రచయిత వివరాలు

పూడూరి రాజిరెడ్డి

పూర్తిపేరు: పూడూరి రాజిరెడ్డి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://raji-fukuoka.blogspot.com/
రచయిత గురించి:

 

రాత్రి పడుకున్నప్పుడు మంచాలను ఎత్తి, అందరూ కిందే చాపలు పరుచుకుని పడుకున్నారు. ఉన్న ఒంటి పరుపును మాత్రం ఒకవైపు వేశారు. ఆ సాకుగా బుజ్జిదీ, పిల్లాడూ అందులో పడుకునేట్టుగా; తనూ, భార్యా పక్కపక్కనే ఉండేట్టుగా ఎత్తువేశాడు రాజారామ్‌. తల్లి ముందటింట్లో మంచం వేసుకుంది. చాలా రోజుల దూరం కాబట్టి, అతడికి ఆత్రంగానే ఉంది. కానీ భార్య పడనియ్యలేదు. బుజ్జిదాన్ని పక్కలో వేసుకుని పడుకుంది.

అన్ని సూత్రాలనూ తుంగలో తొక్కుతున్నవి మాత్రం మొదటినుంచీ ఉల్లిగడ్డలు, టమోటాలు. వాటి ధరల్ని రాసిపెట్టడంలో కూడా అర్థం లేదు. నా జాబితా ప్రకారం వీటి ధరలు: టమోటా 2003లో 8. 2013లో 40. అంటే, రూపాయికి కిలో దాకా కిందికి పడిపోయి మళ్ళీ ఒక దశలో స్థిరపడిన ధరలు ఇవి. ఇప్పుడు వందకు మూడు కిలోలు. ట్రాలీల్లో తెచ్చేవాళ్ళయితే నాలుగు కిలోలు కూడా ఇస్తున్నారు. ఆమధ్య 20కి కూడా కిలో వచ్చింది.

బ్యాగులోంచి అన్నండబ్బాను బయటికి తీయగానే, నాకు మామూలుగా నా భార్య ముఖం గుర్తొస్తుంది. దానిలో ఉన్న పదార్థాలను బట్టి కొంచెం చిరాకో, ప్రేమో కలుగుతుంటుంది. కానీ ఇవ్వాళ నేను ఏ కళన ఉన్నానో – డబ్బా మూత తీయగానే, కొంచెం ముద్దగా అయినట్టుగా ఉన్న అన్నం కళ్ళబడగానే, నాకు ఉన్నట్టుండి మా ఊళ్ళో చిన్నతనంలో చూసిన ఒక గొల్లాయన గుర్తొచ్చాడు. ఆయన ఒక పగటిపూట తన అన్నంమూటను విప్పుకుని తినడం గుర్తొచ్చింది.

ఆ మాట మరి దేనికో తగిలినట్టయిన రంగారెడ్డిలో మళ్ళీ తెలియని భయం ప్రవేశించింది. తెలియకుండానే జేబు మోస్తున్న బరువు స్పృహలోకి వచ్చింది. ఊహల్లో ఉన్నదాన్ని వాస్తవంలోకి తేవడానికి తను పెట్టుకున్న గడువు మరీ దగ్గరగా ఉందేమో. కాలేజీలో చేయలేని ధైర్యం క్యాంపులో మాత్రం వస్తుందా? ఇది కొంత ఇన్‌ఫార్మల్‌గా ఉండగలిగే జాగా కావడంతో ఎక్కువ వీలు ఉంటుందనిపించింది.

ఏ కళైతే మనిషిని తేలికపరుస్తుందనుకుంటామో అదే మళ్ళీ నెత్తిన బరువు కూడా మోపుతోంది. ఏ నీటివల్లయితే బురద అవుతున్నదో అదే నీటివల్ల అది శుభ్రమూ అవుతుందన్నాడు వేమన్న. దీనికి విరుద్ధంగా ఏ కళ అయితే శుభ్రం చేస్తుందనుకుంటున్నామో అదే కళ ఆ కళాకారుడిని మురికిలోకి కూడా జారుస్తోంది. మరి దీనికి ఉన్న మార్గం ఏమిటి?

చదవడానికీ, రాయడానికీ మధ్య లింకు ఇంకా నేను కనుక్కోవలసే ఉంది. చదివితే ఆలోచన వస్తుంది. కానీ చదివినదాన్లోంచి రాదు. ఈ తేడా చాలా ముఖ్యం. ఎక్కడో ఒక కొనను పట్టుకుని పాక్కువెళ్ళడం లాంటిది. లేదా అది మనలోని నిద్రాణంగా ఉన్నదాన్ని దేన్నో తట్టిలేపుతుంది కావొచ్చు. అసలు ఏం జరిగి ఆలోచన వస్తుందో చెప్పలేం.

జీతం అనేది ఒకటి జీవితంలో మొదటిసారి అందుకోవడమూ, అందరమూ ఆ మొదటి తారీఖు రాగానే అకౌంట్స్‌ సెక్షన్‌ ముందు వరుసగా నిలబడటమూ, వాళ్ళు ఒక్కొక్కరినీ రెవెన్యూ స్టాంపులు అంటించిన రిజిస్టర్‌లో సంతకం పెట్టించుకుని, టేబుల్‌ మీద పరిచిన నోట్ల కట్టల్లోంచి మనకో కొన్ని కాగితాలు చిల్లర పైసలతో సహా లెక్కించి చేతికి ఇవ్వడమూ; కొన్నాళ్ళు పోయాక చెల్లింపుల్ని కొంత నాగరికపరిచి, ముందే అందరి డబ్బుల్నీ ఎవరి కవర్లో వాళ్ళకు వేసి పిన్‌ చేసి ఉంచడమూ;

నేను యూట్యూబులో ఒకే ఒక్కసారి మా పెద్దోడు నడవడానికి ముందు కాళ్ళు హుషారుగా టపటపలాడించే వీడియో పోస్టు చేయడానికిగానూ అకౌంట్ ఓపెన్ చేశాను. దానికి పాస్‌వర్డ్ ఏదో ఉంటుంది. నాకే గుర్తులేదిప్పుడు. ట్విట్టర్ కూడా ఓపెన్ చేశాను. కానీ వాడట్లేదు. అయినా దానికి కూడా ఏదో ఉండేవుంటుంది. గూగుల్ ప్లస్ కూడా ఏదో ఉన్నట్టుందిగానీ దానిలో నేను ఉన్నట్టో లేనట్టో నాకే తెలీదు.

బయటి చలి వెన్నులో కూడా అనుభవమైంది. అటునుంచి ఎవరూ రావట్లేదని నిర్ధారణ కోసం ఒకసారి చెవిని మళ్ళీ కొంచెం ముందుకు వంచాడు. ఏ అలికిడీ లేదు. చల్లటి నీళ్ళలో అడుగు పెట్టేముందు అనుభవించే క్షణకాలపు తటపటాయింపు. నెమ్మదిగా కుడికాలు మోపాడు. ఏమీ తెలియలేదు. రెండో అడుగు కూడా పడ్డాక మొత్తం మనిషి బరువు పడటం వల్ల చెక్క క్రీక్‌మంది. ఒక క్షణం ఆగి, మళ్ళీ పైకి కదిలాడు.

నిశ్చల స్థితికి గుండె చప్పుడే అడ్డుపడుతూ. అస్తిత్వానికి ఏ అదనపు ప్రాధాన్యతా లేదు. నువ్వూ ఈ ప్రకృతిలో భాగమే అని కణకణంలోనూ ఇంకించుకుంటే గనక సాటిజీవిని అపార కరుణతో చూస్తావు. నేను ప్రత్యేకమనే అతిశయమేదో డ్రైవ్‌ చేయకుండా మనిషనేవాడు ఎట్లా బతకాలి? అందరూ అదే అతిశయంలోకి వచ్చాక అది అతిశయం కాకుండా పోతుంది. అప్పుడు ముందువరసలోని వాళ్ళు ఇంకో అతిశయాన్ని మోస్తూవుంటారు కదా?

ఒక పెద్ద భూకంపం, నా ఊహల్లో కూడా లేనంతటి పెద్ద భూకంపం వచ్చి, ఈ ప్రపంచం తలకిందులైపోతే ఇప్పుడున్నవన్నీ అర్థంలేనివైపోతాయి. భూముల రిజిస్ట్రేషన్లు, ఐఫోన్లు, సాఫ్ట్‌వేర్లు… అప్పుడు నాలుగ్గింజలు పండించుకోవడమే ప్రధానం అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ దానికనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. స్కిల్స్‌ రీడిఫైన్‌ అవుతాయి. బలంగా తవ్వేవాడే అవసరం అవుతాడు. పంట పండించినవాడే మొనగాడు అవుతాడు.

నిబంధనల ప్రకారం అర్ధగంట ముందు మాత్రమే వదిలెయ్యడానికి వీలుంది. దానికోసం తొమ్మిది మంది కాచుకుని ఉన్నారు. చివరి పది నిమిషాల వరకూ ఆరుగురు మిగిలారు. గంట మోగిన తర్వాత కూడా రాస్తూ ఉండిపోయిన వాళ్ళు ఇద్దరు. అన్నీ తీసేసుకుని, హాల్‌టికెట్ల ప్రకారం ఆర్డరులో సర్దుకుని, కవర్లో పెట్టేసుకుని, వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తును జాగ్రత్తగా చేతుల్లో మోస్తున్నంత బరువుగా గదిలోంచి బయటకు.

మేము రిసెప్షన్‌ను దాటుతున్నప్పుడు రిసెప్షన్‌లో ఇందాక కూర్చున్న అబ్బాయి మా వెనకే వచ్చాడు. ‘సర్, మీరు రేపు మానింగ్‌ కచ్చితంగా వస్తారా?’ మరీ నిలదీసినట్టు అడిగితే ఏం చెప్పాలి? బహుశా నా ముఖంలో డాక్టర్‌కు పూర్తి ఆమోదముద్ర కనబడలేదేమో. అందుకే స్పష్టత కోసం పంపివుంటాడు. నూరు శాతం వస్తామని చెప్పడానికి నోరు రావడం లేదు, అట్లా అని రాము అని చెప్పలేకున్నాను.

ఈ భార్యాభర్తలు ఎక్కడికో వెళ్ళే తొందరలో ఉన్నారు. టైమవుతోందని ఆమె ఒకటే గొణుగుతోంది. మిషన్‌ దగ్గర ఉన్నతను డబ్బులు చేతిలోకి తీసుకోగానే, ఇంక ఎటూ నేను హడావుడిలో ఉన్నాననే ఒక తెలియని అధికారంతో ముందటి ముసలాయన్ని కాదని ఇతడు ముందుకు పోబోయాడు. ఆ ముసలాయన ఏమీ తొణక్కుండా, ‘హలో! నేను ఇక్కడొకణ్ని లైన్లో ఉన్నాను’ అన్నాడు. చేసేదేమీలేక అతడు చేతులు జోడించి సారీ చెబుతూ, భార్య ముఖం వైపు చూసుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేశాడు.

ఒకావిడ, ముఖం గుర్తు లేదు, వయసులో చిన్నదే, కానీ అందరమూ బహుశా ఆమె కోసమే ఎదురు చూస్తున్నంత ప్రాధాన్యత గల మనిషి, వడిగా అడుగులేస్తూ లోపలికి వస్తోంది. మాలో మేము ఏదో మాట్లాడుకుంటున్న మా దృష్టి ఆమెవైపు మళ్ళింది. చిత్రంగా, ఆమెతోపాటు వెంట వస్తున్న నలుగురైదుగురిలో బాల్‌రెడ్డి ఉన్నాడు. ఇతనిది మా ఊరే. నాకు చిన్నప్పటినుంచీ పరిచయం. ఇద్దరమూ మనసారా కళ్ళతో పలకరించుకున్నాం.

పెద్దోడు ఆ ఎర్రరంగు బాల్‌ను గట్టిగా తన్నాడు, ఈ చిన్నోడు దాన్ని ఆపలేక దాని వెనకాలే పరుగెత్తాడు. ఇద్దరూ నైట్‌ప్యాంట్లు వేసుకున్నారు. ఇద్దరి కాళ్ళకూ బూట్లు ఉన్నాయి. పెద్దోడు నల్లచొక్కా తొడుక్కుంటే, చిన్నోడు టీ షర్ట్‌ వేసుకున్నాడు. చిన్నోడికి మొన్న మొన్నే హెయిర్‌ కట్‌ చేసినట్టుగా కొంత మొండి తల కనబడుతోంది. పెద్దోడి బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయి. వాడు పరుగెత్తినప్పుడు వాడి నల్లటి జుట్టు కూడా వాడిలాగే గంతులేస్తోంది.

పోతూ వస్తూ దాటేసుకుంటూనే ఉంటాం. కానీ ఇంతకాలమైనా పరిచయం కాకుండా ఎందుకు ఉండిపోయింది? మనతో ప్రత్యేకించి పని పడకపోతే, ఉద్యోగరీత్యా సంభాషించుకోవాల్సిన అవసరం రాకపోతే ఎలా పరిచయం అవుతుంది? పనిగట్టుకొని పరిచయం చేసుకోవడంలో నాకు ఉత్సాహం లేదు. జరిగిపోవాలంతే. మన చుట్టూనే జీవితాలు ప్రవహిస్తూవుంటాయి. మనం వాటిని ఖండించుకుంటూనో, ఒరుసుకుంటూనో పోము. అసలు ఆ ప్రవాహానికీ మనకూ నిమిత్తమే లేదు. ఇదెంత శూన్యం?

ఆ అన్న తినడం పూర్తి చేసి, చేయి కడుక్కుని తుడుచుకుంటూ వచ్చి, మళ్ళీ ఇందాకటి కుర్చీ మీదే కాళ్ళు ముడుచుకుని కూర్చుంటూ ‘ఏం తమ్ముడూ ఏం సంగతి?’ అన్నట్టుగా కొన్ని వివరాలు అడిగాడు. చాలా క్యాజువల్‌గా మాట్లాడుతున్నవాడల్లా కుర్చీలోకి మరింత ఒరుగుతూ, నా ముఖాన్ని పరీక్షగా చూసేలా తల పైకెత్తి, ‘డైరెక్టర్‌ అవడమంటే మాటలా?’ అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. ‘చూడు, ఈ ప్రశ్నకు జవాబు చెప్పు? ఒక తల్లి తన కొడుక్కు పాలిస్తున్నప్పుడు ఆమె చేతులు ఎక్కడుంటాయి?’

సాధారణంగా పొద్దున పొద్దున్నే టీవీ పెట్టను. కానీ ఒక్కోసారి పిల్లలు స్కూలుకు వెళ్ళిపోయాక ఏర్పడే నిశ్శబ్దాన్ని శబ్దంతో భర్తీ చేయాలనిపిస్తుంది. సినిమా, ట్రావెల్, ఫుడ్ ఇవి నా ప్రయారిటీలు. శబ్దం మరీ ఎక్కువైందన్నట్టుగా పెట్టగానే ఏదో ఫైట్ వస్తోంది. మహేశ్‌బాబు సినిమా. తలల మీద ఇటుకలు పగులుతున్నాయి. గోడలకు వెళ్ళి గుద్దుకుంటున్నారు.

వాతావరణం ఒక్కసారి స్తంభించిపోయింది. బీడీల చేతులు ఆగిపోయినై. టీవీ నడుస్తుందన్నట్టేగానీ తెలియని నిశ్శబ్దం ప్రవేశించింది. నేను జయక్కతో కళ్ళు కలపకుండా, అసలు ప్రత్యేకంగా ఎవరి మీదా చూపు నిలపకుండా అలాగే కూర్చున్నాను. ఎన్ని సెకన్లు దొర్లిపోయినై? అంతమందిలో ఎవరో కిసుక్కుమన్నారు. ఇక, నవ్వడమా మానడమా అన్నట్టుగా ఆగి నవ్వి ఆగి నవ్వి ఒక్కసారిగా అందరూ బద్దలైపోయారు.

చిన్నోడికి రోజూ ఓ కథ కావాలి. పెద్దోడికీ ఆసక్తేగానీ అడుగుతాడు, వదిలేస్తాడు; వీడంత మంకుపట్టు పట్టడు. తెనాలి రామకృష్ణ కథలు, ఈసప్‌ కథలు, అక్బర్‌ బీర్బల్‌ కథలు, మర్యాద రామన్న కథలు, ఇట్లాంటివేవో నాకు గుర్తొచ్చినవి చెప్తుంటాను. ఒకరోజు, ఎంత గింజుకున్నా ఏ కథా గుర్తు రాక, ఏదో మేనేజ్‌ చేయొచ్చని డోరియన్‌ గ్రే మొదలుపెట్టాను.

ఈలోగా ఇంకో నంబర్ నుంచి కాల్ రావడం మొదలైంది, “…ఎక్కడ పడిపోయారండీ?” అంటూ. మామయ్య అందా, నాన్న అందా? పిల్లర్ నంబర్ థర్టీన్ అని చెప్పాను. రోడ్డుకు అటువైపా? ఇటువైపా? రైతుబజార్‌కు ఎంతదూరం? కుడిపక్కా, ఎడమపక్కా అంటూ వచ్చిన ప్రశ్నలకు జవాబు చెబుతూనే ఇంకో షాపులోకి వెళ్ళాను. నేను అడిగింది కాక ఇంకేదో పేరు చెప్పి, అది ఉందన్నాడు.

ఫిల్టర్‌లో నీళ్ళు పోయడం, కూరగాయలు కోయడం, పాలప్యాకెట్‌ కట్‌చేసి గిన్నెలో పోయడం, పిల్లలకు స్నానాలు చేయించడం, రేపు ఉదయానికని గుర్తుపెట్టుకుని ఇవ్వాళ రాత్రే రెడ్‌ రైస్‌ నానబెట్టడం… ఇవన్నీ నా పిల్లలమ్మ పనులు. అయినా, అవన్నీ నేను చేసిపెడతాను, నా పనితీరు తను మెచ్చకపోయినా.

ఇన్ని ఆడ పనులు చేయగలిగినవాడిని, బట్టలు మాత్రం ఉతకలేను.

డిగ్రీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు రామ్‌నగర్లో కిరాయికున్నాం. ఒకరోజు మధ్యాహ్నం మావాళ్ళు ఎటో పోయినట్టున్నారు; నేను ఒక్కడినే ఉన్నాను. ఓనర్‌వాళ్ళ కోడలు మా రూమ్ దగ్గరికి వచ్చింది. వాళ్ళు కూడా పై అంతస్థులోనే ఉండేవాళ్ళు. బ్యాచిలర్ వయసులో కబుర్లకు కారణమయ్యేంత చక్కగా ఉంటుంది. అందుకే ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసు. అయితే, ఆమెతో నాకు పెద్ద పరిచయం లేదు.

చద్దరు నాలుగు మూలలు
సరిగ్గా వచ్చేలా మడతపెట్టడం కూడా
చాలా పెద్ద విషయం అయినప్పుడు,
ఎంత చిన్న విషయానికైనా
నూటా ముప్పైరెండోసారి బాధపడటం

అతడిని భార్య అడిగింది:
“మీరు ఇంతకు ముందు చిన్న విషయానికి కూడా నాతో కొలుచుకునేవారు.
ఇప్పుడు మౌనంగా అన్నీ స్వీకరిస్తున్నారు.
మీరు మంచివాళ్ళయ్యారా?”

మంగళవారమో, బుధవారమో సాయంత్రం మా పిల్లలు ఆడుతూ ఆ దీగుడు తలుపు తెరిచారు. అందులో రెండు అరలీటర్ పేకెట్లు కనబడినై, జున్నయిపోయి! అంటే, యాదయ్య ఆదివారం నాడు మాకు పాలు వద్దని చెప్పిన విషయం మరిచిపోయి వుంటాడు కాబట్టి వేశాడు. పైగా ఖర్మకొద్దీ ఆ రోజున ఓనరంకుల్ గేటు తీయకముందే వచ్చివుంటాడు. లేదంటే, మా ఓనర్ వాళ్ళయినా చెప్పివుండేవాళ్ళు.

ఈ పుస్తకాలను చదవడం ఒక ఆసక్తి అయితే, ఈ పేరు ద్వారా ఆమెను నేను ఊహించుకోవడం మరొక ఆసక్తి. అత్యంత సంప్రదాయమైన పేరుగల ఈవిడ నాకెందుకో ఒక పద్ధతిలో సెక్సీగా ఉన్నట్టు తోస్తుంది. అయితే ఆమెను నేను ఎప్పుడూ చూడలేదు. ఒకరిని కేవలం కుతూహలం కొద్దీ వెళ్ళి చూసి వచ్చే స్వభావం కాదు నాది. అలాగని ఆమె ఎదురైతే మాత్రం కచ్చితంగా సంతోషిస్తాను.

ఇప్పుడే ఇదే దృశ్యాన్ని– భార్య తన కమిలిన చేతిని సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు చూపించే సన్నివేశాన్ని– యథాతథంగా సాహిత్యంలోకి తేవడం ఎట్లా? దీన్ని డ్రమటైజ్ చేశామా, వాస్తవం పక్కకు పోతుంది; పోనీ ఉన్నది వున్నట్టు చెప్దామా, ఆ ఎఫెక్ట్ రాదు. అందుకే, సాహిత్యం చెప్పగలిగేది జీవితమంతటిది ఉండొచ్చు గానీ, జీవితం మొత్తం తన పూర్తి ముఖంతో సాహిత్యం లోకి వస్తుందన్న నమ్మకం నాకు కలగడం లేదు.

అది జరిగిన తర్వాత, చాలా నెలల పాటు, ఆ సన్నివేశం నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేది. నేనా పెద్దాయనను చిన్నబుచ్చి వుంటానా? పక్కవాడు పాదాభివందనం చేసినప్పుడు, నా నుంచి కూడా ఆయన అదే ఆశించి వుంటాడా? అసలు ఆయన పట్టించుకున్నాడా? కానీ ఇద్దరి మర్యాదలోనూ స్పష్టమైన తేడా కనబడినప్పుడు, లిప్తమాత్రంగానైనా గమనించకుండా ఉంటాడా?

అక్కడకు ఎలా వెళ్ళాలి? వెళ్ళినా అసలు ఎలా అడగాలి? నేను ఏ పనిని కూడా అలా చేసేయలేను. దాని గురించి కొంత ఆలోచించాలి; మథనపడాలి; గింజుకోవాలి; అప్పటికి గానీ సంసిద్ధుణ్ని కాలేను. అందులో భాగమే ఆ మానసికపు కసరత్తంతా!