“లంకమల దారుల్లో” వివేక్ లంకమల రాసిన ఇరవై ఒక్క వ్యాసాల సంకలనం. వీటిలో తన యాత్రానుభవాలనూ, తాను చూసిన ప్రదేశాల చారిత్రక భౌగోళికాంశాలనూ, తన వ్యక్తిగత ఆలోచనలనూ పంచుకున్నాడు. యాత్రాకథనాలూ, మ్యూజింగ్స్, చారిత్రక కథలూ మూడూ కలిసి ఉన్న పుస్తకమని చెప్పొచ్చు.
అడవిని ఆనుకొని ఉన్న ఊర్లో పుట్టి పెరిగిన వివేక్ తమ మిద్దె మీదినుండి ఒక్కో ఋతువులో ఒక్కోలా కనిపించే పడమటి కొండల్ని పరీశీలించేవాడు. అడవి గురించి పెద్దలు చెప్పే కథలు అబ్బురంగా వినేవాడు. చిన్నతనంలో, కాలేజీ రోజుల్లో ఒకట్రెండు సార్లు అడవికి వెళ్ళినా ఆకలికి, అలసటకూ తాళలేక తిరిగొచ్చేశాడు. చదువయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డాక కరోనా లాక్‌డౌన్‌తో ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. నాలుగు గోడల మధ్య బందీ అయిన ఆ సమయంలో స్వేచ్ఛ కావాలి అనుకున్నాడు. ఊహల్లో స్వేచ్ఛ, ఆలోచనల్లో స్వేచ్ఛ, భౌతిక స్వేచ్ఛ… ఆ స్వేచ్ఛా కాంక్షే అతన్ని అడవిలోకి తరిమింది. ఒక సాధారణ ఉద్యోగిని రచయితగా, అసాధారణ పథికుడిగా మార్చింది.
మొదటిసారి అడవిలోకి వెళ్ళినపుడు ‘అన్నాళ్ళు సమాజాన్ని చూసిచూసి, ఆ అలజడులకు ఆవల అడవి ప్రపంచం అద్భుతంగా కనిపించింది’ అన్నాడు. కనిపించిన ప్రతి చెట్టునూ పక్షినీ జంతువునూ నీటిచెలమనూ దారులనూ, పాడుబడిన బావులనూ, దారిలో ఎదురైన ప్రతిమనిషినీ జాగ్రత్తగా గమనించాడు. తిరిగిన దారుల గురించి తనకు తెలిసిన చరిత్రను గుర్తుచేసుకుని, తెలియని దాన్ని లోతుగా అధ్యయనం చేశాడు.
అలా ఆడవిపై మరింత ఆసక్తి పెరిగింది. మళ్ళీమళ్ళీ అడవిలోకి వెళ్ళాడు. దట్టమైన అడవిలో దారీతెన్నూ లేకుండా తిరిగాడు. చెట్లు, ఆకాశం తప్ప ప్రపంచంలో మరేమీ లేదన్నట్టుగా చూశాడు. ఓ క్షణంలో అకస్మాత్తుగా, తనను తాను వదులుకున్నాడు. ఒక ఆటవిక, పురాఆనందాన్ని పొందాడు. ప్రకృతిలో లీనమై తన మాటలకు భావుకత అద్ది కవిత్వం చెప్పాడు. చదివిన పుస్తకాల్లోని గొప్ప వాక్యాలను తలుచుకున్నాడు. ‘వెళ్ళిన ప్రతిసారి ప్రయాణంలో నాకు నేను కొత్తగా కనిపించేవాణ్ణి’ అన్నాడు. ఆ అన్వేషణలో అడవి వివేక్‌కి ఒక తాత్విక దృక్పథాన్నిచ్చింది.
చేసిన ప్రతి ప్రయాణ అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో రాయడంతో భావసారూప్యం ఉన్న అనేకమంది స్నేహితులయ్యారు. ప్రయాణాల్లో వారంతా ఒకరికొకరు తోడయ్యారు. అలా కరోనా కాలంలో అడవినీ, నీళ్ళనూ వెతుక్కుంటూ మొదలుపెట్టిన వీళ్ళ ప్రయాణాలు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి.
లంకమల, నల్లమల, వెలిగొండలు, పాలకొండలు, ఎర్రమల వంటి అడవులే కాక పెన్నా, సగిలేరు, చెయ్యేరు, పాపాఘ్ని, కుందూ వంటి నదులనూ, నదీ సంగమాలనూ వెతుక్కుంటూ తిరిగారు.
సోమశిల వెనుక జలాల్లో మునిగిపోయిన పన్నెండవ శతాబ్ధ కాలంనాటి గుండ్లమాడ శివాలయాన్ని చూడటానికి పడవలో చేసిన ప్రయాణం ఎంతో సాహసోపేతమైనది. రాజుల చెరువు, మల్లుగాని బండ, తురకల సరి, మొండి భైరవకోన వంటి చారిత్రక ప్రదేశాలను వెతికే క్రమంలో లంకమలలోని పాతరాతియుగపు ఆదిమానవుని రేఖాచిత్రాలను కనుగొన్నారు.
సోమశిల వెనుక జలాల్లో మత్స్యకారుల వలస జీవితాలను తడమడానికి వెళ్తూ ఆధార్ కార్డ్ కూడా లేని యానాదుల బతుకు కోసం పోరాడారు. అన్నమయ్య డ్యామ్ తెగి చెయ్యేరు పరీవాహక పల్లెలు వరదలో మునిగిపోతే సంవత్సరం దాటినా ఏ న్యాయమూ చెయ్యలేదని విమర్శనాత్మకంగా పోస్ట్ రాస్తే అది రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ చేరడం, ఆయన ఆదేశాలతో జిల్లా కలెక్టర్ స్పందించడం అక్షరాలకున్న విలువ తెలుపుతుంది. No Plastic Lankamala అంటూ ప్రకృతి పట్ల మనిషి బాధ్యతను గుర్తుచేశారు.
ఇలా పరిశీలనాశక్తి పెంచుకున్న వివేక్ రెండో పుస్తకం “వలపటెద్దు”. దీన్లో ఉన్న పదకొండు కథలూ వాళ్ళ చుట్టుపక్కల ఊర్లలో జరిగిన సంఘటనల చుట్టూ అల్లినవి. తను చూసిన, విన్న విషయాలను ఏ చిన్న అంశం వదలకుండా అందంగా వర్ణించటంలో మంచి ప్రతిభ చూపించాడు వివేక్. కథనంలో మంచి నాటకీయత ఉంది. లంకమల అడవుల్లోని చారిత్రక కథల్లోనూ వలపటెద్దు కథల్లోనూ ఆ నాటకీయతా, ఉత్కంఠతలే పాఠకున్ని వడివడిగా ముందుకు లాక్కుపోతాయి. ఎంత పెద్ద కథ అయినా అలవోకగా సాగిపోతుంది.
మొదటి పుస్తకంలో ప్రకృతి ప్రధానంగా ఉంటే, రెండో పుస్తకంలో మూగజీవాలది ముఖ్యపాత్ర. “రెండు ఎద్దులకు తలకాయ కొద్దిసేపు ఆనిచ్చాడు. వాటెకు ఏమి చెప్తాడో ఏమోగానీ ఆయప్పకు, ఆ మూగ జీవాలకే తెలియాల”. “పాణానికి పాణంగా చూసుకున్న ఎద్దుల కళ్ళల్లో నీళ్ళను చూసి తట్టుకోలేక అతని మనసు బేదిచ్చాంది” లాంటి మాటల్లో రైతుకూ, ఎద్దులకూ మధ్య అనుబంధం కనిపిస్తుంది.
ఓబుల్రెడ్డి ఎద్దులు కథలో రాజమ్మకు కానుపు కష్టమైతే “ఎద్దులబండి కట్టి రాళ్ళమిట్టన రొంచేపు తిప్పితే ఆ అదుర్లకు బిడ్డ క్యార్ మంటా బయటపడ్డా అంట” అంటుంది పెద్దవ్వ. అలా బండికట్టి బయలుదేరాక ఆ ఎద్దులకు ఎంత అలుపొచ్చినా, నోటినుండి నురగొచ్చి కడుపు ఉబ్బిపోయి నాలుక బయటపెట్టేంత పరిస్థితి వచ్చినా అవి మధ్యలో ఆగలేదు. వలపటెద్దుకు కాలి లాలం ఊడిపోయి రక్తం వస్తే యజమాని భుజం మీద కన్నీళ్లు కార్చింది, కానీ హాస్పిటల్ చేరే వరకూ ఎక్కడా ఆగలేదు. దీనిమీద ప్రేమతోనే ఏమో పుస్తకానికి వలపటెద్దు అని పేరు పెట్టాడు.
వలపటెద్దుకున్నట్లాంటి పట్టుదలే అంతర్లీనంగా పుస్తకంలోని ప్రతి కథలోని ఒక మనిషిలోనో, జంతువులోనో కనిపిస్తుంది. సగిలిసీమ నాయనలో, నాటుపడింది సంటెమ్మలో, యామయ్య గుర్రంలో, ప్రాణాలను అడ్డుపెట్టి సుక్కపడ్డను కాపాడిన రైతులో కనిపించేది ఈ పట్టుదలే. అలా వలపటెద్దు కథలు పోరాట తత్వాన్నీ, జీవితం మీద సానుకూల దృక్పథాన్నీ చూపించాయి.
“తాము కోల్పోబోతున్న అస్తిత్వ మూల్యం తెలియని బాల్యం గవర్నమెంటు వాళ్ళేసిన టెంట్లలో నవ్వుతూ ఆడుకుంటుంది” అంటాడు మునక గ్రామాన్ని ఖాళీ చేసే సందర్భంలో… ఆ పిల్లల భవిష్యత్తులో ఉండే బాధనూ లోటునూ ఏ కళ్ళతో చూశాడో ఈ రచయిత! ఇదే కథలో ఒక రైతు మునిగిపోతున్న ఊరు ఖాళీ చేస్తూ ఇంటి దగ్గర కట్టేసిన గేదెను మర్చిపోయాడు. ‘దాని ధర వచ్చేట్టు నేను చూస్తా’ అని ఎమ్మార్వో అంటే ‘ధరేసివ్వడానికి అదేమన్నా వస్తువా?’ అని ఏటికి ఎదురీది, ప్రాణాలు అడ్డుపెట్టి దాన్ని కాపాడి తీసుకొచ్చాడు. ఆ గేదె ఏ పరిస్థితిలో దొరికిందో కథలో మరో ట్విస్ట్. నాకు చాలా నచ్చిన కథ ఈ సుక్కపడ్డ. బుచ్చిబాబు వరద కథలో ఒక అమ్మాయి పాత్రతో ఎమోషన్ పండిస్తే వివేక్ ఈ వరద కథలో ఒక మూగజీవంతో పాఠకున్ని అంతగానే కట్టిపడేసాడు.
‘నెత్తర పొడి’ ఓ స్వచ్ఛమైన పల్లె మనసుల ప్రేమకథ. ప్రేమకథన్నాక విలనుండాలి కదా… కాశీగాడి ప్రేమకథకు మొదటి విలన్ నెత్తరపొడే. “గొల్లోండ్లిల్లల్లో నెత్తరపొడికి ఈ రకంగా మొహమోసినోన్ని నిన్నే సూచ్చాండా” అని కాబోయే మామ మాటతో లొల్లి మొదలై అనేక మలుపులతో కథ సుఖాంతమవుతుంది. సన్నివేశాల చిత్రణ బాగుంది. సినిమా రీళ్ళలా కళ్ళముందు తిరిగిపోయింది.
‘ఎవురో మనల్ని తక్కువగా సూచ్చాంటారు అని నిత్యం గొనుక్కునే తమలో కూడా ఎక్కువ తక్కువలుండాయనే’ అనుకుంటాడు గోలిగాడు ‘దున్నలు కుళ్ళేయి’ కథలో. మొండిపట్టుకు పోయి చిన్న గొడవ కులం గొడవగా మారుతుంది. చివరికి అందరూ ఆత్మాభిమానంతో ఎంతగానో కోరుకున్నదాన్ని వదిలేసుకుంటారు. అక్కడితో కథ ఆపేస్తే బాగుండేది అనిపించిది. తాగుడే ఈ గొడవకు, ఇంగితం కోల్పోవడానికి మూలం అని ముగించాడు. వివేక్ రచనల్లో తనకు అనిపించింది, చూసింది, విన్నది అన్నీ చెప్పాలనుకోడం కనిపిస్తుంది.
‘బాయిలో బొమ్మ’ భయపెట్టి చివరికి తత్వం చెప్తుంది. యానాదుల కథ ‘సీటాకు’, ఎర్ర చందనం కూలీ కథ ‘ఎర్ర మరకలు’ వాళ్ళ దీనస్థితినీ, వాళ్ళమీద జరిగే అమానుషాలనూ కళ్ళకు కట్టాయి.
ఈ పుస్తకంలోని రాయలసీమ వ్యవసాయానికి సంబంధించిన కథలు చదువుతుంటే పెన్నేటికథలు, కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణ కథలు గుర్తుకొచ్చాయి. కానీ వీటిలో ఒక తేడా మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించింది. అప్పటి కథల్లో ఉన్నంత బాధా కరువూ ఇప్పుడు లేనట్టుగా, కష్టపడితే ఎంతో కొంత మంచి ఫలితాలు ఉన్న ముగింపుతో కనిపించాయి. ఈ పోలిక కనిపించాక ఒకే రకమైన కథలు ఏం రాస్తాం అనుకోకుండా స్థల, కాలాలను నమోదు చేసేలా విస్తృతమైన సాహిత్యం రావాల్సిందే అనిపించింది. ఈ తరంవాళ్ళూ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా తమ మూలాల్లోకి వెళ్ళి పరిశీలించి రాయడం మంచి విషయం. తెలుగు కథలకు, సాహిత్యానికి ఢోకా లేదనేలా కొత్త తరం రచయితలు భరోసా ఇస్తున్నారు.
కథల్లో వివేక్ మాండలికం అద్భుతంగా ఉంది. కానీ కొన్నిసార్లు మాండలికం, శిష్ట భాష కలిపి ఉన్నాయి. అది సరిచేసుకుని, ఇంకా ఎక్కువగా చదివి తన పరిధిని పెంచుకుంటూ పోయి తన ఊహాశక్తికీ వాక్యానికీ మరింత పదును పెట్టుకుంటే ఇతను మాత్రమే రాయగలిగిన ఎన్నో కథలు, మరెంతో మందిని వెతుక్కుంటూ వెళ్తాయి.