నలభై

నా వయసును ఎందుకో పెంచి చెబుతున్నారేమో అనిపిస్తుంటుంది. మరీ అంత వెనక్కి నేను పుట్టలేదేమో, లెక్కలు వేయడంలో ఏదైనా తేడా జరిగిందేమో. ఎంత అనుకున్నా ఒక స్థిరం రాదు. కానీ సంవత్సరాలుగా తరచిచూస్తే మళ్ళీ అంతా సరిగ్గానే ఉందనిపిస్తుంది.

నేను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం 2008లో మొదలైంది. అదొక వాస్తవం. దానికి సంబంధించిన డేట్‌ ఆఫ్‌ జాయినింగ్‌ రిపోర్టుల్లాంటివేవో ఉన్నాయి. అంతకుముందటి ఉద్యోగం 2003లో మొదలైంది. దాన్నీ కాదనలేను. ఆ ఉద్యోగంలో చేరిన రోజుల్లోనే నా చేతిలోకి మొబైల్‌ ఫోన్‌ అనేది వచ్చింది. ఇంకా వెనక్కి వెళ్తే అధికారికంగా నా తొలి ఉద్యోగం అనుకునేది 1999లో మొదలైంది. దాని తాలూకు పే–స్లిప్స్‌ కూడా నా దగ్గర చాలా రోజులు ఉండేవి కాబట్టి, ఇదీ నిజమే. జీతం అనేది ఒకటి జీవితంలో మొదటిసారి అందుకోవడమూ, అందరమూ ఆ మొదటి తారీఖు రాగానే అకౌంట్స్‌ సెక్షన్‌ ముందు వరుసగా నిలబడటమూ, వాళ్ళు ఒక్కొక్కరినీ రెవెన్యూ స్టాంపులు అంటించిన రిజిస్టర్‌లో సంతకం పెట్టించుకుని, టేబుల్‌ మీద పరిచిన నోట్ల కట్టల్లోంచి మనకో కొన్ని కాగితాలు చిల్లర పైసలతో సహా లెక్కించి చేతికి ఇవ్వడమూ; కొన్నాళ్ళు పోయాక చెల్లింపుల్ని కొంత నాగరికపరిచి, ముందే అందరి డబ్బుల్నీ ఎవరి కవర్లో వాళ్ళకు వేసి పిన్‌ చేసి ఉంచడమూ; అదీ పోయి అందరితో బ్యాంకు అకౌంట్లు తెరిపించి అందులో వేయడమూ, ఆ ఒకటో తారీఖు కంపెనీలో కట్టే మా వరుసలు కాస్తా అలా బ్యాంకులోకి మారడమూ, ఎప్పుడైనా ఎక్కడైనా డబ్బులు తీసుకోగలిగేలా ఆ ఏటీఎం కార్డులతో కొత్త ప్రైవేట్‌ బ్యాంకు రంగప్రవేశం చేయగానే మా కంపెనీ మా అకౌంట్లను అటు మార్పించేదాకా మా వేతనపు క్యూలు కొనసాగడమూ; ఇవన్నీ నేను చూశాను.

ఇంకా ముందుకు వెళ్తే, మీ టెన్తు బ్యాచి ఏది అనేదాన్ని బట్టి మీరు ఎప్పటివారు అనే అంచనాకు వస్తారు. నాది 93 మార్చ్‌. కీసరగుట్ట స్కూల్లో నాకు వచ్చిన మార్కులను ఒక బోర్డు మీద రాసిపెట్టారు. దాన్నయితే చెరపలేను. ఇంకా వెనక్కి, వెనక్కి వెళ్తే సాధికారికంగా సంవత్సరం అంటూ ఒకటి చెప్పగలిగేది దేశంలో ఒక ప్రధానమంత్రిని మొదటిసారి హత్య చేసిన విషయం తెలిసినప్పుడు నేను మా అత్తమ్మవాళ్ళింటికి చుట్టంగా వెళ్ళాను. పెద్దవాళ్ళేదో దాని గురించి మాట్లాడుకుంటున్నారు. 1984 అనేది తర్వాత్తర్వాత జీకే ప్రశ్న అయ్యింది కాబట్టి, ఇంతవరకూ నన్ను సంవత్సరాలుగా ట్రాక్‌ చేసుకున్నాను. కానీ ఈ కాలం నాటికే ఒక వార్తను గ్రహించే వయసు నాకుంది. మరింకా వెనక్కి నేను పుట్టింది, పెరిగింది అదేం చేయాలి?

మా ఇంట్లో పొద్దు గూట్లో పడగానే చెమ్మల మీద కిరోసిన్‌ దీపాలు పెట్టేది పోయి, కరెంట్‌ వచ్చింది గుర్తుంది. పొలాలకు నీళ్ళు పెట్టడానికి ఎడ్లతో కొట్టే రాట్లు పోయి, మొదట ఇంజిన్‌ మోటార్లు వచ్చి, అటుపై వాటిని కరెంట్‌ మోటార్లు ఆక్రమించుకోవడం గుర్తుంది. ఇప్పుడు ఆ ఎడ్లతో నడిచే నాగళ్ళు పోయి ట్రాక్టర్లు రావడము, బావుల స్థానే బోర్లు రావడమూ చూస్తున్నాను. రోళ్ళల్లో దంచడం పోయి, ఊళ్ళో మొట్టమొదటి గిర్నీ పడటం గుర్తుంది. మా అమ్మమ్మ ఊరికి సవారీ కచ్రాల్లోను, నడిచీ పోవడం గుర్తుంది. చాయ్‌ పత్తాకు బదులు కాట్లు పెట్టిన బిళ్ళలు వాడటం గుర్తుంది. ఊళ్ళో ధోవతులు, రుమాళ్ళు తప్ప ప్యాంట్లు అనేవి కనబడని రోజులు గుర్తున్నాయి. గల్ఫ్‌ దేశాలకు వెళ్ళినవాళ్ళ బంధువులు ఎవరైనా మా బాపుతో ఉత్తరాలు రాయించుకోవడం చూసిన మురిపెం నుంచి ఈ–మెయిల్‌ అనేది క్రియేట్‌ చేసుకోవడమూ, దాన్ని మొదటిసారి మధుకు పంపి ఎలా చేరిందా అని ఆశ్చర్యపోవడమూ నుంచి, బ్లాగులు, ఫేస్‌బుక్, నెట్‌ఫ్లిక్స్‌ దాకా సాంకేతిక ప్రయాణం చేస్తూ వస్తున్నాను. ఇవేవీ కాదనలేను. అంటే నేను ఎంత గింజుకున్నా, ఎంత తొక్కిపట్టినా ఒకటి రెండేళ్ళు అటూయిటూ కాగలవే తప్ప ఏళ్ళకు ఏళ్ళు అయితే మాయం కావు. కాబట్టి నాకు నలభై ఏళ్ళన్నది ఏం చేసీ దాయలేను. ఇది నేను ఎదుర్కోవాల్సిన వాస్తవం.