మానసా పబ్లికేషన్స్ వారి నవలల పోటీ

తమిళనాడుకు చెందిన ‘మానసా పబ్లికేషన్స్’ సంస్థ ప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ కుమార్తె, రచయిత్రి జె. చైతన్య, మరో రచయిత్రి కృపాలక్ష్మిలు కలిసి ఏర్పాటు చేసిన సంస్థ. మానసా పబ్లికేషన్స్, యువ రచయిత్రుల నుంచి ఆంగ్ల నవలల్ని ఆహ్వానిస్తోంది. మానసా సాహితీ పోటీల (మానసా లిట్ ఫెస్ట్) పేరుతో ఇందుకోసం ఓ సరికొత్త వేదికను కల్పిస్తోంది. తెలుగు లేదా ఇతర భారతీయ భాషల్లో రాసిన నవలల్ని రచయిత్రులు ఆంగ్లంలోకి అనువదించి కూడా పంపించవచ్చు. అది ఇప్పటిదాకా ఎక్కడా ప్రచురించని నవలై ఉండాలి. ఇతర ప్రచురణ సంస్థలకు పంపి పరిశీలనలో ఉన్నవి పంపకూడదు. కొత్తగా రచనలు చేసేవారిని ఉద్దేశించిన పోటీ కాబట్టి, మొదటిసారి నవల రాసినవారు లేదా ఇప్పటిదాకా కేవలం ఒక్క పుస్తకం మాత్రమే ప్రచురితమైన రచయిత్రులు మాత్రమే అర్హులు.

నవల అంశం: ‘మహిళలకే సొంతమైన విభిన్న జీవన దృక్పథాలని ప్రపంచానికి చాటడం, వాళ్ళ అనుపమాన సృజనా శక్తిని తెలియచేయడం మా సంస్థ లక్ష్యం…’ అంటున్నారు వ్యవస్థాపకులు. పోటీకి పంపించే రచనలు స్త్రీ కోణంతో వారి జీవన దృక్పథాలని చాటాలి. స్త్రీ వాద రచనలుగానే ఉండాల్సిన అవసరంలేదు. మహిళల జీవితాలని లోతుగా చక్కటి కళాత్మక విలువలతో ఆవిష్కరించాలి అన్నదే ఎంపికకు గీటురాయి.

ఈ పోటీ రెండు విభాగాల్లో ఉంటుంది:
16 నుంచి 25 ఏళ్ళ లోపు (యంగ్ అడల్ట్స్)
25 ఏళ్ళు, ఆపై వారు (అడల్ట్స్)

ప్రతి విభాగంలోనూ విజేతకి లక్ష రూపాయల బహుమతి ఉంటుంది. వాళ్ళ రచనని మానసా సంస్థవారే ఆంగ్లంలో ప్రచురిస్తారు. ప్రతి విభాగం నుంచి, విజేతల రచనతోపాటు న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని బట్టి గరిష్టంగా ఐదు రచనలను ప్రచురణకు తీసుకునే అవకాశం ఉంది.

చివరి తేది: రచయిత్రులు తమ రచనల్ని 2025 ఆగస్టు 31వ తేదీ లోపు పంపాలి. 2026 జనవరి 31న విజేతల్ని ప్రకటించే అవకాశం ఉంది.

మరిన్ని వివరాలు: https://www.manasapublications.com/- లో చూడొచ్చు.

2. మానసా – స్త్రీ సాహితీ నిధి

‘స్త్రీలకి సంబంధించిన మగవారి రచనల్లో ఉన్న సమస్యల్లా అవి వాళ్ళ పురుష దృక్పథాన్నీ, దృక్కోణాన్నీ దాటుకుని రాలేకపోవడం అన్నదే. అరుదుగా కొందరు రచయితలు మాత్రమే ఆ స్వభావసిద్ధ లోపాన్ని దాటుకుని రాగలుగుతున్నారు. ఇక్కడ మనకు లేనిదీ… మేం కోరుకుంటోన్నదీ స్త్రీ దృక్కోణంతో కూడిన ఓ ప్రపంచాన్ని. అంచులూ హద్దులూ అన్నవి శిలాశాసనాల్లా కాకుండా నీటిలో సిరాచుక్కలా సంలీనమయ్యే ప్రపంచం కావాలి. మహిళా సాధికారత ఆలంబనగా సాగే ప్రపంచం అది! అక్కడ స్త్రీ దృక్కోణం అన్నది ఓ విలక్షణ రీతి కాదు… అదే ప్రధాన స్రవంతి…’ – మానసా పబ్లికేషన్స్ నిర్దేశించుకున్న లక్ష్యం ఇది. నవలల పోటీల నిర్వహణ అందులో భాగమే. దాంతోపాటూ మరో రెండు ముఖ్యమైన పనుల్నీ వాళ్ళు చేపడుతున్నారు.

భారతీయ భాషల్లోని పాత, కొత్త మహిళా కేంద్రక రచనల్ని ఆంగ్లంలోకి అనువదించాలనుకుంటున్నారు. ఇప్పటిదాక అనువాదానికి నోచుకోని గొప్ప సాహిత్యాన్ని వెతికి మరీ ప్రపంచ వేదికపై పెడతామంటున్నారు.

స్త్రీలకి సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన రచనలు- వ్యాసాలు, నవలలు, కథలతో అతిపెద్ద ఆన్‌లైన్ ‘సాహితీ నిధి’(repository)ని ఏర్పాటు చేస్తున్నారు. సర్వకాలీన, సార్వజనీన కళాత్మక విలువలు ఉండడం ఒక్కటే వాటి ఎంపికకు గీటురాయి.

వాటికి సంబంధించిన రచనల ఎంపికకు సిఫార్సులను ఆహ్వానిస్తున్నారు. మిగతా ప్రపంచం దృష్టికి అంతగా రాని తెలుగు రచనలూ ఇందులో భాగం కావొచ్చు.

ఆసక్తి ఉన్నవారు https://www.manasapublications.com/- లో వివరాలు చూడొచ్చు. లేదా
connect@manasapublications.com ఈమెయిల్-లో సంప్రదించవచ్చు.