తల దూసుకోవడానికి అలమారా తలుపు తీసి, మళ్ళీ వేస్తున్నప్పుడు ఈ ప్యాకెట్ కనబడింది. అలమారా ఒక రెక్కకు పెద్ద అద్దం బిగించి ఉంటుంది. దాని మీద కిటికీలోంచి వెలుగు పడుతుంది కాబట్టి ముఖం సరిగ్గా కనబడదు. కాబట్టి తలుపు తీసి దువ్వెనతో పని చూసుకుని, ఇన్‌షర్ట్ బాగానే కుదిరిందని మురుసుకుని, మళ్ళీ రెండు రెక్కల్ని సరిగ్గా బిడాయించి వేస్తున్నప్పుడు ఈ ప్యాకెట్ అట్లా మెరిసింది. బ్రెడ్ ప్యాకెట్‌ను ఇక్కడెందుకు పెట్టినట్టు? కానీ దాన్ని బట్టల మడతల్లో దాయడంలోనే ఏదో గోప్యత ఉందనిపించింది. నెమ్మదిగా చూపుడువేలుతో తాకాను. ఏమీ అర్థం కాలేదు. ఎవరైనా ఆ గదివైపు వస్తున్నారా అని అడుగుల చప్పుడు విన్నాను. అప్పుడు నేను మేడ్చల్‌లో మామయ్య వాళ్ళింట్లో ఉండి చదువుకుంటున్నాను, ఎక్కువగా బంధువులాగా, తక్కువగా పేయింగ్ గెస్టులాగా. నాలాగే ఇంకొంతమందీ ఉండేవాళ్ళు. అందరమూ అత్తమ్మ తరఫునో, మామయ్య తరఫునో చుట్టాలం. నేను మామయ్య చెల్లెలి కొడుకును. ఎవరి పొడా లేదని నిర్ధారించుకుని, మునివేళ్ళతో ఒత్తాను. మెత్తగా తగిలింది. కానీ దాని పరిమాణంగానీ, ఆకృతిగానీ ఏమీ తెలియలేదు. ఏమై ఉంటుందిది?
శ్రీనన్న నాకన్నా మూడేండ్లు పెద్దవాడు. వయసు తేడా వున్నా ఏదైనా మాట్లాడే చనువుండేది. ఒక్కడే వున్నది చూసుకుని, ఆ తలుపు తీసి చూపించి, గుసగుసగా ‘ఏమి’టని అడిగాను. అదేమిటో చెప్పకుండా, నన్ను ఆటపట్టించడానికి, అటు వస్తున్న మా సుహాసినక్కను గట్టిగా పిలిచి– మామయ్య కూతురైనా నేను అక్క అనే పిలిచేవాణ్ని– ‘వీనికట ఈ ప్యాకెట్ ఏంటో తెలువాన్నంట’ అన్నాడు. ఆ అనడంలోనే ఏదో తన్నిందని తెలుస్తోంది. ఆడవాళ్ళు మాత్రమే చూపగలిగే కోపపు సిగ్గుతో నన్నోసారి చూసి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఇంక నేను అదేమిటని మళ్ళీ ఎవరినీ అడిగే సాహసం చేయలేదు.
కొన్నేళ్ళు గడిచాక, అదేమిటో నాకు ఎవరూ చెప్పకుండానే, వయసుతో వచ్చిన ప్రాపంచిక జ్ఞానం వల్ల, అలాంటి ఒక సమస్య నాలో ఉందని తెలియకుండానే నివృత్తి జరిగిపోయింది. అట్లాంటి కాలంలో పండగ సెలవులకని నేను మా ఊరికి వెళ్ళాను. ఇంకో రెండు మూడేళ్ళకుగానీ మా ఇంట్లోకి టీవీ రాని రోజులవి. (మేడ్చల్‌లో టీవీ ఉండేది. ఇది వేరే.) అందుకే అది వున్న వాళ్ళింటికి వెళ్ళి కూర్చునేవాళ్ళం. అట్ల ఒకరోజు మా గంగన్న వాళ్ళింటికి పోయాను. బీడీలు చేసేవాళ్ళు, బియ్యానికి ఎసర్లు పెట్టి వచ్చిన ఆడవాళ్ళు చాలామంది కింద కూర్చుని వున్నారు. కుటుంబ సంబంధాల్లోని అధిక్రమం వల్ల మా జయక్క నాకు కుర్చీ వేసింది.
సినిమా ఏదో చూస్తుండగా, మధ్యలో ఈ ప్రకటన వచ్చింది, ఎవరో ఆడమనిషి మంచంలో అసహనంగా కదులుతున్నట్టు. మరి జయక్క దాని గురించి ఎన్ని రోజులుగా తన కడుపులో దాచుకుందో, లేదా, మా పట్నపు మరిదికి కచ్చితంగా తెలిసివుంటుందన్న ధీమానో, ‘రాజూ, అదేంటిదోయ్, ఊకె జూపిస్తరు?’ అని అడిగింది. నేను ఒక క్షణం నాలో నేనే నిలిచిపోయాను. ఏమాత్రం తొణక్కుండా, మాటలో ఏ వంకరా వినబడకుండా, దేవుడి గొంతుతో జవాబిచ్చాను: ‘ఆడవాళ్ళు బయటుంటరు గదా జయక్కా, అప్పుడు వాడుతరు’.
వాతావరణం ఒక్కసారి స్తంభించిపోయింది. బీడీల చేతులు ఆగిపోయినై. టీవీ నడుస్తుందన్నట్టేగానీ తెలియని నిశ్శబ్దం ప్రవేశించింది. నేను జయక్కతో కళ్ళు కలపకుండా, అసలు ప్రత్యేకంగా ఎవరి మీదా చూపు నిలపకుండా అలాగే కూర్చున్నాను. ఎన్ని సెకన్లు దొర్లిపోయినై? అంతమందిలో ఎవరో కిసుక్కుమన్నారు. ఇక, నవ్వడమా మానడమా అన్నట్టుగా ఆగి నవ్వి ఆగి నవ్వి ఒక్కసారిగా అందరూ బద్దలైపోయారు. ఆ నవ్వుల్లో జయక్క కోపపు సిగ్గు మాటలు కలిసిపోయినై- ‘ఎందుకు నవ్వుతున్నరె? మీ కడుపులు గాల, మీ తలుకాయలు గొట్ట’.