రంగారెడ్డి స్నానం చేసి వచ్చేటప్పటికే రాములు లేడు. కిటికీ ఊచల మీద ఎండిన బనీను, చెడ్డీని తీసుకుని తడివాటిని వాటి స్థానంలో ఆరేశాడు. తెల్లటి బనీనుకు అంటిన చిలుం మరక ఊచ ఎంత పాతదో చెబుతోంది. మరకను గోటితో గీకి చూశాడు గానీ అదేమీ పోలేదు. బ్యాగులోంచి ప్యాంటు, అంగీని కూడా వేసుకున్నాక తువ్వాలను కూడా అదే కిటికీ రెక్క మీద వేశాడు. టక్కును చూసుకుందామంటే అద్దం లేదు. ఆ మూలన ఎవరిదో ఉండాలి. యాభై మంది అయినా పడుకోగలిగే పాత బడి భవనం అది. ఇంకా ఒకరిద్దరు పడుకొనే ఉన్నారు. కొన్ని బిస్తర్లు నీటుగా దగ్గరికి మడిచి ఉన్నాయి. మడత పెట్టకుండా లోపల చుట్టిన చద్దర్లు బయటికి తన్నుకొని వచ్చాయి. ఒక కన్ను కనబడితే ఇంకోటి కనబడని ఆ చిన్న అద్దంలో తనను తాను చూసుకుని మురుసుకున్నాడు. ఏ రాత్రి పుట్టిందో ముక్కు పక్కన చిన్న ముత్యపు మొటిమ! చేతుల్తోనే తల దూసుకుని, ఇంకా పూర్తిగా రాని మీసాలను తృప్తిగా తీడుకున్నాడు. బయటికి నడిచేవాడల్లా మళ్ళీ బ్యాగు దగ్గరికి వెళ్ళాడు. తెలియకుండానే గుండె వేగం పెరిగింది. ఇప్పుడు ఇది అవసరమా అని ఒక క్షణం అనిపించింది. కానీ అక్షరాలను వాక్యాలుగా పేర్చగలిగిన తన సృజన కొంత ఆత్మవిశ్వాసం కలిగించింది. దానికితోడు ఒక సాహసానికి ముందుకు తోస్తున్న ప్రాయపు మత్తు. ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకుని, తెల్ల కాగితాన్నే జాగ్రత్తగా మడిచి కవర్‌లాగా చేసినదాన్ని బయటికి తీశాడు. దాని పైన ఎడమ మూల, కింద కుడి మూలల్లో ‘నీకు, నేను’ అని రాసివుంది. ఆ రెండు పదాలను తమ ఉనికితో సజీవం చేయగలిగే ఇరుమూర్తుల సాన్నిహిత్యం గొప్ప తీపు పుట్టిస్తుండగా, దాన్ని అడ్డంగా మడిచి జేబులోకి మునిగేలా పెట్టుకుంటూ ఉత్సాహంగా బయటికి నడిచాడు.
తడి ఆరడం కోసం గోడకు ఏటవాలుగా పెట్టి వచ్చిన స్లిప్పర్లు పడిపోయి వున్నాయి. ఈలోపే ఎవరో వాటిని వేసుకునెళ్ళి, మళ్ళీ తడివి అక్కడ వదిలివెళ్ళారు. అరె, వీటిని ఎవరైనా తొడుక్కోవచ్చని ఎందుకు అనుకుంటారో! అడుగు వేసినప్పుడు మట్టిని అంటించుకోకుండా పాదాన్ని చెప్పు మీద అద్దుతూ తిరిగి ఆ తడిని గడ్డికి రుద్దుతూవుంటే నజీర్ కనబడ్డాడు. ఏదో అద్భుతమైనది చూస్తూ వస్తున్నట్టుగా కనబడుతున్న నజీర్ నవ్వు ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూస్తుంటే – “ఏందోయ్, నువ్వు మర్రికాడికి పోలేదా?” అని మందలించాడు.
“అటే” అన్నాడు ఇంకా ముఖం వైపే చూస్తూ, ఆ ముందటి నవ్వుకు ఏమైనా జవాబు దొరుకుతుందేమో అన్నట్టుగా.
“యాట తెగినట్టుంది గదా.” వెనక వైపు తల ఎగరేస్తూ అన్నాడు నజీర్.
‘స్‌స్‌స్‌స్…’ అదెట్లా మరిచిపోయానా అన్నట్టుగా కనబడిన రంగారెడ్డి ముఖంలోని వెలుగు నజీర్ కళ్ళలో ప్రతిఫలించింది.
ఎన్.ఎస్.ఎస్. క్యాంపుకు పేర్లు రాసుకుంటున్నట్టు కాలేజీలో ఎవరో చెప్పారు. ఎ, బి, సి మూడు సర్టిఫికెట్లుంటే జాబుల్లో ప్రిఫరెన్సు ఉంటుందట. డిగ్రీలో ఇచ్చేది సి. ముందు రెండు లేవు కాబట్టి, దీనితోటి లాభం లేదని రంగారెడ్డి మిన్నకున్నాడు.”‘క్యాంపుకట పోదామారా?” అన్నాడు రాములు, రూము బయటినుండే కూరగాయల సంచీ చేతికిస్తూ.
“మల్ల టమాటలు తెచ్చినవారా?”
“కిలో రెండు రూపాయల్రా. బొక్కకూర తెమ్మంటావురా మరి.”
రాములుకు ఎ, బి, రెండు సర్టిఫికెట్లు ఉన్నాయి. రంగారెడ్డి నుంచి జవాబు లేకపోతే మళ్ళీ రాములే ఎగేశాడు: “క్యాంపురా… ఆఖర్రోజు తినాంత మటన్ వెడుతర్రా.” రంగారెడ్డి తన చెంపల్లో ఏదో అణిచేసుకున్నాడు. రాములు కళ్ళల్లో ఒక దొంగను గుర్తుపట్టిన నవ్వు.
తెలియకుండానే గుటకలు మింగాడు రంగారెడ్డి. ముక్కుతో మాంసపు ఉనికిని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తూనే, ఊరిలోకి పోయే బాట వైపు తిరిగాడు. తోడు కోసమే అక్కడ వేచివున్నట్టుగా నజీర్ అనుసరించాడు.
“రాములు ఎటు వోయిండో చూశినవా?”
“అదే, ఆ గుట్ట మీద ఏదో గుడి ఉందట గదా, ఆడికి పోతున్నం అనినుండె.”
‘స్‌స్‌స్‌స్…’ ఇదికూడా మర్చిపోయానే అనుకున్నాడు. కానీ రెండు పూర్తి భిన్నమైన ‘స్‌స్’లు.
“లాస్టు రోజు పోదం అనుకునుంటిమి; కానీ ఈ మీటింగొకటి అడ్డమచ్చింది.”
“తిన్నంక పోదామేంది? నేను గూడొస్త.”
“తిన్నంక ఎట్లవోతం?”
రంగారెడ్డి అలా ఎందుకన్నాడో నజీర్‌కు వెంటనే అర్థం కాక, చిన్న గ్యాపుతో తలాడించాడు ‘అవును గదా’ అన్నట్టుగా.
రేపు ఎట్లా ఎల్లిపోతమని ఆ సుధాకర్‌గాడు, రామస్వామి గిట్ట రాత్రంత పాటలు వాడుడు మొదలువెట్టకపోతే పొద్దున్నే లేద్దుము.” నజీర్‌ను కూడా కలుపుకుని సర్దిచెప్పుకున్నాడు రంగారెడ్డి. “ఈ ఊరికి మళ్ళెప్పుడొస్తం? ఎందుకొస్తం?”
“ఆ సుధాకర్ గూడ వోయిండు తెలుసా, వాళ్ళతోటి.”
“వాడు రాక్షసుడు. అంతటా ఉంటడు.”
రంగారెడ్డికి ఏదైనా పరిహారం చెల్లిస్తే బాగుండన్నట్టుగా, దుకాణం దగ్గరికి వస్తూనే, “టైమున్నది గదా, ఒకటి గుంజుదమా?” రెండు చేతివేళ్ళ ఏటవాలు సైగతో అడిగాడు నజీర్. అరుగు మీద కూర్చున్నవారు వీళ్ళను పది రోజులుగా చూస్తూనే ఉన్నారు. కళ్ళల్లో ఆ గౌరవం తెలుస్తోంది. నజీర్ దుకాణం వైపు వెళ్ళాడు.
తోవలోనే నిల్చున్న రంగారెడ్డిని “ఎన్నింటికట మీటింగు?” అరుగు మీద కూర్చున్నవాళ్ళలో ఒకాయన అడిగాడు. “ఇప్పుడు అయితది, ఇంకేంది.” కదులుమన్నట్టుగా ఆయనకు జవాబిచ్చి, “అగ్గిపుల్ల మరిచిపోకు.” నజీర్‌ను ఉద్దేశించి గట్టిగా చెప్పాడు రంగారెడ్డి.
వాళ్ళు దేనికోసం ఆగారో తెలిసిన ఆ ఊరి మనిషి కళ్ళల్లో చిన్న మార్పు, ఇందాకటి గౌరవంలోంచి ఒక వీసమెత్తు తగ్గినట్టుగా.
వాళ్ళు పెద్ద దారి వెంట పోకుండా చిన్న సందులోంచి ఇండ్లు లేని వైపు తిరిగారు. వేపచెట్టు కింద ఉన్న గుండ్ల మీద విశ్రాంతిగా కూర్చున్నారు. దుకాణంలో చింపుకొచ్చిన అగ్గిపెట్టె చిన్నపక్క భాగంలోని చిన్నముక్క మీద ఒడుపుగా అగ్గిపుల్లను గీకుతున్న నజీర్‌నే రంగారెడ్డి తదేకంగా చూస్తున్నాడు. మూడో ప్రయత్నంలో బర్రున వెలిగింది. విజయవంతం అయిందన్నట్టుగా నజీర్ చిన్నగా నవ్వాడు. కానీ ఆ ముఖపు ముడతల్లో అది ఎక్కడో ఇరుక్కుపోయింది. ప్రమాదవశాత్తూ కాలడం వల్ల ముఖం మీద తెల్లమచ్చలు, కొద్దిగా వెనక్కి లాగిపట్టినట్టుగా ఉన్న చెంపలు, దాంతో ముందుకొచ్చినట్టుండే మూతి.
పొగ వదిలి, మెడను వాళ్ళు ఇందాక వచ్చిన తోవవైపు ఎగరేస్తూ అన్నాడు నజీర్: “నువ్వు అబ్బాస్ లెక్కున్నవట; దుకాణంల పిలగాడు అంటుండు.”
ఆ మాట రంగారెడ్డి యవ్వనానికి ఒక సర్టిఫికెట్‌లా తగిలింది. నీలిమ దగ్గరికి పోవడానికి కొంచెం ధైర్యం వచ్చింది. “పిలగాడు ప్రేమదేశం చూసినట్టున్నడు.” పెద్ద విషయం కాదన్నట్టుగా కొట్టేశాడు. కానీ తీక్షణమైన ఆమె చూపుల మైకంలోకి జారబోతున్న రంగారెడ్డిని, భవిష్యత్ వైపు సంభాషణను మళ్ళిస్తూ వర్తమానంలోకి గుంజుకొచ్చాడు నజీర్.
“ఎలక్ట్రానిక్స్ అంటే ఏం జేస్తవు? అటు ఎమ్మెస్సీకి వోతే మళ్ళ ఫిజిక్స్‌ల వచ్చేదే అండ్ల సదువుతువు; నీకు అటు మ్యాస్, ఇటు ఫిజిక్స్ రెండే ఉంటై. కెమిస్ట్రీ ఆప్షన్ వీకినట్టే.”
“ఈ మాట జాయిన్ అయినప్పుడు ఎవడు జెప్పకపాయె. నువ్వు ఆర్ట్సుగానివి; నీగ్గూడా ఇంత తెలుసా?” టీజ్ చేస్తున్నట్టుగా అని, నజీర్ చేతిలోంచి అందుకుని నోట్లో పెట్టుకోబోతూ, అంతకుముందున్న ఫిర్యాదునే రిపీట్ చేశాడు. “నీకు తడి అంటియ్యకుండ తాగరాదు గదా.”
తల గోక్కున్నాడు నజీర్. “నీకు మొదాలు ఇచ్చేదుండే. నీ తీర్గ నాకు ఉమ్ము అంటకుంట తాగొస్తలేదు.”
రంగారెడ్డి విలాసంగా పీల్చాడు. చిన్న దగ్గొచ్చింది. కానీ హీరోలెక్క అనిపించింది. తనవైపే చూస్తున్న నజీర్‌కు చెప్పకనే చెప్తున్నట్టుగా, పెదవుల కొసల్ని చిన్నగా లోపలికి వంచి చూపించాడు. దాన్నే రిపీట్ చేయడంతో నజీర్ మూతి మరింత ముందుకు పొడుచుకు వచ్చినట్టయి రంగారెడ్డికి నవ్వొచ్చింది.
కాలిన నజీర్ ముఖాన్ని తేరిపార చూడటానికి రంగారెడ్డి మొదటిరోజు ఇబ్బందిపడ్డాడు. అప్పటికే అది తన జీవితంలో ఒక వాస్తవమైపోయిన నజీర్ అలాంటివాటిని గమనించినా అవమానంగా తలచని స్థితికి వచ్చేసివున్నాడు. దాన్నే గుర్తు చేస్తున్నట్టుగా- “నిజం చెప్తున్న. నీ ముఖం జూసుకుంట ఇట్ల నీ ముందట కూసుంటా అని మాత్రం నేను అనుకోలేదు.”
“ఏదైనా అలవాటువయా. అందుకే దీన్ని శ్రమదానం అనుడు గాదు, ప్రేమదానం అనుకుందాం.” సరదాగా అంటూ రంగారెడ్డి వైపు చేయి సాచాడు.
ఆ మాట మరి దేనికో తగిలినట్టయిన రంగారెడ్డిలో మళ్ళీ తెలియని భయం ప్రవేశించింది. తెలియకుండానే జేబు మోస్తున్న బరువు స్పృహలోకి వచ్చింది. ఊహల్లో ఉన్నదాన్ని వాస్తవంలోకి తేవడానికి తను పెట్టుకున్న గడువు మరీ దగ్గరగా ఉందేమో అనిపించింది. కాలేజీలో చేయలేని ధైర్యం క్యాంపులో మాత్రం వస్తుందా? ఇది కొంత ఇన్‌ఫార్మల్‌గా ఉండగలిగే జాగా కావడంతో ఆ చొరవకు ఎక్కువ వీలు ఉంటుందనిపించింది.
వీళ్ళు వెళ్ళేసరికి మర్రిచెట్టు దగ్గర హడావుడిగా ఉంది. చెట్టు చుట్టూ కట్టివున్న గద్దెకు ఆనుకుని రెండు టేబుళ్ళు, నాలుగు కుర్చీలు వేసివున్నాయి. స్వాగతం చెబుతూ బ్యానర్ కట్టివుంది. క్యాంపువాళ్ళు, ఊరివాళ్ళు పోగవుతున్నారు. పక్కనే ఎల్లంపల్లి క్యాంపులో ఉన్న అమ్మాయిల్ని తోలుకరావడానికి వ్యాను పోయినట్టు తెలిసింది. పరిచివున్న జంపుఖానాల మీద క్యాంపు నిర్వాహకులుగా ఉన్న మల్లారెడ్డి సార్, దామోదర్ సార్ చుట్టూ కొంతమంది గుమికూడి కూర్చున్నారు. అదేరోజు కాలేజీ నుంచి వచ్చివున్న కొందరు లెక్చరర్లు కూడా వాళ్ళలో కనబడుతున్నారు. వాళ్ళలో కళ్ళతోటి దేవులాడితే రాములు కనబడలేదు. అవే కళ్ళను నీలిమ వచ్చే తోవ వైపు పెట్టివుంచాడు రంగారెడ్డి. అయినా రోజూ నడిచినట్టే నడుస్తున్న చర్చలు చెవులకు తగులుతూనే ఉన్నాయి.
‘మా అన్న పటాన్‌చెరువుల జాబ్ చేసినుండె. అక్కడ వాళ్ళ షిఫ్ట్ ఇంచార్జ్ జయలక్ష్మి అని ఉండెనట. మీరు అనాగరికులు; అన్నీ మేమే నేర్పిచ్చినం అన్నదట సార్.’
‘ఒగల్నుంచి ఒగలు మనుషులు నేర్సుకుంటనే ఉంటరు; వాళ్ళు నేర్పిచ్చినం అనంగనే మనం ఉరుకులాడుడు ఎందుకు?’
‘మన భాషను ఖూనీ జేస్తరు. విలన్లకు వెడుతరు.’
‘ఇయ్యాలనుకోంగనే రేపు మారుతాదయ్యా. విలన్లన్నా రియల్‌గా మాట్లాడుతున్నరు, అందుకు సంతోషపడాలె గదా. సగం రియాలిటీ అయిందిగదా.’
‘మీరు అని అనుడేంది సార్? మనకు అలవాటు లేని పని!’
‘అది మర్యాదావాచకమే గదా. మంచిదేగదా భాష మంచిగైతే.’
‘మీరేమన్న జెప్పుండ్రి సార్. వాళ్ళది వేరే, మనది వేరే.’
‘మీ బాపమ్మ మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతవా? సుదువుకున్నోడు వేరు, సదువుకోనోడు వేరు. నీకోటి జెప్త సూడు. అబ్బో అది బాగ లాంగు అంది మొన్న మా అవ్వ. ఆ మాట ఏడికేలో ఆమె చెవ్వుల వడ్డది. మాట్లాడుకునే భాష మారుతనే వుంటది.’
‘ఎంతైనా తెలుగోళ్ళం తెలుగోళ్ళమేగద సార్, విడిపోతే ఎట్ల?’
‘నీ రమ్యకృష్ణ ఏడికి వోదు తియ్యిరా. నువ్వీడుండిగూడ సినిమాలు జూడొచ్చు.’
ఆ మాటల్ని అదుపులో పెట్టడానికే అన్నట్టుగా వ్యాన్ చప్పుడైంది. అమ్మాయిలు ఒక్కొక్కరే వాళ్ళవైపు రాసాగారు. అందాకటి వాదనలు ఏ కొలిక్కి రాకుండానే సమాధానపడ్డట్టుగా మౌనంలోకి ముడుచుకున్నాయి. వాళ్ళకోసం వేసివుంచిన జంపుఖానాలో అమ్మాయిలు కుదురుకున్నాక, అప్పటిదాకా ఆవరించిన నిశ్శబ్దం తొలగి మళ్ళీ మాటలు మొదలైనాయి.
కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని చూస్తున్న రంగారెడ్డికి నీలిమ ఎక్కడా కనబడలేదు. తను క్యాంపుకు వచ్చిందా? వస్తుందనే అన్నారు. కొంచెంసేపు చూసి ఒంటేలుకు లేచినట్టుగా వ్యాన్ వైపు వెళ్ళాడు. దాన్ని ఒక పక్కకు పెట్టుకుని డ్రైవర్ తాపీగా బీడీ కాలుస్తున్నాడు. అసలైన మీటింగ్ మొదలైనప్పుడు కూర్చుందాం అన్నట్టుగా కొందరు అంచుల పొంటి తిరుగుతున్నారు. ఇక్కడిదాకా వచ్చిన మనిషి ఇక్కడ ఆగిపోతుందా? రాకపోవడం వల్ల నిరాశ, వెంటనే చేయాల్సిన సాహసం లేకపోవడంతో రిలీఫూ రంగారెడ్డిలో ఏకకాలంలో కలిగాయి. అంతకుముందున్న బిగిసినతనం పోయి శరీరం తేలికైంది. మళ్ళీ వచ్చి కూర్చునేప్పటికి, అందాకటి చర్చకు ముక్తాయింపుగా అన్నట్టుగా, కాలేజిలో కవి సుదర్శన్ సార్ అని పిలుస్తారు, ఆయన చెప్తున్నాడు: “ఇది మనసుల వెట్టుకోండ్రి; ఇప్పుడు అందర్ని సదువులు, ఉద్యోగాలు ఇడిశిపెట్టి ఉరుకుమనిగాదు. ఆలోచన జెయ్యిండ్రి. ఉద్యమం రూపుదిద్దుకున్నంక అందరు మీకు సాధ్యమైనట్టుగా అండ్ల షరీక్ గాండ్రి. ముందైతే మీకు మీరు కన్విన్స్ గావాలె. అది ముఖ్యం జూడు.”
ఆ మాటలకు స్పందనగా రంగారెడ్డి తన ఆలోచనలను మనసులో పేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడే చిన్న కలకలం మొదలైంది. ఒక గుంపు వెంట రాగా ముఖ్యఅతిథి నేరుగా వాళ్ళు కూర్చున్న దగ్గరికి వచ్చేశాడు. రాగానే ఎవరో దండలెయ్యబోతే వద్దన్నాడు. ‘మనిషికి ఒకటే ఒక్కసారి దండలేస్తరు, అది శవం మీద; నన్ను శవాన్ని జెయ్యద్దు’ అన్నాడు. అందరు ఒకటేసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. ఉన్నట్టుండి వాతావరణం హుషారెక్కింది. గుసగుసలు మొదలైనాయి.
‘అరే, మస్తు చెప్పిండు గదా.’
‘పిల్లగాండ్లతోటి అట్ల మాట్లాడుతనే నచ్చుతదని అన్నడు గావచ్చు.’
‘ఈయిననా?’ ఊహించుకున్న రూపానికీ, ముందున్న విగ్రహానికీ పొంతన కుదరక రంగారెడ్డి కొంత విచిత్రపడ్డాడు.
సభా మర్యాదలు పూర్తయినంక దామోదర్ సార్ మొదాలు మాట్లాడాడు: “మనం పది రోజుల కింద ఈ ఊరికి వచ్చినప్పుడు ఎట్లుండె? మెయిన్ రోడ్డు కాడ దిగి రెండు కిలోమీటర్లు లోపలికి నడిచచ్చినం. బండ్ల మీద వచ్చినోళ్ళు ఎట్ల తిప్పలు వడ్డరు? రాళ్ళు, జిబ్బులు అన్ని వోయి ఇప్పుడు ఊరు అద్దం లెక్కయింది. ఇగ రేపు మాపు ఊళ్ళకు బస్సు గూడ నడుస్తది. వాళ్ళు కూరగాయలు, పాలు అమ్ముకునెటోళ్ళు గావచ్చు; చదువుకునేటోళ్ళు గావచ్చు; ఆపతికీ సంపతికీ వేరేకాడికి పోయేటోళ్ళు కావచ్చు–వాళ్ళకు ఎంత మంచి సదుపాయం అయితది! ఊరోళ్ళు బస్సెక్కినప్పుడల్లా గా సిద్దిపేట కాలేజోళ్ళు శ్రమదానం తోటి తొవ్వలు సాఫు జేసిపోయిన్రని మిమ్ముల్నే యాజ్జేసుకుంటరు సూడుర్రి.” ముగించగానే మరోసారి గట్టిగా చప్పట్లు పడ్డాయి.
తర్వాత ఇవ్వాళ్టి మన ముఖ్య అతిథి మాట్లాడుతారంటూ మైక్ అందజేసే విరామంలో–”స్లిప్పర్ల మీద టక్కులేసే సారంగా…” ఒక రకమైన వెక్కిరింతతో పాడే గొంతుతో అనుకుంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు సుధాకర్. ఆ ఎడ్డిచ్చుడు అప్పటికే వాళ్ళకు సాధారణం కావడంతో రంగారెడ్డి దానికి ఏమీ స్పందించలేదు గాని, తెలియకుండానే సుధాకర్‌తో ఉండాల్సినవాళ్ళ కోసం వెనక్కి తిరిగాడు. ఎప్పుడొచ్చి కూర్చున్నారో స్వామి, రాములు ఏదో మాట్లాడుకుంటున్నారు.
“నీకు చెప్పద్దనుకున్నగనీ నాకే నోరాగక చెప్తున్నరా. నీలిమ ఎవ్వలితోటో లేచిపోయిందట.” అది తెలియని ఉత్సాహమో, కేవలం సమాచార మార్పిడో ఆ గొంతులో పోల్చుకోలేకపోయాడు రంగారెడ్డి. తనలో ఉన్న నిజమైన ఫీలింగ్ ఏమిటో కూడా తేల్చుకోలేకపోయాడు. ఉన్న సభకూ, విన్నదానికీ రెండు వేర్వేరు ప్రపంచాల అంతరం ఉంది. ఏనాడూ పరిచయం చేసుకొనే ధైర్యం చేయలేదు. తన పేరు కూడా ఆమెకు తెలుసో లేదో. కానీ తనచుట్టూ ఉండే నలుగురైదుగురు స్నేహితులకు తన ఐడెంటిటీల్లో అది కూడా ఒకటి. కానీ దీనికి ఎలా స్పందించడం? ఒక సబ్బు బుడగ చిట్లిపోయినట్లు… నిర్మాణం తలపెట్టకముందే అందమైన స్వప్నం కూలిపోయినట్లు… గట్టిగా బాధ పడటానికైనా తనకు ఏమైనా అధికారముందా? అయినా జరుగుతున్న సభ గురించి కాసేపు ధ్యాస లేకుండా పోయింది.
అయిపోగానే అందరూ ఎక్కడిదక్కడ వెళ్ళిపోయారు. భోజనాలను ఇవ్వాళ పంచాయితీ భవనం పక్కన ఉన్న ఖాళీ జాగాలో ఏర్పాటు చేసినట్టుగా సభానంతరం అనౌన్సు చేశారు. కలిసి వచ్చినవాడు కలిసి పోవడం మర్యాద అన్నట్టుగా రంగారెడ్డి కోసం నజీర్ ఆగివున్నాడు.
వీళ్ళు పోయేసరికి ఎట్లా మొదలైందో భోజనాల దగ్గర పెద్ద లొల్లి జరుగుతోంది. “హలాల్ జేసిన కూర మాకెట్లవెడుతరు సార్?” అని రాములు అడుగుతున్నాడు.
“ఏదో ఆఖరినాడు అందరు సంబురపడుతరని వండిస్తే మీరొకటి మొదలువెడితిరి!” మల్లారెడ్డి సార్ కోప్పడుతున్నాడు.
“సంబురపడ్డం సార్. కానీ అందరం తినేకాడ ఇంకో పద్ధతిని ఎందుకు తెచ్చిన్రు మీరు?”
“అరే, కొబ్బరికాయ గొట్టి పని మొదలు వెట్టమా? అట్లనే అనుకో. చెయ్యకపోతే ఆ పిలగాడు నేను తినా అనే. అందుకని చేయిమన్న.”
“చేస్తే నేను తినా అంటున్న!” పల్లాన్ని గ్లాసుతో కొడుతూ స్వామి అందుకున్నాడు.
పరిస్థితి వేరే తలంలోకి పోతున్నట్టు అనిపించింది. అప్పటికే తినడం మొదలుపెట్టినవాళ్ళు కొందరు నమలడం ఆపేశారు. వడ్డన కోసం వరుసలో నిల్చున్నవాళ్ళు ఇది ఎటు తేలుతుందా అన్నట్టుగా వాళ్ళ వైపు చూస్తున్నారు. ఇదేమీ పట్టనట్టుగా కొందరు తింటూనే ఉన్నారు.
‘ఒక్కడి కోసం తొంబైతొమ్మిది మంది త్యాగం జేసుడే నిజమైన మానవత’ అని మల్లారెడ్డి సార్… ‘మరి తొంబైతొమ్మిది మందికోసం ఒక్కడు త్యాగం జేస్తే ఏమైతది సార్’ అని రాములు…
అసలే అర్థంకాని అవస్థలో ఉన్న రంగారెడ్డి మరింత గందరగోళంలో పడ్డాడు. తేరిపారగా నజీర్ ముఖం వైపు చూడబుద్ధి కాలేదు. కానీ ఆ పిలగాడు నజీర్ మాత్రం అయివుండడని బలంగా అనిపించింది. మాంసం కూర కూడా ఏమాత్రం ఉత్సాహం కలిగించని సందర్భం రంగారెడ్డి జీవితంలో అదే మొదటిది. కానీ దానికి కారణం ఏమిటో తనకే స్పష్టంగా తెలీదు.