లోయలోని అందమంతా
నీ చీరలోకి ప్రవేశిస్తే,
మత్తిలిన కన్నులతో
నాకు మాత్రమే వినిపించే
నీ కొంగు రెపరెపలతో
మౌనంగా నన్నే సమీపిస్తే,
ఎదురెండలో అమాంతం
ఆవిష్కృతమైన అరణ్య సౌందర్యం
నన్ను నేను విస్మరిస్తే,
ఎదురు చూడని చల్లని స్పర్శ
నా మేను పులకరిస్తే,
లోయలోకి దూకే జలపాతం
పగలే ఇంద్రధనువులు వేస్తే,
ఎగిరి వచ్చే తెల్లని పక్షులు
మన ఇద్దరిలో చెలరేగే
అలజడిని లోకానికి చాటితే-
హఠాత్తుగా నింగినేలను
ధారలుగా కలిపే వర్షం!
కళ్ళముందు దృశ్యాలను
కనిపించనీయదు.
దూరంగా పిడుగు పాటు-
మొహం మీద పడిన
కురుల స్పర్శ
నా కౌగిలిలో నీవు
మోహమంతా ఆకాశానిదే.