మౌనంబంతట మాటలాడె…

అను కావ్యావతరణ కథ

కం.
శ్రీవిలసత్కావ్యకథా
పావనకలశాబ్ధిభంగభద్రారామా!
నీవారశూకవద్బ్ర
హ్మావరణసమప్రమాణ! ఆత్మారామా! (1)
వ.

అను నా చిలుకపలుకులకు స్వామి చిరునవ్వు నవ్వెనో యేమొ, నా తలపున వెన్నెలారబోసినట్లు తెలివెలుగులు వెల్లివిరిసె, నట్లు తేటపడిన మనఃఫలకమున నొక తేజఃపుంజము ప్రసరించి దివ్యాకృతిఁ గొనె. (2)

ఉ.

పుట్టుచుఁ జచ్చుచున్ మరియు పుట్టు శరీరము సేయు కర్మ పెన్
బుట్టలు గట్ట, దాని తుదముట్టగ వ్రచ్చు మహాప్రయత్నమై
పట్టిన మంత్రదీక్ష నెరపండిన జీవప్రచేతనాగ్ని, తాఁ
బుట్టిన దేమొ తుట్టతుదిపుట్టువు పుట్టనుఁ జీల్చు మౌనియై (3)

ఆ.వె.

మౌని గుండెనిండ మార్దవ మది మెండు
కాని నిండుకుండ కదల కుండు
నొక్క తొణుకు గలుగ నుప్పొంగదే గంగ
సారసత్కథాసుధారసమ్ము! (4)

వ.

అట్టి కథాసుధకై యా మునినాథుని మనమ్మున నేదో మథనమ్ము (5)

ఉ.
ఏ కథ వేదనాద? మగలించు పెఠిల్లున కర్మపాశమున్!
ఏ కథ యచ్చపుం రసపుటేరు? హరించును మూలకామమున్!
ఏ కథ జ్ఞానదీప్తి? కరగించు నవిద్యమహాఘవృత్రమున్!
ఏ కథ విన్న చెప్పిన తరించును సంసృతివార్థి జీవుడున్! (6)
వ.
కథయన్న గట్టు చేర్చెడు నట్టి కథ కావలె, నయిన నా కథను నడిపించు నాయకు డెట్లుండ వలె? కథ లౌకిక మయ్యు రస మలౌకికమగు రీతి, నా నాయకుడు మానవుడయ్యును మహనీయుడు గావలె కదా! (7)
తే.గీ.
అతని నడవడి కర్మయోగాభ్యసనము
అతని యొకచూపు సర్వకామార్థదాయి
అతని విద్వత్త ఆత్మతత్త్వావబోధ
అతడు సకలజీవహితైషి యమృతమూర్తి (8)
వ.
గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవంతుడు, దృఢవ్రతుడునై పదహారుకళల పున్నమచందమామ బోలు నా నాయకు డెక్కడ? యెక్కడ? (9)
కం.
ధీరోదాత్తుడు, శాంతుడు,
వీరోచితరోషదేవభీకరు, డనసూ-
యారూఢమతిద్యుతిసా-
కారుడు, నగు నాయకుండు కలడో లేడో? (10)
వ.
అని తలపోయు సమయంబున “కలడు కలం”డను నొక కలరవంబు వినిపించి, బ్రహ్మతేజంబున బొల్చు నొక మహర్షి సాక్షాత్కరించె (11)
ఆ.వె.
తల్లిదండ్రులకును తగినకుమారుడు
వాగ్విశారదుండు బ్రహ్మవేత్త
తపసి వేదవేది త్రైలోక్యనిత్యసం
చారి మునివరుండు నారదుండు (12)
వ.
అంతఁ, దనకుఁ బ్రాంజలి ఘటించిన మునిసత్తముని శిష్యవాత్సల్యంబున హత్తుకొని యా నారదుం డిట్లు పలికె (13)
కం.
మెల్మేలు నీకు నయ్యా
వాల్మీకీ! నేనెరుగుదు భవదీయవిచా
రోల్ముకము నట్టి గుణవం
తుల్ మునివర! నిక్క మరుదు దొరకొన నైనన్ (14)
కం.
ఉన్నాడు లెస్స యొక్కం
డున్నా డిల రాఘవుండు నురువీరుడు ధృ
త్యున్నతుడును నియతాత్ముడుఁ
జెన్నగు మహనీయదీప్తి శ్రీరాము డనన్ (15)
తే.గీ.
అతని నామంబు రూపంబు నంతరంగ
మొక్క తీరున రమ్యంబ! యుగ్గడించి
యతని గుణములు వివరింప ననువదింప
తాతలే దిగిరావలెగా తపస్వీ! (16)
సీ.
దిగ్దిగంతముఁ బర్వు స్నిగ్ధవర్ణద్యుతి
యూర్ధ్వపుండ్రలలాట మొప్పు శిరము
సరసీజపత్రవిశాలాక్షము వరసుం
దరసుదృఢహనుమంతంబు మోము
పాంచజన్యప్రభాభాతి సుగ్రీవము
కోదండ మమరారు కొదమమూపు
శ్రీదుర్గప్రాకారసాదృశవక్షమ్ము
వసుధాధురంధరబాహుయుగము
తే.గీ.
అతని రూపంబు కనులార నరసి పొగడ
నాదిశేషునకే సాధ్యమగునొ యేమొ!
అతడు జగముల కెల్ల నేమయిన గాని
మురిపెమునఁ దల్లికౌసల్య ముద్దుబిడ్డ (17)

ఉ.
జ్ఞానము సద్వివేకమును సత్యవ్రతమ్మును ధర్మనిష్ఠయున్
మానితనీతివర్తనము మంజులభాషణ సుంత లేనిచో
మానవు డెన్నగా పశుసమానుడ! యా గుణముల్ ప్రపూర్ణసం
స్థానము నొందె రామునిగఁ, దాఁ బురుషోత్తముడయ్యె నవ్విధిన్ (18)
తే.గీ.
అతడు కాలాగ్ని క్రోధమునందు, ప్రేమ
చిందు చల్లనిచూపుల చందురుండు
ధనదసము డీవి, క్షమయందు ధరణి, సత్య
తత్పరతయందు సాక్షాత్తు ధర్మమూర్తి (19)
కం.
శ్రీలలితాలక్ష్మణుడున్
బాలితజనరక్షణోరుభారభరతుడున్
బాలిశశత్రుఘ్నుడుఁ దా
నేలిక యన నొక్క రాముడే యనవలెగా! (20)
కం.
ప్రథితము, నానాఖ్యానక
గ్రథితము, సంసారదుఃఖరక్షస్సకలో
న్మథితము, వేదార్థమ్మిది
కథయనగా రామకథయె కథ యనవలెగా! (21)
ఉ.
ఈ కథ వేదనాద, మగలించు పెఠిల్లని కర్మపాశమున్
ఈ కథ యచ్చపుం రసపుటేరు, హరించును మూలకామమున్
ఈ కథ జ్ఞానదీప్తి, కరగించు నవిద్యమహాఘవృత్రమున్
ఈ కథ విన్నఁ జెప్పినఁ దరించును సంసృతివార్థి జీవుడున్! (22)
కం.
అని రామకథను సంగ్రహ
మునఁ దెల్ప మహర్షివాక్యముల లోలోతుల్
ముని మది నాటె నతండును
ఘనవాక్యవిశారదుండు గావున నంతన్ (23)

(సశేషం)