1
పలుచని ప్రేమ, పలుచని దయ
పలుచని భయం, పలుచని కోపం
పలుచని నీరు, పలుచని గాలి
పలుచని ఆకాశం, పలుచని మెలకువ
ఇంతకన్నా ఏం కావాలి అంటావు
జీవితం కాంతి వస్త్రాలు దాల్చి
నీ ముందు నిలిచి
నీకేం కావాలి అని అడిగితే
ఇంత చిక్కదనం నిజంగా
నిన్ను చాలా గాయపరుస్తుంది
నిన్ను హతాశుడిని చేస్తుంది
ఉక్కపోసి, వెళ్ళేదారి వెదకమంటుంది
పూల మీది రంగుల్లా పుట్టాల్సినవాడివి
సీతాకోక రెక్కల నిశ్శబ్దంలా,
ఇంద్రధనువులోని చెమ్మగాలిలా,
అడవిచెట్ల నీడల్లా ఉండాల్సినవాడివి
ఇలా ఎందుకున్నావని దుఃఖపడతావు
2
నిజంగా నీకేమీ తెలియదు
తెలుసుననే పసిబాలుడి మాటలు
తెలిసి మాట్లాడుతున్నవి కానేకాదు
తెలియటమనే పంజరంలో
ఎలా ఇరుక్కున్నావో తెలియదు
3
ఇదంతా ఇలా కాదు
మరోలా ఉంటే బావుండునని
బాల్యం నుండి ఇప్పటి వరకూ
నీ దేహంలా ఎదగటం రాని
కల ఒకటి తలపై ఎగురుతూనే వుంది
4
ఇలా కాదు, మరోలా అనిపించటమే
నీ దుఃఖపుకోటకు ప్రాకారమేమో
ఎప్పటికీ తెలియదు