ఇనుప కంచెలు, ప్రవేశాన్ని నిషేధించే మహాద్వారాలు, మృత్యువంటి కటికచీకటి కమ్మిన ప్రాసాదాలు, ఒంటరి గది, ఆరిన దీపం; రోజ్‌బడ్ అనే మార్మిక పదబంధాన్ని పలికి, కల కంటే గహనమైన మహానిద్రలోకి ఒత్తిగిల్లుతాడు చార్లెస్ ఫోస్టర్ కేన్. సిద్ధార్థ కొత్త కవితాసంకలనం మల్లెలతీర్థం మహాఖననంలో ముక్కుపుల్లలు అనే శీర్షికతో వివిధ విలక్షణమైన కవితలు చదివాక, మళ్ళీ మళ్ళీ చదివిన తర్వాత, ఒక కాగ్నిటివ్ డిసొనన్స్ (cognitive dissonance) స్థితికి చేరుకున్నాను: చదివాను, కానీ అర్థంకాలేదు, అయినా నిజమైన కవిత్వం, అర్థం కాకముందే అనుభూతమవుతుంది (genuine poetry can communicate before it is understood) అని ఎలియెట్ అన్నట్టు ఏదో ఎరుక కలుగుతోంది. అప్పుడు రోజ్‌బడ్ ఓ ఆలూజన్‌గా (allusion) నా తలలో తళుక్కుమని ఒకానొక ఎపిఫ్ఫనీ మూమెంట్‌కి కారణమయ్యింది. కవి సిద్ధార్థ పలుమార్లు పలవరించిన ముక్కుపుల్ల కూడా అటువంటి పదబంధమే అనిపించడమే జ్ఞానోదయ క్షణం, ఎపిఫ్ఫనీ మూమెంట్ నాకు.
శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు… వంటి పలవరింతలు కవుల నుంచి సహజమే. ఆడుకున్న లక్కపిడతలు, కట్టుకున్న ఇసుకగూళ్ళు, దాచుకున్న నెమలీకలు, మరపురాని నూనూగు ప్రేమలు, వెంటాడే దృశ్యాలు, వెన్నంటే మట్టివాసన- ఎన్నో రోజ్‌బడ్ లాంటివి. ప్రూస్ట్‌కి (Proust) మాడలెన్‌లా(madeleine) జ్ఞాపకాల తుట్టెని కదిలించే సెన్సరి ట్రిగ్గర్లు; వర్డ్స్‌వర్త్‌కి డాఫడల్ లాంటి భావోద్వేగాలు, రోజ్‌గార్డెన్‌లో టి. ఎస్. ఎలియట్ గుడిగుడిగుంజాలు, ఎమిలీ డికెన్సన్ స్వచ్ఛంద మరణేచ్ఛలు! కానీ, వీటన్నింటికీ భిన్నమైనవి సిద్ధార్థ ముక్కుపుల్లలు.
మల్లెలతీర్థం మహాఖననంలో ముక్కుపుల్లలు అనే శీర్షికతో మొత్తం 12 కవితలున్నాయి. రెండు మూడు కవితల శీర్షికలు – మూడు ముక్కుపుల్లలు, రెండు ముక్కుపుల్లలు, ఇరానీ ముక్కుపుల్లలు అని ఉపసర్గలు ఉన్నా, మిగతావన్నీ ముక్కుపుల్లలు మాత్రమే.
ఎండ పెరిగినకొద్దీ
చెట్టు చల్లబడుతుంది
మా ఊరి యాపచెట్టు
నల్లగా..
ఆకుపచ్చ చీకటిగా నవ్వే
గుమ్ డెల్లి రంగక్కలాగా ఉంది –
ఇది ఒక ముక్కుపుల్ల.
ఎండ పెరిగిన కొద్దీ
చెట్టు చల్లబడుతుంది నల్లగా…
ఆకుపచ్చ చీకటిగా
నవ్వే మా సోమారపు సక్కమ్మలాగా-
ఇది కూడా ఒకానొక ముక్కుపుల్లే.
అంటే ముక్కుపుల్లని కవి చిన్ననాటి పల్లె ముచ్చటగ గుర్తించవచ్చా?
మరి ఇదేమిటి –
రాత్రి సంచార స్వరయోగ భ్రష్టుడ్ని
చిన్న దెబ్బకే నెత్తురోడే ప్రతీకను
ముసుగులోని పెంజీకటిని…
అని మరో ముక్కుపుల్లలో confess చేసుకుంటున్నాడు!
నడిచొచ్చే రాత్రి పరిమళం గురించి
తెలుసానే నీకు
గల్లీ కడుపులో ముడుచుకుని
గజల్ సాధన చేసే పాతపట్నం గురించి
తెలుసాన్నా నీకు
పగిలిన గాయం మీద
దొడ్డుప్పును రాస్తూ నమిలిన పాట
గురించి విన్నావా…
చూస్తుండగానే… కొన్నిపదుల సంవత్సరాలు
కాళ్ళకిందినుంచి… జారిపోయాయి
పాదాలు లేని కాళ్ళు మిగిలాయి
అడవులపై తిరిగీ… తిరిగీ… తిరిగీ… తిరిగీ…
ఆ కాకి… ఆకుపచ్చగా మారిపోయింది
కాకిని అనుసరిస్తూ… వనాల వెంట
తిరిగిన నేనూ నలుపునైపోయాను
అన్నది మేఘం
అన్నీ ముక్కుపుల్లలే కానీ, వాటిని కలిపి గుదిగుచ్చడానికి అంతస్సూత్రం అనబడే దారమే లేదు.
వాచ్యార్థానికి ముక్కుపుల్ల ఒక నాసికాభరణం. ముక్కుపుడక, ముంగర, ముక్కెర, ముక్కుపోగు, ముక్కమ్మి, బులాకి, నత్తు, బేసరి, కమ్మి, అడ్డబాస — అన్నీ ముక్కుకి చేసే అలంకారాలే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు. తెలంగాణాలో ముక్కుపుల్లలు అంటారు. ప్రాంతీయపరంగా సిద్ధార్థ – తెలంగాణ కవి కనుక ముక్కుపుల్లలు అని రాశాడు. ప్రాంతీయతకి పెద్దపీట వేయాలని, స్థానిక సంస్కృతికి సాగిలపడాలని, మాండలికాన్ని తలకెత్తుకోవాలని… ఆలోచనలు తెలుగుసాహిత్యంలోకి అడుగుబెట్టక మునుపే, వసుధైక కుటుంబ ఆదర్శంతో అంతర్జాతీయ స్థాయి ప్రతీకలు, గ్రీకు లాటిన్ పౌరాణిక ఐతిహ్య సూచికలు వాడటం ఒక ట్రెండ్‌గా నడుస్తున్న కాలంలోనే (1990కి ముందే) సిద్ధార్థ తన తెలంగాణా ఇడియమ్‌తో (idiom) తన కవితల్ని ఉన్నతీకరించాడు. ఆ నుడికారాన్ని కూడా నేరుగా తన జీవితంలోంచి, తన అనుభవంలోంచి తోడితెచ్చి, తన కవిత్వాన్ని నిసర్గ రమణీయం చేశాడు. సిద్ధార్థ కవిత్వాన్ని తెలంగాణా సాహితీసాంస్కృతిక సిద్ధాంతపరంగా తూచాలనుకోవడం కేవలం anachronistic కాబట్టి, ఆభరణమైన ముక్కుపుల్లకి, సిద్ధార్థ ముక్కుపుల్లలుకి ఎంత సంబంధం ఉందో, అంత లేదు.
ఇంతకీ ముక్కుపుల్ల ఏమిటి? ప్రాచీన గ్రీస్ Odeలా, ఇటలీ, ఇంగ్లండ్‌లలో విలసిల్లిన సానెట్‌లా, ఫ్రెంచ్‌వారి విల్లనెల్ (Villanelle), సెస్టినా (Sestina) వంటి, దువ్వూరి రామిరెడ్డి నుంచి, ఇస్మాయిల్ నుంచి, గాలి నాసరరెడ్డి వరకూ అనువాదం, అనుసృజన చేస్తున్న జపనీయ హైకు, తంక మాదిరిగా దిగుమతి చేసుకున్న కవితాప్రక్రియా? లేదా మన గురజాడ ముత్యాలసరం వంటి, కొందరు ఆధునిక తెలుగుకవుల పైత్యప్రకోప జనిత నానీలు, రెక్కలు లాంటి స్వకీయ ఛందోరూపమా?
“There was an Old Man with a beard,
Who said, “It is just as I feared!
Two Owls and a Hen,
Four Larks and a Wren,
Have all built their nests in my beard!” (Edward Lear)
– అంటూ ఉల్లాసంగా (Light-heartednessతో) సాగే సంప్రదాయక ఐర్లాండ్ Limerickని లిమరిక్కులు అనే సమకాలీన సామాజిక వ్యంగ్య, తీవ్రవ్యాఖ్యానంగా శ్రీశ్రీ మార్చాడు:
వివాదాంధ్ర
దిక్కులేని దివాలాంధ్ర
పెంటమీద పిశాచాంధ్ర
కృత్త పుచ్చ సృగాలాంధ్ర
మత్త తుచ్ఛ మసాలాంధ్ర
వెర్రెత్తిన విషాదాంధ్ర
సిద్ధార్థ ముక్కుపుల్ల కూడా అటువంటి సృజనాత్మక అనుసరణా? కానే కాదు!
మరేమిటో అర్థంచేసుకోవాలంటే, రోలాండ్ బార్త్ నిర్దేశించిన రచన నుంచి పాఠ్యానికి(From Work to Text) మార్గాన్ని కాదని, సిద్ధార్థ ఇతర సాహిత్యం వైపు వెళ్ళాల్సిందే. పలు ప్రపంచకవుల్లానే సిద్ధార్థ కూడా ఏకశిలాసదృశ్యమైన కవితానిర్మాణ వైఖరికి కట్టుబడలేదు. తన తొలి కవితాసంపుటి దీపశిల తెలుగు ఆధునిక సాహిత్యంలో phenomenal happeningగా పేర్కొన దగ్గ ఒక సరికొత్త ఆవిష్కారం. వస్తువు- రూపం, వ్యక్తి- వ్యవస్థ, ఆత్మాశ్రయ- వస్త్వాశ్రయ – వంటి అనేకానేక నిశ్చల నిశ్చిత ద్వంద్వాలకి దీపశిల కవిత్వం ఒక చెంపపెట్టు.
“దీన్ని (సిద్ధార్థ దీపశిల కవిత్వం) ontological poetry అంటాను. యిలాంటిది నేను చదవడం యిదే మొదటిసారి” – అన్నారు తత్వ-సాహితీవేత్త వడ్డెర చండీదాస్. తనదైన తాత్విక సంప్రదాయంలోంచి Ontological Poetryగా గుర్తించారాయన. అంటే సిద్ధార్థ కవిత – కేవలం ప్రపంచాన్ని వర్ణించడానికో లేదా భావోద్వేగాలను వ్యక్తీకరించడానికో పరిమితం కాకుండా, అస్తిత్వసారాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందని చండీదాస్ భావం. అస్తి-నాస్తి విచికిత్స, ఉనికి-కాలం మధ్య సంబంధం, స్వకీయత-గుర్తింపు మధ్య పెనుగులాట, వాస్తవికతని అంటిపెట్టుకొని ఉండే మౌలిక నిర్మాణ-వినిర్మాణాలు – వీటన్నింటినీ కలిగి ఉండేదే ontological poetry. అంటే, అనేకానేక మానవాస్తిత్వ ఇతివృత్తాల లోతైన, అసలైన అన్వేషణగా సిద్ధార్థ దీపశిలని గుర్తించాడు చండీదాస్. అయితే, దీపశిల కవిత్వ భావసారాలలో శిష్టత్వం ఉందని కొందరు సీరియస్ కవిత్వపాఠకులు అభిప్రాయపడ్డారు. మెయిన్ స్ట్రీమ్ మెరమెచ్చుల కోసం, ప్రచ్ఛన్న ప్రత్యర్థుల ప్రశంసల కోసం పనిగట్టుకొని తెచ్చుకున్న శిష్టత్వం కాదు, సిద్ధార్థ అక్షరాల మెరుపు. స్థలకాలాలకి అతీతమైన మధుర సుషమా సుధాగాన మంజువాటి నివాసి కావడం వల్ల సిద్ధార్థకి సహజాతం – ఆ శిష్టత్వం.
అయితే, సిద్ధార్థ రెండో కవితాసంకలనం బొమ్మలబాయి సంపుటి శీర్షిక నుంచే ఆ నిందని అధిగమించింది (అధిగమించడమంటే విడనాడటం కాదని అంటారు మో — వేగుంట మోహనప్రసాద్ — ఓ సందర్భంలో). తెలంగాణ నుడికారపు సౌందర్యబీభత్సాలు, మాండలికాల మట్టివాసనలతో బొమ్మలబాయి సాంస్మృతికంగా మరింత గ్రామ్యమయ్యింది. అది కూడా ప్రయత్నపూర్వకంగా కాక, ఋతుచంక్రమణమంత సహజంగా.
సుమారు నాలుగు దశాబ్దాల సిద్ధార్థ కవితాయానంలో ఉపమానం, ఉత్ప్రేక్ష వంటి అలంకారాలు, డిఫెమిలియరైజేషన్, ఆబ్జెక్టివ్ కోరిలేటివ్, కన్ఫెషన్, ఆటోమేటిజం, నాటకీయ స్వగతాలు వంటి కవనశైలీవిన్యాసాలు కొత్త అర్థచ్ఛాయలతో అగుపిస్తాయి. వాటన్నింటికీ భిన్నం మల్లెలతీర్థం మహాఖననం సంకలనంలో ముక్కుపుల్లలు నిర్మాణశిల్పం. పైకి అక్షరాలుగా, పాదాలుగా, చరణాలుగా కనిపించే ముక్కుపుల్లలు వెనక, కవి బాల్య, కౌమార, యవ్వనాల్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించిన గుర్తులేవో ఉండుంటాయి. వాటి ఫలితంగా కవి తనదైన అధివాస్తవ ఆవరణాన్ని సృష్టించుకొని, ముక్కుపుల్లలుతో పాఠకుడికి ప్రవేశాన్ని కల్పిస్తున్నాడు.
నెమలికూతల సాయంత్రాల గురించెవరైనా చెప్పింర్రా
మొగిలివనంలో వెన్నెల అభంగ నృత్యం
కత్తులు నూరే మిత్రుల మాటలూ
ఎక్కడైనా వినబడ్డాయా
జువ్విచెట్టుమీద అలసిపడుకున్న పామును
పలకరించినవా..
ఎండిన మక్కచేను…
కన్ను అంటుకుంది
రాత్రో పగలో… తెలియదు
ఒక చీమ గాండ్రించింది
దోమ పకపకా నవ్వింది.
పూవు దీపం వెలిగిస్తూంది
ఊరవిష్కె డప్పుకొడుతూంది
లోపలెక్కడ్నో
ఒక బాయిలో చేద
గిర్కెతో
పాతాళ గర్గె… ఎనగర్ర
వొక మెజెంటా గన్నేరు తొంగి చూసిన
చేద బాయిలో
తేలే చందమామను
తోడుకున్నాను
తోడుతూనే వున్నాను
బొక్కెనలోకి
లోపలి బొక్కెనలోకి
బతికిన క్షణాల
పంచనామాలు నా పిల్లలు
ఈ ముక్కుపుల్లలు అన్నీ అధివాస్తవ చిత్రాలే.
సర్రియలిస్ట్ కవిత్వమంటే – ఆండ్రే బ్రెటన్ (André Breton), లూయిస్ అరగాన్ (Louis Aragon), పాల్ ఎలువార్డ్ (Paul Éluard) వగైరాలు మొదలెట్టిన సర్రియలిజం కాదు. అంతకు వందల వేల సంవత్సరాల క్రితం భారతీయత కళారూపాల్లో అంతర్భాగమైపోయిన సర్రియలిజం.
“అదె చూడరే మోహన రూపం/పది కోట్లు గల భావజరూపం” అని దేవుడ్ని పొగిడిన నోటితోనే, పూర్తి విరుద్ధంగా అదే దేవుడ్ని “జూటరి నల్లముసుగు భూతము” అని దూషించే అభాస వంటి అధివాస్తవికత. లేఖనానికే కాదు, ఈ విరోధాభాస విగ్రహానికి, ఇంకా పలు గాన, హాస, లాస, ధ్యానాల తీవ్ర అధివాస్తవిక తలంలో, పడమటి సర్రియలిస్టు ఆర్టిస్టులు Max Ernst, René Magritte, Salvador Dalí, Joan Miró తలపుల్ని తలదన్నేలా ఉంటుంది. పూరి జగన్నాథుడు, తిరుపతి వేంకటేశ్వరుడు, గుడిమల్లం శివలింగమూర్తి, తెలంగాణ చౌడమ్మ, యెల్లమ్మ వికటదంత రూపాలు, గరగ, శూల, రాతి ప్రతిరూపాలు – అన్నింటా అనాది అధివాస్తవికతే. ఆ భారతీయ దేవతామూర్తులు, తెలంగాణ గ్రామదేవత రూపాల రూపకల్పనలో ఏ సాంస్కృతిక అధివాస్తవికత ఉందో, సిద్ధార్థ ముక్కుపుల్లలులో కూడా అదే ఉంది.
ముక్కుపుల్లల్ని దేహ ఛిద్రణం (Body piercing) అని కళ్ళెర్రజేస్తూ, ఎంత సౌందర్యాత్మక హింస అనుభవిస్తున్నామనే కవితలతో మన విశాల సుందర జీవన వైవిధ్యాన్ని కాలరాయచూస్తున్న ఆధునిక క్రైస్తవీయ ఫెమినిస్టు కవుల నడ్డివిరిచే దుడ్డుకర్రలు సిద్ధార్థ ముక్కుపుల్లలు.
చెట్లు, వర్షం, పిట్టలు, ఓల్డ్ సిటీ, ఇరానీ కెఫేలు, ప్రేమికులు, కుటుంబాలు, కాలం, కవిత్వం, మృత్యువు – దృశ్యాదృశ్యాలుగా ప్రిదిలిపోతున్న సిద్ధార్థ ముక్కుపుల్లలు – స్థానీయ సాంస్కృతిక అధివాస్తవ ప్రతీకలు!