[ఈమాట విశ్రాంత సంపాదకుడు, బహుకాలపు ప్రవాసి అయిన వేలూరి వేంకటేశ్వర రావుగారు తెలుగు సాహిత్యాభిమానులకు చిరపరిచితులే కాదు, వారొక సాహిత్య అనుభవాల, జ్ఞాపకాల గని. వారితో మాట్లాడేకొద్దీ ఎన్నో కథలు, కథనాలు సాహిత్యం గురించి, సాహిత్యవేత్తల గురించీ చెలమనీటిలా ఉబికి వస్తూనే ఉంటాయి. తెలుగులో పేరు పొందిన ఎందరో సాహిత్యవేత్తలతో స్నేహాలు, అనుభవాలే కాకుండా వేలూరిగారు స్వయంగా చక్కటి రచయిత, విమర్శకుడు. తెలుగు సాహిత్యచరిత్రలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి. గత కొద్దికాలంగా ఆరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో విశ్రాంతజీవితం గడుపుతున్న వేలూరిగారితో పరుచూరి శ్రీనివాస్, గొర్తి సాయి బ్రహ్మానందం కలిసినప్పుడు జరిగిన సంభాషణ ముఖాముఖీ రూపంలో ఈమాట పాఠకుల కోసం – సం.]
వేలూరి వేంకటేశ్వర రావు (ఫీనిక్స్, అమెరికా)
మీ సాహిత్య ప్రయాణం ఎలా మొదలయిందో చెప్పండి?
ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక. ఈ రెండూ మా ఇంటికొచ్చేవి. దెబ్బలాడుకుని చదువుకునేవాళ్ళం. మా అమ్మగారు చదివేది. డెయిలీ పేపర్ చదవడం మా ఇంట్లో అత్యవసరం. చదివితీరాలి. ఇది సాహిత్య ప్రయాణం అనను కాని అది ఆరంభం.
లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుని ఇంట్లో ఉంచేసుకునేవాణ్ణి. ఎక్కువగా చదివేవాడిని కాదు. లైబ్రరీ నుంచి ఎన్ని ఎక్కువ పుస్తకాలు తెచ్చుకుంటుంటే అది ఎంతో గొప్పగా వుండేది. ఒకసారి మా నాన్నగారు చూసి, ‘ఏంట్రా! లైబ్రరీ నుంచి మూడేసి నాలుగేసి పుస్తకాలు తెచ్చుకుంటున్నావ్? ఏమైనా చదువుతున్నావా?’ అనడిగారు. ‘ఒకటో రెండో చదువుతాను ఖాళీ ఉన్నప్పుడు’ అన్నాను. మరి నాలుగైదు తేవడమెందుకు? అని, ఆయనే నన్ను వెంటబెట్టుకుని తీసుకువెళ్ళి, పుస్తకాలు వెనక్కిప్పించి ‘వీడికి పుస్తకాలివ్వకండి. వీడు చదవడానికి తెచ్చుకోవడంలేదీ పుస్తకాలు, డస్కు మీద అలంకారం కోసం’ అన్నారు. అప్పుడు నేను ఏడ్చేశాను. లైబ్రేరియన్ ‘పరవాలేదయ్యా. తీసుకెళ్ళు. నువ్వెన్ని చదవగలిగితే అన్నే చదువు’ అన్నారు. అదీ ఆ చదవడం నా సాహిత్య ప్రయాణానికి ఆరంభం. అప్పట్నుంచీ ఏది దొరికినా చదివేవాడిని.
మరి మీ మొదటి ప్రచురణ?
మొదటి సాహితీ ప్రచురణ అంటే ఆ రోజుల్లోనే చిన్నపిల్లలకి నేనొక పద్యం రాశాను. ఇది ఎలా వచ్చిందంటే… ఎవరో మా చుట్టాల పిల్లే అడిగింది. రాత్రిపూట ఇన్ని నక్షత్రాలున్నాయి. చందమామ ఒక్కటీ పెద్దగా ఉంది. నక్షత్రాలన్నీ చందమామలైపోతే మనకు లైటే అక్కర్లేదు కదా అని. దాని ఐడియా నేను కాపీ కొట్టేసి ఒక చిన్న పిల్లల పాట ఆంధ్రప్రభకి పంపించాను. వాళ్ళు అయిదు రూపాయలిచ్చారు. ఆ రోజుల్లో అయిదు రూపాయలంటే ఎంత గొప్పో!
అదీ అసలు నా మొట్టమొదటి సాహితీ ప్రచురణ. ఆ తర్వాత నేను థియోసాఫికల్ సొసైటీ స్కూలుకెళ్ళాను. వాళ్ళు కొత్తగా స్కూల్ స్టార్ట్ చేసి, ఎంట్రన్సు పరీక్ష పెట్టి మమ్మల్ని ఆరవ తరగతికి (మేం ఫస్ట్ ఫారం అనేవాళ్ళం), రిక్రూట్ చేశారు. వాళ్ళు ప్రతి యేటా రెండు మ్యాగజైన్‌లు అచ్చు వేసేవాళ్ళు, పిల్లలు, మేస్టర్లు రాసిన వ్యాసాలతో. ఆరు నెలలకోసారి ప్రింటయ్యే సంచిక. అందులో నేనొక చిన్న వ్యాసం రాశాను. నా సొంతం కూడా కాదా వ్యాసం. అందరి దగ్గరికి వెళ్ళి, సమాచారం సేకరించుకుని రాసింది. సోమంచి లింగయ్యగారని… ఆయన రాజకీయ నాయకులు ఎవరొచ్చినా వాళ్ళ ఇంగ్లీషు ఉపన్యాసాలు స్టేజి మీద వెంటనే తెలుగులోకి అనువదించేవాడు. నెహ్రూ ఏలూరొచ్చినప్పుడు, ఆయనే అనువదించాడు. ఆయన థియోసాఫికల్ సొసైటీ లోకల్ ప్రెసిడెంట్. మా నాన్నగారి కంటే పెద్దవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అశోకచక్రంలో 24 స్పోక్సే (ఆకులే) ఎందుకున్నాయని అడిగాను. ఆయన చాలాసేపు ఆలోచించాడు. ఎందుకంటే, థియోసాఫికల్ సొసైటీ వారికివన్నీ తెలుసు అని పిల్లలందరూ అనుకునేవాళ్ళు. ‘గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలున్నాయి. అందుకనే, ఇందులోనూ ఆ 24 స్పోక్స్ పెట్టారు’ అని ఆయనన్నాడు. అదంతా పట్టుకుని అశోకుడి గొప్పతనం పొగుడుతూ నేనొక వ్యాసం రాశాను. వాళ్ళచ్చేశారు. ఆ తర్వాత హైస్కూల్‌కి వెళ్ళినప్పుడు, ఫోర్త్ ఫారంలో ఉండగా, మేమొక చేతిరాత పత్రికను మొదలుపెట్టాం. ఒకటో రెండో ఇష్యూలు వచ్చాయి. తెల్లకాగితానికి కింద కార్బన్ పేపర్ పెట్టి, రెండు కాపీలు తయారుచేసి, రెండు సెక్షన్లకీ పంపించేవాళ్ళం, ఒకళ్ళ తరువాత ఒకళ్ళు చదువుకోటానికి. మా మాస్లర్లకి చాలా సంతోషమైంది. అందులో నేను సొంతంగా ఒక కథ రాశాను. ఒక పజిల్ కూడా చేశాను, రామా అండ్ కో.లో వున్న నిఘంటువు సాయంతో! ఆ తర్వాత నేను నిజంగా చెప్పుకోదగ్గవేవీ రాయలేదు.
మీరు పెరిగింది ఏలూరులో కదా! అప్పట్లో మీ చుట్టూ సాహిత్యకారులెవరైనా ఉన్నారా?
ఉన్నారు. మేము హైస్కూల్లో ఉన్నప్పుడు పెద్దగా తెలీదు కాని, హైస్కూల్ తర్వాత కాలేజీకి వచ్చేముందు పీరియడ్ ఒకటుంటుంది చూడండి. మీరిప్పుడు టెంత్ గ్రేడ్ అంటారు, మాకప్పుడు స్కూల్‌ఫైనల్ అనివుండేది. స్కూల్‌ఫైనల్ అయ్యాక ఇంటర్మీడియట్ లోకి రాగానే, మాకు వెల్చేరు నారాయణ రావుగారు పరిచయమయ్యారు. ఆయన అప్పుడు కాలేజీలో ఫోర్త్ యియర్ బి.ఎ. ఏదో చేసేవారు. మేము హైస్కూల్లో ఉండేవాళ్ళం. ఆయన, పెమ్మరాజు వేణుగోపాల రావుగారు కలిసి, ఒక నాటకంలో సీన్లు వేశారు, ఇంగ్లీషులో, జూలియస్ సీజర్ అనుకుంటాను. హామ్లెట్ అయి ఉండచ్చు. బాగా గుర్తు లేదు.
వెల్చేరు నారాయణ రావుగారు మా ఇంటి సందులోనే ఉండేవారు. అక్కడే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు కూడా వుండేది. ఆయనతో పరిచయం బహుశా నా లిటరరీ ఇంటరెస్ట్‌ను బాగా పెంచింది అనుకుంటాను. ఆయనతో కూర్చోవడం, కబుర్లు చెప్పటం బాగా అలవాటైంది నాకు. ఆయన బి.ఎ. తరువాత కాలేజీలో తెలుగు ట్యూటర్‌గా చేరారు. అప్పట్లో ఆయన శ్రీశ్రీ కవిత్వాన్ని, విశ్వనాథ రామాయణాన్ని చదువుతూవుంటే, ఇది బాగోలేదు, అది బాగోలేదు అని రామాయణం పద్యాలని వేళాకోళం చేస్తుండేవాడిని. సాహిత్యమండలి అని ఒక ఆర్గనైజేషన్ వుండేది. ఆ సంస్థ మొట్టమొదటి సారిగా శ్రీశ్రీకి సన్మానం చేసిన సంస్థ. వాళ్ళు ప్రతి సంవత్సరం సంక్రాంతికి మూడు రోజులపాటు సదస్సులు నిర్వహించేవారు. అందులో మూడోరోజున, అంటే ఆఖరి రోజున యూత్ ఏదైనా రాస్తే వాటిని మీరు స్టేజి మీద చదవొచ్చు అన్నారు. నేనూ, చదువుదాం అనుకున్నాను. గ్వెర్నికా అనే పద్యం. దానిని అక్కడ చదివాను. ఆ పద్యం నారాయణ రావుగారి గదిలో కూచొని రాశా. అది మొదలు పెట్టంగానే కరెంటు పోయింది.
పద్యం రాస్తుంటే లైట్ ఆరిపోయింది – నా మొదటి లైను! తర్వాత – నేనిక్కడ అప్పకవీయం కప్పుకొని పడుకున్నాను; అక్కడ ఆకలి, హాహాకారాలు. ఆ తర్వాత మరి కొన్ని లైన్లు. అవీ ఇవీ మసాజ్ చేసి చదివేశాను. అమ్మో, వీడు కవితలు రాస్తున్నాడురోయ్ అని అనుకున్నారు, మా మేస్టర్లు, స్నేహితులు!
మాకు అంటే, పోణంగి రామకృష్ణారావు, నారాయణ రావు, నేను. మాకు సూర్యనారాయణ రాజు అనే ఫ్రెండ్ ఉండేవారు. సూర్యనారాయణ రాజు శాంతినికేతన్‌లో చదువుకుని వచ్చాడు. ఆయన మాకు బోలెడు పుస్తకాలను తెచ్చిచ్చేవాడు. అప్పుడు మేము నిజంగా పుస్తకాలు చదివాం అనుకున్నాం. మిగిలినవాళ్ళ సంగతేమో కాని… నాకు అర్థమయ్యాయా లేవా అని అడక్కండి. హక్స్‌లీ, ఉనామునో, పిరాందెల్లొ, బెకెట్, హెమింగ్వే, బాల్డ్‌విన్, కామూ, సార్త్ర… ఇలా. అప్పట్లోనే రాజుగారి ధర్మాన ‘లేడీ ఛాటర్లీస్ లవర్’ కూడా చదివాం. ఆ రోజుల్లో అది బ్యాన్‌డ్ బుక్ అట! మేము వీళ్ళందరినీ చదివాం. తర్వాత, రాయడమన్నది, అని మీరు అడిగితే, ఇండియాలో ఉండగానే నేను కారవాన్ మ్యాగజైన్‌కి రెండు పోయెమ్స్ రాశాను, ఒకటి, The Rape of the Clouds అని ఇంగ్లీష్‌లో. కానీ, వాటినెవరైనా సంపాదించి మళ్ళీ తెలుగు చేశారంటే చంపేస్తాను (నవ్వుతూ).
కాలేజి మ్యాగజైన్‌కి వ్యాసాలు రాశాను. అందులో ఒక్కటైనా దొరికితే బావుణ్ణు, అనుకుంటాను. ఏలూరు కాలేజీలో చదువుకునేటప్పుడు నారాయణ రావుగారు తెలుగు ఫాకల్టీలో ఉండేవారని చెప్పానుగదా. బి.ఎస్సీ. పూర్తి చేశాక కూడా చదవడం కొనసాగించాను. అబ్రహాం లింకన్ గడ్డం ఎందుకు పెంచాడో తెలుసా? దానిమీద రీడర్స్ డైజెస్ట్‌లో ఒక కథ వచ్చింది. ఆ కథను తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశాను. ఏలూరు కాలేజీ మేగజైనుకి. ఆనందలక్ష్మిగారు (తరువాత ఆనందారామం పేరుతో కథలు, నవలలు రాశారు) అనుకుంటా, నీ అనువాదం బాగుందయ్యా, అని మెచ్చుకున్నారు! అప్పటినుంచే లేజీనెస్ మొదలైందని అర్థం. పర్మిషన్ తీసుకోకుండా ట్రాన్స్‌లేట్ చేయడంలాంటి పిచ్చి పనులు చేశాను. తుర్గినేవ్ (Turgenev) కథ ఒకటి లైబ్రరీలో చదివాను. దాన్ని అనువదించాను. ఎక్కడ అచ్చయ్యిందో గుర్తులేదు.
బాలగంగాధర తిలక్‌గారు కూడా మీ ప్రాంతంలో ఉండేవారు కదా? ఆయనతో పాటు ఇంకా ఎవరుండేవారు?
అవును. బాలగంగాధర తిలక్‌గారితో నా పరిచయానికి ముందుగా ఒక కథ చెప్పుకోవాలి. బీ.ఎస్సీ. పూర్తయ్యాక రెండున్నర సంవత్సరాలు ఖాళీగా వుండవలసి వచ్చింది. అప్పట్లో ఒక పత్రిక నడిపాం, ఏలూరు వీక్లీ అని. వడ్లపట్ల దయానందంగారు ఎడిటర్/పబ్లిషర్. నారాయణ రావుగారు కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండేవారు కాని, ఆయన చేసే వర్క్ పెద్దగా ఉండేది కాదు. అదొక పదహారు పేజీల వీక్లీ. అందులో నేను కొన్ని ఎడిటోరియల్స్ రాశాను. సాహిత్యమండలి నిర్వాహకులని వేళాకోళం చేస్తూ ఒక పెద్ద వ్యాసం రాశాను, అందులో! అది పూర్తిగా పొలిటికల్ వీక్లీ. ప్రతీ పొలిటీషియన్‌కీ ఒక కార్టూన్ వేసి మేమందులో విమర్శించాం. వాళ్ళు అవి చేయట్లేదు, ఇవి చేయట్లేదు అని. మొదలుపెట్టినప్పుడు మాకు ఏడెనిమిది అడ్వర్టయిజ్‌మెంట్లుండేవి. ఓకే, మనం పత్రిక నడిపేయగలం అనుకున్నాం. వెయ్యి కాపీలు ఒక్కసారి వెయ్యంగానే అలా వెళ్ళిపోయేవి. నాకు సబ్జెక్టే దొరకాలి గానీ నేను రాయగలనూ అని ధీమా వచ్చేసింది! God forbid! It didn’t consume me completely.
ఈ గ్యాప్ పీరియడ్‌లో చేసిన పని అది. సంవత్సరం గడిచేటప్పటికి మాకొక నశ్యం కంపెనీవాడే అడ్వర్టయిజ్‌మెంట్ ఇచ్చేవాడు. వాడుగూడా మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి. అదికాక ఇంకో అడ్వర్టయిజ్‌మెంట్ వచ్చేది కాదు. అందుచేత ఆ పేపర్‌ను ఎత్తివేయాల్సివచ్చింది. జనసంఘ్ పార్టీమీద కొంచెం వేళాకోళంగా రాశాం భోజనసంఘ్‌వాళ్ళు అని! I agree. It is youth arrogance. జనసంఘ్‌వాళ్ళే ఆ పేపర్ కొనుక్కుంటాం అని ముందుకొచ్చారు. కానీ వాళ్ళకి అమ్మటం మాలో ఎవ్వరికి ఇష్టం లేదు! అందుకని అమ్మలేదు. అప్పులతో మూసేశాం. ఇదిలా ఉంటే, సాహిత్యమండలిలో సంక్రాంతి మీటింగ్‌కి తిలక్‌గారిని పిలిచారు. నాకు తిలక్ ఎవరో తెలియదు. తిలక్‌గారు ఎలా వేషం వేసుకునేవారో మీకు తెలుసా? చాలా స్ఫురద్రూపి. మల్లెపువ్వుల్లాంటి తెల్లటి గ్లాస్కో లాల్చీ, గ్లాస్కో పంచెలే కట్టుకునేవాడు. చాలా జాగ్రత్తగా నడిచేవారు. ఆయన నా వెనుక నిల్చున్నాడు, తారట్లాడుతున్నాడు.
నేను ఊరికే వెనక్కి తిరిగి ‘ఎవరోయ్ ఈ బాలరాజు?’ అన్నాను, పక్కనున్నవాడితో. (అప్పట్లో నాగేశ్వరావుగారి బాలరాజు సినిమా, అందరికీ గుర్తే. మల్లెపువ్వుల్లాంటి పంచెలు, చొక్కాలూ వేసుకున్నవాళ్ళని బాలరాజు అనడం మామూలు, ఆరోజుల్లో!) ఆయన విన్నాడది. ఏమీ మాట్లాడలేదు. ఆయన కవితలు చదవాల్సిన వంతు వచ్చింది. ఆయన వెళ్ళాడు, పద్యాలు చదివాడు, మేమందరమూ విన్నాము. నా వ్యాఖ్య గురించి ఆయన తంగిరాల సుబ్బారావుకు చెప్పాడు కాబోలు. మీరు వినేవుంటారు, తంగిరాల వెంకట సుబ్బారావుగారని, బెంగుళూరులో ప్రొఫెసర్‌గా పనిచేశారు – ఆయన తణుకులో తిలక్‌గారితో కలిసి తిరిగేవాడు.
ఆ తర్వాత పట్టాభిరామా ప్రెస్ వాళ్ళు ఒక చిన్న పద్యపఠనం లాంటిది పెట్టి, తిలక్‌గారిని మీరు నాలుగు పద్యాలు చదవండి, వింటాం అన్నారు. ఆ ప్రెస్ మా ఇంటిదగ్గరే. నేను కూడా వెళ్ళా అక్కడికి. ఇదుగో, తంగిరాల సుబ్బారావు కూడా వున్నాడు. పోస్టల్ డిపార్ట్‌మెంటులో నేను మూడు నెలలు, సుబ్బారావు మూడేళ్ళూ పనిచేశాం, అదీ మాస్నేహం! సుబ్బారావొచ్చి మమ్మల్నందరినీ ఇంట్రడ్యూస్ చేయడం మొదలుపెట్టాడు. అందరి పేర్లూ చెప్పి, నా దగ్గరికొచ్చాక, వీడు వేలూరి వెంకటేశ్వరరావని పరిచయం చేశాడు. తిలక్ నన్ను చూడగానే ‘అతనెవరో నాకు తెలుసు. నువ్వేం పరిచయం చెయ్యనక్కర్లేదు’ అన్నాడు. ‘నేను మిమ్మల్నెప్పుడూ కలవలేదండీ’ అన్నాను. ఆయన ‘నువ్వేకదా నన్ను బాలరాజు అన్నది?’ అన్నారు. నేను వెంటనే ‘అయ్యో, పొరపాటైందండీ. మీరని అనుకోలేదు. ఆ వేషంలో వచ్చేవారిని చాలా తక్కువమందిని చూస్తాం’ అన్నాను.
అదీ ఆయనతో నా తొలి స్నేహం. ఆ స్నేహం ఆయన పోయేదాకా అంతేవుంది. ఎప్పుడు కలిసినా ‘నేను బాలరాజునయ్యా’ అంటుండేవారు. ఆయన రుణం నేను తీర్చుకున్నాను రెండు రకాలుగా. ఆయన ఏలూరు క్లబ్‌కొచ్చి పేకాటాడేవాడు. తర్వాత నా జీవితంలో కొంతకాలం గడిచిన తర్వాత నేను కూడా ఏలూరు క్లబ్‌లో చిన్న స్టేక్ పేకాట ఆడేవాణ్ణి. ఆయన చేత పేకాట మాన్పించడానికి ప్రయత్నించినవాళ్ళల్లో నేను ముఖ్యుడిని. ‘ఈరోజుకు పోయిన రూపాయిలు చాలు, అయిపోయింది చాలు, ఇంటికి వెళదాం’ అని తీసుకొచ్చేసేవాళ్ళం. అలా మా స్నేహం బాగా పెరిగింది. ఆయన్ని చూడటానికి తణుకు రెండుసార్లు వెళ్ళాను కూడా. ఇంకో రుణాన్ని నేను ఆంధ్రా యూనివర్సిటీలో తీర్చుకున్నాను. తెలుగు, ఇంగ్లీషు, డిబేట్లలో నాకు బహుమతులొచ్చాయి; సైన్సువాళ్ళు డిబేట్లు, గట్రా పట్టించుకోరు. అప్పటికే ఆంధ్రా యూనివర్సిటీలో నాక్కొంచెం గౌరవం పెరిగింది, యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్ అండ్ సోషియాలజీ విభాగాల వాళ్ళ తోటి! కావ్యదహనోత్సవం అని చిన్న సెటైర్ సదస్సు ఒకటి చేశాం. అందువలననుకుంటా, యూనివర్సిటీలో ఆర్ట్స్ చదివేవాళ్ళకి నేను బాగా తెలుసు.
ఇంతకుముందు తిలక్ గురించి చెప్తూ విశాఖపట్నం గురించి ప్రస్తావించారు. ఏలూరులో చదువైపోయిన తర్వాత విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నంలో తొలిరోజుల గురించి చెప్పండి.
విశాఖపట్నం నాకు చాలా మంచి వాతావరణాన్నిచ్చింది. ఒకటేమిటంటే నేను రెండేళ్ళో, రెండున్నరేళ్ళో గ్యాప్‌తో వెళ్ళాను యూనివర్సిటీకి. అంచేత క్లాసులో నేను సీనియర్‌ని. అక్కడ యూనివర్సిటీలో ‘ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం’ ఫిలాసఫీ వాల్యూమ్ పని జరుగుతుండేది. మేడేపల్లి వరాహ నరసింహ స్వామిగారు, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారు అసలు పని చేసేవాళ్ళు. శ్రీనివాసాచార్యులగారికి ఒక ఆఫీసుండేది. యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్ ఒకాయన (కొత్త సచ్చిదానంద మూర్తి) ఉండేవారు. ఆయన కూడా వస్తుండేవారు అప్పుడప్పుడు. దానికి ఆయన ఎడిటర్. మా కావ్యదహనం సభకి అధ్యక్షత వహించినది నరసింహ స్వామిగారు, ఎవ్వరినీ ఖాతరు చేసేవారు కాదు, ప్రొఫెసర్ అయినా సరే! ఆయనంటే అందరికీ భయమే! ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు అక్కడికి చుట్ట కాలుస్తూ వస్తే, నరసింహ స్వామిగారు నానా తిట్టులూ తిట్టారు. కృష్ణశాస్త్రిగారు దబుక్కున చుట్ట బయట పారేశారు. శ్రీనివాసాచార్యులుగారి ఆఫీసుకు నేను రోజూ వెళ్తుండేవాడిని. అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్తుండేవాడిని. ఒకొక్కమారు నాలుగు రోజులు ఊరు వెళ్తున్నానయ్యా. కాస్త ఇల్లు చూసిపెట్టు అనేవారు. అప్పుడక్కడ పకోడీలూ అవీ చేసి పండగలా చేసేసేవాళ్ళం. అంత స్నేహం ఆయనతో. నేను ఎప్పుడూ ఆయనతోపాటు తిరుగుతూ ఉండేవాడిని. అది చేద్దాం, ఇది చేద్దాం, సరేనండీ అని మాట్లాడుకునేవాళ్ళం.
ఫస్టియర్‌లో జ్యేష్టతో పరిచయమైంది నాకు. మరొకాయన రత్నం అని, మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఉండేవారు. ఆయన రష్యాలో పిహెచ్.డి. చేసి వచ్చాడు. తరువాత వరంగల్ కాలేజీకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ లెఫ్టిస్టులు. అక్కడ వేణుగోపాలరావు, కృష్ణాబాయిగారి ఇంటికి, జ్యేష్టతో ఒకటి రెండుసార్లు వెళ్ళాను. శ్రీనివాసాచార్యులుగారు, నేనూ ప్రతి శనివారం సాయంత్రం యూనివర్సిటీ కాలేజీ క్యాంపస్ నుంచి కిందికి నడిచివచ్చి రావిశాస్త్రిగారిని రెగ్యులర్‌గా ప్రతి వారం కలిసేవాళ్ళం. శ్రీనివాసాచారిగారు ట్రెడిషనలిస్టు, రావిశాస్త్రిగారు నాన్ ట్రెడిషనలిస్టు. ఏదైనా రాసిన కథ కాని, వ్యాసం కానీ… కథలేననుకోండి ఆయన రాసింది. ‘ఏవైనా రాశారా శాస్త్రిగారూ’ అని అడిగేవారు. మరి ఆయనకీ ఈయనకీ ఉన్న స్నేహమేమిటో మాకు తెలీదు. వాళ్ళిద్దరూ ఆపోజిట్స్. కొత్తగా ఇది రాశాను అంటే, దాన్ని స్క్రిప్టులో ఉండగానే ఎత్తుకొచ్చి చదివేవాడు ఆచార్యులుగారు. మరి గమనించండి.
అక్కడికి చాలామంది వస్తుండేవారు. కృష్ణమూర్తిగారని ఒకాయన వచ్చేవారు. జ్యేష్ట రెగ్యులర్‌గా మాతో వచ్చేవారు. మేము సాయంత్రాలు అక్కడే కూర్చునేవాళ్ళం. ఒకసారి చేకూరి రామారావుగారు కూడా వచ్చారు. అప్పుడు ఆయన తెలుగు ఎం.ఎ. చేయడానికొచ్చారు. మొట్టమొదట రామారావుగారు ఎలా కలిశారంటే ఆంధ్రా యూనివర్సిటీలో ఒక కఫెటేరియా వుండేది. ఇప్పుడుందో లేదో! ఇండియా కాఫీ హౌస్, అని! ఒక ఫ్రెంచ్ కుర్రాడు ఆల్బర్ట్ అని, వాడిని భద్రిరాజు కృష్ణమూర్తిగారు తీసుకువచ్చారు. తెలుగు నుంచి ఫ్రెంచి లోకి ఒక పుస్తకం చేయమని ఆ కుర్రాడికి యునెస్కో డబ్బులిచ్చింది. మనవాళ్ళు వెతికి వెతికి, వేమన పద్యాలు అనువదించటానికి పురమాయించారు. ఎవరైనా (ఇంగ్లీషులో) మాట్లాడుతుంటే… ‘ప్లీజ్ స్పీక్ తెలుగు, స్పీక్ తెలుగు’ అని అడిగేవాడు. చేకూరి రామారావు ఒకరోజు అతడిని పట్టుకుని, ఇండియా కాఫీ హౌస్ కొచ్చాడు. వాళ్ళక్కడ కూర్చుని, ఒక కథ, ఒక్క కథే తెలుగులో చదివేవారు. అలా రామారావుగారిని చూశా, మొదటిసారి. కానీ ఆ కుర్రవాడు అతనెవరో మాకు వివరంగా తెలీదు. అతిథులెవరైనా వస్తే వారిని శ్రీనివాసాచార్యులుగారి ఆఫీసుకి తీసుకువెళ్ళేవాళ్ళం. ఆల్బర్ట్ అతిథి కదా! రామారావుగారితో మేము శ్రీనివాసాచార్యులుగారి దగ్గరికి వెళ్తున్నామని చెప్పాం. కాఫీహౌస్ పక్కనే ఆచార్యులగారి ఆఫీసు. మేమూ అక్కడికే వెళ్తున్నాం పదండి అన్నారాయన. అక్కడికి వెళ్ళాక శ్రీనివాసాచార్యులుగారు చేకూరి రామారావుగారిని నాకు యువకవి అని పరిచయం చేశారు. ‘అయ్యో, మీరు తెలీకపోవటమేంటండీ? మీరు స్వతంత్రలో రాసేవారుకదా’ అన్నాను. ఆరోజుల్లో స్వతంత్రలో కవర్‌పేజీ వెనుక పద్యం వస్తే వాడు కవి. ‘ఫస్ట్ పేజీ ఓపెన్ చేయగానే ఆ పేజీల్లో వరుసగా రెండు మూడు పద్యాలొచ్చేవి. ఇదుగో, అప్పుడే పరిచయమయ్యాం’ అన్నాను. అలా పరిచయమైంది నాకు రామారావుగారితో. ఆ స్నేహం చివరిదాకా అలానే ఉంది. రామారావుగారిని కూడా కావ్యదహనోత్సవంలోకి లాక్కొచ్చాం. కావ్యదహనోత్సవంలోకి వచ్చాడు కానీ, తను చెప్పాల్సిన ఉపన్యాసం చెప్పలేదు ప్ర్రొఫెసర్లతో ఏదైనా గొడవ వస్తుందని.
చెప్పాను కదా, ఒకప్పుడు ఆంధ్రా యూనివర్సిటీలో తెలుగు, ఇంగ్లీష్ డిబేటింగ్‌లో ప్రవేశం ఉన్నవారిలో నేనొకడిని అని. బహుమతులు గట్రా వచ్చాయి కూడా! అందుచేత ప్రతివాళ్ళూ నన్ను ప్రతిదానికీ పిలుస్తూవుండేవారు. అప్పుడు తెలుగు కార్యక్రమాలు చేసే ఆర్గనైజర్లందరూ హాజరయ్యేవారు. ఒక వారం పాటు ఆంధ్రా వీక్స్ అని జరిపేవాళ్ళు. మీకిష్టమున్న వాళ్ళెవరో చెప్పండి, వాళ్ళను పిలుస్తాం అన్నారు. అపుడు గో.రా. శాస్త్రిగారిని పిలిపించాం, శ్రీదేవిగారిని పిలిపించాం. తిలక్‌గారిని, లతగారిని పిలిపించాం.
శ్రీశ్రీ గారు రాలేదా?
శ్రీశ్రీ అంతకుముందెప్పుడో వచ్చివెళ్ళి పోయాడు. శ్రీశ్రీ మా కావ్యదహనోత్సవానికి Wish the cremation a success అని టెలిగ్రాం పంపారు. అంతే. వీరందరినీ పిలిపించాను. వీరందరికీ టైమిచ్చాం. అందరూ వచ్చారు, హోల్ డే అంతా పార్టిసిపేట్ చేశారు. తిలక్ గారు నాతోపాటు ఒక వారం వుండిపోయారు. ఆయన కొంచెం పెక్యూలియర్‌గా వుండేవారు. ఇక్కడ సాంబార్ తిండం మంచిదా? ఇక్కడ కూరలు తినడం మంచిదా? అనడిగేవారు. ఆయనను లైబ్రరీకి తీసుకొచ్చి పుస్తకాలు ఏవి కావాలనడిగితే, డైలాన్ థామస్ గారి పుస్తకాలు కావాలన్నారు. ఇచ్చాను.
యూనివర్సిటీ రోజుల్లో మీరేమైనా రాశారా?
ఆ, రాశాను. ఒకటేమో యూనివర్సిటీ మ్యాగజైన్‌కి ఇంగ్లీష్‌లో రాశాను. అదిప్పుడు మీరు చూస్తే, టూకీగా ‘అంపశయ్య’ నవలలా వుంటుంది. అంతకుమించి యూనివర్సిటీలో నేనేమీ రాసినట్లు గుర్తులేదు. స్వతంత్రకు రెండు రివ్యూలు రాశాను. కావ్యదహనోత్సవం మీద కూడా రివ్యూ రాశాను. యూనివర్సిటీ ఫిజిక్సు క్లాసుల్లో వుండడం వల్ల మిగతా ఆర్ట్స్ వాళ్లను కలవడం కొంచెం కష్టంగా వుండేది. యూనివర్సిటీలో వుండగా చదవడమే ఎక్కువగా వుండేది. రాయడం అంటే అక్కడక్కడా న్యూస్‌పేపర్లూ వాటికి రాయడం, అది రెగ్యులర్‌గా వుండేది. అదర్‌దెన్ దట్, లిటరరీగా ఏమీ రాయలేదు.
ఏలూరు నుంచి విశాఖపట్నం, విశాఖపట్నంలో చదువు, ఆతర్వాత ఉద్యోగం. కానీ, క్లుప్తంగా చెప్పాలంటే మీ ఇంటలెక్చువల్ జర్నీలో ఏలూరు ప్రభావం పెద్దది అనుకుంటాను విశాఖపట్నం కంటే.
అనొచ్చండీ. ఏలూరు ప్రభావమే నామీద ఎక్కువ.
ఆతర్వాత ఒరిస్సా వెళ్లారు. కటక్‌లో పనిచేశారు.
అవును. సౌభాగ్య కుమార్ మిశ్రా అక్కడే పరిచయమయ్యాడు. అతను అక్కడ నేను చేరిన సంవత్సరం తర్వాత ఎం.ఎ ఇంగ్లీష్ చేయడానికొచ్చాడు. కానీ, ఆ సంవత్సరం పరీక్ష తీసుకోలేదు. అతన్ని నాకు జితేందర్ పట్నాయక్ అనే కొలీగ్, ఆయన పరిచయం చేశాడు. తర్వాత అక్షయ్ మొహంతి అని. అతను కటక్‌లో రేడియో స్టేషన్‌లో పనిచేసేవాడు. నాకు టీ కొట్టు దగ్గరెక్కడో పరిచయమైనట్టు గుర్తు. చాలా బాగా పాటలు పాడేవాడు. ఎక్కడ పాడమంటే అక్కడ పాడేవాడు. మిశ్రా అప్పుడప్పుడూ ఒరియా పోయెమ్స్ తెచ్చి, నాకు వినిపించేవాడు. నాకు కొత్త రోజుల్లో ఒరియా బాగా అర్థమయ్యేది కాదు, కానీ వచ్చీరాని హిందీలో మాట్లాడితే, మిశ్రా, మహంతి, మరొకడు ప్రఫుల్ల జెనా, ఒడియా పదాలు చెప్పేవాళ్ళు. ఆ స్క్రిప్టు చదవడం వచ్చేదికాదు. దాంతో మిశ్రా నాకోసం ఆ పద్యాలు ఇంగ్లీష్ లోకి పారాఫ్రేజ్ చేసి చెప్పేవాడు.
ఒకసారి సౌభాగ్య ఒక ఒరియా కవిత చదివాడు. క్లుప్తంగా ఆ పద్యం ఇది: ‘ఓ చంద్రుడా! నువ్వు మాకిక అనవసరం, ఈ తెల్లటి ఫ్లొరెసెంట్ దీపాలముందు!’ అయ్యో, ఇది నీకంటే ముందు మావాడొకడు రాశాడయ్యా అన్నాను. సౌభాగ్య వెంటనే శ్రీశ్రీ యా అన్నాడు. ఒరిస్సాలో శ్రీశ్రీ పేరందరికీ తెలుసు. కానీ, అలాంటి పద్యం రాసిన వాడు పట్టాభి. అప్పుడు నాదగ్గర పట్టాభి పుస్తకాల్లేవు. తర్వాత ఏలూరు నుంచి కొన్ని పుస్తకాలు తీసుకువెళ్లి ఆయనకు వినిపించాను. ఇక అప్పట్నుంచీ అతను నాకు బాగా దగ్గరయ్యాడు. ఒక టెన్నిస్ కోర్ట్ వుండేది. ఆ టెన్నిస్ కోర్ట్ లో పడుకుని … అతను పోయెమ్ చదవడం, నేను వినటం చేసేవాళ్లం. అయితే అక్కడుండగా నేను అతన్ని అనువదిస్తానని ఏమీ అనుకోలేదు.
అక్కడుండగా ఒరియా కథలు వినడం, ఒరియా కథలు చదవడమే తప్ప. నిజానికి తెలుగును గురించి పెద్దగా పట్టించుకోలేదు. అక్కడుండగా చాసో (చాగంటి సోమయాజులు) కూతురు తులసి గారు పరిచయమయ్యారు. తులసి గారు అప్పట్లో గవర్నమెంట్ కాలేజీలో హిందీ లెక్చరర్‌గా వుండేవారు. మేమేమో ప్రయివేటు కాలేజీలో. అక్కడుండగా ఒకసారి చాసో గారొచ్చారు. ఒకసారి మా మిత్రులందరం హోటల్‌కెళ్లాం. ఆ ఎదురుగా ఒక పార్కుంటే, అందులో కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నాడు ఒకాయన. బాలకృష్ణ అంటే వెనిగళ్ల బాలకృష్ణ, నేనూ వెళ్లి ఆయనను పలకరించాం. పలకరించాక నాకు అర్థమైంది ఆయనే చాగంటి సోమయాజులు గారు అని. అప్పటికీ ఎన్నో కథలు వచ్చినట్టులేవు. ఆయనతో గడిపాం, కొద్దిరోజులు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఆయన. ఆయనకి చాలామంది కవులు, రచయితలూ తెలుసు; వాళ్ళతో పరిచయాలున్నాయని చెప్పారు. అంతకు మించి అప్పట్లో చాసో గురించి నాకు తెలియదు. ఒక నెలేమో వుండి ఆయన వెళ్లిపోయాడు. అలా చాసో పరిచయమయ్యాడు. మేంకూడా ‘ఓహో, ఒరిస్సాలో తెలుగు రాసేవాడొకడు పరిచయమయ్యాడు అనుకున్నాం. అంతకన్నా ఏం తెలీదు.
మిగతా ఒడియా కవులని నేను మీటయ్యాను. కె.కె.శర్మ అని ఒకతను ఇంగ్లీష్‌లో పొయెట్రీ రాసేవాడు. అప్పటికే రెండు మూడు పోయెమ్స్ పబ్లిష్ చేసినట్టున్నాడు. జయంత్ మహాపాత్ర–ఐ నెవర్ మెట్ హిమ్, వన్ ఆన్ వన్. వినడమే ఎక్కువ అక్కడ ఒరిస్సాలో. ఎవరొచ్చి ఏం రాసినా, ఏం చదివినా, అది బెంగాలీదైనా కూడా, దీనిని తెలుగులోకి ఎవరు తీసుకొస్తారా అని ఎదురుచూసేవాడిని. ఇలాంటి కథలు మనవాళ్లెవరైనా రాశారా అనుకునేవాళ్లం. అప్పుడు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వచ్చేవక్కడికి. ఒకరకంగా చెప్పాలంటే ఐ వాజ్ లిటిల్ డిజప్పాయింటెడ్ ఎట్ దట్ టైమ్. వాళ్లకి రెగ్యులర్‌గా పోయెట్స్‌ని మీటవడం, సాహితీ సదస్సులు చేసుకోవడం. కటక్‌లో ఇప్పటికీ వున్నాయి. మనకి లేవు కదా అని అనిపించేది ఆ రోజుల్లో నాకు. అప్పుడు అక్కడుండగా వెస్టరన్ లిటరేచర్, మేం ఏలూరులో చదివిన దంతా సౌభాగ్య చేత చదివించా. నేను చేసిన మంచి పనేదైనా వుంటే అదే. అది అతని పిహెచ్‌డికి పనికొచ్చిందో లేదో తెలీదు. ఆతర్వాత అతను బరంపురం యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా వెళ్లాడు. అతను రిటైరైన తర్వాత … నేనతడిని కలిసిన యాభై ఏళ్ల తర్వాత అతని కంటాక్ట్ తీసుకుని ఇక్కడికొచ్చింతర్వాత కాల్ చేశాను. దాదాపు అదే సమయానికి నేనూ రిటైరయినట్లున్నాను.
ఇందాక తిలక్ గురించి చెప్తూ … విశాఖపట్నంలో కావ్యదహనోత్సవం గురించి చెప్పారు. కానీ, ఆ కావ్యదహనోత్సవం పుస్తకం గురించి మీరు అంతకుముందే ఏలూరులో జరిగినట్టు; అంతకుముందే విశాఖపట్నంలో దానిని స్టేజీ మీద సెటైర్‌గా ప్రదర్శించడానికి సంబంధించిన విషయాల గురించి కూడా చెప్పండి
నారాయణరావు గారు ప్రోద్బలం. శంకరమంచి, దయానందం, నేను, చిన్న ఎత్తున చేసాం, YMHA హాలులో. ఏలూరు కవులు వచ్చారు; కొనకళ్ళవెంకటరత్నం (బంగారి మామ పాటలు) గారు వచ్చారు. ఇట్ వాజ్ గుడ్. కానీ, ఇట్ వాజ్ మచ్ బెటర్ ఇన్ వైజాగ్. ఓపెన్ ఏయిర్ ఆడిటోరియంలో, చాలామంది లెఫ్టిస్టులంతా వచ్చారు వైజాగ్ సభకు.
మీరెందుకు సౌభాగ్య మిశ్రా కవిత్వాన్ని అనువదించలేననుకున్నారు?
చేశాను కదా!
అది అమెరికాకొచ్చాక చేసిన పని. వాటిని అనువదించడానికి మీకు ప్రేరణ ఏమిటి?
అతని కవితలు కొన్ని నాతోపాటు అమెరికాకొచ్చాయి. ఇక్కడికొచ్చాకనే చేశాను. నేననుకున్నది, ముందు ఒకటి రెండు పద్యాలు ట్రాన్స్‌లేట్ చేసి అతన్ని షాక్ చేద్దామనుకున్నా. నీ పద్యాలు తెలుగులోకి చేస్తున్నాను అని. ఇవిగో ఇక్కడే ఉన్నాయి. వాటిని మొదట్లోనే కుంటుకుంటూ కుంటుకుంటూ చదవాల్సొచ్చింది. అతను కొన్ని పద్యాలు చదివి వినిపించాడు కదా నాకు. కొన్ని లీలగా ఎక్కడో గుర్తుంటాయి, ఎప్పుడో చదివినవి.
Now let us get back to your question. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు చేద్దామనుకున్నానని అడిగారు కదా! తెలుగులో రెండోమూడో ఇక్కడి పత్రికల్లో అచ్చువేయించి అతనికి పంపిద్దామనుకున్నాను. ఒరిస్సాలో సాహితీ సదస్సులు బాగానే జరిగేవి. ఒక రకమైన క్రిటిసిజమ్ ఉండేది. పదిమంది కూచొని డిస్కషన్స్ చేసేవాళ్ళు. అయితే ఈలోగా బాలకృష్ణగారు రిటైరై అమెరికా వచ్చేశారు. (అతనికి ఒరియా చదవటం బాగా వచ్చు. ఒక 30 ఏళ్ళు అక్కడే ఉన్నాడు కదా!) అమెరికాకి వచ్చిన తర్వాత కొంతకాలం నాతోపాటే కలిసి పనిచేశాడనుకోండి. ఊరికే అడిగానాయనని. ఏమయ్యా, నీకేమైనా ఆ స్క్రిప్టు గుర్తుందా? అని. ఓ, సుబ్బరంగా గుర్తుంది. మా ఆవిడకి నాకన్నా ఇంకా బాగా గుర్తుంది అన్నాడు. అయితే, నాకో ఉపకారం చేసిపెట్టు అనడిగాను. నాకు ఆ ఒరియా స్క్రిప్టు తెలుగులో రాసిపెట్టు అన్నాను. రాసిపెట్టాడు. ఒరియా – ఇంగ్లీష్ నిఘంటువు తెప్పించా. ఇప్పుడది ఇంటర్‌నెట్‌లో వుంది. యూనివర్సిటీ ఆఫ్ చికాగోవాళ్ళు అచ్చువేశారు.
మీరు కవిత్వాన్ని అభిమానిస్తారు. కవిత్వాన్ని లోతుగా చూడడం, లేదా వేరే పార్శ్వాల్ని చూడడం. ఇవన్నీ మీకు తెలుసు. అసలు మీరెందుకు కవిత్వం రాయలేదు?
నేను ఇండిపెండెంట్‌గా ఏదన్నా కవిత్వం రాసి అచ్చువేద్దామనుకుంటే, నాకొచ్చిన భయమేమిటంటే, ఇవి ఇంతకుముందు చదివినవాటితో పోలికలు కనిపిస్తాయేమో అని – memory plays tricks with us. నువ్వు ప్లేజియరిస్ట్ అంటారేమో అని భయం. అందుకనే కొన్ని కథలు రాయడం కూడా మానేశాను. కొన్నుంటాయి, ఐడియాలు రాసుకుంటుంటాం. మీకు చూపిస్తాను కంప్యూటర్లో. నేనే రాశానని తెలుసు. మీకు చెప్పానుకదండీ. నేను ఏదైనా కవిత్వం రాయాలనుకున్నాననుకోండి, మొదలుపెడతాను. ఇదెక్కడో చదివినట్టుందే అనిపిస్తుంది. మనం చదివినవి లీలగా గుర్తుకొస్తాయి, అన్నాను కదా! నా సొంతమేనా ఇవి? ఒక్కొక్కప్పుడు ఏమీ చదవకుండా ఉంటే రాయడం, తేలిక; బహుశా మంచిదనిపిస్తుంది. పొయెట్రీ రాసి చదువుతుంటాం అప్పుడప్పుడూ. ఇదంతా నేను రాసిందేనా; ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో; ఎప్పుడో చదివినట్లుందే అనుకుంటారేమోనని. ఆ అనుమానం నూటికి తొంభై సార్లు నాకే వస్తుంది. Let me digress here a bit. మీకో కథ చెప్తా.
నేను అంటూ అత్తగారు అని ఒక కథ రాశాను. మొట్టమొదటి రియాక్షన్ ఏమిటో మీకు తెలుసునాండీ? ఒక పాఠకుడు, కవి కూడాను! ఆయన ఇప్పుడు ఎడా పెడా కవితలు రాస్తున్నాడు కూడా! భానుమతీ రామకృష్ణ ఇలాగే రాశారు కదా, అన్నాడు. నిజానికి నేను రాసిన కథకి, భానుమతీ రామకృష్ణగారు రాసిన కథలకి ఎక్కడా పోలికలేదు. It is a diaspora story for me. మా అత్తగారు ఇక్కడికి రావడం, ఆవిడ ఎక్స్‌పీరియన్సులూ. నేను, ఆ భయం మూలంగా పాతిక కథల కంటే ఎక్కువ రాయలేకపోయాను. ప్రోమిస్క్యువస్ తెలుగమ్మాయి. అమెరికాలో తెలుగమ్మాయి గురించి కథకి నోట్స్ రాసుకున్నా, ఈ దేశం వచ్చిన కొత్త రోజుల్లో! తీరాచూస్తే స్మైల్ రాసిన కథ లాగే అనిపిస్తుంది. ఇంకెవరైనా రాసేశారేమో ఇలాగ? ఆ భయంతో నేను సొంతంగా రాయలేదు. రాయలేనేమో అనాలి, నిజం చెప్పాలంటే!
మీరిందాక జవాబు చెప్తూ ఒక మాటన్నారు. ఒరిస్సాలో సాహితీ సదస్సులు అవి ఎక్కువగా జరిగేవి అని. అప్పుడక్కడ సాహిత్య విమర్శ కూడా వుండేదా?
ఎవరో ఒకరు లేచి మాట్లాడేవాళ్ళు కాని, సాహిత్య విమర్శ అంటే మీరే జాగ్రత్తగా డిఫైన్ చేయాలి దాన్ని. క్రిటికల్‌గా మాట్లాడేవాళ్ళు. ఈ పద్యంలో ఇది ఉంది, ఈ పద్యంలో ఇది లేదు, ఈ కథలో ఇవి లేవే అన్నంతవరకే! మనోజ్‌దాస్ అని ఒక రైటరున్నాడు మీరు విన్నారో లేదో! అతనికీమధ్యే పద్మభూషణ్ కూడా ఇచ్చారు. మనోజ్‌దాస్ కథల్ని సాహిత్య అకాడమీ పుస్తకాలుగా కూడా అచ్చు వేసింది. ఈమధ్యే మనోజ్‌దాస్ రాసిన ఒక కథ తెలుగులో చేశాం. మీకు అలాంటి కథలు తెలుగులో రావు అన్నాననుకోండి. తెలుగువాళ్ళకి చాలా కోపమొస్తుంది. ఎందుకు మనం రాయలేకపోతున్నాం అని? ఏమో మరి మనం రాయలేమేమో? మన కల్చర్‌లో లేదేమో అది. ఒకాయన చదువుతాడనుకోండి. ఇది కొత్తగా వుంది. మెటఫర్స్ బావున్నాయి. ఈ మెటఫర్స్ కొత్త మెటఫర్స్ అని చెప్పేస్తాడు ఫేస్‌బుక్‌లో. అంతే. అది విమర్శ అనాలో, పరిచయం అనాలో, సమీక్ష అనాలో నాకు తెలియదు. ఆయన ఫేస్‌బుక్‌లో రోజూ రాసేవాళ్ళల్లో ఒకడు. ఆయన్ని ఏమనగలం? I cannot criticize.
ఒకానొక మాటల సందర్భంలో, మనకున్న వర్ల్‌డ్ క్లాస్ పొయెట్ శ్రీశ్రీ ఒక్కడే అన్నారు. ఇది చాలా పెద్ద స్టేట్‌మెంట్. చాలామంది నొచ్చుకునే అవకాశముంది.
అవును. ఇప్పటికీ అదే అంటాను. శ్రీశ్రీకి గేయం ఉంది. ‘20వ శతాబ్దం నాది’ అని శ్రీశ్రీ ప్రకటించాడు. ‘నేను ముందుకు తీసుకువెళతాను దీనిని’ అన్నాడు. శ్రీశ్రీలా మన ఊరి పొలిమేరలు లేదా దేశం దాటిన ఒక్క తెలుగు కవిని చూపించండి. ఆ మాటకొస్తే, Show me one who originally wrote in English, except Jayant Mahapatra and published in New Yorker! నా ఎరికలో అమెరికాలో పబ్లిష్ అయిన పుస్తకాలు, కథలు, ఇతర కవితలూ వగైరా ఎనభయ్యో, తొంభయ్యో వుంటాయి. అవి కూడా అనువాదాలు. బెంగాలీ నుంచి, హిందీ నుంచీ. ఈ మధ్యకాలంలో నారాయణరావు, షూల్మన్ ఒక ఇరవయి పుస్తకాలు తెలుగు నుంచి అనువదించారు, ఇంగ్లీషులోకి.
ఇక్కడ మీకో ముఖ్యమైన సంఘటన చెప్పాలి. ఒకసారి తానా సభలకి, 1981 తానా అనుకుంటా, శ్రీశ్రీని అమెరికాకి పిలిచారు. శ్రీశ్రీ భార్య కూడా వచ్చారు. తానావాళ్ళు ఆయనకొక్కరికే ఫ్లైట్ ఖర్చులిచ్చారు. శ్రీశ్రీ కొంచెం నొచ్చుకున్నాడు. నేనూ, నారాయణరావూ ఇంకొంతమంది డబ్బులు కలక్ట్ చేసి శ్రీశ్రీ భార్యకి టికట్ ఖర్చులిచ్చాం.
శ్రీశ్రీ అమెరికా వచ్చారా?
రావడమే కాదు. నేషనల్ పబ్లిక్ రేడియో (NPR) వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చేశారు. చాలా మంచి ఇంటర్వ్యూ. శ్రీశ్రీ వాగ్ధాటి చూసి ఆశ్చర్యపోయారు. మహాప్రస్థానంలో కొన్ని కవితలు చదివాడు. మాడిసన్‌లో, శ్రీశ్రీని తీసుకువెళ్ళి రేడియో ఇంటర్‌వ్యూ చేయించాక – నారాయణరావుగారు తీసుకెళ్ళారు – యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌లో శ్రీశ్రీ అక్కడ కొంతమంది స్టూడెంట్స్‌కి లెక్చర్ ఇచ్చాడు. పద్యాలు చదివాడు, మాట్లాడాడు. క్యాంపస్‌కి సంబంధించిన రాడికల్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. డాలర్లలో కొంచెం చిన్న మొత్తం డబ్బు కూడా ఇచ్చారని తెలిసింది. ఇచ్చారో లేదో కూడా తెలీదు. అక్కడికి చాలామంది ఆఫ్రికన్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఒక అరవైమంది దాకా ఉంటారు అందరూ కలిసి. శ్రీశ్రీ పద్యాలు చదవడం పూర్తవగానే, చాలామంది స్టూడెంట్స్ వెళ్ళి శ్రీశ్రీ కాళ్ళ మీద పడ్డారు. ఉధృతంగా చదువుతాడు కదా! సినారె, ఆనందారామం కూడా అప్పుడు అదే ఊళ్ళో ఉన్నారు. అప్పటికే వాళ్ళు పెద్ద రచయితలు. నారాయణరెడ్డి ఓపెన్‌గానే అడిగేశాడు. నన్ను అక్కడికి తీసుకువెళ్ళలేదే అని. ‘తీసుకెళతానండీ. కానీ, సబ్జెక్ట్ ఏమిటి? మీరే సబ్జెక్ట్ మీద మాట్లాడతారో చెప్తే, యూనివర్సిటీలో ఒక టాక్ ఇప్పించేవాడిని. అయామ్ వెరీ సారీ’ అన్నాడు నారాయణరావు. ఆయనకిది గుర్తుందోలేదో మరి. బయటికి చెప్పకపోవచ్చు కానీ గుర్తు బాగానేవుంటుంది. ఆనందలక్ష్మి కొంచెం బాధపడిందేమో కానీ, నారాయణరెడ్డి అక్కసుగా ఫీలయ్యాడు.
మీరు శ్రీశ్రీగారి మాటల్ని రేడియో స్టేషన్‌లో రికార్డు చేయించారు కదా! ఆ టేపులన్నీ ఏమయ్యాయి?
అన్నీ పోయాయండీ. నారాయణరావుగారు మూవ్ అవుతున్నప్పుడు కనపడకుండా పోయాయి. ఎన్.పి.ఆర్. వాళ్ళను అడిగినా ఉపయోగం లేకపోయింది. వాళ్ళు కూడా రికార్డులను గ్లోబల్‌గా ఉంచుతామని, ఒక్కచోట ఉంచమని చెప్పారు. చాలాసార్లు వాళ్ళకి కాల్స్ చేసినా, ఉత్తరాలు రాసినా కూడా ఫలితం లేకపోయింది. అక్కడ మన తెలుగు కుర్రవాణ్ణి కూడా నే అడగమన్నా. వాడడిగాడో లేదో తెలీదు గాని, పని మాత్రం అవలేదు. ఎన్.పి.ఆర్. వాళ్ళతో పాటు నారాయణరావు ఇంట్లోవాళ్ళు కూడా ప్రోగ్రాం జరుగుతున్నప్పుడే ఆ టాక్ అంతా రికార్డ్ చేశారు. ఇప్పుడు ఎవరి దగ్గర కూడా అవి లేవు. నారాయణరావు కూడా మాడిసన్ కూడా వదిలేసి షికాగొ యూనివర్సిటీలో చేరాడు. ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు నావే సగం పోయాయి.
ఇప్పటివరకు మనం మీరు అమెరికాకు రాక ముందు విషయాల గురించి మాట్లాడుకున్నాం. మీరు అమెరికాకి వచ్చేసిన తరువాత చాలా మార్పులొచ్చాయి. అమెరికాకు వచ్చే తెలుగువారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అక్కడి నుంచీ మీ ప్రయాణం ఎలా జరిగింది?
IADO (Indo American Democratic Organization) అనే సంస్థకు మన తెలుగువాళ్ళు వ్యవస్థాపకులు. తానా ఒక్కటే సంస్థగా ఉండేప్పుడు మనం రాజులం! చాలా ముక్కలుగా విరిగినవాళ్ళని ఎవడూ ఖాతరు చెయ్యరు. తానా, ఆటా చీలిక చికాగోలో జరిగింది. ఇప్పుడు బోలెడన్ని ఆర్గనైజేషన్లు వచ్చాయి. అమెరికాకు వచ్చే తెలుగువారి సంఖ్య బాగా పెరిగిపోయింది కదా! కులం, మతం మనకి తప్పవు, ఎక్కడికి వెళ్ళినా!
మీకు తెలియనిదేముంది? ఎందరో మహానుభావులు. కొంతమందితోనే మనం సుముఖంగా ఉండగలం, కొంతమందితో ఉండలేం. వారుకూడా మనతో సుముఖంగా ఉండలేరు. I tried to concentrate on my own stuff. ఇలా సాగుతుండగా పేపర్లు పెట్టి నడిపిన సరదా ఒకటుండేదికదా! కేవీఎస్ రామారావుగారు, ఆయన నాకు తెలీదు. ఎలావుంటాడో కూడా తెలీదు. ఈమాట అనే పత్రిక సురేశ్‌తో కలిపి నడిపేవాడు. ఈమాట పత్రికలో నేను మొట్టమొదటి వ్యాసం నారాయణరావుగారి పుస్తకం మీదే రాశాను. ఇంగ్లీష్‌లో రాశాను. A Poem at the Right Moment నారాయణరావుగారి మీదొచ్చిన వ్యాసాల మీద రాశాను.
ఇండియా పత్రికలలో వ్యాసాలు రాశారా?
‘కాగితప్పులి కళ్ళలో భయం’ అని 9/11 మీద వచ్చిన వామపక్షీయుల కవితా-వ్యాస సంకలనం మీద పెద్ద సమీక్షే రాశాను. చాలామంది, మిత్రులు అమిత్రులయ్యారు. నేను డాలర్లకి అమ్ముడు పోయానని వుత్తరాలు, తిడుతూ వ్యాఖ్యలూ రాసిపారేశారు. అది పెద్ద కథ! అది 2000 తరువాత.
ఆంధ్రప్రభ వాళ్ళకు కూడా రాసేవారు కదా?
‘అక్షరాలు హఠాత్తుగా మాయమైపోతాయి’ అని, పోయెమ్ లాంటిది. అది అట్లాంటాలో (1998) ఒక సదస్సుకి వెళ్ళినప్పుడు చదివాను. అది మా తెలుగు మాస్టారు మీద రాసిన వ్యాసం. దానిని ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు నాకివ్వండి, నేను వేసుకుంటాను అని తీసుకుపోయారు. రెండు మూడు ఇష్యూల్లో ఇద్దరు అమ్మాయిల బొమ్మలు పెట్టి, టైటిల్స్ పెట్టి ప్రింట్ చేశారు. తరువాత కూడా అడపా దడపా రాస్తూ వచ్చాను.
సాహిత్యమే కాకుండా మీకు ఆర్ట్ (చిత్రకళ) మీద కూడా ఆసక్తి ఉంది. చిత్రకళ గురించి బాగా తెలిసిన కొద్దిమంది మనుషుల్లో మీరొకరు. మీరు అమెరికా వచ్చిన తర్వాతే మీకు ఆర్ట్ మీద ఆసక్తి కలిగిందా? ఇండియాలో ఉన్నప్పుడే వుందా?
మొదట్నుంచే ఉంది. కానీ ఇక్కడికొచ్చాక బాగా పెరిగింది. నేను థీసిస్ రాయడం పూర్తయింది. అప్పుడు ఫిజిక్స్‌లో ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నా. టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉద్యోగాలెక్కడా లేవు. పిహెచ్‌డి చేసినవారికి యూనివర్సిటీలో ఉద్యోగాలు రావాలంటే వందల అప్లికేషన్లు పెట్టాలి. రెండుమూడు ఇంటర్‌వ్యూలకు వెళ్ళా. ఓంటారియో స్టేట్ యూనివర్సిటీలో ఒకటి వచ్చింది కానీ, నేను వెళ్ళదలచుకోలేదు. ఇలా ఉండగా ఏం జరిగిందంటే… మా అడ్వయిజర్ ఏం చేశాడంటే, నేనప్పటికి ఆయన మిలిటరీ గ్రాంట్‌తో ఉన్నా. ఆయనొకటన్నాడు. If you submit your thesis, I have to cut off your money అని. సరే, ఏం చెయ్యాలి? ఆయనే వెంటనే ‘ఒక ఏడాది టైమ్ తీసుకో, Don´t submit your thesis, అప్పటికి పరిస్థితులు మారిపోవచ్చు. నిజానికి అదృష్టవశాత్తూ నేనా మనీ ఇవ్వగలను’ అన్నాడు. సరే, Let me take a chance. అప్పటికే ఇండియాకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నా. ఒక ఏడాదో రెండేళ్ళో ఉండి వెళ్ళిపోదామనుకున్నా కదా! సరే, ఒక ఏడాది ఆగి ప్రయత్నం చేయడం మంచిదే కదా, నష్టమేముంది అనుకున్నా. ఒక నెల తర్వాత ఆయనే వచ్చి, జార్జియాలోనో ఎక్కడో ఒకళ్ళు రీప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి పెడుతున్నారు. వాడికి నువ్వు రెగ్యులర్‌గా వెళ్ళి, కలెక్ట్ చేసిన డేటాని తీసుకొచ్చిస్తే వాళ్ళు ఎనలైజ్ చేసుకుంటారు. అది కూడా ఇప్పిస్తాన్నీకు’ అన్నారు. వెయ్యిడాలర్లు జీతం. ఫెలోషిప్‌తో కలిపి, దగ్గిరదగ్గిర అప్పట్లో అసోసియేట్ ప్రొఫెసర్ జీతం! Lucky me అనుకున్నా. సో, అప్పుడు నేనేదో కోర్సు తీసుకోవాలి. వన్ ఇన్ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ఓన్లీ ఇన్ రీసెర్చ్. అనెదర్ కోర్స్ ఈజ్ మై ఛాయిస్. ఒకటేమో మెడికల్ స్కూల్‌లో కోర్సేదో తీసుకున్నా. ఇంకో కోర్సేమో అట్లాంటాలో ఆర్ట్ అప్రీషియేషన్ కోర్సు తీసుకున్నా. షికాగోలో ఉద్యోగమొచ్చిన తరవాత కూడా I continued that passion.
షికాగో వచ్చిన తర్వాత… ఐ వాజ్ సో హ్యాపీ. నా లైఫ్ కొంత టర్న్ తీసుకుందక్కడ. ఒక ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌వాళ్ళు ఆడిషన్ కోర్సు ఆర్గనైజ్ చేసేవాళ్ళు. మనమేం చేయనక్కర్లేదు, డబ్బులు కూడా కట్టనక్కర్లేదు. రెగ్యులర్‌గా వచ్చి పెద్దపెద్దవాళ్ళ ఉపన్యాసాలు వినేవాడిని. ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అవీ పెడితే హెల్ప్ చేస్తుండేవాడిని. ఒకసారి ఎవరు చేస్తున్నారు అని అడిగితే ఎస్. వి. రామారావు అని చెప్పారు. నేను లండన్‌లో ఉండగా ఈయన భారతి, ఇంకేవో పత్రికలకు రాసిన ఆర్టికల్స్ చూసేవాడిని. అతను అంతకుముందు యూకేలో వుండేవాడు. అమెరికాలో డేటన్ యూనివర్సిటీలో ఆర్ట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి వచ్చాడు. మొట్టమొదట తానా కాన్ఫరెన్స్‌లో కలిశాన్నేను రామారావును. ‘మీరు ఆర్టిస్ట్ రామారావు గాదూ’ అన్నాను. అంతే, లిటరల్‌గా నా కాళ్ళ మీద పడ్డాడు. నన్నిక్కడ ‘ఆర్టిస్ట్ రామారావు’ అన్నది మీరొక్కరేనండీ అన్నారు. నేను ‘అదేంటండీ? నేను మీ గురించి చదివాను. మీ బొమ్మలు చూశాను అక్కడా ఇక్కడా’ అని. తర్వాత ఆయనే తన బొమ్మలూ అవీ చూపించారు. అప్పట్నుంచీ మా మధ్య స్నేహం పెరిగింది. అతని దగ్గర చాలా పుస్తకాలుండేవి. ఆర్ట్ పుస్తకాలు. అక్కడికీ అక్కడికీ వెళ్ళినప్పుడు కొన్నవి. అతను గీసిన చాలా బొమ్మలు, చార్‌కోల్‌తో గీసిన స్కెచెస్ అవీ. పాపం He lost all of them. Tremendously interesting. He is a wonderful person. ఏమీ లేకపోతే కాసేపు ఆయన బొమ్మలన్నా చూస్తూ కూర్చోవచ్చు. ఆబ్‌స్రాక్ట్స్ (నైరూప్య చిత్రాలు) అవీ చేశాడు. I started developing my own interest.
మీరూ చలసాని ప్రసాదరావుగారూ ఇక్కడ ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ లాంటిది చేశారని విన్నాం
అదొక ఇంటరెస్టింగ్ థింగ్. చలసాని ప్రసాద్ — నో నో, ప్రసాదరావు… I must be careful — ప్రసాదరావుగారు నాకు బాగా తెలుసు. ఎస్.వి. రామారావుకి ఫ్రెండు. ప్రసాదరావుగారు మాట్లాడలేక పోయేవారు. అప్పటికే మాట పోయింది. పేపర్ మీద నోట్ లాగా రాసిస్తుండేవాడిని. అప్పుడే చికాగోకి తుమ్మపూడి నుంచి సంజీవదేవ్ వచ్చాడు. ఆయన బొమ్మల ఎగ్జిబిషన్ పెట్టటం అవీ చేశాం. సంజీవదేవ్‌కి రంగులు తెలియవని చెప్పాను. చలసాని ప్రసాదరావుగారి గురించి తెలుసుకోవాలంటే… He is a peculiar person. చాలా తక్కువమందికి తెలుసును. ఈనాడు మ్యాగజైన్‌లో పనిచేసేవాడు. ఆయనకి కూడా నేను ఒకటో రెండో రాశాను. విపుల పత్రికలో వేసినట్టు గుర్తు. వంద రూపాయలో, నూటేభై రూపాయలో డబ్బులు కూడా పంపాడు. ఆ కాపీలు ఉన్నాయో పోయాయో కూడా తెలియదు.
తమాషా ఏమిటంటే ఒకసారి లవణం కూడా వచ్చాడు, వీళ్ళు వెళ్ళిన తరువాత. లవణం తెలుసుకదా మీకు? రామారావు ఆయనను తీసుకొచ్చాడు. గుళ్ళో మీటింగ్ పెట్టారు, గుడి బేస్‌మెంట్‌లో. నేనూ, చలసాని ప్రసాదరావూ కూర్చున్నాం. ఆయన మాట్లాడిన కాగితాలు నాదగ్గరెక్కడో వున్నాయి, దొరికితే ఇస్తాను తీసుకుపోండి.
[వేలూరిగారు ఈమాటలో చిత్రకళ గురించి రాసిన వ్యాసాలు కొన్ని, ఇక్కడ చూడవచ్చును: ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి, బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్, పికాసో కుడ్యచిత్రం గ్వెర్నికా గురించి…. — సం.]
మీకు ఫొటోగ్రఫీ కూడా బాగా తెలుసు. అంటే, కొన్ని స్పెషల్ ఫొటోస్ వుంటాయి, వాటిని మీరు ఐడెంటిఫై చేయగలరు. ఇది క్లాసిక్ ఫొటో, ఇది కాదు అని. అవన్నీ ఎట్లా సాధ్యమయ్యాయి?
మీకో పుస్తకముంది ఇక్కడ కింద, దీనిమీద లైబ్రరీ మార్కులుంటాయి చూడండి. The Voices of Silence అని. ఎవర్రాశారో తెలుసా? తీయండి, Andre Malraux, Stuart Gilbert ఇంగ్లీష్ అనువాదం. నిజానికీ పుస్తకం నా దగ్గరుండేది, పోయింది. పోతే, అప్పుడు ఒక స్కూలువాళ్ళు సెకండ్‌హ్యాండ్ పుస్తకాలను అమ్మేస్తుంటే అక్కడినుంచి ఎనిమిది డాలర్లు పెట్టి, కొని పట్టుకొచ్చాను. అది చదవండి. How photography has changed the entire concept of the art అనేది అర్థమవుతుంది. అందరు ఆర్టిస్టులు ఒక్క రోజులో అక్కడినుంచి ఇక్కడికీ, ఇక్కడినుంచి అక్కడికి వెళ్ళగలిగినవారు కారు. వెళ్ళి చూసినవారే, ఓహో, అతనిలా వేస్తున్నాడా? మనం ఇలా వెయ్యకూడదు అనుకునేవాళ్ళు. ఫొటోగ్రఫీ వచ్చేక, They used to look at the photograph. Photography is becoming part of the art. So, మనం కూడా బొమ్మలు గీయడం మంచిదనిపించింది. అదిగో చూడండి, అవ్యయ సంకలనం మీద వేసిన కవర్ పేజ్ బొమ్మ. ఆ అమ్మాయి చెట్టు కింద కూర్చుని. The photograph of the woman who I do not know. ఇది హవైయిలో తీసిన బొమ్మ, మావీలో. అలాంటి బొమ్మలు చాలా తీశాను.
మీకు గాంధీ అంటే చాలా ఇష్టం. అదెంత ఇష్టమంటే గాంధీ సాహిత్యం సమగ్ర సంకలనం మొత్తాన్నీ (100 వాల్యూములు) తెప్పించుకుని మీరు చదివారు. గాంధీ గురించి చెప్పండి.
అవును. అప్పట్లో చాలా చౌక కూడా. రెండువేల రూపాయలకి హండ్రెడ్ వాల్యూమ్స్ అమ్మారు. అంటే పుస్తకం ధర ఇరవై రూపాయలే పడింది. (పెన్మెత్స) సూర్యనారాయణరాజు ఫస్ట్ సెట్ అని పోస్టులో పంపించాడు. హైదరాబాద్‌లో పదేసి పుస్తకాల చొప్పున కుట్టి పంపించేవారు. అప్పుడేం జరిగిందంటే, 37 పుస్తకాలు రాలేదు. 63 ఏమో వచ్చాయి, with index and all. నేను రాశాను. నేనిక్కడే కొనుక్కుంటాను, నువ్వు పంపొద్దులే అని. కానీ, ఇక్కడివాళ్ళు లూజ్‌గా అమ్మబోమని చెప్పారు. మొత్తం సెట్ కొనుక్కుంటేనే ఇస్తామన్నారు. సో, సూర్యనారాయణరాజుకు నీస్ ఒకావిడ వుండేది, అహ్మదాబాద్‌లో. ఆ అమ్మాయిని పంపించి, మళ్ళీ ఒక వందా కొనిపించి హైదరాబాద్ తెప్పించాడు. నేనిక్కడినుంచి లిస్ట్ తయారుచేసుకుని, ఏవి రాలేదో అవి మాత్రమే ప్యాకేజీగా తెప్పించుకున్నాను.
నేను గాంధీని ఎలా చదివానంటే, That is one of my best interests. I should have continued reading him. గాంధీ మీద బాగా ఇంటరెస్ట్ రావడానికి ప్రధాన కారణం భాగవతుల పరమేశ్వరరావుగారు. నా థాట్ కాస్త ఇంప్రూవ్ అయింది ఆయన వల్ల. ఆయన గాంధియన్. నా ఉద్దేశంలో ఆయన Last Gandhian of India అనుకుంటాను, అని వివిధలో రాశాను కూడా. మార్క్సిస్టుల మీద నమ్మకం తగ్గేకొద్దీ, గాంధియన్ థాట్ మీద ఇంటరెస్ట్ పెరిగింది. గాంధీని చదవాలి అనుకున్నా. ఎప్పుడైనా మా ఆవిడతో మాట్లాడుతూవుంటే మా పై ఫ్లోర్‌లో గాంధీ పుస్తకాలు చూశారు కదా మీరు! వాటిలోంచి ఏదో ఒక పుస్తకం తీసుకుని చదివేవాళ్ళం. గాంధీ ఎంత మెటిక్యులస్ ఫెలో అంటే మీరెవరన్నా ఒక ఉత్తరం రాస్తే దానికి సమాధానం రాసేవాడు. స్మాల్ థింగ్. ‘మా ఊర్లో రైళ్ళు పది నిముషాల కన్నా ఎక్కువ ఆపడంలేదు, నువ్వు చెప్తే ఆపుతారు’ అని రాశారనుకోండి. జస్ట్, ఉదాహరణకు తీసుకోండి. వాటిక్కూడా సమాధానం రాసేవాడు. మీ సమస్యను ఆ డిపార్టుమెంటువారికి రాసి, అది పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తాను, అని రాసేవాడు. అలాంటివాడు గాంధీ.
He is a great soul. అందుకనే, ఎంత గొప్పవాడో చదవకుంటే మనకు అర్థం కాదు అని ఆయన వాల్యూమ్స్ అన్నీ కొన్నాను. కొన్ని తెలుగు పుస్తకాలు Emory University గౌతమ్ రెడ్డికిచ్చాను, ఏదైనా లైబ్రరీకి ఇవ్వమని. తెలుగు చేతిరాత పత్రికలు వగైరా! పుచ్చుకోవటమే తప్ప అతను సరిగా కాపీ చేసి నా వ్యాసాలు పంపించమంటే, సరిగా ఫొటో గూడా తియ్యలేదు. That is part of history of the Telugus in the USA…
మీరు గాంధీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓ మాటన్నారు. గాంధీజీ నిజజీవితంలో మాత్రమే కాదు. ఆయన రాసే రచనల్లో కూడా నిజాయితీ వుంటుంది–అందరూ గాంధీని ఎందుకు చదవాలంటే…?
చెప్పానుకదా! కొందరు గాంధీ మీద సైకో-అనాలసిస్ పుస్తకాలు రాశారు. గాంధీ తన మనవరాళ్ళిద్దరి పక్కనా పడుకోవడం… ఇదంతా ఎగ్జాగరేషన్ కాదు. ఆయన పుస్తకంలోనే రాసివుందది. Whether I control it or not? అందుకోసమే చేశానన్నాడు. Sexual control. He says that. Very openly. He writes everything what he has done. But there are many people, like RSS, they think it is not. గాంధీని ఇలా భావించింది ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళు, మావోయిస్టులూ. Gandhian economics is village economics అండి. ఒక గ్రామంలో పండిన పంటను ఇంకో గ్రామంవాళ్ళు బార్టర్ సిస్టమ్‌లో పంచుకోవడం. మీకు తెలుసు. ఇదిప్పుడు మనకి వింతగా కనిపిస్తుంది ఇంటర్‌నెట్ ఏజ్‌లో. What nonsense is this? సరే, It is a different story. కొన్ని పిచ్చిపనులూ చేశాడాయన. పెళ్ళాంతో సరిగ్గా ఉండకుండా, నువ్వు టాయిలెట్స్ క్లీన్ చెయ్యి, అది చెయ్యీ ఇది చెయ్యీ అని. He always says that. ‘Yes, I am a human’ అని ఒప్పుకొనేవాడు. ఆ ఇమ్యూనిటీ ఉన్నవాడు గాంధీ. పాలిటిక్స్‌లో కూడా ఏవో వుండేవి, పట్టాభి సీతారామయ్యగారిని కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ని చెయ్యాలని హెల్ప్ చేశాడనీ, ఇలా ఏవో వున్నాయి. But we don´t know whether they are true or not. I think he was very honest. అందుకనే గాంధీ పుస్తకాలు చదువుతా. ఇంక కొత్తగా మీరడగాల్సిందేముంది?
సరే, కొంత కాలం ఈమాట పత్రిక సంపాదకత్వం నిర్వహించారు. దాని గురించి చెప్పండి.
Yes, I really wanted to give a structure to that, like the New Yorker. You can look here in the USA. పాత The New Yorker సంచికలు చూడండి, ఇప్పటి న్యూయార్కర్స్ చూడండి. మార్పుంటుంది. నేను ఇంగ్లీష్‌లో చదువుతుంటా. వాళ్ళ షార్ట్ స్టోరీస్ అవీ చూడండి, ఎంత మారుతూవచ్చాయో? సో, వాళ్ళ స్టోరీ ఎడిటర్స్ మారారు. పొయెట్రీ ఎడిటర్స్ మారారు. There is a need for change, time brings change sometimes, it may go bad too. But most of the times they base on the structure. ఒక కొటేషన్ వుంది Before you build anything tall, make sure your foundation is strong. There is nothing wrong in giving a structure. నేను సంపాదకునిగా ఉన్నన్నాళ్ళు, ఈమాటకు ఆ రకమైన స్ట్రక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించాను. I think I have done ‘enough damage’ with eemaaTa. So I had to quit as Chief Editor.
బావుంది. లిటరరీ క్రిటిసిజం లోకి వచ్చాం. ఇప్పుడు మీరే అన్నట్టు, నూయార్కర్‌లో స్టోరీ, పొయెట్రీ ఎడిటర్స్ మారుతూవచ్చారు. ఇంతకుముందు మీరే అన్నట్లు, ఎంతైనా తెలుగువాళ్ళం కాబట్టి మీ strength అంతా తెలుగులోనే వుంటుందనుకున్నారు. మీరు యాభై ఏళ్ళకు పైగా అమెరికాలో వున్నా కూడా, ఇప్పటికీ మీరు తెలుగులో జరుగుతున్న మార్పుల్ని కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు. సాహిత్య విమర్శ అన్నది ఒక థియరిటికల్ లెవెల్‌లో ప్రస్తుతం కనపడడంలేదు. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి వల్లంపాటి, వెల్చేరు లాంటివారు రాసిన విమర్శలన్నీ 1970-80లలో ఆగిపోయాయి.
సో, ఈ తర్వాతొచ్చిన సాహిత్యాన్ని కూడా ఎలా చూడాలి? వీటికి కావల్సిన టూల్స్‌ను మనమెలా సమకూర్చుకోవాలి? అప్పుడెప్పుడో సాహిత్య విమర్శ లేదనుకోవడం తప్పు. First thing is we have totally given up our aesthetics. We have to go back. మన పుస్తకాల్లో క్రిటిసిజముంది. కాని, అప్పట్లో ప్రోజ్ లేదు కాబట్టి, పొయెట్రీయే వుంది కాబట్టి పొయెట్రీనే తీసుకుందాం. తీసుకుని చదవండి. వాడెవడో సుబ్బరంగా క్రిటికల్‌గా చెప్పాడు. ఆరు పుస్తకాలు రాద్దామనుకున్నాడట, ఒకటే రాశాడు. ఐ థింక్ ఆల్ అవర్ పీపుల్ ఇన్ మై ఒపీనియన్ అగ్రీ. పుస్తకాన్ని క్రిటిసైజ్ చేయడంవల్ల ఫలితముంటుంది. టెక్ట్స్‌బుక్స్ తీసుకుని చదవండి. మెటాఫరిజం, సోషల్ క్రిటిసిజమ్ ఇవన్నీ చదివితే ఓహో, ఇలాగ కూడా చెయ్యొచ్చా? అని అర్థమవుతుంది.
ఈమధ్య నేనొక ఆర్టికల్ రాశాను. వీళ్ళందరూ కథలు రాస్తున్నారు, వీరిలో ఎవరైనా అరిషడ్వర్గాలను దాటి కథలు రాశారా? మీరు ఏ కథలోనైనా అరిషడ్వర్గాలను దాటి రాసినది వుందా? ఒకాయన, పేరు గుర్తుకు రావడం లేదు, ఆయన బైబిల్ లోంచి వెనక్కి వెళ్ళమంటాడు. You go back to your classics, read them. Read them well. Read several commentaries. There is everything in the Bible. అన్నాడు కదా! నేను అల్లాగే మహాభారతంలోనుంచి ఒక లిస్టిచ్చాను. ఇవన్నీ కూడా అరిషడ్వర్గాల గురించి చెప్పిన కథలే!
సో, కొత్తగా మీరేమీ చెప్పట్లా. కొత్త మాటల్లో చెబుతున్నారు. అసలు కొత్తమాటలు కూడా ఎందుకు చెప్పాల్సివచ్చిందీ? మాటలు మారతాయి, భాష మారుతుంది. Economic structure కూడా మారుతుంది. కదా! అందుచేత కొత్తమాటల్లో చెప్పాల్సివస్తోంది. It is not new. You are saying it in a new language. ఇలా ఎవరూ చెప్పలేదు అనకండి. You will always find a source for this. యూనివర్సిటీ లెవెల్‌లో నాకు తెలీదు. ఇక్కడ మీరు క్రిటిసిజం మీద క్లాసులు తీసుకోవచ్చు. వాళ్ళు పాఠం చెబుతారు. కాని, మనకిలా చెప్పేది ఎక్కడ? అసలు క్రిటిసిజం రాసేవాళ్ళెవరు మీకు? న్యూస్‌పేపర్లవాళ్ళు. What are their qualifications? అంటే, సాహిత్యానికి బయట ఉన్నవాడు క్రిటిసిజం రాస్తున్నాడు. మాధవ్ వున్నాడనుకోండి, He is a scientist. He is doing good literary work as editor and writer. మానస ఇంజనీరు. కవిత్వం మీద మంచి వ్యాసాలు రాయగలదు. సురేశ్ వున్నాడు, అతనూ ఇంజనీరే. He is translating from other languages. అవుట్‌సైడ్ పరిధికి వెళ్తున్నవాళ్ళు రాయాల్సివస్తోంది. నిజంగా లిటరేచర్‌లో పనిచేసినవారు రాయట్లా? ఎందుకని రాయట్లా? ఇక్కడ చూడండి, ఇక్కడెవరు రాస్తున్నారు క్రిటిసిజమ్? ఎలా డెవలప్ అవుతోందిక్కడ? ఎలా మూవవుతోంది? For good or bad, ఎందుకు మూవవుతోంది? ఎలా మూవవుతోంది?
Because here they have coaching. కోచింగ్ మన క్లాసిక్స్ నుంచి స్టార్టవ్వాలని అనుకుంటా. I may be probably wrong. ఆధునిక సాహిత్య సిద్ధాంతాలతో భారతీయ ఆలంకారికులు చెప్పిన సిద్ధాంతాలను జోడించి, మన విమర్శకులు మన సాహిత్యాన్ని విశ్లేషించవలసిన అవసరం ఉన్నది. నాకెందుకో ఇప్పటికీ రాజశేఖరుడిని చదివితే, హమ్మా, వీడు భలే పనికొస్తాడే మనకు అనిపిస్తుంది. At his time he was a radical. కావ్య మీమాంసాలో రాజశేఖరుడు తన భార్య అవంతీసుందరి చెప్పినదని చెబుతూ, శబ్దార్థహరణం, ఎప్పుడు అనింద్యం కాదో విపులంగా రాస్తాడు. వాడెవడో వైఫ్ రాసిన పోయెమ్‌ను కోట్ చేస్తాడు. శుభ్రంగా చెప్పేస్తాడు, బెస్ట్ క్రిటిక్‌కి ఉండాల్సిన లక్షణాలేమిటి అని. బెస్ట్ క్రిటిక్ అని ఎవరిని అంటారు? ఎందుకంటారు? బెస్ట్ రీడర్. జాగ్రత్తగా చదివినవాడిని అంటారు అని తేల్చేస్తాడు.
ఇప్పుడు వీడు మనవాడే. వీడి కవిత్వం గొప్పదని రాసెయ్యి. రేపు మనని గురించి వాడే రాయాలి! మనం సుబ్బరంగా పోలరైజ్ అయిపోయాం. రైట్, లెఫ్ట్, సెంటర్. సెంటర్ ఉందో లేదో నాకు తెలీదు. రైట్ ఆర్ లెఫ్ట్. బోత్ ఆర్ రాంగ్. అవునా కాదా? బోత్ ఆర్ రాంగ్. ఆమె ఎవరో రాసింది. ‘సామాజిక స్పృహ లేని కథలు రాయడం అనవసరం’ అని. అసలు సామాజిక స్పృహ అంటే ఏమిటి? What does that really mean? వాడెవడో అన్నాడు–NYR Booksలో అనుకుంటా. Why don´t you write something for us? అంటే, I write whatever I want. I don´t give a fuck. You read what I write–అనే అర్థమొచ్చేటట్లు అన్నాడు. వాడు రాసింది నువ్వు చదివితే క్రిటిసిజమొస్తుంది. నువ్వు చదవకపోతే ఎక్కడినుంచొస్తుంది? దీనికి ఏమిటి చెయ్యాలండీ అంటే… ట్రెయినింగ్ కావాలండీ. You should have training. Don´t sit and write. You just go back and see.
అందుకనే నేను ‘కథ నచ్చిన కారణం’ అని ఒక శీర్షిక మొదలుపెట్టాను. చూడండి, అకాడమీకి ఎందుకు నచ్చిందీ అని. గుర్తుందా మీకు? వెరీ ఓల్డ్ స్టోరీ. రేమండ్ కార్వర్ కథ. జయప్రభగారెంత గొడవ చేసింది, ఈ కథలో ఏమీ లేదని. నిజంగా ఆ కథలో ఏమీ లేకపోతే You just try to Google, ఇక్కడ హైస్కూల్ టీచర్ల దగ్గర్నుంచి ప్రొఫెసర్ల దాకా ఆ కథ మీద కామెంట్ చేస్తున్నారు. It might be seen differently అని. I read old ones with my new eyes. ఆ attitude ఉన్నవాడు మంచి క్రిటిక్ అవుతాడు. Why do you want to keep all these old books?
నారాయణరావు పుస్తకాలు ఇంకా ఎందుకుంచాను నేను? నారాయణరావు నా ఫ్రెండ్ అనా? I don´t think so. He is just a friend like other people. వెనక్కి వెళ్ళకపోతే… ముందుకు వెళ్లలేం. You should have known what happened behind you. Then only you will drive correctly. కె. శ్రీనివాస్ అన్నాడొక మాట, ఏదో మాటల సందర్భంగా. ‘ఎవరూ చదవరు, ఎవరూ రాయరు, మీకు bad criticism వస్తుంది తప్ప’ అని. చక్కగా ఎనలైజ్ చేసి, ఓహో, ఈ పుస్తకం ఈ విషయం చెప్పింది. లేదంటే వచ్చెయ్. ఆ ప్రోజ్‌లూ, ప్రిఫేస్‌లూ (ముందుమాటలు, వెనక మాటలు) అవన్నీ తెలుగులో చేస్తే బావుంటుంది.
అవును ఒక స్పెషల్ ఇష్యూ లాగా 2013లో వచ్చాయి. మీరు చాలా సందర్భాల్లో విమర్శ గురించి మాట్లాడారు కాబట్టి గత పాతికేళ్ళలో వచ్చిన విమర్శని తీసుకుంటే…
విమర్శ ఉన్నదా అసలు?
ఆ ఉన్నదే. ఎంతవరకూ ఉన్నదో అదే. ఒక వ్యక్తిని, అతను చేసే రచనల్నీ కలిపేసి, కలగాపులగం చేసేస్తే అది విమర్శగా తయారవుతోంది. దానిమీద మీ అభిప్రాయం ఏంటి?
చాలా తప్పది. Person is different from what he/she writes. See what his/her output is! నోబెల్ ప్రైజ్ వచ్చిన ఇండో కరిబియన్ రైటర్ Naipaul. Did you know what he said? How a black man deals with white ladies. That’s why he has a white girl friend. He treats her exactly like a black man does. ఓపెన్‌గానే అన్నాడు. న్యూయార్కర్ అలాంటి మాటలు రాయలేదు కాని అతని మీద మంచి క్రిటిసిజమ్ వచ్చింది. He is a great writer. But he said the wrong words about white women. Personal life is totally different. That’s where he is differed. అది ఎక్స్‌పోజ్ చేయగలగాలి.
ఆయనెవరో సారా తాగేవాడు, ఆయన రైటరేమిటి అంటారు. సారా తాగడం అతని దురదృష్టం. అంతమాత్రాన ఆయన పొయెట్ ఎందుకు కాకూడదు? అతను సారా తాగటం మూలంగా పొయెట్ కాలా. పొయెట్ అయ్యాడు కాబట్టి, మీరందరూ అతనికి సారా పోసి సారా మనిషిని చేశారు. The problem is with you. The admirers, followers. ఆయన రాగానే ఫస్టునే ‘వీడు తాగుతాడండీ’ అని. సినారె గురించి కూడా అంటారు. He is a nice guy. కబుర్లు చెప్పటానికీ వాటికీ బానే ఉంటాడు. ఆయనకి మూడు వేల హిందీ పాటలు నోటికొచ్చు, తెలుసా మీకు? ఎవరున్నారండీ ఇప్పుడు మూడువేల హిందీ పాటలు నోటికి వచ్చినవాళ్ళు? అవధానం చేయగలడాయన. ఆయనే చెప్పాడొకసారి నాకు మూడువేల హిందీ పాటలు వచ్చండీ అని. పాటలు బాగా రాస్తాడు. రాసుకోనీ.
కానీ, ఇప్పుడు డెయిలీ పేపర్లు చూడండి. వచ్చేవి కాస్త. ఎవరు ట్రాన్స్‌లేట్ చేయమన్నారండీ, ఎవరు చదువుతారండీ? అంటారు. అది రాసింది ఇంగ్లీష్ చదువుకున్నవాళ్ళకి. ఇంగ్లీష్ చదివినవాడు లేడా? ఏదో తామర కొలనులో మందారం పువ్వో అదేదో… మన అంపశయ్య నవీన్ రాశాడు దానిమీద. దట్స్ నాట్ క్రిటిసిజమ్. ఆయన సరిగ్గా ట్రాన్స్‌లేట్ చేయలేదని. పోనీ నువ్వు చెయ్. ఇంతకంటే బెటర్ ట్రాన్స్‌లేషన్ నువ్వు చేసి చూపించు. (తమ్మినేని యదుకుల) భూషణ్‌తో కూడా ఇదే గొడవ. భూషణ్ బాగా చదువుకుంటాడు. ఉమాకాన్తమ్‌ని గుర్తుంచుకున్నామా? లేదు. కృష్ణశాస్త్రిని గుర్తుంచుకున్నాం. కృష్ణశాస్త్రి రాసిందంతా కవిత్వం. కావ్యం మీద పుస్తకమే రాశాడాయన. నేటికాలపు కవి ఎలావుండాలి? అనో ఏమో. చదివారా మీరా పుస్తకం? ఏమైంది, ఎవరు గుర్తున్నారు? ఇప్పుడు కృష్ణశాస్త్రి లాగే రాసేవాళ్ళున్నారు. కొందరు. ఆ మెటఫర్‌నే కొంచెం మార్పుచేసి రాస్తున్నారు. కాగితాల మీదా, పువ్వుల మీదా, ఆకు మీదా రాసినవాళ్ళెవరు? కొత్త కవులు! కృష్ణశాస్త్రి is a living poet. Where is ఉమాకాన్తమ్? critic. So, you see.
అందుకే మిమ్మల్నొకసారి వెనక్కి తీసుకువెళ్ళి, పాత పుస్తకాలు చూపిస్తే, రామాయణం… దాన్ని వదిలెయ్యండి. భారతం తీసుకుని ఒక పద్యం చదివితే… అరె, ఇది ఎలా మిస్సయ్యాం మనం? పైగా నిఘంటువుని కూడా తీసుకుని చూసి, ఆ, ఈ అర్థాలు మనకు తెలీవే అని ఎందుకనిపిస్తుంది? ఎందుకది పుస్తకమైంది? అందుకనే. ఆ భారతం తీసుకుని బోలెడు కథలు రాయొచ్చు మనం. కానీ తిడతారు జనం. ఎందుకు నచ్చిందీ అని?
ఈ సందర్భంలోనే సాహిత్యాన్ని, ఉదాహరణకు ఒక కవితని ఎలా చదవాలి? ముఖ్యంగా గత 30 ఏళ్ళుగా కవిత్వం రాసేవాళ్ళు పెరిగారు. పబ్లిష్ అవుతున్న కవిత్వం బాగా పెరిగింది. కాని, ఒక కవితను ఎలా చదవాలి?
ఇది మంచి కవిత్వమా, కాదా? ఇంగ్లీష్‌లో అయితే బోలెడన్ని పుస్తకాలున్నాయి. ఉదాహరణకి Edward Hirsch How to read a poem అన్న పేరుతో పుస్తకం రాశారు. Terry Eagleton Literary Criticism పుస్తకమే రాశాడు. నారాయణరావు ఒక వ్యాసంలో కవులే కవిత్వం గురించి మాట్లాడాలి, సైన్స్‌వాళ్ళు సైన్స్ గురించి మాట్లాడుకున్నట్లుగా, అంటే చాలా మందికి కోపాలొచ్చాయి. యెస్, I am rather coming close to it.
అంటే ఇప్పుడు మనకు విమర్శకుల కొరతా? లేదా వేలమైళ్ళ దూరంలో అమెరికాలో కూర్చుని వీళ్ళకి మనమేమైనా చెప్పగలమా?
చెప్పొచ్చును, తప్పులేదు. మనకున్న పేపర్లలో ఏదో ఒకదాన్ని తీసుకోండి. ఈమాటను కూడా తీసుకోవచ్చు. ఏదో ఒక పుస్తకం తీసుకుని ఈ పుస్తకం ఎందుకు బావుంది? అని విమర్శ రాయండి. కొత్త పుస్తకమే తీసుకోండి, పరవాలేదు. Start doing it.
ప్రస్తుతమున్న కథా సాహిత్యం… పూర్వపువాళ్ళతో పోలిస్తే కథలు ఇప్పుడెలా ఉన్నాయి? కథ ప్రోగ్రెసివ్‌గా ఉందా?
ప్రోగ్రెసివ్ అంటే, లెఫ్ట్ బాగా పెరిగింది. కథలో మీరు సమాజం గురించి బాధపడి, సహేతుకంగా సమాజాన్ని అడ్రస్ చేయని కథలు నిర్హేతుకంగా క్రిటిసైజ్ చేయకపోతే మీరు కథకులు కారు. అసలు కథను ఒకరకంగా నిర్వచించడం తప్పు. లైఫ్‌ని నిర్వచించగలరా? నిర్వచించలేరని నా ఉద్దేశం. అన్ని పాటర్న్స్ వుంటాయందులో. They are broken patterns. కథ కూడా అంతే. Broken sentencesలో మీరసలు కథ ఎందుకు రాయలేరు? That was my argument. If your life is broken, sentences come broken, and the reader is clever enough to understand you. మధ్యలో ఆపేశారనుకోండి, ఇక్కడ వాక్యం పూర్తికాలేదే అనకూడదు మీరు. మీరు ఈమధ్యకాలంలో వచ్చిన కథలు చూశారా? ఎన్ని మార్పులొచ్చాయో చూశారా కథల్లో? అంటే, అలా వుండాలని నేనటంలేదు. The structure of the life is changing. ఇప్పుడు నాలోనే కొన్ని వేగ్‌గా ఉంటాయండీ. ఏది రాసినా బ్రోకెన్‌గానే వుంటుంది. Life is not a straight line.
కథ ఎలా ఉండాలి అనేది, ఐ థింక్ వల్లంపాటి వెంకటసుబ్బయ్య బాగా చెప్పగలరు. కథ ఇలా వుండాలి, మిడిల్‌లో ఇలా వుండాలి, ముగింపుండాలి, మధ్య బాడీ చక్కగా వుండాలి, పైన లావుగానూ, కిందికొచ్చేసరికి సన్నబడివుండాలని, ఇదంతా టోటల్ నాన్సెన్స్. If there an incident makes a wonderful transfer, it would be a story. వారిని వెంటనే వెళ్ళి కారవాన్ కథల్ని చదవమంటా. రేమండ్ కార్వర్‌కి ఎవరు హెల్ప్ చేశారో తెలుసునా? వాడి ఎడిటరు. వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు కూడా. అప్పుడు హి రోట్ ద ఓల్డ్ స్టోరీ. ఇప్పుడు అతని కథలన్నీ అచ్చులో దొరుకుతాయి.
ఇప్పుడు కంటెంట్ కూడా తగ్గిపోతోంది. అచ్చుపత్రికలు తగ్గిపోయాయి…
ఇప్పుడు ఇంటర్‌నెట్ పత్రికలున్నాయి కదండీ! Why don´t we go for a change there? నారాయణరావు, మేమూ దాదాపు ముప్ఫయ్యేళ్ళ కిందటే ఒకసారి అనుకున్నాం. ఎక్స్‌క్లూజివ్‌గా కవిత్వం కోసమే ఒక పేపర్ పెడితే బావుంటుంది అని. Nothing but poetry. ఎవరో ముగ్గురో నలుగురో yes, yes, అన్నారు. ప్రింట్ కుదరకపోతే ఇంటర్‌నెట్‌లో పెట్టండి. As a trial, every quarter. మూడు నెలలకో సంచిక పెట్టండి. ఈ పది కథలొచ్చాయి ఈ నెలలో. ఈ క్వార్టర్‌లో ఇంటర్‌నెట్‌లో వచ్చిన కథల్లో మాకు అందుబాటులో ఉన్న కథలివీ. వీటిని తీసుకున్నాం. ఈ కథలు ఎందుకు బావున్నాయి, ఎందుకు బాగోలేవో రాయండి అని చెప్పండి. Don’t hurt them. At the same time, tell them that your suggestions make better sense. కథే కాదు, పోయెమ్స్ తీసుకోండి, కొత్త పోయెమ్స్ వచ్చాయి. కొన్నింటిని చిత్రవధ చేద్దామనుకున్నాను నేను. నిజంగా అంత కోపమొచ్చింది నాకు. Good sense prevailed over.
అమెరికాలో తెలుగువారి సంఖ్య బాగా పెరిగింది. రాసేవాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది. ఒక రకంగా తెలుగు డయాస్పోరా అంటున్నాం కాబట్టి, వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. మీ దృష్టిలో తెలుగు కథలు అంటే, అమెరికాలో ఉన్నవారు రాసిన కథలు డయాస్పోరా కథలవుతాయా? వీట్ల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. అంటే ఇది డయాస్పోరా, అది డయాస్పోరా కాదు, అది వేరే. మాకు తెలిసినంతవరకూ అసలు డయాస్పోరా గురించి మొదట ఒక అవగాహన కల్పించింది మీరు. దాని గురించి మీ అభిప్రాయమేమిటి?
Telugu diaspora అన్న మాట మొట్టమొదటిసారి అట్లాంటా సదస్సులో అన్నాను. It has become a catch word now. ఇప్పుడొస్తున్న కథలు — డయాస్పోరా కథల పేరుతో వస్తున్నవి చదివితే — నేనేదో పొరపాటు చేశానేమో అనిపిస్తుంది. నాకే అనుమానంగా వుంది. డయాస్పోరా అంటే నాకు తెలుసా, వారికే ఎక్కువ తెలుసా అని. అవి డయాస్పోరా కథలు కావని నా ఉద్దేశం. ఎందుకంటే… డయాస్పోరా కథలని చెప్పుకోవాలంటే అందుకు ఒక పరిధిని పెట్టుకోవాలి. మీ అన్నయ్య కొడుకో కూతురో బెజవాడలో పుట్టి, బెజవాడలోనే చదువుకుని, బెజవాడలోనే వుండి, ఆతర్వాత ఉద్యోగరీత్యా నిజామాబాద్‌కి వెళ్ళిపోయారు. అక్కడే ఉండిపోతాడు. అక్కడే ఎవర్నో గుజరాతీని పెళ్ళి చేసుకున్నాడు. వాడి తర్వాతి జనరేషన్ డయాస్పోరా అవుతుంది. మీరు కల్చరల్లీ నాట్ సెపరేటెడ్. కల్చరల్ సెపరేషన్ కావాలి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లతో రాశారనుకోండి, అవి నిజంగా డయాస్పోరా అవుతాయి. మీరూ, నేనూ రాశామనుకో, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌ను తీసుకుని మనం చెప్తాం. We are probably diaspora in a way, if we are one of the earlier generations.
ప్రస్తుతం వస్తున్నవి డయాస్పోరా కాదని నా ఉద్దేశం. లొకేషన్ మారితే అవి డయాస్పోరా అవుతాయనుకోవడం తప్పు. అమెరికా నుండి వచ్చే సాహిత్యం డయాస్పోరా సాహిత్యం కావాలంటే మనం నూతన సమాజంలో ప్రవాసులుగా ఒక హైబ్రిడ్ సంస్కృతిని రూపొందించుకొని, ఆ సమాజంలో మనకే ప్రత్యేకమైన సమస్యలు, సంక్లిష్టతలు, అనుభవాలతో ఒక కొత్త జాన్రా సృష్టించుకోగలగాలి. అప్పుడు ఆ సాహిత్యాన్ని డయాస్పోరా సాహిత్యం అనవచ్చు. కానీ ఇప్పుడొస్తున్నవాడెక్కడున్నాడు? ఒక కాలు ఇక్కడే హైదరాబాద్‌లో వుంది, ఇంకో కాలు అక్కడుంది. 2000 తర్వాత ఇక్కడికొచ్చిన చాలామంది ఎవరైనా రాస్తే అవి రియల్లీ suspicious. గత ఇరవై ఏళ్ళలో చెప్పండి. ఎంతమంది కొత్తగా వచ్చినవాళ్ళు కథలు రాస్తున్నారు? రాసినవాళ్లందరూ అక్కడినుంచి వచ్చినవాళ్ళేనా? అసలు తెలుగులో డయాస్పోరా ఉన్నదా, ఇప్పుడు! మనమేమో అక్కడికి, ఇక్కడికి పోస్టు కార్డుల్లా వెళ్ళొస్తున్నాం. కమ్యూనిటీ కావాలి.
కల్చరల్‌గా కలవాల్సిన అవసరం లేని వాతావరణం కూడా వచ్చేసింది కదా! ఇంటర్‌నెట్టుంది. టెక్నాలజీ బాగా వచ్చేసింది.
నేను రాసిన Metamorphosis చదివి, ఒక స్నేహితుడు ఇది బహుశా మొదటి diaspora అనవచ్చునని రాశాడు. బాగా చదివే క్రిటిక్. ఇది డయాస్పోరా కథ అవుతుంది అని. I said: might be, with a little ‘d’ in the spelling of diaspora. ఇంటర్‌నెట్ ఉందికదా, మీరు రాయండి, రాసింది వెంటనే అచ్చవుతుంది. I think we have to wait for another generation. ఇక్కడ కాళ్ళు పాతుకుపోయిన యంగర్ జనరేషన్. వారి నుంచి రావడానికి స్కోప్ వుంది. Because they are culturally separated. మనకూ, చైనీస్‌కీ ఒకటే డిఫరెన్స్. ఇక్కడికి మనంతట మనమొచ్చాం, ఇక్కడ కలిశాం. మన రిలేషన్‌షిప్స్ అన్నీ ఇక్కడికొచ్చాక కలిశాయి. చైనీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు డిఫరెంటు. వాళ్ళు పడవలేసుకుని వచ్చినవాళ్ళు. అందరూ గ్రూప్స్‌గా వచ్చారు. పోలిష్! అందరూ గ్రూపుగా వచ్చారు. మెక్సికన్స్ కూడా ఇలాగే వచ్చారు. కానీ, మనమలా రాలేదు. ఇప్పుడలా ఎవరైనా వస్తున్నారేమో ఐటీ వాళ్ళు. అది మీకు తెలియాలి. నాకు తెలీదు. నలభై మందో యాభై మందో కలిసొచ్చారనుకోండి, వారందరూ ఒక గ్రూపవుతారు.
డయాస్పోరా నవల నేనే మొదట రాశాను, డయాస్పోరా కథలు నేనే మొదట రాశాను అంటే, రాసుండొచ్చు. మొదటి కథే అయివుండొచ్చనుకుంటున్నా. నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఆవిడెవరో ఒకప్పుడు డయాస్పోరా అంటే నాకు చాలా పట్టుందని చెప్పింది. ఇక్కడే రాశారావిడ. మాట్లాడేటప్పుడు కూడా నా చేతులు గట్టిగా పట్టుకుంది. ఏమిటీ గట్టిగా పట్టుకోవడమేంటి? You come and go to an IT job. Go there, eat one Onion Dosa. ఇంటిదగ్గర్నుంచి ఏదో పలావు తీసుకెళతావ్. అక్కడ కూర్చుని అందరితో మాట్లాడతావ్. వండుకువెళ్ళిన దాన్ని మైక్రోవేవ్‌లో పెట్టి వేడిచేస్తావ్. అక్కడంతా ఆనియన్ వాసన. యువర్ జాకెట్ స్మెల్స్. అదీ ఆవిడ డయాస్పోరా.
చికాగోలో ‘ఇండియన్స్ టెల్లింగ్ స్టోరీస్’ అని ఒక ఉమెన్స్ గ్రూపుండేది. ఆఫ్రికన్లూ, ఇండియన్లూ, మెక్సికనులూ, ఏడెనిమిది మంది మహిళలే కూర్చుని, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్పేవాళ్ళు. నా భార్య శాంతి వచ్చినప్పుడు తను కూడా తన ఎక్స్‌పీరియన్సెస్ చెప్పింది. How bad the family suffered? It was almost 60 years ago. How she suffered. Her resilience. అవి డయాస్పోరా. You live your life. Your story could turn into a diaspora story.
బ్రెజిలియన్లను తీసుకోండి. వారికి డ్యూయల్ సిటిజెన్‌షిప్ వుంటుంది. బ్రెజిలియన్ డయాస్పోరా ఇక్కడెందుకు లేదు? వారి డయాస్పోరా ఒక మోడల్! సౌత్ అమెరికన్స్ అండ్ మెక్సికన్స్ వున్నారు. వాళ్ళు కూడా కథలు రాస్తారు కదా! మనమూ సరిగ్గా అదే స్టేజ్‌లోకి వచ్చేస్తున్నామా? Sometimes, I am an eternal optimist. Our younger generation, I am sure will forget the caste, sub-caste, and religious strings! కొత్త ప్రభుత్వం భారతీయులపై ఆంక్షలు పెట్టకపోతే! మనం ఇలా మాట్లాడుకుంటూంటే ఎంతసేపైనా మాట్లాడచ్చు.
పరుచూరి శ్రీనివాస్, గొర్తి బ్రహ్మానందం: ధన్యవాదాలు వేలూరి గారు. మా ప్రశ్నలని మీరు విశదీకరించిన తీరు బావుంది. మీ అనుభవాలూ, జ్ఞాపకాలూ, సాహిత్య దృష్టీ, దృక్కోణం — ఇవన్నీ కొత్త ఆలోచన్లని ప్రేరేపింప చేసాయి. సాహిత్యాన్ని ఎలా చూడాలీ, కవిత్వమూ-విమర్శా, డయాస్పోరా వీటిపై మీ ఆలోచనా, అవగాహనా ఇవన్నీ నేటి తరానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా కొంతైనా పరిచయం చేయగలిగామని ఆశిస్తున్నాం.