[అభగ్న గర్గరిక అంటే పగలని తరిగడవ. కవి మనసొక గర్గరిక వంటిది. ప్రాణం రాడు (గుంజ). ఊహాశక్తి తక్రం (తక్రం శక్రస్య దుర్లభమ్). అనుభూతి కవ్వం. ప్రాణం ఆధారంగా ఉన్న మనస్సులో ఊహాశక్తిని అనుభూతి చిలికితే వెలికివచ్చే నవనీతం కవిత. అది ఒకసారి పడవచ్చు, పడకపోవచ్చు. నొప్పి పుట్టనూవచ్చు. కానీ క్రమమంతా ఒక ఆనందహేల. — రచయిత ]
ఎన్ని ప్రభూతులం గలవరింతల తాకితినో రవంత వి-
చ్ఛిన్నతలేని పున్నెముల శీతలపుంజము కోరి; యెంత కా-
వ్యాన్నమునాబ చేత ముఖమంతట కూరితినో, గురూక్తిగా
విన్న పురాకవీశ్వరుల వేదనలో, సిరిలో, ప్రపత్తిలో
మన్ననలో, గవేషణము మానక సల్పితినో; చికాకు లో-
గొన్న మనమ్ము గింజుకొన కూరిమి బల్మిని క్రుక్కికొంటినో
చిన్ని సహాయదీధితివిశేషము నాకగునన్న యాశతో;
భిన్నపథాధ్వనీనుడయి పేశలవస్తుగతప్రభావుడై
కొన్ని యుగాంతముల్ మెదడుకుర్రడు పారగ చూసియుంటినో;
తిన్నెల దారిలో, తిమిరధీఃఫలదైన్యధనంపు మోజులో,
చెన్నుల కామినీమసృణశీర్ణబలిష్ఠ శరీరరాజిలో,
వెన్నెల వేళలో, భయదభీషణతీక్ష్ణదినప్రభాళిలో
పన్నిన కాలతంత్రమున భవ్యసభాగతమధ్యసీమలో,
నన్ని దురీహ, సాధుకృతి, హాని, మహాక్రతుసంచయమ్ములో
నన్ను పడంగ త్రోసికొని నల్గితినో యనుసంగతుల్ నిజ-
మ్మన్నది, నిన్ను చేరి నయనాంచలబాష్పకణోదయమ్ములౌ
నన్నది, నీవు నాదు బ్రతుకన్నది, నేనుగ నేనులేను, లే-
నన్నది, నీదు ప్రన్నని కటాక్షవిపాతమె నాకు చాలు, చా-
లన్నది నీవెరుంగవొ రసావిషి! నా కవితామతల్లి! నే-
నెన్నొ మనోవికారములకేటికొ లోబడి నిన్నుజూచి ర-
మ్మన్నను రావదేమొ యొక యావృతి; నేనెటులున్నవాడనో
యన్న గుఱింత లేకయె వియన్నది కట్టలు త్రెంచినట్లు సం-
పన్న గుణాఢ్యవై మిడిసిపాటున జారెదవొక్కసారి, నే-
నెన్ని విధాల వేడినను నేమరపాటువహించినట్లు సం-
క్లిన్నమనస్సులో సమసి లీనముచెందెదవొక్కసారి, నా-
దన్న సమర్థభావనను తన్ని, త్యజించెదవొక్కసారి, గా-
కున్న మహానుభూతులకు నూతమునిచ్చెదవొక్కసారి, యా-
పన్నుని జేసిపోయెదవు ఫక్కున నవ్వి మరొక్కసారి, నే
నిన్ను రచింతునో, కులికి నీవె ననున్ రచియింతువో! మరి
ట్లున్నను లోకమెల్ల మురియున్ నినుజేరి యదెంతచిత్రమే!