(నాసదీయ సూక్తానికి స్వేచ్ఛానువాదం)
నేడూ, నిన్నా, మొన్నా
చరిత్ర పుటల్ని దాటి,
శకాలనూ యుగాలనూ వెనక్కి నెట్టి,
కాలపు మూలాల్లోకి సాగే
తాత్విక ప్రస్థానం
చేరుతుందా ఆవలి తీరం?
ఎలా పుట్టింది?
ఎక్కడినుండి పుట్టిందీ సృష్టి?
లోకసృష్టికి ముందు
ఎలా ఉండేదో లోకం?
అప్పుడు చైతన్యం లేదు కదా
జడత్వమూ లేనట్టే!
నేలగా పిలిచే ఈ మట్టిముద్దా
మట్టిని కప్పిన అంతరిక్షమూ ఆకాశమూ
లేనేలేవేమో!
మృత్యువు లేదు కదా
అమృతత్వమూ లేదు!
రాత్రింబవళ్ళ ఊసే లేదు!
నీరు, నిప్పు ఊసేలేక,
అంతా గహనం, గభీరం!
అప్పుడు ఏమీ లేదేమో—
లేకపోవడమే తప్ప!
కాలం లేని కాలంలో
స్థలమే లేని స్థలంలో
కదిలేదేది? నిలిచేదేది?
ఊహలకు అందని ఊహను గురించి—
అంతా ఊహే!
శ్వాసాశ్వాసీ అన్నీ తానే,
అయి ఉంటాడా పరమాత్మ?
చీకటిని కమ్మేసిన కటిక చీకటి
రహస్యాన్ని మింగేసిన రహస్యం
సమస్తాన్నీ ఆవరించిన శూన్యం నుండి
పొడుచుకొచ్చిన
బలీయ వాంఛ!
అవ్యక్తాన్ని తొలచి
అభివ్యక్తమైన పరమాత్మ!
కరుణా కిరణ వృష్టి
కిందా, మీదా, సర్వత్రా!
ఇదేనా సృష్టి?
ఎక్కడినుండి వచ్చింది?
ఎవరు దీనికి కర్త?
అన్నిటికంటే ముందుగా ఏముందో?
అంతటికీ మూలమేదో?
అసలు ఉన్నదేమిటో, లేనిదేమిటో
తెలిపే అస్తి-నాస్తి విచికిత్సకు
దొరికుతుందా సమాధానం?
మరి ఋషులూ, దేవతలను
అడిగితే తెలుస్తుందా ఈ రహస్యం?
ఎలా తెలుస్తుంది?
సృష్టి తరవాతే కదా వారూ పుట్టింది!
ఈ సృష్టి కారణమేంటో?
ఇది చేరే తీరమేంటో?
సృష్టికర్తకైనా తెలుసా?
ఏమో ఎలా తెలుస్తుంది?