ఫోన్‌ తమాషా

ఆఫీసు నుంచి ఏదో కాల్‌ రావాల్సి ఉండటంతో ఆ రోజు ఫోన్‌ దగ్గరే ఉంచుకున్నాను. అనుకున్నట్టుగానే కాసేపటికి మోగుతోంది. చూస్తే గీతిక. ఈమె ఎందుకు చేస్తోంది? నేను ‘ఫన్‌డే’ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చూసుకున్నప్పుడు, ఈమె మాకు కొన్ని వారాల పాటు ఒక కాలమ్‌ రాసింది. అది ఆగిపోయి కూడా బానే రోజులైంది. మళ్లీ ఇప్పుడు? “హలో గీ..త్‌..త..” “నానా రాజిరెడ్డీ.” ఊమ్‌! రెండు ఆశ్చర్యాలు. ఆడగొంతు మగగొంతుగా మారిపోవడం ఒకటైతే, ఆ పిలుపులోని చనువు. అయితే ఆయన అప్పుడు మాకు ఒక కాలమ్‌ రాస్తున్నారు కాబట్టి ఆ గొంతును ఇట్టే గుర్తుపట్టాను. ఎన్‌.గోపిగారు. ఈ కాల్‌లోకి ఆయనెట్లా వచ్చారు? ఆయనతో మాట్లాడుతూనే నా తార్కిక బ్రెయిన్‌ దాన్ని పరిష్కరించింది. అయితే ఈమె ఏదో పనిమీద హైదరాబాద్‌ వచ్చివుండాలి; ఆయన్ని కలవడానికి వెళ్లివుండాలి; మాటల్లో నా/ఫన్‌డే ప్రస్తావన వచ్చివుండాలి; ‘అరే, నేను ఒకటి చెప్పడం మరిచిపోయానమ్మా, ఫోన్‌ కలుపు’ అనివుండాలి; అలా ఆయన నాతో మాట్లాడుతూ ఉండాలి. ఆయన్ని ఆ విషయం నేను అడగలేదు.

ఇదయ్యాక కాసేపటికి నేను అనుకున్న కాల్‌ వస్తోంది. రామన్న. నా బాసే అయినా ‘అన్న’ అనేవాడిని కాబట్టి, అలాగే ఫీడ్‌ చేసుకున్నాను. “అన్నా…” “హే రాజన్‌” మళ్లీ ఆశ్చర్యం! ఇట్లా జి.ఆర్‌.మహర్షిగారు తప్ప నన్నెవరూ పిలవరు. కానీ ఈ కాల్‌లో ఈయనేంటి? ఎవరూ తమ సొంత ఫోన్లలోంచి నాతో మాట్లాడొద్దని కంకణం కట్టుకున్నారా? ఈయనా మా దగ్గర పనిచేసినవారే, మ్యాగజీన్‌కు రాసినవారే కాబట్టి, నా పాత లాజిక్‌ ప్రకారం, ఈయన కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, మాటల్లో నా ప్రస్తావన వచ్చి, ఫోన్‌ కలపమని… నా ముఖం! ఏదో తేడా ఉంది. అదనపు ప్రశ్నల ద్వారా ఆయన ఆయన ఫోన్‌లోంచే మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్నాను. కానీ ఇలా ఎందుకు?

నా ఫోన్‌ దాదాపుగా మోగుతూనే ఉండే రోజులు అవి. పైగా, ఒక కాల్‌ తర్వాత ఇంకో కాల్‌ రావాల్సిందే కదా ఏదో టైముకు. ‘శ్రీరమణ’ అని కాలర్‌ ఐడీ చూపిస్తోంది. శ్రీరమణగారేనా, ఇంకెవరైనా? ఇప్పుడు నేను ‘సార్‌ నమస్తే’ అన్నట్టుగా సిద్ధం కావాలా, ఎదుటివాళ్ళు మాట్లాడేదాకా ఆగి రియాక్ట్‌ కావాలా? కొందరు మనం హలో అనేదాకా ఏమీ మాట్లాడరు. కొందరు ఏమిటంటే ఆ చిన్న పాజ్‌ నిశ్శబ్దాన్ని కూడా భరించలేక వాళ్ళే ముందు మాట్లాడేస్తారు. ఇట్లా అయితే నాకు తేలిక. గోడ చాటున నక్కిచూసినట్టుగా, ఎదుటివాళ్ళ గొంతు వినబడేదాకా ఆగి… “ఆ హరి, ఏంట్రా సంగతి?”

అసలు తమాషా ఇప్పుడు మొదలైంది. మనుషులు వాళ్ళే. కానీ భిన్న పేర్లతో మాట్లాడుతున్నారు. ఆజాద్‌ అని వచ్చిందంటే అది మహీ కావొచ్చు. ఖదీర్‌ ఫోన్‌ చేస్తే మెహెర్‌ కావొచ్చు. మరి మెహెర్‌ అని వస్తే ఎవరు? భగవంతం అని వచ్చిందంటే అది ఖమ్మం భగవంతుడు కానట్టు. కాశీభట్ల అని పడిందంటే, ఆ కర్నూలు నుంచే ఎవరైనా కావొచ్చు, ఇంకెక్కడినుంచైనా రావొచ్చు. ఇంటినుంచి వస్తుందనుకున్న కాల్‌ ఇంకెవరి ఇంటిదో కావొచ్చు. నా ఫోన్‌కు ఏమైందన్న ఆందోళన కొంత ఉన్నప్పటికీ, మనుషులుగా వాళ్ళకు వాళ్ళు పరిచయం కూడా లేనివాళ్ళు ఇలా పరకాల్‌ ప్రవేశం చేయడం కొంత సరదాగానే ఉండింది. కానీ ఈ కాంబినేషన్లను నేను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెంకట్‌కు కాల్‌ చేయాలంటే, మోహన్‌కు చేయాలి. సత్యతో మాట్లాడాలంటే… ఎక్కడో రాసుకున్నానే! ఇట్లా ఆ రెండు మూడు రోజులపాటు నేను ఈ కొత్త మారుపేర్లకు అలవాటు పడుతూ, ‘రామన్న’ స్థానంలోకి వచ్చిన మహర్షిని ‘హే ఆత్మన్‌’ అనడానికి సిద్ధం అవుతూ ఉండగానే… ఉన్నట్టుండి రామన్న రామన్న అయిపోయాడు. అందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ అసలు పాత్రల్లోకి మారిపోయారు. ఫోన్‌ అసలు అటు ఎందుకు మారిందో, మళ్ళీ ఇటు ఎందుకు మారిందో నాకైతే తెలీదు. ఏ సాంకేతిక సమస్య అయినా కావొచ్చుగానీ ఆ తమాషా బాగుండింది.