కొన్ని సమయాలలో కొందరు మనుషులు

మిలటరీ నుండి రిటైరై వచ్చేసిన మా నాయన, నేను మునుపు 15 సంవత్సరాలుగా ఉంటున్న ఉమ్మడి కుటుంబం నుండి నన్ను వేరుచేసి తీసుకువచ్చి తన స్వంత చిన్నకుటుంబంలో పడేసి కుదేసిన ఆ ఇల్లు నాకు కొత్తది. అలా మనకో కొత్త ఇల్లు ఏర్పడి ఆ కొత్త ఇంటి ఎదురుగా ఒక పెద్ద పొడుగాటి ఇల్లు ఉండి, ఆ ఇంటిని ఆరు భాగాల చిన్న కొంపలుగా మార్చి వాటిని కిరాయికి ఇచ్చినపుడు, బిర్రున జరిగిపోతున్న కాలం మాదిరిగా ఆ ఇళ్ళల్లోకి వచ్చే మనుషులు, పోయే మనుషులు, కొత్త మనుషులు, పాతబడిన మనుషులు, రకరకాల జీవితాలు పరిచయం అవుతాయి కదా. నాకు అలానే పరిచయమయ్యాయి అక్కడి చాలా జీవితాలు. మహాదర్శకుడు హృషీకేశ్ ముఖర్జీ కనీసం పేరు కూడా తెలియక మునుపే అనేక ముసాఫిర్లను నేను ఆ చుట్టుపక్కల కనుగొన్నాను. నాకన్నా ఒకటో లేదా రెండో సంవత్సరాల పెద్దది అయి ఒళ్ళు అమ్ముకునే పంజరంలో ఉండే చిలక అనే అమ్మాయి. దుమ్ము నురగలో, గట్టి మట్టిపై ఈతకొట్టే ఒక సాయబు లారీ డ్రైవర్, ముని శాపం వల్ల నూనెపల్లె ఏకలవ్య నగర్‌కి వచ్చిపడి పాతకాగితాలు, ప్లాస్టిక్ సామాను అమ్ముకుని బ్రతికిన అప్సరస వంటి తిలోత్తమ, కుక్క కరిచి కుక్కలా వగురుస్తూ చనిపోయిన లావు బుగ్గల చిన్న బుజ్జాయి శీను, నెలకు అయిదు రూపాయల ధర్మాన్ని, దయను నమ్ముకుని సుదూరమైన ప్రాంతాల్లో భార్యాబిడ్డలని వదిలి ‘సలాం షాబ్’ అంటూ తలవంచి నమస్కరించే గూర్ఖా భయ్యాలు, వడ్రంగి పనిచేసి బ్రతికే ఒక అన్న, సన్నని చెక్కబద్దల్లాంటి ఆయన తలిదండ్రులు. ఎక్కడెక్కడి నుండి బయల్దేరి వచ్చి ఒక గదిలో రెండు మూడేళ్ళు కలిసి ఉన్న ఆరుమంది విద్యార్థులు, నా అంత వయసే ఉన్న ఒక చిత్రకారుడు రాము. మా ఇద్దరి కన్నా వయసు చిన్న, గుండెలు పెద్దవి కలిగి ఆ దారిన వెళ్ళే కుర్రకారునంతా రెండు కళ్ళతో ఆపేసే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, ఇంకా వారితో ఉండే ఆ అమ్మాయికి నాయనా, ఆ అమ్మాయి వాళ్ళమ్మకి పెనిమిటి కానీ టిపికల్ రాయలసీమ వేషభాషల ఒక మనిషి… ఇంకా గుర్తులేని ఎందరెందరో ముసాఫిర్లు.

మేము కొత్తగా కొన్న ఆ పాత ఇంటిని ఒకావిడ నుండి కొనుగోలు చేశాడు మా నాయన. ఆవిడది చక్కని రూపం. చక్కని రూపానికి మీదు మిక్కిలి కొలమానం వంటి సూది ముక్కు. ఆవిడది ఎంత సూదంటు ముక్కో చెప్పలేం. ఆ ముక్కు కింద పెదాలు ఎప్పుడూ నవుల్తూ ఉండిన తాంబూలం కారణంగా ఎర్రగా ఉండేవి. గొప్ప మానవ విగ్రహం, దానికి తగిన రూపం ఆవిడది. ఆవిడ పడుపువృత్తిలో ఉండేవారు. ఆ పనిలో చాలా డబ్బు, అనుభవం, వయసు మీరడం సంపాదించిన తరువాత బోలెడన్ని ఇళ్ళు, స్థలాలు, డబ్బు కూడబెట్టుకున్నారు. తన పని తను తగ్గించుకుని, ఎక్కువ పని చేయగలిగే వయసు, అవసరం, ఓపిక, ఆరోగ్యం ఉన్న అమ్మాయిలని చేరదీసి వారితో వ్యాపారం సాగించేవారు. నాకు ఆరోజుల్లో మా కొత్త ఇంటి దగ్గర 14 సంవత్సరాల వయసు మొదలుకుని 30 ఏళ్ళ వరకు ఉన్న అనేక రంగుల, రూపాల స్వశరీర వ్యాపారంలో ఉన్న ఆడవాళ్ళు కనపడేవారు. వారిని చేరదీసినావిడకు బిల్లా వంటి ఒక కొడుకు, రంగా వంటి ఒక మేనల్లుడు వుండేవారు. వారి కన్ను ఎప్పుడు తమపై పడ్డా ఆ ఆడవాళ్ళు తమ మాంసాన్ని వారికి ఉచితంగా అప్పగించేవాళ్ళు.

ఈ అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఉండేది. నాకప్పుడు పదహారు వయసు. దాదాపు నా ఈడు, లేదా నా పైన వకటీ రెండు ఏళ్ళు పెద్దది అవవచ్చు. ఆ అమ్మాయిని చిలక అని పిలిచేవాళ్ళు. నల్లగా ఉండేది ఆ అమ్మాయి. ఎంత అందమో ఆ నల్లని నలుపుది. ఒకవేళ ఏనుగు దంతం తెలుపు కాకుండా నల్లగా ఉండి ఉంటే ఆ అమ్మాయిలానే ఉండేది. ఒకనాడు నేను నీళ్ళు తెద్దామని బోరింగ్ పంపు దగ్గరికి వెళితే అక్కడ ఈవిడ ఉన్నారు. బిందె నింపుకుని ఎవరైనా సాయం చేస్తారా అన్నట్టుగా ఎదురుచూస్తూ ఉంది. నన్ను చూసి “సీనా ఈ బిందెత్తి పెట్టు” ఆంది. నేను బిందె ఎత్తి ఆ సన్నని నడుంపై ఆనించా. చూస్తే నడుంకి కాస్త ఆ పక్కన, పొట్టకి కొంచెం ఈ పక్కన కంట్లో చీమంత పుట్టుమచ్చ కనపడింది. అమ్మాయే రామచక్కని నలుపు అనుకుంటే ఆ మచ్చ ఇంకా చిక్కని నలుపు. ఎప్పుడయినా ఆ మనోహరి బొమ్మని నే వేయాల్సి వస్తే ఆ చేవనల్లని రంగు మీద ఇంకో నలుపు పుట్టు మచ్చ కనిపించేట్లు ఎట్లా బొమ్మ పోత పోయగలను? ప్రభూ, ఈశ్వరా, మాలిక్! నీ దగ్గరున్నన్ని సవాలక్ష నలుపు వర్ణాలు రెండే కళ్ళున్న నా వంటి మామూలు మానవుడి రంగుల పెట్టిలో అన్నీ నలుపు రంగులు ఎట్లా ఉంటాయి? అని అప్పట్లో నా బెంగ. దానిని దూరం చేసేందుకే అనుకుంటా దేవుడు నాకంత గొప్పగా బొమ్మల్ని, రంగుల్ని అబ్బనివ్వలేదు. అయితే అటువంటి చిలకమ్మాయి, ఇంకా ఇతర అమ్మాయి నెమళ్ళు ఉన్న రోజుల్లోనే మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగింది ఒక కుటుంబం. ఆ ఇంట్లోని అబ్బాయి పేరు రాము. నా వయసువాడే. మాటా మాటా కలిశాకా తెలిసింది తను ఆర్టిస్ట్ అని, బొమ్మలు వేస్తాడని. తన బొమ్మల్ని చూపించాడు కూడా. బోలెడంత పద్దతైన ప్రాక్టీసు, పోస్టర్ కలర్స్‌తో వేసిన చక్కని పెయింటింగ్స్. నేను థ్రిల్లైపోయా ఆ బొమ్మలు చూసి. ఆయన చెప్పినవే కొన్ని సలహాలు నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నవి. రంగు బొమ్మల్లో ఎప్పుడూ సరాసరి నలుపు రంగును నూటికి నూరుశాతం వాడకూడదు. కాస్త బ్రౌన్ కానీ ఎరుపు రంగుని కానీ కలుపుకోవాలి. ఇంకొకటి పోర్ట్రైట్‌లు వేయడం, ముక్కు మొహాలు తిన్నగా కుదర్చడం నేర్చుకుంటే చాలు. బొమ్మ వేసిన ఆ ఆమ్మాయి తలకు సితార, జ్యోతిచిత్ర, శివరంజని తదితర సినిమా పత్రికల్లో అచ్చు అయ్యే సినిమా తారల రకరకాల పోజులని ఆధారం చేసుకుని పూర్తి బొమ్మని వేయవచ్చు. పెరిగి పెద్దయి రాము పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అనుకున్నాను. అవలా. వాళ్ళ నాయనగారిలా వస్త్ర వ్యాపారంలో కుదురుకున్నాడని తెలియవచ్చింది.

నాకు మా ఈ కొత్త ఇంటి దగ్గరే నేపాలీ గూర్ఖాలు పరిచయం అయ్యారు. భలే నవ్వు మొహాలు వాళ్ళవి. బిడియస్తులు, స్నేహశీలులు. ఖాకీ దుస్తులు, త్రికోణాకర టోపీ, వెడల్పాటి బెల్టు, దానికి దోపుకున్న వంకీ కత్తి. గూర్ఖాలు చాలా ధైర్యవంతులు అని మా నాన్న నాతో చెప్పేవాడు. మిలటరీలోని గూర్ఖా రెజిమెంట్ గురించి కబుర్లు చెప్పేవాడు. ఉద్యోగరీత్యా ఆ వైపు తిరిగిన మనిషి కాబట్టి వాళ్ళతో వారి బాగోగుల గురించి వాళ్ళ భాషలోనే మాట్లాడేవాడు. మా నాయనని వాళ్ళు ఎంతగానో గౌరవించేవారు. మా ఇంట్లో పిల్లలందరినీ వాళ్ళు బాగా ఇష్టపడేవాళ్ళు. ఒక్క రూములోనే చాలామంది ఉండేవారు. మంచి రంగుతో తేటగా ఉండేవారు, సన్నని శరీరాలతో తిన్నగా ఉండేవారు. నాకు గురుతు ఉండి బొజ్జలు పెరిగిన గూర్ఖా ఎవరినీ నేను ఎప్పుడూ చూడలేదు. రాత్రిళ్ళు మేలుకుని మా నూనెపల్లె గ్రామం నాలుదిక్కులా కాపలా కాచేవారు. ప్రతి రాత్రీ తమ చేతుల్లో ఉన్న కర్రలతో మా ఊరి వీధులని గట్టిగా తాటిస్తూ గస్తీ తిరిగేవారు. అప్పుడప్పుడూ విజిళ్ళు ఊదేవారు, ఇంటి తలుపులను, గోడలను, ఇంటి చిన్న గేట్లను కర్రతో తట్టి వాటిని మెలకువతో ఉంచేవారు. నెల తొలిదినాలలో ఇంటింటికీ వెళ్ళి నవ్వు మొహాలతో అయిదు రూపాయల జీతం అడిగేవారు. ఇచ్చేవారు విసుక్కుంటూ ఇచ్చేవారు, ఇవ్వదలుచుకోనివారు కసురుకుంటూ వెళ్ళగొట్టేవారు. అదే నవ్వు మొహాలతో, సిగ్గు మొహాలతో వెనుదిరిగేవారే, కానీ తిట్టుకోవడం, పళ్ళు కొరకడం, అవమానంగా తలదించుకోవడం చేయగా నేను చూళ్ళేదు. మా ప్రాంత ప్రజల ప్రవర్తనపై లజ్జ చెంది నేనే తల దించుకునేవాడిని. ఇంటిని, అమ్మా నాయనలని, భార్యాబిడ్డలని నెలల తరబడి, సంవత్సరాల తరబడి వదిలి ఇక్కడ మనుషులని, రాత్రులని కాపలా కాచుకునే వాళ్ళకి ఒక అయిదు రూపాయాలివ్వడానికేమిటీ అని మనస్తాపం కలిగేది. ఇన్నేళ్ళ తరువాత ఆ గూర్ఖా అన్నలని తలుచుకుంటే తీర్చలేని దిగులు అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడా ఒక్క గూర్ఖా కూడా కనపడ్డంలేదు. ఇప్పుడెప్పుడైనా ఒకసారి కనీసం ఒక గూర్ఖా కనపడినా చాలు. ఆయనని ఒక మంచి హోటల్‌కి తోడ్కొని పోయి మంచి భోజనం తినిపించాలని కోరిక. కనీసం ఈ చిన్న చర్య ద్వారా మా ఊరివాళ్ళు ఆ గూర్ఖాల గులాబీ అరచేతుల్లో పెట్టలేకపోయిన ఆ అయిదురూపాయల పాపాన్ని ఇట్లా కడుక్కుందామని నా అత్యాశ.

మా ఇంటిని కుడి వైపుకు ఆనుకుని ఒక చాకలివాళ్ళ మిద్దె ఉండేది. దానికి ఆనుకుని ఒక కొట్టం ఉండేది. దానికే ఆనుకున్న మరో కొట్టం, మరో కొట్టం కూడా. ఆ కొట్టాలలో ఒక లారీ డ్రైవర్ కుటుంబంతో కాపురం ఉండేవారు. మామూలు రోజుల్లో అయితే చడీచప్పుడు లేని సంసారం వారిది. ఆయన తాగినప్పుడు మాత్రం వీధి మొత్తం గోలగోలయ్యేది. ఒకసారి ఆయన తాగాల్సినదానికన్నా దానికన్నా ఎక్కువ తాగారేమో, వీధిలోకి వచ్చి పెద్ద కేకలు వేస్తున్నాడు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా నేలమీదకు సాష్టాంగపడిపోయి ఈత కొట్టడం మొదలెట్టాడు. మా వీధి దోవ మహా అన్యాయంగా ఉంటుంది. గుంతలు గుంతలు, రాళ్ళు పైకి పొడుచుకుని వచ్చుంటాయి, చాలా గట్టిగా ఉండే భూమి. లారీ ఆయన మత్తు ఉన్మాదంలో చేతులు బారలు చాపి మహావేశంతో ఈత కొడుతూనే ఉన్నాడు. జనం గబగబా వచ్చి ఆయన్ని పట్టుకు లేవదీసి ఇంట్లోకి తీసుకెళ్ళారు. అప్పటికే ఆయన బనియన్ నిండా, ఒంటినిండా, రక్తం కారుతోంది. మన్ను, రక్తం కలిసి పోయి చాలా దారుణంగా ఉంది ఆ దృశ్యం. ఇంతకన్నా దారుణమైనవి ఇంకా చూశాను. అప్పట్లో అవి దారుణమని తెలియదు. అవన్నీ మామూలే కదా అనుకునేవాడిని. అప్పడు మేము కాపురం ఉన్న వీధుల్లోనే ఇప్పుడు రాంగోపాల్ వర్మ సినిమాల్లోలాగా పిస్తోలు పట్టుకుని చిన్న చిన్న సందు గొందుల్లో పరుగెత్తే పోలీసులు, వాళ్ళని తప్పించుకునే ప్రయత్నంలో ఎవరి ఇళ్ళల్లోకైనా దూరిపోయి రెండు చేతులు జోడించి ఆ ఇంట్లో ఆడంగుల కాళ్ళకు దండాలు పెట్టుకునే నేరస్తులు, వాళ్ళని వడ్ల బస్తాల వెనుకనో, మంచాల కిందనో దాచిపెట్టేవారు మా ఆడవాళ్ళు. పోలీసులు వెళ్ళిపోగానే “లిగాడి పనులు పెట్టుకోవద్దు నాయన, ఏదైనా మంచి పని చేసుకుని బతకండి” అని సుద్దులు చెప్పే ఆ ఇంటి ఇల్లాలు. కిక్కిరిసిపోయేంతగా జనాన్ని వేసుకుని జీపులు బర్రు బర్రు మంటూ తిరిగేవి అప్పుడపుడూ చాలాసార్లు మా రోడ్లమీద. ఆ జీపుల్లోని మనుషుల చేతుల్లో తుపాకులు ఉండేవి, జీపుల్లో కూచున్నవాళ్ళ కాళ్ళ దగ్గర నాటు బాంబుల గంపలు ఉండేవి. ఒకరోజు సైకిలు మీద నేను టౌన్‌కి వెళ్తున్నాను. దారిలో కనపడ్డ ఒకాయనతో మాట కలుపుదామని రోడ్డు సైడు గట్టు మీద కాలు పెట్టి ఆగి ఆయనతో మాట్లాడుతున్నాను. ఒక నిముషం గడిచిందో లేదో ఒక్కసారిగా పెద్ద శబ్దం. ఎదురుగా ఇంత దుబ్బని నల్లని పొగ, దాని వెనుక హాహాకారాలు. అక్కడ ఏమి జరిగిందో అసలు అర్థం కావడం లేదు. కొన్ని సెకనుల అనంతరం ఆ పొగలోనుండి కొన్ని మానవ ఆకారాలు బయటికొస్తున్నాయి. తెల్లని చొక్కాలు మసికొట్టుకు ఉన్నాయి, బట్టలు పీలికలుగా తయారయ్యాయి. వారి శరీరాలు రక్తమోడుతూ ఉన్నాయి, ఒకాయన వేళ్ళు తెగిపోయి చివరలు వేలాడుతూ ఉన్నాయి. హాలీవుడ్ సినిమాల్లో జాంబీల్లా మత్తుగా ఊగులాడుతూ నడుస్తున్నారు వారంతా. పొగలు తగ్గాక చూస్తే అక్కడ పేలిపోయిన జీపు టాపు తాలూకు టార్పాలిన్ ఎగిరి కరెంటు తీగలపై ఊగుతుంది. తరువాత తెలిసింది ఆ జీపులో బాంబుల గంప ఉన్నదని, అది జీపులోనే పేలిందని. ఇది మా ఇంటి దగ్గర జరిగిన అనుభవం కాదు కదా, ఇక్కడ రాయడం ఇది సమజసం కాదు, కానీ ఒక ఫ్లోలో అలా వచ్చేసింది, మన్నించాలి.

గూర్ఖాలు వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంట్లోకి రాము వాళ్ళు వచ్చారు. రాము వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత కృష్ణ అనే ఒకాయన, వాళ్ళ అమ్మా నాన్న వచ్చి చేరారు. కృష్ణ అన్న కార్పెంటర్ పని చేసేవాడు. చాలా బక్కపలుచని మనిషి. గుండు తల మానవుడు, పెద్ద నోరు ఎప్పుడూ ఇకిలిస్తూనే ఉండేది. అప్పుడప్పుడూ మేము కబుర్లాడుతూ ఉండేవాళ్ళం, అవేం కబుర్లో ఇప్పడు గుర్తు లేదు. కృష్ణ అన్నతో మా నాయన మా ఇంటికి చాలా ఫర్నీచర్ చేయించాడు. డైనింగ్ టేబులు, కుర్చీలు, షోకేస్, టీపాయ్…ఇలా. మా ఇంటికి కుడి వైపున ఒక డాబా ఇల్లు ఉండేది. ఆ ఇంట్లోకి ఒకసారి ఒక టీచరమ్మ కుటుంబం, ఆవిడ చెల్లెలు కూడా వచ్చారు. ఆ అమ్మాయి చాలా చక్కగా ఉండేది. మా ఇంటి చుట్టుపక్కల కుర్రవాళ్ళు, ఆ దారిన పోయే ప్రతి కుర్రవాడు ఆ అమ్మాయి వంక చూసేవారు, నవ్వేవారు, ఆ అమ్మాయి కూడా అందరి వంక చూసేదీ, నవ్వేది. కార్పెంటర్ కృష్ణ కూడా ఆ అమ్మాయి వంక చూస్తూ నవ్వేవాడు. ఆ అమ్మాయి కూడా సమ్యక్ న్యాయంగా కృష్ణ వంక కూడా చూస్తూ నవ్వేది. ఇదేదో విచిత్ర వ్యవహారంలా ఉందే అని నేననుకునేవాణ్ణి. కొంతకాలం తరువాత కృష్ణ చాలా అప్పులు చేశాడు, అప్పులవాళ్ళు ఆ ఇంటివద్దకు వచ్చేవారు, కృష్ణవాళ్ళు చివరకి ఆ ఇల్లే వదిలి వెళ్ళిపోయారు ఆ పోవడం పోవడం మళ్ళీ ఎప్పుడూ కనపడలేదు. మా ఇంటి పక్కని ఆమ్మాయివాళ్ళు కూడా ఒకసారి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన చాలాకాలం తరువాత ఒకసారి ఆ అమ్మాయి చంకలో పిల్లవాడిని వేసుకుని ఒక ఎర్రని ఎండలో కనపడింది. ఆ అమ్మాయి అలాగే అప్పటిలాగే చిన్నగా సన్నగా ఉంది, మనిషి వాడిపోయి జాలిగా ఉంది. చంకలో ఉన్న ఆ అమ్మాయి కొడుక్కి గ్రహణం మొర్రి. ఇప్పుడు ఆ అమ్మాయిని, ఆ పిల్లవాడిని తలుచుకుంటే ఏదో తెలియని అశక్తతగా, బరువుగా, పరివేదనగా ఉంది. పేర్లు తెలియని మనుషులు, ఏ ఊర్లు పట్టుకు కొట్టుకుపోయారో, ఇప్పడు ఉన్నారో లేరో కూడా తెలియని మనుషుల జ్ఞాపకాల దారాలను దోసిట్లో పుచ్చుకుని నేనిప్పుడు ఎందుకింత మనసు కష్టపెట్టుకుంటున్నానో, వారిని ఒకసారి చూస్తే బావుండని ఆశపడుతున్నానో లేదో కూడా తెలియడంలేదు. చీకట్లో జ్ఞాపకాలని వెదుక్కుంటూ తడుముకోవడం ఏ మాత్రం విజ్ఞతైన పని?

ఎవరు ఎప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోయాక ఎవరు కొత్తగా వచ్చారు అనే ఖచ్చితమైన లెక్కా పద్దు లేదు కానీ మా ఇంటి ఎదురుగా అద్దెకు దిగిన వారిలో ఒక ఆరుమంది ఐటీఐ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మేమంతా దాదాపూ ఒకే వయసువాళ్ళం. నబీరసూల్, కృష్ణ, శ్రీరాములు, ఫక్రుద్దిన్, సర్తాజ్. ఈ అయిదుమందితో నాకు కొత్త పరిచయం. వీళ్ళతో పాటూ ఉండే వలీ మాత్రం నా చిన్నతనంనుండి కూడా తెలిసినవాడు, స్కూలులో హైస్కూలులో కూడా నా క్లాస్మేట్ వాడు. సర్తాజ్ అనే అతనిది ఆదోని దగ్గిర ‘మంత్రికి’ అనే ఊరు, మృదుస్వభావి. ఒకసారి నన్ను తోడుకుని వాళ్ళ ఊరికి తీసుకు వెళ్ళాడు కూడా. మంత్రికి అనే ఊరు పేరుని బట్టి అదేదో తులసి అనే ఒక పాపులర్ క్షుద్ర నవలలోని మంత్రతంత్రాల “బిస్తా” అనే గ్రామంలా ఉంటుందేమో అనుకున్నాను ఆ ఊరిని. అలా ఏం లేదు.

ఆ ఆరుమందిలో ఇంకో ఆయన ఫక్రుద్దిన్. ఆయనది ఏ ఊరో తెలియదు. నబీరసూల్‌ది మాత్రం మా నాయన, జేజినాయనగార్ల ఊరు కృష్ణంశెట్టి పల్లె. శ్రీరాములుది, కృష్ణాది ఇద్దరిదీ కర్నూలు. ఈ ఆరుమంది జనాభాలో ఒక్క శ్రీరాములుకి మాత్రమే కథలు, నవలలు చదివే అలవాటు ఉంది. ఒక రెండు సంవత్సరాలు సంబరంగా, సరదాగా భలేగా గడిపాం మేము. వీళ్ళతో బ్రతికిన రోజుల్లొనే 1942 ఎ లవ్ స్టోరీ సినిమా పాటలు విడుదలయ్యాయి. నేనూ సర్తాజ్ కలిసి ఆ పాటలు వాళ్ళ రూమ్‌లో మా టేప్ రికార్డర్లో విన్నాం. సాహిత్యం గట్రా అనేది తెలీయకపోయినా ఆ పాటల్లో సాహిత్యం విని ప్రాణం ఆగిపోయింది. అదే సమయంలోనే మన్నాడే, తలత్, హేమంత్ కుమార్ పాటలు వినడం కూడా అలవాటయ్యాయి మాకు. ఆన్‌మోల్ రతన్ అనే ఆ పాటల క్యాసెట్ సెట్ వింటూ అందులో బలరాజ్ సహాని నటించిన వక్త్(waqt) అనే సినిమాలోని “ఏ మేరీ జ఼ోహ్రా జ఼బీం, తుఝే మాలూమ్ నహీం (Aye Meri Zohra Zabeen, Tujhe Malum Nahi)” అనే పాట విని, వార్నీ! ఈ పాటనా మేము ఇంతకాలం “సరిగమలాపవయా సరసకు చేరవయా పెదవులు ప్రేమలయా రానీవయా” అని తెలుగులో నేర్చుకున్నది అని తెగాశ్చర్యం పొందాము. మా అందరి సామాజిక నేపథ్యం, పుట్టిన ఊర్ల, చదువుకున్న చదువుల, పెరిగిన పద్దతుల వాతావరణాలు వేరు. యవ్వనంలో స్నేహం అనేదానికి వ్యత్యాసాల అంటరానితనం ఉండదు. మాలో ఏ ఇద్దరికీ వ్యక్తిగత అభిరుచులు, వ్యాపకాలు ఒకటి కావు. అవేమీ లేకపోయినా, గంటలకొద్దీ ఆడుకోవడానికి కబుర్లు, కాలు సాగేకొద్దీ నడవడానికి దారులు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికి సమయం పుష్కలంగా ఉండేది. ఇప్పడు వీరిలో ఎవరినయినా కలుద్దాం, ఎక్కడున్నారో ఆరా తీద్దాం అని ఒక క్షణం అనిపించినా అదంతా పనికిమాలిన పని అనిపిస్తుంది. ఆ వయసు మనుషుల్ని, ఆ స్నేహాల్ని అక్కడే ఆపేసి నిలిపేస్తేనే మంచిది. ఆనాటి ఆ చక్కని పరిమళం ఎప్పుడో ఒకసారి తలుచుకుని ఆస్వాదిస్తేనే మంచిది. మళ్ళీ ఒకసారి కొత్తగా చూద్దామని వెదకబోయామా ఆ స్నేహాలకునూ డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్ మంటలు, రోగాల కంపు అయి ఉంటాయి.

ఈ ఆరుమంది ఐటీఐవాళ్ళు ఇంకా అక్కడ ఉన్నప్పుడే, వాళ్ళు ఆ గది ఖాళీ చేయకమునుపే నేనే ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయా. కాబట్టి ఇక అక్కడి పరిస్థితి ఏమిటి? కొత్త సమయాలు, కొత్త మనుషుల గురించి ఏమీ తెలీదు. నేను అక్కడి నుండి వెళ్ళబోయే ముందు చివరసారిగా జరిగిన ఒకటీ రెండు పెద్ద సంఘటనలతో ముగింపుకు వచ్చేస్తాను. ఆ దినం గురువారం. బయట ఏదో గొడవగా అనిపిస్తే నూనెపల్లెలో మా ఇంటి కటాంజనానికి ఆనుకుని చూస్తున్నా. మేము ఇల్లు కొన్న ఆవిడకు బిల్లా వంటి ఒక కొడుకు ఉండేవాడు అని చెప్పాను కదా అతను, అతన్ని చుట్టి ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు. వారంతా ఆయన దాయాదులే. అతని కంటే పెద్దవయసువాళ్ళ దగ్గరి నుండి అతని కన్నా చిన్నవయసువారి వరకు ఉన్నారు వారు. అతడిని చుట్టు ముట్టి ఉన్నారు. ఈ మనిషి తాగి ఉన్నాడు, స్టడీగా లేడు, మత్తులో లేకపోయి ఉంటే అది ఏమంత సులభం అయ్యేది కాదు. మొదట అతన్ని ఈ నలుగురు పెద్ద పెద్ద మొద్దులు పట్టుకుని కొట్టారు, ఫట్, ఫట్… భుజాలకు, మెడమీది, నెత్తి మీద దెబ్బలు. అతను కిందకు ఒక వైపుకి ఒరిగాడు, ఏదో గొణుగుతున్నాడు. ఒకడు అతని వీపు మీద నడింకి కాలు పెట్టి గొడ్డలి ఎత్తి భుజం మీద, వీపు మీద వేట్లు వేస్తున్నాడు. అచ్చు కర్ర దుంగలు నరుకుతున్నట్లే! ఫళక్ ఫళక్ అని శరీరపు ఒప్ప ఇలా విచ్చుకుంటుంది, చుక్క రక్తం రావడం లేదు తెల్ల కండ మాత్రమే కనపడుతుంది. అది ఇప్పుడు నా కళ్ళముందు ఉంది. నేను అలా ఇంటి ముందు నిలబడి చూస్తూనే ఉన్నాను. అలా గొడ్డలి దెబ్బలు పడుతుండగానే, బిల్లా వెంట ఎప్పుడూ తిరిగే కుర్రవాడు రంగా అని చెప్పాను కదా, స్వయానా అతని బావమరిది. అతనికి నా వయసే ఉంటుంది. అతను కిందకి వంగి నీళ్ళ బోరింగ్ కింద బిందె అందడానికి పెద్ద రాయి ఒకటి పెడతారు, దాన్ని రెండు చేతులా పైకి ఎత్తుకున్నాడు. నాగరాజు తలమీదికి పైనుండి ఆ రాయి జారింది. నాగరాజు రెండు కాళ్ళు తప తప కొట్టుకున్నాయి అచ్చం మా ఇంటికి రెండు ఇళ్ళ అవతల సుంకులమ్మ గుడి ఉంది. ఆ గుడి ముందు కోళ్ళను కోస్తారు, తల మొత్తం నరికేస్తారు. కోడి వెంటనే చావదు, చాలాసేపు తన్నుకుంటుంది. లేచి నిలబడి పోతున్న తన ప్రాణాల్ని పట్టుకోడానికి పరిగెడుతుంది. పరిగెత్తి పరిగెత్తి కింద పడుతుంది. మన్నులో రక్తం కలిసిపోతుంది. అంతే. అలా కోళ్ళ చావుల్ని చాలానే చూశాను కానీ మనిషి చావు వేరు. మనిషిని చంపుతూ ఉంటే చూస్తూ నిలబడే పోవాలి, కానీ ముందుకు వురికి ఆ దారుణానికి అడ్డుపడేది, ఆపేది ఉండదు. అంత దమ్ము లేదు, అసలు కాళ్ళే కదలవు.

ఈ బిల్లా హత్య జరగడానికి నెల ముందో అంతకు ముందో మా ఇంటికి దగ్గరలోనే ఒక కోమట్ల ఇల్లు ఉండేది. షాపు, ఇల్లు కూడా అదే. ఒక తెల్లవారు ఝామున నిద్ర లేచిన బిల్లాకి సిగరెట్ తాగబుద్ది వేసింది. వెళ్ళి కోమటాయన ఇంటి తలుపు తట్టాడు. కోమటాయనకి ఇంట్లో వయసులో ఉన్న కూతురు ఉంది. అంత చీకట్లో తలుపు తీసి సిగరెట్ అమ్మే ధైర్యం లేదు. ఇప్పుడు ఇవ్వను, తెల్లారాక రమ్మన్నాడు. రౌడీ షీటర్ ఇతగాడికి అవమానం అనిపించింది. తెల్లవారింది. షాపు తలుపులు తెరిచారు, సిగరెట్ లేదనిపించుకున్న ఈ మనిషి కొట్లోకి వెళ్ళి కోమటాయన కడుపులో పొడిచాడు, ఒకటీ, రెండు, మూడు, నాలుగు… ఎన్ని కత్తి పోట్లో తెలీదు. అక్కడిక్కడే ఆయన మరణం. ఆ కేస్ ఏమయిందో తెలీదు,ఆయన కూతురు బ్రతుకు ఏవయిందో కూడా తెలీదు.అది జరిగిన నెల తరువాత కాలం చేతిలోకి ఈ కేసు వచ్చింది. కన్నుకు, కన్ను, పన్నుకు పన్ను, పోటుకు పోటు. ఆ రోజుల్లాంటి రోజులు, ఆ మనుషులు, ఆ సంఘటనల వంటి రంగు, వాసన, రుచి, రక్తం ఉన్న కథలు, సంఘటనలు పోయాయి. అసలు జీవితాలలోనుంచి నిజ సంఘటనలే పోయాయి. ఇప్పడు జీవితంలో సోది నినాదాలు, సోది కవనాలు తప్పా ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలు, హఠాత్ మలుపులు, పులి గాండ్రింపులు ఏమీ లేవు. అసలు జీవితమే లేదు ఇక్కడ. నిజంగా ఒకనాటి జీవితాన్ని ఇలా చూశామా అనే కల లోంచి దిగ్గున లేచి కూచుని ఇలా రాసుకుని, మళ్ళీ ఏదో ఒకరోజు ఇంకో కల కోసం ఎదురుచూస్తూ నిద్రపోవాలి.


అన్వర్

రచయిత అన్వర్ గురించి:

బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/, https://www.facebook.com/anwartheartoonist/

 ...