పొట్టి గౌన్ వేసుకున్నా ఇవాళ. అమ్మ బెల్లంతో కొబ్బరి ఉండలు చేసింది. జేబుల్లో వేసుకుంటే బంక కొద్దో గొప్పో అంటుకుంటుంది.
లస్కోరా కన్నా బెల్లం కొబ్బరుండలే రుచిగా ఉంటాయి. లస్కోరా పంచదారతో చేస్తారు.
లస్కోరా అంటారేమిటీ? ఇంగ్లీషు మాటా? తెలుగు మాటా? మరిచిపోకుండా నాన్నని అడగాలి. ఎందుకంటారు అని అమ్మనీ బామ్మనీ అడిగేమే అనుకో… ‘దాని పేరు అది. అది అంతే’ అంటారు.
కోరా అంటే కోరింది. కోరింది అంటే నాకిది కావాలి అది కావాలి అని అడగడం కాదు. కోరంతో కొబ్బరిని కోరతాం కదా అదీ! కోరా – కొబ్బరి కోరు!
చేతికోరంతో అన్నేసి చిప్పలు కోరడం మాలావు కష్టం. అదే తిప్పే కోరం అయితే ఎన్ని చిప్పలైనా తిప్పేయవచ్చు. చేతికోరం అంటే చెయ్యిలా ఉంటుంది. ఐదువేళ్ళలా దానికీ కొబ్బరిని గీకడానికి ఐదు పళ్ళు ఉంటాయి. తిప్పుడు కోరానికి పళ్ళు ఎక్కువ. ఎడం అరచేత్తో చిప్పని పట్టుకుని కుడిచేత్తో కోరాన్ని గిరగిరా తిప్పేయడమే! చేటలో కొబ్బరి కోరు తిరగలి లోంచి పిండి పడ్డట్టు పడుతుంది. నేనూ తిప్పగలను అని ఓరోజు బయల్దేరానా! ఇలా ఓ తిప్పు తిప్పానో లేదో, ‘దాన్నెందుకు తిప్పనిస్తున్నావే, లేత అరచేతులు కందిపోతాయి. అసలే దాని చర్మం పలచన!’ అంటూ బామ్మ అమ్మని దెబ్బలాడింది. పని చేసిచేసి పెద్దవాళ్ళ చేతులు బండబారిపోతాయిట! లేత చేతులు! ఈమాట నాకు నచ్చింది. లేత తమలపాకుల్లాగ! కొన్ని మాటలు నాకు భలే నచ్చుతాయి!
నాతో వచ్చిన తిప్పలే ఇవి! ఒకదాంట్లోంచి నాకు తెలీకుండానే మరోదాంట్లోకి వెళ్ళిపోతా. మొదటిది కాస్తా మర్చిపోతా. ఏఁవిటి అబ్బా! ఏమిటనుకుంటున్నాను చెప్మా? ఆఁ అదీ లస్కోరా! నాన్నని అడగాలి. నాన్నని అడగాలి. బామ్మ జపం చేసినట్టు అదే అదే మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉంటే మర్చిపోనేమో! ఇంకోదాంట్లోకి మళ్ళీ గెంతకుండా ఉంటానేమో!
లస్కోరా! కోరా అంటే కోరు. సరే, మరి లస్సు అంటే పంచదారా?! ఓహో! నాకే తోచింది. అలోచిస్తే అన్నీ తోస్తాయి. అయితే బెల్లం కొబ్బరుండ బెల్కోరా! అహహా! కొత్త మాటని కనిపెట్టేనోచ్చి! బెల్కోరా! బెల్కోరా!
ఛఛ! ఇది కనిపెట్టడం కాదు. మాటలాంటి మాటని లాగేను. అంతే! ఓహో, మాటకి మాట కలిపి లాగితే మరో మాట పుట్టుకువస్తుంది అన్నమాట! కొత్త మాటలు పుట్టించొచ్చు ఇలాగ!
బెల్కోరా అనాలనీ అనమనీ అందరికీ అలాగే చెప్పాలనీ అమ్మకీ బామ్మకీ బోధపరచాలి. వాళ్ళు చచ్చినా కొత్తవాటిని గబుక్కున ఒప్పుకోరు. ‘మా పెద్దవాళ్ళు చెప్పినట్టూ మేం నేర్చుకున్నామూ నువ్వూ మేం చెప్పినట్టూ నేర్చుకోవాలి’ అంటారు. అదే నాన్నతో చెప్పేననుకో, ‘భలే భలే బాగా కనిపెట్టేవే! అహ, పుట్టించేవే! సెబాసు’ అంటాడు.
బెల్కోరా ఉండల్లాగానే జీళ్ళూ నవులుతూ ఉంటే మామజాగా ఉంటుంది. బామ్మ నువ్వులుండలు చేస్తుందనుకో, కాని జీళ్ళు జీళ్ళే! నువ్వులుండలు నువ్వులుండలే! దేని రుచి దానిదీ అంటుంది బామ్మ. కాదు జీళ్ళే అన్నాననుకో, జిహ్వకో రుచీ పుర్రెకో బుద్ధీ అంటుంది.
నాన్న స్నేహితులు లస్కోరా తింటూ హస్కు వేస్తారు! వాళ్ళకి లస్కోరానే ఇష్టంట! నాన్నకి వేడివేడిగా బెల్లం కొబ్బరి ఉండలు–అదే బెల్కోరా ఉండలు–చేస్తున్నప్పుడు తిండం ఇష్టం. నిజానికి బెల్కోరా ఉండలు చల్లారిపోయినా బాగుంటాయి. చేస్తున్నప్పుడు తిన్నా బాగుంటాయి.
తినేవాడి దంతసిరి బాగుంటే చేసేవన్నీ బాగా కుదురుతాయి అంటుంది బామ్మ. అదేంకాదు, చెయ్యడం రావాలి. అమ్మకి ఎంచక్కా అన్నీ చెయ్యడం వచ్చు.
న్యూసుపేపరు కాయితంతో పెద్ద గరాటా చేసుకుని, కొబ్బరుండలు, కాదు కాదు, బెల్కోరా ఉండలు పెట్టుకుని నా గోడ గుర్రం ఎక్కా.
గరాటా అని నేనంటే బామ్మ నవ్వుతుంది!
దీపం బుడ్డిలో కిరసనాయిలు పొయ్యడానికి చిన్న గరాటా ఉంది. అదిట గరాటా! గల్లా అని కూడా అంటూ ఉంటుంది అమ్మ!
తమలపాకులతో మిఠాయి కిళ్ళీ అలాగే కదా చుడతారు! ఉత్తప్పుడయితే తిననివ్వరు కాని ఏదన్నా పండగొచ్చిందనుకో, బోలుడు పిండివంటలతో భుక్తాయాసం తీరి, తిన్నది అరగడానికి ఇంటిల్లిపాదితో పాటు నాకూ కిళ్ళీ నమలడానికి ఇస్తారు.
బామ్మ స్నేహితురాలు మాణిక్యాంబగారిది బోసినోరు. ఆవిడ పాపం మెత్తగా ఉన్నవే తినగలదు. పండగనాడు తప్పనిసరిగా వస్తుంది ‘భద్రం!’ అంటూ. బామ్మ పేరు భద్రం.
ఆవిడకి బామ్మ బూర్లు పెడితే మొత్తం బూరంతా తినదు. బూరెలోపలి పూర్ణం ముద్దలో పూసకట్టిన నెయ్యి వేయించుకుని తింటుంది. బామ్మకి ఆవిడంటే బోల్డు ప్రేమ! చిన్నప్పటి స్నేహితురాలు మరి! నాకు నాగమణిలాగ!
సున్నం రాసి ఈనెలు తీసి లేత తమలపాకులు, ఉప్పుచెక్కముక్కలు, ఏలక్కాయ, లవంగం, దాల్చినచెక్క ముక్క, జాజికాయ, పచ్చకర్పూరం పిసరు వేసి చిన్న ఖల్వంలో నూరి ఆ ముద్ద ఇస్తుంది ఆవిడకి! ఇత్తడి పాన్‌దాన్ ముందుపెట్టుకుని ఏమిటేమిటి వెయ్యమన్నావు అని ఆవిణ్ణి అడిగి మరీ వేస్తుంది ఎంత ముద్ద చేసినా తినగలదో లేదోనని!
ఇద్దరూ ఒక్క ఈడువాళ్ళేనట! బామ్మకి ఒక్క పన్నూ ఊడలేదు. పాపం ఆవిడది బోసినోరు అయిపోయింది! పళ్ళు లేకపోతే ఎంత కష్టమో కదా!
పళ్ళు ఉన్నా ఏం లాభం? ఆ పళ్ళు బాగోలేక నాగమణి వాళ్ళక్కయ్యకి ఒక్క సంబంధమూ కుదరటంలేదట! ఇవాళ ఉండబట్టలేక బళ్ళో ఆటల పిరీడప్పుడు నాగమణిని అడిగేశా, ఏమయిందే అని! ఈసారి వచ్చినవాళ్ళు చేసుకుంటామనే అన్నారట. ఆ పెళ్ళికొడుక్కి ఎవత్తో ఉందిట! దాన్ని దాచిపెట్టి వాళ్ళవాళ్ళు చేసేద్దామనుకున్నారట!
ముందే తెలిసింది. నయం. అదృష్టవంతులం. లొసుగు వుంది కాబట్టే ఎత్తుపళ్ళయినా చేసుకుంటామంటూ ఒప్పుకున్నారు-అనుకొని వీళ్ళే కాదన్నారట!
వాళ్ళక్క ఎత్తుపళ్ళు మరీ అసహ్యంగా ఉంటాయి. మీది పళ్ళు మూడు కింది పెదిమమీదే ఉంటాయి పెదిమలు మూసేసినా సరే, ఏమిటో! కొందరికి పళ్ళన్నీ లోపల ఎక్కడో ఉండి రెండు పెదిమలూ సమానంగా కలిసిపోయి గీతలా ఉంటాయి. మరి కొందరికి పైపెదిమి ఎత్తుగా ఉండి కింది పెదిమి లోపలికి నొక్కుకుపోయి ఉంటుంది!
అందుకే మరి అందరి నవ్వూ ఒక్కలాగ ఉండదు! కొందరైతే ఎప్పుడూ నవ్వుతున్నట్టు ఉంటారు. అబ్బే, నవ్వరు వాళ్ళు! ఆ పళ్ళ నుంచి మనకి అలా కనబడతారు!
పెద్దతాత పళ్ళే పళ్ళు! బామ్మని చూడ్డానికి వస్తూ ఉంటాడు. బామ్మకి ఏం కాడు. ఆయన్ని అందరూ పెద్దతాత అంటారు అంతే.
ఆయన నవ్వితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది! అందరిపళ్ళూ అలా అందంగా దానిమ్మ గింజల్లా అమరివుంటే ఎంత బావుణ్ణో!
పిన్ని కూతురు రేవతికి పన్నుమీద పన్ను ఎక్కింది. దొంతర పన్ను అంటారట! అది నవ్వితే భలే అందంగా ఉంటుంది. నిజానికి అందంగా కనబడకూడదుగా! అందరూ ఒకలాగ ఉండి ఒకళ్ళు వేరేగా కనబడితే దాన్ని గొప్పగా బాగుందనుకుంటాం కాబోలు! అది నవ్వితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది! అదో అందం అంటుంది బామ్మ. అందాల్లో రకాలున్నాయా?
ఆమధ్య నా పన్నొకటి ఊడిపోయింది. పాలపళ్ళు ఊడిపోయి అలా కొత్త పళ్ళు వస్తాయిట! మరోపన్ను లోపల్నించి ఉన్నదాన్ని తోసేస్తుందన్నమాట. పన్ను ఊడిపోయిందని పట్టుకెళ్ళి చూపిస్తే
“ఊడిందీ? వెళ్ళి ఆ ఎలక్కన్నంలో వేసి ఎలకా ఎలకా నీలా మంచి పన్ను ఇయ్యీ అని దణ్ణం పెట్టు.” అని చెప్పింది బామ్మ. పెరటివేపు కాలువ పక్క గోడకి ఓ కన్నం ఉంది. అదీ ఎలక్కన్నం!
ఎలక పళ్ళు అందంగా ఉంటాయా అని అడిగా. ‘అందం కాదే, ఎలకలా ప్రతీదాన్ని కొరికి కొరికి తినే పన్ను!’ అంటూ అందరూ నవ్వేరు. ఎలకపళ్ళు ఎలా ఉంటాయో? నే చూడలేదు. ఎలక బొమ్మని చూశా. దాంట్లో పళ్ళు వెయ్యలేదు! గబుక్కున కన్నంలోకి దూరిపోయే ఎలకని చూశా!
‘ఊడిపోయిన చోట నాలికతో అస్తమానం గొలక్కు. గొగ్గిపన్ను వస్తుంది.’ అన్నారు.
నిజమే; నాలిక అస్తమానం ఖాళీ చోటికి నాకు తెలీకుండానే వెళ్ళిపోతోంది! ఇదెక్కడి గోలో!
“ఎలక్కి దణ్ణం పెట్టమంటావేమిటీ?” అని మొహం వికారంగా పెట్టా.
“ఎలక వినాయకుడి వాహనం. నీకన్నీ తెలుసునంటావుగా!” అంటూ ఎదురుమాటతో నా నోరు మూసేసింది.
బొజ్జ దేవుడికి దణ్ణం పెట్టాలి. ఆ దేవుడు ఎక్కి తిరిగే ఎలక్కీ దణ్ణం పెట్టాలి. శివాలయానికి వెళ్ళి శివలింగానికి దణ్ణంపెట్టడానికి ముందు నందికి దణ్ణం పెట్టాలి. నందిని పట్టుకుని వేళ్ళ సందులోంచి శివలింగాన్ని చూస్తుంది బామ్మ.
నందికి దణ్ణం పెడితే మరి పందికీ దణ్ణంపెట్టాలా? పందీ దేవుడే. పంది అంటే వరాహం. వరాహం దేవుడే! ఏఁవిటో దేవుళ్ళు అర్థంకారు.
అవునూ, దేవుళ్ళ గురించి ఆలోచనలో పడ్డానేవిఁటీ? ఇలా అందులోంచి ఇందులోకీ ఇందులోంచి అందులోకీ పడిపోతూ ఉంటా!
నాగమణి అక్కయ్య చిన్నప్పుడు పళ్ళు ఊడిపోయినప్పుడు నాలికతో గొలుక్కుందా? అందుకే అలా వచ్చాయా?
కొందరు బాగుంటారు. కొందరు బాగుండరు. బాగుండనివాళ్ళు ఉన్నప్పుడే కదా తతిమ్మావాళ్ళు బాగున్నారని తెలిసేది! నాగమణి అక్కయ్య పళ్ళు అసహ్యంగా ఉండబట్టే కదా మిగతావాళ్ళ పళ్ళు బాగున్నాయి. అంటే బాగులేనివాళ్ళు ఉండితీరాలి. చెడ్డవాళ్ళు ఉంటేనే కదా మంచివాళ్ళు ఎవరో తెలుస్తుంది! అంటే చెడ్డవాళ్ళు తప్పనిసరిగా ఉండాల్సిందే!
అందరి పళ్ళూ పెద్దతాత పళ్ళలా ఉంటే బావుణ్ణు అని ఇందాకా అనుకున్నా. కాని అది తప్పు. అందరివీ అలా ఒక్కలా ఉండకూడదు. బాగుండనివి తప్పనిసరిగా ఉండాలి! ఉండితీరాల్సిందే!
నేను అనుకుంటున్నది తప్పా? ఒప్పా? ఇది వ్యతిరేకపదం. తప్పు ఇంటూ ఒప్పు అని మధ్యలో ఇంటూ పెట్టించి టీచరు రాయించింది కదా!
తప్పు ఉంటేనే ఒప్పు తెలిసేది!
“ఇంకా నీ గుర్రం దిగకుండా కూర్చున్నావేంటి? పద ఇంట్లోకి.”
బుర్రొంచుకొని నా కొత్త ఊహ ధ్యాసలో తప్పో ఒప్పో తెలియక కొట్టుకుంటున్నానేమో, నాన్న సాయంత్రం షైరు నుంచి వచ్చేసి గేటు తలుపులు వేసినట్టే తెలీలేదు. తుళ్ళిపడి తలెత్తి గుర్రం మీంచి ఒక్క దూకు దూకేను.
“నాన్నా! నా ఊహలు జట్కా గుర్రంలా పరిగెడుతూ మధ్యలో గబుక్కున ఇటూ అటూ వెళ్ళకుండా ఆగిపోయాయి ఒక దగ్గరే! నిన్ను చాలా చాలా బోలెడు బోలెడు అడగాలి.” అన్నా.
“సరేలే, అడుగుదువుగాని. ముందు పద ఇంట్లోకి.” నాన్న నా చెయ్యి పట్టుకుని వీధి చీడీ మెట్లు ఎక్కించాడు.