చిన్న దుఃఖం
బస్సులో కూర్చుండి, చాలా పెద్ద ఘటనల గురించి రాసిన పేపర్ చదువుతూ ఉండగా ఇది నా కంటబడింది.
రోడ్డు మీద చాలుగా నాలుగైదు మీటర్ల మేరా పోసినట్టున్న పసుపు బియ్యం.
ఏ ఆడబిడ్డకో పోసిన ఒడిబియ్యం అయ్యుండాలి.
బహశా, తీసుకెళ్తున్న సంచీ చినిగి వుంటుంది; చూసుకుని వుండరు.
అలా పారబోసుకోవడం ఎంత అరిష్టం!
ఆమె ఏ ఇంటిమూలనో కూర్చుని ఏడుస్తూ వుంటుందా!
ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత చిన్న దుఃఖానికి చోటుంటుందా?
కాపరి
“నానా, నేను పెద్దయ్యాక పోలీస్ కావాలా? షెపర్డా?” అడిగాడు కొడుకు.
“ఊఁ,” ఆలోచించినట్టుగా నటించి, అన్నాడు తండ్రి: “చెప్పడం కష్టమేనే! మరి నీకేమిష్టం?”
“షెపర్డ్” ఠక్కున చెప్పాడు కొడుకు.
“మరి కా ర!”
“మరి హర్షిత్ నన్ను పోలీస్ కమ్మంటున్నాడు…”
“అట్లనా! వాడికి నేను చెప్తాన్లే, సరేనా?”
“కానీ నానా, మరి మనం పండుగలకు కూడా వాటిని కోయొద్దు, సరేనా!”
“…”
చెడ్డవాడు
అతడిని భార్య అడిగింది:
“మీరు ఇంతకు ముందు చిన్న విషయానికి కూడా నాతో కొలుచుకునేవారు.
ఇప్పుడు మౌనంగా అన్నీ స్వీకరిస్తున్నారు.
మీరు మంచివాళ్ళయ్యారా?”
అతడు చిత్రంగా నవ్వి, చెప్పాడు:
“ఒక విధంగా చెప్పాలంటే, నేను మంచివాడినేమీ కాకపోగా, చెడ్డవాడినయ్యాను.
ఇంతకుముందు నీ ప్రతిమాటకూ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నేను వాదనకు దిగేవాడిని;
ఇప్పుడు వాదనలు అక్కర్లేదని తెలుసుకున్నాను.
అందువల్ల నీ మాటలకు నేనేమీ కదిలిపోవడం లేదు.
నీ మాటల్ని తగినంతగా పట్టించుకోవడం లేదంటే నిన్ను అగౌరవపరుస్తున్నట్టే కదా!
ఆ లెక్కన నేను చెడ్డవాడినయ్యాననే కదా!”
‘నువ్వింతే’ అన్నట్టుగా చూసి, ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది.
నా ఆదర్శ ప్రయాణం
ఆ సమయానికి కనబడిన ఎర్ర బస్సు.
ఎడమ వైపు కిటికీ పక్క సీటు.
ఏదో ఒక కదలికతో దిగే పల్లెటూరు.
పాక హోటల్లో పేపర్తో చాయ్ తాగి–
(నన్ను గ్రౌండ్ చేసుకోవడానికి ఆ నెపం)
గుడి, బడి, కోడి, మేక, చేనూ గట్టూ చూసి–
చెరువు కట్ట మీద నడవాల్సినంత నడిచి–
దిగువ మర్రిచెట్టు నీడన మౌనంగా సిగరెట్ కాల్చి–
(అంతకుముందు హోటల్లో కొన్నది)
మళ్ళీ వచ్చే బస్సుకోసం ఎదురు చూసి…