కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం

“Genius is ninety nine percent perspiration and one percent inspiration.” – Thomas Alva Edison (1847-1931)

శ్రీకృష్ణదేవరాయల (1471-1529) వారి ఆముక్తమాల్యదలో అద్భుతమైన ఋతువర్ణనలున్నాయి. వానాకాలంపై ప్రఖ్యాతిచెందిన పద్యం, “ఇల్లిల్లు దిరుగ నొక్కింతబ్బు శిఖి యబ్బెనే నింటిలో బూరి యిడి విసరక రాజదు“. ఇది 1974 వరకూ నేను పెరిగిన రావినూతలలోని వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తుంది. అప్పట్లో ఎక్కువమంది ఇళ్ళల్లో అగ్గిపెట్టెలుండేవి కావు; ఇల్లిల్లు తిరిగి నిప్పు తెచ్చి, పొయ్యి రాజేసి, గొట్టంతో ఊదుతూ ఆడవాళ్ళు నానాయాతన పడేవాళ్ళు. నేను పైచదువులకి విజయవాడ వెళ్ళేదాకా, మా ఊరికి గాస్, కరెంటు, ఫోను సౌకర్యాలు లేవు. రాయల తర్వాత నాలుగు వందల ఏళ్ళకి పైగా మన పల్లెటూరి జీవితంలో పెద్ద మార్పు లేదు.

అలాగని మా ఊరు బొత్తిగా నాగరికత లేని నాటు దేశం కాదు. ఓ చక్కని హైస్కూల్ ఉంది. గ్రంథాలయం లేకపోయినా, రెండు మూడు కాఫీ హోటళ్ళున్నాయి. అక్కడ ఇడ్లీ, దోశె కొనుక్కోలేకపోయినా, దయతలచి దినపత్రిక చదువుకోనిచ్చేవాళ్ళు. మా ఊరి పంచాయతీ ఆఫీసులోనూ, ఇద్దరు ముగ్గురు డబ్బున్నవాళ్ళ ఇళ్ళల్లోనూ రేడియో ఉండేది. ఆ రేడియో భోషాణమంత ఉండడం వల్ల, ఒకచోట పెడితే దానిని ఇక కదిల్చే ప్రసక్తి లేదు. దగ్గరి బస్తీలో పని చేసే ఉద్యోగస్థులు సెలవులకి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు కాలక్షేపానికి చేతితో మోయగలిగేటంత చిన్న ట్రాన్సిస్టర్ రేడియో తెచ్చుకునేవారు; భోషాణమంత రేడియో చేతితో మోయగలిగేటంత చిన్నదిగా అవడానికి కారణం, ఆ రోజుల్లోనే రేడియో టెక్నాలజీ శూన్యనాళిక (vacuum tube) నుండి ట్రాన్సిస్టర్‌కి (transistor) మారడం.

నేను 1976-81 మధ్యలో వరంగల్‌‌లో ఇంజనీరింగ్ చదివేటప్పటికి మన దేశంలో బి.టెక్. స్థాయిలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఇంకా మొదలు పెట్టలేదు. అయినా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్సొకటి తీసుకున్నాను. అప్పుడు మా కాలేజీలో కంప్యూటర్ లేకపోవడాన ప్రోగ్రామ్‌లు రాయడం మాత్రం పెన్సిల్‌తో కాగితం మీదే. ప్రోగ్రామ్‌లో చిన్న తప్పు చేసినా, ప్రొఫెసర్ సున్నా మార్కులు ఇచ్చేవాడు. అది న్యాయం కాదని మేము ఫిర్యాదు చేస్తే, ఆయన, “మీరెవరూ కంప్యూటర్ వాడలేదు, ప్రోగ్రామ్‌లో ఎంత చిన్న తప్పు ఉన్నా, కంప్యూటర్ ప్రోగ్రామ్‌ని తిప్పికొడుతుంది,” అని నవ్వుతూ చెప్పేవాడు.

తర్వాత 1981-1983 మధ్యలో నేను మద్రాసులో యం.టెక్. కంప్యూటర్ సైన్స్ చదవడానికి వెళ్ళిన మొదటి రోజునే ప్రొఫెసర్ కె. బి. లక్ష్మణన్ క్లాసులో, “మీలో ఇంతవరకూ కంప్యూటర్ వాడని వారెవరు?” అని అడిగితే, నేను చెయ్యెత్తి చుట్టూ చూశాను – దేశంలో పలుచోట్ల నుండి వచ్చిన పాతికమందిలో, సగం మందయినా నాలాంటి వాళ్ళు ఉంటారనుకుంటే, చెయ్యెత్తిన వాణ్ణి నేనొక్కణ్ణే. మర్నాటి నుండి, వేకువఝామునే లేచి కంప్యూటర్ సెంటర్‌కి వెళ్ళి కంప్యూటర్ వాడటం నేర్చుకున్నాను. రాసుకున్న ప్రోగ్రామ్‌ని బెజ్జాలు వేసే యంత్రం (punching machine) సహాయంతో రంధ్రాల కార్డులు తయారుచేసి పొద్దున్న ఇస్తే, మధ్యాహ్నానికి కంప్యూటర్ మీద రన్ చేసి ఇచ్చేవాళ్ళు. ఏదన్నా పొరబాటు చేస్తే మళ్ళా రాత్రి దాకా రన్ చేసే అవకాశం లేదు.

మద్రాసులో ఇన్స్టిట్యూట్ అంతటికీ కలిపి ఒకే ఒక కంప్యూటర్ ఉండేది. మా డిపార్ట్‌మెంట్ బిల్డింగులో ఓ అంతస్తులో సగభాగాన్ని అదే ఆక్రమించేది; జాగ్రత్తగా ఎయిర్ కండీషన్ చేసిన గదిలో ఉన్న కంప్యూటర్ దగ్గరకి కూడా మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. ట్రాన్సిస్టర్ రేడియోలో పది పన్నెండు ట్రాన్సిస్టర్లు ఉంటే ఈ కంప్యూటర్ లో కొన్ని లక్షల ట్రాన్సిస్టర్లు ఉండేవి.

1980 లో ప్రపంచంలో కెల్లా శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ఖరీదు కొన్ని మిలియన్ల డాలర్లు. ఇప్పుడు నగరాలలోనే కాక రావినూతల లాంటి పల్లెటూర్లలో కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ సెల్ ఫోన్‌లు ఉన్నాయి; కానీ అప్పుడు సంపన్నదేశాలలోని కొన్ని ప్రభుత్వసంస్థలకి తప్ప వేరెవరికీ సూపర్ కంప్యూటర్‌ను భరించగల తాహతులేదు. నిజానికి ఆ సూపర్ కంప్యూటర్ కంటే ఈనాడు మన అరచేతిలో ఉన్న ఫోనులోని కంప్యూటర్ కొన్ని వేల రెట్లు శక్తివంతమైనది. లక్షల ట్రాన్సిస్టర్లు ఉన్న ఆనాటి కంప్యూటరు కంటే ఈనాటి సెల్ ఫోనులో ఎన్నో వేల రెట్లు ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఆనాటి కంప్యూటరు ఒక అంతస్తులో సగభాగం ఆక్రమిస్తే, ఈనాటి సెల్ ఫోనులు అరచేతిలో పట్టేస్తాయి. సాధారణమైన స్మార్ట్ ఫోనులో కొన్ని బిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి, ఇవన్నీ చిటికెనవేలి గోరుకన్నా చిన్న చిప్ మీద అమర్చి ఉంటాయి. అంత శక్తివంతమైన కంప్యూటర్‌ని ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలూ వినోదానికీ, విజ్ఞానానికీ, వ్యాపారానికీ నిత్యం వాడుతున్నారు.

సమస్త ప్రజానీకానికి ఎనలేని సౌకర్యం కల్పించిన ఈ అద్భుతమైన చిప్ టెక్నాలజీని రూపొందించిన శాస్త్రజ్ఞుల, ఇంజనీరింగ్, సంస్థల చరిత్రని “విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరచాలనే” ఉత్సుకతో ఈ వ్యాస పరంపర మొదలెట్టాను. ఆ నెపాన కొన్ని భౌతికశాస్త్ర మూల సూత్రాలని కూడ పరిచయం చేయాలని సంకల్పించాను. కచ్చితంగా కాలక్రమానుగతంగా కాకుండా, అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్‌లా వెనక్కి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది.

థామస్ ఎడిసన్ సృష్టించిన విద్యుద్దీపం వలన ప్రపంచం చీకటి నుండి బయటపడిందని అందరికీ తెలుసు. విశేషమేమిటంటే, కంప్యూటర్లకి మూలమయిన ఎలెక్ట్రానిక్స్ రంగానికి పునాదులు కూడా ఎడిసన్ విద్యుద్దీపం దగ్గరే ఉన్నాయి.

ఎడిసన్ బాల్యం, యవ్వనం

ఎడిసన్ పూర్వీకులు అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలో ఉండేవారు. ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి కోసం అమెరికా చేసిన పోరాటంలో ఎడిసన్ పూర్వీకులు ఆంగ్లేయ రాజుకి మద్దతుగా ఉండడం వల్ల దేశద్రోహులుగా పరిగణించబడి, శిక్ష పాలయారు. రాజు మద్దతుతో విడుదలయి, అప్పట్లో ఆంగ్లేయుల పాలనలో ఉండే కెనడాలో స్థిరపడ్డారు. మరో తరం తర్వాత, వాళ్ళు కెనడాలో స్వపరిపాలన కోసం పోరాడేవారి పక్షం వహించి, రాజాగ్రహానికి గురయ్యారు. ఎడిసన్ తండ్రి, శామ్యూల్ ఎడిసన్, సైనికులు తరుముతుండగా కెనడా నుండి పారిపోయి 1838 లో అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలోని మిలాన్ పట్టణం చేరుకున్నాడు. అది హూరన్ నది పక్కన ఉండేది. హూరన్ నదికి ఎనినిది మైళ్ళ దూరంలో అమెరికాలో ప్రధానమైన రవాణా రహదారి అయిన ఈరీ కాలువ ఉంది. రెంటినీ కలపడానికి హూరన్ కాలువ కొత్తగా త్రవ్వారు. ధాన్యం గిడ్డంగులకీ, ఇళ్ళకీ కావలసిన కలప సామగ్రి అందచేయడానికి శామ్యూల్ ఎడిసన్ కలప మిల్లు పెట్టాడు. నాన్సీ ఎడిసన్ 1839 లో నలుగురు పిల్లలతో భర్తని చేరింది. మరో ఇద్దరు పిల్లలు పుట్టారు, కాని రెండేళ్ళలో ముగ్గురు చనిపోయారు. నాన్సీ నడి వయసులో, ఫిబ్రవరి 11, 1847 న ఏడో సంతానం థామస్ అల్వా ఎడిసన్‌ని కన్నది.

1854 లో మిలాన్ ప్రాంతంలో రైలు మార్గం వచ్చింది కానీ, కాలువ యజమానులు దానిని వ్యతిరేకించడం వలన అది మిలాన్ గుండా పోలేదు. క్రమంగా కాలువ మీద రవాణా తగ్గిపోయి వ్యాపారం దెబ్బతినడంతో ఎడిసన్ కుటుంబం మిలాన్ వదిలి, డెట్రాయిట్ దగ్గర పోర్ట్ హూరన్ అన్న పట్టణానికి వలస పోయారు. శామ్యూల్ ఎడిసన్‌కి స్థిరమైన ఆదాయం వచ్చే వ్యాపారం లేక, కుటుంబ పోషణ భారం నాన్సీ పైన పడింది.

ఎడిసన్ చిన్నతనంలో తుంటరి చేష్టలు చేసి తండ్రి చేత దెబ్బలు తినేవాడు. తల్లి దగ్గర చనువెక్కువ, ఆవిడని రకరకాల ప్రశ్నలు వేసి వేధించేవాడు. అతని అనారోగ్య కారణంగా, ఆలస్యంగా ఎనిమిదో ఏట బడికి పంపారు. పంతుళ్ళు మొద్దబ్బాయి అని పేరు పెట్టి శిక్షించే వాళ్ళు. ఎడిసన్ బడికి పోనని మొరాయించేవాడు. వాళ్ళకి బడికి పంపడానికి సరిపడా డబ్బు కూడా లేదు. కొడుకు మరీ తెలివి తక్కువ వాడు కాదని, తల్లి తనే చదువు చెప్పడం మొదలెట్టింది.

గిబ్బన్ “Decline and Fall of the Roman Empire,” హ్యూమ్ “History of England,” లాంటి చరిత్ర పుస్తకాలు, షేక్స్పియర్, డికెన్స్‍ల సాహిత్యం అతనికి చదివి వినిపించేది. ఎడిసన్‌కి సైన్సు అంటే ఆసక్తి ఉందని గ్రహించి R. G. Parker’s School of Natural Philosophy, ఎడిసన్‌కి తెచ్చి ఇచ్చింది. పెద్దయిన తర్వాత, ఎడిసన్, “నన్ను మలచినదీ, అర్థం చేసుకున్నదీ మా అమ్మే, ఆమే నన్ను నా ఇష్ట ప్రకారం బతకనిచ్చింది,” అన్నాడు. ఎడిసన్ పుస్తకాలు చదివి ఇంట్లో ఓ మూల తన మొదటి ల్యాబ్‍ని ఏర్పరచుకున్నాడు. అక్కడ రసాయనాలతో, తాను సొంతంగా తయారు చేసిన తంతియంత్రం (telegraph set) తో కాలం గడిపేవాడు. వీటితో ఎడిసన్ ఆలోచనా ప్రపంచం విస్తరించింది.

ఎడిసన్ పెరట్లో కూరగాయలు పండించి చుట్టుపక్కల వాళ్ళకి అమ్మి కాస్త డబ్బు సంపాదించేవాడు. 1859లో పోర్ట్ హూరాన్, డెట్రాయిట్ లని కలుపుతూ రైలు మార్గం వచ్చింది. ఎడిసన్ పన్నేండేళ్ళు కూడా నిండకుండానే రైలులో న్యూస్ బాయ్‌గా ఉద్యోగం సంపాదించాడు. వేకువ ఝామునే లేచి పేపర్లు, పళ్ళు, ఫలహారాలు, వార్తాపత్రికలు రైలులో అమ్మేవాడు. రైలు కండక్టర్ ఓ బోగీలో ఎడిసన్‌కి ఒక చిన్న ల్యాబ్, పరికరాలూ పెట్టుకోడానికి అనుమతి ఇచ్చాడు.

ఆ సమయంలోనే ఏదో జబ్బు సోకడం వల్ల పన్నెండేళ్ళ ప్రాయంలో ఎడిసన్‌కి ఒక చెవిలో కొంత, రెండో చెవిలో పూర్తిగా వినికిడి పోయింది. దానికి అప్పుడు చికిత్స ఏమీ లేదని వైద్యులు తేల్చారు. దానితో బడికి వెళ్ళే అవకాశం మృగ్యమయింది. వినికిడి లోపాన్ని ఎడిసన్ ఎప్పుడూ లోటుగా భావించలేదు.

రైలు డెట్రాయిట్‍లో దాదాపు రోజంతా ఆగడం వల్ల ఎడిసన్‌కి చాలా తీరిక సమయం దొరికేది. పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి ఉన్న పుస్తకాలన్నీ, సాహిత్యం, సైన్సూ, ఇంజనీరింగ్, దేనినీ వదలకుండా, చదవసాగాడు. న్యూటన్ “ప్రిన్సిపియా” (Principia) పుస్తకంలోని శుద్ధ గణితం మాత్రం మింగుడు పడలేదు. అంతటితో జీవితంలో గణితమంటే విముఖత ఏర్పడింది. సైద్ధాంతికమైన వాటి కన్నా “పనికొచ్చే” విషయాలమీదే ఎడిసన్‌కి మనసు లగ్నమయ్యేది.

ఆ సమయంలో అమెరికా అంతర్యుద్ధం కారణంగా చాలా అల్లకల్లోలంగా ఉంది. అబ్రహాం లింకన్ అద్యక్షుడయ్యాడు. సంచలనం సృష్టించే వార్తలుంటే పత్రికలు విరివిగా అమ్ముడు పోతాయని ఎడిసన్ గ్రహించాడు. ప్రెస్సుకు వెళ్ళి ముఖ్యమైన వార్తలేమిటో ముందుగా కనుక్కొని, రైలు మార్గంలో ఉన్న స్టేషన్ల వాళ్ళకి ముందే తంతి (telegraph) ద్వారా ఆ వార్తలు పంపి, వాళ్ళని బోర్డు మీద పతాక శీర్షికలని రాసిపెట్టమని అడిగేవాడు. ఎడిసన్ పత్రికలు అమ్మే రైలు స్టేషన్ చేరేసరికి జనం గుమిగూడి ఉండే వాళ్ళు, పత్రికలు బాగా అమ్ముడయేవి.

అలా ఎడిసన్ వ్యాపారనైపుణ్యానికి  తంతి యంత్రం బీజం వేసింది. దానినే వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు స్టేషన్ మాస్టరు కూతురుని ప్రమాదం నిండి తప్పించడంతో స్టేషన్ మాస్టరు ఎడిసన్‌కి తంతి యంత్రం మీద ఉన్న ఆసక్తి గమనించి అతనిని తన దగ్గర అసిస్టెంట్‍గా చేర్చుకున్నాడు. రైల్వేలలో అప్పటికే రైళ్ళ రాకపోకల వివరాలు తెలియచేయడానికి తంతియంత్రం వాడేవారు. ఎడిసన్ కొన్నేళ్ళుగా తంతి యంత్రం మీద ప్రయోగాలు చేసి ఉండటం వలన ఆ పని సులభంగా నేర్చుకున్నాడు.

దేశదిమ్మరి జీవితం

ఎడిసన్ దేశంలో పలు ప్రాంతాలలో టెలిగ్రాఫ్ ఆపరేటర్‌గా పనిచేసి, ఎక్కడా స్థిరపడక 1867 లో ఇంటికి వచ్చాడు. ఇరవై ఏళ్ళొచ్చినా సరయిన సంపాదన లేదని తల్లి వాపోయింది. ఈస్ట్ కోస్ట్‌కి వెళ్ళాలని నిర్ణయించుకొని ఎడిసన్ బోస్టన్ నగరంలో వెస్ట్రన్ యూనియన్ కంపెనీలో టెలిగ్రాఫ్ ఆపరేటర్‌గా చేరాడు, కానీ అది గొడ్డుచాకిరీలాగా అనిపించింది. రాత్రిళ్ళు పనిచెయ్యడం, పగలు పాత పుస్తకాల షాపుల కెళ్ళి పుస్తకాలు చదవడం చేసేవాడు. అప్పుడే ఫారడే రాసిన “Experimental Researches in Electricity,” అన్న పుస్తకం చదివాడు. అది ఎడిసన్‍ని చాలా ప్రభావితం చేసింది. విద్యుచ్ఛక్తితో పనిచేసే మోటార్లకు సంబంధించి ఫారడే చేసిన మౌలికమైన ప్రయోగాలు ఎడిసన్‌ని ఎంతో ఉత్తేజపరిచాయి. ఫారడే ప్రయోగాత్మక శైలి, క్లిష్టమైన సాంకేతిక విషయాలను సైతం పనికివచ్చే పరికరాలకు ఉపయోగించగలిగే నైపుణ్యం ఎడిసన్‌కి తరవాత జీవితంలో ఎంతో స్ఫూర్తినిచ్చాయి.

కాంగ్రెస్ లాంటి చట్టసభలలో, సభ్యులు తంతియంత్రం ద్వారా తమ ఓటు నమోదు చేయగలిగే యంత్రాన్ని తయారుచేసి, ఎడిసన్ తన మొట్ట మొదటి పేటెంట్ సంపాదించాడు. దానిని అన్ని శాసనసభలలోనూ అమ్మి, డబ్బు సంపాదించవచ్చని ఆశ పడ్డాడు, కానీ అంత తొందరగా ఓటు వేసేస్తే, రాజకీయ నాయకులు వాళ్ళు ఎడతెగని ప్రసంగాలు చెయ్యడానికి వీలుండదు కనుక అది ఎక్కువ అమ్ముడు పోలేదు.

1869 జూన్‍లో బోస్టన్‍లో ఉద్యోగానికి స్వస్తి చెప్పి, చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఎడిసన్ న్యూయార్క్ నగరం చేరాడు. అక్కడ గోల్డ్ అండ్ స్టాక్ టెలిగ్రాఫ్ కంపెనీలో స్టాక్ టికర్ మరమ్మత్తు చేయడానికి చేరాడు. స్టాక్ టికర్ టెలిగ్రాఫ్ ద్వారా వివిధ నగరాల స్టాక్ ఎక్స్ఛేంజీలలో బంగారం ధరలు అప్పటికప్పుడు ఎలా మారుతున్నాయో సన్నటి రిబ్బన్ లాంటి కాగితం మీద అచ్చువేస్తుంది. ఆ వివరాలను ఉపయోగించి బ్రోకర్లు కొనుగోళ్ళ, అమ్మకాల నిర్ణయాలు తీసుకొంటారు. ఓ రోజు తంతియంత్రాలు సరిగా పనిచెయ్యక వ్యాపారం కుప్పకూలబోతే ఎడిసన్ పొరబాటు ఎక్కడుందో కనిపెట్టి బాగు చెయ్యడంతో, అతని ప్రావీణ్యం ఏమిటో కంపెనీ యజమానికి తెలిసింది. నెల జీతంతో ఉద్యోగమిచ్చాడు.

కొన్నాళ్ళకి ఆ కంపెనీని వెస్ట్రన్ యూనియన్ అనే మరొక పెద్ద సంస్థ కొనేసింది. ఎడిసన్ ఆ ఉద్యోగం వదిలి నెవార్క్ అన్న పట్టణంలో సొంతంగా ఫాక్టరీ నెలకొల్పాడు. నూట ఏభై ఏళ్ళకి పూర్వం అతని పూర్వీకులు నివసించిన ప్రాంతం అదే. ఎడిసన్ అంతకు ముందు ఉన్న వాటి కంటే మెరుగైన పద్ధతిలో స్టాక్ ధరలను తెలిపే తంతియంత్రాన్ని తయారుచేశాడు. ఇంకా రకరకాల తంతి పరికరాలు – ఒకే తీగె మీద రెండు దిశలా ఒకే సారి సిగ్నల్స్ పంపేవి, మునుపటి కంటే వేగంగా పంపేవి, స్టాక్ టికర్‌తో కలిపి చుక్క, గీతలకు బదులు అక్షరమాలతో పంపేవి – ఇలాంటి యంత్రాలు ఎన్నో తయారుచేసి పేరు గడించాడు. పెళ్ళిచేసుకున్నాడు, ఇద్దరు పిల్లలకు తండ్రి ఆయాడు. వాళ్ళ ముద్దు పేర్లు – డాట్, డాష్ (తంతి భాషలో చుక్క, గీత).

మెన్లో పార్క్ మాంత్రికుడు

వ్యాపారవేత్తగా ఎడిసన్ ప్రయాణం నెవార్క్‌లో ఉన్నప్పుడే మొదలు అయింది. అతను కనిపెట్టిన యంత్రాలకు పేటెంట్లూ, డబ్బూ గడించాడు. కొత్త పరికరాల కల్పన మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ప్రశాంతమైన చోటు కావాలని, న్యూయార్క్, ఫిలడెల్ఫియాల మధ్య వెళ్ళే రైల్వే మార్గం పక్కన, పది ఇళ్ళు కూడా లేని మెన్లో పార్క్ అన్న చిన్న ఊరిలో రెండు అంతస్తులతో, తండ్రి పర్యవేక్షణలో ఒక భవనాన్ని కట్టించాడు. క్రింద ఆఫీసు, లైబ్రరీ, పైన రకరకాల యంత్రాలు, పరికరాలు, విశాలమైన రసాయనశాస్త్ర ప్రయోగశాల.


1 మెన్లో పార్క్ ల్యాబ్

అలా ప్రపంచంలోనే మొట్టమొదటి పారిశ్రామిక పరిశోధనశాల (ఇండస్ట్రియల్ రీసెర్చి ల్యాబ్‌) ని నెలకొల్పాడు. ఆ భవనమే, గ్రామోఫోన్, విద్యుద్దీపం, పవర్ సిస్టం, ఒకటేమిటి, అనేక కొత్తకొత్త సాంకేతిక సౌకర్యాల కల్పనకు పుట్టినిల్లు అయింది. ఆ భవనమే “కల్పనల కర్మాగారం” (Invention Factory) అన్న పేరు తెచ్చుకొని, భవిష్యత్తులో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెల్ ల్యాబ్స్ లాంటి వాటికి మార్గదర్శకమయింది.

మాట్లాడే యంత్రం

టెలిఫోన్‍లో మాట్లాడే మాటల్ని నమోదు చేసి, తిరిగి ప్రసారం చెయ్యడానికి ఒక పరికరం చేస్తే ఉపయోగపడుతుందని ఆలోచిస్తూ జులై 18, 1877 న ఎడిసన్ ఒక పరికరాన్ని చేశాడు. ఆకులాంటి పలుచని లోహపు రేకు (diaphragm) కి ఎదురుగా మాట్లాడితే ఆ రేకు కంపిస్తుంది. దానికి ఒక సూదిని అతికించి సూదిమొనని మైనపు కాగితం మీద పెట్టి, మాట్లాడుతూ కాగితాన్ని లాగితే ఆ కంపనలు కాగితం మీద గుర్తులుగా నమోదవుతాయి. ఇపుడు ఆ కాగితం మీద సూది ఉన్న మరో రేకుని పెట్టి కాగితాన్ని లాగితే సూది ఆ గుర్తులని అనుకరిస్తూ తిరిగి రేకుని కంపింప చేయడాన మొదటి మాట్లాడిన మాటలే వినబడతాయి. “హలో” అన్న మాటని తిరిగి వినిపించ గలిగేలాగ చేయడంతో ఎడిసన్ అటువంటి ప్రయోగాలు విరివిగా చెయ్యడం మొదలెట్టాడు.

నాలుగు నెలల పాటు దానిని మెరుగుపరచడానికి రేయింబవళ్ళు రహస్యంగా కృషి చేశాడు. ఎడిసన్‌కి వెస్ట్రన్ యూనియన్‍తో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఎడిసన్ ఆ పరికరాన్ని వాళ్ళకు చూపించాడు. శబ్దాన్ని నమోదు చేసి, ఎప్పడు కావాలంటే అప్పుడు తిరిగి ప్రసారం చేయగలగడం వల్ల వాళ్ళకు  ప్రయోజనం ఏదీ కనిపించలేదు. ఎడిసన్ ఏజెంట్ ఒకతను సైంటిఫిక్ అమెరికన్ పత్రికలో నవంబరు 17, 1877 న “మాట్లాడే యంత్రం” గురించి ఇలా రాశాడు: “సైన్సు కేవలం మేధోపరమనీ, ఉద్రేకాలకీ ఉద్వేగాలకీ అతీతమనీ వింటాము. గతించిన వారి మాటలు వింటే కలిగే ఉద్వేగం కన్నా తీవ్రమైనదేదీ లేదు కదా! ఇప్పుడు సైన్సు ద్వారా ఎవరి మాటలనయినా నమోదు చేసి తరువాత ఎప్పుడైనా వినవచ్చు. గొప్ప గొప్ప  గాయకుల గళాన్ని ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, వారు ఉన్నా, గతించినా, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు.”


2 ఫొనొగ్రాఫ్ నకలు

నవంబరు 29, 1877 న ఎడిసన్ నమూనా యంత్రం సిద్ధం అయింది. ఇనుముతో చేసిన ఇరుసు మీద ఇత్తడి స్థూపం (cylinder), తిప్పడానికి ఇరుసుకి ఓ పిడి, ఇరుసుకి ఇరువైపులా సూదులున్న రేకు పొరలు. స్థూపానికి తగరపు రేకుని తొడిగి, పిడిని తిప్పుతూ, ఎడిసన్ అమెరికా రచయిత్రి శారా జోసెఫా హేల్ (Sarah Josepha Hale 1788 – 1879) రాసిన “Mary had a little lamb,” అన్న పిల్లల పాటని పాడాడు:

Mary had a little lamb,
Its fleece was white as snow,
And everywhere that Mary went
The lamb was sure to go.

పిడిని వెనక్కి తిప్పి, ఇరుసుని మళ్ళా మొదటికి తెచ్చి, రెండో రేకు పొరని మొదటిదాని స్థానంలో పెట్టి, మళ్ళా పిడిని తిప్పాడు. పాట తిరిగి వినిపించింది. శబ్దాన్ని నమోదు చేసి తిరిగి వినిపించగలిగే యంత్రానికి ఎక్కువ ఉపయోగం ఉండదేమోనని  ఎడిసన్ మొదట అనుకున్నాడు. కానీ, ఆ ఫోనోగ్రాఫ్ యంత్రమే ఇప్పుడు సంగీత ప్రపంచానికీ, సమాచార ప్రపంచానికీ మూలస్తంభం అయింది. డిశంబరు 7, 1877 న ఎడిసన్ సైంటిఫిక్ అమెరికన్ కార్యాలయానికి వెళ్ళి ఆ యంత్రాన్ని ప్రదర్శించాడు. “మాట్లాడే ఫొనోగ్రాఫ్” మూలంగా ఎడిసన్‌కి మంచి పేరు వచ్చింది. “న్యూజెర్సీ కొలంబస్” నీ మెన్లో పార్క్ ల్యాబ్‌నీ చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఎడిసన్ వాషింగ్టన్ వెళ్ళి అమెరికా అధ్యక్షుడికీ, ఇతర ప్రముఖులకీ ఫొనోగ్రాఫ్‌ని చూపెట్టాడు.


3 ఫొనొగ్రాఫ్ తో ఎడిసన్

చీకటిని ఛేదించడానికి కాంతిని విభజించాలి

1879 సెప్టెంబరులో ఎడిసన్ విద్యుద్దీపాల మీద పరిశోధనలు చేసే విలియం వాలెస్‌ (William Wallace) ని కనెక్టికట్ రాష్ట్రంలోని ఆన్సోనియాలో అతని ఫాక్టరీలో కలుసుకొన్నాడు. వాలెస్ అప్పటికే డైనమో, చాపదీపాల (arc light, రెండు తీగెలని దగ్గరికి తీసుకు రావడం వల్ల వాటి మధ్య వచ్చే వెలుగు) సృష్టికర్తగా చాలా పేరు సంపాదించాడు. ఎడిసన్ కొన్నిసార్లు విద్యుచ్ఛక్తిమీద పరిశోధనలూ, ప్రయోగాలూ చేసినా అవి విఫలం అవడంతో వాటి మీద అప్పటివరకూ దృష్టి పెట్టలేదు. వాలెస్‌ని కలవడం ఎడిసన్‌కి విద్యుచ్ఛక్తి మీదా, విద్యుద్దీపాల మీదా ప్రయోగాలు చేయడానికి స్ఫూర్తినిచ్చింది. అప్పటికే బ్రిటన్‌లో హంఫ్రీ డేవీ (Humphry Davy, 1778-1829) చాప దీపంతో చేసిన ప్రయోగాలు ప్రజలని ఆశ్చర్యపరచాయి. చాపదీప కాంతి మిరుమిట్లు కొల్పేది కాబట్టి వీధులలో, దుకాణాల్లో వాడగలిగినా, ఇళ్ళల్లో వాడడానికి పనికిరాదు.

ఇళ్ళలో వాడగలిగే ప్రజ్వలన దీపం (incandescent lamp) కోసం అప్పటికి నలభై ఏళ్ళుగా చాలా మంది పరిశోధకులు కృషి చేసి విఫలమయ్యారు. కమ్మరి కొలిమిలో బాగా కాగిన ఇనుప కడ్డీ మొదట ఎర్రగా, తర్వాత తెల్లగా మారినట్లే, విద్యుచ్ఛక్తితో ఏదైనా పదార్థాన్ని బాగా వేడి చేస్తే అది వెలుగుతుందని హంఫ్రీ డేవీ అప్పటికే చూపాడు. కానీ, ఆ వేడికి కరిగిపోని పదార్థం కావాలి. అందుకు కార్బన్‌ని వాడితే, అది బాగా వేడెక్కినా కరగదు కానీ సులభంగా మాడిపోతుంది. ప్లాటినం ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ కరుగుతుంది; దానికి తోడు అది చాలా ఖరీదైన పదార్థం. ఇవీ 1878 వరకూ ప్రజ్వలన దీపం చేయడానికి ఉన్న అడ్డంకులు.

దీపాలని ఒకదాని తర్వాత మరొకదానిని ఒకే తీగె ద్వారా కలిపి కడితే దానిని సీరీస్ సర్క్యూట్ అంటారు. క్రిస్మస్ దీపతోరణాలను ఇలాగే కలుపుతారు. తీగెలో విద్యుత్తు ఒక దీపం నుండి పక్క దీపానికి ప్రవహిస్తుంది కాబట్టి ఆ దీపాలలో ఏ ఒక్కటి పాడయినా మిగిలిన దీపాలు కూడా పనిచెయ్యవు. వెలిగితే అన్నీ వెలుగుతాయి, లేకపోతే ఏదీ వెలగదు. వాలస్ ఇలాంటి సర్క్యూట్ వాడాడు.

సీరీస్ సర్క్యూట్ ఇళ్ళల్లో రోజూ వాడుకొనే దీపాలకి పనికిరాదు. వంటగదిలో ఉన్నప్పుడు అక్కడ వెలుగు ఉండాలి కానీ, వేరేగదులలో అక్కరలేదు. రెండు తీగెలని కలుపుతూ సమాంతరంగా ఎన్ని దీపాలయినా పెట్టగలగాలి, ఏ దీపాన్నయినా వెలిగించగలగాలి, ఏ దీపాన్నయినా ఆర్పివేయగలగాలి.  ఆ విధంగా కాంతిని విభజించడం చాలా ముఖ్యమని ఎడిసన్ తీర్మానించాడు.


4 సమాంతర, సీరీస్ సర్క్యూట్స్

ఎక్కువ విద్యుత్తు ప్రవహించాలంటే తీగెలు చాలా మందంగా ఉండాలి. (రోడ్డుపై ఎక్కువ వాహనాలు వెళ్ళాలంటే, రోడ్డు వెడల్పుగా ఉండాలి కదా) తీగెలకి రాగి వాడే వారు; మందమెక్కువైతే ఖర్చు ఎక్కువ. అందుకే ఎడిసన్ తన దీపం తక్కువ విద్యుత్తుతో పనిచేయాలని భావించాడు. మరో కారణం, విద్యుత్తు ప్రవహించే తీగెలో వేడి పుడుతుంది, అలా కొంత శక్తి నష్టమవుతుంది. విద్యుత్తు రెట్టింపు అయితే, వేడి నాలుగు రెట్లు, విద్యుత్తు మూడు రెట్లు అయితే, వేడి తొమ్మిది రెట్లు అవుతుంది. వేడి అంటే నష్టపోయిన శక్తి. కాబట్టి తక్కువ విద్యుత్తుతో వెలుగుని సాధించాలి. ఇదీ అప్పుడు ఎడిసన్ ముందు ఉన్న సవాలు.

ఓమ్ సూత్రం (Ohm’s Law) ప్రకారం, వోల్టేజ్ = విద్యుత్తు x అవరోధం (resistance). కాబట్టి విద్యుత్తు తక్కువ కావాలంటే అవరోధం ఎక్కువ కావాలి. అవరోధం ఎక్కువ కావాలంటే పొడవైన తీగె కావాలి, దానిని బల్బు గోళంలో పట్టించాలాంటే మెలికలు చేసి చుట్టాలి. అందుకు ఎడిసన్, అతని సిబ్బంది దీపంలో ప్లాటినం ఫిలమెంట్ వాడటం మొదలు పెట్టారు. అయితే మెలికలు ఒకదానికి ఒకటి తగిలితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది, దాని నివారణకి ప్లాటినం తీగెపై ఓ కోటింగ్ వాడిచూసారు. ఇలా ఎన్ని చేసినా వేడికి ప్లాటినం కరిగి పోయేది. ఆ సమస్యని ఎదుర్కొనడానికి వేడి పెరిగినప్పుడు విద్యుత్తుని నియంత్రించే పరికరాన్ని (regulator) దీపంలో అమర్చాడు. దానితో బల్బ్‌లో క్లిష్టత పెరిగింది. అంతేకాక దీపం కాసేపు వెలిగి ఆరిపోవడం, తిరిగి కాసేపు వెలిగి ఆరిపోవడం జరగడంతో ఎడిసన్ రెగ్యులేటర్ ఆలోచనని విరమించుకొన్నాడు. 1879 ఏప్రిల్‌లో ఎడిసన్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన వాటాదారులు ప్రయోగాల ప్రగతిని చూడడానికి న్యూయార్క్ నుండి మెన్లో పార్క్‌కి వచ్చారు. చీకటి పడ్డాక అప్పటివరకూ చేసిన విద్యుద్దీపాలు వెలిగించారు, కానీ అవి ఒకటి రెండు నిముషాలకంటే వెలగలేదు.

ఎడిసన్ తన సిబ్బందిని మూడు సమస్యల మీద దృష్టి కేంద్రీకరించమన్నాడు. 1) వాలస్ తయారుచేసిన డైనమో కన్నా శక్తివంతమైనది తయారు చేయడం. 2) బల్బు గోళంలో బాగా శూన్యం రావడం. 3) ఫిలమెంట్ కోసం  ప్లాటినంకి బదులుగా వేరే పదార్థం కనుగొనడం.

అప్పట్లో డైనమో సాంకేతికత ఇంకా శైశవస్థాయిలోనే ఉంది. ఆ డైనమోలు చాలా పెద్దగా, సామర్థ్యం తక్కువగా ఉండేవి. ఎడిసన్ బృందంలో ఉండే భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ రాబిన్స్ అప్టన్ కొత్త డైనమోని తయారు చేశాడు. అక్టోబర్ కల్లా ప్రపంచంలో కెల్లా శక్తివంతమైన డైనమో మెన్లో పార్క్ లో వెలిసింది.

ఎడిసన్ పాదరసం వాడి బల్బు నుండి గాలిని తీసి శూన్యాన్ని సృష్టించే పంపుల (vacuum pumps) ప్రాముఖ్యతని గుర్తించాడు. అప్పటి పంపులలో రెండు లోపాలున్నాయి: గాలిని కావలసినంత తీయక పోవడం, తీయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. పాదరసంతో, గాజుతో పనిచెయ్యడం చాలా కష్టం. అందుకు గాజుపని (glassblowing) లో నిపుణుడైన లుడ్విగ్ బోమ్  సహాయపడ్డాడు . అతను రకరకాల పంపులను గాజు బుడ్డీలను తయారుచెయ్యడంలో ప్రముఖ పాత్ర వహించాడు. స్ప్రెంగెల్ పంపు (Sprengel pump) హెచ్చు శూన్యాన్ని సాధిస్తే, గైస్లెర్ పంపు (Geissler pump) తక్కువ సమయంలో శూన్యాన్ని సాధిస్తుంది. ఆ రెంటినీ కలిపి చేసిన పంపు హెచ్చు శూన్యాన్ని తక్కువ సమయంలో సాధించింది. చివరకి వాడుకలో ఉన్న రెండు రకాల పంపులను కలిపి ప్రపంచంలోకెల్లా మెరుగైన సంకీర్ణమైన క్రొత్త పంపుని తయారుచేశారు. ఈ పంపు నిర్మాణం ఎలక్ట్రిక్ బల్బు తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయి.

ఫిలమెంట్‌లో విద్యుత్తు తక్కువగా ప్రవహించాలంటే, విద్యుత్తుకు ఎక్కువ అవరోధం కలిగించే పదార్థం కావాలి, దాని మన్నిక గూడా ఎక్కువ ఉండాలి, దానిని సులువుగా కర్బనీకరించగలగాలి. (కర్బనీకరణ అంటే చెక్క, కాగితం, ఇతర వృక్ష సంబంధమైన పదార్థాన్ని ఎక్కువ ఉష్ణోగ్రతలో వేడి చేసి దానిలోని నీరు, కర్బనం కాని పదార్థాలని తొలగించి, కర్బనం లాగ మార్చడం) ఇలాంటి గుణాలు ఉండే పదార్థం కోసం దాదాపు ఆరువేల పదార్థాలపై — ప్లాటినం మొదలుకొని గడ్డంలో వెంట్రుకల వరకూ, ఎడిసన్ బృందం పరీక్షలు జరిపింది. మొదట ఒక రకమైన కాగితాన్ని కర్బనైజ్ చేసి, ఫిలమెంట్‌గా చేసి వాడేవారు, కానీ, ఆ ఫిలమెంట్ కొన్ని గంటల కంటే మన్నలేదు.  మన్నిక గల పదార్థం కోసం ప్రపంచమంతా గాలించారు. చివరకు జపానులో క్యోటో ప్రాంతంలో దొరికే ఒకరకమైన వెదురుకు ఇటువంటి గుణాలు ఉన్నాయని ఎడిసన్ బృందం కనిపెట్టింది. ఈ వెదురును కర్బనైజ్ చేసి తయారు చేసిన ఫిలమెంట్ దాదాపు 1400 గంటలు మన్నింది. ఇది విద్యుద్దీపం తయారీలో మరొక ముఖ్యమైన మైలురాయి. గుర్రపు నాడా ఆకారంలో ఉన్న ఫిలమెంట్‌ని క్రింద పటంలో చూడవచ్చు; కర్బనైజ్ చెయ్యక ముందు (Fig. 2), పిదప (Fig. 1).


5 ఎడిసన్ దీపం, జనవరి 10, 1880 సైంటిఫిక్ అమెరికన్ నుండి

దీప ప్రదర్శన

ఎడిసన్ తను తయారు చేసిన విద్యుద్దీపాలను మెన్లో పార్క్ ల్యాబ్‌లోనూ చుట్టుపక్కల భవనాలలోనూ అమర్చాడు. అవి దూరంగా వెళ్ళే రైలు ప్రయాణీకులకు కూడా కనిపించేవి. ప్రజ్వలన దీపాల వెలుగు గ్యాస్‌తో, నూనెతో వెలిగే దీపాల వెలుగు కంటే భిన్నంగా ఉండడంతో అవి చూపరులకు చాలా కుతూహలం కలిగించేవి. క్రమంగా ఈ కొత్తరకమైన విద్యుద్దీపాలు పత్రికా విలేకరులలోనూ, పెట్టుబడిదారుల్లోనూ, సామాన్య ప్రజాల్లోనూ చాలా ఆసక్తిని రగిలించాయి. డిసెంబర్ 31, 1879 నాడు ఎడిసన్ విద్యుద్దీపాలను ప్రజలకు, పత్రికలవారికీ ప్రదర్శించి చూపించాడు. ఎడిసన్‌ అప్పటికే కొత్త కొత్త పరికరాల రూపకర్తగా ఎంతో పేరు గడించాడు. ఈ ప్రదర్శనకు వేలాదిమంది హాజరయ్యారు. వారికోసం ప్రత్యేకమైన రైళ్ళు కూడా నడిపారు. ఆ ప్రదర్శనలో మెన్లో పార్క్ వీధులలో, ల్యాబ్‌లోనూ విద్యుద్దీపాలను చూసిన ప్రజల కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. చాప దీపాలలాగా కాకుండా నిలకడగా, ప్రకాశవంతంగా వెలిగే ప్రజ్వలన దీపాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ ప్రదర్శనలో ఎడిసన్ భవిష్యత్తులో విద్యుద్దీపాలు గ్యాస్ దీపాలనీ, కొవ్వొత్తులనీ తొలగిస్తాయని, విద్యుద్దీపాలే ఇళ్ళనీ, నగరాలనీ భద్రంగా, ప్రకాశవంతంగా చేస్తాయనీ చెప్పాడు. త్వరలో న్యూయార్క్ లాంటి నగరాలలో విద్యుదీకరణ మొదలవుతుందని జోస్యం చెప్పాడు.

ఎడిసన్ ఎఫెక్ట్

విద్యుద్దీపం దీర్ఘకాలం మన్నికగా పనిచెయ్యాలనే దీక్షతో దానిని మెరుగుపరచడానికి ఎడిసన్ ఎడతెగకుండా ప్రయోగాలు చేస్తూ, వాటి ఉపఫలం (byproduct) గా 1880 ఫిబ్రవరిలో ఓ కొత్త విషయం కనుక్కున్నాడు. కొన్ని రోజులు వెలిగిన తర్వాత కార్బన్ నలుసులు గోళం లోపల పేరుకుపోవడం వల్ల  దీపం గోళం నల్లబారడం గమనించాడు.  అలా నల్లబడిన  దీపం పనికిరాకుండా పోతుందని భావించి, ఎందుకు నల్లబారిందో జాగ్రత్తగా పరిశోధించాడు. ఫిలమెంట్ బాగా వేడెక్కినప్పుడు అది విడుదల చేసే కార్బన్ నలుసులు గోళం ఉపరితలం లోపల పేరుకుపోవడం వలన గోళం నల్లబారుతుందని నిర్ధారించాడు.

మరికొన్ని ప్రయోగాలు చేసిన తరవాత రెండు ముఖ్యమైన విషయాలు గమనించాడు: 1) గోళం అంతటా నల్లగా ఉంది కానీ, ఒక చోట మాత్రం తెల్లని చార కనబడింది.  ఫిలమెంట్ ఒక  కొస  నుండి వెలువడిన నలుసులని ఎదుటి  కొస  అడ్డుకోవటం వలన ఆ కొస  నీడ నిలువుగా తెల్లని చారలాగ పడింది. 2) ఆ నీడ ధన ధ్రువానిది; అంటే కార్బన్ నలుసులు ఋణ ధ్రువం నుండి వచ్చాయి.

1882 జులై లో ఓ ప్రత్యేకమైన దీపంలో అదనంగా ఓ లోహపు రేకు పెడితే, మసి గోళానికి పట్టకుండా ఆ రేకుకి అంటుకుంది. రేకుకి ఓ తీగెని అంటించి తీగె రెండో చివరని ధన ధ్రువానికి తగిలిస్తే ఆ తీగెలో విద్యుత్తు ప్రవహిస్తుందని రుజువయ్యింది. అంతవరకూ శూన్యంలో విద్యుత్తు ప్రవహిస్తుందని తెలియదు. (విద్యుత్తు ప్రవహించడానికి కారణం, వేడెక్కిన ఫిలమెంట్ నుండి ఎలక్ట్రానులు ప్రసరించి (emit) శూన్యంలో ధనధ్రువం వైపు ప్రయాణించడం.  దీనికి  తరవాత ఉష్ణాయానిక ప్రసరణ (thermionic emission) అని పేరు పెట్టారు.) అప్పటిలో ఈ చర్యని అర్థం చేసుకునేటంతగా భౌతికశాస్త్రం అభివృద్ధి చెందలేదు. ఎడిసన్ ఈ చర్యని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా, “ఎలక్ట్రికల్ ఇండికేటర్” పేరుతో దానిని 1883లో పేటెంట్ చేశాడు. మసకబారిన విద్యుద్దీపం ఆధునిక ఎలక్ట్రానిక్స్ రంగానికి  అతి ముఖ్యమైన పునాది అవుతుందని  అప్పుడు తెలియదు.

సెప్టెంబరు 1884 లో ఫిలడెల్ఫియా లో జరిగిన ఎలెక్ట్రికల్ ఎక్స్పొజిషన్ లో ఎడిసన్ తన ప్రజ్వలన దీపాలు, అవి పనిచేయడానికి కావలసిన వ్యవస్థనీ, శూన్యం గుండా విద్యుత్తు ప్రహహించడాన్నీ    ప్రదర్శించాడు. ఇది విలియం ప్రీస్ (William Preece, 1834-1913) అన్న బ్రిటిష్ ఇంజనీర్ దృష్టిని ఆకర్షించింది. ప్రీస్ ఎడిసన్ దగ్గర నుండి కొన్ని దీపాలని తీసుకెళ్ళి, లండన్‌లో ప్రయోగాలు చేసి, 1885 లో రాయల్ సొసైటీలో ఒక  పరిశోధన పత్రం చదివాడు. శూన్యం గుండా విద్యుత్తు ప్రవహించడానికి ప్రీస్  “ఎడిసన్ ఎఫెక్ట్” అన్న పేరు పెట్టాడు.  ప్రకృతిలో కొత్తగా కనుగొన్న, అప్పటి శాస్త్రీయ జ్ఞానంతో వివరించలేని, విశేషాన్ని భౌతిక శాస్త్రజ్ఞులు “ఎఫెక్ట్” అంటారు (ఉదాహరణకి కాంప్టన్ ఎఫెక్ట్, రామన్ ఎఫెక్ట్). అలా ఎడిసన్ ఎఫెక్ట్ శాస్త్రజ్ఞుల వాడుకలోకి వచ్చింది.


6 ఎడిసన్ ఎఫెక్ట్

ఎడిసన్ కంపెనీకి కన్సల్టెంటుగా పనిచేస్తున్న బ్రిటీష్ శాస్త్రవేత్త ఆంబ్రోస్ ఫ్లెమింగ్ (Ambrose Fleming, 1849-1945) కూడా ఎడిసన్ ఎఫెక్ట్ మీద కొన్ని పరిశోధనలు చేశాడు కానీ, అతను కూడా దానికి మూలం తెలుసుకోలేకపోయాడు. దానిని ఎలా ఉపయోగించుకోవాలో అప్పుడు ఎవ్వరికీ అర్థం కాలేదు.

1884 ఆగస్టులో ఎడిసన్ భార్య చనిపోయింది. క్రమంగా ఎడిసన్ స్థాపించిన ఎలెక్ట్రిక్ లైటింగ్ కంపెనీ పెద్దదయేకొలదీ కేవలం పరికరాల రూపకర్త గానే కాక కంపెనీ అధినేతగా బాధ్యతలు పెరిగాయి. ఎంతో ధనవంతుడయ్యాడు. కానీ ప్రయోగాలు చేసే ప్రవృత్తిని మానలేదు.

ఎడిసన్ ఎఫెక్ట్‌కి సంబంధించిన పరిశోధన మరో పదేళ్ళ తరవాత 1897 లో బ్రిటిష్ శాస్త్రవేత్త జె. జె. థామ్‌సన్ (J. J. Thomson, 1856-1940) మొదలు పెట్టాడు. అతను  కొన్ని ప్రయోగాలు చేసి వేడెక్కిన ఫిలమెంట్ నుండి వచ్చిన ‘ఎలెక్ట్రానుల’ మూలంగా విద్యుత్తు ప్రవహించిందని నిర్థారించాడు. ఆవిధంగా ఎలెక్ట్రాన్ ఆవిర్భావానికి పరోక్షంగా ఎడిసన్ మూలపురుషుడు అయ్యాడు. అదే సమయంలో మార్కొని (Marconi, 1874-1937) నిస్తంత్రి (wireless telegraph) రంగంలోకి ప్రవేశించి, రేడియో రూపొందించాడు. దానిని వాడుకలోకి తేవడంలో ఫ్లెమింగ్, ప్రీస్ కీలకపాత్ర వహించారు. ఎడిసన్ ఎఫెక్ట్ ఆధారంగా చేసిన ఫ్లెమింగ్ వాల్వ్ (ఇదే తరవాత శూన్య నాళిక అయింది) పరికరం పైన చెప్పిన భోషాణమంత రేడియోలో ఒక ముఖ్య భాగం, అది ట్రాన్సిస్టర్ రేడియోకి పూర్వ రూపం. ఇలా మసకబారిన విద్యుద్దీపం ఎడిసన్ ఎఫెక్ట్‌కి దారితీస్తే, అది ఫ్లెమింగ్ వాల్వ్‌కూ, ఆ తర్వాత ట్రాన్సిస్టర్లకూ  దారి తీసింది.

రేడియో పనిచేసేది విద్యుదయస్కాంత తరంగాల ద్వారా. విద్యుత్తు, అయస్కాంతం, కాంతి – వీటికి గల అవినాభావ సంబంధం తెలుసుకోడానికి 1600 సంవత్సరంలోకి  వెళ్ళి, వచ్చే సంచికలో కథ కొనసాగిద్దాం.

మూలాలు:

  1. Edison: A Biography. Matthew Josephson. 1959. History Book Club, 2003 Edition. నా వ్యాసానికి ఈ పుస్తకమే ఆధారం; జోసెఫ్‌సన్‌కి చాలా ఋణపడి ఉన్నాను.
  2. Edison’s Electric Light: The Art of Invention. Robert Friedel and Paul Israel. The Johns Hopkins University Press. 2010.
  3. Menlo Park Reminiscences, Volume One. Francis Jehl. Edison Institute. 1937.
  4. Scientific American Archives.
  5. Wikipedia: Thomas Edison

కొడవళ్ళ హనుమంతరావు

రచయిత కొడవళ్ళ హనుమంతరావు గురించి:

పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది Washington రాష్ట్రంలో Seattle నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో.

దాదాపు పాతికేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత మూడేళ్ళుగా కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం – అదీ ప్రస్తుత వ్యాపకం.

 ...