రచయిత వివరాలు

పూర్తిపేరు: నిమ్మగడ్డ శేషగిరి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

సామాన్యంగా అందరూ ఎవరెస్ట్ అని పిలచుకొనే శిఖరాన్ని నేపాల్‌లో సగర్‌మాథా అంటారు. స్వర్గశీర్షమని దాని అర్థం. టిబెట్‍లో ఆ శిఖరాన్ని చోమో లుంగ్మా (పర్వతరాణి) అని పిలుస్తారు. మనిషి కంట అంత సులభంగా పడకపోవడంవల్ల కాబోలు – హిందూ పురాణాలలో ఎవరెస్ట్ ప్రస్తావన దాదాపు లేదు.

మహాకవి కాళిదాసు ఐదవ శతాబ్దంలో తన సంస్కృత కావ్యం కుమారసంభవంలోనూ, అలాగే మన అల్లసాని పెద్దన పదహారవ శతాబ్దంలో మనుచరిత్రలోనూ చూపించిన హిమాలయాల పదచిత్రాలు నా మనసులో నాటుకుపోయాయి. ఆ వర్ణనలలో అతిశయోక్తులు ఉండి ఉండవచ్చు – కానీ అవి అద్వితీయం.

మనసు తరచూ మరో ప్రశ్న వేస్తుంది. ఈ ప్రశ్నకు నా మనసిచ్చే జవాబు – ఖర్చులూ ఫలితాల సంగతి నాకు అనవసరం. ఏదో సాధించాలని నేను ప్రయాణం చెయ్యడం లేదు. ప్రయాణమే నా జీవితం కాబట్టి ప్రయాణాలు చేస్తున్నాను. జీవించడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ప్రయాణం…

డబ్బు సమకూర్చగల అన్ని విలాసాలూ ఆ కారాగారంలో ఉన్నాయి. బహుశా ఈ ల కథెడ్రాల్ జైలు ప్రపంచంలోకెల్లా అతి విలాసవంతమైన జైలయి ఉండాలి. అలాగే ఓ ఖైదీ తనకు తానే నిర్మించుకుని తన వారినే కాపలాగా పెట్టుకొన్న ఏకైక కారాగారమూ ఇదే అయి ఉండాలి. ఎంత తాపత్రయపడినా ఎస్కోబార్‌కు తన స్వంతజైలులోనూ రక్షణ లభించలేదు.

కార్తహేన పాతపట్నపు సందుగొందుల్లో మనసుతీరా తిరుగుతున్నప్పుడు ఓ పందిరి బాట, దిగువన బారులు తీరి ఉన్న చిరుదుకాణాలు కనిపించాయి. అందులో ఒక దానిలో కొకాదాస్ బ్లాంకాస్ అన్న మిఠాయిని అమ్ముతున్నారు. తురిమిన కొబ్బరిని రంగురంగుల తియ్యటి పాకంలో ఉడికించి చేస్తోన్న మిఠాయి అది.

విమానం పైకి ఎగిరినపుడు పైనుంచి కొన్ని ద్వీపాలు కనిపించి పలకరించాయి. ఆ ద్వీపాల మీద అడుగు పెట్టాను, రెండు మూడు రోజులు తిరిగాను అన్న ఆలోచనే నాకు విభ్రమ కలిగిస్తోంది. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతానికి శిలాన్యాసం చేసిన ద్వీపాలవి. జీవరాసుల గురించి ప్రపంచపు అవగాహనను సమూలంగా మార్చిన సిద్ధాంతానికి పుట్టినిళ్ళవి.

క్వెన్క నుంచి గుయాకీల్ 250 కిలోమీటర్లు. మధ్యలో ఒకచోట విరామం కోసం ఆగాం, అంతే. అంతా కలసి ప్రయాణానికి నాలుగున్నర గంటలు పట్టింది. దారంతా వర్షం – బయట అసలేమీ కనిపించనంత వర్షం. క్వెన్క వదిలీ వదలగానే రోడ్డు ఆండీస్ పర్వతాల మధ్య మెలికలు తిరుగుతూ సాగింది.

ఆండీస్ పర్వత శ్రేణి విస్తరించి ఉన్న దక్షిణ అమెరికా దేశాలలో మొక్కజొన్ననుంచి తయారు చేసే చిచా అన్న మదిర తెప్పించుకొని రుచి చూశాను. ఆ పానీయం ఆ ప్రదేశాల్లో మాత్రమే తయారవుతుందట. దాని మూలాలు ఇన్కా నాగరికత పూర్వపుదినాల నాటివట. ఇన్కా ప్రజానీకం కూడా పండుగలు పబ్బాలలో ఈ మదిరను కాచి విరివిగా సేవించేవారట.

ఆ మేడమీది రెస్టరెంటు పాతపట్నపు సంపూర్ణ దృశ్యాన్ని కళ్ళకు కట్టింది. పట్నంలోని ఎన్నో భవనాలూ లాండ్‌మార్కులూ ఆ దీపాల వెలుగుల్లో చక్కగా కనిపించాయి. సెంట్రల్ ప్లాజా, మెట్రోపాలిటన్ కథెడ్రల్, కొండమీద నెలకొన్న వర్జిన్ మేరీ విగ్రహం, ఊళ్ళోని బసీలికా స్పైరు – అన్నీ ఎంతో చక్కగా కనిపించాయి.

నాకు ముందునుంచీ ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలలో యూరోపియన్ల రాకకు పూర్వమే విలసిల్లిన మాయన్, ఇన్కా నాగరికతల విషయంలోను, అవి యావత్ ప్రపంచానికీ అందించిన సాంస్కృతిక వారసత్వం విషయంలోనూ ఆసక్తీ ఆరాధనా ఉన్నాయి. అక్కడి దేశాలలో ఇప్పటికీ కొనసాగుతోన్న ఘనమైన దేశవాళీ సంస్కృతి పట్ల ఆకర్షణ ఉంది.

విమానం గాలిలోకి ఎగరగానే నేను గుడ్‌బై చెపుతున్నది ఒక పనమాకే కాదు; 18 రోజులు తనివితీరా తిరుగాడి ఆయా ప్రదేశాలు, మనుషులు, సంస్కృతులతో సహజీవనం చేసిన యావత్ మధ్య అమెరికాకు అన్న విషయం మనసులోకి ఇంకింది. నేను చేసిన అనేకానేక ప్రయాణాల్లో ఇది ఒక ముఖ్యమైన సంతృప్తికరమైన ప్రయాణం.

మానవ నిర్మాణ అద్భుతాలలో ఒకటైన పనమా కెనాల్ దగ్గర ఆ అపరాహ్ణ సమయం ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా గడిచింది. ఈ కెనాలే లేని పక్షంలో పనమా అనేకానేక చిరుదేశాలలో ఒకటిగా ఉండిపోయేది. ఈ కాలువకున్న వ్యూహాత్మక ప్రాముఖ్యత పనమాను ఒక నిర్దుష్టమైన ఉనికి ఉన్న దేశంగా నిలబెట్టింది.

గ్రనాద నడకరాయుళ్ళ స్వర్గసీమ. పెద్దగా దూరాలేమీ లేవు. ఏ వీధిని చూసినా రంగులీనుతూ కళకళలాడుతూ కనిపించింది. నాలో ఉత్సాహం నింపింది. ఎలాంటి అభద్రతాభావమూ కలుగలేదు. జనజీవితం నింపాదిగా సాగిపోతోంది. మనుషులు సౌమ్యుల్లా కనిపించారు. ఆప్యాయంగా పలకరించారు. స్నేహంగా సాయపడేవారిలా అనిపించారు.

పొరుగున ఉన్న గ్వాతెమాల, ఓందూరాస్ దేశాలలో ఉన్నట్టుగా కాకుండా ఎల్ సల్బదోర్ ప్రజల రూపురేఖలు ఎక్కువగా యూరోపియన్లను పోలి ఉన్నాయనిపించింది. కాస్తంత పరిశోధన తర్వాత అక్కడి జనాభాలో ఎనభై ఆరుశాతం మెస్తీహోలు అని, పదమూడు శాతం యూరోపియన్లు అని, ఒకే ఒక్కశాతం నేటివ్ ఇండియన్లనీ తెలిసింది.

అక్కడి ఒక కూడలిలో ‘చూడు చూడు అంటూ ఒక శిల్పం చూపించాడు మార్కో. అతను ముందే చెప్పిన, హనుమంతుడి పోలికలు పుష్కలంగా ఉన్న ఆకృతి అది. దానికి మార్కో పెట్టిన పేరు ‘మాయన్ హనుమాన్’. ఆమాట అక్కడికి వచ్చిన ఒక భారతీయ టూరిస్టు మార్కోతో అన్నాడట – దాన్ని మార్కో ఖరారు చేసి వాడేస్తున్నాడు.

అడవి వృక్షాలు, వాటిని ఆనుకున్న దట్టమైన పొదలూ లతల మధ్య ఉన్నాయా శిథిలాలు. మేము వెళ్ళినప్పుడు మరికొంత మంది సందర్శకులు ఉన్నారు కాబట్టి సరిపోయింది గానీ లేనట్టయితే అదంతా వింతగా, కాస్తంత భీతి కొలిపేలా అనిపించేదే. అక్కడ అవన్నీ చూపించడానికి సహాయకులు, గైడ్‌లూ లేరు. కనీసం సమాచారం చెప్పే బోర్డులన్నా లేవు.

కొండల వెనకాల నుంచి మా ముందున్న సరోవరాన్ని వర్ణభరితం చేస్తూ సూర్యుడు మెలమెల్లగా రంగప్రవేశం చెయ్యడం కానవచ్చింది. ‘అసలు నువ్వా శునకాలకు థాంక్స్ చెప్పుకోవాలి. వాటి పుణ్యమా అని ఇంత చక్కని ప్రదేశం చేరి సూర్యోదయం చూడగలుగుతున్నావ్’ అని చెణికింది జెమ్మా. ఆమె ఈ ప్రదేశానికి తరచూ వస్తూ ఉంటుందట.

సెంట్రల్ అమెరికా దేశాలు ప్రపంచంలోకెల్లా అతి తక్కువమంది యాత్రికులు తిరుగాడేవి. నేరాల పుట్టలుగా, రాజకీయ అవ్యవస్థ దిట్టలుగా, నియంతల కంచుకోటలుగా, మాఫియా ముఠాలకు స్వర్గసీమలుగా, సైనిక తిరుగుబాట్లకు కేంద్రబిందువులుగా అపార అపఖ్యాతిని గడించాయి. యాత్రికులకు వెంపరం కలిగించే ఖ్యాతి అది.

అందరం సంబరంగా 2020కు స్వాగతం చెప్పాం. చిట్టచివరి సారిగా మొరాకన్ విందుభోజనాన్ని ఆస్వాదించాం. ఎంతో హాయిగా సంతృప్తితో నిద్రాదేవత ఒడిలో సేదదీరాం. తెల్లవారగానే చుట్టూ కమ్ముకున్న కొత్త సంవత్సరపు పరిమళాలను మనసారా ఒంటపట్టించుకుంటూ తిరుగు ప్రయాణం కోసం విమానాశ్రయం దారి పట్టాం.

ఒకే ఒక్కరోజులో మేమంతా నాగరికత నిండిన మరాకేష్‌ నుంచి గంటన్నర దూరం ప్రయాణించి నగరంతో ఏ మాత్రం పోలికలేని కొండచరియల్లో వేలాడే బెర్బర్‌ గ్రామాలను, సారవంతమైన లోయలను, హిమ శిఖరాలను, నిర్జీవపుటెడారులనూ చూడగలిగామన్నది విస్మయ పరిచే విషయం.

స్వీరా నగరాన్ని ఒక ఆరుబయలు మ్యూజియం అనడం సబబు. అక్కడ మనకు లభించగల చక్కని అనుభవం ఏమిటీ అంటే గమ్యమంటూ లేకుండా ఆ నగరపు వీధుల్లో గంటలతరబడి తిరుగాడటం, ఆ ప్రక్రియలో కాస్సేపు మనల్ని మనమే కోల్పోవడం. ఏ ఆలోచనలకూ తావు లేకుండా సేదదీర్చే ఆ వాతావరణం ఏ మనిషినైనా మత్తెక్కిస్తుంది.

మధ్యాన్నం అయ్యేసరికి సూర్యుని ప్రతాపం పెరిగిపోయింది. ఎండ తీక్షణమయింది. వేడి భరించడం కష్టమయింది. మనం వర్ణచిత్రాలలో చూసే ఎడారిలోని ఒంటెల బిడారుల్లో ఈ తీక్షణత గోచరించదు. చిత్రకారుల తూలికలకు అందని అసౌకర్యమది. జీవశక్తిని పీల్చేసే ఆ ఎండల మండిపాటును ప్రత్యక్షంగా అనుభవిస్తే తప్ప ఆ అసౌకర్యాలు మనకు బోధపడవు.

ఈ బృహత్ పర్వతాలు ప్రకృతి మాత దేవాలయాలు, ఈ శిఖరారోహణలు ఆమెకు మనం అర్పించే పూజా నైవేద్యాలు. మేము కూడా తీర్థయాత్రికులమే గదా అనిపించింది. పర్వతాలు ఎక్కడం, పాదయాత్రాంజలులు అర్పించడం, ఆ ప్రక్రియలో మనలోకి మనం తొంగి చూసుకోవడం… అది కదా కొండల మీద నెలకొన్న కోనేటిరాయళ్ళ దర్శనాల అంతరార్థం!

ప్రస్తుత మొరాకో యాత్ర నేను కోవిడ్‌ ఉపద్రవంలో ఎదుర్కొన్న కష్టనష్టాలనుంచి బయటపడటానికి బాగా ఉపకరించింది. మనసుకు ఎంతో అవసరమయిన శాంతిని ఇచ్చింది. నాలో స్ఫూర్తిని నింపింది. ప్రయాణ దాహాన్ని పునరుద్ధరించింది. గత ఆరేళ్ళలో ఇది నా మూడో మొరాకో యాత్ర. అంతా కలసి దాదాపు నెలరోజులు మొరాకోలో తిరుగాడాను. మూలమూలలూ చూశాను.

తిరిగి హోటలుకు వెళ్ళేటపుడు ఆ దేశపు పార్లమెంటు భవనము, సాయుధ రక్షకుల పర్యవేక్షణలో ఉన్న రాజప్రాసాదమూ కనిపించాయి. రబాత్‌ నగరాన్ని నడకరాయుళ్ళ స్వప్నసీమ అనవచ్చు. నగరంలో తిరుగుతోంటే ఆత్మీయంగా అనిపిస్తుందే తప్ప సంభ్రమాశ్చర్యాలు, మనమీద నగరం వాలిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న భావన కలగనే కలగవు.

జిబ్రాల్టర్ జలసంధి దక్షిణ తటాన, మధ్యధరా సముద్రం అట్లాంటిక్ మహాసముద్రాన్ని పలకరించే చోట కాపలా సిపాయిలా నిలచి ఉండే నగరం టాంజియర్. ఆ జలసంధి ఎంతో సన్నపాటిది. ఒకచోట భూభాగాల మధ్య దూరం పదమూడు కిలోమీటర్లే. విరామమంటూ లేకుండా కార్యకలాపాలు సాగే సముద్ర మార్గాలలో జిబ్రాల్టర్ జలసంధి ప్రముఖమైనది.

షెఫ్‌సాన్ ప్రజలు మృదుభాషులు, ప్రశాంతజీవులు. తమ పనేదో తాము చేసుకుంటూ పోయేవాళ్ళు. మరకేష్, ఫెజ్ నగరాల్లో మొహం మీద గుచ్చి గుచ్చి మాట్లాడే మనుషుల్ని చూశాక ఇక్కడివాళ్ళను చూస్తే పిల్లగాలి వీస్తున్నట్టనిపించింది. ఇతర పట్టణాల్లో లాగా ఇక్కడ దళారీల వేధింపులు లేవు. బలవంతపు అమ్మకాలు లేవు.

నాకు ఆశ్చర్యమనిపించింది. ఈ ప్రాంగణం ఎంతో విశాలంగా ఉన్నమాట నిజమే గానీ దీని దిగువున అరవైవేలమంది బానిస ఖైదీలు ఉండటం సాధ్యమనిపించడం లేదు అన్నాను. ఒక గట్టి నిట్టూర్పు విడిచి- వాళ్ళంతా గొలుసులతో గోడలకి కట్టివేయబడ్డారు. నిలబడటానికి కూడా చోటు లేనంతగా కిక్కిరిసి ఉండేదీ జైలు. వాళ్ళల్లో చాలామందికి నిలబడే నిద్రపోవలసివచ్చేది అని వివరించాడు హఫీద్.

ఫెజ్‌లో ప్రతి ఏడాదీ జరిగే ప్రపంచ ధార్మిక సంగీతోత్సవం ఒక విలక్షణ కార్యక్రమం. ఈ ఉత్సవం గురించి షఫియా రైలు ప్రయాణంలో చెప్పింది కూడానూ. ఈ సంగీతోత్సవానికి ప్రపంచపు నాలుగు మూలలనించీ విద్వాంసులు వస్తారట. సూఫీ ఖవ్వాలీల నుంచి హిందూ భజనల దాకా, క్రైస్తవ గీతాల నుంచి బౌద్ధమతపు మంత్రోచ్ఛారణ దాకా విభిన్న బాణీల సంగీత ప్రపంచం.

నమీరూ అతని భార్యా చక్కని ఆతిథ్యమిచ్చే మనుషులు. ఆ రియాద్ వాళ్ళిద్దరి చిన్నపాటి సుందర ప్రపంచం. ప్రపంచపు నలుమూలలనుంచీ వచ్చే అతిథులతో దాన్ని పంచుకోవడం వారికి ప్రీతిపాత్రమైన విషయం. ఫెజ్ నగరంతో స్నేహ సామరస్యాలు సాధించడంలో నమీర్ నాకు ఎంతో సాయంచేశాడు. చక్కని సలహాలూ సూచనలూ ఇచ్చాడు.