సెక్యులరిస్టులు నిజానికి కమ్యూనలిజానికి జీవం పోసారా? ఈ ప్రశ్న వింతగా అనిపించవచ్చు. నిజంగా జరిగింది అదే. ఇంటి దొంగ గురించి మాట్లాడడానికి ఎవరూ ఇష్టపడరు. తాత్వికంగా సామాజికంగా చారిత్రికంగా సెక్యులరిస్టులు అని చాటుకునే వాళ్ళు ఎలా కమ్యూనలిజాన్ని మతతత్వాన్ని ఫాసిజాన్నీ పెంచి పోషించారో ఈ వ్యాసంలో వివరిస్తాను. సెక్యులరిస్టులు కమ్యూనిస్టులు దళిత బహుజన వాదులు ఆత్మ విమర్శ చేసుకుని ముందుకు కదిలితేనే నిజమైన సామాజిక మార్పు సాధ్యమవుతుంది కానీ ఆత్మవంచన వల్ల కమ్యూనలిజం ఫాసిజం రాచపుండులా బాధపెడతాయి అని స్పష్టం చేయటమే ఈ వ్యాసం సారాంశం.
మాట్లాడితే మనుస్మృతిని రామాయణాన్ని పురాణాలని పురాణ పాత్రల్ని విమర్శిస్తూ వాటి వెనక నక్కి ఆధునిక యుగంలో తమ ఆలోచనలు ఆచరణ తీసుకువచ్చిన విషమ పర్యవసానాలను గుర్తించడంలో ప్రగతి శీల మేధావులందరూ విఫలమయ్యారు.
కమ్యూనలిజం — ఆధునికత
కమ్యూనలిజం పూర్తిగా ఆధునిక సమస్య. దాన్ని గతంతో కలిపి వేయడం ద్వారా సమస్యని అస్పష్టంగా మార్చి వేయడం జరుగుతుంది. చాలామంది అలా కలగాపులగం చేస్తారు. ఉదాహరణకి కొందరు మాట్లాడితే మనుస్మృతి గురించి తిట్టిపోస్తుంటారు ఇలాగే ఒకసారి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ శాంతిశ్రీ ధూళిపాల పండిట్ మనుస్మృతిని నిషేధించాలి అంటూ 2002లో తీవ్రంగా ఉపన్యాసంలో విరుచుకుపడ్డారు. బిఆర్ అంబేద్కర్ స్మారక ఉపన్యాసంలో ఈ ప్రకటన చేశారు సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. లింగ వివక్షకి అంబేద్కర్ చెప్పిన పరిష్కారం యూనిఫారం సివిల్ కోడ్ అన్నారు. వెంటనే ఆ వార్తని సోషల్ మీడియాలో దళితవాదులు ప్రగతిశీలులు ప్రచారంలో పెట్టారు. శాంతిశ్రీ ధూళిపాళ పండిట్ అన్నది ఏమిటంటే హిందూ దేవతలు అందరూ బ్రాహ్మణ ఇతరులే అగ్ర వర్ణేతరులే. మలిన వస్త్రాలు పాములు ధరించే శివుని దుస్థితికి వర్ణవివక్ష కారణం. శివుడు షెడ్యూల్ కులానికి చెందినవాడు. మనుస్మృతి వర్ణవివక్షకి మూలం. వెంటనే నిషేదించాలి. అంతేకాదు అంబేద్కర్ ప్రవేశపెట్టినది హిందూ కోడ్ బిల్లు కాదు, యూనిఫార్మ్ సివిల్ కోడ్. ఈ చివరి మాటలో అసలు రహస్యం ఉంది. ఉమ్మడి పౌరస్మృతిని హిందూ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుంది. అయితే హిందూ ప్రభుత్వం చేయాలనుకుంటుంది ఏమిటంటే హిందూ ధర్మాలని హిందూ చట్టాలని అందరికీ అన్వయింపజేయడం అందరిమీద రుద్దడం అనే అభిప్రాయం ఉంది. హిందుత్వ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చిన ఈ ఉపన్యాసాన్ని ప్రగతిశీల మేధావులు సరిగా అర్థం చేసుకోక ప్రగతిశీల ప్రకటనగా భావించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేసేసారు. హిందూ కోడ్ బిల్ అనే మాటలో మతస్పృహ కనబడుతుంది కానీ ఉమ్మడి పౌర స్మృతి అనే మాట పూర్తిగా సెక్యులర్. కులమతాలతో సంబంధం లేకుండా అందరు పౌరులకి ఒకే సెక్యులర్ చట్టాలని అమలు చేయాలనే స్పృహ ఈ పదంలో కనపడుతుంది. రాజ్యాంగంలో కూడా తొందరలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని రాసుకున్నారు. నిజానికి ఈ ఉపన్యాసం ఇచ్చిన వైస్ ఛాన్స్‌లర్ శాంతిశ్రీ ధూళిపాల పండిట్ కమ్యూనిస్టు రష్యా లెనిన్ గ్రాడ్‌లో 1962లో జన్మించడం విశేషం. ఇటువంటి కమ్యూనిస్టు నేపథ్యం నుంచి వచ్చిన పండిట్ ముస్లిం వ్యతిరేక ప్రకటనలు చేసి రచ్చకెక్కడం విచిత్రం. హిందుత్వ నేపథ్యం కలవారుగా ముద్రపడ్డారు ఈవిడ. ఈ ఉపన్యాస పాఠం మన సెక్యులరిస్టులు దళిత బహుజన వాదులను ఎందువల్ల అంతగా ఆకర్షించింది అనేది నన్ను ఆశ్చర్యపరిచింది. నిజానికి 2021 లోనే హిందూత్వ విద్యార్థి సంస్థ ఎబివిపి విద్యార్థులు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే మనుస్మృతి దహనం చేశారు. వాస్తవాలను అర్థం చేసుకొనే శక్తి ఉన్న ప్రగతిశీల మేధావులు అరుదేనేమో.
కేరళ దళిత మేధావి ప్రొఫెసర్ ఎం. కుంజమన్ అంటారు: “మోడీ వైఖరి వల్ల బ్రాహ్మిణిజం అంతరిస్తోంది, నాన్ బ్రాహ్మినికల్ హిందుత్వ బలపడుతోంది.” అన్ని కులాలను కలుపుకుపోయే మెగా రెలిజియన్ హిందుత్వ. ఇతర మతాలైన బౌద్ధ జైనాలపై దాడి చేసిన వీరశైవమును మించిపోయి, హిందుత్వ ప్రస్తుతం మైనారిటీలకు ముప్పుగా మారచ్చు. హిందుత్వ అసలు లక్ష్యం అదే.
ఈసందర్భంగా తమిళనాడు గుర్తు వస్తుంది. కుల నిర్మూలనను నాస్తికత్వంతో కలిపి ప్రచారం చేశారు తమిళ మేధావులు. కానీ అక్కడ కుల వివక్ష దాడులు ఎక్కువ. కానీ హిందుత్వ లేదు అక్కడ. హిందుత్వ కుల వివక్ష స్థానాన్ని మత వివక్షతో భర్తీ చేయగలదు అదే దాని బలం. అందుకే దళిత బహుజనులలో కూడా బలం పుంజుకుంది. ఇది అర్థం కానివాళ్ళు ఇంకా పాత సిద్ధాంతాల చట్రాలలోనే తిరుగుతుంటారు.
లెప్టిస్ట్ నియంతృత్వం నుంచి రైటిస్ట్ నియంతృత్వంలోకి
ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని మేధావులు రాజ్యాంగ నియంతృత్వంగా వ్యాఖ్యానించారు. విషానికి విషమే విరుగుడు అన్నట్లు న్యాయాన్ని న్యాయంతోనే చట్టాలను చట్టంతోనే అణచివేయడం అనే వైరుధ్యాన్ని1975 -77 మధ్య ప్రధాని ఇందిరాగాంధీ అమలు చేశారు. ఆశ్చర్యకరంగా ఆ సమయంలోనే సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను రాజ్యాంగంలో చేర్చారు. ఇప్పుడు మనం సెక్యులరిజానకి ముప్పు వస్తోంది అని బాధపడడం మరో వైరుధ్యం. ఎమర్జెన్సీకి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మద్దతు పలికడం విశేషం.
ఇందిరాగాంధీ తన నియంతృత్వ విధానాల వెనుక ప్రజాస్వామ్యాన్ని బలపరచాలనే ఉద్దేశం ఉంది అని సమర్థించుకున్నారు. హిందూత్వ వాదులు ఫాసిజాన్ని బలపరచాలని చూస్తున్నారు. నాజీలు కూడా చిన్న సమూహంగానే ప్రారంభమై జాతీయ ప్రజా జీవితంలోని అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయారు. అలాగే హిందుత్వ వాదులు కూడా చొచ్చుకుపోతున్నారు. తప్పుడు అవగాహనని, గందరగోళాన్ని హిందుత్వవాదులు సృష్టిస్తున్నారు. అలాగే మైనార్టీలకి ముప్పుగా మారారు. యువకులలో హింస ప్రవృత్తిని పెంచుతున్నారు అని ఇందిరా గాంధీ ప్రకటించారు. ఫాసిజం అబద్దాలను ప్రచారం పెడుతోంది అన్నారు. విద్యాసంస్థలలో రాజకీయాలు పెరిగిపోయాయని, ఢిల్లీ యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులని జైళ్ళలో కుక్కారు. హిందూ విద్యార్థి సంఘం ఏబీవీపీ, ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ పైన కూడా దాడులు జరిగాయి. కొందరు హిందుత్వ నాయకులు కూడా పోలీస్ హింసను ఎదుర్కొన్నారు. కమ్యూనిస్టు సోవియట్ యూనియన్‌తో ఇండియా మైత్రి నెరపుతున్న కాలం అది. అందుకే ఫాసిజం నాజీయిజం మత తత్వ ప్రమాదాలను తన మొనోపలీకి సమర్థనగా వాడుకున్నారు ఇందిరాగాంధీ. అలాగే విదేశీ శక్తుల ప్రమేయం, జాతీయతా సెంటిమెంట్ కూడా వాడుకున్నారు ఇందిరాగాంధీ. ఇప్పుడు హిందుత్వ వాదులు మరో రూపంలో అదే చేస్తున్నారు. అలాగే పాపులిజం జనాకర్షణ ప్రధాన రాజకీయాలు అప్పుడూ ఇప్పుడూ ప్రధానమే.
ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థులు అన్ని సిద్ధాంతాలకు సంబంధించిన వ్యక్తులు యాంటీ నేషనల్ జాతి వ్యతిరేకులుగా ఎమర్జెన్సీలో నిందని ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీ డిసిప్లినరీ డెమోక్రసీ -క్రమశిక్షణతో కూడిన ప్రజాస్వామ్యం అవసరమన్నారు. ఉన్నత స్థాయి సామాజిక క్రమశిక్షణ, ఆర్థిక అభివృద్ధిని సాధించే ప్రజాస్వామ్యం అవసరం, అది జాతీయ కర్తవ్యం అన్నారు. వాక్ స్వతంత్రం, పత్రిక స్వేచ్ఛ హరించబడ్డాయి. కాంగ్రెస్ నాయకుడు మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి భీమ్ సేన్ సచార్ (82) అనేక మందితో కలిసి పత్రికా స్వేచ్ఛ కోసం నిరసన తెలిపారు. చాలా వినయంగా ప్రధానికి లేఖ రాశారు. “ప్రధాని అదనపు అధికారాలని మేము ప్రశ్నించడం లేదు. కానీ ప్రజలు మాట్లాడుకోవడానికి కూడా భయపడుతున్నారు. కమ్యూనిస్టు దేశాలలో వలె గుసగుసలు పోయే దీనస్థితికి నెట్టబడ్డారు. అందువల్ల పత్రికా స్వేచ్ఛ, సభాహక్కు, వాక్ స్వతంత్రము కాపాడాలి” అని కోరారు. కానీ దీనికే ఉన్నత అధికారులు రాజద్రోహం ముద్ర వేసి జైలులో పెట్టారు. ఇంతగా ప్రజాస్వామ్యం కనుమరుగైన కాలంలోనే, బెంగాల్ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యదర్శి ఇందిరా గాంధీ నియంతృత్వానికి మద్దతుగా మాట్లాడారు”ఆంగ్లో శాక్సన్ తరహా ప్రజాస్వామ్యాన్ని భారత్‌లో అమలు చేయడం కుదరదు. దానికి ఇంకా చారిత్రక సమయం రాలేదు. ఇంకా ప్రజల చైతన్యం ఆ స్థాయికి ఎదగలేదు” అన్నారు. సిపిఐ పార్టీ ఎమర్జన్సీకి బహిరంగ మద్దతు తెలిపింది కూడా.
నిజానికి ఇందిరాగాంధీ కమ్యూనల్ రాజకీయాలని బలంగానే పోషించారు. సిక్కుమత వాదులను ఎన్నికల రాజకీయాలలో వాడుకొని, ఫలితంగా మత తత్వం పెరిగి దానివల్లనే హత్యకు గురయ్యారు. ఆమె హత్య తర్వాత సిక్కుల మారణకాండ కూడా జరిగింది. పేదల సంక్షేమం ఆర్థిక అభివృద్ధి పేరుతోనే ఎమర్జెన్సీలో నియంతృత్వం అమలు చేయబడింది. రాజ్యాంగం సోషలిజం సెక్యులరిజం పేరు చెప్పుతూనే అన్ని పార్టీలని సంస్థలని అణిచివేశారు.
ఇప్పుడు కథ మారింది. కమ్యూనిస్టు దేశాలు అంతరించాయి గ్లోబలైజేషన్ యుగంలో ఇప్పుడు హిందు రైటిస్టులు మరో రూపంలో ఎమర్జెన్సీ భాషనే ఉపయోగిస్తూ ముందుకు వచ్చారు. ఉమ్మడి సివిల్ కోడ్, ఒకే చట్టం, ఒకే దేశం, స్త్రీల హక్కుల పరిరక్షణ, జాతీయత, శాంతి భద్రతలు వంటి సెక్యులర్ భాషని చట్టబద్ధ భాషని వాడుతున్నారు. కమ్యూనిస్టు పరిభాష బదులు రైటిస్ట్ మత పరిభాషని ఒకే దేవుడు ఒకే మతం కూడా జత చేస్తున్నారు. సెక్యులరిజం సోషలిజం లకు బదులు హిందుత్వ సహనానికి ప్రతీక అంటున్నారు. విద్యార్థులపై విద్యాసంస్థలపై మేధావులపై దాడులు, అరెస్టులు ఇటీవల సాధారణం అయ్యాయి. ఇందిరా గాంధీ మైనారిటీలకు ముప్పు వచ్చింది అంటే, హిందూ వాదులు మెజారిటీ హిందువులకి ముప్పు వచ్చి పడింది అంటున్నారు. ఆనాటి ఇందిర కానీ ఈనాటి హిందుత్వ వాదులు కానీ విదేశీ శక్తుల ప్రమేయం అనే మాటను యథేచ్ఛగా వాడడం గుర్తించాలి. అరాచకం హింస అప్పుడూ ఇప్పుడూ భిన్న రూపాల్లో కొనసాగుతోంది. లెఫ్టిస్టు రైటిస్ట్ సెంట్రిస్టుల మధ్య ఇంతగా సామ్యం ఎలా సాధ్యమైంది? ఆ మూలాలను తెలుసు కొననిదే నియంతృత్వ రోగమూలాలను గుర్తించలేం.
రాజ్యాంగంలోనే నియంతృత్వం
భారత రాజ్యాంగాన్ని వలసవాద రాజ్యాంగం — కలోనియల్ కాన్స్టిట్యూషన్ అంటారు, న్యాయ శాస్త్రవేత్త అర్ఘ్య సేన్
గుప్త. ఆధునిక సమస్యలకి సంక్షోభాలకి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో మనుస్మృతి లోనో మరోచోటో మూలాలను వెతకడం పలాయనo మాత్రమే. రాజ్యాంగం పట్ల భక్తి కాదు, అవగాహనముఖ్యం. స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వాలకు అనుకూలమైన చట్టాలు మాత్రమే కాదు, వాటిని అరికట్టే విధానాలు కూడా రాజ్యాంగంలోనే ఉన్నాయి. అందులో ప్రివెంటివ్ డిటెన్షన్ లా ప్రధానమైనది కొన్ని ప్రత్యేక పరిస్థితులలో న్యాయాన్ని సకాలంలో పొందే హక్కుని జీవించే హక్కుని వాక్ స్వాతంత్యాన్ని సకల సహజ హక్కుల్ని రాజ్యాంగమే పూర్తిగా నిరాకరించవచ్చు. రాజ్యానికి ముప్పు రావచ్చును అన్న భయం ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులని నిరాకరించటం సబబే అని అంబేద్కర్ అన్నారు. దీనిపై రౌలత్ చట్టం లాంటి వలసవాద చట్టాలని పేరు మార్చి దొడ్డిదారిన ప్రవేశ పెడుతున్నారు అని కొందరు రాజ్యాంగ సభ సభ్యులు తీవ్రంగా విమర్శించారు. నగరీ కరణ వెనుకబడిన భారత్‌లో గ్రామాల పట్ల నిర్లక్ష్యం, రాష్ట్రాల కంటే కేంద్రాలకి ప్రాధాన్యం, కేంద్రీకరణ, మెగా పరిశ్రమలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం లాంటి చర్యలు ఎప్పటికైనా దేశాన్ని నియంతృత్వంలోకి నడిపే అవకాశాన్ని సులభం చేశాయి. ఈ విషమ పరిస్థితికి రాజ్యాంగంలోనే బీజాలు ఉన్నాయి. కనుక రాజ్యాంగం కూడా నియంతృత్వానికి కారణం అవుతోంది.
చరిత్ర భావనలోని లొసుగులు
కమ్యూనలిజం వలసవాదముల ప్రభావంతో పురాణ కల్పనలకి ప్రాధాన్యం తగ్గి, చారిత్రక కల్పనలకు ప్రాధాన్యం హెచ్చింది. పురాణ కల్పనలో ప్రత్యక్షంగా కనపడని మానవ హృదయానికి చెందిన ఐక్యత సామరస్యం సాధ్యం అయ్యేది. కానీ చరిత్ర రచన ప్రగతి శీలత పేరుతో రేసిజాన్ని పెంచి పోషించింది. ఆర్య-అనార్య, హిందూ-ముస్లిం, బ్రాహ్మణ-అబ్రాహ్మణ…. ఇలా ఏమాత్రం కలవని కలుసుకోవడం వీలుకాని వైరుధ్యాలని వాటి మధ్య విద్వేషాన్ని ప్రచారంలో పెట్టింది. ఆధునిక ప్రగతిశీలులు బౌద్ధాన్ని భారతీయ ప్రొటెస్టెంట్ ఇజంగా హిందూ కులజాతి విద్వేషాలకి విరుగుడుగా సంస్కరణ మతంగా పైకెత్తుతారు కానీ, శ్రీలంక బౌద్ధాచార్యులు ధర్మపాల బౌద్ధులు ఆర్యజాతి వారు అని తమిళులు నీచ అనార్య జాతికి చెందిన వారిని ప్రచారం చేశారు. అంతేకాదు బౌద్ధులు కూడా హిందువులే అని ప్రకటించారు. 1923లో కాశీలో జరిగిన అఖిల భారత హిందూ మహాసభలో అనగారక ధర్మపాల బౌద్ధులంతా హిందువులే అని ప్రకటించారు. నిజానికి హిందూయిజాన్ని ప్రపంచమంతా ప్రచారం చేసింది బౌద్ధమేనని, ఇస్లాం మతం వల్ల రెండు మతాలకి ఇక్కట్లు వచ్చి పడ్డాయని అన్నారు. ఘర్ వాపసి అవసరమని కూడా అన్నారు. వందేళ్ళ తర్వాత 2025లో జరుగుతున్న కుంభమేళాలో బౌద్ధులు హిందుత్వ కలిసి వేదిక పంచుకున్నారు. ఐక్య సంఘటనగా మారారు. అంబేద్కర్ నవ బౌద్ధం హిందూయిజానికి పూర్తి విరుద్ధమైనదని హిందూ దేవతలను అంబేద్కర్ నిరసించాడు అని దళిత బహుజన వాదులు అంటారు. నిజానికి దేవతలను ధిక్కరించటం అసలు ప్రధానమైన విషయం ఏమి కాదు (వేదాన్ని పూర్తి ప్రమాణంగా భావించే ఆర్య సమాజ్ దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాష్ గ్రంథంలో అంబేడ్కర్‌ను మించి హిందూ పురాణ దేవతలపై దుమ్మెత్తి పోశారు). అంబేద్కర్ నాగపూర్‌లో 1956లో బౌద్ధ మత స్వీకరణ సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసంలో అంటారు “భారతదేశంలో బౌద్ధ పతనానికి ప్రధాన కారణం ముస్లిం దండయాత్రలు. వేలాది బౌద్ధ ప్రతిమలు ధ్వంసం చేయబడ్డాయి. అనేక విహారాలు విధ్వంసం అయ్యాయి. వేలమంది భిక్షువులు హత్య కావించబడ్డారు. అమానవీయమైన ఈ రక్తపాతం వల్ల భయకంపితులైన భిక్షువులు పక్క దేశానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. ఫలితంగా ఈ దేశం నుండి భిక్షువులు అదృశ్యం అయ్యారు.” హిందూమతం వివక్షతో కూడినది అంటూ బౌద్ధమత స్వీకరణను జాతి విముక్తిగా ప్రకటించిన అత్యంత ప్రధాన సందర్భంలో అంబేద్కర్ చేసిన ఈ ఆరోపణలు హిందుత్వవాదులకు వినసొంపుగా ఉంటాయి. అందుకే ప్రముఖ దళితవాది గేయిలీ ఆమ్ వెట్ అంటారు “అంబేద్కర్‌కు ముస్లింల పట్ల సానుకూలత లేదు. సుఫీలాంటి బహుళత్వంతో కూడిన ముస్లిం సంప్రదాయాలని ఆయన పట్టించుకోలేదు” అని విమర్శించారు. బర్మా బౌద్ధ ఉపన్యాసంలో అంబేద్కర్ బ్రాహ్మణులు బౌద్ధులుగా మారనందుకు తెగ బాధపడి పోతారు. ఒకప్పుడు ఎక్కువమంది బ్రాహ్మలు బౌద్ధులే అని, బౌద్ధ అహింస స్ఫూర్తితోనే గోవధ నిషేధం కోసం ఈనాడు బ్రాహ్మణులు పోరాటం చేయగలుగుతున్నారు అని, అది బౌద్ధం గొప్పతనం అని అంబేద్కర్ అంటారు. ఈ మాటలలో హిందూత్వ కనబడుతుంది. బౌద్ధాన్ని అధ్యయనం చేయడం కోసం బర్మా శ్రీలంక దేశాలలో పర్యటించి బౌద్ధ సన్యాసులను కలిసి బౌద్ధ సభలలో ఉపన్యాసాలు ఇచ్చిన అంబేద్కర్ అప్పటికే బలపడుతున్న హిందూ బౌద్ధ బంధాన్ని విమర్శించలేదు. కమ్యూనిజాన్ని మాత్రం తీవ్రంగా విమర్శించారు. దీనికి కారణం కులవ్యవస్థ అసలు ప్రమాదం అని, హిందూత్వ అంత ప్రమాదకరం కాదు అనే భావన ఉండడం కావచ్చు. సనాతన బ్రాహ్మణుల వలె హిందుత్వ వాదులు వర్ణ వ్యవస్థకు అంత ప్రాధాన్యం ఇవ్వరు. అందుకే సావర్కర్ కుల నిర్మూలనని ప్రచారం చేయడమే కాదు, అంబేద్కర్ ప్రారంభించిన మహద్ చెరువు పోరాటానికి మద్దతు పలికారు అని ధనంజయకీర్ రాశారు. అందుకే తనని తాను సనాతన హిందువుని అని ప్రకటించుకునే గాంధీ అంబేద్కర్‌కు ప్రమాదకరంగా కనిపించాడు కానీ హిందుత్వ వాదులు ఆస్థాయిలో కాదు. హిందుత్వవాదులు వేద పురాణ ధర్మాన్ని విడిచిపెట్టి చారిత్రక హిందూత్వను ఆశ్రయించారు, హిందువులే ఆర్యులు అన్నారు. బౌద్ధులు తామే ఆర్యులమని అన్నారు. ఆధునిక జాతివాదం, హిస్టారికల్ రేసిజం ప్రగతిశీలులకి ఆధునికమైనదిగా కాలంలో పురోగమన శీలమైనదిగా కనబడింది. గతకాల కుల వ్యవస్థను విడిచిపెట్టి జాతివాదం వైపు మల్లడం చారిత్రక పురోగతిగా ప్రగతిశీలులు భావించారు. అందుకే ఒక బౌద్ధ ఉపన్యాసంలో బౌద్ధులు నాగజాతి వారు అని అంబేద్కర్ ప్రతిపాదిస్తాడు. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నడిపిన పెరియార్ రామస్వామి బ్రాహ్మణులు ఆర్యులు కాదు, యూదు జాతి వారు అంటారు. ఆర్యులలో జ్ఞానం, వీరత్వం వంటి ఉన్నత లక్షణాలు ఉన్నాయి. యూదులలో అవి శూన్యం. అందువల్ల బ్రాహ్మణులని యూదులతో పోల్చడమే బెటర్ అని పెరియార్ రామస్వామి నాయకర్ భావించారు. ఈ అభిప్రాయంలో ఆనాటి యాంటీ సెమిటిజం ప్రతిధ్వనిస్తుంది. ఇటీవల బహుజన మేధావి కంచె ఐలయ్య యూదులు ప్రగతిశీలురు నాగరికులు అని ముస్లింలు వెనుకబడిన వారు అని ప్రకటించారు. అంబేద్కర్ ఇజ్రాయిల్ ఆవిర్భావాన్ని నాగరికతా ప్రక్రియగా (సివిలైజేషన్ మిషన్) వర్ణించారు.
మొత్తంగా ఈ వాదనలు అన్నిటిలోనూ సాధారణ ధర్మం ప్రాచీన అస్తిత్వాల స్థానంలో జాతి రేస్ భావాన్ని బలపరచడం కనిపిస్తుంది.
ఇలా కొన్ని సహజసిద్ధమైన పుట్టుకతో వచ్చే జాతి లక్షణాలు ఉంటాయి అనేది సూడో సైన్స్, సోషల్ డార్వినిజం. ఈ సూడో సైన్సును ప్రగతిశీలతగా ఆధునికులు ప్రగతిశీలలు భావించారు ఇది రేసిజానికి ఫాసిజానికి బీజంగా మారింది. ఇది జాతి విద్వేషాలు మతవిద్వేషాలకి కారణం అయ్యింది. వామపక్ష దళిత బహుజన నాస్తిక వాదులు ప్రగతిశీలంగా కనపడే ఒక మార్మిక భాషను ఆశ్రయిస్తారు. చరిత్ర అని విజ్ఞాన శాస్త్రము అని ప్రగతి అని ఇలా ఆధునిక పదజాలంతో పరోక్షంగా ఫాసిజానికి, నియంతృత్వానికి దారులు ఏర్పరిచారు. ప్రధానంగా ఇది ఆధునికతలోని పరిమితి. హిందూ మతాన్ని తాలిబానీకరిస్తే ప్రపంచానికే ముప్పు అంటారు ఆధ్యాత్మిక వేత్త శ్రీ ఎం. నిజానికి హిందుత్వ వాదులు తాలిబాన్లలా మతవాదులు కాదు. అభివృద్ధి లౌకికతలని వాళ్ళు ప్రమాణంగా భావిస్తారు. ఆ పేరుతో కార్పొరేట్ పెట్టుబడి దారులకి అండగా నిలుస్తారు. అయితే ఆధునికులు అందరూ జాతివాదం (రేసియల్) భాష వాడడం మామూలే జాతి (రేస్ )జాతీయత-నేషనాలిటీకి మధ్య ఏమాత్రం దూరాన్ని పాటించరు. హిందూత్వవాదులు కూడా అంతే. నిజానికి కులమతాలు వాళ్ళకి ప్రధానం కాదు. హిందూత్వ ప్రభుత్వం పవిత్ర కాశీపట్టణాన్ని ఆధునికీకరించటం కోసం ఎన్నో ప్రాచీన పవిత్ర నిర్మాణాలను ధ్వoసం చేసినట్లు సంప్రదాయ వాదులు వ్యతిరేకించారు. కానీ హిందూ వాదులు అసలు పట్టించుకోలేదు. ఒకప్పుడు కాశి ఆధునికీకరణ కోసం సంజయ్ గాంధీ దూకుడుగా ప్రయత్నిస్తే ఇందిరా గాంధీ సంప్రదాయవాదులకు భయపడి ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది కానీ, హిందుత్వ ప్రభుత్వం వెనకాడ లేదు. మరో విషయం గంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని సన్యాసిగా మారి నిరాహార దీక్షకు దిగిన స్వామి సానంద్ ప్రతిపాదనలని ఉత్తరాలని హిందుత్వ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. గంగా తీరంలో ఆధునిక ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలుపుదల చేసి పర్యావరణానికి తోడ్పడాలని స్వామి సానంద్ డిమాండ్‌ను హిందూ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దానితో స్వామి నిరాహార దీక్ష చేస్తూ మరణించారు కూడా. అధిక ఉత్పత్తి, అభివృద్ధి, వ్యాపారం వీటిని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లడమే హిందూత్వ రాజకీయాల లక్ష్యం. దానిలో భాగంగానే జాతి విద్వేషం కమ్యూనల్ రాజకీయాలు కూడా అవలంబిస్తారు. భారతదేశంలో కమ్యూనలిజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే చరిత్ర గురించి, రాజకీయాల గురించి అధ్యయనం సరిపోదు. తాత్విక మూలాలు వెతకాలి.
కమ్యూనలిజం తాత్విక మూలాలు
సెక్యులరిస్టులు కమ్యూనిస్టు హిందుత్వవాదులు ఏకకాలంలో విశ్వమంత విశాల బుద్ధిగల తత్వవేత్తగా మెచ్చుకునే వ్యక్తి వివేకానంద. ఇది ఎలా సాధ్యమైంది? విభిన్న ఆలోచనలు గలవారిగా కనబడే వీరందరూ కలిసే మీటింగ్ పాయింట్ ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే అందరు ఆధునిక మేధావుల లోగుట్టు తెలుస్తుంది.
వివేకానందస్వామి హిందూ మతాన్ని అన్ని మతాలకి తల్లిగా, సహనశీలమైన మతంగా, అన్ని మార్గాలు చేరుకునే ఒకే ఒక గమ్యంగా వర్ణించాడు. ప్రపంచ వేదికపై హిందూ అస్తిత్వాన్ని జెండాగా ఎగరవేసి హిందువుల ఆత్మగౌరవాన్ని, గర్వాన్ని పెంచిన వాడిగా వివేకానందకి పేరు ఉంది. అదే సమయంలో సెక్యులరిస్టుల దృష్టిలో మతసహనాన్ని సామరస్యాన్ని బోధించిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. క్రైస్తవ మిషనరీలు కొందరు భారత ఖండాన్ని, బ్రాహ్మణుల కర్మకాండని, హిందూ ఆచారాలని పాత నిబంధన గ్రంధం పరిధిలోనివిగా భావించారు. అంటే భారతీయులు పాత నిబంధన కంటే ఉత్తమశ్రేణికి చెందిన క్రీస్తు సువార్త కోసం వేచి ఉన్నవారిగా, మత చరిత్రలో వెనకబడినవారుగా భావించారు. వారికి సమాధానంగా వివేకానంద వారి పద్ధతిలోనే హిందూమతం అన్ని మతాలు అనుసరించవలసిన సువార్తగా చాటి ఉంటే, వేరే విధంగా ఉండేది.
కానీ, హిందూ ధర్మం ఒక మతం కాదనీ, ప్రత్యక్ష అనుభవం, సైంటిఫిక్ హేతువులపై ఆధారపడిన ఒక మార్గం అని ఆయన భావన. ఇతర మతాలు డాగ్మాటిక్ ఊబిలో పడి కేవలం మతాలుగానే మిగిలిపోయాయి అన్నాడు వివేకానందుడు. రీజన్ -హేతువు అనే తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగిస్తాడు వివేకానంద. దీనివల్లనే హిందుత్వవాదుల నుంచి సెక్యులర్ వాదుల వరకు అన్ని రకాల మేధావులు వివేకానందాన్ని పొందుతారు ఆయనలో.
ఆధునిక కాలంలో అందరికీ హేతువు అనేది ఆరాధ్య దైవంగా మారింది. గాడ్సే తాను గాంధీని హత్య చేయడం ద్వారా ‘హేతు’బద్ధంగా జాతీయతను నిర్మించడానికి మార్గం ఏర్పరిచాను అన్నాడు. అంబేద్కర్ కర్మ, పునర్జన్మ లాంటి ‘హేతు’ విరుద్ధ నమ్మకాలను తొలగించి నవయాన బౌద్ధం పేరుతో హేతుబద్ధమైన మతానికి దారి చూపాను అన్నాడు. దైవాన్ని నమ్మే ఇతర మతాలు వెనకబడినవి అన్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ అద్వైతం థియాలజీ కాదు, ఫిలాసఫీ అన్నాడు. అలా నిర్వచించటంలో విశ్వాసాలకు స్థానం లేని హేతుబద్ధ అన్వేషణ అద్వైతం అని చాటటమే సర్వేపల్లి వారి ఉద్దేశం అంటారు తత్వవేత్త అనంతానంద రామ్ బచన్. ఆధ్యాత్మిక అనుభవం, సమాధి స్థితి అనేవి ప్రత్యక్ష అనుభవము అని చాటుతాడు వివేకానంద. వాటిని ఇంద్రియ అనుభవంతో పోలుస్తాడు. అంతటితో ఊరుకోడు. ఆధ్యాత్మిక అనుభవం సమాధి స్థితులను సైన్స్ చెప్పే ప్రయోగాలపై ఆధారపడిన హేతువుతో పోలుస్తాడు. అంటే అదొక ఆబ్జెక్టివ్ ట్రూత్.
అద్వైత అనుభవాన్ని ఆబ్జెక్టివ్ అన్నట్లయితే సబ్జెక్టు ఉండాలి. తెలుసుకునేవాడు తెలుసుకొనే బడేది అనే రెండు ఉండాలి. సైన్స్ ఈ విభజన నుంచే అభివృద్ధి చెందింది. ఆలోచన, ఆలోచించేవాడు, ఆలోచనకి అందే వస్తు జగత్తు, అనే విభజనపై ఆధారపడిన తత్వవేత్త డెకార్టే నుంచి నేటి సైన్సు దృక్పథం అభివృద్ధి చెందింది. సైన్సు పరిశోధనలో సైంటిస్టు విడిగా భావోద్వేగాలకు అతీతంగా వుండి విశ్లేషణాత్మక దృష్టితో పరిశోధన చేస్తాడు. దానికి భిన్నంగా అద్వైతంలో జ్ఞాని, బ్రహ్మతో పూర్తిగా తాదాత్మ్యం చెందుతాడు, అంటే మూల చైతన్యంలో పూర్తిగా కలిసిపోతాడు. సైన్సు చేసే పరిశోధన, హేతుబద్ధత ఈ విభజనపై ఆధారపడి ఉంది కానీ అద్వైతం ఎటువంటి విభజనని ఒప్పుకోదు.
జ్ఞాత జ్ఞానం జ్ఞేయo -తెలుసుకోవడం, తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది ఒకటే అని అద్వైతం బోధిస్తుంది. వివేకానందస్వామి డివిజన్‌కు వ్యతిరేకంగా అద్వైతాన్ని నిలపడానికి ప్రయత్నించాడు. మతపరమైన ద్వైతంపై (థియోలాజికల్ డివిజన్) యుద్ధం ప్రకటించాడు. క్రైస్తవం, జుడాయిజం, ఇస్లాంలు పూర్తిగా ద్వైత మతాలు. దేవుడు, మనిషి, ప్రకృతి ఇతర జీవులు సృష్టిలో వేటి స్థానం వాటిది. వాటి మధ్య సంబంధం పూర్తిగా హైరార్కికల్. అద్వైతం జీవుడు దేవుడికి అభేదాన్ని బోధిస్తుంది. జగత్తు పరబ్రహ్మ ఒకటే అంటుంది. అందువల్ల ద్వైత మతాలు అన్ని చివరికి అద్వైతంలో హిందూ మోనిజంలో కలవవలసినవి అని వివేకానంద అభిప్రాయం.
నిజానికి పడమటి మతాలు మాత్రమే కాదు, పాశ్చాత్య తత్వశాస్త్రం కూడా ద్వైతంపై (డ్యూయల్ ఇజం) ఆధారపడి వృద్ధి చెందింది. ప్రముఖ తత్వవేత్త కాంట్ మానవ దృక్పథాన్ని ఫెనామెనా-నౌమినా అని విభజించాడు, మానవ చైతన్యానికి వస్తు జగత్తుకి పూడ్చరాని అగాధం ఉందనీ, మనిషి ఇంద్రియాలకీ బుద్ధికీ వస్తుగత సత్యం అందదనీ అన్నాడు. మరో తత్వవేత్త హెగెల్ దృక్పథంలో ప్రపంచానికి మూలమయిన స్పిరిట్ (భావం) పరిణామం చెందుతుంది. వివిధ దశలలో చారిత్రకంగా వ్యక్తమౌతూ ఉన్నత స్థాయికి ప్రయాణిస్తుంది. మూల పదార్ధం అనదగిన స్పిరిట్‌లో ఇటువంటి మార్పుని ప్రతిపాదించటం ద్వారా సాపేక్ష-నిరపేక్ష (అబ్సల్యూట్-రిలెటివ్) సత్యాలకు మధ్య దూరాన్ని హెగెల్ అలాగే నిలిపాడు. (అద్వైతంలో పరమ సత్యం(పరబ్రహ్మ)లో ఎటువంటి పరిణామం ఉండదు. పరిణామం జగత్తు, స్వప్నం వలె భ్రాంతి).
డ్యూయలిజం — ద్వైతం ద్వారా మాత్రమే మానవ నైతికత, హేతుబద్ధ సమాజ నిర్మాణం సాధ్యమవుతాయి అని పాశ్చాత్యులు భావించారు. అందువల్ల డ్యూయలిజం లోపించటం అనేది భారతీయులలోని, ప్రత్యేకంగా హిందువులలోని, లోపం అని పాశ్చాత్యులు తలచారు. డ్యూయలిజం లోపించడం వల్ల కర్త, ద్రష్ట ఉండరు. ఆబ్జెక్టివ్‌గా ప్రపంచాన్ని పరిశీలించి మార్చే ఏజన్సీ ఉండదు. దేవుడు, మనిషి, ఇతర జీవులు పూర్తిగా వేరు అనడం వల్ల దేవుని సన్నిధిలో మనుషులు అందరూ సమానులు అని, మనిషి ప్రకృతిలో ప్రత్యేకమైన వాడు అనే వాదం అది. దాని వల్ల హ్యూమనిజం మానవ విలువలు, నైతికత సామాజికత వృద్ధి చెందాయి. అద్వైతం పాన్‌థీయిజం లలో అది అసాధ్యం అని పాశ్చాత్యుల అభిప్రాయం. డ్యూయలిజం వల్ల ఆంత్రపోసెoట్రిజం పెరిగి విశాల దృష్టి తరిగింది అనే విమర్శ వుంది, అది వేరే విషయం.
ఈ డ్యూయలిజాన్ని ఎదురీదాడు వివేకానంద. అద్వైతం సర్వసమానత్వాన్ని సర్వ మతాల సారాన్ని వ్యక్తం చేస్తుంది. అదే హిందూ మతం అన్నాడు. అన్ని హైరార్కీలని, అసమానతలని అధిగమించగల మతం అది ఒకటే అని వివేకానంద అన్నాడు. అద్వైతం అనే పదానికి ఒకటే అని అర్థం కాదు, రెండు లేవు అని మాత్రమే అర్థం అంటారు తత్వవేత్త అనంతానంద బచన్. ప్రపంచం కలలా మిథ్య, బ్రహ్మ(పరమాత్మ) సత్యం అని ప్రపంచ వాస్తవికతను సృష్టి వైవిధ్యాన్ని మొత్తం గా తిరస్కరించడం కాదు. బ్రహ్మయొక్క, భగవంతుని యొక్క వైవిధ్య భరిత సృజనాత్మక వ్యక్తీకరణగా ప్రపంచాన్ని చూడాలి అంటారు ఆయన. అంటే సజీవ బహుళ ప్రపంచంపై యూనిఫార్మిటీని ఏకత్వాన్ని రుద్దడం అద్వైతం కాదు. అందుకే అద్వైతం అంటే రెండు కాదు అని మాత్రమే అర్థం అంటారు అనంతానంద బచన్. కానీ వివేకానంద తాత్వికంగా, ప్రధానంగా మతపరంగా, అద్వైతం పేరుతో ఏకత్వాన్ని మోనిజం మోనోథీయిజం స్థాపించాడు. ఇదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోల్వాల్కర్ గారి ఏకాత్మ వాదానికి మూలం. అందుకే ఇతర మతాలతో పోటీకి ఘర్షణకి దిగాడు. ఈ వైఖరి రామకృష్ణ పరమహంసలో మచ్చుకు కూడా కనబడదు.
నిజానికి అబ్రహామిక్ మతాలు అనే కాదు, భారత ఖండంలో కూడా అనేక ద్వైత సిద్ధాంతాలు ఉన్నాయి. యోగం, కర్మ, భక్తి మార్గాలు, మధ్వ ద్వైత దర్శనాలు కూడా ద్వైత సిద్ధాంతాలకు సంబంధించినవే. కానీ వాటిని కూడా సమాధి – అద్వైత స్థితికి సోపానాలుగా మార్చడం ద్వారా ఒక సోపాన క్రమాన్ని ఏర్పరుస్తాడు వివేకానంద. నిజానికి శంకరాచార్య కూడా ఇలా సిద్ధాంతీకరించలేదు. పారమార్థిక వ్యావవహారిక (అబ్జల్యూట్-రెలిటివ్) సత్యాలలో వ్యావహారిక సత్యానికి చెందినదిగా ద్వైత మార్గాలను చూశారు అద్వైతులు.
కాగా వివేకానంద అన్ని మార్గాలని అద్వైత సిద్ధికి మార్గంగా చూపాడు. ఈ క్రమంలో శ్రుతి -వేదం కంటే అనుభవం గొప్పది. ఆధునిక సైన్సుతో పోల్చదగినది, హేతుబద్ధమైనది అని వివేకానంద ప్రతిపాదిస్తాడు. దీని వెనక ఒక మతలబు ఉంది. తన అనుభవం నుంచి ఉత్పత్తి అయిన జ్ఞానాన్ని ఒకే ఒక గ్రంథంగా మార్చి హిందూ బైబిల్‌ని సృష్టించటం, వైరుధ్యాలని వైవిధ్యాలని వడగట్టి ఒకే ఒక మోనో థియిష్టు, మోనిష్టు హిందూ మతాన్ని కల్పన చేసి దానినే విశ్వ మతంగా స్థాపించటం ఆయన లక్ష్యం. అదే హేతుబద్ధమైనది, ప్రత్యక్ష అనుభవ సిద్దమైనది అని చాటటం వివేకానందుని ఉద్దేశం. ప్రొటెస్టెంట్ క్రైస్తవులు చర్చి నుంచి కమ్యూనిటీ నుంచి మతాన్ని వేరుపరిచి వ్యక్తిగత విశ్వాసానికి అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వడం కోసం ఒకే ఒక గ్రంథం బైబిల్‌ను ప్రచారంలో పెట్టారు. వైవిధ్యాన్ని నిరాకరించారు. ఇదే పద్ధతిలో దయానంద సరస్వతి వేదం ఒక్కటే ప్రమాణం అని, పురాణాలు, వైవిధ్యంతో కూడిన దర్శనాలు ఆచార వ్యవహారాలు అన్ని బోగస్ అని వేదానికి తనదైన వ్యాఖ్యానాన్ని వేదిక్ బైబిలుగా స్థాపించాడు. అంబేద్కర్ నవయాన బౌద్ధం పేరుతో బౌద్ధ సంఘాల సంప్రదాయాన్ని గ్రంథ బాహుళ్యాన్నీ పక్కనపెట్టి ఒకే ఒక బుద్ధిష్ట్ బైబిల్‌ను తయారు చేయాలి అనుకున్నట్లు ఆయన భార్య సవితా అంబేద్కర్ రాశారు. అయితే వివేకానంద అన్ని సిద్ధాంతాలు దర్శనాలని అంగీకరిస్తూనే వాటిని తన అనుభవానికి సోపానాలుగా వ్యాఖ్యానించాడు. తెలివిగా తన అనుభవాన్ని విశ్వాసం అని కాక హేతువని, సైంటిఫిక్ ప్రయోగ ఫలితం అని అన్నాడు.
రెండు మతాలు
నిజానికి వివేకానందస్వామిలో రెండు మతాలు కనపడతాయి. మొదటి మతం ప్రచారాత్మక మతం. హిందూ మతాన్ని అన్ని మతాల పైన అగ్రశ్రేణిలో నిలిపే మతం. దూకుడు తనంతో కూడిన మతం ఇది. రెండవ మతం సర్వ మతాలు సర్వ సిద్ధాంతాల సమానత్వాన్ని బోధించే రామకృష్ణ పరమహంస మతం. మొదటి మతం వివేకానంద బహిర్ముఖం. రెండవ మతం అంతర్ముఖం. ఈ రెండిటి గురించి విపులంగా చర్చిస్తాను.
వివేకానంద దృష్టిలో వేదాలు, ప్రధానంగా ఉపనిషత్తులపై జ్ఞానకాండపై ఆధారపడినదే హిందూ మతం. పురాణాలు తక్కువ స్థాయివి, కాలబద్ధమైనవి, చారిత్రకమైనవి. పురాణాలు కథ పైన ఆధారపడ్డాయి. కథ అనేది మానవుని ఊహకీ కల్పనకీ మూల ధాతువు. మానవ అస్తిత్వం దాని పైనే ఆధారపడి ఉంది. అసలు కథ లేనిదే భాషా లేదు మానవుడూ లేడు. నిజానికి వేదాలలో ఉపనిషత్తులలో కుడా చాలా కథా, కథనం ఉన్నాయి. ఆధునికులు హేతువుకి పట్టం కట్టటం కోసం కథని, అంటే కల్పనని, చిన్న చూపు చూశారు. ఈ దృక్పథం వివేకానంద, దయానంద సరస్వతి వంటి వారిలో స్పష్టంగా కనపడుతుంది.
ఇలా చెప్తూ వివేకానంద ఇతర ప్రపంచ మతాలు పురాణ స్థాయిని దాటిపోలేదని అంటారు. అంటే అంతిమంగా వేదాలు ఉపనిషత్తులు మాత్రమే, అంటే హిందూ మతమే, అన్ని మతాలకీ ఆదర్శం, లక్ష్యం, కేంద్రం. హిందూ మతం అంటే వేదాలకి వివేకానంద సొంతగా (సమాధి స్థితి, అనుభవం ద్వారా) చేసిన వ్యాఖ్యానం. వివేకానంద అంటాడు: “మనం అందరం హేతుబద్ధ జీవులం. మనo హేతువునే కోరుకుంటాం. ఇంతకీ హేతువు అంటే ఏమిటి? వర్గీకరణ మాత్రమే. చివరికి వర్గీకరణ క్రమంలో పరిమితమైనది అనంతoలో విశ్రాంతి చెందుతుంది. ”
ఈ హేతువే భౌతిక స్థాయిలో ఉక్కు నరాలు ఇనుప కండరాలుగా, కంటికి కన్ను లాంటి ప్రతీకార స్థాయిలో వ్యక్తం అవుతుంది. ఆధునిక హేతువు పూర్తిగా పుంలింగం. వర్గీకరణకి ప్రాధాన్యమిచ్చి ఇతర మతాలని సిద్ధాంతాలని నిమ్న స్థాయివిగా పరిమిత స్థాయివిగా వర్గీకరించి తను నిర్వచించిన అనంతం అద్వైతానికి ఉన్నత స్థాయి కల్పించాడు వివేకానంద. ఇలా హేతువు అతి క్రూర మైనదిగా అణిచివేత సాధనంగా మారింది. ఈ హేతువే ఆధునిక కాలంలో అందరినీ ముస్లిం ద్వేషులుగా యాంటీ సెమిటిస్టులుగా, కమ్యూనలిస్టులుగా మార్చింది.
మరి వివేకానంద ప్రైవేటు మతం ఏమిటి?అది శ్రీ రామకృష్ణ పరమహంస బోధ. నిజానికి వివేకానంద లాగే మన అందరిలోనూ రెండు మతాలు ఉన్నాయి. రెండు ముఖాలు ఉన్నాయి. వలసవాద జ్ఞానం, ఆధునిక హేతువు సృష్టించిన హైరార్కికల్ ఆధిపత్య స్వభావం మొదటిది. రెండవది స్వచ్ఛమయినది, మన హేతుబద్ధతకు అట్టడుగున నిలిచిన అంతశ్చేతన, దీనినే గాంధీ అంతరాత్మ అంటాడు. రామకృష్ణ పరమ హంస క్రీస్తు అయితే, వివేకానంద పాల్ లాంటి మిషనరీ. రామకృష్ణ పరమహంస ఆధునిక విద్య లేని పల్లెటూరు పూజారి. ఆయన సంస్కృతం వేద వేదాంత గ్రంథాలు చదివినవాడు కాదు. నాటకాలు వేసేవాడు, పాటలు పాడేవాడు. హఠాత్తుగా ఒక సమాధి స్థితిలోకి వెళ్లేవాడు. హిందూ మతం అనే కాదు, అన్ని మతాలని వాటి ఆచారాలతో సహా ఆచరణలో పెట్టేవాడు. అంటే బహుళ అస్తిత్వములలోకి మారేవాడు. స్త్రీ వేషధారణ చేస్తే అచ్చం స్త్రీలాగే ఉండేవాడు. అతడొక అర్ధ నారీశ్వరుడు. ఆధునికత తెచ్చిన పురుషాధిపత్యాన్ని ఆధ్యాత్మికంగా అతిక్రమించాడు. వేదాంత రీతిలో వేదాంత బోధలో బూతులు కలిపి మాట్లాడేవాడు. అనుయాయులు రాతలోకి మార్చేటప్పుడు సెన్సార్ చేయవలసి వచ్చేది. ఎంతో చదువుకొన్న ఆధునిక సంస్కర్తలు విద్యావంతులు, మేధావులు కూడా ఆయన పట్ల తీవ్రంగా ఆకర్షితులు కావడం విశేషం. కారణం ఎంతో క్రమబద్ధమైన ఆధునిక హేతుబద్ధత చేస్తున్న నియంత్రణ నుంచి బయట పడాలని ఆకాంక్ష కావచ్చు. పాశ్చాత్య దేశాలలో విద్యకి గ్రంథానికి ప్రాధాన్యం ఎక్కువ. అందుకే ప్రొటెస్టెంట్ క్రైస్తవం ద్వారా సంస్కరణ తెచ్చిన మార్టిన్ లూధర్ ఒక ప్రతిష్టాత్మక యునివర్సిటీ ప్రొఫెసర్. కానీ మన మత సంస్కర్తలు వేమన, వీర బ్రహ్మం, రామకృష్ణ పరమ హంస వంటి వారు విద్యావంతులు కాదు. పుస్తకాల పురుగు అని వెటకారం చేయబడే విషయం. మనది మౌఖిక సంస్కృతి. ముఖే ముఖే సరస్వతీ. అందుకే లేఖనం తెచ్చే క్రోనలాజికల్ హిస్టరీ నుంచి బయటపడి ఏకకాలంలో అనేక మతాల ప్రవక్తలు పురాణ పురుషులుగా జీవించి అనంతంలో కదలాడే వాడు పరమహంస.
నదులు అన్నీ సముద్రంలో కలుస్తాయి, నదుల లక్ష్యం సముద్రం, అలలు అసత్యం, సముద్రం సత్యం అనే హైరార్కికల్ వేదాంతాన్ని బద్దలు చేశాడు రామకృష్ణ పరమహంస. అలలు సత్యమే, సముద్రమూ సత్యమే ఒకటి మరొక దానికి సోపానం కాదు, దారి కాదు. అన్ని రకాల వర్గీకరణలను నిరాకరించాడు. మతాలు అన్నిటిని అంగీకరించాడు, ఆచరించాడు. అదే సమయంలో తల్లి మతం పిల్ల మతం వంటి వ్యాఖ్యానాన్ని నిరాకరించాడు. రామకృష్ణ పరమహంస సమాధి స్థితిలో అనుభవాన్ని స్వతసిద్ధమైన స్వతఃప్రమాణ మైన స్థితిగా దర్శించాడు. అది హేతుబద్ధం కాదు హేతువు అంటే సాధారణీకరణ. సాధారణీకరణ ద్వారా తన అనుభవాన్ని పరమమైనదిగా ఉన్నతమైనదిగా నిర్ధారించి స్థాపించే ఆధ్యాత్మిక ఆధిపత్యం రామకృష్ణ పరమహంసలో లేదు. అందుకే ఆయన ఎవరికి అర్థం కాని ఉన్మాదిలా కనిపిస్తాడు. హేతువులోకి ఇమడని ప్రత్యేక స్వభావం ఉన్మాదంలా కనపడడం సహజం. కానీ అది అత్యంత సృజనాత్మక స్వభావం. నిజానికి మతం ఆధ్యాత్మికతల ప్రత్యేకత ఏమిటంటే దానిలో మార్మికత హేతుబద్ధతను అతిక్రమించి ఊహలో కల్పనలో పరిష్కారమిస్తుంది. వివిధ మతాలు, ఆచారాలు స్థల కాలాలను అధిగమించి సంగమిస్తాయి కానీ, మానవ అహం మతాన్ని ఆధ్యాత్మికతని హేతుబద్ధీకరించి రాజ్యoగా మారుస్తుంది. ఆధిపత్యంగా మారుస్తుంది. అదే క్రమంలో కమ్యూనలిజం పుడుతుంది.
మూలాలు
- Sharma, Jyotirmaya. Hindutva: Exploring the Idea of Hindu Nationalism. Penguin, 2004.
- Rambachan, Anantanand. The Limits of Scripture: Vivekananda’s Reinterpretation of the Vedas. University of Hawaii Press, 1994.
- Rambachan, Anantanand. Hindu Theology of Liberation: Not-Two Is Not-One. State University of New York Press, 2015.
- Jaffrelot, Christophe, and Pratinav Anil. India’s First Dictatorship: The Emergency, 1975–1977. HarperCollins, 2020.
- Sri M. “Hinduism is Talibanized, world would be destroyed.” The Indian Express, February 15, 2025.
- ఓబర్, డగ్లస్. “కుంభమేళ: బౌద్ధులను మచ్చిక చేసుకునేందుకు ఆరెస్సెస్ కసరత్తు.” వైర్ తెలుగు, March 1, 2025.
- అంబేద్కర్, బి. ఆర్. భారతదేశ విముక్తి మార్గం – బౌద్ధం (అంబేద్కర్ ప్రసంగాలు). అనువాదం: గౌరవ్. ప్రత్యామ్నాయ ప్రస్థాన కేంద్రం, 2021.
- ‘No god is a Brahmin,’ says JNU Vice Chancellor, flags ‘gender bias’ in Manusmriti. The Indian Express, August 23, 2022.
- Ambedkar, Savita, and Nadeem Khan (translator). Babasaheb: My Life with Dr. Ambedkar. Penguin Random House India, 2022.
- “ABVP burns Manusmriti copies in JNU.” The Hindu, November 17, 2021.
- Schweitzer, Albert. Indian Thoughts and Its Development. Beacon Press, 1957.
- Medhananda, Swami. Swami Vivekananda’s Vedāntic Cosmopolitanism. Oxford University Press, 2022.
- Singha, Naga P. The Professor and the Paramahansa: Martin Luther and Ramakrishna Compared. Western Oregon University.
- Ananthamurthy, U. R. Hindutva or Hind Swaraj. HarperCollins, 2018.
- “Kerala ‘Brahminical Hinduism disappearing, thanks to Modi’.” The Indian Express, April 23, 2023.
- Sen Gupta, Arghya. Colonial Constitution. Juggernaut Publications, 2023.
- Dr. Ambedkar and the Jewish People. News from Israel. Praja Bandhu, December 30, 1991. Velivada
- Modi’s Hindutva 2.0 written on Varanasi walls: Temple restoration, not mosque demolition.by Shekhar Gupta