[భారతీయ పరిచయక్రమం అన్న శీర్షిక కింద సూరపరాజు రాధాకృష్ణమూర్తి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. అందులో మొదటిది – అస్తిత్వవాద సాహిత్యం. ఈ పుస్తకంలో కీర్కెగాడ్, దొస్తోయెవ్‌స్కీ, నీచ, పిరాన్దెల్లో, కాఫ్కా, హైడెగర్, సార్త్ర, కామూ పరిచయం చేయబడ్డారు. అదే వరుసలో తిరిగి ఈమాటలో వ్యాసాలుగా పరిష్కరించి ప్రచురించడానికి అనుమతి ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకపు ముందుమాట ఇక్కడ చదవండి.]
మూడో రోజు
నా మిత్రుడు (అవును, ఇప్పుడు ఆ పెద్దాయన నాకు చాలా దగ్గరైనాడు) అన్నాడు:
‘ఇది జరిగిన తరువాత కొన్నాళ్ళవరకు నా అంతరాత్మ నాతో ఏమీ గొడవపడలేదు. బాధపడ్డాను. కాని ఎందుకు? నేను ప్రేమించిన మనిషిని చంపుకున్నందుకు. ఆమెపై ప్రేమ నా నరాలలో యింకా ప్రవహిస్తూనే ఉండింది. నేను చంపుకున్నది నా ప్రేమను. కాని నేను ప్రేమించిన మనిషి మరొకరికి భార్య అయితే నేను సహించగలనా? చంపకుండా ఎలా ఉండగలను? ఇక ఆ అమాయకుడి విషయమా? అతడు అరెస్ట్ అయినప్పుడు కొంచెం ఆందోళన చెందాను. అతడి అనారోగ్యం, ఆ తరువాత అతడు త్వరలో చనిపోవడంతో ఆ ఆందోళన కూడా సమసిపోయింది. అతడు జబ్బుపడడానికి చనిపోవడానికి అతడి అరెస్టు కారణం కాదు అని కూడా నిర్ధారణ చేశారు. అతడికి అంతకుముందే ఏదో జబ్బు ఉండింది. ఎలాగూ పోయేవాడే. ఇక నేను తెచ్చేసుకున్న డబ్బు, నగలు. నేనేమీ డబ్బుకు కక్కుర్తిపడి దొంగిలించలేదు. హత్యను దొంగతనంలో భాగంగా విచారణను పక్కదోవ పట్టించడానికి చేశాను. దొంగిలించిన సొమ్ము స్వల్పమే. ఆ సొమ్ము మొత్తం వెంటనే శరణాలయాలకు దానం చేశాను. కనుక చాలాకాలం వరకు నా అంతరాత్మ నన్నేమీ యిబ్బంది పెట్టలేదు. ఎటువంటి అశాంతి లేకుండా చాలాకాలం గడిచిపోయింది. ఆ తరువాత ఒక స్వచ్ఛందసేవాసంస్థలో చేరి సేవచేశాను. అంటే, కాయకర్మ. ఇలాంటిపనులలో గతాన్ని యించుమించు మరచిపోయాను. అప్పుడప్పుడూ అది గుర్తొచ్చేది. కాని తోసెయ్యడానికి ప్రయత్నించేవాణ్ణి. ధర్మకార్యాలలో ఎక్కువ చురుకుగా పాల్గొనేవాణ్ణి. ఎన్నో సంస్థలు స్థాపించి పట్టణాభివృద్ధికి చేయగలిగిందంతా చేశాను. చాలా సంస్థల కార్యవర్గాలలో సభ్యుడిగా ఎన్నుకున్నారు నన్ను. ఇలా ఎన్ని చేసినా ఎన్ని పనులలో మునిగి తేలుతున్నా, గతం గుర్తుకురావడం మానలేదు. దాన్ని తోసెయ్యడం అంతకంతకూ కష్టమయింది. ఆ స్థితిలో ఒక అమ్మాయిని చూచాను. తెలివైన మనిషి. పరిచయమైన కొద్ది రోజులలోనే ఆమెను పెళ్ళి చేసుకున్నాను. సంసారంలో భార్యాపిల్లలపట్ల బాధ్యతలలో గతం మరచిపోవచ్చనుకున్నాను. కాని నా స్థితి యింకా హీనమయింది. నా భార్యకు నేనంటే అమితప్రేమ. నేనొక హంతకుణ్ణి అని తెలిస్తే? ఆమె నాతో మొదటిసారి మనకో బిడ్డ కలగబోతున్నాడు అన్నప్పుడు నేను కలవరపడ్డాను. ప్రాణం తీసిన నేను, నా ప్రాణం పోసుకుంటున్నవాడికి నా ముఖం ఎట్లా చూపించను? ఒకరి తర్వాత ఒకరు, ముగ్గురు పిల్లలు కలిగారు. వారిని ఎలా ప్రేమిస్తాను? ఎలా విద్యాబుద్ధులు చెప్పిస్తాను? మంచి గురించి, మానవత్వం గురించి వాళ్ళకు ఏం చెబుతాను, రక్తం చిందించినవాణ్ణి? ఎంత ముద్దోచ్చే పిల్లలు! దగ్గరకు తీసుకోవాలని, ముద్దుచేయాలని. కాని ఆ అమాయకపు ముఖాలలోకి చూచే యోగ్యత నాకు లేదు.
‘రాను రాను నేను చిందించిన రక్తం నన్ను భయంకరంగా వెంటాడడం మొదలుపెట్టింది. ఒక యవ్వనవతి నిండుప్రాణాలు తీశాను. ఆ రక్తం ప్రతీకారం కోరుతోంది. భయంకరమైన కలలు. గుండెనిబ్బరం కలవాణ్ణి కనుక తట్టుకున్నాను. ఈ రహస్యనరకం నా పాపాన్ని ప్రక్షాళనం చేస్తుందేమో? కాని అది కూడా జరగలేదు. పోను పోను పరిస్థితి దుర్భరమయింది.
‘నా ఔదార్యం, నా దానధర్మాలు, వీటి కారణంగా సమాజంలో నాకొక స్థానం ఉంది. అందరూ గౌరవం చూపేవారు. వాళ్ళు ఎంత ఎక్కువ గౌరవం చూపితే నాకు అంత దుర్భరంగా ఉండేది. ఆ గౌరవానికి నేను అర్హుణ్ణి కాదని నాకు మాత్రమే తెలుసు. అప్పుడప్పుడూ చచ్చిపోదామనుకునేవాణ్ణి. ఆ ఆలోచనరాగానే, దాని వెంటనే ఇంకో ఆలోచన వచ్చేది. బయటికి వెళ్ళి అందరినీ పిలిచి ‘నేనొక హత్య చేశాను’ అని చెప్పేస్తే? అప్పుడప్పుడూ కల కూడా వచ్చేది, అలా చెప్పినట్టు. ఈ ఆలోచనలు, రకరకాల రూపాలలో, దాదాపు మూడు సంవత్సరాలు వెంటపడ్డాయి. చివరకు అనుకున్నాను. ఒక్కసారి చేసినపాపం చెప్పేస్తే, ఇక ఆ పై ప్రశాంతంగా ఉండవచ్చు, అని. అనుకోడం సులభమే. కాని నేరం ఒప్పుకోడం? వణికిపోయాను.
‘ఈ స్థితిలో, నీ ప్రేమఛాలెంజ్ ఉదంతం. అక్కడ జరిగింది చూశాక, ఒక నిశ్చయానికి వచ్చేశాను’, అని ఆగిపోయాడు.
*అంత చిన్న సంఘటన ఇంత పెద్ద నిర్ణయానికి కారణం కాగలుగుతుందా?’ అన్నాను. ‘నా నిర్ణయం గత మూడు సంవత్సరాలుగా పెరుగుతూ ఉండింది. నీ కథ దానికి ముగింపు మాత్రమే యిచ్చింది. నిన్ను చూసి నన్ను నేను నిందించుకున్నాను. అసూయపడ్డాను’. ఈ మాటలంటున్నపుడు అతడి ముఖంలో చిరుకోపం కనిపించింది.
‘నీవు ఇప్పుడు నిజం చెప్పినా ఎవడూ నమ్మడు. పధ్నాలుగేళ్ళనాటి మాట’, అన్నాను.
‘నా దగ్గర ఆధారాలున్నాయి. బలమైన ఆధారాలు. అవి చూపిస్తాను’, అన్నాడు. అమాంతంగా లేచి అతణ్ణి ఆలింగనం చేసుకున్నాను.
‘ఒక్కటి చెప్పు. ఒక్కటి’, అన్నాడు, ఏదో అంతా నా మీదనే ఆధారపడినట్టు. ‘అలా చేస్తే నా భార్య, నా పిల్లలు? నా భార్య కుంగి కుంగి కృశించి చచ్చిపోతుంది. నా పిల్లలు, వాళ్ళ ఆస్తులు అంతస్తు అలాగే ఉంటాయి. కాని, వారు ఒక హంతకుడి బిడ్డలుగా బతకవలసిందే కదా, జీవితమంతా? వాళ్ళ మనసులలో నా గురించి ఎటువంటి ముద్ర వేసిపోతాను?’
నేనేం పలకలేదు.
‘వాళ్ళను వదిలేసి వెళ్ళిపోతాను కదా, శాశ్వతంగా. తెలుస్తోందా? శాశ్వతంగా?’
నేను నిశ్చలంగా కూర్చుండి మనసులోనే ప్రార్థన చేశాను. భయమేసింది. కూర్చోలేక లేచి నిలబడ్డాను.
‘ఏమంటావు?’ అని, నా ముఖంలోకి చూచాడు.
‘వెళ్ళు. వెళ్ళి అంతా చెప్పేసెయ్. ఏదీ ఉండిపోదు. నిజమొక్కటే నిలిచిపోయేది. నీ పిల్లలు ఎదుగుతారు.నీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకుంటారు’, అన్నాను.
ఒక నిశ్చయానికి వచ్చేసాడు. వెళ్ళిపోయాడు.
ఆ తరువాత పదిహేనురోజులు నన్ను కలవడానికి ప్రతిరోజు వచ్చేవాడు. ఆ క్షణాన్ని ఎదిరించడానికి యింకా సిద్ధంగా లేడు. అతని తెగని అంతస్సంఘర్షణ చూస్తే నాకు చాలా బాధ కలిగేది. ఒకరోజు అనేవాడు: ‘నేను నిశ్చయించుకున్నాను. ఏమైనా సరే చెప్పేస్తాను’, అనేవాడు. మర్నాడు: ‘నాకుతెలుసు, ఆ క్షణంనుండి యిక నాకు స్వర్గమే. పధ్నాలుగేళ్ళుగా యీ నరకం అనుభవిస్తున్నాను. శిక్షను స్వీకరిస్తాను. జీవించడం మొదలుపెడతాను. తప్పు చేసి తప్పుతో ఎంతకాలమైనా బతకొచ్చు. కాని అది బతుకుకాదు. నేను బతకాలి. బహుశా నా పిల్లలు నేనెటువంటి శిక్షననుభవించానో అర్థం చేసుకుంటారు. వాళ్ళు నన్ను నిందించరు.’
నేనన్నాను. ‘అందరూ అర్థం చేసుకుంటారు. వెంటనే కాకపోయినా, తర్వాత. ఎందుకంటే, నీవు సత్యాన్ని పట్టుకున్నావు, యీ లోకపుసత్యం కాదు, పై లోకపు ‘సత్యం’.
నా మాటతో బరువు దించుకొని ఆ రోజు వెళ్ళిపోయేవాడు. మర్నాడు మళ్ళీ వచ్చేవాడు. ముఖంలో కాంతి ఉండదు. స్వరం వికటం.
‘నేను వచ్చినప్పుడల్లా, నీవు నన్ను గుచ్చిగుచ్చి చూస్తావు. ఇంకా వీడు బయటపడడేమి అనుకుంటావు కదూ? ఆగు. నన్ను చులకన చేయొద్దు. అది, అది అనుకున్నంత సులభమేమీ కాదు. అసలు ఎప్పటికీ నేను బయటపెట్టలేకపోవచ్చు… నీవు వెళ్ళి చెప్పవుకదా? చెబుతావా?’
గుచ్చే చూపులు కాదు, అసలు అతడి వైపే చూడలేకపోయాను. నాలో అతడి గురించి ఆందోళన పెరిగిపోతోంది, అతడికి ఏమవుతుందోనని. జాలేస్తోంది. నాకు రాత్రులు నిద్రపట్టడంలేదు.
మళ్ళీ వచ్చాడు మర్నాడు: ఇప్పుడే యింటినుండి వస్తున్నాను. నా భార్య గడప దగ్గర నిలబడి నా వైపే చూస్తోంది. భార్య చూపు అంటే తెలుసా నీకు? నీకు తెలీదు. పిల్లలు, ‘నాన్నా త్వరగా వచ్చెయ్. పిల్లల కథల పుస్తకం వినిపించాలి’, అన్నారు. నీకు అర్థమవుతోందా? కాదు. ఈ లోకంలో ఒకడి బాధనుండి మరొకడు ఏమీ నేర్చుకోలేడు.’
అతడి కళ్ళు తడిశాయి. పెదవులు వణుకుతున్నాయి. ఉన్నట్టుండి టేబుల్ మీద బలంగా ఒక గుద్దు గుద్దాడు. టేబుల్ మీది వస్తువులన్నీ పైకెగిరాయి. అతడలా చేయడం అది మొదటిసారి. అతనిది మృదుస్వభావం. పైకెగిరిన వస్తువులు పట్టించుకోకుండా అతడు:
‘అసలు అవసరమా? ఏమయింది చెప్పనందువల్ల? నా నేరానికి మరొకడు శిక్ష అనుభవించలేదే? అతడు జ్వరంతో పోయాడు. నా శిక్ష నేను అనుభవించాను ఇన్నాళ్ళుగా, అయినా ఇప్పుడు నేను చేశానని చెప్పినా నా మాట ఎవడు నమ్ముతాడు? నా ఆధారాలు ఎవడు నిజమనుకుంటాడు? అనవసరంగా నా భార్యాపిల్లలకు జీవితాలలో సుఖము శాంతి లేకుండా చేయడం తప్ప ఒరిగేదేముంది? పొరపాటు పని కాదా? ఏది ఒప్పు ఏది తప్పు? జనం ఏమంటారు? మెచ్చుకుంటారా? నా మంచితనాన్ని గుర్తిస్తారా? నా నిర్ణయాన్ని గౌరవిస్తారా?’
‘దేవుడా!’ అనుకున్నాను. ఇప్పుడుకూడా ఇతడు ఇతరుల గౌరవం గురించి ఆలోచిస్తున్నాడు. అతన్ని ఆ స్థితిలో చూస్తుంటే జాలివేసింది. అతని బాధను పంచుకోవాలని ఉంది. అతని బాధకు ఉపశమనం కల్గించాలని ఉంది. కాని ఎలా?
అతడు తన వశంలో లేడు. అతని దుర్భరమైన అంతస్సంఘర్షణ అర్థమైంది. కొంత అనుభవిస్తున్నాను కూడా.
‘నేనేం చెయ్యాలి? నీవు నిర్ణయించు’, అని ఆక్రోశించాడు.
‘వెళ్ళు. వెళ్ళి బయట ప్రపంచానికి చెప్పు’, అన్నాను, దృఢస్వరంతో కాదు. టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని తీసుకొని తెరిచి చూపించాను.
“24. గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును
25. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
చదివి, ఒక నవ్వు నవ్వాడు.ఆ నవ్వులో బాధ, అసహనం, ఉపహాసం.
‘నిజం. గొప్ప గ్రంథాలు! నా కోసం ఘోరమైన నిజాలు పట్టుకుంటావు ఆ గ్రంథాలన్నీ వెదికి వెదికి. ఈ గ్రంథాలు నా ముఖం మీద కొట్టడం నీకు సులభమే. అవును, ఎవరు రాశారు యీ గ్రంథాలు? దేవదూతలు! రాస్తారు. వాళ్ళకు పెళ్ళామా పిల్లలా? వాళ్ళకేం తెలుసు?’
ఈ సారి అతని ముఖంలో నా పట్ల అసహ్యం కూడా కనిపించింది. కుర్చీలోనుంచి లేచాడు.
“మంచిది. వస్తాను. బహుశా మళ్ళీ మన కలయిక పరలోకంలో, పధ్నాలుగు సంవత్సరాల నరకం రేపటితో ముగుస్తుంది’, అంటూ వెళ్ళిపోయాడు.
అతన్ని ఆలింగనం చేసుకోవాలనిపించింది. కాని ధైర్యం చాలలేదు. వెళ్ళిపోయాడు. నేను కుర్చీలో కూలబడిపోయాను. మనసులో ప్రార్థన చెప్పుకున్నాను, అతడికి అవసరమైన నిబ్బరం కలగాలని. నా కళ్ళవెంట నీరు కారుతూనే ఉండినాయి. అలానే కూర్చుండిపోయాను. అర్ధరాత్రి అయింది. హఠాత్తుగా తలుపు తెరుచుకుంది. నాకు ఆశ్చర్యం వేసింది.అతడు మళ్ళీ వచ్చాడు.
‘ఎక్కడికి వెళ్ళొస్తున్నావు?’ అని అడిగాను.
‘ఇక్కడేదైనా మర్చిపోయానా నేను? నా కర్చిఫ్… పోనీలే ఏమీ మర్చిపోలేదేమో… నేను కొంతసేపు ఇక్కడుంటాను’, అన్నాడు.
అతడు కూర్చున్నాడు. నేను అతడి పక్కనే నిలబడ్డాను. ‘నీవూ కూర్చో’, అన్నాడు. కూర్చున్నాను. రెండు నిమిషాలు నిశ్శబ్దం. నన్ను తదేకంగా చూసి, చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు నాకు బాగా గుర్తు. ఆ తరువాత లేచాడు. నన్ను ఆలింగనం చేసుకున్నాడు.
‘జ్ఞాపకం ఉంచుకో. నేను నీ కోసం రెండోసారి వచ్చాను. వింటున్నావా? గుర్తుంచుకో, రెండోసారి’, అంటూ వెళ్ళిపోయాడు.
‘రేపు’, నా మనసులో మెదిలింది.
అవును, ఆ మరుసటి రోజే. అతడు వచ్చి వెళ్ళిన సాయంకాలం నాకు తెలీదు ఆ మరుసటి రోజు అతడి పుట్టిన రోజుని. అతని పుట్టినరోజు ఎప్పుడూ ఘనంగా జరుగుతుంది. పెద్ద సమావేశం. ఇంచుమించు టౌనంతా హాజరవుతుంది. ఈ రోజు కూడా. రాత్రి విందు ముగిసిన తరువాత అతడు హాలు మధ్యకు వచ్చాడు. చేతిలో ఒక కాగితం. ఆ నాడు తాను చేసిన హత్య గురించి పూర్తి వివరాలున్న ఆ పత్రం, తను పనిచేస్తున్న ప్రభుత్వశాఖ ముఖ్యాధికారికి రాసినది. దాన్ని అక్కడ చేరిన వారందరి మధ్య నిలుచుని చదివి వినిపించాడు. చదవడం ముగించి:
‘ఒక రాక్షసుడిలా ప్రవర్తించాను. మనిషికి మానవత్వానికి నన్ను నేను దూరం చేసుకున్నాను. ఇప్పుడు నాకు భగవంతుని ఆదేశం అందింది. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. పాపఫలం స్వీకరిస్తాను’, అన్నాడు.
అతడు హత్య చేసిన రోజు ఆమె యింటినుండి తెచ్చి యిన్నేళ్ళు భద్రంగా దాచిన వస్తువులన్నీ, తను చేసిన హత్యకు సాక్ష్యాధారాలు అని అతడనుకున్నది, తెచ్చి అక్కడ బల్లమీద ఉంచాడు — హత్య చేయబడిన స్త్రీ నగలు, ఆమెకు కాబోయే భర్త బొమ్మ ఉన్న ఆమె మెడలో ఉండిన లాకెట్టు, ఒక శిలువ, ఆమె డయరీ, ఆమెకు కాబోయే భర్త త్వరలో వస్తున్నాను అని ఆమెకు రాసిన ఒక ఉత్తరం, దానికి ఆమె రాసిన అసంపూర్ణ ప్రత్యుత్తరం. ఎందుకు ఉంచుకున్నాడు ఆ ఉత్తరాలు? కాదనలేని ఈ సాక్ష్యాధారాలు ఎవడైనా చింపివేయకుండా ఇన్నేళ్ళు ఎందుకు భద్రంగా దాచుకుంటాడు?
అయితే, ఆ తరువాత ఆ రోజు అక్కడ జరిగిందేమిటి? విన్నవారు అవాక్కయినారు. అతడు చెప్పిన కథ ఎవరూ నమ్మలేదు. ‘ఈయనకు మతి చలించింది’ అనుకున్నారు.
కాని కథ ఆసక్తికరంగా ఉంది. విన్నారు. కొన్ని రోజులు గడిచాక టౌన్లో అందరు నిర్ధారణ చేసుకున్నారు. అతడికి మతి స్థిమితం తప్పింది అని. న్యాయాధికారులు ఉపేక్షించలేరు కనుక విచారణ చేశారు. కాని ఆ ఆధారాలు బలమైనవి కావని కేసు మూసేశారు. ఆమె నగలు, ఆ ఉత్తరాలు నేరాన్ని ఖచ్చితంగా నిరూపించలేవు. అవి అతడికి ఒక స్నేహితుడికిచ్చినట్లు కానుకలుగానో భద్రపరచమనో యిచ్చి ఉండవచ్చు. కేసు మూసేసిన తరువాత హత్యచేయబడిన స్త్రీ దగ్గరి బంధువులు ఆ నగలు ఆమెవే అని నిస్సందేహంగా గుర్తించారు. ఏమయినా, ఆ వ్యవహారం అంతటితో ముగిసింది.
అయిదు రోజుల తరువాత, టౌన్లో అందరూ అనుకుంటున్నారు. అతడు జబ్బుపడ్డాడని, బతకడని. జబ్బేమిటో తెలీదు. గుండెజబ్బన్నారు. కాని అతడి భార్య అతడి మానసికస్థితిని కూడా పరీక్షించమని అడిగిందట వైద్యుల్ని. అన్ని పరీక్షలు చేసి, చివరకు అది మానసికవ్యాధి అని తేల్చారు. జబ్బేమిటో నాకు తెలిసి ఉంటుందని ఊళ్ళో కొందరు నా దగ్గరకు వచ్చారు. నేనెవరితోను ఏమీ అనలేదు. అతణ్ణి కలవడానికి వెళ్లాను. కాని అతని భార్య నన్ను యింటిలోపలికి రానివ్వలేదు. నేనంటే మండిపడుతోంది.
‘నీవల్లే ఆయనకు యీ జబ్బు. నీవే కారణం. ఏడాదినుంచి మనసు సరిగా లేదాయనకు. వింతగా ప్రవర్తించేవాడు. ఊళ్ళో అందరికీ తెలుసు. నీ ప్రవచనాలు ఆయనను యీ గతికి తెచ్చాయి. మరీ యీ నెలరోజులుగా కొంపలో కంటే నీ దగ్గరే ఎక్కువ ఉంటున్నాడు’. అన్నది.
ఆమె మాత్రమే కాదు. ఊళ్ళో చాలామంది అదే అనుకుంటున్నారు. ‘నీవల్లే యిదంతా జరిగింది’, అంటున్నారు. నాకు లోపల సంతోషం. భగవంతుడు అతణ్ణి కరుణించాడు. తనకు దూరమైన బిడ్డ తిరిగి చేరవస్తే తండ్రికి అంతకంటే ఆనందమేముంటుంది? అతడికి మతితప్పిందంటే నేను నమ్మలేదు. నేను ఎట్లాగైనా అతణ్ణి ఒక్కసారి కలవాలనుకున్నాను. అతడు కూడా, ప్రాణం పోయేలోపల నన్నొకసారి చూడాలనుకుంటున్నాడని తెలిసింది. వెళ్ళాను. అతన్ని చూడగానే తెలిసింది. రోజులు కాదు గంటలలో ఉంది అని. బలహీనంగా ఉన్నాడు. ఒళ్ళు పాలిపోయి ఉంది. చేతులు వణుకుతున్నాయి. ఊపిరిపీల్చడం కష్టంగా ఉంది. కాని ముఖంలో కాంతి, ప్రశాంతి ఉన్నాయి.
‘చేసేశాను’ అన్నాడు, నన్ను చూస్తూనే.’ నీ కోసం రోజూ ఎదురుచూస్తున్నాను. ఎందుకు రాలేదు యిన్ని రోజులు?’
‘నన్ను రానివ్వలేదు’, అని అనలేదు నేను.
అతడన్నాడు: ‘భగవంతుడికి నామీద దయ కలిగింది. నన్ను తన దగ్గరికి తీసుకుంటున్నాడు. నేను చనిపోతున్నాని తెలుసు. కాని ఎంత కాలం తరువాత మళ్ళీ ప్రశాంతి, సంతోషం! నా పని నేను చేశాను. మరుక్షణమే దివ్యలోకం దిగివచ్చింది. నాలోకి. ఇప్పుడు నేను నా పిల్లలను ప్రేమించగలను. వాళ్ళను ముద్దుపెట్టుకోగలను. నా భార్య, న్యాయమూర్తులు, ఎవ్వరూ ఒక్కరుకూడా నమ్మలేదు నేను హంతకుణ్ణని. నా పిల్లలు కూడా ఎప్పటికీ నమ్మరు. ఆది, వారిపై భగవంతుని కృప. నేను చనిపోతాను. కాని నా పిల్లలపై ఎటువంటి మచ్చవదలకుండా పోతున్నాను. స్వర్గంలో ఉన్నట్టుంది నాకు. నా కర్తవ్యం నేను నిర్వర్తించాను.’
అతడికి మాట్లాడడం కష్టంగా ఉంది. ఊపిరి అందడంలేదు. నా చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా ఒత్తాడు. చాలాసేపు మేం మాట్లాడలేదు. అతడి భార్య మాటిమాటికి తొంగి చూస్తున్నది. కాని అవకాశం చూసుకొని, నాతో రహస్యంగా అన్నాడు: ‘నీకు జ్ఞాపకం ఉందా? నేను ఆ రాత్రి నీ దగ్గరికి రెండవసారి వచ్చాను. గుర్తుంచుకో అని కూడా అన్నాను. నీకు తెలుసా నేను ఆ రాత్రి రెండవసారి ఎందుకొచ్చానో?… నిన్ను చంపడానికి!’
నేను ఉలిక్కిపడ్డాను.
‘ఆ రోజు నీదగ్గరనుంచి వెళ్ళిపోయానా? బయట చీకటి. వీధులవెంట తిరిగాను. నాలో నేను ఘర్షణపడ్డాను. ఉన్నట్టుండి నీ మీద విపరీతమైన ద్వేషం కలిగింది. భరించలేనంత: ‘ఈవేళ నన్ను కట్టిపడేస్తున్నది అతడొక్కడే. నా విధిని నిర్ణయించే న్యాయనిర్ణేత అయినాడతడు. ఇంత జరిగిన తరువాత, రేపు నలుగురి ఎదుట నా నేరం ఒప్పుకోక తప్పదు. వాడికి అంతా తెలుసు.’ అనుకున్నాను. నీవు నా నేరాన్ని బయటపెట్టేస్తావని భయపడలేదు. నాకు ఆ ఆలోచనకూడా రాలేదు. కాని అనుకున్నాను: ‘నా గురించి యింత తెలిసిన తరువాత నా ముఖం అతనికి ఎలా చూపించను? ముఖం చూడనక్కరలేదు. అతడు దూరంగా ధృవప్రాంతంలో ఉన్నా ఈ ఆలోచన భరించడం దుర్భరం.’ నీవే కారణం ఈ దుర్భరవేదనకు అనుకున్నాను. ఈ వేదన అంతం కావాలంటే నిన్ను అంతం చేయాలి. అప్పుడు రెండోసారి వచ్చాను నీ దగ్గరికి. నీ టేబుల్ మీద కత్తి ఉండడం గుర్తు ఉండింది. వచ్చి కూర్చొన్నాను. నిన్నూ కూర్చోమన్నాను. ఒక నిమిషం, నిమిషమంతా ఆలోచించాను. ఆ క్షణంలో నిన్ను చంపి ఉంటే, వెనుకటి హత్యమాట ఎట్లా ఉన్నా, ఈ హత్యతో సర్వనాశనం అయిపోయేవాణ్ణి. కాని ఆ క్షణం అదేమీ ఆలోచించలేదు నేను. కేవలం నీ మీద పగతీర్చుకోవాలన్న ఆలోచనమాత్రమే. భగవంతుడు ఆ క్షణం నా లోపలి దయ్యాన్నుండి నన్ను కాపాడాడు. కాని, తెలుసా? ఆ రోజు నీవు మృత్యువుకు దగ్గరగా ఉన్నంతగా ఎప్పుడూ లేవు.’
ఒక వారం తరువాత అతడు చనిపోయాడు. టౌన్ మొత్తం శవయాత్రలో పాల్గొంది. అక్కడి ముఖ్య పూజారి అతన్ని గురించి ఆర్ద్రంగా మాట్లాడాడు. అందరూ ఆ మాయదారి జబ్బును నిందించారు. ఆయన అకాలమరణానికి సంతాపం చెందారు. ఊళ్ళోని జనమంతా నా మీద చాలా కోపంగా ఉన్నారు, అతని మరణానికి కారణం నేనేనని వారి దృఢభావం. నన్ను చూడడానికి కూడా యిష్టపడడంలేదు. కొందరు మాత్రం అతడు ఆనాడు చెప్పింది నమ్మారు. నమ్మినవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. నా దగ్గరకు వచ్చేవారు, నిజమేమిటో చెబుతానని. మనిషి పతనం వినడం జనాలకు యిష్టం కదా! నేను పెదవి విప్పలేదు. ఆ తరువాత కొద్ది రోజులలోనే నేను ఆ వూరు వదిలివెళ్ళిపోయాను.
వివరణ:
సాధారణంగా కథలలో నేరంచేయనివాణ్ణి నేరస్థుడిగా న్యాయస్థానాలు గుడ్డిగా (చట్టానికి కళ్ళులేవు) తీర్పు చెప్పడం వస్తువు. నేరం చేసినవాణ్ణి నిర్దోషిగా ప్రకటించి అన్యాయంగా వదిలేయడమూ కథావస్తువు. కాని యీ దొస్తోయెవ్‌స్కీ కథలో అటువంటి అన్యాయం లేదు. ఈ కథలో చట్టానికి సమాజానికి కథానాయకుడు హంతకుడని తెలియదు. ఎన్నటికీ తెలిసే అవకాశం కూడా లేదు. కాని తాను హంతకుణ్ణి అని లోకానికి ప్రకటించేవరకు, ఆ హంతకుడు అనుభవించిన వ్యథ యీ కథావిషయం.
ప్రస్తుత కథాభాగానికి వద్దాం.
ఈ నవలలో (The Karamazov Brothers) కీలకమైన భాగాలుగా ఉంటూకూడా స్వతంత్రంగా బతకగలిగిన కథలు కొన్ని ఉన్నాయి. (ఉదా. కోల్యా కథ Nikolai Ivanov Krasotkin – Kolya). The Grand Inquisitor భాగం యించుమించు ఒక స్వతంత్ర గ్రంథం అయిపోయింది. విడి పుస్తకంగా దొరుకుతోంది కూడా. కాని దానితో కలిపి చదువుకోవలసిన ప్రస్తుతకథాభాగం, ఒక అద్భుతమైన కథగా కూడా గుర్తింపు పొందవలసినది. కాని, చాలామంది పాఠకులు, యీ భాగాన్ని అసలు నవలలో ఉన్నట్టుకూడా గుర్తించినట్టు లేదు. ఈ “నవల లోపలి నవల”ను దాటేసి అవతలికి వెళ్ళిపోయారు. అలా దాటెయ్యడంవలన, ఒక మంచి కథను దాటెయ్యడమే కాక, దానికీ, The Grand Inquisitorకు ఉన్న సంబంధం ఉపేక్షించడం అవుతుంది.
మహాన్యాయాధిపతి (The Grand Inquisitor)
దొస్తోయెవ్‌స్కీ కాలానికి కొంచెం ముందు వరకు రోమన్ కాథలిక్ చర్చి, చర్చి అధికారాన్ని కాదన్నారన్న నెపంతో వేలమందిని “నేరవిచారణ” (Inquisition) జరిపి, నేరం ధృవపరచి, తగులబెట్టింది. జోన్ ఆఫ్ ఆర్క్ పేరు విన్నాం. పేరులేని వేలమందిని తగులబెట్టింది చర్చి. ప్రస్తుత నవలలో ఏకంగా జీససే దొరికిపోయాడు మతాధికారులకు. ఆయన యీ నేలపై తిరుగుతుండగా పట్టుకొని అరెస్ట్ చేశారు. మతన్యాయాధికారి (Inquisitor) జీసస్‌ను నేరవిచారణ చేయడం యీ నవలాభాగంలోని విషయం. (అంత జరిగిన తరువాత జీసస్ తిరిగి యీనేలపై తిరగడం తప్పుకదా!) చర్చికి శత్రువు సైతాను కాదు, క్రీస్తు. (నవలలోని యీ భాగం ఇవాన్ రాసిన ఒక కావ్యం.)
ఏమిటి క్రీస్తుపై అభియోగం? సృష్టిలో కోట్లమంది ఉన్నా. మనిషి ఒంటరివాడు. ఆ ఒంటరితనంలో అభద్రత ఆవిర్భవిస్తుంది. భద్రతకోసం భగవంతుణ్ణి సృష్టించి యిచ్చింది చర్చి. ఊరకే యిస్తుందా? ఏదీ ఊరకే రాదు. (మతమైనా రాజ్యమైనా సమాజమైనా కుటుంబమైనా, భద్రత ఊరకే యివ్వదు. ప్రస్తుత విషయం మతం.) మతం మనిషికి భద్రత యిచ్చి అతని స్వాతంత్య్రాన్ని తీసేసుకొంటుంది. నిరంకుశంగా శాసిస్తుంది. మతం, మతం మారి సామ్రాజ్యమైపోతుంది. (ఇది వాస్తవమైన మతమార్పిడి.) న్యాయాధికారి జీసస్‌తో అంటాడు, ‘మేము సీజర్ కత్తిని, రోమ్‌ను లాగేసుకున్నాం. ఈ భూమిపై ఎదురులేని శాసకులుగా ప్రకటించుకున్నాం.’ ఎందుకు? ‘పాపం వారు చిన్నపిల్లలు. అల్లరిచేసి బడిపంతుల్ని బడిలోకి రానివ్వకుండా అడ్డుకుంటారు. కాని వారి అల్లరి ఆనందం చాలాకాలం ఉండదు. దానికి వాళ్ళు చాలా మూల్యం చెల్లించుకోవలసివస్తుంది. దేవాలయాలు ధ్వంసం చేస్తారు. ఈ నేలను నెత్తుటితో ముంచెత్తుతారు. అలసిపోయి వారి దుర్బలతను తెలుసుకుంటారు కాని, నీవేం చేశావు? వాళ్ళ స్వాతంత్ర్యం తీసేసుకోకపోగా, దాన్ని మరింత ఎక్కువ చేశావు.’
జీసస్ ఒక్కమాట మాట్లాడలేదు. న్యాయాధికారివద్దకు మెల్లగా నడిచి వెళ్ళి, అతని చేతిని ముద్దు పెట్టుకున్నాడు.
న్యాయాధికారి జీసస్‌ను వదిలేశాడు: ‘వెళ్ళిపో! కాని మళ్ళీ రాకు’, అంటాడు.
ఎవరు ఒప్పు, ఎవరు తప్పు? న్యాయాధికారి అన్నమాట నిజంకాదు అనగలమా? మనిషి భద్రతకోసం, రొట్టెముక్కకోసం, స్వేచ్ఛను అమ్ముకుంటాడన్నమాట నిజం కాదనగలమా? జీసస్ ప్రేమ సమాధానం సమస్యను పరిష్కరిస్తుందా? ప్రపంచంలోని అన్యాయాన్ని దుర్మార్గాన్ని జయించగలుగుతుందా? జీసస్ ఓడిపోతాడు, ఓడిపోయాడు అనకుండా ఉండగలమా? అలాగని, జీసస్ పెట్టిన ముద్దు న్యాయాధికారి గుండెలో ఒక శాశ్వతమైన దివ్యకాంతిని వదిలివెళ్ళిన మాట నిజం కాదా? మనం ఎవరి పక్షం? దొస్తోయెవ్‌స్కీ ఎవరి పక్షం? రొట్టెముక్క కావాలా, (యీ రొట్టెముక్క కొందరు ప్రసాదమని, కొందరు సాదమని పంచుతారు), లేక స్వేచ్ఛ కావాలా?
న్యాయాధికారి జీసస్‌ను వదిలేశాడు: ‘వెళ్ళిపో! కాని మళ్ళీ రాకు’, అంటాడు. [కాని క్రీస్తు “రెండవసారి” వస్తూనే ఉంటాడు (Second Coming)] క్రైస్తవమతానికి శత్రువు సైతాను కాదు, జీసస్. జీసస్ మనిషిని, చర్చి నుండి కూడా, ముక్తుణ్ణి చేస్తాడు. చర్చి తన అనుయాయుల స్వేచ్ఛను సహించలేదు. ఈ న్యాయాధికారి, మతం ముసుగులో ఉన్న సైతాను కాదా? మనం సైతాను పక్షం కామని, క్రీస్తు పక్షమని నిర్ద్వంద్వంగా చెప్పగలమా? బృహదారణ్యకోపనిషత్తు యిటువంటి మాటే అంటుంది. మనిషి ముక్తుడు కావడం దేవతలకు యిష్టం ఉండదని, మనిషి తాను ముక్తుడను అని, ముక్తిని కోరవచ్చునని తెలుసుకోవడం కూడా దేవతలకు యిష్టం ఉండదని. ఎందుకంటే, మనిషి దేవతలకు భోగ్యవస్తువు. అనేక పశువులకు యజమాని, తన పశువులలో ఒకటి తప్పిపోయినా బాధపడుతాడు. దేవతలకు మనుషులు పశువులవంటివారే. ఒక్క పశువైనా తన బంధంనుండి తప్పించుకోడం ఎవడూ సహించలేడు. (“యో౬న్యాం దేవతాముపాస్తే, అన్యోఒ సావన్యో హమస్మీతి, న స వేద, యథా పశురేవం స దేవానామ్ | యథా హ వై బహవః పశవో మనుష్యం ఏకైకః దేవాన్ భునక్తి; ఏకస్మిన్నేవ పశావాదీయమానేఒ ప్రియం భవతి, భవతి, కిము బహుషు? తస్మాదేషాం తన్న ప్రియం యదేతన్మనుష్య విద్యుః ||” (బృహ: ఉప: 1.4.10) అలాగే, చర్చి కూడా తన అధికారం నుండి ఎవడూ బంధముక్తుడు కావడం సహించదు. మనిషి చర్చి అధికారాన్ని కాదని క్రీస్తును శరణుచెందడం చర్చి సహించదు. అలా ముక్తి పొందినవారిని చర్చి ఎలా హింసించిందో, తొలగించిందో చరిత్ర చెబుతుంది.
ఈ Grand Inquisitor లోని ప్రశ్నకు సమాధానంలోని సంఘర్షణే దీని తరువాత నవలలో వచ్చిన ప్రస్తుత కథాభాగం, (“పాపము ప్రక్షాళనము”: The Mysterious Visitor). ఇది ఫాదర్ జోసిమా కథ. ఆయన చెప్పుకున్న తన కథను, ‘ఆయన మాటలలో’నే ఆల్యోషా రాసినది, (“composed in his own words”). అందరిచేత యీనాడు మహిమాన్వితుడిగా ఆరాధింపబడుతున్న జోసిమా, యవ్వనంలో ఒక తాగుబోతు తిరుగుబోతు. ఎవరినీ దేనినీ లెక్కచేసేవాడు కాదు. కాని అతని జీవితకాలంలో అతడి గతం ఎవరికీ తెలియదు.
ఈ కథలోని యిద్దరు ప్రధానపాత్రలలో జోసిమా ఒకడు. రెండవవాడు ఆ టౌన్‌లో పెద్దమనిషిగా సంభావించబడుతున్న హంతకుడు. ప్రధాన కథావిషయం ఆ హంతకుడి పాపము, పశ్చాత్తాపము, ప్రక్షాళనము. ఈ కథలో మనం గమనించవలసిన ముఖ్యవిషయాలు:
కథాగమనవేగంలో ఉత్కంఠభరితపఠనంలో, మొదటిసారి చదివినపుడు మనం కొన్ని ప్రధానమైన విషయాలు గమనించకపోవచ్చు.
‘ఈ మధ్య మీరు ఈ టౌన్లో తిరుగుతూ, కొందరి యిళ్ళకు వెళ్లడం, వారితో వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడడం చూస్తున్నాను. మీరు వాళ్ళకు చెపుతున్న మాటలు వింటున్నాను కూడా. మీరు సామాన్యవ్యక్తి అనిపించడం లేదు. మీది దృఢమైన ధార్మికప్రవృత్తి. మీలో సత్యనిష్ఠ కనిపిస్తున్నది. మీరు చేస్తున్న పని అందరూ చేయగలిగింది కాదు. పరువు నష్టమనీ, నలుగురూ చులకన చేస్తారనీ తెలిసి కూడా, మీరు చేయదలచుకున్నది చేసేస్తారు. అలా చేయడానికి చాలా ధృతి ఉండాలి’.
ఈ కథాకాలంనాటికి, జోసిమా ఫాదర్ కాదు. బ్రదర్ కూడా కాదు. అది అతని ధార్మికపరివర్తనలో ప్రథమదశ. ఉత్తీర్ణుడు కాదు, కాని తీర్థుడు. (“స్వయం తీర్థః పరాంరయతి”) ఒక హంతకుడి పరివర్తనలో పాపవిమోచనంలో ప్రేరణ అయినవాడు. ఒక సైనికాధికారిగా ఉండినవాడు, ఆ పదవికి రాజీనామా చేశాడు. ఊళ్ళో సామాన్యజనాలతో కలిసిమెలిసి తిరుగుతూ, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, తోచినమాటలు చెబుతూ ఉంటాడు. ఇవి సాధారణంగా ఏ పాస్టరో చేస్తాడు. ఇతడి విధినిర్వహణ అధికారికం కాదు. అప్పటికి అతడికి చర్చితో ఏ అనుబంధము లేదు. ఇది, “చర్చి మాత్రమే యీ విధులు నిర్వహించగలదు, మరెవరూ యీ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదు”, అన్న చర్చిని తిరస్కరించడం.
క్రైస్తవమతంలో, తప్పుచేసినవారు తమ తప్పును ఫాదర్ చెవిలో ఊదుతారు. లోకానికి ఆ రహస్యంతో సంబంధం లేదు. ఈ కథలో, హంతకుడు తన పాపాన్ని తన పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించబడిన అతిథులు, ఒక పై అధికారి ఎదుట, రాసి ఉంచుకున్న కాగితం చదివి, నేరాన్ని లిఖితపూర్వకంగా ప్రకటిస్తాడు. ఇది కూడా చర్చిని తిరస్కరించడమే.
ఈ విధి నిర్వహణ చేసే వ్యక్తి, మతాధికారి కానీ కాకపోనీ, తాను చెప్పేది పూర్తిగ తాను నమ్ముతాడని నమ్మకం ఉందా?
హంతకుడు జోసిమాతో: ‘అంటే నీవు నమ్మవన్న మాట? నీవు నలుగురికీ నమ్మకం కలిగిస్తావు, కాని నీకు నమ్మకంలేదు? విను. తప్పక వస్తుంది.’
ఇక్కడ మనం గమనించవలసింది, కథలో జోసిమా మతాధికారి కాదు, కాని చర్చికి అనధికారిక ప్రతినిధి. అంటే, అతని గురించి హంతకుడన్నమాట, చర్చిలోని అధికారులకు వర్తిస్తుంది. లోకానికి విశ్వాసం గురించి చెబుతుంటారు. కాని వారికే గట్టినమ్మకం ఉండదు.
ఇలా, యీ కథలో రోమన్ కాథలిక్ చర్చిపై తన వ్యతిరేకతను గూఢంగా వ్యక్తం చేస్తాడు రచయిత. దొస్తోయెవ్‌స్కీకి రష్యన్ ఆర్థోడోక్స్ చర్చిపై అభిమానం ఉండవచ్చు. కాని యీ విమర్శలో ఆ అభిమానం ప్రధానం కాదు. వ్యక్తి స్వేచ్ఛ ప్రధానం. దానిని ఏ వ్యవస్థకూడా హరించడం అతడికి యిష్టంకాదు.
నవలలో న్యాయాధికారిఘట్టం తరువాత వచ్చే యీ కథలో చర్చి అప్రాధాన్యాన్ని చెప్పే యీ అంశాలు గుర్తించడం అవసరం. చర్చిని కాదనడం సులభమే కావచ్చు. క్రీస్తును స్వీకరించడం అంత సులభమా? ఎంత కష్టమో దొస్తోయెవ్‌స్కీకి తెలుసు. నవల అంతా అదే కష్టం. ఈ కథాభాగంలో ఆ కష్టాన్ని అంతటినీ చిక్కబరచి నింపాడు.
వ్యక్తి బాధ్యత:
ఈ కథలో హంతకుడు తన నేరాన్ని ఒప్పుకోవలసిన అవసరం ఏముంది? న్యాయస్థానం అతణ్ణి నేరస్థుడు అనలేదు. సమాజం అతణ్ణి మహాత్ముడు అని మన్నన చేస్తున్నది. సుఖంగా బతికేయొచ్చుకదా? ఈ కథ బైబిల్ లోని అబ్రహాం కథకు విపర్యయం అనవచ్చు. అబ్రహాం తన కొడుకును బలి యివ్వడం చట్టం దృష్టిలో హత్య, శిక్షార్హమైన నేరం. సమాజం దృష్టిలో అతినింద్యమైన నిర్దయచర్య. ఈ దొస్తోయెవ్‌స్కీ కథలో హంతకుడు చట్టం దృష్టిలో నిర్దోషి, సమాజం దృష్టిలో మహాత్ముడు. కాని అక్కడా యిక్కడా కూడా భయము కంపము ఉన్నాయి. బైబిల్ కథలో హత్య జరగలేదు, యీ కథలో హత్య జరిగింది. బైబిల్ కథలో హత్య జరిగి ఉంటే చట్టం దృష్టికి సమాజం దృష్టికి వచ్చి ఉండేది. కాని పరస్పరం విపర్యయంగా కనిపించే యీ రెండు కథలలోను సామాన్యాంశం ఒకటి ఉంది. అది, చట్టము సమాజము కథకు ప్రధానం. అవి అప్రధానమన్నదే కథలో ప్రధానవస్తువు.
ఈ వాస్తవానికి రెండు ముఖాలు. సృష్టిలో మనిషి ఒంటరి. సర్వతంత్ర స్వతంత్రుడు కూడా. ఒంటరితనం భయకారణం. (“ఏకాకీ బిభేతి” అని బృహదారణ్యకం.) ఒంటరితనము భయము పోవాలంటే రెండవదేదైనా ఉండవలె, (“స ద్వితీయమైచ్ఛత్”. బృహ. ఉప.) కాని ఆ రెండవది పుట్టగానే, దానితో భయంకూడా పుట్టుకొస్తుంది, (“ద్వితీయాద్వై భయం భవతి.” బృహ. ఉప.) ఇది మనిషి అస్తిత్వవాస్తవం. ఒంటరితనం రెండువిధాలు. ఒకటి సమష్టితో కలిసిపోలేని ఒంటరితనం. రెండవది, సమష్టిలో లయమై, సమష్టిని తనలో నింపుకొని, సమస్తాన్ని మించి నిలిచిన వ్యష్టి ఒంటరితనం. ఈ రెండవదానికి కొంత వివరణ అవసరం.
“Faith is just this paradox, that the single individual as the particular is higher than the universal… the single individual who having been subordinate to the universal as the particular, now by means of the universal becomes that individual who, as the particular, stands in an absolute relation to the absolute.” (Kierkegaard:Fear and Trembling.tr. Hannay.p.84-85)
సమష్టితో కలిసిబతకలేని ఒంటరితనం, సమష్టితో ఆత్మీయతను పొంది, సమష్టిని తనలో నింపుకొని, సమష్టిని మించి ఎదుగుతుంది. వ్యష్టి సమష్టిలో ఒదిగి ఎదగడం అంటే యిదే. ఒదిగినపుడూ ఒంటరి, ఎదిగినపుడూ ఒంటరి. మొదటి ఒంటరితనం. అల్పం, రెండవది భౌమం.
ఈ కథలో వస్తువు యీ రెండవ ఒంటరితనం. ఈ ఒంటరితనంలోకి చట్టానికి, సమాజానికి, చివరకు ధర్మానికి (religion) కూడా ప్రవేశం లేదు. ” Man Is born as many, and dies as one.” (Heidegger) అన్ని ధర్మాలను పరిత్యజించి ఆత్మను పట్టుకోడం అంటే యిదే. ప్రస్తుతకథాభాగంలో హంతకుడు తన నేరాన్ని ఒప్పుకున్నది తన వెలుపలి శక్తులకు లొంగిపోయి కాదు. తన ఆత్మను కాపాడుకోడానికి. అస్తిత్వవాదం, వ్యక్తి ఆత్మ (individual self)లో, వ్యక్తికంటే ఆత్మ (self)కు ప్రాధాన్యం యిస్తుంది. అస్తిత్వవాదాన్ని ఒక విధంగా ఆత్మవాదం అనవచ్చు. అన్ని విధాలైన వెలుపలి (అనాత్మ) బంధాలను వదిలించుకొని, కేవలం “నేను”గా మిగిలి ఉండడం. అదే “కేవలోహం”. ఈ కథలో హంతకుడు అనాత్మను అనాదరించే స్థితికి చేరుకున్నాడు. న్యాయం నిర్దోషి అననీ, సమాజం మహాత్ముడననీ, అవి తనకు అవసరం లేదు. అబ్రహాం కథలో కూడా, యిదే చూశాం. పరమమైన విధేయత ఆత్మకే, చట్టానికి లోకనీతికి అందులో భాగం లేదు.
పాపము, క్షమ
“నిస్పృహ పాపం (“Despair is sin”) పాపానికి వ్యతిరేకపదం పుణ్యం కాదు, అశ్రద్ధ”, అంటాడు కీర్కెగార్డ్. (“the opposite of faith is not sin, but unbelief or the refusal to believe.” “Sickness unto Death.”) ఏది నిస్పృహ? “నేను పాపులలోకెల్లా మహాపాపిని, నన్ను భగవంతుడుకూడా క్షమించలేడు”, అనడం నిస్పృహ. ఆ నిస్పృహ భగవంతుని అనంత క్షమాగుణానికి పరిమితి విధిస్తుంది. అది నమ్మకం లేకపోవడం. అది కొండలను కదిలిస్తుంది. పాపికొండలను కరిగిస్తుంది. శ్రద్ధ కలిగితే కలగనిది లేదు. కాని ఆ శ్రద్ధ ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది? నారకపావక (inferno, Purgatorio) భూమికలను గడచి వెళ్ళవలె. ఈ కథలో ఆ భూమికలను ఆవిష్కరించాడు దొస్తోయెవ్‌స్కీకి. హంతకుడు నడచిన నరకం చూపించాడు రచయిత. భగవంతుడి క్షమాగుణం అనంతం. కనుక అనంతంగా పాపాలు చేయమని అర్థమా? అదే అందులోని రహస్యం. భగవంతుని కృపాస్పర్శ కలిగిన తరువాత, మూడులోకాల ఆధిపత్యం కాదు, పధ్నాలుగు లోకాలు నీ పాదాలవద్ద పడేసినా పాపం చేయలేవు.
కీర్కెగార్డ్ రాతలలో (ముఖ్యంగా “The Concept of Dread”; “Sickness unto Death”) చాలా ఎక్కువగా ఆక్రమించిన విషయం పాపం. (ఈనాడు కీర్కెగార్డ్ సాహిత్యకారులకంటే మానసిక వైద్యులకు ఎక్కువ ఆదరణీయుడు. పాపభావము అభావము కూడా ఏవిధమైన మానసిక అస్వస్థతలకు కారణాలవుతాయో కీర్కెగార్డ్ తన రచనలలో చాలా వివరించాడు. ప్రస్తుతకథలో మానసిక వైద్యుల ప్రసక్తి ఉంది. హంతకుడి భార్య తన భర్తకు మానసిక వైద్యచికిత్స అవసరం అంటుంది.)
ముక్తి, పాపంనుండి ముక్తి కదా? సోక్రటీస్ అజ్ఞానం తప్ప పాపం లేదు అంటాడు. మనిషి “తెలియక” తప్పు చేశాడంటే కీర్కెగార్డ్ కాదంటాడు. పాపం చేయడం, మనిషి స్వభావం. చేయకపోవడం స్వభావాన్ని అతిక్రమించడం. తనలోని పాపాన్ని తెలియడం, ఒప్పుకోడం శ్రద్ధకు దారి.
కీర్కెగార్డ్ అంటాడు, కేవలం పశ్చాత్తాపం వల్ల ప్రయోజనంలేదు. శ్రద్ధ ఉండాలి. ఏ పాపమైనా దేవుడు క్షమించలేనంత పెద్దది కాదు, క్షమిస్తాడు అన్న శ్రద్ధ ఉండాలి. శ్రద్ధలేని పశ్చాత్తాపం వ్యర్థం. ఈ కథలో హత్యచేసిన పెద్దమనిషి చాలానే పశ్చాత్తాపం చెందాడు. నరకవ్యథను అనుభవించాడు. శ్రద్ధ కలిగిన తరువాతనే తన నరకం తొలగింది. ఎలా తొలగింది? వెలివేత తొలిగేది ఎలా? ఏ ఒంటరితనం
తొలగడానికి తోటి మనిషిని కాదని మనిషి దేవుణ్ణి సృష్టించుకున్నాడో, ఆ ఒంటరితనపు తత్త్వం తెలుసుకున్నాడు.
‘వెలివేతా? ఏ వెలివేత?’
దొస్తోయెవ్‌స్కీ రచనాచాతుర్యం హంతకుడిని జోసిమా అడిగిన యీ ప్రశ్నలో తెలుస్తుంది.
“ఏ వెలివేత అని అడగడమేమిటి? ఎన్ని వెలివేతలున్నాయి? “వెలివేత” సాధారణంగా మతాధిపతుల భాష, (excommunication). ఇక్కడ ఆ ప్రసక్తి లేదే! ఇది చర్చి విధించిన వెలివేత కాదు. “ఏ వెలివేత?”కు హంతకుడిచ్చిన సమాధానం యీ కథాసారం అనవచ్చు.
‘మనిషి మనిషిని వెలివేయడం. మనిషి మనిషితో కలిసి బతకలేకపోవడం. వెలిగా, వెలితిగా బతకడం. లోకమేమైపోయినా సరే, నేనుబాగుంటే చాలు అనుకోడం.’ దేవుని ద్వారా మనిషిని కాదు, మనిషిద్వారా దేవుని తెలుసుకున్నాడు, యీ కథలోని హంతకుడు:
ఈ అవగాహన, హంతకుడు ప్రక్షాళనభూమికపై చాలాదూరం నడిచివచ్చాడని చెబుతోంది.
హంతకుడు చాలా బాధను అనుభవించాడు. ఈ సందర్భంలో అతడన్న ఒకమాట వాస్తవక్రైస్తవానికి నిర్వచనం. ముఖ్యంగా కీర్కెగార్డ్ ప్రవచించిన వాస్తవక్రైస్తవానికి పునాదిరాయి.
(కీర్కెగార్డ్ ప్రసక్తి యీ వ్యాసంలో యింత తరచుగా రావడం అసందర్భమేమీ కాదు. ఒక కోణంలో వారిద్దరూ కవలలు. కీర్కెగార్డ్ తాను క్రైస్తవధర్మానికి అంకితమైపోయానని, కాదు, క్రైస్తవధర్మం తనను దత్తత తీసుకున్నదని, చెప్పుకున్నాడు కదా! దొస్తోయెవ్‌స్కీలో, ఆస్తిక్యానికి నాస్తిక్యానికి మధ్య ఊగిసలాట ఉంది. అది అతనిది మాత్రమే కాదు. మనందరిదీ. మనలోని ఊగిసలాటనే దొస్తోయెవ్‌స్కీ పలికించాడని చెప్పుకోవచ్చు.) ఈ కథలో హంతకుడు అన్నమాట యిది: “ఈ లోకంలో ఒకడి బాధనుండి మరొకడు ఏమీ నేర్చుకోలేడు.” ఇది కూడా, క్రైస్తవ అస్తిత్వవాదంలో ఒక కీలకభావం: “… faith has never existed just because it has always existed.” (Kierkegaard: Fear and Trembling. tr. Hannay.p.85) ఎవడి శ్రద్ధను వాడు సంపాదించుకోవలె, రక్తం చిందుతూ, ఒకడి శ్రద్ధను మరొకడు సంపాదించిపెట్టలేడు. తస్మాత్ జాగ్రత, ఎవడి రక్తం వాడే చిందించుకోవలె! ఎవడి శిలువపై వాడే!
స్వేచ్ఛ, వ్యథ: (Freedom and angst):
హంతకుడి వ్యథ అతడి స్వేచ్ఛాఫలం. అతడు తన నేరాన్ని ఒప్పుకోవలసిన అవసరం లేదు. కాని ఒప్పుకునే స్వేచ్ఛకూడా అతడికి ఉంది. ఉండబట్టే ఒప్పుకున్నాడు. ఆడమ్ నిషిద్ధఫలం తినవచ్చు. తినకుండా ఉండవచ్చు. ఆ నిర్ణయస్వేచ్ఛ లేనపుడు బాధలేదు. స్వేచ్ఛ ఉన్నపుడే ఘర్షణ, వ్యథ. (angst.) “స్వేచ్ఛ మనిషికి విధించిన శిక్ష.” (సార్త్ర) ఈ ఘర్షణ ఆడమ్ నుండి సంక్రమించిన వారసత్వం కాదు, (ఆగస్టిన్ అన్న peccatum originale, “original sin’) ఈ ఘర్షణ స్వేచ్ఛాఫలం.
కాని యీ ఘర్షణే మనిషికి ముక్తిసాధనం. అది మనకున్న స్వేచ్ఛాస్వరూపాన్ని వివరిస్తుంది. మన ఎంపికకు ఒక మార్గం చూపిస్తుంది.
బాధ్యత:
ఈ కథలో హంతకుడి నోట మరో మాట పలికిస్తాడు (జోసిమాతో) దొస్తోయెవ్‌స్కీ: “అవును. నీవంటూ ఉంటావే, అది నిజం. మనం మన కర్మలకే కాదు, లోకంలో అందరి కర్మలకు అందరి పాపపుణ్యాలకు బాధ్యులం.”
“లోకంలో అందరి కర్మలకు అందరి పాపపుణ్యాలకు మనం బాధ్యులం.” ఇది ఆధ్యాత్మికమార్గంలో సద్గురువుల నోట తరచు వినపడే మాటే. జగ్గీ వాసుదేవ్ యిటీవల జిడ్డు కృష్ణమూర్తి గురించి మాట్లాడుతూ, కీర్కెగార్డ్, దొస్తోయెవ్‌స్కీల పేర్లుకూడా ప్రస్తావించాడు. ఈ బాధ్యత విషయంలో ఆయన (మరో సందర్భంలో) ఏమంటున్నాడు?
“Responsibility does not mean taking on the burdens of the world. It does not mean accepting blame for things you have done or not done. It does not mean living in a state of perpetual guilt. Responsibility simply means your ability to respond. If you decide, “I am responsible, ‘you will have the ability to respond. If you decide, I am not responsible, you will not have the ability to respond. It is as simple as that. All it requires is for you to realise that you are responsible for all that you are and all that you are not, all that may happen to you and all that may not happen to you.” (Isha Jaggi Vasudev)
అంటే, లోకంలో ఎవడు ఎక్కడ హత్య చేసినా, “ఆ హత్య నేనే చేశాను”, అని అరిచి చెప్పాలా! లేక, ప్రపంచంలోని దుఃఖాన్నంతా నా భుజాలపై వేసుకు బతకాలా? అది కాదు దాని అర్థం. లోకంలో జరుగుతున్నవాటికి నీవు స్పందించగలగాలి. “అది వాడి ఖర్మ”, అనకుండా వాడికి నేనేమైనా చేయగలనా! ప్రతి ఒక్క విషయంలోను చేయలేవు. చేయడం కాదు ముఖ్యం. చేయాలన్న తపన. స్పందన. ఇది అస్తిత్వవాదంలో కూడా వినపడుతుంది.
“మనిషి తనకొరకు తీసుకునే నిర్ణయం, సమస్తమానవాళి కొరకు నిర్ణయం.” “…in choosing for himself [man] chooses for all men” (Sartre: Existentialism Is Humanism) అదెలా? నాకు హానికరమైన నిర్ణయం నేను తీసుకోను కదా? అది యితరులకు కూడా హానికరం కాలేదు.
ఇందులో అస్తిత్వవాదవైరుధ్యం కనిపిస్తుంది. ఏమిటది? అస్తిత్వవాదంలో మనిషి తప్ప మానవత లేదు కదా? మానవత అనేది తత్త్వం (essence) కదా? అస్తిత్వవాదంలో నాకు మేలు చేసేది నాకు మాత్రమే మేలుచేయాలి కదా?
దీనికి సార్త్ర సమాధానం:
“జరిగేదేమంటే, మనిషి తాను కోరినట్టుగా తనను తాను నిర్మించుకోడం కొరకు, తాను ఏ విధమైన మనిషిగా రూపొందవలె అనుకుంటాడో ఆ రూపం ఊహించుకుంటాడు. అనురూపమైన చర్యలే తీసుకుంటాడు. ఒక్కటి కూడా అందుకు భిన్నంగా ఉండదు. ఇదా ఆదా అన్న విచికిత్స కలిగి, వాటిలో ఒకదానిని ఎంచుకోడమంటే దాని విలువను గుర్తించడమే. రెంటిలో తక్కువ విలువైనదానిని ఎంచుకోలేము. ఎప్పుడైనా, ఎంపికచేసుకున్నపుడు ఎక్కువ విలువైనదానినే ఎంచుకుంటాం. అందరికీ మేలుచేయగలదైతేనే కాని నాకు మేలు చేయలేదు.” (“అస్తిత్వవాదం మానవతావాదం”)
(There’s not a single choice of our acts which doesn’t at the same time create an image of man as we think we ought to be. To choose to be this or that is to affirm at the same time the value of what we choose, because we can never choose evil. We always choose the good, and nothing can be good for us without being good for all. “Existentialism is Humanism”: Sartre)
సార్త్ర సమాధానంతో మనం సమాధానపడాలి. పేచీ పడలేము కనుక, పడరాదు కనుక. మనం కోరుకునేది ఆ సర్వమానవాభ్యుదయం కనుక. అది వాదాలను దాటిన ప్రేరణ. సమస్తమానవాళికి మేలు చేయనిది నాకు మేలు చేయలేదు అన్న అవగాహనకు ఏ పేరైనా పెట్టనీ, అస్తిత్వవాదమననీ మానవతావాదమననీ, ఆమోదించదగిందే. ఈ సందర్భంలో సార్త్ర మాట మరొకటి వినదగింది. “at the
heart of the aesthetic imperative, there is the moral imperative.” (“Why write?”: Sartre) అధార్మికమైన కళ ఉండలేదు. కలం పట్టుకున్నావా, ధర్మమే పలుకగలవు. అధర్మం పలుకలేవు. రాయలేవు, మనిషికి హాని కలిగించేదేదీ రాయలేవు. ఇది నిజమైతే ఎంత సంతోషించదగిన మాట! అంతేనా? సార్త్ర మరో మాట: “…నిజానికి, అస్తిత్వవాదికి ప్రేమలేదు, ప్రేమనిండిన పనులు మాత్రమే.” (“…in reality, for the existentialist, there is no love apart from the deeds of love;” (సార్త్ర). (జిబ్రాన్ యిదే అంటాడు, “కనిపించే ప్రేమ కర్మ”, “work is love visible”, అని.) “పని”కిరాని ప్రేమ పనికిరాదంటుంది అస్తిత్వవాదం. “మనం మన కర్మలకే కాదు, లోకంలో అందరి కర్మలకు అందరి పాపపుణ్యాలకు బాధ్యులం.”, అన్న యీ కథలోని హంతకుడి మాటకు వివరణ మనల్ని యింతదూరం తెచ్చింది.
దొస్తోయెవ్‌స్కీ కవలనవలలు: (Crime and Punishment; The Brothers Karamazov)
Dostoevsky నవల The Brothers Karamazov లోని ప్రస్తుత కథాభాగానికి నేను చేసింది చాలావరకు అనువాదము, కొంత అనుసరణము. కొన్ని చిన్నచిన్న మార్పులు. పాత్రలపేర్లు తీసేశాను. పేర్లు లేని లోపం కథలో తెలియదు.
ఈ కథకు పేరు “పాపము ప్రక్షాళనము” నేను పెట్టిందే. (ఈ కథకు నేను మొదట పెట్టిన పేరు “చేసిన పాపం”.)
“నేరము శిక్ష” (Crime and Punishment) దొస్తోయెవ్‌స్కీ ప్రసిద్ధమైన నవల. కాని, యీనవలలోని (The Karamazov Brothers) యీ కథాభాగంలో, నేరము శిక్ష కంటే, పాపము ప్రక్షాళనము ప్రధానం. (‘Not crime and punishment, but sin and expiation.” “Family Reunion”: T.S. Eliot ఆంగ్లానువాదంలో ఈ భాగానికి The Mysterious Visitor అని పేరు. ఆంగ్లంలోని ఈ పేరు, దొస్తోయెవ్‌స్కీ ఉద్దేశించినది, ఎక్కువ సార్థకం కావచ్చు. ఎందుకంటే, ఈ కథలో The second coming ప్రధానాంశం. ‘నేను రెండవసారి వచ్చాను. గుర్తుంచుకో’, అన్న మాట కథాక్రమంలో కీలకమైన మార్పు, కథార్థంలో కీలకాంశం. అంటే యీ కథలోని ప్రధానపాత్ర (అన్నట్టు యీ కథలో ప్రధానపాత్ర ఎవరు, హంతకుడా జోసిమానా? జీసస్‌కు ప్రతినిధి అని అనుకోవాలా? కథలో అతడు రెండవసారి వచ్చింది, తన పరివర్తనకు కారణమైన జోసిమాను చంపడానికి. ఇది జీసస్ పునరాగమనం (Second Coming) వంటిది ఎలా అవుతుంది? జీసస్ రెండవసారి ఎందుకు వచ్చాడో, దాని ప్రాధాన్యాన్ని పరమార్థాన్ని తెలియజెప్పడం, యీ కథలో హంతకుడు రెండవసారి రావడంలోని కథాప్రయోజనం. ఈ భూమిపై అధర్మం తల ఎత్తుకొని తిరుగుతూ, ధర్మం తలదించుకుంటుందో అప్పుడు క్రీస్తు రెండవసారి అవతరించి దుష్టశిక్షణ చేసి శిష్టులను రక్షిస్తాడని బైబిల్ చెబుతుంది.
[“Both the beast and the Antichrist will be thrown into the lake of fire to burn for all eternity (Revelation 19:20-21) and Satan will be bound
in the bottomless pit for a thousand years.” (Revelation 20:1-3) ]
ప్రస్తుత కథలో హంతకుడు నేను రెండవసారి వచ్చాను, గుర్తుంచుకో అంటాడు. అతడు జోసిమాను చంపడానికి రావడం, అధర్మం తల ఎత్తడంగా, తలకెక్కడంగా, అర్ధం చేసుకోవలె. అధర్మం అంత పెరిగేవరకు క్రీస్తు చూస్తూ ఉంటాడు. అప్పుడు అవతరిస్తాడు. ఎక్కడ?
మనిషి అంతరంగంలో, మనిషిలోపల అధిష్టించిన దయ్యాన్ని నరికేసి మనిషిని కాపాడుతాడు. బైబిల్‌లోచెప్పిన “రెండవ రాక”కు అర్థం యిది. క్రీస్తుచైతన్యం (Christ consciousness) మనిషి అంతరంగంలో అవతరించడం, “భగవంతుడు ఆ క్షణం నా లోపలి దయ్యాన్నుండి నన్ను కాపాడాడు.” ఎప్పుడు కాపాడాడు?
“కాని, తెలుసా? ఆ రోజు నీవు మృత్యువుకు దగ్గరగా ఉన్నంతగా ఎప్పుడూ లేవు.” ఇక్కడ రచయిత చమత్కారం గమనించవలె. ఆ రోజు మృత్యువుకు దగ్గరయింది ఎవరు? హంతకుడా? పాపం శిఖరం చేరుకొన్నదెవరికి? (“అభ్యుత్థానమధర్మస్య”) హంతకుడిలో సైతాను తలకెక్కాడు. ఆ క్షణం వరకు, క్రీస్తు ఆగాడు. అప్పుడు సైతాను తల నరికి, హంతకుణ్ణి, మరో హత్య చేయకుండా కాపాడాడు. ఇది యిందులోని “రెండవ రాక” అర్థం. క్రీస్తు ఎప్పుడో వస్తాడని ఎదురు చూడవద్దు. ఆయన ప్రతిక్షణము అవతరించడానికి ఆతురతతో ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా?
“Crime_and_Punishment” లో పశ్చాత్తాపం లేదు, ప్రక్షాళనం లేదు. రాస్కోల్నికోవ్‌లో పశ్చాత్తాపం కలగదు, చివరి క్షణం వరకు కూడా. అతడికి కలిగింది పశ్చాత్తాపాగ్నిలో ప్రక్షాళనం కాదు. కథ ముగింపులో అతడికి కలిగింది హఠాత్సాక్షాత్కారం, (revelation) ఒక మెరుపు. అది కారాగారంలో శిక్షాకాలంలో జరిగింది.
“అది ఎలా జరిగిందో అతడికి తెలియదు. కాని, ఉన్నట్టుండి ఏదో అతన్ని బలంగా పట్టి ఆమె పాదాలవద్ద పడేసింది. అతడు ఏడ్చాడు. ఆమె మోకాళ్ళను తన చేతులతో చుట్టేశాడు. మొదట ఆమె భయంతో అదిరిపడింది. ముఖం వివర్ణమయింది. ఉదుటున పైకి లేచి, వణుకుతూ అతడివైపు చూచింది. కాని, అదే క్షణంలో ఆమెకు అర్థమయింది. ఆమె కన్నుల్లో ఒక అనంతానందం మెరుపులా మెరిసింది. ఆమెకు తెలిసింది. సందేహం లేదు. అతడు ఆమెను ప్రేమించాడు. ఆమె తప్ప అతడికి మరొక వస్తువు లేదన్నట్టు ప్రేమంచాడు. ఆ క్షణం వచ్చేసింది.” (Crime and Punishment: Epilogue Two.)
రాస్కోల్నికోవ్‌కు కలిగింది దివ్యప్రేమసాక్షాత్కారం. సోఫియా తన బియాట్రిస్. దొస్తోయెవ్‌స్కీకి “ద డివైన్ కామెడీ” తెలియదనలేము. Crime and Punishment నవల ముగింపు, పావకప్రక్షాళనం (purgatory) లేని పరంధామం (paradiso) . కాని, The Brothers Karamazov లో నరకము (inferno) పావకము (Purgatorio) కలిసి భూమిపైకి దిగివస్తాయి.
దొస్తోయెవ్‌స్కీని పోల్చాలంటే షేక్స్‌పియర్ వరకు వెనక్కు నడవాలి. మేక్బెత్ హత్యాప్రవృత్తి, లియర్ ఉన్మాదము, ఒథెలో ఉద్రేకము, హేమ్లెట్ విషాదము, అన్నీ దొస్తోయెక్స్‌పి పాత్రలలో కనిపిస్తాయి. కీర్కెగార్డ్ అదే కదా అన్నాడు,
‘కాలం దుర్మార్గం అయింది అంటారు. నా అభియోగం అది కాదు. అల్పపు బతుకులు బతుకుతున్నారు జనం అంటాను. వారి కోర్కెలు అల్పం. వారి పాపాలు అల్పం. భావతీవ్రత లేదు. ఆర్తి లేదు. భగవంతుడిచ్చిన గొప్ప కానుక యీ బతుకు. మంచికో చెడుకో దాన్ని చివరి బొట్టు వరకు అనుభవించవలె కదా? అందుకే నా ఆత్మ ఎప్పుడూ బైబిల్ పాతనిబంధన, షేక్స్పియర్ నాటకాలవైపు వెళుతుంది. వాటిలో జనం కనీసం బతికున్న మనుషులు. వాళ్ళు ద్వేషిస్తారు ప్రేమిస్తారు పగవాళ్ళను నరుకుతారు శపిస్తారు. వాళ్ళు పాపాలు చేయగలరు. వాళ్ళు బతికున్నవారు. బతుకులో ఆర్తి (passion) లేనివాడికి భగవంతుడి కొరకు ఆర్తి ఎట్లా ఉంటుంది ?’
(Kierkegaard: Either/Or:1843)
మనిషి పుణ్యం చేయలేకపోయినా, పాపాలైనా చేయగలగాలి. రెండూ చేయనివాడికీ బండకూ తేడా ఏముంటుంది?
దొస్తోయెవ్‌స్కీ నవలలలోని పాత్రలు వెనుక జన్మలో వైకుంఠంలో జయవిజయులై ఉంటారు. శిష్టులై ఆరు జన్మలా, దుష్టులై మూడు జన్మలా అని అడిగితే, తడుముకోరు. పాపం వారి ఊపిరి, అదే ముక్తిసాధనం కూడా.
The Karamazov Brothers దొస్తోయెవ్‌స్కీ చివరి నవల, అసంపూర్ణం కూడాను. అసంపూర్ణనవలలు కాఫ్కా ప్రత్యేకతగా ప్రసిద్ధం. కాఫ్కా విషయంలో ముగింపు అప్రధానం అని, వాటికి ముగింపు ఉండదని అతడి అభిప్రాయం అనుకోవచ్చు. దొస్తోయెవ్‌స్కీ విషయం వేరు. అతడు ఆ నవలను కొనసాగించాలనే అనుకున్నాడు, ఆల్యోషా నాయకుడుగా, కాని ముగించలేకపోయాడు.