మెట్లు
ఆ చీకట్లో తీరా మెట్ల దగ్గరికి వెళ్ళాక గమనించాడు. వాటి మీద అడుగు వేస్తే నిలుస్తాయన్న నమ్మకం కుదరలేదు. చెక్కలు బాగా పాతవి. మరొకటీ గమనించాడు. బయట చీకటిగా ఉన్నప్పటికీ మెట్ల మీద కొద్దిపాటి వెలుతురు పడుతూవుంది. అదెక్కడనుంచి వస్తుందో తెలియలేదు. ఈ మెట్లు దేని ఊతంగా నిలబడివున్నాయో కూడా కనబడలేదు. కానీ పైకప్పు మాత్రం వేసివుంది. ఉన్నట్టుండి ‘కూకుక్ కూకుక్’ అని ఏదో అరుపు పైనుండి వినబడింది. మెడంతా వంచి పైకి చూశాడు. ఒక మనిషి అటునుంచి వస్తుంటే ఇటునుంచి ఇంకో మనిషి వెళ్ళడం కష్టం. అంత ఇరుకు. పైగా మరీ నిటారుగా ఉన్నాయి. ఏ పిట్టా కనబడలేదు. ‘కూకుక్’. ‘కూకుక్’. తనకు తెలిసిన పిట్టల అరుపుల్లో ఈ శబ్దాన్ని పోల్చుకున్నాడు. స్ఫురించలేదు. తీరా పైకి ఎక్కాక కంట్లో పొడిస్తే! బయటి చలి వెన్నులో కూడా అనుభవమైంది. అటునుంచి ఎవరూ రావట్లేదని నిర్ధారణ కోసం ఒకసారి చెవిని మళ్ళీ కొంచెం ముందుకు వంచాడు. ఏ అలికిడీ లేదు. చల్లటి నీళ్ళలో అడుగు పెట్టేముందు అనుభవించే క్షణకాలపు తటపటాయింపు. నెమ్మదిగా కుడికాలు మోపాడు. ఏమీ తెలియలేదు. రెండో అడుగు కూడా పడ్డాక మొత్తం మనిషి బరువు పడటం వల్ల చెక్క క్రీక్‌మంది. ఒక క్షణం ఆగి, మళ్ళీ పైకి కదిలాడు. కనబడకుండా లేచిన దుమ్ము వల్ల ముక్కుపుటాలు చిమచిమతో గుండ్రంగా విచ్చుకున్నాయి. నిటారుగా ఒక్కో మెట్టే ఎక్కుతుంటే గుండెలో బరువు పెరుగుతోంది. పిట్ట ధ్వని మాత్రం నిలిచిపోయిందని గ్రహింపు కలిగింది. ఇంకొన్ని మెట్లు ఎక్కాక పిట్ట ఎగిరిపోయిన రెక్కల చప్పుడు. అది కొద్దిపాటి ధైర్యం ఇచ్చింది. ఆ పక్షి కనీసం పావురం పరిమాణంలో ఉంటేగానీ ఆ ధ్వని, ఆ రెక్కల చప్పుడు నప్పవు. మరికొన్ని మెట్లు ఎక్కాక, ఎంత దూరం వచ్చానా అని జాగ్రత్తగా మెడ తిప్పి చూశాడు. దాదాపు సగానికి చేరాడు. మళ్ళీ మెడ తిప్పి, ఇంకొక్క అడుగు పైకి వెయ్యడమూ, మధ్యలో క్రీక్రీక్రీక్‌మని విరిగి మొదటి మెట్టూ చివరి మెట్టూ కలిసిపోవడమూ, దానితో పాటు గాల్లో కిందికి జారుతున్నప్పుడు ఆధారం కోసం పెనుగులాడుతున్నప్పుడే అది కల అని తెలిసిపోవడమూ… కానీ భయం మాత్రం శ్వాసంత వాస్తవంగా నా లోపల కదులుతూవుంది.
దృక్పథం
పంజాగుట్ట నుంచి అమీర్‌పేట దారిలో ప్రయాణిస్తుంటే, ఒక పెద్ద ఓడలాంటి షాపింగ్ మాల్ ఏదో నిర్మాణం అవుతోంది. ఎంతసేపు పోయినా అది పూర్తవతున్నట్టేలేదు. అబ్బబ్బబ్బబ్బ… వీడు ఇంత భారీగా కడుతున్నాడంటే, కచ్చితంగా నా జేబులో చెయ్యి పెట్టబోతున్నట్టే అనుకున్నాను. ఇక దానికనుగుణమైన ఆలోచనలన్నీ తిరిగాయి. ఎటూ అందులో ఒకట్రెండు సినిమాలైనా చూస్తాను, కుతూహలం కోసమైనా ఏదో ఒకటి తింటాను, పిల్లల కోసమైనా బట్టలో ఏవో కొనకపోతానా? అంటే, పోస్ట్ డేటెడ్ చెక్కులు రాసిచ్చినట్టే.
అయితే, బస్సు చర్మాస్ స్టాప్ దాటుతూవుండగా, దీన్నే పూర్తిగా తిరగేసి పక్కనవున్న మిత్రుడికి చెప్తున్నాను. ఓ, మీకు చెప్పలేదు. నేను ఊహల్లో ఏం చేస్తానంటే, నా ఆలోచనలన్నిటినీ ఎవరితోనైనా సంభాషిస్తున్నట్టుగా మనసులోనే పర్ఫార్మ్ చేస్తూవుంటాను. ఇదొక చిత్రమైన జబ్బే కావొచ్చు. కానీ ఏం చేద్దాం? అందుకే అనుకుంటాను: నేనెప్పుడూ ఒకణ్ని కాదు, ఇద్దరం.
‘చూశావా, నా జేబులో ఉన్న ముష్టి చిల్లర డబ్బుల్తో వాడితో నేను ఇంత పెద్ద కాంప్లెక్స్ కట్టిస్తున్నాను.’
‘ఊఁ బాగుంది. కానీ ఇట్లా తిరగేసి అర్థంచేసుకోవడం వల్ల ఏం వస్తుంది మీకు?’ అని ఆ మిత్రుడితో ప్రశ్న వేయించి, నేను జవాబు చెబుతాను: ’శాంతి. నేను అటువైపు మాత్రమే ఆలోచిస్తే నా లోపల ఘర్షణ మొదలవుతుంది. కానీ ఇటువైపునుంచి కూడా చూడటం మొదలుపెట్టగానే, లోపల శాంతి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాంతో ఘర్షణ దానికదే సమసిపోతుంది. నాతో నేను శాంతి పొందడం ఒక్కటే ఈ జీవితకాలం నేను చేస్తున్న సాధన.’