స్ఫూర్తినిచ్ఛే కథలు: శ్యామ్‌యానా

ప్రతి చిన్న విషయానికీ కదిలిపోయే గుండె ఉన్నవాడు. దాన్ని మరచిపోలేక ఆ ఆలోచనలతో సతమతమయే స్నేహశీలి.

ఎవరు ఏ సాయమడిగినా అది తన సొంతపనే అనుకుని తక్షణం ఆ సాయం అందజేసేంత వరకూ నిద్రపట్టని మనిషి.

తేదీలు, మాటలతో సహా ప్రతీదీ అద్భుతమైన తన ధారణశక్తితో అప్పచెప్పే అరుదైన వ్యక్తి. ఎవరికీ ఏ రిఫరెన్స్ కావాల్సి వచ్చినా తన మెదడులో నిక్షిప్తం చేసుకున్న కంప్యూటర్ నుంచి వెలికితీసి అదునుకు ఆదుకునే మనిషి.

ఎవరితోనూ ప్రత్యుపకారం ఆశించి స్నేహం నెరపనివాడు.

ఇన్ని సుగుణాలు ఉన్న ఆ ఉత్తముడి పేరు డాక్టర్ శ్యామ్ చిర్రావూరి.

మెడికోశ్యామ్‌గా ప్రసిద్ధుడైన తెలుగు కథకుడు.


శ్యామ్‌యానా (2010)
వంగూరి ప్రచురణ.

ఈ శ్యామ్ విజయనగరంవాడు. విద్యార్థిగా చదువుకుంటున్న రోజులలోనే కుర్రాడుగా మా ఇంటికి వచ్ఛేవాడు. మా తమ్ముడు చాగంటి శంకర్ లాగా నాతోపాటు ఉయ్యాలబల్ల మీద కూచుని మాటాడుతూ ఉండేవాడు.

ఆ కుర్రాడినుండి ఈనాటి ప్రసిద్ధ కథకుడిగా మనసున్న మంచి మనిషిగా అత్యుత్తమడాక్టరుగా ఎత్తులకు ఎదిగిన శ్యామ్‌ని, ఆ పెరకువని చూస్తూనే వున్నా! బహుముఖ ప్రజ్ఞాశాలిగా పరిపక్వతతో సాధికారతతో రచన చేసినా ప్రసంగించినా అలా రాయగలిగే, చెప్పగలిగే స్థాయికి ఎదగడం వెనక ఉన్న కృషి కూడా నాకు తెలుసు.

నానావిధాల వైవిధ్యంతో కూడిన జ్ఞానాన్ని ఆకళించుకోవాలన్న తృష్ణ విద్యార్థి దశ నుండి ఉన్నందువల్ల చదవడం వేరు అధ్యయనం చేయడం వేరు అన్న తెలివిడి అప్పటికే ఏర్పడి ఉన్నందువల్ల ఈ ఎదుగుదల సాధ్యమైంది. ఈ ఎదుగుదలకి వారి ఇంట్లో వారి నాన్నగారు చిర్రావూరి సర్వేశ్వర శర్మగారి గొప్ప లైబ్రరీ దోహదపడింది. శర్మగారి ఆ లైబ్రరీలో స్వయంగా ఆయన కొనుక్కుంటూ సేకరించి పెట్టుకున్న వైవిధ్యభరితమైన జ్ఞాన సంపద శ్యామ్‌కి దక్కిన గొప్పవరం.

శర్మ గారికి wit, wordplay అంటే మహా ఇష్టం. తనకి వచ్చిన హిందీ తెలుగు ఒడియా భాషల్లో మాటలతో సరదా రాతలు ఆయన ఆ రోజుల్లో రాసేవారు. కలం పేర్లని మారుస్తూ పత్రికలలో ప్రచురిస్తూ ఉండేవారు.

శ్యామ్ వాళ్ళ నాన్నగారిలా కలం పేర్లు మారుస్తూ అతి చిన్న వయసులోనే ఆ చమత్కారాన్ని సొంతం చేసుకున్నాడు. హాస్యం వ్యంగ్యం తోడయ్యాయి. తనదే అయిన సొంత ముద్రతో తను చదివిన ఇంగ్లీషు, తెలుగు, హిందీ పుస్తకాల నుండి రచయితల కవుల, మేధావుల ఉటంకింపులతో తనకు ఎంతో ఇష్టమైన హిందీ తెలుగు సినిమా పాటలతో మూడు భాషల మేళవింపుతో కథలు అల్లడం మెడికోశ్యామ్ రోజులలో మొదలుపెట్టి ఈనాటికీ రాస్తున్నాడు.

మా ఇంటి చాసో, నారాయణబాబు, రోణంకి తదితర మేధావి రచయితల కవుల సాహిత్య సాంస్కృతిక వాతావరణంలో పెరగడం వల్ల నేనూ అతి చిన్న వయస్సునుండి కథలు అల్లడం మొదలుపెట్టి ఈరోజు వరకూ రాస్తూనే ఉన్నా.

శ్యామూ, నేనూ ఇద్దరమూ విరామాలతో మధ్య మధ్య దీర్ఘ విరామాలతో రాస్తూ వస్తున్నాం. ఇహ ముందూ రాస్తాం కూడా.

మా మధ్య ఈ రకమైన సామ్యం ఉన్నప్పటికీ మా ఇద్దరికీ వ్యత్యాసం కూడా ఉన్నాది. వేరువేరు కథకులం. వేరువేరు రకాల కథకులం.

చాలా సంవత్సరాల తర్వాత శ్యామ్ తన కథల పుస్తకం శ్యామ్‌యానా అచ్ఛువేసుకున్నాడు.

అవి నేను పిహెచ్.డి. చేస్తున్న రోజులు. శ్యామ్ మెడికోశ్యామ్‌గా మెడికల్ కాలేజీలో విద్యార్ధిగా కథలు రాస్తున్న రోజులు. ఆ కథలులువాటిని ఎప్పుడు ఎలా రాస్తున్నదీ కూడా నాకు తెలుసు. విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియోకి ఓ ప్రసంగం ప్రసారం చేయమని నేను ఇచ్చేను.

శ్యామ్ యానా అచ్చు వేసుకున్నప్పుడు శ్యామ్ ఆ పుస్తకం గురించి తన సాహిత్య ప్రయాణం గురించి నాలుగు ముక్కలు పుస్తకం వెనక అట్ట మీద రాసుకున్నాడు.

తనని గాలి తోసేస్తూ ఉంటే ముందు నడిచేట్ట! ఆ తర్వాత నేను ‘నడవగలనూ’ అన్న ఆత్మవిశ్వాసంతో నడిచేట్ట! మరి కొన్నాళ్ళకి నడవడం రాక ఆగిపోయేట్ట! తర్వాత గతంలోకి చూసుకుని అసలు నేను నడిచానా అని సందిగ్ధంలో పడ్డాట్ట!

ఇవీ ఆయన రాసుకున్న నాలుగు వాక్యాలు!

ఈ మాటలు చదివిన పాఠకుడికి ఏమనిపిస్తుంది! రచయిత సందిగ్ధత ఎలా ఉంటుందో తెలుస్తుంది!

ఒకటే విజయనగరం నుంచి రచయితలుగా ఎదిగినవాళ్ళం. గురజాడ వేళ్ళ సారం నుంచి వచ్చినవాళ్ళం. ఆ సారంతో పుట్టి పెరిగిన వాళ్ళం. ఆధునిక తెలుగు కథాసాహిత్యానికి దారి వేసిన గురజాడ బాట పట్టుకుని నడుస్తున్నవాళ్ళం. ఆ సాహితీ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా చెప్పుతూ దేశంలోనూ బయటా ఎంతో గౌరవం పొందుతున్నవాళ్ళం.

ఆ దృక్పథంలోంచి వచ్సిన వాళ్ళమే అయినా మేం రెండు రకాల కోవలకి చెందిన రచయితలం అయ్యాం.

శ్యామ్ లోని సందిగ్ధత ఏం చెపుతోంది? తనలో ఒక విచికిత్స ఉందని ఒక శంకతో తను ప్రపంచమానవాళికి జరగాలనుకున్న, కలలు కన్నరోజు వస్తుందా? రాదు, వచ్చేటట్టు లేదు – అన్న నిరాశకి గురి అవుతూ నైరాశ్యం ఆవహించిన రచయితగా మన ముందుకి వచ్ఛేడు అని!

సరిగ్గా దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి రచయితని నేను. చాలామంది ఈ పాట వినే ఉంటారు. ఓ సుబహ్ కభీతో ఆయేగీ అని పాడతాడు ముకేశ్. ఆ ఉదయం ఎప్పటికో అప్పటికి తప్పకుండా వస్తుంది ఎదురుచూస్తూ ఉండు అంటాడు జాన్ నిసార్ అఖ్తర్. మన జావేద్ అఖ్తర్ తండ్రి. వీళ్ళు తరక్కీపసంద్ అంటే ప్రగతిశీల రచయితలు. ఆశావాదులు. తమ కల నిజమవుతుంది అని నమ్మే ఆశావాదులు. ఆ ప్రగతిశీల రచయితల కోవకి చెందిన రచయితని నేను. మానవాళికి నిజంగా మంచి రోజులు వస్తాయని, ఆ రోజులు వచ్చేవరకు ఎదురుచూస్తూ కృషి చేస్తూనే ఉండాలన్న పూర్తి నమ్మకంతో రాస్తున్నదాన్ని.

శ్రీశ్రీ అంతటి వాడే నిజంగానే నిజంగానే నిఖిల లోకం రహిస్తుందా? నిజంగానే నిజంగానే మానవాళికి మంచికాలం హసిస్తుందా! అని ఒకానొక విచికిత్సకు గురి అయి శంకకు సందేహానికి లోనయి నైరాశ్యంతో పాడతాడు. కవితా ఓ కవితా పాడిన శ్రీశ్రీవే సందేహంలో పడ్డాడు. అంటే సమాజగతమైన యదార్థ స్థితిగతులు వారిని నైరాశ్యంలో ముంచుతున్నాయి అని తెలుస్తుంది. శ్యామ్ అలాంటి సందిగ్ధతలో మునిగేడు! ఈ సందిగ్ధత శ్యామ్‌లో మెడికోశ్యామ్‌గా రాస్తున్న రోజుల నుంచీ ఉన్నట్టు తను అట్ట మీద రాసుకున్న మాటలు చెప్పకనే చెపుతున్నాయి!

శ్యామ్ నా గురించి రాస్తూ ‘ఆవిడకు స్పష్టత ఉంది. మానవాళికి మంచి రోజులు తప్పకుండా వస్తాయన్న గట్టి నమ్మకంతో కృషిచెయ్యాలన్న దృక్పథం ఉన్నవారు. ఆవిడ ఆశావాది’ అన్నాడు.

ఏ కథకుడైనా ఏ కవి అయినా ఫ్రస్టేషన్ లేకుండా రాయలేడు. ఆ ఫ్రస్టేషన్ వ్యక్తిగతమైనది కావొచ్చు, కుటుంబగతమైనది కావచ్చు. సమాజ గతమైన అక్రమాలు, అన్యాయాలు ఎలా ఆపాలో అడ్డుకోవాలో తెలీక పడుతున్నది కావొచ్చు. బాధ కవిత్వానికి పర్యాయపదం. ఈ కొటేషన్ ఎప్పటి కొటేషన్ – ‘అవర్ స్వీటెస్ట్ సాంగ్స్’ అన్నది! బాధ లేనిదే మనం రాయలేం. ఈ రచనలని ఒక vent అనీ అనుకోవచ్చు. ఉన్న పరిస్థితులను మార్చలేం. కాబట్టీ ఆ బాధని నెట్టేయ్యాలని తోసెయ్యాలన్నప్పుడు రచన పుట్టుకొస్తోందనీ చెప్పొచ్చు.

ఆ చారిత్రక స్థితిగతులను కాయితాలమీద రచనగా తర్వాతి తరాలకు అందజేయడమూ అవసరమే. ఆ జీవితానుభవాలని ఆ చరిత్రను నమోదు చేస్తున్న రచయితలం మేమందరం.

మరొక విషయం. అసలు ఏ రచన గొప్ప రచన? ఏ కథ గొప్ప కథ? ఏది సామాన్యమైన కథ? అలా చెప్పడానికి దానికి తూనికరాళ్ళేమిటి? ఏ కథైతే మన అనుభవ పరిధిలోకి వచ్చిన మన అనుభవాన్ని ఆసరా చేసుకుని మళ్ళా మళ్ళా మరోసారి మరోసారి అందులోని ఒక మాటో, ఒక వాక్యమో, కొన్ని వాక్యాలో జ్ఞాపకం వస్తూ ఉంటాయో ఆ కథ గొప్ప కథ.

నాకు అలా భర్తృహరి జ్ఞాపకం వస్తూ ఉంటాడు. భర్తృహరి అంటే నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టం.

ఎప్పటి భర్తృహరి? ఆయన నా కోసం రాయలేదు! కొన్ని నిత్యసత్యాలు మన అనుభవ పరిధిలోకి వచ్చి పలకరిస్తాయి. అవి మన అనుభవాలని ఉత్తేజపరుస్తాయి. మన చైతన్యాన్ని విశాలపరుస్తాయి. మీదకి ఎదగడానికి దోహదపడతాయి. ప్రయోజనకారి అవుతాయి.

ఈ మాటలు కేవలం నా మాటలు కావు. ఆచార్య రోణంకి అప్పలస్వామిగారు తమ అనుభవాల గురించి చెపుతూ ఒకానొక కథ తనను ఎప్పుడూ వెంటాడుతుందని, అలా వెంటాడుతూ నిద్రపోనివ్వని కథ గొప్ప కథ అనీ చెప్పేరు. పదే పదే ఆయనకు గుర్తొచ్చే ఆ కథ బెస్తవారిది. ఆ బెస్త స్త్రీలలో ఓ స్త్రీ ప్రసవ వేదనతో బాధపడ్తూ – ఆమె చుట్టూ ఉన్న స్త్రీలు ఆరాటపడుతూ – అతి కష్టం మీద సుఖప్రసవం అయి ఊపిరి పీల్చుకుంటారు. అయితే ఆ కష్టాన్ని బాధని మొత్తం అంతా మరిచిపోయి తమ తండ్రులు, భర్తలు, కొడుకులు సముద్రం మీద వేటకి వెళ్ళిన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మగవాళ్ళ బతుకు ఎంత కష్టభూయిష్టమైనదో అని బాధ పడతారు! ఆ స్త్రీలని అప్పలస్వామిగారు ఎప్పటికీ మరచిపోలేకుండా ఉన్నారు!

మన అనుభవ పరిధులూ స్థాయీభేదాలతో ఉంటాయి.

కథకులు గాని సృజనశీలురులైన రచయితలు గాని వారి వారి పరిధులు గాని భిన్నభిన్నం గానే కనబడతాయి. వారు చదివిన,అధ్యయనం చేసిన పుస్తకాలు, లోకానుభవం, మేధావుల సాంగత్యం వారి పరిధిని విశాలపరుస్తాయి. ఎంత విశాలమైన పరిధి పెరిగితే అంతగా వారి అవగాహనా స్థాయి పెరుగుతుంది. ఇదేవిధంగా పాఠకులలోనూ వారి వారి పరిధులు భిన్న భిన్నంగా ఉంటాయి. సామాన్య పాఠకుల పరిధికి ప్రబుద్ధ పాఠకుల పరిధికి వ్యత్యాసం కనబడుతుంది.

ఇదేవిధంగా మేధావుల్లోనూ స్థాయీభేదాలు కనబడతాయి. ఒకరి పరిధికీ మరొకరి పరిధికీ ఉన్న వ్యత్యాసంతో అందరూ ఒకేలాగ ఒక సృజనశీల రచనను అవగాహన చేసుకోవడం కనబడదు. ఒకే స్థాయి ఉన్న మేధావులు ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్న విధం ఒకేలాగ ఉంటుంది. వారు ఒకరిని ఒకరు అందుకోగలుగుతారు.

శ్యామ్ కథలను గాని బహుముఖ ప్రజ్ఞాశీలుర కథలను గాని ఆయా స్థాయీభేదాలతో అర్థం చేసుకోవడం జరుగుతుంది.

శ్యామ్ కథల్లో కథ నడుస్తున్నంత మేరా అడుగడునా కథకుడి reflective mood కదులుతూనే ఉంటుంది. ఈ reflective mood వల్ల లంకెలు లంకెలుగా లింకులతో refrains, వీటి సంబంధం మళ్ళా భాషతో, సాహిత్యంతో సినీ సంగీతంతో వక్రగతి కిరాణ ప్రసారంతో సత్యం దీప్తివంతమై వెల్లడవుతూ ఎదటికి వస్తుంది. జిగేల్మనిపించేవి, తళుక్కుమనేవి, పెదిమల మీదకి వచ్చీరాని సన్నని నవ్వు తెప్పించేవి చమక్కులూనూ!

ఇవీ శ్యామ్ కథలు.

నాలుగు కాలాలు ఉండే కథలు!

అందరూ చదవవలసిన కథలు!

స్ఫూర్తినిచ్ఛే కథలు.


(ప్రతులకు: వంగురి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారిని సంప్రదించండి: vangurifoundation@gmail.com. ఇండియాలో అచ్చంగాతెలుగు వెబ్‌సైట్ ద్వారా. వెల రూ. 150.00)