అందం

మా చిన్నోడికి మా తాత రంగు వచ్చివుండాలి. చిన్నోడు నల్లగా ఉన్నాడని నేనెప్పుడూ అనుకోలేదు గానీ, వాళ్ళమ్మ మాత్రం ‘కర్రోడా’ అని ఉడికిస్తూ వుంటుంది. వాడికి బట్టల మీదా, తయారవడం మీదా పట్టింపు ఎక్కువ. ‘అమ్మా, ఎల్లుండి ఊరికి పోయేటప్పుడు నాకు ఏ డ్రెస్‌ ఏస్తవ్‌?’ అని ముందే తెలుసుకునేంత! ఈ పట్టింపును వాడి రంగుతో చెక్‌ పెట్టేస్తుంటుంది: ‘నువ్వు ఏదేసుకున్నా అంతే తియ్‌రా!’

పిల్లల్ని కూడా తల్లులు అలా టీజ్‌ చేస్తారనీ, అలా చేయడం అంత అసాధారణ విషయం ఏమీ కాదనీ నాకు పెళ్ళయిన తర్వాతే అర్థమైంది. అది అర్థమయ్యాకే నేను నా భార్యను ‘తొంటదానా’ అని వెక్కిరించడం మొదలుపెట్టాను.

చిన్నోడికి రోజూ ఓ కథ కావాలి. పెద్దోడికీ ఆసక్తేగానీ అడుగుతాడు, వదిలేస్తాడు; వీడంత మంకుపట్టు పట్టడు. తెనాలి రామకృష్ణ కథలు, ఈసప్‌ కథలు, అక్బర్‌ బీర్బల్‌ కథలు, మర్యాద రామన్న కథలు, ఇట్లాంటివేవో నాకు గుర్తొచ్చినవి చెప్తుంటాను. కొన్నిసార్లు సినిమాలను వాళ్ళకు అనువుగా మలిచి చెబుతాను. ఒకరోజు, ఎంత గింజుకున్నా ఏ కథా గుర్తు రాక, ఏదో మేనేజ్‌ చేయొచ్చని డోరియన్‌ గ్రే మొదలుపెట్టాను. మొదలయ్యీ కాకుండానే, “డోరియన్‌ గ్రే అందంగా ఉంటడ్రా” అని చెప్పాను.

“అందంగా అంటే ఎట్లుంటడు నానా?” అడిగాడు చిన్నోడు.

“అదేరా, అందం అంటే చూసుటానికి మంచిగుంటరు గదా, నీకు దెల్వదా?”

“అట్లగాదు నానా, తెల్లగుంటడా ఆయన?”

“అవున్రా తెల్లగ, పొడువుగ ఉంటడు.”

చాలాసార్లు జరిగినట్టుగానే, వింటూనే వాళ్ళు నిద్రలోకి జారిపోయారు.

తెల్లారి నేను జిమ్‌కు వెళ్ళాను. ఈమధ్యే ఒక మూడు నెలల కోసమని మొదలుపెట్టాన్లే! ట్రెడ్‌మిల్‌ మీద ఎంతసేపని అలా ఖాళీగా ఉరుకుతాం? ఏవేవో ఆలోచనలు నాతో పాటు పరుగెడుతూ ఉంటాయి.

‘అయ్యో నా బంగారం, వాడు ఏమడిగిండు నన్ను, నేనేం జెప్పిన?

నాకు ఎంత సిగ్గయిందంటే–నేను వచ్చేసరికి వాడు స్కూలుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ వాణ్ని సాయంత్రం ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూడటం మొదలుపెట్టాను.

అందంగా ఉండుడంటే తెల్లగ, పొడువుగ ఉండుడా… నీట్‌గ పళ్ళు తోముకునుడు, శుభ్రంగా స్నానం జేసుడు, మంచిగ బట్టలేసుకునుడు… ఇట్లా చెప్పొచ్చని నాకు ఎందుకు తోయలేదు!’