ళికొడుకులు!” అంది అమ్మ.

జుట్టునీ నన్నూ చూసి ఎగురుకుంటూ వస్తారా? జుట్టా? లోపలున్న బుద్ధీ ఆలోచనలూనా? మట్టిబుర్ర పిల్లనైనా జుట్టు బాగుందని ఎగురుకుంటూ వస్తారా పెళ్ళికొడుకులు?

“పెళ్ళికొడుకులు ఎగురుకుంటూ లైను కట్టకపోతే పోతే పోనీ. నేనసలు పెళ్ళే చేసుకోను. పెళ్ళెందుకూ చేసుకోవడం – నాకు తెలీక అడుగుతా?”

“పెద్దయ్యాక నీకే తెలుస్తుందిలే!”

వీళ్ళు నాకు క్రాఫు చేయించరు!

చెవుల పక్కనుంచీ చిన్ని పాయలు తీసి మధ్య ఓ చిన్న పాయతో కలిపి సన్నటి జడ వేస్తుంది అమ్మ, జులపాలజుట్టు కళ్ళల్లో పడకుండా.

అమ్మయ్య అనుకుని ‘నాగమణీవాళ్ళింటికెళ్తున్నా’ అని చెప్పి పరిగెట్టబోతా.

“ఆ జుట్టును ఎగరేసుకుంటూ ఇప్పుడేం వెళ్ళకు. చక్కా జడేసుకుని పువ్వులు పెట్టుకుని సాయంత్రం వెళ్ళు. ఇప్పుడు వెళ్తే అందరి కళ్ళూ నీమీదే ఉంటాయి. దిష్టి తగుల్తుంది. అందులోనూ ఆ పెద్దరావిచెట్టు పక్కనుంచి కూడా వెళ్తావాయె. దెయ్యం వాలుతుంది.”

“ఆ రావిచెట్టునిండా పక్షులు ఉంటాయి. దెయ్యం ఎప్పుడూ కనబడలేదే!” అమ్మ దీనికి జవాబు చెప్పదు.

ఆదివారంనాడు నాన్నా తన స్నేహితుల ఇంటికి వెళ్తాడు. తనూ ఇంట్లో ఉండదు. మర్చిపోకుండా దెయ్యం గురించి నాన్నను అడగాలి.

ప్రతీ ఆదివారం రోజురోజంతా ఇంతలా ఇన్ని అవస్థలు పెట్టి ఏడిపిస్తే నాకెందుకు బెంగా భయం వెయ్యవూ?

ఆదివారం అంటే నాకు పడదు.